– చిత్తలూరి

నీకు నోరెట్లా‌ వచ్చింది తల్లీ

ఆ‌ నోటి నాలుక మీదే కదా

నాలుగక్షరాలు గీసి

నిన్ను మాటల‌ పెట్టెను చేసి

దేశమ్మీదికి వదిలేశారు

నీ కలమెట్లా కదిలింది బిడ్డా

వాళ్ల కలాల నిండా కన్నీళ్లను‌ నింపి కదూ

నీకు చేతులెట్లా వచ్చాయమ్మడూ

నీకు జన్మనిచ్చినోళ్ల తరువాత

చదువు చెప్పి

నీకు మరో జన్మనిచ్చోళ్లు కదా

నీ జన్మస్థానాలనే,

నీ భవిష్యత్తు మర్మస్థానాలనే

కలం ముక్కుతో కసిగా కాకిలా పొడిచావు

అక్షరాలంటే అణుబాంబులని చెప్పినవాళ్లనే

నిలువునా పేల్చేయటానికి సిద్ధపడ్డావు

ఏ కనిపించని శక్తులో ఉసిగొలిపితే ఎగబడి

నీ బోధక దేవుళ్ల చిత్రపటాలకే

దండలు వేయాలని తలపోశావు

నువ్విలా గుండెల్లో పొడుస్తావని తెలిస్తే

నువ్విలా మనసు మీద కొడతావని తెలిస్తే

బహుశ వాళ్లు నీకు

చదువు చెప్పే వాళ్లే కాదేమో

అయినా బిడ్డ తప్పు పని చేసినా

క్షమించే పెద్ద గుణంలే తల్లీ వాళ్లది

నువ్వు వాళ్ల గుండె కాయల్ని పెకలించుకుని

పారిపోతూ తట్టు తగిలి పడిపోయినా

నేలపాలైన వాళ్ల గుండె కూడా

అచ్చం మీ అమ్మలాగే

జాగ్రత్త తల్లీ కాస్త చూసుకుని నడువు

ఎంతైనా నీకు నడత నేర్పిన వాళ్లం కదా

అనే దీవిస్తారు

అన్ని అవాకుల చవాకుల బాకులతో

నీ చదువు కన్నతల్లుల

గుండెల మీద పొడవటానికి

నీకు మనసెట్లా ఒప్పింది తల్లీ!

* ఉపాధ్యాయుల ఒకానొక వేదనకి…*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com