(సి.రామమూర్తి మన పత్రిక ఎడిటర్)
నిజం( శ్రీ రామ్ మూర్తి ) కవిత్వమై కురిసిన వాన చప్పుడు వినిపించిన శ్రీలక్ష్మి

Poetry is the epitome of Literature”
సాహిత్యంలో ఎన్నెన్నో ప్రక్రియలు. మరెన్నో శిల్పాలు, ఇంకెన్నో సంప్రదాయాలు, ధోరణులు, రీతులు! కానీ వాటన్నిటిలోనూ తనదైన ప్రత్యేకతను సాధించిన ప్రక్రియ మాత్రం కవిత్వమే! అందుకే సాహితీ వ్యాసంగాలన్నిటిలోనూ కవిత్వానికి అగ్రస్థానం ఉంది. Brevity, Symbolism, philosophy, generalisation, metaphorical expression వంటి అంశాలు ప్రధాన లక్షణాలుగా గల కవిత్వం, మేధోజీవులకు ‘ఆలోచనామృతం’గా పరిణమించింది. అల్ప పదాలలో అనల్పార్థాన్ని, మనకు తెలిసిన భాష, పదాల నుంచే మనకు తెలీని కొత్త జీవన సత్యాన్ని ఆవిష్కరిస్తూ పాఠకులను సంభ్రమాశ్చర్యాలకు లోను చేసే శక్తి కవిత్వానికి ఉంది. అందుకే కవిత్వం – అణువంత అక్షరంలో విశ్వమంత విశాలత్వాన్ని నిబిడీకృతం చేసుకున్న మహిమాన్విత సృజన!

కవిత్వానికి సంబంధించి ఈ మాటలన్నిటికీ అచ్చమైన ఉదాహరణగా నిలుస్తున్న కవితాసంకలనం – “అలలు”.! “నిజం” అనే కలం పేరుతో గత కొన్ని దశాబ్దాలకాలం నుంచి పేరెన్నికగన్న కవిత్వానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన శ్రీరామమూర్తి గారు తాజాగా వెలువరించిన సంక్షిప్త కవితల సంకలనమే – అలలు!
తెలుగు కవితాప్రస్థానంలో సంక్షిప్త కవితలది ప్రత్యేక స్థానం! మినీకవితలుగా, హైకూలుగా, సినెర్యూలుగా, నానీలుగా ఇతర ప్రక్రియలుగా సంక్షిప్త కవితలు తెలుగు కవితా ప్రపంచాన్ని సుసంపన్నం చేసాయి. అయితే ఈ సంక్షిప్త కవితాప్రస్థానంలో సరికొత్త చేర్పుగా వచ్చిన ఈ ‘అలలు’, పేరుకు తగ్గట్టే జీవన సాగరంలో ఎడతెరపి లేకుండా వచ్చే ‘అనుభవాల అలలు’గా మనకు కనిపిస్తాయి. ఈ కవితలలో సంక్షిప్తత ఎంత సహజంగా ఒనగూడిందో, సార్వజనీనత, తాత్వికత అంతే స్వభావసిద్ధంగా అంతర్ భావాలుగా ఇందులో ఒదిగిపోవడం విశేషం!
చాన్నాళ్ళ క్రితం కుందుర్తిగారి ‘నగరంలో వాన’ కవితల సంపుటి చదివాను. “నగరం గడగడ వణికిపోతుంది. నడి సముద్రంలో తేలాడుతున్న ద్వీపంలా వుంది. విను వీధి నుండి జారిన మంచుకొండ పగిలి శతకోటి శకలాలు జలబిందువులుగా మారి ముసురు ముంచేస్తుంటే గూట్లోకి చేరిన గువ్వలా నగరం నక్కి కూర్చుంది. కదుల్తున్నాయి కార్లు బాలవీరులు విసిరిన కత్తి పడవల్లా ఆకాశరాజు చేసిన దాడికి నగరం నలిగిపోయింది. చీటికి మాటికి కోర్టుకెక్కటం చీదరెత్తింది.
కాబోలు హైకోర్ట్ భవనం మీద చింతతో చిందిన చినుకు పక్కనే వున్న మూసీ నదిలో పడి ముక్కు మూసుకుంది. శాసనసభా శిఖరం మీద చల్లగా జారిన బిందువు ఆకసం వంక తలెత్తి చూసి చాలిక వర్షమని శాసించింది. అంతటితో వాన వెలిసింది”
అంటూ వాన సౌందర్యాన్ని అద్భుతంగా వర్ణించాడు. 1967లో తొలి ముద్రణకు | నోచుకున్న ఈ పుస్తకం ఎందరి హృదయాలనో కొల్లగొట్టింది.
ఆ తర్వాత ఎంతోమంది వర్షం మీద | రాశారు. కొన్ని నేను చూసి వుండక | పోవచ్చు కూడా.
కుందుర్తిలా నా మనసులో నాటుకున్న కవితా పంక్తులు | మామిడి హరికృష్ణ గారివి. “ఓ నా “ప్రియమైన భాష్యకారుడా! / అనాహుత తుఫాను గుండె వేదనల్లోంచి / హఠాత్తుగా పెల్లుబికిన చినుకు నేమనాలి? / ఒక అనామకలోకంలోని / ఒకానొక తిరస్మృత
ప్రేమికుడి / కన్నీటి పాట అందామా” అంటూ రాశారు.
అలా ‘నిజం’ రాసిన ‘అలలు’ సంకలనంలోని కవితలలో వాన మీద రాసిన కవితలు నేను పైన చెప్పిన కవితలను గుర్తు చేసుకునేలా చేసాయి.
అయితే తెలుగునుడుల ప్రాణ రహస్యాన్ని ఔపోసన పట్టిన కవి ‘నిజం’ ‘వాన’ మీద రాసిన కవితలు మరింత నవ్యంగా కనిపిస్తాయి. ఆయన కలం నుండి జారిన కవనధారలు సరికొత్తగా కన్పిస్తాయి ఈ ‘అలలు’ సంపుటిలో, మొదటి పుస్తకం ‘నిజం’ గీతాలైతే, రెండో పుస్తకం ‘ఎర్ర మందారాలు’ తర్వాత 40 ఏళ్ళకి తీసుకొచ్చారు.
2018లో నివురు, 2019 డిసెంబర్‌లో ‘నాలుగోపాదం’. ఇక 2020లో విడుదలైన ‘అలలు’! ఇలా మూడు సంవత్సరాలకు 3 పుస్తకాలు తీసుకొచ్చారు. అంటే మనం చెప్పుకుంటున్న ఈ ‘అలలు’ 5వ పుస్తకం అన్నమాట. ఈ 5వ పుస్తకంలో -విశ్వరూపమెత్తిన ‘వాన’ను ఇప్పుడు పరిశీలిద్దాం .!
కేవలం ఆగ్రహం, ఆవేదన, ఆక్రోశం మాత్రమే కాకుండా హైదరాబాద్లో 100 సంవత్సరాల తర్వాత కురుస్తున్న వానని రసాత్మకంగా, సౌందర్యాత్మకంగా, కవితాత్మకంగా నిజంగారు చూడగలిగారు. అంత చక్కగాను అక్షరబద్ధం చేయగలిగారు.
ఒక్క వాన చుక్క చాలు ఎండిన నేల గుండెను తడపటానికి
ఒక్క చక్కని కవిత చాలు మనిషి గుండెను అనుభవాల తడితో నింపటానికి”
అలాంటి చిత్తడి అనుభూతిని పంచిన నగరంలో వర్షం మీద కవితా వర్షాన్ని కురిపించిన ‘నిజం’ గారి పోతపోసిన అక్షరాలోచనలే ‘అలలు’ కవి తలపోతల పుస్తకంలోని సగంభాగం కవితలు.
ఇవి ఏకాంశాలు కాదు. చిరు కవితలుగా, ముక్తకాలుగా వెలిసిన ఆలోచనాత్మక పదచిత్రాలు. వస్తువు నగరంలో వర్షమైతే కవితాశిల్పం చిన్నకవితలు. ‘అలలు’ పుస్తకంలో ఎన్నో కవితాంశాలున్నా ఈ కవితలు చదువుతున్నంత సేపు ‘వర్షం’ మీద ఎక్కువగా కవితలుండటం వల్లనుకుంటాను. అదే మనసుకు నాటుకుపోయింది. ఒక దీర్ఘ కవిత చదివిన అనుభూతిని కల్గించింది. అప్పుడప్పుడు వచ్చిపోయే మబ్బులుగా రైతులు, మహిళలు, ప్రకృతి, పడతి కవితాంశాలు పలకరిస్తూ పోతుంటే ఒక మోడ్రన్ పెయింటింగ్ అర్థమయ్యి కానట్టు అస్పష్ట కవితలా ఊరిస్తున్నట్టుగా నగరంలో 100 ఏళ్ళ తర్వాత, కురిసిన అతి భారీ వర్షం మీద కవితలన్నీ ‘నిజం’ గారి తలలో మొలిచిన కవితాక్షతలుగా మనసులో సజీవంగా నిలిచిపోతాయి.
నిజానికి ‘నిజం’ గారి కవితల్ని చూస్తుంటే ఎక్కువగా సమాజంలోని పలు అంశాలపట్ల తనదైన కోణంలో విశ్లేషించిన స్పందనలుగా అన్పిస్తాయి. కుప్పల కొద్దీ అద్భుత పదబంధాలతో మళ్ళీ మళ్ళీ వెనక్కు తిరిగి చూసి చదువుకునే అక్షర విన్యాసాలతో, అలంకారాలతో అద్భుతమనిపించే భావనా చమక్కులతో, తాత్విక ఆలోచనా స్రవంతులతో, భావోద్వేగ స్పూర్తితో, వ్యవస్థ పట్ల ఎనలేని ఆవేదనతో ఆలోచింపచేసేలా వుంటాయి. చదివే వారి దృష్టి కోణాన్ని పట్టి ఆ కవితలు కన్పిస్తుండటం విశేషం. సాధారణ పఠితలకి, అబ్బా ఏం రాశారా అన్పిస్తే కవులకి మళ్ళీ మళ్ళీ చదువుకునే, రాసుకుని దాచుకునే సంపదల నందిస్తాయి. వ్యాఖ్యాతలకి చప్పట్ల దండల్ని వేయిస్తాయి. అందుకే ‘నిజం’ ఓ పట్టాన ఓ ఫ్రేమ్ లో ఒదగరు.
ప్రజాకవిగా, నిజాల కవిగా, నిష్ఠుర కవిగా, జాగృత కవిగా, జన చైతన్య కవిగా కన్పిస్తారు. ‘నిజం’ ఎప్పటికైనా ‘నిజమే’ అన్నట్టు ‘నిజం’ కవితలన్నీ సమాజంలో ‘నిజాల’ ఇజాల్ని మాత్రమే చూపిస్తాయి. చెళ్ళున చెంప మీద చరుస్తాయి. వ్యంగ్య బాణాలు విసురుతాయి. ఆలోచనల్లో పడేస్తాయి. కన్నీళ్ళు పెట్టిస్తాయి. కార్యోన్ముఖుల్ని చేస్తాయి. ప్రణయ విహారాలు చేయిస్తాయి. ప్రళయాగ్నుల్ని కురిపిస్తాయి.
కేవలం ‘వాన’ అంశంగా వున్న ఈ కవితలన్నీ చదివాక, వీటిలో ఎన్నెన్నో కవితా ధోరణులు అలవోకగా ఒదిగినట్టు అనిపిస్తుంది. సాధారణంగా ఏ కవిత్వమైనా 1. అభ్యుదయ ధోరణి, 2. సౌందర్యాత్మక ధోరణి, 3. మానవీయ ధోరణి, 4. విప్లవ ధోరణి, 5. అస్తిత్వ వాద (స్త్రీవాద, మైనారిటీవాద, దళితవాద, ప్రాంతీయ వాదం వంటివి) ధోరణులతో ఉండటం లేదా వీటిలోని ఏదో ఒక ధోరణిలో ఒదగడం చూస్తాం.
కానీ ఈ ‘అలల’లోని కవితలు ధోరణుల కన్నా అనుభవాలను, అనుభూతులను, స్పందనలను, సంవేదనలను మనముందు పరిచినట్లుగా అనిపిస్తాయి.
వస్తువు ఏకమే. కానీ చూస్తున్న దృష్టిని బట్టి అర్థం చేసుకున్న సృష్టిని బట్టి ఆయన కలం విభిన్న పోకడలు పోయింది. 360 డిగ్రీలలో దృష్టి నిల్పిన ఈ కవి ‘వదిలిన’ అంశమంటూ లేదు. ఇక ముందు ఏ కవి వర్షం మీద కవిత రాసినా అది ఈ కవితలతో సరిపోల్చటం తప్పనిసరిగా జరిగి తీరుతుందన్నంత విస్తృతంగా వర్షం గురించి రాశారీ కవితల్ని అన్పిస్తుంది.
“మేఘాలు గర్జిస్తే ఉరుములు మెరుపులు / వర్షిస్తే మొలకలు, బతుకులు” అంటూ జీవన చిత్రాన్ని చెపుతూనే- ‘వానాకాలంలో గొడుగుల పందిరయ్యే నగరం ఈసారెందుకో నెత్తిన చేతులు పెట్టుకుని పరుగులు తీసింది. మన చేతకాని తనమే వానని పగవానిని చేస్తుంది. గొంతులు పైరులెండే వేళ వరుణ పూజలు చేస్తుంది’ అంటూ ద్వంద్వ ప్రమాణాలతో బ్రతికే మనిషి నైజాన్ని ఎండగట్టారు. ‘గొడుగుల పందిరయ్యే నగరం’ అంటూ కొత్త కోణాన్ని ఆవిష్కరించారు.
“మేఘ బాహువులు సారించి అదేపనిగా కురుస్తున్న నింగికి అలసట రాదా. ఓర్పరి భూమికి మోకరిల్లదా?” అంటూ అలసిపోకుండా ఏరోజా వాన తగ్గుతుందా, పేద ప్రజల బాధలు తీరుతాయా అని ఎదురుచూసీ చూసీ ఆశావహంగా ఉండే తన ఆలోచనలకు అక్షరమంత భరోసా ఇచ్చారన్పించింది. అవును. ఓర్పరితనం ముందు అంతా మోకరిల్లాల్సిందే. అది నింగైనా… వానైనా..! |
జర పైలం కాస్తా జలపైలమయ్యింది అంటూ “కష్టపడి కూడబెట్టిన నీటి సంపదను సిటీ చెరువు బ్యాంకుల్లో దాచుకోవాలని పోటీపడ్డాయి మేఘాలు. అవి ముందే లూటీ అయి మూతపడ్డాయని తెలీక మోసపోయాయి.” ఎంత వాస్తవిక కోణమో కదా! భావుకత భలే చిత్రంగా అల్లారు. ముందే లూటీ అయిపోయాయి సిటీ చెరువులు అంటూ కబ్దాలకు గురైపోయిన వైనాన్ని వ్యంగ్యంగా, చక్కగా చెప్పారు.
“వానొస్తుందని తెలిసి చెట్టు చెట్టునూ గొడుగులు చేసి పెడుతుంది భూమి. బతుకు బాటల నుంచి తలదాచుకోను వస్తారని” అంటారు. నిజం కదా! భూతల్లికి తన బిడ్డలంటే ఎంత ప్రేమనో. బ్రతుకు బాటల నుంచి పరుగెత్తుకుంటూ తడిచి చెట్ల క్రిందకి చేరే జనాల కోసం “చెట్టు చెట్టును గొడుగులు చేసి పెడుతుందని” చెప్పడం ఎంతో “బస్తీలకు వరద సుస్తీ. పుర శరీరం నిండా డ్రైనేజీ పుండ్లు.” నిండి పొర్లుతున్న డ్రైనేజీలను చూస్తే రసి కారుతున్న పుండ్లే గుర్తొస్తాయి ఎవరికైనా ‘నిజం’ చెప్పిన ఈ నిజం బస్తీలకు చేసిన వరద సుస్తీని మరో మారు గుర్తుచేసింది.
‘వెండి మేఘాలుండే చోటనే కరిమబ్బులూ అవి ఆకాశ కిరీటాలు, ఇవి ప్రాణధారలు. కొందరు అనాయాస ఏలికలు. శ్రమించి చరిత్రకెక్కని పీలికలు ఎందరో’ అంటూ నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్న శ్రీ శ్రీని గుర్తుచేస్తారు. వీరందరిది కష్టం, మరికొందరిది కరెన్సీల చుట్టరికం. వారిది శ్రమ. వీరిది శ్రమదోపిడి తత్వం .
కొండ మీద ఇల్లు కట్టుకున్న మేఘం బండ మీటి నేల దాహాన్ని కొలుస్తుంది. అవసరం లేకపోయినా కురుస్తుందని వేదన చెందే ఈ కవి మరో కోణంలో ప్రేమైక మూర్తిగా మారారు.
‘చినుకు వంతెన మీద చిరుపాదాలతో వస్తుంది వాన’ అంటూ కుచ్చిళ్ళు | ఎత్తిపట్టుకుని జాగ్రత్తగా మువ్వల | పాదాలతో వస్తున్న లేజవ్వనిగా వానని అభివర్ణించారు!
‘తల్లిపాలు కడుపునిండా తాగిన బిడ్డలా | వానాకాలపు నేల ఆకుపచ్చగా | కేరింతలు కొడుంది’ అంటూ ఒక ఆరోగ్యకరమైన చిన్నారి బిడ్డ ‘కడుపునిండిన సంబురంతో చేసే కేరింతలాటను ‘వాన’కు ఆపాదించారు.
‘వర్షాకాలమంతా ఆకాశం నల్లమేఘాలు కుట్టిన పైట కప్పుకుంటుంది | వాన పాలుబ్బిన వక్ష స్థలం దాచుకోవటానికి” అంటారు. ఎంత చక్కని పరిశీలన. ఎంత సౌందర్యాత్మక పోలిక!
“రాత్రి కురిసిన మేఘాలను ఆరేసుకుంది ఆకాశం, తెల్లచీరలు పరిచిన నీలినింగి.” అవును నీలినింగి కాస్తా తెల్లటి మేఘాలు పర్చుకోవడటం వల్ల తెల్లచీరలు పర్చినట్టు కన్పిస్తుందంటూ హృద్యంగా కవితాత్మను చెప్పారు.

పనీపాటా లేనట్టు మేఘాలకిదేం పని / మితిమీరి తాగిన సాగరాన్ని అదే పనిగా జనమ్మీద వాంతి చేసుకుంటున్నాయి” అంటూ చమత్కరిస్తున్నాడు ఈ కవి. కవి కలం కన్ను బలం ఎంతగా వుందో మీకీ కవిత చూస్తే అర్థం అవుతుంది. మితిమీరి తాగటం వల్ల వాంతులు అవుతున్నాయట మేఘాలకి.
“ఆకాశానికి ఈత నేర్పుతోంది నేల” ఎంత హృద్యమైన భావన! ఎక్కడి ఆకాశం. ఎక్కడి నేల. వరద ముప్పిరికొనటంతో ఆకాశం నింగి కలిసిపోవటం వల్ల ఆకాశం
ఈత నేర్చుకోగల్గుతుందని చెప్పటంలో గొప్ప కవితాత్మ దాగి వుంది.

ఈ’భూమినీ ఆకాశాన్ని కలిపి కుడుతోంది వాన దర్జీ / నడుమనున్న బడుగు జనానికి నీటి బెజ్జాలు’ “రాత్రంతా కుండపోత. ఎక్కడ నిద్రపోవాలో తెలీక భూమి నీటి దుప్పటిలో దాక్కుంది.” ఇది ఎంతో హైట్ కూడిన భావన. ‘నీటి దుప్పటి’లో దూరిందట భూమి ఎక్కడ నిద్రపోవాలో తెలియక. పాపం పేదవాడు నీడ కోల్పోయి – నిద్ర కోల్పోయి – బట్టలు తడిసిపోయి నిస్త్రాణంతో అదే నీళ్ళలో కూలబడి సోలిపోయి నిద్రోయాడేమో అన్పిస్తది.

“నగరం తలవంచుకుని నడుస్తుంది. రోడ్డెక్కిన మురుగు కాలువలు, చెరువులను దాటుకుంటూ” అంటూ దీనావస్థను ఎండగట్టారు.

‘మెట్రో విహారానికి వచ్చిన నీలి మేఘాలకు తిరిగి వెళ్ళబుద్ధి కావటం లేదు. పురవీధుల్లో జలకాలు, బడుగుజనం కొంపముంపులు.” పల్లెటూరి నుండి నగరం చూడటానికి వచ్చిన స్కూలు పిల్లలు ఇంతింత కళ్ళు వేసుకుని లైట్లతో సింగారించుకున్న నగరాన్ని చూస్తూ ఇంటికి వెళ్ళటానికి నిరాకరిస్తారు. మారాం చేస్తుంటారు. అదే గుర్తుకు తెచ్చారు.

రెచ్చిపోయిన వానబిందువుల్ని చూసి కార్చిన కన్నీళ్ళెన్నో / కన్నీటి బిందువొకటి ఎన్ని వేదనల నిఘంటువో / హృదయం లేని చోట రాలనంటుంది ససేమిరా… అనటంలో గొప్ప మానమీయ భావన దాగుంది.

వానైనా… కన్నీరైనా నీరే కదా! బిందువులు, బిందెలు తెలుసు కానీ వీధులు సింధువులవడం ఇప్పుడే చూస్తున్నాం. నీటిదారిని ఇకనైనా విడిచి పెడదాం…. అంటూ గడ్డం పట్టుకొని హితవు చెప్తారు.

వానకెంత పురప్రేమో చేతులపై ఎత్తుకుని ముద్దాడుతుంది / ‘నగరం’ పై ప్రాణాలు పైనే పోతున్నాయ్.. / చిన్నపిల్లాడిని తండ్రులు పైకి ఎగరేసి ముద్దాడటం చూస్తూ వుంటాం కదా.. అలానే ‘పురం’ కూడా అన్పిస్తాడు.

నీలాకాశం మేఘాల బండరాళ్ళను దొర్లిస్తోంటే భూమి భరిస్తోంది / బిడ్డలను బలిస్తోంది గంగావతారమెత్తి అంటూ పౌరాణిక కథనాన్ని గుర్తుచేస్తాడు.

ఏ బస్తీకి వెళ్ళాలో తెలియకుండా ఓ టికట్ తీసుకుని సిటీ బస్సెక్కితే అన్ని కాలనీలు ఒకేలా ఉన్నాయి మున్నీటి తపస్సులో – ‘మున్నీటి’ తపస్సులో జపం చేస్తున్నట్టున్న భక్తుల భాగోతాలను ఎండగట్టారు.

“చెట్లెప్పుడూ ఇంతలా కంట తడి పెట్టలేదు, నగరం సాగరమైందని ఏడుస్తున్నాయి” అంటూ సాగర సదృశ్యమైన నగరాన్ని తల్చుకుని చెట్లు ఏడుస్తున్నాయని సరికొత్తగా ఆవిష్కరించారు.

‘నీటిపాములు ముట్టడిస్తుంటే పుడమి మూర్చపోయింది. నీళ్ళు చల్లండి’ అంటూ భావనాపటిమను చాటాయి.

‘వానదెబ్బలకు కాళ్ళు విరిగి, కళ్ళు, పళ్ళూడిపోయిన రోడ్లు, భవనాలకు ఆసుపత్రులు చాలక కరోనా రోగులను ఖాళీ చేయిస్తున్నారు’ అన్న ఈ చిన్న కవిత అణుబాంబు కన్నా గొప్పగా పేలుతుంది జనాల మెదళ్ళలో.
“ఎక్కడ ఏ గుడిసె మాడి మసైపోయిందో, ఏ పచ్చని పండ్ల చూలాలు బూడిదై పోయిందో..మేఘార్బాటానికి ఎదురేది- పిడుగు నుండి కాపాడే గొడుగేది” అని రాయటంతో వారి అక్షర విన్యాసాల అందం మరో మారు ద్యోతకమయింది.

“ఆచితూచి అడుగేయండి. ఏది రోడ్లో ఏది మురుగో, మడుగో తెలిసి సాగండి / | ఇది అభివృద్ధి మయసభ…” అంటూ ఆనాటి మయసభ మాదిరిగా సత్యం ఏదో
భ్రమ ఏదో తెల్సి సాగాల్సిన వైనాన్ని | గుర్తుచేశాడు.

“వాన భీముడు చెట్లను పెకిలించి గదలు చేసుకుంటున్నాడు.

దీన బతుకులైన ప్రజలు దిక్కులు | వెతుక్కుంటున్నారని చెప్తూ తాను ‘ప్రజాకవి’నని, ప్రజల పక్షపాతినని మరో మారు అందంగా అక్షరాలా చాటుకున్నారు.

‘మేఘం మేనులో మెరుపు ఖడ్గం / చీకటి కడుపులో కాంతి కరవాలం / అణచివేత క్షేత్రంలో తిరుగుబాటు అంకురం’ అంటూ తిరగబడాలన్న ఆలోచనకి అంకురం పడితే చాలు వానచుక్క కూడా కరవాలంగా మారిన వైనాన్ని కవితలో దర్శింపచేశారు.

“సముద్రానికి మరో సముద్రాన్ని కనిస్తున్నాయి భూమ్యాకాశాలు” అంటూ
ప్రేమైక భావంగా పైకి కన్పించే “ప్రకృతి పైరులే ఆదిమవేల్పులు విగ్రహారాధనతోనే జన సంస్కృతి పై కాల్పులు” అంటూ తిరోగమనంలో సాగుతున్న మానవ జీవన గమనాన్ని గుర్తుచేశారు.

‘ఇది వాన చేస్తున్న భూహక్కు పోరాటం / కబాదార్ల దుర్మార్గానికి అమాయకుల బలిపీఠం నగరం’ అంటూ రాసి నిజమే కదా. ఇది భూహక్కు పోరాటమే అని మనతోనే అన్నిస్తారు. అదే ‘నిజం’ గారి ఇజం. ఆయన ఏది రాసినా ‘కన్విన్సింగ్ గా చెప్తారు. మనం ఎంత కాదని చెప్పాలనుకున్నా గొంతు పెగలదు. ఎందుకంటే అవన్నీ నిజాలు. రాసింది పైగా నిజం గారే కాబట్టి.

“ఆకాశాన్ని ఎవరు ఈడ్చితన్నారో ఆ కసినంతా భూమ్మీద కుమ్మరిస్తోంది / పై
మెట్టుకి కిందిది లోకువే కదా” అని జనాంతికమైన ఆధిపత్య భావజాలాన్ని కవిత్వంలో నింపి గమ్మత్తుగా ‘ఔరా’ అన్నీస్తారు.

“గాల్లో వానల ఉరితాళ్ళు పేనుతున్న రాత్రి, ధాత్రి పుటల నిండా దుర్భర జీవనగాధలు రాస్తోంది” అంటూనే “మాసికల రోడ్లను వొల్లనంది వాన, నరికి ముక్కలు చేసింది, ఇళ్ళను గుల్ల చేసింది. నగర సుందరి మేకప్ చెరి పేసింది” అంటూ సౌందర్యాత్మక ‘మేకప్’ వేసుకున్న నగరం పాపం వర్షానికి చెరిగిపోయి ‘రంగులు వెలసిన’ ఇళ్ళు వెలవెలపోతున్న విధానాన్ని చూపించారు.

“నగరం ఆరేసుకున్న చీరతో కరెంట్ తీగల గుండె ఝల్లు / విద్యుత్ షాక్ కి బదులు వేడికన్నీళ్ళు” ‘కురిసి కుమ్మినప్పుడల్లా పునరావాసాలే | ఆవాసాలెప్పుడూ ఎండమావులే’ అంటూ ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాలప్పుడు మాత్రమే పరుగులు పెట్టే విధానాన్ని నిరసించాడు.

“ఏరెత్తుకెళ్ళిన చూపు ఏ తీరం చేరుతుందో / ఎక్కడ మునిగి ఇంకెక్కడ తేలుతుందో’ అంటూ దృష్టికి అందకుండా వెళ్ళిపోయిన ఆత్మీయుల చూపుల మీద ఆవేదనను ఒంపారు.

‘నది వరదలో ఈదుతోంది. బాహువులు చాచి పంటలను, ఇళ్ళను నిమురుతోంది. ఉప్పొంగిన ప్రేమకు ఊపిరులు ఉల్లిపొరలవుతున్నాయి’ అంటూ పొసిసివ్ ప్రేమతో అల్లల్లాడుతున్న నగరం దుస్థితిని వివరించారు.

ఎడతెరపి లేని వర్షం. అలిగిముసుగేసుకున్న పుడమి మూతిముడుపులు, భూమ్యాకాశాల ప్రణయకలహాలు’ అంటూ అమర ప్రేమికులైన భూమి ఆకాశాల ముచ్చట్లను అక్షరబద్ధం చేశారు.

ఎప్పటి నుండో నిజం – తాత్విక కవి – తాజాకవి- నేటికవి – మేటికవి. ఇప్పుడు ‘వర్షం’ కవి కూడా. సీరియస్గా కవిత్వాన్ని ప్రేమించే ప్రతీకవి ‘వర్షం’ మీద కవిత రాయాలన్పిస్తే వీరి పంక్తులు గుర్తుకురాక మానవు. అభివ్యక్తి ఏదైనా అనురక్తి ఎంతైనా ‘వర్షం’ మీద ఇంత ఉన్నతంగా ఇన్ని కోణాల్లో ఎవరూ రాయలేదనిపించింది.

తాను రాసుకున్నట్టుగానే ఆకలితో అల్లాడిపోయే అక్షరాలకు భావాల పాలు తాగించి గంతులేయించటమే కవిత్వం అన్నట్టుగా వారి ఈ చిరుకవితలన్నీ చినుకుల్లా కొత్త పదబంధాలతో, కొత్త పదాలతో అలంకరించుకుని మురిసిపోయాయి.

కల్లూరి భాస్కరంగారు ముందు మాటలో రాసినట్టు శబ్దార్థాల సమప్రాధాన్యత ముచ్చటగొల్పుతుంది. ప్రకాశ్ గారన్నట్టు ఇది జనవద్గీతే.

ఇలా ఈ ‘అలలు’లోని కవితలు – రూపంలో హస్వంగా వున్నా, భావంలో విశ్వంగా కన్పిస్తాయి! ఈ సంక్షిప్త కవితల సంకలనం ఇటీవలి కాలంలో ఆలోచింపచేసిన కవిత్వంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

అందుకే “A True Poem is one, which provokes a thought, triggers an idea and inspires the Life!” అన్న మాటలకు నిలువెత్తు సాక్ష్యంగా ఆవిష్కృతమయింది. అధ్యయనం, అనుభవం, పరిశీలన, భాష, పదసంపద, జీవితం, తాత్వికత అనే ఆరు అంశాలను తన జ్ఞానం అనే సముద్రంలో ప్రతిష్టించి, ఆ మధనంలోంచి వెల్లువెత్తిన “అలల’ను కవితలుగా మనకు అందించిన ‘నిజం’ నిజంగానే అభినందనీయుడు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com