-కాంచనపల్లి గోరా

బెకన్ రచన వచనల్లో సత్యం యొక్క విశిష్టత, పుస్తకపాఠనావిశ్యకత

లండన్ – 1561- 1626  కాలానికి  చెందిన   బెకన్ న్యాయవాదిగా తాత్వికుడు గా రాజకీయవేత్త గా ఆంగ్ల భాషాకోవిదుడుగా  బహుముఖ ప్రఖ్యాతుడు.అతడు విద్యార్ధి దశలో ట్రినిటి కాలేజీ లో చదివే రోజుల్లోనే ఆరిస్టాటిల్ తాత్విక వివేచనకు ప్రభావితుడయ్యాడు .

బెకన్ ని  Father of English Essay అని అంటారు . Father of Empiricism  అంటారు .మానవునికి శాస్త్రీయ దృక్పథం ప్రకృతిని దగ్గరనుండి చూస్తే వస్తుందని చెబుతాడు బెకన్.బెకన్ వ్యాసం of Truth  నైతిక భావజాలం ప్రోది చేసుకోవడానికి ఉపయుక్తం గా నిలిచింది . సత్యాన్ని గురించి నైర్మల్యాన్ని గురించి  వివరిస్తుంది ఈ వ్యాసం .బెకన్ దృష్టి లో సత్యాన్వేషణ అంటే ప్రేమించడం గురించి తెలుసుకోవడమే .సత్యానికి సంబంధించిన ఙ్ఞానం పొందడం అంటే సత్యాన్ని దృడం గా  విశ్వసించడమే .సత్య పథం ద్వారా ఆనందం పొందేవాడు నిజమైన సార్వభౌమాధికారం కలవాడు .బెకన్ తన పరిశీలన లో మనిషి స్వాభావికం గా అబద్దం చెప్పేలక్షణం  కలిగి ఉంటాడని చెబుతాడు . బెకన్ అసత్యం వైపు మొగ్గు చూపాడని ,అ సత్యవాచకం లోని స్వాభావికతను సమర్థించాడని అర్థం కాదు .బెకన్ గొప్ప ఆదర్శాలను ,విస్మృత సత్యాలను అర్థం చేసుకున్న రచయిత .సత్యాన్వేషి అయిన రచయిత ఎప్పుడైనా పాఠకుని లో నిజాన్ని  ప్రోది చేయాలనిచెబుతాడు.

పై ప్రతిపాదన తోనే కొనసాగిన ఆయన off Goodness , Goodness of Nature అనే వ్యాసాలు నైతిక సూత్రాలు ఆవృతాలు గా కొనసాగుతాయి .ధార్మిక వ్యక్తిత్వం భాధా హేతువౌతుందని చెబుతాడు ,దాన గుణానికి లేక దార్మికతకు హద్దులు ఉండవు అని చెబుతాడు .

 బెకన్ పునర్జీవనోద్యమానికి (Renaissance ) చెందిన వాడు .మనిషి తనకు ఈ ప్రపంచానికి గల సంబంధం అసలే ఆలోచించడు .బెకన్ మానవుని ఆచరణాత్మకత మీదనే నిరంతరం దృష్టి నిలిపేవాడు .Of Truth , Of Beauty  పూర్తి గా మనిషి సత్ప్రవర్తనకు సంబంధించినవే . బెకన్ సౌందర్యం సత్యం అవిభాజ్యం అంటాదు .ఆయన మానవీయ అధ్యనం అంతా ఈ కోణం లోనే సాగుతుంది .మనిషి లోని దైవత్వం ,లేక ఉన్నత వ్యక్తిత్వం నిరూపించేందుకే ఆయన ప్రయత్నం .ఒక తాత్వికుడు గా సత్యాన్వేషణ ఆయన ప్రధాన లక్షణం .మనిషి లో సాధారణం గా ఉండే భ్రమలను అయన వెతిరేకిస్తాడు .ఈ విషయంగా అతడు జరిపిన అన్వేషణ మానవీయకోణం లోని నిజాయితీ ని బయట పెడుతుంది .’’ To say of what is that it is,or of what is not that is not ,is truth ‘’  అంటాడు బెకన్. బెకన్ అసత్యానికి సృజనాత్మకత ఉంటుందని చెబుతాడు .అట్లాగే Free will కూడా ఉంటుంది . కాగా సత్యం గుంజకు కట్టేసినట్టు నిక్కచ్చి గా ఉంటుంది .మనిషి కష్టపడితేనే సత్యం లభ్యమౌతుంది .మనసు కష్టపడడానికి ఇష్టపడక అసత్యం వైపు భ్రమల వైపు వెడుతుంది . సాధారణం గా అబద్దాలు చెప్పేవాళ్ళు కవులు ,వ్యాపారస్తులు అయిఉంటారని చెబుతాడు బెకన్. సత్యం ముత్యం లాంటిది .అది పగటి వెలుగు లో కనబడుతుంది .అబద్దం చీకటి లో మెరిసే వజ్రం లా ఉంటుంది . సాధారణం గా కొంచెం సత్యం కొంచెం అబద్దం కలిపినా మాటలు వినసొంపు గా ఉంటాయి . కవిత్వం ఇట్లాంటి వ్యక్తీకరణలు అధికంగా చేస్తుంది కాబట్టే Augustin   కవిత్వాన్ని దయ్యాల ద్రాక్ష రసం అన్నాడు .  సత్యం theological truth   philosophical truth అని రెండు రకాలుగా ఉంటుంది . ఙ్ఞానమే సత్య శోధనకు ములమౌతుంది .నిజం అనే గుట్టపైకి ఎక్కి కిందికి చూస్తే కనిపించే యుద్ధ్హాలు అసలు విషయం తెలుపుతాయి .

బెకన్ Of Studies, వ్యాసం అధ్యయనావశ్యకత తెలిపేది . చదువు వల్ల కలిగే ప్రయోజనాలు కూలంకషంగా చర్చిస్తాడు బెకన్. చదువు ఆనందాన్ని , శక్తిని ,ఇస్తూ ఒక ఆభరణం గా ఉంటుందంటాడు బెకన్. బెకన్ దృష్టిలో విద్య పట్ల మూడు రకాలైన దృక్పథాలు కలిగిన వాళ్ళుంటారు .కపటులు లేక అవివేకులు(crafty)సామాన్యులు   (simple) వివేకులు (wise) . అవివేకులు పుస్తకాలను ,పఠనాన్ని నిరసిస్తారు .సామాన్యులు అధ్యయనాన్ని ఆరాధిస్తారు .వివేకులు పుస్తక ఙ్ఞానాన్ని ఆచరణ కు తెస్తారు . బెకన్ పఠనీయ పుస్తకాల గురించి కూడా సూచనలు చేస్తాడు .కొన్ని పుస్తకాలను చదివే ఉత్సాహం కోసం చదవాలి .ఇలాంటి ఆసక్తి కలిగించేది ప్రధానం గా ఫిక్షనే . కొన్ని పుస్తకాలు మొత్తం కాకుండా అవసరమైన భాగాన్ని చదివి అర్తం చేసుకోవాలి . మరికొన్ని గొప్ప పుస్తకాలు జాగ్రత్తగా చదివి జీర్ణం చేసుకోవాలి . కొన్నయితే చదవాలిసిన అవసరం లేదు నిష్ప్రయోజనమైనవి .

బెకన్ ఎ శాస్త్రం చదివినా ప్రయోజనం ఉంటుందని చెబుతాడు .చరిత్ర ఙ్ఞానాన్ని పెంపొందిస్తుంది . కవిత్వం ఉహాత్మకత పెంచుతుంది .గణితం బుద్ధిని వికసింపజేస్తుంది .తత్త్వం అనవసర ఆలోచనలు చంపి ఏకాగ్రత కలిగిస్తుంది .న్యాయశాస్త్రం చెడ్డ ఙ్ఞాపకాలను అధిగమిస్తుంది .

శరీరార్యోగ్యం కోసం వ్యాయామం ఎంత అవసరమో మానసిక ఆరోగ్యం కోసం చదువు అంత అవసరం అంటాడు బెకన్.

చదువు మనిషినిని సంపూర్తిమానవుని గా మారుస్తుంది అంటాడు .

అధ్యయనం వల్ల  సిద్దపడే తత్త్వం పెరుగుతుందంటాడు. ప్రతిదాన్ని ఆకళింపు చేసుకొని వర్తమాన సమాజానికి అవసరమైన వ్యక్తిత్వం సంతరించు కొంటాడు మనిషి . బెకన్ ఒక్క చదవడమే కాక రాయడాన్ని కూడా ఆహ్వానించాడు . రాయడం వల్ల కచ్చితత్వం వస్తుందని చెబుతాడు . జానికి ఒక మహారచయితను చిరు స్పర్శ తో తూచడం అంత సులువు కాదు . ఎవరికైనా ఈ చిరు ప్రయత్నం   వల్ల సత్యశోధన మీద అధ్యయనం మీద ఆసక్తి కలుగుతుందేమో అనే అభిలాషె.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com