..డాక్టర్ పసునూరి రవీందర్ పాటలు

సమైక్య పాలన మీదనే కాకుండా, దళిత బహుజన దృక్పథంతో ప్రశ్నల కొడవల్లెత్తి ప్రతిధ్వనించిన ఈ పాటకు పదునెక్కువ. ఎర్ర జెండా నీడలో పురుడు పోసుకున్న ఈ మాటకు ఎదిరించే తత్వం ఎక్కువ. అందుకే ఈ పదం ఆదివాసీల ఆత్మ ఘోషకు అక్షరరూపం అయితది. అడవి బాట పట్టిన అన్నలకు ఆకలి తీర్చే అమ్మయితది. కన్నోళ్ళ ఆశల దీపమై కమ్యూనిస్టు సిద్ధాంతాలతో కలిసి నడిచిన పాటగాడు డాక్టర్ పసునూరి రవీందర్. అక్షరమే ఆయుధంగ వామపక్ష భావజాలంతో పెరిగి పెద్దోడు అయ్యిండు. బుద్ధుడు, పూలే, అంబేద్కర్ ఆలోచనా విధానంతో సామాజిక విప్లవాత్మక శక్తిగా అవతరించినాడు. పాట లోతుల్ని శోధించి పరిశోధకుడు అయ్యిండు. విద్యార్థి ఉద్యమ నాయకుడు అయ్యిండు. కవి, గాయకుడు, రచయిత, జర్నలిస్టు విమర్శకుడుగా బహుముఖ ప్రజ్ఞా పాటవాల తో బహుజన సామాజిక చైతన్యాన్ని పాదుగొలుపుతున్న కేంద్ర సాహిత్య యువపురస్కార అవార్డు గ్రహీత డాక్టర్ పసునూరి రవీందర్ ఈ ఫిబ్రవరి 21న ఎర్ర ఉపాలి మొదటి స్మారక అవార్డు అందుకుంటున్న సందర్భంగా రవిందర్ గురించి నాలుగు మాటలు.

గొప్ప చారిత్రక, సాంస్కృతిక, రాజకీయ వారసత్వం ఉన్న వరంగల్ పట్టణం లోని రైల్వేస్టేషన్ పక్కనే గల శివనగర్ లో భిన్న సంస్కృతుల మేళవింపు తోపాటు విప్లవ భావజాలం కూడ మెండుగానే ఉంటది. అక్కడ బతుకే పోరాటం అయిన కాడ భారత కమ్యూనిస్టు పార్టీ జెండాను భుజానికి వేసుకుని బానిసత్వాన్ని ధిక్కరించి బతుకుతున్న నిరుపేద శ్రామిక కుటుంబమే పసునూరి వీరస్వామిది. వీరస్వామి – వరమ్మ దంపతులిద్దరూ కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేసిండ్రు. దోపిడీ పీడన లేని సమాజ నిర్మాణం కోసం ఇంటినే పార్టీ కేంద్రంగా మార్చిండ్రు. వీరి పెద్ద కొడుకే డాక్టర్ పసునూరి రవీందర్ ఈయన 1980 జనవరి 8న శివ నగర్ లో జన్మించిండు. చిన్నప్పటి నుంచి తండ్రి అడుగుజాడల్లో పయనించిన రవీందర్ తండ్రితో పాటు మేడే ఉత్సవాలలో పాల్గొనడమే కాకుండ ఎర్రజెండా చేతపట్టి విప్లవ పాఠాలు నేర్చుకున్నడు. డప్పు దరువులకు చిందేసి ఆడడం, వేదికలెక్కి పాటలు పాడడం రవీందర్ కు వెన్నతో పెట్టిన విద్య అయింది. విప్లవోద్యమ స్ఫూర్తితో రవీందర్ ఇంటర్మీడియట్ చదివే రోజుల్లోనే పాటలు రాయడం మొదలు పెట్టిండు. తల్లి పాడే బతుకమ్మ పాటలు, జానపద గేయాల ప్రభావంతో అనేక పాటలు రాసిండు. క్రమంగా వామపక్ష ఉద్యమాల వైపు అడుగేసిండు. విప్లవోద్యమంలో అసువులు బాసిన అమరవీరులను స్మరిస్తూ

“అగ్గిపూలా వనము మన ఓరుగల్లో మన ఓరుగల్లు

అమరులు యాదైతే మది తల్లడిల్లో మది తల్లడిల్లు” అంటూ వరంగల్లో ఘనతను వర్ణిస్తూ నే అమరవీరులను పేరుపేరునా పలకరిస్తడు. అమ్మల కడుపుకోతకు అక్షరరూపం అయితడు. అన్నార్తుల పేగు బంధమై అల్లుకుంటడు. రవీందర్ వరంగల్లో డిగ్రీ చేస్తున్న సమయంలో విద్యార్థి నాయకుడిగా అనేక ఉద్యమాలలో క్రియాశీలక పాత్రను పోషిస్తడు. అదే సమయంలో ప్రజానాట్యమండలి కళాకారుల పాటలకు ఆకర్షితుడై పాటలు రాసిండు. పసునూరి రవీందర్ స్నేహం విలువను చాటి చెప్పిన పాట విద్యార్థి లోకంలో ఒక సంచలనాన్ని సృష్టించింది. ఎంతోమంది అభిమానులను సంపా దించి పెట్టింది. ఈ క్రమంలోనే అంబేద్కర్ ఆలోచనా విధానంతో రవీందర్ ఉన్నత చదువుల మీద దృష్టి సాధించడమే కాకుండా డా, తన ముగ్గురు తమ్ముళ్లు శ్రద్ధగా చదివేలా చేయగలిగిండు. అట్లా విద్యా దృక్పథాన్ని అలవర్చుకున్న రవీందర్ కాకతీయ విశ్వవిద్యాలయం నుండి తెలుగు లో గోల్డ్ మెడల్ సంపాదించిండు. అనంతరం 2000 సంవత్సరంలో రజిత ను వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిండు. సాహిత్యానికి అంజలి ఘటించిన పసునూరి రవీందర్ మాక్సిజమా, అంబేద్కరిజమా అనే సంఘర్షణలో నుంచి సత్యాన్వేషణ చేసి ఆఖరికి బహుజన దృక్పథమే సరైనదని, అంబేద్కర్ సిద్ధాంతం లోనే అన్నీ ఉన్నాయని సూత్రీకరిస్తడు. ఈ నేలకు అంబేద్కరిజం తప్ప ఇంకా ఏమీ అవసరం లేదని ప్రకటిస్తడు. అదే ప్రచారం చేస్తడు. కథలు, కవితలు, వ్యాసాలు, ప్రసంగాల ద్వారా తన భావజాలాన్ని బలంగ వ్యక్తం చేస్తడు. పసునూరి రవీందర్ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో “ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు సాహిత్య విమర్శ” అనే అంశం మీద ఎం.ఫిల్ చేయడంతోపాటు “తెలంగాణ ఉద్యమ పాట” మీద పీహెచ్డీ పూర్తి చేసిండు. అనంతరం అదే విశ్వవిద్యాలయంలో పిడిఎఫ్ కూడా పూర్తి చేసిండు. దేశంలోని అనేక ప్రాంతాల విద్యార్థులు చదువుకునే హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో తెలంగాణ ఉద్యమానికి మద్దతు కూడగడతడు. రాష్ట్ర ఆకాంక్షతో ప్రత్యక్ష ఉద్యమంలో భాగస్వామిగా మారుతడు. ప్రజా కవులు పాటలను గొంతెత్తి పాడి సభలను విజయవంతం చేయడమే కాకుండా పసునూరి రవీందర్ తాను స్వయంగా ఎన్నో పాటలు రాసిండు. ఆయన రాసిన

“ఊరు వాడ ఒక్కటై ఉద్యమించి రన్నో జై కొట్టి తెలంగాణ

మెల్ల మెల్లగా పోరు ఢిల్లీ చేరిందన్నో జై కొట్టి తెలంగాణ”

అన్న పాట ఖండాంతరాల ను దాటిపోయింది. సెల్ ఫోన్ లలో రింగ్ టోన్ గా ప్రతిధ్వనించింది. 2010 లో వచ్చిన ఈ పాట ఉద్యమాన్ని ఉర్రూతలూగించింది. పసునూరి రవీందర్ రాసిన పాటలు “భూమికోసం, అగ్గి పూలవనం, ఊర్లకు నీల్లంటుకున్నయి, జై కొట్టు తెలంగాణ వంటి పాటల సీడి ల లో చోటుచేసుకున్నయి. డాక్టర్ పసునూరి రవీందర్ హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో నిరాహార దీక్ష చేపట్టిన సమయంలో తాను రాసిన దీర్ఘకవితను “లడాయి” అనే సంకల నంగా ప్రచురించినాడు. సింగిడి తెలంగాణ రచయితల వేదిక కన్వీనర్ గా పనిచేసిన పసునూరి రవీందర్ విశ్వవిద్యాలయానికి అనేక మంది కవులను ఆహ్వానించి కవిత్వము, పాటలను రికార్డు చేసే కార్యక్రమాన్ని ప్రొఫెసర్ జయశంకర్ సార్, ప్రొఫెసర్ కోమురన్నలతో కలిసి నిర్వహించినాడు. ఈ సందర్భంగా అనేక సంకలనాలకు సహాయ సంపాదకుడిగా పని చేసినాడు. తన సంపాదకత్వంలో “మాదిగ పొద్దు” సంకలనాన్ని వెలువరించినాడు. రాష్ట్రం ఆవిర్భవించిన తొలినాళ్ళలో డాక్టర్ పసునూరి రవీందర్ వెలువరించిన కథాసంకలనం “అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా” కు 2015 కేంద్ర సాహిత్య యువ పురస్కారం లభించింది. ఇదే కాకుండా పసునూరి రవీందర్ రాసిన కథలు ఇంగ్లీష్, హిందీ, కన్నడ భాషల్లోకి అనువాదం చేయబడినవి. పసునూరి రవీందర్ సిద్ధాంత గ్రంథానికి గాను తెలంగాణ ఎన్నారై అసోసియేషన్ వారు సురవరం ప్రతాపరెడ్డి అవార్డును ప్రధానం చేసినారు. అదేవిధంగా యునైటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ వారు జాషువా అవార్డును ప్రధానం చేసినారు. ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్న డాక్టర్ పసునూరి రవీందర్ ఈనాడు దళిత కవి ఎర్ర ఉపాలి మొట్టమొదటి స్మారక అవార్డును అందుకుంటున్న సందర్భంగా పసునూరి రవీందర్ కు శుభాకాంక్షలు. జయహో డాక్టర్ పసునూరి రవీందర్.

-అంబటి వెంకన్న

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com