ప్రఖ్యాత కవి రచయిత అనువాదకుడు డాక్టర్ నలిమెల భాస్కర్ 14 భారతీయ భాషలు తెలిసిన ఉపన్యాసకులు .’పునత్తిల్ కుంజబ్దుల్ల’ మలయాళ నవలను ‘స్మారక శిలలు’ పేర తెలుగు లోకి అనువదించారు.ఈ నవలకే 2010లో కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం పొందారు. తెలంగాణ భాషకు సంబంధించిన తెలంగాణ పదకోశాన్ని 2003లోనే ముద్రించారు .ఇది ఇప్పటికీ నాలుగు ముద్రణలు పొందింది. తెలంగాణ పదాల మీద నిరంతర పరిశోధన చేస్తూ ‘బాణం ‘అనే వ్యాస సంపుటి 2008లో వెలువరించారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో మన భాష మీద వందల ప్రసంగాలు చేశారు .2017 లో ‘తెలంగాణ భాష- దేశ్య పదాలు’ 2019లో ‘తెలంగాణ భాష -సంస్కృత పదాలు’ అనే పుస్తకాలను వెలువరించారు. అదే సిరీస్ లో ఇటీవలనే ‘తెలంగాణ భాష -తమిళ పదాలు ‘అనే గ్రంథం వెలువరించారు . 1974 నుంచి ఇప్పటివరకు వివిధ ప్రక్రియల్లో 20 పుస్తకాలు వెలువరించారు. ఆయనతో కవి రచయిత ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అన్నవరం దేవేందర్ – తంగేడు పత్రిక కోసం ముఖా- ముఖి నిర్వహించారు .ఇందులో తెలంగాణ భాషకు సంబంధించిన చాలా విషయాలు చర్చించారు.

ప్ర. తెలంగాణ సంస్కృతి వేరైనట్లుగానే తెలంగాణ భాష వేరు అని మీరు పలు సందర్భాల్లో అన్నారు.తెలుగుకు,తెలంగాణకు ఎట్లా వేరు వేరో వివరంగా చెప్పగలరా?

జ. దేవేందర్! ఇక్కడ ఒక చిన్న సవరణ. నాకు తెలిసి నేను ఆంధ్ర భాష తెలుగు భాష..ఇవి రెండూ వేరు వేరు అని చెప్పినట్లు గుర్తు. తెలుగు అంటే తెలంగాణ భాషే అని చాలా బలంగా తెలంగాణ మలి దశ ఉద్యమ కాలంలో చెప్పాను. ఒకవేళ అప్పట్లో తెలుగు భాష,తెలంగాణ భాష రెండూ వేరు వేరు అని చెప్పి వుంటే అది తప్పే!

మరి ఇంతకీ ఆంధ్ర భాష, తెలుగు భాష ఇవి రెండూ వేరుగా ఉన్నాయా? ఒకప్పుడు ఉండినాయి.ఆంధ్రులు ఆర్యులు. వాళ్ళు ఉత్తర భారతం నుండి వింధ్య పర్వత ప్రాంతాల వరకూ, ఇంకా దిగువకూ వచ్చారు.వాళ్ల భాష బహుశా :సంస్కృతం అయివుండచ్చు .తెలుగు వాళ్ళేమో వింధ్యకు దిగువన తెలుగు మాట్లాడుతున్న ప్రజలు. ఆంధ్రులు ,తెలుగువాళ్లు కలసి పోయి ఈనాటి తెలుగు మాట్లాడుతున్నారు. తెలుగు వాళ్ళు ద్రవిడులు. అయితే ఇట్లా కలిసిపోవడం ఏ రెండు వేల ఏండ్లకు ముందే జరిగింది. ఆంధ్ర భాషలో అందుకే సంస్కృత పదాలు ఎక్కువగా ఉంటాయి. తెలుగులో దేశ్య శబ్దాలు అధికం.”అమ్మ” ఆంధ్ర పదం “అవ్వ” తెలుగు పదం. నన్నయ పూజ్యురాలు , స్త్రీ అనే అర్థం లొనే అవ్వ అన్నాడు. పోతన తల్లి అనే అర్థంలో రాసినాడు. “అమ్మ” మీదా ఇంతో కొంతో “మాత,మా” అనే మాటల ప్రభావమో, “అంబ” అనే పదం ప్రభావమో వుంది. “అవ్వ” “అవ్వై” ద్రవిడ పదం నుండి వచ్చింది.

“ఆంధ్ర భాషా వికాసము” రాసిన గంటిజోగి సోమయాజి ఏమన్నారో గమనిద్దాం: “నేడు ఆంధ్రమనబడెడు దేశమునకు కేంద్ర స్థానము గుంటూరు సీమ” (1947). సోమయాజి మరలా “నిజాము రాజ్యమున తూర్పు భాగము తెనుగు. ఈ భాగమునకే ‘తెలింగాణా ‘అని పేరు. ఇది అక్కడ తెనుగు వారి వలన వచ్చిన నామమే గాని వేరు కాదు” అన్నారు.

“పశ్చిమాంధ్రులకును, ప్రాగ్దేశాంధ్రులకును సారస్వత సృష్టిలోను,సారస్వత సేవలోను కొంత భేదమున్నది. మన వాంగ్మయమున గల మార్గ దేశి శాఖలలో పూర్వ కాలమున మార్గ శాఖ ప్రాక్రియలోను ,దేశి శాఖ పశ్చిమ సీమలోను ఎక్కువ వృద్ధియైనది. బాహుళ్యము మీద చెప్పవచ్చును ” ఇది పెంగళి లక్ష్మీకాంతం 1942 లో చెప్పిన ముచ్చట.

పశ్చిమాంధ్రులు అంటే తెలంగాణీయులు. ప్రాగ్దేశాంద్రులు అనగా ఆంధ్రులు. వీళ్ళ సాహిత్యంలో కూడా తేడా ఉందని పింగళి వారన్నారు. మార్గశాఖ ఆంధ్రులదైతే, దేశిశాఖ తెలంగాణ వారిది. సంస్కత మార్గంలో నడిచే శాఖ “మార్గ”. తమ దేశపు,ప్రదేశపు పద్దతిని అనుసరించేది “దేశీ”. అందుకే అక్కడ “నన్నయ” వున్నాడు. ఇక్కడ “సోమన్న” వున్నాడు.

“ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహం”లో ఖండవల్లి లక్ష్మీరంజనం “తెలుగు వారుండు దేశము కనుక ఈ దేశమందలి ఒక భాగమునకు తెలంగాణము అను పేరు ఏర్పడినది ” అన్నారు 1955లో.

అంతెందుకు? ” ఆంధ్రము” అనే పదమే అది సంస్కృతపు మాట అనే ఆధారాన్ని చూపిస్తున్నది. “ధ” అనే అక్షరం మహాప్రాణం. ఖ,ఛ,ఠ.. మొదలైన ఈ మహాప్రాణాలు తెలుగులో లేవు. అవి సంస్కృతం నుండి ఆ తర్వాత తెలుగులోనికి వచ్చాయి. ఈ “ధ” అనే అంతరిక సాక్ష్యం “ఆంధ్రము” అనే మాట సంస్కృతం అని చెప్పకనే చెబుతున్నది. “తెలుగు” (తెలంగాణం కూడా) అనే పలుకు అది తెలుగు నుడి అని చెబుతున్నది .

అయితే.. ఇవాళ ఆంధ్రప్రాంతం అంతటా సంస్కృతపదాలతో వున్న తెలుగు మాట్లాడుతున్నారని, తెలంగాణ అంతటా తెలుగు మాటలతో కూడిన తెలుగు పలుకుతున్నారని ఒక గీత గీసి సూత్రీకరణ చేయలేము. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లోనూ తెలుగే మాట్లాడుతున్నారు. కానీ ,తెలంగాణ, సీమలోని ప్రజల వ్యవహారంలో ఆంధ్రప్రాంతపు రెండున్నర జిల్లాల విద్యావంతుల భాషలో వున్న తెలుగు కంటే ఎక్కువ తెలుగు ఉన్నది అనేది నిర్వివాదంశం. దానిక్కారణం ఏమంటే.. తెలంగాణ ప్రాంతం మొదటి నుండి అది తెలుగు మాట్లాడే భూభాగం. పైగా నిజాము నవాబుల కాలంలో పాఠశాలలు,పత్రికలు,ముద్రణాయంత్రాలు, రవాణా సౌకర్యాలు మొదలైన ఆధునిక నాగరికత సౌలతులు లేకపోవటం చేత తెలంగాణ తెలుగు మార్పుకు ఎక్కువగా లోనుగాక, మూలాల కాపాడుకున్నది. అట్ల కాక బ్రిటీషాంధ్రలో పై వసతుల కారణాన అక్కడి భాష బాగా మారిపోయింది. అక్కడ కూడా రెండున్నర జిల్లాలు విద్యావంతుల భాషా వ్యవహారంలో తెలుగు కన్నా ఇతర ప్రాంతాల్లో తెలుగు ఎక్కువ. ముఖ్యంగా తెలుగు భాష ఎక్కడైనా నిరక్షరాస్యుల్లోనే బాగా బ్రతుకతున్నది.

ప్ర: ప్రస్తుతం తెలంగాణ భాష సంస్కృతి ఎట్లా ఉన్నది? దీని కోసం ప్రభుత్వంగానీ, రచయితలుగానీ ఏ రకమైన కృషి చేయాలి ?

జ: నేను భాషకే పరిమితమై మాట్లాడుతాను .తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆలస్యంగానైనా తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పడింది. ఇది సంతోషించవలసిన విషయమే! మిత్రుడు నందిని సిద్దారెడ్డి అధ్యక్షతన కొంతవరకు మంచి పుస్తకాల ప్రచురణ జరిగింది. అయితే ఈ కృషి చాలదు. తెలంగాణ భాష కి ఒక సమగ్ర చరిత్ర రచన జరుగలేదు. ఓ సమగ్రమైన నిఘంటువు రాలేదు. తెలంగాణ భాష వ్యాకరణం దిశగా ఏ కృషి చేయడం లేదు. తెలంగాణ కవులైన పోతానాదుల పద ప్రయోగ సూచికలు తయారుకాలేదు. అన్నమయ్యను పట్టించుకున్నంత కాకున్నా కొంతమేరకైనా భద్రాచల రామదాసును పట్టించు కోవాల్సి ఉండింది . తెలంగాణ భాషకు సంబంధించిన పరిశోధన ఏ మాత్రం జరగడం లేదు . తెలంగాణ పల్లె సీమల్లో ప్రాచీన మూలలు కలిగిన వేలాది పదాలున్నాయి. అవి అటు ములాద్రవిడానికీ ,ఇటు తెలుగు దేశీపదాలకూ అతి దగ్గరగా ఉన్నాయి.ఈ అపురూపమైన పద సంపదనూ, సామెతలనూ, జాతియాలనూ, నుడికారాలనూ ప్రభుత్వం అనుకుంటే సేకరణ చేయించగల్గుతుంది. వ్యక్తులు ఎంత చేసినా తక్కువే. పైగా తెలంగాణ భాష గొప్పతనం ఏమిటంటే.. ఈ భాషలో ద్రవిడ పదాలూ, తెలుగు పలుకులూ,ప్రాకృత సంస్కృతం మాటలూ, ఆంగ్ల ఉర్దూ నుడులూ వుండి అది సుసంపన్నగా, పరిపుష్టంగా వుంది. దేశంలోని ఏ భాషకూ లేని ప్రాశస్త్యం యిది. ఉత్తరాది భాషల్లో ద్రావిడ పదాలు వుండవు కదా! పోనీ.. దక్షిణాదిలోను తమిళంలో సంస్కృత శబ్దాలు తక్కువ కదా! మలయాళంలో మనతో పోల్చితే ఉర్దూ తక్కువ , కన్నడంలోనూ అంతే! జాతీయ భాషగా అర్హతలు కల్గిన భాష “తెలుగు” అని హాల్డెన్ అన్నాడు. నిజానికి తెలంగాణ భాషకి జాతీయ భాష కాదగిన అన్ని అర్హతలూ ఉన్నాయి. కానీ ప్రభుత్వాలకూ , రచయితలకూ, ప్రజలకూ తెలుగు భాషో, తెలంగాణ భాషో అనండి.. పెద్దగా పట్టింపు లేదు. దేశాభాషాలతో పోల్చి చూస్తే మన భాషకు మనమే ఆదరణ చూపడం లేదన్నది చేదు నిజం.

ప్ర: పద్నాలుగు భారతీయ భాషాసాహిత్యాలపై పట్టున్నవారిగా మీరు అంచనా వేస్తే మన తెలుగు సాహిత్యం భాష పరిస్తితి ఎట్లా వుంది?

జ: ఒక చిన్న ఉదాహరణ! నేను 1992 మే నెల లో మొదటి సరిగా కలకత్తా వెళ్ళాను. హౌరా రైల్వే స్టేషన్లో దిగాను. అక్కడి పుస్తకాల షాపులో “దేశ్” ( స్వర్ణోత్సవ కథల సంకలనం) అనే పుస్తకం కొన్నాను . నిజానికి “దేశ్” అనేది బెంగాలీలో 1933 లో మొదలైన పక్షపత్రిక. యాబై ఏళ్ల సందర్భంగా 1983లో ఆ యాబై సంవత్సరాల్లో ఆ పత్రికలోనే వచ్చిన ఓ యాబై మంచి కథల్ని ఎంపిక చేసుకొని సంకలనం వేశారు. ఆ సంకలనం 1991 వరకే ఏడుసార్లు ముద్రించబడి 37,500ల పత్రులు అమ్ముడుపోయినై ,ఆ తర్వాత అరేళ్లకు మరో 14300ల పుస్తకాలు చెల్లిపోయినై. 1997 నుండి ఈ 2021 వరకు ఇంకా ఎన్ని ముద్రణలు లు పొందివుంటుందో నాకు తెలియదు.1997నాటికే 51800ల పత్రులు అమ్ముడు పోయినై అంటే వాళ్ళ భాషాభిమానం ఎంత గొప్పగా వుంది! నేను 1986లో త్రివేండ్రం వెళ్ళినప్పుడు ఉదయం పూట ఫుట్ పాథ్ లపై మలయాళ దిన పత్రికలు చూసి ఆశ్చర్యపోయాను. అప్పటికి వంద దినపత్రికలు వస్తున్నాయట ఆ భాషలో. దేశంలోనూ అత్యధిక సర్కులేషన్ కల్గిన మలయాళ మనోరమ మనందరికీ తెలిసిన పత్రికే . నిన్నా మొన్నా శ్రీధరన్ అనే ఐదవతరగతి వరకే చదువుకున్న ఒక వృద్ధుడు పన్నెడు లక్షల పదాల తో ఉన్న మలయాళ, తమిళ, కన్నడ,తెలుగు నిఘంటువు వేశాడు .పి.సి.కార్తా పదివేల మలయాళ సామెతలకు నిఘంటువు వేశాడు. మలయాళ మనోరమ వాళ్ళు “భాషా పోషిని” అనే గొప్ప రెన్నెళ్ల పత్రికను తెస్తున్నారు. మన కన్నా ముందునుంచి అయ్యప్ప పనిక్కర్ సంపాదకత్వం లో కేరళ కవిత వస్తున్నది.కేరళ యూనివర్సిటీ మలయాల శాఖ భాషా సాహితీ అనే త్రైమాసిక తెస్తున్నది. పొన్ కున్నం వర్కి క్రైస్తవ సమాజంలో ఉన్న ఎస్టాబ్లిష్ మెంట్ కి వ్యతిరేకంగా కథలు రాశాడు. వైక్కం ఒక ఋషి వంటి రచయిత, ఇక తమిలానికి వస్తే ఆనంద వికటన్ ,కుముదం వంటి పత్రికల కన్నా ఎక్కువగా తమ రచనలు “కనైయాలి” వంటి సాహితీ పత్రికల్లో వస్తేనే బావుంటుంది అనుకునే లబ్ది ప్రతిష్టులు వున్నారు. ఆ భాషలో తమిళంలో పదుల సంఖ్యలో సాహిత్య పత్రికలు ఉన్నాయి. వాటికి గొప్ప ఉదాహరణ ఉంది

అంతెందుకు? దేవేందర్.. మనం పోయినేడు మదురై పెళ్ళాం కదా! మీనాక్షి దేవాలయం ముందరి షాపులో నేను “తమిళ సాహిత్య చరిత్ర ” పుస్తకాన్ని (అది తమిళ పుస్తకమే) కొన్నాను కదా! అది ఇప్పటి వరకు 33 ముద్రణలు చూసింది. పైగా , అది సాహిత్య చరిత్ర. కవిత్వమో ,కథల వయ్యో కాదు, నవల అంతకన్నా కాదు ,పైగా ఆ గ్రంథం కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురణ .సాధారణంగా ఆ పుస్తకాలు వాళ్ళ విక్రయ కేంద్రాల్లో తప్ప బయటి దుకాణాల్లో అమ్మరు ,కానీ మదురైలో మామూలు పుస్తకాల షాపులో దొరికింది, పైగా అన్ని సార్లు అచ్చయింది.అది తమిళుల ప్రత్యేకత! తమిళంలో చారిత్రక నవలలు ఇప్పటికీ చదువుతారు, దళితవాదం ముందు మరాఠీ లో వచ్చింది ,దళితులు అద్భుతమైన ఆత్మకథలు రాసుకున్నారు, అక్కడి సాహిత్యంలో వ్యంగ్య కథలు ఎక్కువ, కన్నడం లో ఇప్పటికీ మినీ కవితలున్నాయి, “లలిత ప్రబంధ” పేరుతో హాస్యవచనం వుంది, జానపద సాహిత్యాన్ని వాళ్ళు కండ్లకు అద్దుకుంటరు. అక్కడ కన్నడ సాహిత్య పరిషత్తు తరుపున కన్నడ కథ, కవిత ఏటేటా వస్తాయి. నేమిచంద్ర మొదలైనవాళ్లు రెండునెలలకు ఓ మారు “అచల “అనే స్రీవాద పత్రికను ప్రకటనలు లేకుండా, ఏ సంచికనూ ఆపకుండా తెస్తున్నారు. దళితవాదం కన్నడంలో మనకన్నా ముందోచ్చింది, గుజరాతి లోనూ దళితవాదం వుంది. ఝవేర్ చంద్ మేఘాణి గొప్ప జానపద విద్వాంసుడు. గుజరాతీ లో “కవితా” అనే రెండునెలల పత్రిక గత యాబైఒక్క ఏండ్లనుంచి వస్తున్నది, పైగా అప్పుడప్పుడు ప్రత్యేక సంచికలు వేస్తున్నారు. అనువాదానికి, బాలసాహిత్యానికి,ప్రణయ కావ్యాలకు, నగర కవితలకు మరాఠీ కవితలకు,,, ఇట్లా అనేక సంచికలు వచ్చాయి.

హిందీలో “యుగ్ స్పందన్” అనే పత్రిక వుంది, అది ముప్పై రెండేళ్ల నుండి ఢిల్లీ నుండి వస్తున్నది, వీళ్ళు కూడా సమకాలీన భారతీయ కవితలు, ఆఫ్రికా కవయిత్రులు, మరాఠీ కవిత, తెలుగు కవిత, కన్నడ కవిత, మలయాళం కవిత,మాతృ భాష గొప్పదనం,,,, ఇట్లా అప్పుడప్పుడు అనేక ప్రత్యేక సంచికలు తెచ్చారు. పంజాబీలో దేశ విభజననాటి సాహిత్యంలో “కాజి కా పేట్ ” చెప్పుకోదగిన కధ. అస్సామీస్ లో సరిహద్దు రాష్ట్రాలనుండి వచ్చిన పేదల పరిస్థితి దయనీయం, హోమెన్ బోరోగహైన్ “వెతుకులాట”చాలా గొప్ప కథ, ఒరియాలో గొప్ప సాహిత్యం వస్తున్నది.

నేను తెలుగు తీసికట్టు అని చెప్పడంలేదు, ఇక్కడ వామపక్ష ఉద్యమ సాహిత్యం ఎక్కువ. కవిత్వం, కథ, నవలలు చక్కగా వికసించిన ప్రక్రియలు ఇక్కడ కానీ విమర్శ, వ్యాసం, సమీక్షా, హాస్యం,వ్యంగం, బాలసాహిత్యం, ఆత్మకథ మొదలైన ప్రక్రియలు దాదాపు నిష్క్రియలుగా మిగిలాయి. రంగనాయకమ్మ వంటి రచయిత్రి ఇతర భాషల్లో ఎక్కడా కానరాదు.

ప్ర: ఇతర బాషల నుంచే ( ముఖ్యంగా బెంగాలీ ,తమిళం ,మరాఠి , హిందీ ) మన తెలుగులోకి నవలలు ,కథలు అనువాదం అయి వస్తున్నాయి , మన సాహిత్యం ఆయా భాషల్లోకి వెళ్తుందా .. ఈ అదాన్ ప్రధాన్ ఎలా వుంది ?

జ:ఇతర బాషలనుండి తెలుగులోనికి అనువాదాలు ఎక్కువగా జరుగుతున్నాయనేది వాస్తవం . ఇట్లా జరగడం తప్పేమి కాదు . పైగా మనభాష మరింత కండపుష్టితో పుష్పిస్తుంది , దీనికి కారణం అంటే తెలుగులోకి అనువాదమై రావడానికి హేతువు …తెలుగు మాతృభాషగా ఉన్నవాళ్లు , వాళ్లకు ఇతర భాషలు తెలిసిన కారణం చేత అనువాదాలు చేస్తున్నారు. మాతృభాషలోనికి అనువాదాలు సులభంగా చేయవచ్చు . ఆ అనువాద గ్రంధాలను నలుగురికి పంచుతారు – లేదా మార్కెటింగో నెటవర్కో ఉంటే కొంతమేరకు అమ్ముకుంటారు .ఇతర భాషల్లోకి మన తెలుగు సాహిత్యం అనువదించబడాలంటే ముందు ఎల్ . ఆర్ . స్వామి లాంటి తెలుగేతరులై ఉండి మన ప్రాంతంలో స్థిరపడిన వాళ్ళను వెతకాలి . ఆ పని మన దగ్గర జరగడం లేదు. లేదా ముందు మన సాహిత్యాన్ని ఆంగ్లంలోనికి గానీ హిందీ లోనికి గానీ తీసుకుని పోవాలి . అట్లా చేస్తే హిందీ ఆంగ్లాల నుండి తమిళం వంటి దేశ బాషల్లోకి వెళ్లే అవకాశం వుంది , ఏది ఏమైనా మన బాష నుండి ఇతర బాషల్లోకి వెళుతున్నది తక్కువ. దానికి మన సృజనకారులది ఎంత తప్పో, మన అనువాదకులదీ అంతే తప్పు . కవులూ , రచయితలూ ,,, ముందుగా తమ రచనల్ని ఇతర బాషల్లోనికి తీసికొని వెళ్లాలన్న సంకల్పం కలిగి వుండాలి. ఆ తర్వాత మంచి అనువాదకుల్ని గుర్తించాలి . అట్లా చేసినా మళ్ళీ ఆ రచనల్ని ఆయా భాషీయులకు ఎట్లా చేరవేయాలన్న సమస్యా ఉత్పన్నమైతుంది. దీనికి ఒక పరిష్కారం ఏమంటే , తమిళనాడు , కేరళాల్లో వున్న ప్రచురణకర్తల్ని సంప్రదించడం. ఆలాగయితేనే అనువదించబడిన పుస్తకాలు అక్కడి పాఠకులకు చేరే అవకాశం వుంటుంది , లేకపొతే ఆ పుస్తకాలన్నీ తమ తమ యిళ్ళల్లో కట్టలు కట్టలుగా పడి ఉంటాయి . ఇంకో మార్గం వుంది. ఇతర రాష్ట్రాల్లో చాలా కాలంగా ఉద్యోగరీత్యా స్థిరపడిన తెలుగు వాళ్ళుంటారు. వారిని గుర్తించి అనువాదాలు చేయించవచ్చు. లోగడ ఉపద్రష్ట అనురాధ గారు తెలుగు కథలు ఒరియీకరించారు. ఇప్పుడు తుర్లపాటి రాజేశ్వరి ఉన్నారు . తమిళనాడులో గౌరీ కృపానందర్ ఉన్నారు . ఇట్లా ఎన్నో మార్గాలున్నాయి. మనసుంటే ముందు తెలుగు రచయితలకు తమ రచనలని అనువదింపచేసుకోవాలన్న తలంపు అవసరం, తరువాత సరైన అనువాదకుల్ని వెతికి పట్టుకోవాలి . ఆ తర్వాతే మిగతా పనులన్నీ అవుతాయి మరి.ప్ర:మన తెలుగు సాహిత్యాన్ని తెలుగేతర సాహిత్యకారులు ఇష్టపడే చదువుతున్నారా ? మన కవులు, రచయితల సృజన గురించి ఇతర బాషా సాహిత్యకారులు ఏమనుకుంటున్నారు ?

జ:చాల వరకు తెలుగేతర సాహిత్యకారులు తెలుగు రచయితలకన్నా ఎక్కువ చదువరులు – మిక్కిలి అధ్యయనపరులు -వాళ్లు అన్ని సాహిత్యాలను అక్కున చేర్చుకుంటారు , మన దిగంబర కవులు కన్నడిగులు చదివారు . కన్నడ రచయిత బెసగర హళ్లి రామన్న తను రాసిన ఒక రైతు కథలో శ్రీ శ్రీ ని పేర్కొంటాడు , మన గురజాడను చాలా మంది చదివారు . ఆ మధ్య చెన్నై తెలుగు శాఖ నిర్వహించిన ఒక సాహిత్య కార్యక్రమానికి నేను హాజరయ్యాను , తమిళన్ బన్ అనుకుంటాను … నన్నయ నుండి నేటివరకు గల తెలుగు సాహిత్యన్ని సంగ కవిత్వం నుండి ఈ నాటి వరకున్న తమిళ సాహిత్యాన్ని తులనాత్మకంగా వివేచించారు . అనువాదం వచ్చిందంటే చాలు కండ్లకు అద్దుకుంటారు . జ్ఞాన పిపాస మనకన్నా ఎక్కువ ఇతరులకు – చారిత్రక దృష్టి కూడా మనకంటే ఎక్కువ వాళ్లకు . నారాయణరెడ్డి గారు కూడా ఇతరులకు చాల తెలుసు , అట్లా శివారెడ్డి , గోపి మొదలైన వారలందరూ చాలా మందికి ఎరుక .

మన కవిత్వం చాలా గొప్పదనీ , ముఖ్యంగా ఉద్యమ కవిత్వం గొప్పగా వుందనీ ఇతరులు తెలుసుకున్నారు . ఆయా వాదాల కవిత్వమూ , కథలూ ఏమాత్రం తీసిపోనీవన్న అవగాహన ఏర్పరచుకున్నారు .ప్ర:ఎందుకు మన సాహిత్యం ఇతర బాషల్లోకి తక్కువగా అనువాదం చెందుతున్నది ?

జ:సమాధానం ఇంతకుముందరి నాల్గవ ప్రశ్నకు నేనిచ్చిన జవాబులో దాదాపుగా వుంది .

ప్ర:మీరు 14 భారతీయ భాషలు నేర్చుకోవాలనే పట్టుదల మీకు ఎట్లా వచ్చింది ? ఇప్పటికీ అన్ని భాషాసాహిత్యాలను చదువుతున్నారా ?జ: ఇదో పెద్ద కథ, నిజానికి నాది విలక్షణ మనస్తత్వం ,అందరూ నడిచే దారి కన్నా భిన్నంగా వుండాలన్న భావన నాలో స్వతః స్సిద్దంగా వుండొచ్చు, చిన్నప్పుడు”లెక్కలు” అంటే అంతా భయపడేవాళ్ళం, ఎం లెక్కలు ఎందుకు గొట్టు? అని ప్రశ్నించుకునే వాణ్ణి ! ఎస్.ఎస్.సి లో మిగిలిన సబ్జెక్టుల కన్న లెక్కల్లో ఎక్కువ మార్కులు వచ్చాయి, బి,ఇడిలో సైకాలజీ అంటే బెదిరిపోయేవాళ్ళం , నాకు అందులోనే ఎక్కువ మార్కులు, అట్లాగే ఎక్స్ టర్నల్ గా ఏం .ఏ చేస్తే పర్సెంటేజ్ ఇవ్వరు అనే వాళ్లు, నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది. కొంత భిన్నంగా ఆలోచించడం

వల్ల కావచ్చును భాషల వైపు మళ్ళడం ,అయితే అదొక్కటే కారణం కాదు

నేను సైన్సు టీచర్ గా కొలనూర్ అనే ఊరికి నియుక్తున్ని అయి వెళ్ళినప్పుడు ఆ వూళ్ళో గ్రంధాలయం లేదు కనీసం దినపత్రిక కూడా రాదు. అప్పటికి ఏం ఏ ఎక్స్టర్నల్ గా అయిపోయింది ఏం, ఫిల్ కు వెళితే నేను ఎక్స్టర్నల్ కనుక నాకు అవకాశాలు ఇవ్వలేదు ఇక పై చదువులకు వీలులేదు నాకేమో ఆరవ తరగతి నుండి పాఠ్య పుస్తకే తరమైనవి చదవడం అలవాటు ఏం చేయాలి ..30 రోజులలో అంటూ ప్రారంభించాను త్రిభాషా సూత్రం ద్వారా మనందరికి వచ్చిన మూడింటిలో మరో 11 నేర్చుకుని 14 చేర్చాను ఇక్కడ మరో మాట చెప్పాలి పట్టుదల నాకు మా నాన్న నుండి వచ్చింది .చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని పోగొట్టుకుని అక్కాచెల్లెళ్లు అన్నదమ్ములు లేని కనీసం ఇల్లు అడుగు జగ , తరిగాని కుశ్కి గాని లేని మా బాపును వాళ్ళ మేనమామ చేరదీశాడు. అటువంటి మా తండ్రి రాళ్లు మోసి బీడీలు చేసి మార్వాడి దుకాణం లో ఉండి కోపులల్ల అడవిలో ఉండి, ప్రైవేట్ టీచర్ గా చేసి చివరికి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నియమించబడి జీవితాన్ని గెలుచుకున్న నలిమెల రామచంద్రం మా తండ్రి. పోతే కొత్తపల్లి వీరభద్రరావు స్వాతంత్ర్యానికి పూర్వం మనదేశానికి కోచ్చిన పాశ్చత్యులు ఇక్కడే భాష నేర్చుకుని నిఘంటువులు వేసి వ్యాకరణాలు రాసి సేవ చేశారు కానీ స్వాతంత్ర్యానంతరం ఏ భారతీయుడు సోదర భాష నేర్చుకుని అధ్యయనం చేయకపోవడం విషాదం అని రాసిన మాటలు కూడా నన్ను వెంటాడినై ,ఫలితంగా భాషల అధ్యయనం.

ఇప్పటికే దాదాపుగా అన్ని భాషా సాహిత్యాలు చదువుతున్నాను. అయితే మునుపటిలా ముమ్మరంగా కాదు. కండ్లు సహకరించని కారణాన తగ్గించాను.

ప్ర: తెలుగులో ఇతర భాషల్లోని పత్రికల్లో సాహిత్యం స్థానం ఎంత.. ? మనవాళ్లు ఇటీవల సాహిత్య ప్రత్యేక సంచికలు వేయడం లేదు. పుటలు తగ్గిస్తున్నారు. ఎందుచేత.. ?

జ: కారణం మనమే..! మనం చదవం కాదా..! పుటలు తగ్గిస్తారు మరి..! ఇందాకే చెప్పుకున్నాం. ఇతరులతో పోలిస్తే మనకు అధ్యయన శీలం తక్కువని. అయితే తెలుగులో సోమవారం పేజీలు మన ప్రత్యేకం, ఇతర భాషల్లో ఆదివారం సంచికలు ప్రత్యేకం. అంతేగాక అక్కడ ఉగాది, విజయదశమి, దీపావళి, ప్రత్యేక సంచికలు వేస్తారు. బెంగాలీలో దసరా సంచికలు, దర్శనమిస్తాయి. తమిళంలో, కన్నడంలో ప్రత్యేక సంచికలున్నాయి, ఓనం పండుగకు మలయాంలో ప్రత్యేకంగా పత్రికలు, సంచికలు వేస్తున్నాయి. మరాఠీలొ ఉన్నాయి. తెలుగులో ఇంతకు మునుపు ఉండేవి అని చెప్పుకోవలసిన దుస్థితి. దీనికి కారణం. మరలా చెబుతున్నాను. మనమే కారణం. రచయితలే చదువరు. పుస్తకాలు కొనరు. కేరళలో రచయిత 10 వేల కాపీలు వేసుకుంటే, ఏడాదిలో చెల్లిపోతాయి. పఠన సంస్కృతి వికసించనంత కాలం పత్రికలు ఏం చేస్తాయి మరి..!

ప్ర:నూతన తరం పాఠకులకు, సృజనకారులకు మీరిచ్చే సలహా ఏంటి.. ?

జ:బాగా చదవాలి. సృజనకారులు ఒక ప్రత్యేక వ్యక్తిగత గ్రంథాలయం ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి. రాత్రికి రాత్రే పేరు రావాలన్న యావలోంచి బైటికి రావాలి. ముఖ్యంగా సృజనకారులు తమకు నచ్చిన ప్రక్రియలో కనీసం ఒక దశాబ్దం పాటు లోతైన అధ్యయం అలవర్చుకోవాలి. ఆ తరువాతే ఆ ప్రక్రియే ఆ రచయితను పట్టుకుని ముందుకు నడిపించ గలదు. చాలా సంయమనం అవసరం.అన్ని గాలుల్ని ఆహ్వానించాలి. ఒక సహృదయ దృక్పథం అవసరం. సృజనశీల రచయితలు, కొత్త వాళ్లైనా, పాత వాళ్లైనా ముందు మనిషి గా మారాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com