ఎం. ఎ. వెల్లోడి ముఖ్య మంత్రి గా తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రం గా ఏర్పడ్డ కాలమది. 1952 లో హైదరాబాద్ లో మొదటి ఎన్నికలు జరిగాయి .నవంబర్ 1,1956 లో ఆంధ్రప్రదేశ్ కలిపి సంయుక్త రాష్ట్రం గా ఏర్పడింది .ఇలాంటి రాజకీయ పరిణామాలు జరిగిన కాలం లోనే వచ్చిన సాహిత్యం ఆ కాలాన్ని ప్రతిఫలించడం అనివార్యం .అంతకంటే కొంత కాలం ముందు జరిగిన రజాకార్ల ఉదంతం లాంటి రాజకీయ పరిస్థితులు ,తరువాత హైదరాబాద్ పైన జరిగిన పోలీస్ యాక్షన్ , తరువాతి పరిస్థితులు ఈ కథలలో కనిపిస్తాయి .

1948 ప్రాంతం లో రాసిన నెల్లూరు కేశవస్వామి యుగాంతం ఈ స్థితిని ప్రతిఫలించింది. హైదరాబాద్ భారత్ యూనియన్ లో విలీనం జరిగాక ముస్లిం ల భయం ,ఉద్విగ్నత ,కథలో బలం గా చిత్రించారు .కానీ ఈ పరిస్థితి లో కూడా ఒక హిందూ యువకుడు ఒక రజాకార్ ముస్లిం యువకుని తో స్నేహం మానవత్వానికి ఒక మచ్చు తునక .

తెలంగాణ లో నిరుపేద కుటుంబాలలో అసఫ్ జాహీ ల కాలం లో నిలువరించలేని చీకట్లు ఉన్నాయి .భూస్వాముల క్రౌర్యం వల్ల ,జైలు పాలైన నిస్సహాయ జీవితాలున్నాయి .అలాంటి ఒక దైన్యాన్ని చిత్రించిన కథ వట్టికోట ఆళ్వారు స్వామి ‘’పరిగె ‘’(1952).ఒక పూట గింజలు తెద్దామని ప్రయత్నించిన మల్లయ్య భూస్వామి శిక్షకు గురై ,చివరికి చట్టం దృష్టిలో కుడా నేరస్థుడై జైలు పాలైన కథ ఇది .

మనిషి లో సహజం గా ఉన్నదానికి లేనిదానికి కూడా తన ఊహను కలిపి చిలువలు పలువలు చేసే లక్షణం ఉంటుంది .అసలువిషయం తెలిసాక తామెంత అవివేకం గా ఆలోచించామో తెలిస్తే సిగ్గు కలుగుతుంది .అట్లాంటి వైనాన్ని తెలిపే కథే (1950) మురళి రాసిన ‘’అదిగో పులి ,ఇదిగో తోక,.

విషాదాంతాలు భారతీయ సాహిత్యం లో చాలా తక్కువ . ఇది అమంగళం అనే లాక్షణిక శాసనం కూడా ఉంది . కాని కథ ఏనాడో దీన్ని అధిగమించింది . యశోదారెడ్డి (1951) లో రాసిన ‘’విచ్చిన తామరలు’’ ఇందుకు ఉదాహరణ . పేదవాళ్ళ అమ్మాయికి ధనవంతుల అబ్బాయి తో ప్రణయం .ఆ అమ్మాయి దీనివల్ల తన తండ్రి బాధ పడతాడని ఊహించి ఆత్మహత్య చేసుకోవడం ఇందులో కథనం .

మధ్య మధ్య సంభాషణల తో కథ నాటకీయం గా ఉంటుంది . కమలాకరుడు అని ప్రథమా విభక్త్యాంతం గా ఉన్న పేర్లు కొన్ని బెంగాలీ నవలలకు తెలుగు అనువాదం స్ఫురింపిస్తాయి. ‘’పదహారు సంవత్సరాల కిశోరి’’ లాంటి పదాలు శైలి కి ఒక విలక్షణత్వం తెచ్చాయి .

‘’ఎలక్షన్ హడావిడి ‘’ సి.హెచ్ .రాజేశ్వర రావు , (1952) కథ లో స్టాండై ,ఎక్సుపెక్ట్ చేయడం ,లాంటి కృత్రిమం గా ప్రయోగించిన ఆంగ్ల పదాలు కనబడతాయి .అట్లాగే క్లయింట్ లాంటి అనివార్య పద ప్రయోగాలు కూడా ఉన్నాయి .నాటి జమీందారులకు ప్రజలు బుద్ది చెప్పడం ,అదే సమయం లో జమీందారీ ఎస్టేటు లన్నీ భారత యూనియన్ లో కలిసి పోయి, వాళ్ళ సాంప్ర్దయాధికారానికి స్వస్తి వాచకం ఇందు లోని అంశం .

మధ్య తరగతి జీవితం అప్పులమయం .ఎక్సుప్లాయిటేషన్ వాళ్ళ కు నిత్యానుభవం .అటువంటి ఒక దైన్య మధ్య తరగతి ఉద్యోగి కథే పి.యస్ . ఆర్. ఆంజనేయ శాస్త్రి ఎక్సు ప్లయిటేషన్, (1953) కథ .

మధ్య తరగతి జీవితం అప్పులమయం .ఎక్సుప్లాయిటేషన్ వాళ్ళ కు నిత్యానుభవం .అటువంటి ఒక దైన్య మధ్య తరగతి ఉద్యోగి కథే పి.యస్ . ఆర్. ఆంజనేయ శాస్త్రి ఎక్సు ప్లయిటేషన్, (1953) కథ .

గూడూరి శంకరం పాపాయి కథ (1953) ఒక ఏకపాత్రాభినయం లాగా సాగుతుంది .చిరు పాపాయి లో నిర్మలత్వం ఆవిష్కరించడం ఈ కథలో ముఖ్యాంశం .

స్నేహం అపూర్వమైనది .ఏ కాలంలోనైనా స్నేహబంధానికి ఉన్న విలువ అపారం . కె.లింగరాజు ‘’తిల్లానా’’ కథ లో (1953) కళా హృదయం కలిగిన హిందూ ముస్లిం స్నేహాన్ని చిత్రించాడు .నాటి కుపిత సమాజాన్ని శాంతి హితం చేయడానికి సాహిత్యం ఒక సాధనం అని ఈ కథ మరోసారి నిరూపించింది.

కథా సంవిధానం లో చక్కని కవిత్వం జాలువారుతుంటుంది .’’కణం కణం నరం నరం ఉప్పొంగి ఉన్న ఆ ఆరాధన లో గళం కుంటుపడింది .అమరం లోని కోశాలు అవి .కన్నతల్లికి నవరత్నాల నివాళి.అయినా జీవచ్చవమైన జరాభారం కాందిశీకి లాగే ఉండిపోయింది .’’

కుటుంబజీవితం లో పురుష దౌష్ట్యం నాటి నుండి కొనసాగుతున్నదే .అట్లాంటి ఒక భర్త లేక తండ్రిని చిత్రించిన కథ జీవితగతి (1953). కుటుంబం చీకటి నేపధ్యం వల్ల మనిషి ఎంత దిగాజారుతున్నాడో ఈ కథ వల్ల తెలుస్తుంది .నాటి తెలంగాణ విస్తరించిన దుఃఖాన్ని మరో కోణం లో చిత్రించిన కథ ఇది .

పెద్దోల్ల కథ కూలీ గా పోయిన మల్లయ్య కు పటేల్ కులదర్పం బాధ పెడుతుంది .తన ఊరి పటేల్ కూడా ఆ సభకు ప్రేక్షకుడు గా వస్తాడు .కాని నల్లబట్టల మల్లయ్య ను పలకరించడు.ఒక సామాజిక అంతరం గ్రామాల్లో ఎట్లా ఉందో చెప్పేకథ సురమౌళి ‘’అంగుడు పొద్దు’’ (1954).

అస్పృశ్యతా నివారణ గురించి గొప్ప ఉపన్యాసాలు చెప్పేవారు ఈ రోజు వరకూ ఉన్నారు .అంతేకాక వేదిక మీద గొప్ప ఆదర్శాలు చెప్పి ఇంట్లో మాత్రం పరమ మూర్ఖులు గా వ్యవహరించే వాళ్లకు తక్కువేమీ లేదు . భారత దేశ లో సాధారణం గా ఒక వ్యక్తి సమాజం లో ఒక రకం గా కుటుంబం లో ఒక రకం గా ఉండే వైరుధ్యాన్ని చూస్తాం .అట్లాంటి వైరుధ్యాన్ని చిత్రించిన కథ జి.చంద్రమౌళి , ప్రజానాయకుడు పరంధామయ్య (1954).

పరంధామయ్య అనే వ్యక్తి హరికథలు ,బుర్రకథలు చివరికి ఉపన్యాసాలు చెప్పి తన జీవితాన్ని అస్పృశ్యత నివారించడానికే అంకితం చేశానని వేదికలమీద చెబుతాడు . ఇంట్లో కన్న కూతురు హరిజనులతో ఆడుకుంటే ఆమెని శిక్షిస్తాడు . ఇట్లాంటి ద్వంద్వ వ్యక్తిత్వం బలం గా చిత్రించాడు ఈ కథ లో .1954 లోనే వచ్చిన కే. సరోజని ‘’తీరని బాధ’’ లో పురుషుని పేరుతో స్త్రీ రాసిన ఉత్తరాలు చదివి ఆమెనే శంకించి చంపిన దయ లేని భర్త కథ .

నాటి హైదరాబాద్ విమోచనోద్యమ కాలం లో ఉద్యమానంతర కాలంలోనూ స్వార్థ రాజకీయాలు చేసిన వారు ధనికులు గా నాయకులు గా మారారు .కొందరుమాత్రం కేవలం సేవా భావం తో పని చేసి సర్వస్వం కోల్పోయారు .దేశ సేవకుడు (1955) కథ లో . ఇరివెంటి కృష్ణ మూర్తి ‘’రంగుల లింగయ్య ‘’ చమత్కారం గా కొనసాగుతుంది .రైలు ప్రయాణాన్ని గురించి చెబుతున్న ఓ పల్లెటూరి మనిషి భాషణం లో తన అనుభవం ఇక్కడ గమనించదగింది .మొత్తం విషయాన్ని చలన చిత్రం లాగా మన ముందు పెడతాడు రచయిత .

నేర ప్రవృత్తి మనిషిని దహించి వేస్తుంది .నిష్కల్మషమైన హృదయం కలవాళ్ళు సంతోషం గా ఉంటారు . ఈ వ్యక్తిత్వాన్ని చిత్రించిన కథ చక్రవర్తి రంగస్వామి (1956) ‘’నిజమైన మనుషులు’’ .

పరుపులు కుట్టే వ్యక్తి కి యాదృచ్చికం గా పాత పరుపులో దాచిన డబ్బు దొరికితే మొదట తానే తీసుకుందామనుకున్నా ,తరువాత ఆత్మవిమర్శ చేసుకొని ఆ డబ్బు యజమానికప్పగించడం ఇందులో సారాంశం . యజమాని కూడా ఔదార్యం తో మళ్ళీ పరుపులు కుట్టే వ్యక్తి కి ఇచేస్తాడు .ఒక సార్వజనీనక మానవతా కోణాన్ని ఆవిష్కరించిన కథ ఇది .

ఇదే కోవకు చెందిన కథ పబ్బరాజు గోపాల రావు ‘’రిక్షా వాలా’’ (1956).రిక్షా ఇరుసు విరిగి కింద పడినందుకు కోపగించుకున్న వర్తకుడు రిక్షా వాలాను దారుణం గా కొట్టడం , ఆ వ్యాపారి రిక్షాలొ ముత్యాలు మరచి పోతే రిక్షా వాలా ముత్యాలు మళ్ళీ వ్యాపారి కి తీసుకెళ్ళి ఇవ్వడం , వ్యాపారి తానుచేసిన పనికి సిగ్గుపడి రిక్షావాలా కు ఒక వేయి రూపాయలు ఇచ్చి భాగస్వామి గా చేర్చుకోవడం ఇందులోని అంశం .

ఇల్లిందుల సరస్వతీ దేవి కథ కానికాలం వస్తే కూడా నాటి హైదరాబాద్ రాజ్య పరిస్థితిని చిత్రించిందే.నవాబ్ వంశానికి చెందినా ఓ ముస్లిం కుటుంబం నటి పోలీస్ యాక్షన్ తరువాత ఎట్లా చెల్లా చెదురైందో హృదయ ద్రావకం గా వర్ణించింది రచయిత్రి .

ఈ విధం గా కథలన్నింటిలోనూ నాటి రాజకీయా సామాజిక పరిస్థితులు అన్యాపదేశం గా చిత్రించబడ్డాయి .గ్రాంథిక భాష తో మొదలైన కథ క్రమం గా పరిణామం చెందింది .

తెలంగాణ తనను తాను తడుముకుంటున్న వేళ తెలంగాణ ఆత్మవిశ్వాసాన్ని ,అస్తిత్వాన్ని ప్రకటించిన కథలు ఇవి .దీనికి కారణమైన సంకలన కర్తలు ముదిగంటి సుజాతారెడ్డి ,సంగిశెట్టి శ్రీనివాస్ . వీళ్ళ కృషి మిగుల అభినందనీయం .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com