దుబాయ్ నుండి పోశెట్టి బామ్మర్ది వచ్చిండు. రెండు రోజులు అయింది. బావ బావమరిది కర్రోల్ల వాడకట్లనే ఉండేది. తమ్ముడు వచ్చినప్పటి నుండి పగలంతా తల్లిగారింట్లనే ఉంటుంది పోశెట్టి భార్య రామక్క. వచ్చి పోయేటోళ్ల సందడి తగ్గిందని, అత్తగారి ఇంటి నుండి దావత్కు పిలుపు వచ్చింది.

ఇంట్లకు పోయేసరికి, తెచ్చిన వస్తువులన్నీ అట్టపెట్టల నుండి తీసి గడంచె మీద, నులక మంచం మీద, సర్దుతున్నరు అక్క, తమ్ముడు. అత్తా మామ పక్కన నిలవడి, “ఇదేంది! ఇదేంది?” అని అడుగుతున్నరు. పోశెట్టిని చూడంగనే, “రా… బావ రా! ఇండ్లకేల్లి ఏం కావాల్నో తీసుకో బావా… నీ ఇష్టం” అన్నడు.

బ్లాంకెట్లు, వాచీలు, టేప్ రికార్డులు, ట్రాన్సిస్టర్, ఆడియో క్యాసెట్లు, కరెంటుతో నడిచే టార్చి లైట్లు, జీన్స్ ప్యాంట్లు, టీ షర్ట్లు, అంగీలు, అత్తరు-సెంటు సీసాలు, బంగారు నగలు- డిస్కో చెయిన్లు, గాజులు. అంగడి అంతా ఇంట్లోకి వచ్చినట్టు! ఆగమాగంగా ఉంది. ఇంకా… ఇంకో బ్యాగు ఎయిర్పోర్టులో పోయిందట… ఎవడో కొట్టేసిండట… అండ్ల ఇంకెన్ని సామాన్లు ఉండెనో!

ట్రాన్సిస్టర్ చూడంగనే మనసు పారేసుకున్నడు. పాటలంటే ప్రాణం పోశెట్టికి. వేములవాడ గ్రామపంచాయతీ రేడియోలో అద్దెంకి మన్నార్, మా ఊరి సురమౌళి, వార్తలు చదువుతుంటే కళ్లముందు బొమ్మ కట్టేవి. రేడియో సిలోన్ లో అమీన్ సయాని స్వరంతో బినాకా గీత్ మాల, మీనాక్షి పొన్నుదురై మీరు కోరిన పాటలు వినుకుంట “ఎట్లన్న రేడియో కొనాలని” అనుకునేడిది. ఎప్పుడు ఏదో ఇబ్బంది. కొనలేక పోయిండు.

ఊర్లో రేడియోలు వేళ్లమీద లెక్క పెట్టేన్ని ఉండేవి. ట్రాన్సిస్టర్లు రాకముందు, డబ్బున్నోళ్ల విలాసం రేడియో. ఇంట్లోకి వెళ్ళగానే కనిపించేట్టు, అలంకరించిన టేబుళ్ళ పైన దర్పంగా దర్శనమిచ్చేది. జాలి-జాలి పొడవాటి ఏరియల్… పింఛమై మెరిసేది.

గరీబోళ్ల వినోదం గ్రామ పంచాయతీ రేడియో. లౌడ్ స్పీకర్ లో వినిపించేవారు. రేడియో స్టేషన్ లో ప్రసారాలు ముగిసే వరకు పంచాయతీ రేడియో పలకడం ఆపేది కాదు. రాజన్న గుడి నుంచి వినిపించే ప్రకటనలు, రేడియో మాటలు కలిసిపోయి యుగళ గీతం పాడేవి. ఒక్కోసారి జుగల్బందీ జరిగేది.

చిన్న రేడియోలు వచ్చాక, పెద్దవి అలంకరణ వస్తువులుగా మిగిలిపోయి.. ఏరియల్ దుమ్ము పట్టి, వర్షాకాలంలో బట్టలు ఆరేసుకునే దండెంగా రూపాంతరం చెందాయి. ఈ రేడియోలకు లైసెన్సులు ఉండేవి. పోస్ట్ ఆఫీస్ కు పోయి, డబ్బులు కట్టి రెన్యువల్ చేసుకునేది. అలా అవి, మధ్య తరగతి ఇళ్లలోకి చేరినయి. ఎప్పుడైతే గల్ఫ్ దేశాలకు వెళ్లడం మొదలైందో, ట్రాన్సిస్టర్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు బీదోళ్ల దరికి చేరినయి.

అప్పటి ఆ కోరిక ఇప్పుడు నెరవేరుతుంది!

“రేడియో కావాల్నోయ్” అన్నడు.

“సూడు సూడు మని… గదే అడిగితివి బావ! నేను దేశం పోయేటప్పుడు ఇచ్చి పోతాలే!!” అన్నడు.

‘నోరు విడిచి అడుగుతే కాదనె’ నని, ‘ఊరికే నన్న అడిగితి, అడుగక పోయినా పోయేది’ అని, పోశెట్టి ప్రాణం కలి కలి అయింది.

బావ ‘నారాజ్’ అయింది చూసి, సరే బావ తీసుకో! పరాష్కానికి అన్న. నీ కంటే ఎక్కువనా! మా అక్కనే ఇచ్చినం ఇదో లెక్కనా!” అని తీసి, చేతికి ఇచ్చి దండం పెట్టిండు. ఇంకోటి-ఇంకోటి అయితే అలిగి తీసుకోకపోయేడిది. రేడియో కదా! నవ్వుకుంట తీసుకున్నడు.

మనుషుల్లోని వికారాల్లా అనేకానేక భావాలతో కొలువైన పాటలు… విన్న సమయంలో ఉన్న మూడును బట్టి ఆనంద విషాదాల్లో విహరింపజేస్తాయి. నెత్తిపైన ఆకాశమై… చుట్టూ అలుముకున్న సమీరమై… సుమధుర పరిమళమై… రోజంతా వెంటాడుతూ వేటాడుతూ ఉంటాయ్. మరునాడు మళ్ళీ ఒకటి…పాట ఊపిరై పాడుతుంది రోజంతా.

తిన్నా పడుకున్నా పక్కనే రేడియో. పొలంకాడ చింతచెట్టుకు ఉయ్యాల ఊగేది. నడుస్తున్నప్పుడు భుజాన మోగేది. ఇంట్ల అడాప్టర్ తో, బయట బ్యాటరీతో నడిచేది. మంచె మీద పాడుతున్న రేడియో ఉన్నట్టుండి ఆగిపోయింది ఆ సారి. ‘ఏమైందో!’నని హైరానా పడ్డడు. అడుగుదామంటే బామ్మర్ది వీసా పర్మిట్ అయిపోయిందని వెల్లిపాయే! సక్కగ ఇంటికి పోయి అడాప్టర్ పెట్టి, ఆన్ చేసిండు. మోగవట్టింది. “హవ్వల్ల! బతికిచ్చిండు దేవుడు” అని బయటికే అన్నడు. బ్యాటరీలు అయిపోయుంటయని, హరి దుకాండ్లకు పోయి కొత్తవి కొనుక్కొచ్చి వేసిండు. పలుకుత లేదు. ‘ఏమాయె!’ అనుకుంట, కరెంటు పెట్టిండు. హవ్వల్దారుగా వస్తుంది. “ఎం ఖరాబు అయిందో లోపల… రేడియోలు మంచిగజేసే రాములు దగ్గరికి కొంటవో”తాని భార్యకు చెప్పి, బజారుకు బయలుదేరిండు. “మల్ల ఏ జాముకు వస్తావో? బుక్కెడంత బువ్వ తినిపోరా”దని అంటున్న భార్యను వినిపించుకోకుండా గల్మ దాటి వచ్చేసిండు. రేడియోకి ఏమయిందో తెలిస్తేగాని నిమ్మలమయ్యేట్లు లేడు మనిషి. జప్ప-జప్ప నడుసుకుంట దుకాండ్లకు వచ్చిండు.

రాములు లేడు. రాములు ఇంటిపేరు ఏందో తెలువదు. వట్టి రాములు అంటే ఎవరో ఎవరికీ తెలువదు. ‘రేడియో రాములు’ అంటే సుట్టు పక్కల ఊర్లల్ల సుత గుర్తు పడతరు. ఆయిన చెయ్యి పడిందంటే ఎంతటి మొండి రేడియో అయినా పలుకుతదని పేరు పడ్డది.

పని జేసే పిలగానికి అప్పజెప్పి ఎటో పోయినట్ట్టున్నడు. ఒకటికో! రెంటికో! మొదటిది లఘు శంక. దానికి రాధాకృష్ణ లాడ్జి వెనుక వైపు తూముకాలువలో పోవచ్చు, లావు దూరం కాదు. రెండోది దీర్ఘ శంక. చెరువుకట్ట ఎక్కాలె. పేరుకు తగ్గట్టు దూరం దండిగానే ఉంటది. మనిషి తీరునువట్టి దూర భారం!

ఇనుప ర్యాకుల్లో, రిపేరింగ్ కౌంటర్ టేబుల్ల పైనా, ఎక్కడ చూసినా చిన్నా-పెద్ద, తీరొక్క సైజుల్లో రేడియోలు, ట్రాన్సిస్టర్లు. రిపేర్ అయినవి. కావలిసినవి. అయినా తీసుకుపోనివి. అసలుకే పనికిరానివి. ఎటు చూసినా దుకాణం నిండా దుమ్ము-ధూళితో పడి ఉన్నయి, దేశ జనాభాల! కొత్తవి, అద్దాల అల్మారాల్లో అమ్మకానికి పెట్టిండు.

ఎండల పడి వచ్చిన పోశెట్టికి నెత్తిలకేల్లి చెమట కారుతుంది. ‘ఎప్పుడొస్తాడో’ అని బీరిపోయి నిలవడ్డడు. రేడియో పని నేర్చుకుంటున్న బాబకు, తనను చూసి పాపమనిపించి “లోపలికి వచ్చి, ఇట్ల ఫంక కింద గాలికి కూసో బాపు” అన్నడు.

‘చదువుకునే వయసుల పనిజేయవట్టె పిలగాడు!’ అని మనుసుల తండ్లాడుకుంట, “బడికి పోతలేవా? బిడ్డా!” అని, కూసుండుకుంట మాట కలిపిండు.

“లేదే బాపు! పోతున్న. తొమ్మిదోది అయిపోయింది. ఎండాకాలం తాతిల్లు కదా, పని నేర్చుకుంటున్న” అన్నడు.

పిలగాన్ని జూస్తే ముద్దుగనిపిస్తున్నది, “గాలి తిరుగుడ్లు లేకుండ, ఇంటికి ఇంత ఆసర అయితున్నవు” అన్నడు పోశెట్టి.

“లేదే… ఇంట్ల కష్టం ఏం లేదు!? నేనే దాచిపెట్టుకుంట. సెలవుల్ల రెండు నెలలు పొద్దుట పూట పేపర్లు వేస్తా. రాత్రి పూట బెస్త దేవన్న దగ్గర కట్టే తింపుడు నేర్చుకుంటున్న. పెండ్లి బారాత్ల్ల కట్టెసాము జేస్తే మా వస్తాదుకు పైసలు ఇస్తరు. అండ్లకేల్లి మాకిన్నిపంచుతడు. సైను బోర్డులు రాసుడు సుత వచ్చు. ఆర్టిస్టు కె. కొండయ్య దగ్గర నేర్చుకున్న. ఈ పైసలతోటి కరెంటుది ఇస్త్రీ పెట్టె కొనుకున్న. జెండా పండుగలకు ఇత్తడి చెంబుల నిప్కలు పోసి ఇస్త్రీ చేసుకునే బాధ పోయింది. ఇంకా.. చదువుకునే టేబుల్-కుర్చీ కొనుక్కున్న..” గల గలా బాబ మూలవాగై పారుతుంటే ఆనందాశ్చర్యాలతో వింటున్నడు పోశెట్టి.

బడి మొఖం తెలియకుండ, బాల్యం పొలంలనే గడిచిపోయింది పోశెట్టికి. ఇంత ఇగురంతో ఉన్న పిలగాన్ని చూసుకుంట ‘గిటువంటి కొడుకు కలగక పాయె’ నని, లోలోపల మురిసిపోతుండు. తనకు లేనిది ఇతరుల్లో చూసుకుని ఆనందించే వాళ్ళు, అసూయపడే వాళ్ళు, ఇద్దరూ మనుషులే మరి!

ఇంతట్ల రాములు వచ్చిండు.

“డబ్బ రాజయ్య దగ్గర పాన్ కట్టిచ్చుకోను పోయిన. ఏమైంది రేడియోకి” అనుకుంట పోశెట్టి చేతులకేల్లి తీసుకుని, స్క్రూ డ్రైవరుతో విప్పవట్టిండు.

మాటల్లోనే- యాట కడుపు కోసి పేగులు బయటికి తీసినట్టు, రేడియోని రెండు ముక్కలు జేసిండు. అటు ముట్టి ఇటు ముట్టి, “మంచిగ చెయ్యడానికి ఓ దినమంత పడుతది”

“అయ్యో… ఎట్లన్న ఇప్పుడు జేసి ఇయ్యరాదే!”

నవ్వుకుంట, “ఈడ జూసినవా… ఎన్ని ఉన్నయో! నీకంటే ముందుగాల రిపేరు చేయాల్సినవి, వారం పది రోజుల కింద ఇచ్చి పోయినవి. అవ్వి చేయడానికే నెలన్న పడుతది. కొత్తగ వచ్చినయి పట్టద్దనుకున్న. మనూరోడివని ఒప్పుకున్న.”

“ఎట్లనన్న సూడరాదే! అది లేకపోతే మనుసున వట్టదు. దుకాణం బందు జేసే యాల్లకన్న చెయ్యే!”

“నువ్వు అంతగనం తండ్లాడుతున్నవని చెపుతున్న, అండ్ల ఏదన్న పార్టు పోతే దొరుకుడు కష్టం. ముందే ఇంపోర్టెడ్ ది. కరీంనగరుకో హైదరాబాదుకో పోవాలే! గట్లయితే వారం దినాలయిన పడుతది. నీ అదృష్టం కొద్ది నా దగ్గర దొరికితే మాపటీలికి ఇస్త.

“మంచిదాయె! రాత్రికి వస్తగని, ఖర్చు ఎంత అయిద్దో చెప్పక పోతివి.”

“అరే! అన్న, నీదగ్గర ఎక్కువ తీసుకుంటానే నువ్వు రాపో!”

సాయంకాలం అయింది. పొద్దు గూకింది. పొట్టవిప్పి పెట్టిన పోశెట్టి ట్రాన్సిస్టరును ముట్టుకోనేలేదు! పక్కన పెట్టిన బ్యాటరీలు వెయ్యనేలేదు! వేరే రేడియోను ముందువేసుకు కూర్చున్నడు. సరిగ్గా దుకాణం బందు జేసే యాల్లకు పోశెట్టి వచ్చిండు.

“రా అన్న! రా… నీ కోసమే చూస్తున్న. ఇయ్యాల్ల జల్ది ఇంటికి పోయెడిది ఉండే. నీ పనికోసమే ఆగుడయింది” అనుకుంట, రేడియో బిగించిండు. పక్కనున్న బ్యాటరీలు తీసి వేసిండు. లెదర్ కవర్ తొడిగి, తుడిచి, ఆన్ చేసిండు. బ్యాండ్లు మారుస్తూ, స్టేషన్లు మార్చుతూ, వినిపించిండు.

పోశెట్టి సంబురపడిపోతూ  “రాములన్న! అన్న టయింకు ఇచ్చినవ్. ఎంత ఇయ్యాల్నే!” అన్నడు.

“దాందేముందే, నా దగ్గర పార్టు ఉండెపటికె జల్ది ఇచ్చిన”, పోశెట్టి చేతిల పట్టుకున్న నోట్లను చూసుకుంట, “ముప్పై పార్టు వేసినందుకు. రిపేరుకు ఇరువై. మొత్తం యాభై రూపాయలు అయితది గని, నీ దగ్గర రిపేరింగ్ చార్జీలు తీసుకుంటానే!” అన్నడు.

“గింతయితదా! గంతయితదా!” అని అనకుండా, చేతుల నోట్లు పెట్టి, చేయి కలిపి, నవ్వుకుంట నమస్తే చెప్పి, పసిపోరడిలా రేడియోని చంకన పెట్టుకుని, వెళ్లిపోయిండు.

ఆ రోజు వచ్చిన ఆదాయాన్ని క్యాష్ కౌంటర్ లోంచి తీసి లెక్కపెడుతుంటే, “ఇదేమి రాజ్యం! ఇదేమి రాజ్యం! దోపిడి రాజ్యం! దొంగల రాజ్యం!” అంటూ నినాదమై పగులుతూ, వరద నదిలా ప్రవహిస్తూ, జనం. ముందు అన్నలు కూర రాజన్న, చలపతిరావు, లలితక్క. పక్కన కూర దేవన్న.

“షటర్ గుంజుర పిలగా! జల్ది గుంజు” అంటూ రూపాయలు జేబుల కుక్కుకొని బయటకు వచ్చి, సగం మూడుపాళ్లు కిందికి దించి, బాబ పక్కకు వచ్చి నిలవడ్డడు రాములు సేటు. జులూసు పూర్తిగ కదిలిపోయి… గుడి ముందర పాటలు పాడుతున్నరు. గాలి భుజానికి ఎత్తుకుంది. ఒక చైతన్య పూరిత వాతావరణం నెలకొంది.

ఉన్నట్టుండి .., “గా.. పోశెట్టి ట్రాన్సిస్టర్ ల రిపేర్ ఏం వచ్చింది సేటు?” అనుమానంతో ప్రశ్నించిండు బాబ.

“ఏం లేదురా! ఆ పిసోడికి ప్లస్-మైనెస్ లు తెలువక, బ్యాటరీలు కరెక్టుగా వేసుడు చేతకాలే!”.

“ఏం లేదురా! ఆ పిసోడికి ప్లస్-మైనెస్ లు తెలువక, బ్యాటరీలు కరెక్టుగా వేసుడు చేతకాలే!”..

“అట్లయితే రిపేరు చేసినాని, పైసలు ఎందుకు తీసుకున్నవ్?”

“పుక్కటుకు చేస్తే మన కడుపు ఎట్ల నిండాలె!?”.

“దానికి అమాయకుల్ని మోసం చేయాలా?”

“అది మోసం కాదు, బతుక నేర్చుడు. రిపేరింగ్ తో పాటు బతుకు పాఠాలు నేర్పుత, ముందు షెటర్ ఎత్తుదాం, ఆసర పట్టరా!” అన్నడు సేటు. గుంజే టప్పుడు అల్కగనే పడుతది ఎత్తేటప్పుడు  ఒక్కని తోటి లేపుడు కాదు.

“నేను లేప!” అన్నడు బాబ.

“అగొ… ఏమయిందిరా! మజాకులు చేస్తున్నావ్?”

“రేపటి నుంచి పని బందు వెడుతున్న. ఇగ రాను” అన్నడు.

ఇప్పటికిప్పుడు కొత్తోన్ని ఎంకులాడాలంటే ఏడయితదిని, గావురాలు పోతూ “ఏమైంది బేటా!?” అన్నడు.

“నీతానా మోసాలు నేర్వడానికి రాలే! దాని కంటే గుడి ముందర బిచ్చమ్ ఎత్తుకోవడం నయం! నీ సంగతి పోశెట్టికి చెప్పుతా!”

“ఏంరో! ఎక్కతక్క  మాట్ల్లాడుతున్నావ్? ఒక్కటి పీకితే… అవ్వ దగ్గర చిన్నప్పుడు తాగిన పాలు కక్కాలె… ఏమనుకున్నవో!”

“అట్లనా! నువ్ చెయ్యెత్తి చూడు. పోయి కూర దేవన్నకు చెపుతా. అన్నది మా స్కూలే! సీనియర్. ఏమనుకున్నవో..” అనుకుంట దుకాణం ముందరి తంతెలు దిగుతున్నోని, “సినిమాకు పైసల్ ఇస్తరా”ని, బుదరికిచ్చ పోయిండు.

“నాకేమద్దు ఫో!” అనుకుంట, ‘తెడ్డు’ సంజ్ఞ చూపించి, గుడి దిక్కు నడిచిండు బాబ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com