ఆడెపు లక్ష్మీపతి

“….భావాలు మాత్రమే పరమ వాస్తవాలు(ultimate reality). వస్తువులు భౌతిక రూపం ధరించక మునుపే భావాల రూపం లో మనసులో వుంటాయి. కాబట్టి భావం మౌలికం (original), వస్తువు భావానికి ప్రతి (copy)మాత్రమే. ఒక వడ్రంగి తయారు చేసిన కుర్చీ అతని మనసు లోని ‘కుర్చీ’ అనే భావన ఫలితమే. అలా, ఆ కుర్చీ వాస్తవికత నుండి దూరమై పోయింది. ఒక చిత్రకారుడు గీసిన కుర్చీ బొమ్మ వడ్రంగి చేసిన కుర్చీకి అనుకరణ అయినందున అది వాస్తవికత నుండి ఇంకా దూరమై పోయింది. కవులు /సాహిత్యకారులు ప్రకృతిని కేవలం అనుకరిస్తారు, లేదా చుట్టూ వున్న ప్రపంచాన్ని ప్రతిబింబిస్తారు. అంటే మనిషిని వాస్తవికత నుండి దూరం తీసుకు పోతారు, వాళ్ళు భ్రమల్లో వుంటారు. కాబట్టి నా ఆదర్శ రాజ్యం (The Republic) లో వాళ్లకు స్థానం లేదు …” అని అభిప్రాయ పడిన ప్రాచీన గ్రీకు రాజనీతి తత్వవేత్త ప్లేటో – ప్రకృతి/ ప్రపంచం/ పర్యావరణం కాల్పనిక సాహిత్యాన్ని అనుకరించే స్థితికి వచ్చేంత వాస్తవిక స్పృహతో, మున్ముందు- రెండు వేల నాలుగు వందల సంవత్సరాల అనంతరం-సాహిత్య సృజన జరుగుతుందని ఊహించి వుంటే సాహిత్యకారులకు తన Republic లో నిజంగా అగ్రస్థానం ఇచ్చేవాడు! నేటి ‘సైన్స్ ఫిక్షన్’ రచయితలు తప్పక ఆ గౌరవానికి నోచుకుని ఉండేవారని మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు!

రొమాంటిసిజం, రియలిజం, సోషలిస్ట్ రియలిజం, మ్యాజికల్ రియలిజం…మొదలైన వాటిలాగే స్పెక్యులేటివ్ లేదా కాన్సెప్చువల్ ఫిక్షన్ ఆధునిక సాహితీ రీతుల్లో ప్రధానమైనది. స్పెక్యులేటివ్ ఫిక్షన్ వర్గానికి చెందినదే సైన్స్ ఫిక్షన్. సైన్స్, ఫిక్షన్ పరస్పర విరుద్ధమైనవి. ప్రయోగ పూర్వకంగా నిరూపితమైన శాస్త్ర విజ్ఞాన సూత్రాల సమాహారం సైన్స్ అనీ, వాస్తవం కాని ఊహాజనితాలు లేదా కల్పనల సమ్మేళనం ఫిక్షన్ అనీ మనకు తెలుసు. కథ, నవల, నాటకం…తదితర సాహితీ ప్రక్రియలను ఆంగ్లం లో ‘ఫిక్షన్’ అంటారు. సైన్స్ ఫిక్షన్ అంటే సైన్స్ మేళవించిన కల్పనా సాహిత్యం అని అర్థం చేసుకోవాలి.

నిజానికి సైన్స్ ఫిక్షన్ ఆసక్తికరమైన సాహితీ ప్రక్రియ. కాని ఈ genre తెలుగు పాఠకులకు బాగా పరిచయమైనది కాదు, ఆస్వాదనీయమైనదీ కాదు అని కొందరి అభిప్రాయం . యూరోపియన్, అమెరికన్, చైనీస్, కొరియన్ సాహిత్యాల్లో సైన్స్ ఫిక్షన్ కి మంచి ఆదరణ వుంది. Astounding Sci-fi Stories, Amazing Stories, Fantasy & Science Fiction, Asimov’s Science Fiction Magazine, Future, Space Stories, Uncanny, Lightspeed Magazine, Electric Literature, Contrary, Beyond, The Futuristic …మొదలైన ఓ 20-30 ఇంగ్లీష్ మాగజైన్ లు సైన్స్ ఫిక్షన్ ని ప్రచురిస్తాయి. గత రెండు దశాబ్దాల నుంచి మన రచయితలు ఈ ప్రక్రియ పట్ల మొగ్గు చూపిస్తున్నందున తెలుగులో కొన్ని కథలు వచ్చాయి. అయితే ఒకరిద్దరు రాసినవి తప్ప చాలా కథలు వస్తు శిల్పాల కోణంలో ఇంగ్లీష్ కథల తో పోల్చదగ్గవిగా కనపడవు. అక్కడ మేరీ షెల్లీ, జూల్స్ వెర్న్, హెచ్.జి. వెల్స్, అలన్ పో …మొదలుకుని మార్గరెట్ అట్వుడ్, సి.ఎస్. లూయిస్, జో హాల్డ్ మన్, ఫిలిప్ కే. డిక్, రే బ్రాడ్ బరి, ఆర్థర్ సి. క్లార్క్, ఆక్టేవియో బట్లర్ …తదితరులు చక్కని సైన్స్ ఫిక్షన్ సృష్టించారు. కొత్త తరం వాళ్ళు పూర్తిగా నిబద్ధులై రాస్తున్నారు. తెలుగులో సైన్స్ ఫిక్షన్ పరిణతి సాధించాలంటే ఇంకాస్తా అధ్యయనం అవసరమని నా అభిప్రాయం.

* ఇంతకీ సైన్స్ ఫిక్షన్ అంటే నిజంగా ఏమిటి ?

గత, వర్తమాన కాలాల వాస్తవ ప్రపంచాన్నిగురించిన తగిన పరిజ్ఞానం గట్టి పునాదిగా, శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాల స్వభావ, పురోగమనాలపై సంపూర్ణ అవగాహనతో, సంభవనీయమైన భవిష్యత్ ప్రపంచాన్ని ఊహించే సాహిత్య శాఖ సైన్స్ ఫిక్షన్. బాగా అభివృద్ధి చెందిన శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం, సుదూరాల్లోకి అంతరిక్ష యానం, కాలం లో ముందు వెనుకలకు ప్రయాణం, సమాంతర విశ్వాలు, గ్రహాంతర జీవులు …తదితర భవిష్యత్ కాలపు భావనలు సైన్స్ ఫిక్షన్ ముడిసరుకు. The Time Machine, A Spce Odyssy, Minority Report, Jurassic Park, Annihilation, Do Androids dream of Sheep? Slaughter House-Five, Time line, The Martian…వంటి నవలలు సాహితీ లోకాన్ని అబ్బుర పరిచాయి. ఇవి సినిమాల్లో అద్భుతమైన ఇతివృత్తాలకు, సినిమాటిక్ టెక్నిక్ పరంగా కొత్త ప్రయోగాలకు ప్రేరణనిస్తూన్నాయి. ఇందుకు చక్కని ఉదాహరణ- క్రిస్టఫర్ నోలన్ తీసిన ‘Interstellar’. ఇదో ఫ్యూచరిస్టిక్ సినిమా. 2067 సంవత్సరం లో పంట తెగుళ్ళు, ధూళి తుఫానుల మూలంగా భూమ్మీద ఆహార కొరత ఏర్పడి మనిషి జీవితం దుర్భరమవడంతో నాసా రహస్యంగా కొత్త గ్రహాల అన్వేషణకు ఒక మిషన్ ప్రారంభిస్తుంది. గార్గంటువా అనే కృష్ణ బిలం ఆవల వేరే గెలాక్సీ లోని 12 గ్రహాల్లో 3 మానవ నివాస యోగ్యమైనవిగా తేలడం తో గ్రావిటేషనల్ ప్రొపల్షన్ థియరీ అమలు ద్వారా పెద్ద సంఖ్యలో మనుషుల్ని అక్కడికి చేరవేయాలనీ , లేదా ఫ్రీజ్ చేసిన 5000 మానవ పిండాలను ఎండ్యూరమ అనే స్పేస్ క్రాఫ్ట్ లో అక్కడికి పంపించి ఒక కాలని ఏర్పాటు చేయాలని రెండు ప్లాన్ లు సిద్ధమవుతాయి. మిల్లర్, ఎడ్మండ్స్, మాన్ అనే ఆ మూడు గ్రహాలకు వ్యోమగాములు బృందాలుగా వెళతారు. టైం డైలేషన్ కారణంగా మిల్లర్ పై ఒక గంట కాలం భూమ్మీది ఏడు సంవత్సరాలతో సమానం. ఎండ్యూరమ లోని సైంటిస్టులు ముందు వెళ్ళిన పరిశోధకులను కలిసేందుకు కృష్ణబిలం గురుత్వాకర్షణ శక్తిని దాటడానికి 23 సంవత్సరాల 4 నెలల కాలం పడుతుంది. పలు కారణాల వలన అనుకున్న పని పాక్షికంగానే పూర్తవడం తో పరిశోధకుల్లో కొందరు అక్కడే చిక్కుబడి పోగా ముగ్గురు మాత్రమె భూమ్మీదికి తిరిగి వస్తారు. భూమ్మీది కాలం ప్రకారం 130 ఏళ్ళు ఉండాల్సిన కథానాయకునికి ఏమంత వయసు పెరగదు; అతడు ఆసుపత్రిలో బెడ్ మీదున్న తన కూతురును కలుసుకుంటాడు; తను అంతరిక్ష యాత్రకు బయలు దేరేటప్పుడు ఆమెకు 13 ఏళ్ళు, ఇప్పుడు 80 ఏళ్ల వృద్ధురాలు. ఇందులో cryostasis-reversible preservation technology(మనుషులను దీర్ఘకాలం పాటు నిద్ర పుచ్చే ప్రక్రియ), tesseract(5 డైమెన్షనల్ జామెట్రీ క్యూబ్ –మన కంటే తెలివైన భావి మానవులు సృష్టించినది, దీని ద్వారా విభిన్న టైం పీరియడ్ ల్లోంచి వీక్షించ వచ్చు), event horizon(ఆస్ట్రోఫిజిక్స్ లో ఈ హద్దుకు ఆవల వున్నపరిశీలకుడిని ఏ ఘటనా ప్రభావితం చేయజాలదు), space habital(స్పేస్ స్టేషన్ లో శాశ్వత స్థావరం), slingshot(ఇతర గ్రహాల గురుత్వాకర్షణ శక్తికి గురికాని రీతిలో స్పేస్ క్రాఫ్ట్ ను అతి వేగంగా పంపించే మాన్యోవర్)…తదితర సైంటిఫిక్ పదజాలం ఈ సినిమాలో వింటాం , ఇవన్నీ ఐన్ స్టీన్ సిద్ధాంతాలలో ప్రస్తావించినవే. ఈ సినిమా చూస్తుంటే ఏ.ఇ. వాన్ వోగ్త్ కథ ‘ఫార్ సెంటారస్’ గుర్తుకు వస్తుంది.

సైన్స్ ఫిక్షన్ ఒక రకంగా మనల్ని ఊహల్లో తేలియాడిస్తుంది, మరో లోకాల్లోకి తీసుకు వెళుతుంది.ఇది ఆమోదనీయమైన ‘పలాయన వాదమే’ నంటాడు ఆర్థర్ సి.క్లార్క్. “ There is no real objection to escapism, in the right places ..We all want to escape occassionally. But sci-fi is often far from escapism, in fact you might say that sci-fi is escape into reality. It is a fiction which does concern itself with real issues; the origin of man ; our future. In fact I can’t think of any form of literature which is more concerned with real issues and reality.”

సై-ఫి మనల్ని ‘ఒక వేళ అలా జరిగితే’ అని ఆశ్చర్య పోయేలా , ‘అలా ఎందుకు జరిగింది’ అని అడిగేలా చేస్తుంది; సుదూర భవిష్యత్తు లోకి చూసి, చివరికి మనం చేరుకునేది అక్కడికేనా అని ప్రశ్నిస్తుంది. ‘The Day after Tomorrow’, ‘The Road’ సినిమాలలోలాగా,‘Brave New World’,‘The Wind-up Girl’ నవలలలో లాగా డైస్టోపియన్, అపోకాలిప్టిక్ భవిష్యత్ పటం చూపి హెచ్చరిస్తుంది. Contact, District-9, StarTrek లలో లాగా గ్రహాంతర జీవ జాతులతో ఎలా మెలగాలో చెబుతుంది; తద్వారా జెండర్, వర్ణ వివక్షల పట్ల మనలో అంతరావలోకన ప్రేరేపిస్తుంది. సై-ఫి శక్తి మంతమైన ప్రదేశాలను, సమానత్వం విరాజిల్లే సమాజాలను స్వప్నిస్తుంది(జేమ్స్ బ్లిష్ కథ ‘ఏ కేస్ అఫ్ కన్సైన్స్’ లో లాగా), కొత్త శాస్త్ర సాంకేతిక విజ్ఞానానికి ఊహలు, ఆలోచనలు రేకెత్తిస్తుంది. 60 ఏళ్ల కిందట వచ్చిన ‘స్టార్ ట్రెక్’ లో అరచేతిలో ఇమిడే ఫోన్ లు, కంప్యూటర్ లు, ట్రై కార్డర్స్ చూపించారు. అవన్నీ నేడు నిజమైనాయి. నీల్ స్టీఫెన్సన్ 1992 నవల ‘స్నో క్రాష్’ తమకు ఎంతో ప్రేరణ నిచ్చిందని గూగుల్ ఎర్త్ డెవలపర్స్ చెప్పారు.

కొందరు సైన్స్ ఫిక్షన్ ని, ఫాంటసి ని ఒకే గాటన కట్టేస్తారు. కానీ ఈ రెండు వేర్వేరు. రేపో లేదా సమీప భవిష్యత్తులో సాధ్యపడగల ఘటనలు, మనం చూడగల సన్నివేశాల్ని సైన్స్ ఫిక్షన్ చిత్రిస్తుంది; ఎన్నడూ సాధ్యపడని, ఎన్నడూ జరగబోవని ఘటనలు , వాస్తవంగా ఎక్కడా ఉనికిలో లేని లోకాలు ఫాంటసి లో వుంటాయి. అంత మాత్రాన ఫాంటసి ని కొట్టి పారేయడానికి వీల్లేదు. ఒక కోణం లో ఫాంటసి అంటే ఊహల స్వైర విహారం. ఒక్కొక్క సారి ఈ తరహా స్వైర కల్పనలే గొప్ప సిద్ధాంతాలకు, సైంటిఫిక్ ఆవిష్కరణలకు ప్రేరణగా పని చేస్తాయి. అందుకే ఆల్బర్ట్ ఐన్ స్టీన్ అన్నాడు :”When I examine myself and my methods of thought, I come to the conclusion that the gift of fantasy has meant more to me than any talent for abstract, positive thinking .” భారతీయ పురాణాలలోని ఆగ్నేయాస్త్ర, బ్రహ్మాస్త్ర, వారుణాస్త్ర ప్రయోగాలు , పుష్పక విమానం, మనుషులకు జంతువుల తలలు అమర్చడం, పాతాళం లోకి ప్రయాణాలు … ఆయా రచయితల ఊహలని మనకు తెలుసు. ఆ అస్త్రాలు నేడు ఖండాంతర క్షిపణు లుగా నిజమైనాయి. జూల్స్ వెర్న్ ’20 Thousand leagues under the Sea’ నవలలో వందేళ్ళు ముందుగా జలాంతర్గామి ని ఊహించాడు. పక్షిలా ఎగరాలన్న మనిషి చిరకాల కోరికను సాకారం చేసేలా రైట్స్ సోదరుల ప్రయోగం చేశారు, మొదట్లో అది విఫలమైనా ఆ పాఠాల ద్వారా విమానానికి రూపకల్పన చేయడం జరిగింది . అవయవాల మార్పిడి, శస్త్ర చికిత్స నేడు వైద్య విజ్ఞానం లో సర్వసాధారణ అంశాలు. ఏమిటి, ఎందుకు, ఎలా… అనే ప్రశ్నలు, ఊహల నుంచే కొత్తది ఆవిష్కరించాలన్న జిజ్ఞాస పుడుతుంది. మరో కోణం లోంచి కూడా ఫాంటసి ప్రయోజనాన్ని చూడవచ్చు: ‘Gulliver’s Travels’ లో సమకాలీన ఆంగ్లేయుల జీవన విధానాన్ని, మనుషుల సంకుచిత మనస్తత్వాన్ని విమర్శించేందుకు, ‘Harry Potter సిరీస్’ లో, ‘The Lord of the Rings’(Tolkien)లో, ‘Alice in Wonderland’ లో ఒక వర్గం పాఠకులకు వినోదం కలిగించేందుకు, వారి ఊహా పరిధిని విస్తారం చేసేందుకు ఫాంటసి ప్రవేశపెట్టినట్టుగా మనకర్థమవుతుంది. కొన్ని ఆంటీ –రియలిస్ట్ (కాఫ్కా , బోర్హేస్ ), సర్రియలిస్ట్ (కోర్తజార్), మాజికల్ రియలిస్ట్(మార్క్వెజ్, టోనిమారిసన్, ఇసాబెల్ అలెండీ ) రచనల్లో ఒక ప్రత్యెక ప్రయోజనార్థం- మనం ‘యదార్థం’ అని భావించే ప్రపంచం భ్రమాజనిత స్వభావాన్ని, వాస్తవికత యొక్క సంక్లిష్ట స్వరూపాన్ని, బహు పార్శ్వాల్ని మెటాఫిజికల్, ఆంటాలజికల్ కోణం లోంచి ఆవిష్కరించేందుకు- ఫాంటసీ ఉపయోగించడం జరిగింది. కొన్ని సందర్భాల్లో, ప్రత్యేకించి బాల సాహిత్యం లో, చదువరుల్లో ఆసక్తి రేకెత్తించడానికి ఫాంటసి జొప్పించడం అవసరమవుతుంది. ఉదాహరణకి జేన్ యోలెన్ రాసిన ‘Emperor’s kite and the 7th Mandarin’ అనే కథ. చక్రవర్తి ఆత్మ ప్రతిరాత్రి ఒక డ్రాగన్ కైట్ రెక్కలపై విహరించి వస్తుందని దర్బారులో అందరి నమ్మకం. యువకుడైన 7 వ మాండరిన్ కైట్ కి రక్షకుడిగా విధి నిర్వహిస్తూంటాడు. పెను తుఫాను చెలరేగిన ఒక రాత్రి అది ఎక్కడికో ఎగిరి పోగా దాన్ని వెతుకుతూ మాండరిన్ కోట దాటి వెళతాడు. ప్యాలెస్ లో చక్రవర్తి పీడకలలు కంటాడు, అపరిచితుల ఆక్రందనలు, కేకలు వింటాడు. ఎట్టకేలకు కొన్ని రోజుల తర్వాత మాండరిన్ కైట్ ని తిరిగి పట్టుకొచ్చి విషణ్న వదనంతో చక్రవర్తికి కొన్ని విషయాలు తెలియజేస్తాడు. మత గ్రంథాల్లో, ప్రాచీన పత్రాల్లో లేని కొత్త సంగతులు చెప్పి చక్రవర్తిని వ్యాకుల పరచినందుకు, కైట్ రూపం చిన్నాభిన్నమై పోయేలా అజాగ్రత్తగా వున్నందుకు మాండరిన్ ని శిక్షించాలని దర్బార్ లోని వారంటారు. కోట బయటి వాస్తవ జీవితం, ప్రజల బాధలు, వారి దీన, హీన పరిస్థితులు తనకు కలలో కనిపించాయనీ, మాండరిన్ నివేదించిన దాంట్లో అసత్యాలేవీ లేవనీ, ఒకరకంగా తనకు కనువిప్పు కలిగిందనీ చెప్పి చక్రవర్తి మాండరిన్ ని క్షమిస్తాడు. పిల్లలను అమితంగా ఆకట్టుకునే ‘సిండరెల్లా’ కథలో, ‘అల్లావుద్దేన్- అద్భుత దీపం’ కథలో, మన పంచతంత్ర , బేతాళ కథల్లో ఇలాంటి అద్భుత చిత్రణ లు వున్నాయి .

గత రెండు దశాబ్దాల నుంచి సైన్స్ ఫిక్షన్ లో మరో ఉప శాఖ ఎదగడం గమనిస్తూన్నాం; దీన్ని క్లైమేట్ ఫిక్షన్ (cli-fi) లేదా ఎకో- ఫిక్షన్(eco-fiction) అని పిలుస్తున్నారు. శాస్త్ర, సాంకేతికతల అప్రతిహత పురోగమనం, విచక్షణ లేని ప్రకృతి వనరుల దోపిడీ, అడవుల నరికివేత, అవధుల్లేని పారిశ్రామికీకరణ, పర్యావరణ విధ్వంసం, అంతటా పెరిగిపోతున్న కాలుష్యం, భూమి వాతావరణంలో, శీతోష్ణ స్థితుల్లో చోటు చేసుకుంటున్న పెనుమార్పులు…తదితర కారణాల వల్ల మున్ముందు సంభవించబోయే ప్రకృతి విపత్తులు, తీవ్ర ఉత్పాతాలను దృశ్యమానం చేయడం ; ప్రకృతి పై జరుగుతున్న విధ్వంసాన్ని అడ్డుకునేందుకు వ్యక్తులు, సంస్థలు చేపట్టే పోరాటాలు, వివిధ జీవజాతుల మనుగడను దెబ్బతీసే, వాటి ప్రవర్తనాసరళిపై దుష్ప్రభావం కలగజేసే పర్యావరణ కారణాలను అన్వేషించే పరిశోధనలను, పర్యావరణ పరిరక్షణలో సాంప్రదాయిక విజ్ఞానం పాత్రని, ఇతర దిద్దుబాటు చర్యలను చిత్రించడం … క్లైమేట్ ఫిక్షన్ ఇతివృత్తాలు.(‘The Day After Tomorrow’ హాలివుడ్ సినిమా సైన్స్ ఫిక్షన్ కోవకి చెందినదైనా ఇది నిజమైన cli-fi చిత్రం. భూతాపం పెరుగుతున్నందున అంటార్క్ టికా హిమ ఖండాలు కరిగి, సముద్ర మట్టాలు హెచ్చి,మంచు తుఫానులు, వరదలు అమెరికా ని అతలాకుతలం చేయడం దీని ఇతివృత్తం). 2017 పులిట్జర్ బహుమతి పొందిన ‘The Overstory’, 2016 ది హిందూ లిటరరీ ప్రైజ్ అందుకున్న ఈశాన్య భారత్ నవల ’When the River Sleeps’ ఈ కోవకు చెందుతాయి. ఇంకా Flight Behavior, The Drowned Cities, South Pole Station, Solar, A friend of the Earth… మొదలైన పుస్తకాల్ని ఈ పరంపరలో పేర్కొనవచ్చు.

ఇప్పుడు చెకోస్లోవేకియా కి చెందిన కథా, నవలా రచయిత, నాటకకర్త కారెల్ కాపెక్ రాసిన సై-ఫి నాటకం ‘రోసమ్స్ యూనివర్సల్ రోబోట్స్’(Rossum’s Universal Robots)ని పరిశీలిద్దాం. సైన్స్ ఫిక్షన్ పై ఒక అవగాహన కలుగుతుంది . 1890 లో బోహీమియా (అప్పట్లో ఆస్ట్రో-హంగరీ లో భాగం)లో జన్మించి ప్రేగ్, పారిస్, బెర్లిన్ నగరాల్లో చదువుకుని, 1917లో ప్రేగ్ యూనివర్సిటీ నుండి పట్టభద్రుడై, 1938 లో మరణించిన కారెల్ కాపెక్ తన 48 ఏళ్ల జీవిత కాలం లో అనేక నాటకాలు , నవలలు, కథలు, వ్యాసాలు రాశాడు. అవన్నీ ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి. అతడు మొట్ట మొదట 1920 లో తన నాటకం ‘రోసమ్స్ యూనివర్సల్ రోబోట్స్’ (దీనిని ప్రామాణికమైన సైన్స్ ఫిక్షన్ రచన గా సాహితీ వేత్తలు, కళా రంగ విమర్శకులు ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు)లో ప్రయోగించిన ‘రోబోట్’ అన్న పదం (చెక్ భాషలో ‘forced labour’ అని దీని అర్థం; రోబోట్ ని తెలుగు లో ‘మర మనిషి’ అని పిలుస్తున్నాం) విరివిగా వాడుకలోకొచ్చి శాస్త్ర సాంకేతిక రంగం లో చిరస్థాయిగా నిలిచి పోయింది.

చెకోస్లోవేకియా రచయితల గురించి ఒక మాట చెప్పాలి. రెండు ప్రపంచ యుద్ధాల కల్లోల భరిత కాలాల్లో ఆస్ట్రో, హంగరీ, చెక్, స్లోవాక్, రష్యన్, జర్మన్ రాజకీయ భాషా సంస్క్ర్తుతులచే ప్రభావితమైన అస్థిర పాలనా వ్యవస్థల కింద మ్రగ్గిన జీవిత నేపథ్యం లోంచి వచ్చిన వారైనందున వీరు మంచి ప్రయోగశీల సాహిత్యం సృష్టించారు. చెకోస్లోవేకియా రెండు దేశాలుగా విడిపోక ముందు ఆ దేశానికి ఆఖరు అధ్యక్షునిగా వుండిన వక్లావ్ హావెల్ ప్రభుత్వ విధానాలను –ముఖ్యంగా కమ్యూనిస్ట్ పాలనా వ్యవస్థను –విమర్శిస్తూ The Garden Party, The Memorandum అనే రెండు హాస్య, వ్యంగ్య నాటకాలు రాశాడు. మరో విశిష్ట రచయిత మిలన్ కుందేరా. వ్యక్తి సుఖ లాలస, సెక్స్, రాజకీయ అసమ్మతి, పరిస్థితులతో రాజీ, దేశాంతర వాసం, లక్ష్యాల, సిద్ధాంతాల అస్థిరత –జీవితానికి అర్థం కనుక్కునే అన్వేషణలో మనిషి పొందే అనుభవ సంచయాన్నికొండొకచో అశ్లీలత మేళవించిన పోస్ట్ మోడర్నిస్ట్ శైలిలో తాత్విక విషణ్నత కోణం లోంచి The Festival of Insignificance, The Unbearable Lightness of Being నవలల్లో చిత్రించాడు. కారెల్ కాపెక్ అన్ని రచనల్లోకేల్లా The Insects గాఢమైన తాత్వికత వున్నఅలేగోరిక్ నాటకమని విమర్శకులంటారు. మూడు అంకాల ఈ నాటకం లో సీతాకోక చిలుకలు, కీచురాళ్ళు, చీమలను పాత్రలుగా పెట్టడం జరిగింది . కుటుంబ వ్యవస్థ కేంద్రంగా అత్యాశ, దౌర్జన్యం, అహం, వ్యామోహం, స్వార్థం… వంటి జంతు లక్షణాల్ని పరోక్షంగా మనుషులకు ఆపాదిస్తూ నాటకం లోని మొత్తం యాక్షన్ ని ఒక ద్రిమ్మరి పరిశీలనా కోణం లోంచి చూపి, సృష్టిలో ప్రాణుల నిర్దిష్ట కర్తవ్యాలను, జీవితం లోని క్రూరత్వాన్ని, మనుగడకై పెనుగులాటను- స్థూలంగా natural order of things స్ఫురింపజేస్తాడు కాపెక్.

‘Rossum’s Universal Robots’ మూడు అంకాలు(నిజానికి మొదటి అంకం ప్రొలోగ్), ఒక ఎపిలోగ్ వున్న నాటకం. కథా స్థలం పేరు తెలియని ఒక ద్వీపం. కాలం ఎప్పటిదైనా కావచ్చు. ‘రోసమ్స్ యునివర్సల్ రోబోట్స్ (RUR)’ కంపెని జెనరల్ మేనేజర్ డోమిన్ దేశవిదేశాల నుండి పలు సంస్థలు ఆర్డర్ చేసిన సంఖ్యలో రోబో లను తయారు చేసి పంపిస్తుంటాడు. అవి అచ్చం మనుషుల్లాగే వుండి, మంచి తెలివి తేటలతో , కచ్చితత్వం తో పని చేయగలవు. అయితే వాటికి ఆత్మ, మంచిచెడు విచక్షణ, సహజ భావోద్వేగాలు వుండవు. ఆదేశించిన పని చేయడమే వాటి విధి. వాటి జీవిత కాలం 20 ఏళ్ళు. ఫ్యాక్టరీ చూడటానికి వచ్చిన దేశాధ్యక్షుని కూతురు హెలెనా అక్కడ పనిచేస్తున్న టైపిస్ట్ సులా అనే అమ్మాయి కృత్రిమ మనిషి అంటే నమ్మలేకపోతుంది. రోబో లను తయారు చేసే విధానంలోని వివిధ ప్రక్రియలు, దశలు, వాటి బ్రేక్ డౌన్, డిసెక్షన్, డిస్పోజల్ …వగైరా విషయాలను డోమిన్ ఆమెకు వివరిస్తాడు, చూపిస్తాడు. రోబోట్లను ఇబ్బడిముబ్బడిగా ఉత్పత్తి చేయడం ద్వారా ప్రపంచం లో ఆహారోత్పత్తిని పెంచి తిండికి కరువు లేకుండా, మనుషులకు శ్రమ అనేదే లేకుండా, యుద్ధాల్లో సైనికులుగా మనుషుల అవసరం లేకుండా చేయాలన్నది తన ఆదర్శమని చెబుతాడు. మనుషుల్ని కృత్రిమంగా తయారు చేసే ఫార్ములా కనిపెట్టిన గొప్ప ఫిజిషియన్ వృద్ధ రోసం తనకు తాను దేవుడిని మించిన వాడిగా భావించుకునే వాడనీ, కానీ ఇంజినీర్ అయిన యువ రోసం తండ్రిని పక్కకు నెట్టి తన వ్యాపారాత్మక తెలివినుపయోగించి ఆత్మ, భావోద్వేగాల్లేని మనుషుల్ని-రోబోట్లని –ఉత్పత్తి చేయనారంభించాడనీ, ఇప్పుడా సెక్రెట్ ఫార్ములా తన వద్ద ఉందనీ డోమిన్ వివరిస్తాడు. కంపెని వ్యాపారం లో అతనికి తోడుగా చీఫ్ ఇంజినీర్ ఫాబ్రీ, ఫిజియాలజికల్ డిపార్ట్ మెంట్ హెడ్ డాక్టర్ గాల్, చీఫ్ సైకాలజిస్ట్ డాక్టర్ హాలెమీర్, మేనేజింగ్ డైరెక్టర్ బుస్మన్, బిల్డింగ్ డిపార్ట్ మెంట్ హెడ్ ఆల్క్విస్ట్ వుంటారు. వారందరి ఆశయం ,లక్ష్యం ఒకటే . అదంతా ప్రక్రుతి విరుద్ధమైన చర్య అని భావించిన హెలెనా కలవరపాటుకు , దిగ్భ్రాంతికి గురవుతుంది. తనతో పెళ్ళికి డోమిన్ ఆమెని బలవంత పెడతాడు, బతిమిలాడుతాడు . ఆమె ఒప్పుకుంటుంది.

అలా పదేళ్ళు గడిచాక కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయి. చుట్టూరా యాంత్రిక జీవితం, కృత్రిమ మనుషుల చాకిరీ పట్ల అసంతృప్తి చెందుతుంది హెలెనా. పరిచారిక నాన్సీ రొబోట్ల వ్యవహారాన్ని,వాటి ప్రవర్తన తీరుని ఏవగించుకుంటుంది. మారియాస్ అనే రోబోట్ బ్రేక్ డౌన్ లక్షణాలతో విపరీతంగా ప్రవర్తిస్తుంది. దాన్ని డిసెక్షన్ కి పంపిస్తారు. మళ్ళీ రోబోట్ల బ్యాచ్ ఉత్పత్తి కాకుండా చేసేందుకు హెలెనా లాకర్ లోంచి సీక్రెట్ ఫార్ములా తీసి కాలబెడుతుంది. ఒకనాడు హఠాత్తుగా హార్బర్ లో కొన్ని షిప్స్ ఆగడం ,ఆయుధాలు చేత పూనిన రోబోలు ఫ్యాక్టరీ ఆఫీసు వైపు దూసుకు రావడం RUR యాజమాన్యం చూస్తుంది, ప్రపంచ రోబోలన్నీఏకమై తిరుగుబాటు ప్రకటించి మనుషులను ఎక్కడికక్కడ మూకుమ్మడిగా చంపెస్తున్నాయనీ, తిరుగుబాటు కు నాయకుడు రేడియస్ అనే రోబోట్ అని తెలుసుకుని అందరూ షాక్ అవుతారు. వాటికి భావోద్వేగాలు, విచక్షణ జ్ఞానం ఎలా వచ్చాయని డోమిన్ ఆశ్చర్య పోతున్న క్షణాన హెలెనా నిజం బయట పెడుతుంది; రోబోట్లకి ఆత్మ, భావొద్వేగాలు ఉండేలా వాటి నిర్మాణం లో మార్పులు చేయాల్సిందిగా తానే డాక్టర్ గాల్ కి ఆదేశమిచ్చినట్టు చెబుతుంది, గత మూడేళ్ళ నుంచి తానా పనిలో వున్నట్టు డాక్టర్ గాల్ ఒప్పుకుంటాడు. భవనాన్ని ముట్టడించిన సాయుధ రోబోట్ల నుంచి తమని తాము రక్షించుకునేందుకు డోమిన్ పరివారం విఫల యత్నం చేస్తుంది.

ఎపిలోగ్ భాగం లో , రేడియస్ ఆజ్ఞ మేరకు ఆల్క్విస్ట్ (RUR యాజమాన్య బృందం లో అతనొక్కడే బ్రతికి ఉంటాడు) రోబోట్లను తయారు చేసే విధానం గురించి తల బద్దలు కొట్టుకుంటాడు. గాల్ లాగా అతడు ఫిజిషియన్ కాదు ,బిల్డర్ మాత్రమె. అతని గోడు వినిపించుకోకుండా ఎలాగోలా ఆ ప్రక్రియ వెలికి తీయమని, ప్రయోగాలు చేసి ఫార్ములా కనిపెట్టమని రెడియస్, ఇతర రోబోట్లు బలవంత పెడతాయి . తమ నిర్మాణంలో సహజ ప్రత్యుత్పత్తి వ్యవస్థ లేదని వాటికి తెలుసు. ఫార్ములా ఏనాడో నాశన మైనదని, ఇక తమ సంఖ్య పెరిగే అవకాశం లేదని తెలుసుకుని అవి నిరాశ చెందుతాయి. డిసెక్షన్ రూమ్ లోకి వెళ్ళబోతున్న సమయం లో అనూహ్యంగా ప్రైమస్ , హెలెనా అనే రోబోలలో సహజ ప్రేమ అంకురించి మనుషుల్లాగా ప్రవర్తిస్తాయి. నాటక ముగింపులో ఆల్క్విస్ట్ వాళ్ళని ఆడం , ఈవ్ లుగా సంబోధించి శుభాకాంక్షలు తెలుపడంతో తెర పడుతుంది .

మొదటి ప్రపంచ యుద్ధం (1914-1919) గొప్ప వినాశనాన్ని కొని తెచ్చింది. ఫలితంగా యూరప్ , అమెరికా సహా బోల్షివిక్ విప్లవానంతర రష్యా లో ప్రజల జీవితాలు చిందరవందర అయినాయి. పులి మీద పుట్ర లాగా 1918 లో విరుచుకు పడ్డ స్పానిష్ ఫ్లూ 8.5 మిలియన్ ప్రజల్ని బలి గొన్నది. $100 బిలియన్ ల విలువైన ఆస్తి నష్టం కలిగి దేశాలన్నీ అప్పుల్లో కూరుకు పోయాయి. యుద్ధం ముగిసిన ఒక సంవత్సరం తర్వాత అణు విచ్చేదన ప్రయోగం లో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. శాస్త్ర సాంకేతిక విజ్ఞాన రంగం లో అదో గొప్ప ముందడుగు. మరిన్ని ఆవిష్కరణలు జరిగి కొత్తరకం ఆటోమొబైల్స్, హై స్పీడ్ విమానాలు, హై వేస్ వచ్చేశాయి. ఆధునిక నాగరికత మనిషి ఆలోచనలను ,జీవన శైలిని మార్చేసింది. సమాజాలలో అసమానతలు పెరిగాయి. ఈ చారిత్రిక నేపథ్యం లో RUR నాటకం ద్వారా కారెల్ కాపెక్ మూడు సందేశాలిచ్చాడు : 1. టెక్నాలజీ అప్రతిహత పురోగమనం కారణంగా భవిష్యత్తులో మానవాళికి ప్రమాదాలు ఎదురు కాగలవు. 2. ఉత్పత్తి సాధనాలను గుప్పిట్లో పెట్టుకుని అన్నింటినీ నియంత్రించే వారు , శ్రమ మినహా మరేమీ లేక నియంత్రించబడేవారు- అనే రెండు వర్గాలుగా మానవాళి చీలిపోతే హింస, రక్తపాతాలు సంభవించే అవకాశముంది.3. దోపిడీ యుత వ్యాపార ధోరణులు, మానవీయ విలువల మధ్య జరిగే ఘర్షణ లో తుదకు రెండోదే గెలుస్తుంది. ఈ నాటకం చదవడం ఒక వింత అనుభవం అని చెప్పొచ్చు. ఒక మంచి సై –ఫి రచన చదివిన సంతృప్తి పాఠకునికి కలుగుతుంది. దీని తెలుగు అనువాదాన్ని ఇటీవలే ఎమెస్కో వారు ప్రచురించారు. ఆసక్తి వున్నవారు కొనుక్కుని చదవ వచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com