(డా.రూప్ కుమార్ డబ్బీకార్)

ఉర్దూ కథ : జడే

రచయిత్రి : ఇస్మత్ చుగ్తాయి

హిందీ అనువాదం : నంద్ కిశోర్ విక్రమ్

తెలుగు అనువాదం: డా. రూప్ కుమార్ డబ్బీకార్

అందరి మొహాలు పాలిపోయివున్నాయి. ఇంట్లో కనీసం వంటావార్పు కూడా లేదు. ఇలా ఆరవరోజిది. పిల్లలు స్కూల్ లేకుండా ఇంటి పట్టునే వుండి అల్లరితో ఇల్లు పీకి పందిరి వేయసాగారు. అదే పనిగా తన్నుకోవడాలు, గుద్దులాటలు, మళ్ళీ అవకాశం దొరకదు అన్న రీతిలో వీరి అల్లరితో ఇల్లంతా సంత అంగడి అయ్యింది. ఈ వెధవలకేo తెలుస్తుంది, ఆంగ్లేయులు వెళ్లిపోయారు కానీ, పోతూ పోతూ లోతైన గాయాలు చేసి మరీ పోయారు అని. అవి సంవత్సరాలు గడిచినా మానని గాయాలు. భారత్ మీద ఇంతటి దుర్మార్గమైన, క్రూరమైన చేతుల మీదుగా, ఆయుధాలతో అత్యాచారాలు జరిగాయి. రక్తపుటేరులు ప్రవహించాయి. ఆ గాయాలను మాన్పె శక్తి ఎవ్వరికీ లేదు.

కొన్ని రోజులనుండి పరిస్థితులు ఎంత భయానకంగా వున్నాయంటే, పట్టణంలోని ముస్లింలు ఒక విధంగా గృహ నిర్బంధంలో ఉన్నారా? అన్న అనుమానం కలగసాగింది. ప్రతి ఇంటికి తాళాలు వేసి వున్నాయి. బయట పోలీసు పహారా! ఈ విధంగా బతుకులు ‘దిన దిన గండం నూరేళ్లాయుష్షు’ అన్నట్లు గా సాగుతున్నాయి. ఒక విధంగా చూస్తే ‘సివిల్ లైన్స్’ లో వాతావరణం ఎప్పటిలానే ప్రశాంతంగా వుంది. ఈ దుర్భర పరిస్థితి ఎక్కువగా యువకులున్న చోటే పుట్టుకొస్తది. వాళ్ళే సమస్యలను కెలుకుతూ వుంటారు. ఎక్కడైతే పేదరికం వుంటుందో అక్కడే అజ్ఞానమనే గుర్రం మీద ఈ సాంప్రదాయపు దండోరా మోగుతూవుంటుంది. అందుకు తగినన్ని కారణాలు తవ్వి కుప్పలుగా పోయబడ్డాయి. దానికి తోడు పంజాబ్ నుండి వచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరిగి పోతుండటంతో అల్పసంఖ్యాకుల గుండెల్లో భయం పెరగ సాగింది. దిగజారిన పరిస్థితులను కెలికే వారి సంఖ్య, రెచ్చగొట్టే వారి సంఖ్య పెరుగుతూ, పెరుగుతూ నెమ్మదిగా ప్రశాంతమైన, స్వచ్ఛమైన ప్రాంతాల్లోకి పాకిపోయింది.

రెండు మూడు ప్రాంతాల్లోనైతే బహిరంగ ప్రదర్శనలు కూడా జరిగాయి. కానీ, మార్వాడ్ ప్రాంతంలో హిందువులు, ముసల్మానుల మధ్య వారి వస్త్ర ధారణలో కాని, ముఖ కవళికల్లో గాని, పేర్లలో గాని అంత పెద్దగా తేడా వుండక బయటి వారికి బేధం గుర్తించడం కష్టంగా వుంటుంది. కాని, బయటి నుండి వచ్చిన అల్పసంఖ్యాకులను మాత్రం చాలా సులువుగా గుర్తించగలరు. దానితో వారంతా పంద్రా ఆగస్టు వాసన పసిగట్టి పాకిస్తాన్ సరిహద్దుల గుండా తప్పించుకు పోయారు. ఇక మిగిలిపోయింది స్థానికంగా, చాలా కాలంగా వున్న కుటుంబాల వారు. వారిలో అంతగా తెలివి లేదు. స్థాయి కూడా లేదు. ఎవరైనా ముందుకు వచ్చి భారత్, పాకిస్తాన్ మధ్య వున్న సమస్యను కూర్చొని సావధానంగా విడమర్చి చెప్పే వాడు లేడు. ఎవరికైతే చెప్పవలసిన అవసరం వుండేదో వారికి చెప్పడం జరిగింది . వారంతా అర్ధం చేసుకున్నారు. సురక్షితమై పోయారు. ఇక మిగిలిన కొందరు ఎవరైతే వున్నారో వారు పావలాకు గోధుమలు, పావలాకు చేతి మందం రొట్టె దొరుకుతున్నది చాలు అన్న ఆశతో వున్నారు. అక్కడికి వెళ్ళాక గాని తెలిసి రాలేదు, నాలుగు సేర్లు గోధుమలు కొనడానికి ఒక రూపాయి అవసరం పడుతుందని, ఇంకా చేతి మందం రొట్టె కోసం పూర్తిగా ఒక పావలా ఇచ్చుకోవలిసివస్తుందని. మరి ఈ రూపాయి, ఈ అర్ధ రూపాయి ఏ దుకాణంలో దొరకలేదు, ఏ పొలంలో పండలేదు. బతుకు వెళ్లదీయడానికి ఎంతగా పరుగులు పెట్టాలో ఈ మాత్రం డబ్బు సంపాదించాలియన్న అంత కష్టపడాల్సి వస్తుందన్న వాస్తవం సోయిలోకి వచ్చింది.

అల్పసంఖ్యాకులను తమ ప్రాంతాలనుండి బహిరంగంగానే వెళ్ళగొట్టాలి అన్న నిర్ణయం ఎప్పుడైతే తీసుకున్నారో అప్పుడు ఒక పెద్ద చిక్కు సమస్య ఎదురయ్యింది. స్థానికులతో అధికారులంతా కలిసిమెలిసి తిరుగుతూ వుంటారు, కనుక ముసల్మానులను మరీ ఏరి వెళ్ళగొట్టాలంటే విడిగా, ప్రత్యేకంగా స్టాఫ్ అవసరమవుతుంది. అందుకు అనవసరంగా ఖర్చు చెయ్యాల్సి వస్తుందంటూ ఠాకూర్లు వ్యతిరేకించారు. ఒక వేళ, శరణార్ధుల కోసం ఇంత భూమి కావాలి అని అనుకుంటే చెప్పండి, నేల చెక్క ఖాళీ చేయించే ఏర్పాటు చేయగలం. పశువులు ఎలాగూ వుండనే వుంటాయి. మీరెప్పుడు అవసరమనుకుంటే చెప్పండి అప్పుడు అడవి శుభ్రం చేయిస్తాము, అన్న సమాధానం ఎదురయ్యింది .

ఇక లెక్కకు కొన్ని కుటుంబాలే కదా మిగిలివున్నాయి. ఆ కుటుంబాలు మహారాజా వారి శిష్యబృందం లోనివి కావచ్చు. కొందరికి గాఢమైన స్నేహం వుండి వుండవచ్చు. వాళ్ళైతే పోయే ప్రశ్నేతలెత్తదు. ఎవరైతే వెళ్లిపోవడానికి గట్టి నిర్ణయం తీసుకున్నారో వారైతే మూటాముల్ల సర్దేసుకుంటున్నారు. మా కుటుంబం కూడా అదే కోవలోకి వస్తుంది. తొందరేమీ లేకుండె! కానీ ఈయన ఆవేశంతో పిచ్చి పిచ్చిగా వాగేసాడు. ఐనా ఎవ్వరూ ఈయన మాటలకు విలువివ్వ లేదు. ఎవ్వరూ ఇతని మాటల్ని చెవికెక్కించుకోలేదు. సామాన్లు సర్దుకుంటున్నారన్న విషయంలో ఎవ్వరికీ గాలి కూడా సోకలేదు. ఈ ఛబ్బా మియాను ఆ అల్లా యే కాపాడాలి. ఇంత ఢాంబికం ప్రదర్శించకపోతే ! పెద్దన్నయ్య ఐతే అన్నింటికీ సిద్దమే అయ్యాడు. చెప్పి చెప్పి అలసిపోతే మియా ఛబ్బా ఏo జేసాడు – స్కూలు గోడల మీద ‘పాకిస్తాన్ జిందాబాద్’ రాయడానికి తీర్మానించుకున్నాడు. రూప్ చంద్ పిల్లలు దీనిని వ్యతిరేకించి అదే స్థానంలో ‘అఖండ్ భారత్ ‘ అని రాసేసారు. ఫలితంగా చెప్పులతో కొట్టుకోవడం, తన్నుకోవడం చివరికి ఒకరి మీద ఒకరు అంతు చూస్తామని ప్రతిజ్ఞలు కూడా చేసుకున్నారు. మాటా మాటా పెరిగింది. పరిస్థితి ఎంత దాకా వచ్చిందంటే పోలీసులు కలుగ జేసుకొని వేళ్ళ మీద లెక్క పెట్ట గలిగే సంఖ్యలో ముస్లింలు మిగిలివుంటే వాళ్ళను లారీల్లో ఎక్కించి ఇళ్ళకు పంపించి వేసారు.

ఇక చూడండి – పిల్లలు ఇంటికి రాగానే, “వీళ్లకు కలరా తగలనీ, వీళ్లకు మహమ్మారి రోగం వచ్చి పోనీ ” అని తిట్టుకునే తల్లులు, ఎంతో ప్రేమతో ఆందోళనకు గురై గుండెలకత్తుకున్నారు. కొన్ని సార్లు ఇలా కూడా జరిగేది, రూప్ చంద్ పిల్లలతో గొడవపడి ఛబ్బా వస్తే ‘దుల్హన్ బాబీ’ అతన్ని అక్కడే చెప్పు దెబ్బలతో సత్కరించి తిరిగి అతన్ని లేపి రూప్ చంద్ దగ్గరికే పంపి చికిత్స చేయించేది. ఎందుకంటే రూప్ చంద్ మా ఫ్యామిలీ డాక్టరే కాదు, అబ్బాకు పాత దోస్త్ కూడాను. డాక్టర్ సాహెబ్ దోస్తీ అబ్బా తోటి, ఆయన కొడుకుల సోపతి అన్నల తోటి, ఆయన కోడళ్ళకు మా వదినలతో ఇలా ఏ తరం వారు ఆ తరం తోటి ‘ఒకే కంచం ఒకే మంచం’ అన్నంతగా గాఢమైన స్నేహం వుండేది. రెండు కుటుంబాలకు చెందిన వర్తమానంలోని మూడు తరాల వాళ్ళు ఒకరితో మరొకరి అన్యోన్యత ఎంత గాఢంగా వుండేదంటే భారత్ విభజన తర్వాత వీరి ప్రేమలో ఇంత పెద్ద అగాధం ఏర్పడుతుందన్న అనుమానం లేశ మాత్రం కూడా కలగక పోయేది. అంతే కాదు రెండు కుటుంబాలలో కూడా ముస్లిం లీగ్, కాంగ్రెస్ , మహాసభకు చెందిన పార్టీ పక్షం వారున్నారు . ధార్మికమైన, సాంప్రదాయకమైన , రాజకీయ విషయాల పైనా కూడా చర్చలు వాడిగా, వేడిగా సాగేవి. అదేదో ఫుట్ బాల్ మ్యాచ్, క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నంత హుషారుగా వాగ్వాదాలుండేవి. ఇక్కడ అబ్బా కాంగ్రెస్ వాది. అక్కడ డాక్టర్ సాహెబ్ ఇంకా పెద్దన్నయ్య లీగ్ ను సమర్ధించే వారు. అక్కణ్ణుంచి జ్ఞాన్ చంద్ మహా సభ పక్షమైతే, ఇక్కణ్ణుంచి రెండవ అన్నయ్య కమ్యూనిష్టు వాది. అక్కడ గులాబ్ చంద్ సోషలిష్ట్. ఈ లెక్కన మగాళ్ల భార్యలు, పిల్లలు వారి వారి పార్టీలకే సానుభూతి చూపేవారు. సాధారణంగా ఏదైనా విషయంపై చర్చ వేడిగా, వాడిగా నడిచినా కాంగ్రెస్ పక్షమే ఎప్పుడూ బలంగా నిలబడేది.

కమ్యూనిష్టు, సోషలిస్టు పక్షం వారు తిట్లు తినేవారు. చివరికి కాంగ్రెస్ పక్షం వైపే మొగ్గు చూపేవారు. మహా సభ, లీగ్ వాళ్ళు మిగిలిపోయే వారు. వీరిద్దరికీ ఒకరంటే మరొకరికి పడదు. కానీ ఎదుటి పక్షం తరఫున వివాదం మొదలవ్వగానే ఒక్కటవుతారు. చివరికి ఇద్దరూ ఒక్కటై కాంగ్రెస్ మీద విరుచుకు పడతారు. కానీ ఇక్కడ కొంత కాలం నుంచి ముస్లిం లీగ్ జోరు అధికం కాసాగింది. అలాగే మహాసభది కూడా. కాంగ్రెస్ పరిస్థితి మరీ అన్యాయంగా మారసాగింది. పెద్దన్నయ్య కనుసన్నల్లో ఇంట్లోని మిగతా మొత్తం దళం, కాంగ్రెస్ కట్టర్ వాదులు ఒకరిద్దరు తప్పించి, ‘నేషనల్ గార్డ్ ‘ మాదిరి ఒక్క గుంపయ్యారు. ఇక్కడ జ్ఞాన్ చంద్ నాయకత్వంలో ‘సేవక్ సంఘ్’ గా ఒక చిన్న దళం ఏర్పడింది. ఇన్ని వర్గాలుగా, గ్రూపులుగా విడిపోయినా, సిద్ధాంతాలు వేరైనా వారి మధ్య వున్న ప్రేమ మాత్రం చెక్కు చెదరకపోయేది. ఇప్పటికీ అలాగే మొదటిలా కొనసాగుతోంది.

“మన లల్లూ పెండ్లి మాత్రం మున్నీ తోటే జరిపిస్తాను” – మహాసభ జ్ఞాన్ చంద్ గారి లీగ్ తండ్రితో అంటున్నారు .. “బంగారు పట్టీలు చేయిస్తాను.”

“యార్, ఇవి పై పై మాటలు, ఢాంబికాలని వంక పెట్టి తీసిపారెయ్యకు.” — అంటూ జ్ఞాన్ చంద్ పై దాడి చేస్తారు .

ఒక వైపు ‘నేషనల్ గార్డ్’ గోడలమీద “పాకిస్తాన్ జిందాబాద్ ” అని రాతలు రాస్తే అటువైపు ‘ సేవక్ సంఘ్’ వాటిని చెరిపి ” అఖండ్ భారత్ ” అని రాసేస్తారు . ఇవన్నీ పాకిస్తాన్, భారత్ తో లావాదేవీలు జరుపుతున్నప్పటి సందర్భం లోని సంఘటనలు. మాటలు ఒక హాస్యంలా వుండేవి.

అబ్బా , ఇంకా రూప్ చంద్ వీరి మాటలు విని సన్నగా నవ్వుకొని అందరిని ఒకటిగా వుంచే ప్రయత్నం చేసేవారు . అమ్మ, చాచీ రాజకీయ విషయాలకు దూరంగా వుంటూ పసుపు, ధనియాలు, కూతుళ్ల పెళ్లిళ్లకు కట్నకానుకల గురించి మాట్లాడుకునేవారు. ఇక కోడళ్ళేమో ఒకరి ఫ్యాషన్లను మరొకరు ఎలా నకలు చేయాలి అన్న అవకాశాల కోసం ఎదురు చూసేవారు. డాక్టర్ సాహెబ్ దగ్గరి నుండి వెచ్చాలు తెప్పించుకోవడమే కాదు, మందులు కూడా తెప్పించుకునే వారు. ప్రతి రోజు ఏదో వంకతో తుమ్ము వచ్చినా, డాక్టర్ సాబ్ దగ్గరికి పరిగెత్తడం, ఒంట్లో చిన్నపాటి నలతగా వున్న డాక్టర్ గారు . ఇక అమ్మ పప్పు, రొట్టె చెయ్యడం మొదలు పెడుతుందో లేదో డాక్టర్ సాబ్ కు కబురెళ్లి పోతుంది, భోజనానికి రమ్మని. కబురందడమే ఆలస్యం డాక్టర్ సాహెబ్ తన మనవళ్ల సైన్యాన్ని వెంటేసుకొని పొలోమంటూ వచ్చేస్తారు.

వెళ్లే సమయాన, “భోజనం చెయ్యకూడదు సుమా ! విన్నారా ” – అంటూ భార్య హెచ్చరిస్తుంది .

“అది సరే, మరైతే ఫీజేలా వసూలయ్యేది. చూడు! లాలా, ఇంకా చున్నిని పంపించు” .. అని బదులిచ్చేవారు.

“అయ్యో రామా ! మీకే మాత్రం లజ్జ రాదు” – అని విసుక్కుంటుంది .

కానీ అసలు మజా ఎప్పుడొస్తుందో తెలుసా? ఎప్పుడైతే అమ్మ ఒంట్లో నలతగా వుందని గాభరా పడి వణికి పోతుందో అప్పుడు చూడాలి.

‘వద్దు నాయనా వద్దు, ఈ జోకర్ దగ్గర చికిత్సనా! నేను చూపించుకొను, అంటూ మారాం చేస్తుంది. కానీ ఇంటి డాక్టర్ ను వదిలి పట్టణానికి వెళ్లి ఎవరు తీసుకొస్తారు. డాక్టర్ సాహెబ్ ను అలా పిలవగానే ఇలా పరిగెత్తుకు వచ్చేస్తారు.

“ఒక్కరే అలా పులావ్ మెక్కేస్తే ఆరోగ్యం పాడుగాదు ?! ” ఆయన గట్టిగా వారిస్తారు .

“మీరలాగే తింటారు కదా! అందర్నీ మీలాగే అనుకుంటే ఎలా !” – అని పర్దా వెనకనుంచి అమ్మ సణుగుతూ ఎదురు దాడి చేస్తుంది.

“అరే, ఒంట్లో బాగులేదనడం ఒక వంక మాత్రమే, మీరు ఉన్నపలానా నన్నురమ్మంటే నేనే వచ్చేస్తాను గదా! ఈ నాటకాలన్నీ ఎందుకు ఆడటం ?” .. అతను కళ్ళలో కాసింత కోపం నటిస్తూ ముసి ముసి నవ్వులు పోసాగాడు . అమ్మకు ఒళ్ళు మండి చెయ్యి వెనక్కు లాక్కొని ఏవో మాటలు వినిపిస్తుంటుంది. అబ్బా నవ్వుతూ వుండిపోతాడు.

“ఒక్క రోగిని చూడటానికని వస్తే ఇంట్లో వున్న రోగులందరూ వరస కట్టి నిలబడి పోతారు. ఒకడు కడుపు నొప్పి అంటాడు. మరొకడు పుండు మీద పొక్కు ఒలిచిపోయి పచ్చిగయ్యిందంటాడు. ఒకరికి చెవి పోటు, ఇంకొకరికి ముక్కు వాచిపోతుంది .”

“ఇదేం బాధ డిప్యూటీ సాహెబ్ ! ఒకరిద్దరికి ఇంత విషమిచ్చేస్తాను, సరిపోతుంది! నన్నేమైనా పశువుల డాక్టర్ అనుకున్నారా? దేశంలో వున్న పశువులన్నీ ఇక్కడికే ఎగబడి వచ్చేసాయి” అని రోగుల వైపు చూస్తూ లోలోన నవ్వుకుంటూ వుంటారు.

కొత్త శిశువు పుట్టడానికి సిద్ధంగా వుంటే ఇలా అంటారు — “ఉచితంగా వచ్చే డాక్టరున్నాడు కదా! కంటూ పోండి, అందరికి చెప్పండి, బేఖార్ గా వొకడున్నాడని “.

కానీ ఎవరికైనా (ప్రసవపు) నొప్పులు అలా మొదలవుతాయో లేదో వారి వరండా నుంచి మా వరండాకు చక్కర్లు కొట్టడం మొదలవుతుంది. అరుస్తూ అందరినీ హైరానా పెట్టేస్తారు. ఆ భయానికి ఇరుగు పొరుగు రావడానికి కూడా కష్టమవుతుంది .

ఎలాగైతే శిశువు మొదటి కేరింత ఈయన చెవుల పడుతుందో, అంతే , వరండా నుంచి దర్వాజా దగ్గరకు , దర్వాజా నుండి గది లోపలికి వచ్చేస్తారు. ఈయనతో పాటు అబ్బా కూడా కంగారుగా వచ్చేస్తాడు. ఆడాళ్ళంతా నెత్తి నోరు కొట్టుకుంటూ, విసుక్కుంటూ పర్దాలోకి వెళ్ళిపోతారు. శిశువు నాడి చూసి తల్లి వీపు మీద చరుస్తూ, “వహ మేరీ శేర్ ని” యని శిశువు బొడ్డుపేగును కోసి స్నానం చేయించడం మొదలు పెడతారు. అబ్బా బెదురు బెదురుగానే ఆయా లాంటి పనుల్లో సహాయం అందిస్తాడు. ఇక అమ్మ అరవడం మొదలుపెడుతుంది. అల్లాహ, ఇదేమి విచిత్రం ‘జచ్చా -బచ్చా’ దగ్గర ఈ మగాళ్లకేం పని?

పరిసరాల్లో లో వేడి పుట్టించి ఇద్దరూ చివాట్లు తిని పిల్లల్లా బయటికి పరుగెత్తుతారు.

అబ్బా పక్షవాతానికి గురైనపుడు రూప్ చంద్ జి ఆస్పత్రి నుండి రిటైర్ అయి వున్నారు. అప్పటినుండి ఆయన ప్రాక్టీస్ అంతా స్వంతానికి, మరి మా ఇంటికి మాత్రమే పరిమితమై పోయింది. ఆ సమయంలో చికిత్స మాత్రం వేరే డాక్టర్లు చేసినా నర్స్ తో పాటు అమ్మ ఇంకా డాక్టర్ సాహెబ్ మాత్రమే మేల్కొని ఉండేవారు. ఎప్పుడైతే అబ్బా చివరి కర్మలు చేసి వచ్చారో తరాలుగా వచ్చే ప్రేమ, అభిమానంతో పాటు బాధ్యత కూడా భుజాలపై వేసుకున్నారు. పిల్లల ఫీజులు మాఫీ చేయించడానికి స్కూలుకు పరుగులు తీసేవారు. పిల్లల పెళ్లిళ్లకు కట్నం కోసం జ్ఞాన్ చంద్ నోరు మూయించేవాడు. ఇంట్లో ఎలాంటి విశేషమైన కార్యం జరిగినా అది డాక్టర్ సాహెబ్ సలహా మేరకే జరిగేది. ఇంటి పడమటి మూలను కూలగొట్టి రెండు గదులు పెంచి వేయాలన్న ప్రశ్న తలెత్తినప్పుడు అది డాక్టర్ సాహెబ్ సలహా మేరకే కూలగొట్టించడం జరిగింది.

“దాంతో రెండు గదులు పైన వేసి పెంచుకోండి ” – అని ఆయన సలహా ఇచ్చాడు. దానిని స్వీకరించడం జరిగింది . ఫజన్ ఎఫ్. ఏ లో సైన్స్ తీసుకోవడానికి సిద్ధంగా లేకుంటే డాక్టర్ సాహెబ్ చెప్పు తీసుకొని వెంటబడితేగాని గొడవ పరిష్కారం కాలేదు. ఫరీదా మొగుడితో కొట్లాడి ఇంటికొచ్చి కూర్చుంది. డాక్టర్ సాహబ్ దగ్గరికి ఆమె భర్త చేరిండు. మరుసటి రోజు ఆయన రెండవ కోడలు షీలా పెళ్ళై వచ్చిన తర్వాత ‘ఆయా ‘ సమస్య కూడా కొలిక్కి వచ్చేసింది. పాపం బేచారీ! ఒక రోజు ఆస్పత్రి నుండి పారిపోయి వచ్చింది. ఫీజు ఇవ్వడం దేవుడెరుగు, ఆ పైన ఆరవ రోజే కుర్తా – టోపీ వెంట తీసుకొని వచ్చింది.

అటువంటి గాఢానుబంధాల మధ్య ఇప్పుడు ఛబ్బా కొట్లాడి వస్తే ఇంతలా స్వాగత సత్కారాలా! ఎలాగైతే రణరంగం గెలిచివచ్చిన ఒక మహాయోధుడిలా మర్యాద జరిగింది. అందరూ అతని గొప్పదనాన్ని తెలుసుకోవాలనే కుతూహాలం చూపుతున్నారు. యువకుల ముందు అమ్మ గొప్ప గొప్ప విజయం సాధించినట్లు అమాయకంగా ప్రదర్శన ఇవ్వసాగింది. ఈ మార్పు ఈ రోజుది అని కాదు. ఎప్పుడైతే 15, ఆగస్టు నుండి డాక్టర్ సాహెబ్ గారి ఇంటి మీద త్రివర్ణ పతాకం ఎగిరిందో, తమ ఇంటి మీద లీగ్ జెండా వేళ్లాడసాగిందో అప్పట్నుంచి వారి నోరు మూత పడింది. ఈ జండాల మధ్య ఒక పెద్ద అగాధం ఏర్పడింది. దీని భయంకరమైన లోతుల్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ అమ్మ లోలోన కుమిలిపోతూ వుంటుంది. మళ్ళీ శరణార్ధుల సంఖ్య పెరగసాగింది. పెద్ద కోడలు తల్లి గారి వైపు వారు బహావల్పూర్ నుండి దోపిడీకి గురై అన్నీ కోల్పోయి ఏదో విధంగా ప్రాణాలు కాపాడుకొని రాగానే ఈ అగాధం వెడల్పు మరింత పెరిగింది. అలాగే రావల్పిండి నుండి నిర్మల అత్త వైపు బంధువులు స్పృహ తప్పిన అవస్థలో వచ్చిన తర్వాత ఈ అగాధం లోతుల్లో కొండచిలువలు బుసకొట్టసాగాయి. చిన్న వదిన తన పిల్ల వానికి కడుపు నొప్పియని చూపించటానికి పంపిస్తే, షీల వదిన తమ నౌకర్ ను తరిమేసింది.

ఈ విషయాన్నితీసుకొని ఎవ్వరూ కూడా ఎలాంటి వివాదం రేపి రెచ్చగొట్టి సమస్యను పెద్దగా చేయలేదు. ఇంట్లో అందరూ ఒక్క సారిగా అటువైపు వెళ్లడం మానేసారు. పెద్ద వదిన ఐతే తన హిస్టీరియా ఫిట్స్ మరిచి హడావుడిగా బట్టలు సర్దడం మొదలుపెట్టింది.

“నా ట్రంకు పెట్టెను మాత్రం తాకకండి ” – చివరికి అమ్మ నోరు తెరిచింది . దాంతో అందరూ అవాక్కయి చూస్తుండి పోయారు .”

” ఏం నువ్వు రావా ” – పెద్దన్నయ్య ఆవేశంగా అన్నాడు.

ఈ వయసులో సింధ్ కు వెళ్లి చావాలా?” ఈ రాజీ పడే బతుకు నాకెందుకు?

“ఐతే డాకే కు సాంజ్ లే దగ్గరికెళ్ళిపో !”

“ఆమె డాకే కు ఎందుకెళ్తుంది. అక్కడికెళ్లి ఏమైనా బెంగాలీలా వరన్నం పిసికి పిసికి తినడానికా?” సాంజ్లి అత్త కూడ వెటకారంగా అంది .

“ఐతే ఫరీదా దగ్గరికి రావల్పిండి వెళ్ళు “- ఖాలా చెప్పింది. ” తౌబా మేరీ “, అల్లాహ , పవిత్రమైన పంజాబీల చేతుల మీదుగా నేలను అపవిత్రం చేయించకు, పాపిష్టి మాటలు మాట్లాడే వారు నరకానికి పోతారు.” ఈ రోజు, ఎన్నడూ నోరు తెరవని మా అమ్మ చిటపటలాడ సాగింది.

సామెతలు, మాటలతో వాతావరణం వేడెక్కసాగింది. ఐనా మాటల తాకిడి తగ్గడం లేదు. మా అమ్మ ముఖం కాస్త కోపంతో ఎర్రబడింది.

“పిల్లల్లా మాట్లాడుతున్నారు” – నేషనల్ గార్డ్ సర్దార్ అలీ మధ్యలో జోక్యం చేసుకున్నారు .

“తలా తోక లేని మాటలు, ఏమనుకుంటున్నారు. ఇక్కడే వుండి చస్తారా ఏమైనా !?”

“మీరెళ్ళండి. ఇప్పుడు నేనెక్కడికి వెళ్తాను, చివరి ఘడియల్లో ” –

“ఐతే చివరి రోజుల్లో కాఫిర్ల తోటి చివరి కర్మలు చేయించుకుంటావా? ఖాలా బీ మూటలు లెక్కబెడుతూ పోతూ వుంది. మూటల్లో బంగారo, వెండి నగలతో సహా కరక్ పళ్ళపొడి, మెంతిపొడి, ముల్తానీ మిట్టి దాకా వున్నాయి. ఈ వస్తువులను ఎంత ప్రేమగా గుండెలకత్తుకొని తీసుకువెళ్తుందంటే చూసేవారికి ఈ వస్తువులే లేకుంటే పాకిస్తాన్ కు కరువు వచ్చేస్తుందా! అన్న భ్రమ కలుగుతుంది. పెద్దన్నయ్య కోపంతో విసుక్కొని మూడుసార్లు పనికి మాలిన మూటలను విసిరేసాడు. ఐతే ఆమె ఈ ఆస్తులను తీసుకు వెళ్లక పోతే పాకిస్తాన్ పేద దేశంగా మిగిలిపోతుంది అన్న తీరులో ఆమె ప్రవర్తన వుంది. చిన్నచితకా సామాన్లు సర్దేసింది. వంట పాత్రలు గోనె సంచుల్లో మూట కట్టింది. మంచాలు విప్పి కట్ట కట్టింది. చూస్తూ చూస్తూ వుండగానే అన్నీ అమర్చి, పొందికగా వున్న ఇల్లు కాస్త చిందరవందరగా, పెంట కుప్పలా మారింది. ఇప్పుడు సామాన్లకు కాళ్ళొచ్చేసాయి. కాస్త సేద దీరడానికి కూర్చున్నాయా! అన్నట్లు వున్నాయి . కానీ ఏంతో సేపు అవి అలా వుండవు. తిరిగి నాట్యం చేస్తాయి. అమ్మ ట్రంకు పెట్టె మాత్రం ఎలా వుండేదో అలానే వుంది .

“ఆపా కోరిక ఇక్కడే చావాలని వుంటే ఎవరాపగలరు,” చివరికి భాయి సాహెబ్ తన అభిప్రాయాన్ని తెలుపుతాడు. అమాయకపు మొహంతో వుండే మా అమ్మ శూన్యపు కళ్ళతో ఆకాశం వైపు చూడసాగింది. ఆమె తనలో తానే ప్రశ్నించుకుంటుంది – “ఎవరు చంపుతారు? మరి ఎప్పుడు చంపుతారు?

” అమ్మకు మతి చెడింది “- ఈ వయసులో బుద్ది నిలకడగా వుండదు. రెండవ సోదరుడు చెవిలో గుసగుసలు పోయాడు. వీళ్ళకేం తెలుసు. ఈ కాఫిర్లు అమాయకుల పైన ఇంకా అత్యాచారాలు చేస్తూనే వున్నారు. మన దేశమైతే కనీసం ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ వుంటుంది.

నోరు మెదపని మా అమ్మ గనక ఒకవేళ నోరు తెరిస్తే తప్పకుండా ఈ మాటలు చెప్పేది – “మన దేశం అంటే ఎవడబ్బ సొత్తు అది? మనుషులు ఎక్కడ వుంటే అదే వారి దేశం? ఏ నేల మీద పుట్టామో, ఏ మట్టిలో పొర్లాడి పెరిగి పెద్దయ్యామో , అదే మన దేశం కాకపొతే, మరి కేవలం ఓ నాలుగు రోజుల కోసం ఓ ప్రాంతానికి వెళ్లి అక్కడ బతుకుదెరువు వెళ్లదీసే ఆ నేల మన దేశం అయిపోతుందా? ” ఇంకా ఎవరికీ తెలుసు, అక్కణ్ణుంచి కూడా ఎవరైనా తరిమేస్తే ?!

“వెళ్ళండి, వెళ్లి మరో చోట కొత్త దేశం ఏర్పాటు చేసుకోండి” అని చెబితే ? ఇక్కడే నా బతుకు ఇంత వరకు వెల్లదీసాను. ఓ చిన్న గాలివాటు వచ్చింది. దేశంలో వున్న కొట్లాటలు, సమస్యలు ముగిసిపోతాయి. దేశ నాశనం కానీ, దాని పునర్నిర్మాణం కానీ ఏమైనా తియ్యని అనుభవాలను మిగిల్చే ఆట కాదు కదా! ఒక సమయముండే, మొఘల్ లు తమ దేశాన్ని వీడి కొత్త దేశం నిర్మించుకోవడానికి ఇక్కడికి వచ్చారు కదా! ఈ రోజు మళ్లీ దేశం కోసం బయల్దేరాలా?! అటువంటప్పుడు దాన్నిదేశం అనాలా? కాలి చెప్పు అనాలా? కాస్త నొప్పి కలిగిందో లేదో తీసి పారెయ్యడం, మళ్లీ కొత్తవి వేసుకున్నాం అంటే సరిపోదు. కానీ , అమ్మ మౌనంగానే వుంది. ఇప్పుడు వారి మొహాల్లో ఇంతకు ముందు కన్నా అలసట ఎక్కువగా కనబడుతుంది. ఎలాగంటే కొన్ని వందల సంవత్సరాల నుండి దేశం కోసం అన్వేషిస్తూ, మట్టిని వడబోస్తూ, వడబోస్తూ అలసిపోయి కూర్చున్నారా! కానీ, ఈ అన్వేషణలో తమని తాము కూడా కోల్పోయారు. పెద్ద గాలి దుమారం – తుఫానులో కూడా చెక్కు చెదరక తన వేర్లను బలంగానే వుంచే మర్రిచెట్టులా అమ్మ తాను కూర్చున్న చోటే నిబ్బరంగా కూర్చుంది. కానీ కూతుళ్లు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్లు ఏకమొత్తంగా చెప్పాలంటే జన సమూహం అంతా కదిలి గేటు దాటి, పోలీసు సంరక్షణలో లారీల్లో ఎక్కి కూర్చోగానే ఈమె గుండె ముక్కలై చెదిరి పోసాగాయి. విచలిత మనస్కురాలై, అలజడి చూపులతో అగాధానికి ఆవలి వైపు నిస్సహాయురాలై చూడసాగింది . దూరాన నేల బద్దలవడానికి ముందు కల్లోల గగనంలో మబ్బుతునకలా దారి పక్కనే వున్న ఆ ఇళ్లు ఇప్పుడు ఎంతో దూరంగా కనబడసాగింది. రూప్ చంద్ వరండా బావురుమన్నట్లుగా వుంది. ఒకరిద్దరు పిల్లలు బయటికి వచ్చారు గాని వాళ్ళను కొన్నిచేతులు పట్టి లాక్కుంటూ లోపలి తీసుకెళ్లిపోయాయి. ఆ తలుపుల చాటున చెమ్మగిల్లి, కన్నీళ్లు నిండిన అమ్మ కళ్ళ నుండి ఆ కళ్ళు తప్పించుకోలేకపోయాయి. లారీలు దుమ్ము రేపుకుంటూ మొత్తం ఇంటినే లేపుకుని వెళ్లిపోయాయి. రేగిన దుమ్ములో అస్తిత్వాల మూలాలున్నాయా? కాని ఓ మూల శవంలా పడివున్న లజ్జ దీర్ఘమైన శ్వాస తీసుకుంది. తలుపులు తెరుచుకున్నాయి. బరువైన అడుగులతో రూప్ చంద్ జి దొంగలా ఎదురుగా, ఖాళీగా పడివున్న ఇంటిని చూడటానికి బయటికొచ్చి కాసేపు ఆ ధూళి మేఘంలో ఎడబాసిన వదనాలను వెతికే ప్రయత్నం చేసాడు. కాని ఓడిపోయిన తన చూపుల్లో అపరాధ భావం నిండగా జీవం కోల్పోయిన తలుపుల గుండా, దారి తప్పుతూ తిరిగి అతని చూపులు నేలలోకి చొచ్చుకొనిపోయాయి.

జీవితం మొత్తంలో గడించిన వాటిని ఆ అల్లాహ ఇష్టానికే వదిలేసి వైభవం కోల్పోయిన వాకిట్లోకి వచ్చి నిలబడితే చంటి పాపలాంటి అమ్మ హృదయం భయంతో ముడుచుకుపోయింది, ఎలాగైతే నాలుగు వైపుల నుండి దయ్యాలు చుట్టుముట్టి తనను పట్టుకుంటాయా అన్నట్లు. ఆ క్షణంలో కళ్ళు తిరిగి స్తంభానికానుకుంది. ఆసరా కోసం. ముందు దృశ్యం కనపడగానే కడుపులోని కార్జo నోటిలోకి వచ్చింది. ఈ గదిలోనే కదా, పెళ్ళికొడుకు ఒడిని తనదిగా చేసికొని వచ్చాను. ఇక్కడే కదా మొగ్గలాంటి బెదురు కన్నుల ముగ్ధ, అమాయకమైన వదనంతో పెళ్ళికూతురిలా వచ్చిoది. తన చంద్రబింబం లాంటి ముఖంపై నుండి ముసుగు తొలిగించబడినది. ఇక్కడే కదా, అతను జీవితాంతం తోడువుంటానని బాస చేసింది. ఆ ఎదురుగా, మూలనున్న గదిలోనే తొలి కాన్పు జరిగింది. ఆ మూలనే మాయిముంతను నేలలో నిక్షిప్తం చేసింది. పెద్ద కూతురు జ్ఞాపకం ఒక్కసారిగా జ్వాలలా ఎగసి గుండెను చుట్టుకుంది. ఒక్కటి కాదు, రెండు కాదు అలా పది వరకు జరిగాయి. పది ఆత్మలు తమ మొదటి శ్వాస ఇక్కడే తీసుకున్నాయి. పది రక్తమాంసాల ముద్దలు ఇక్కడే కదా మనుషులుగా మూర్తీభవించి ఈ పవిత్రమైన గదిలో జన్మలెత్తాయి. వాళ్ళే గదా ఈ పవిత్రమైన గర్భగుడిని ఈ రోజు వదిలేసి వెళ్లిపోయారు. శాంతి, సుఖజీవనం వెతుకులాటలో, రూపాయికి నాలుగు కిలోల గోధుమల కోసం పరుగులు తీసింది. తమ చిన్ని చిన్ని ముద్దుగుమ్మల నాజూకైన, సొగసైన ‘ఆ, గూ, ఆ, గూ‘ అన్న సుస్వరాల శబ్దాలు ఇప్పటికీ ఈ గదిలో ప్రతిధ్వనిస్తూనే వున్నాయి. ఒక్కసారిగా ఆ గది లోకి వెళ్లి తన ఒడిని పరిచింది. కానీ ఆ ఒడి శూన్యంగానే వుండి పోయింది. ఏ ఒడినైతే ముత్తైదువులు పవిత్రంగా భావించి, తాకి ఆ చేతిని తమ పొత్తికడుపులపై వుంచుకునేవారు. ఆ ఒడి ఈ సమయం అనాథలా బావురుమంటుంది. గది ఖాళీ గా వుండి విషాద వీచికలు వీస్తుంది. పిచ్చిదానిలా అక్కడి నుండి వెనక్కి తిరిగింది. తాను వెనుతిరిగింది కానీ ఆమె కాళ్ళు కాదని మొరాయించాయి. వేరే గదిలో తటపటాయిస్తూ వుండిపోయింది. ఇక్కడే జీవిత భాగస్వామి యాభై సంవత్సరాలు కాపురం చేసి ముఖం చాటేసాడు. ఈ దర్వాజా ఎదురు గానే గదా కఫన్ లో చుట్టి శవాన్ని పడుకోబెట్టింది, పరివారమంతా చుట్టూ నిలబడి చూస్తూ వుండిపోయింది. అదృష్టవంతుడు, ఐనవాళ్ళందరూ ఎదురుగా వుండగానే పరలోక ప్రాప్తి చెందాడు. కానీ , తన జీవిత భాగస్వామిని మాత్రం వదిలివెళ్లాడు. ఈ రోజు తాను కఫన్ లేని శవంలా, అనాథలా పడివుంది. ఎక్కడైతే తన పెనిమిటి తల దగ్గర వణుకుతున్న చేతులతో సంవత్సరాలుగా దీపం వెలిగించేదో అక్కడే కాళ్లు జవాబుగా కూలబడిపోయాయి. ఈ రోజు దీపంలో నూనె లేదు, వత్తి కూడా పూర్తిగా కాలిపోయింది.

ఎదురుగా రూప్ చంద్ తన వరండాలో వేగంగా పచార్లు చేస్తూ పెళ్ళాం, పిల్లలను తిట్టసాగాడు. నౌకర్లను, ప్రభుత్వాన్ని, తన ఎదురుగా బోసిపోయివున్న రోడ్డును, రాయి రప్పను, కత్తులు -కటార్లను అంతేకాదు పూర్తి ప్రపంచాన్నితన తిట్ల దండకంతో కుమ్మేయసాగాడు. ఇంకా విశేష మేమిటంటే, ఇతనే స్వయంగా ఈ అనర్ధానికి కారణమన్నట్లు రోడ్డుకావల ఖాళీగా పడివున్న ఆ ఇల్లు ఇతన్ని మొహం పట్టి వెక్కిరించసాగింది. అనేక సంఘటనలను తన మష్తిష్కం లోంచి తీసి పారెయ్యాలని, పూర్తి శక్తి తో వాటిని పెకిలించి వేయాలని ప్రయత్నించసాగాడు. కానీ తన వల్ల సాధ్యం కాక పరాజితుడై కుప్పకూలిపోయాడు. వంచనకు గురిచేసే వేర్ల మాదిరి, ఏ విషయమైతే అతని అస్తిత్వoలో గూడు కట్టుకుందో అది తన సర్వ శక్తులతో అతన్ని పట్టిలాగుతున్నాయి. ఆ శక్తులు తన మాంసపు కండరాలను లాక్కుని వస్తున్నాయా అన్న బాధతో విలవిల్లాడిపోయాడు. ఒక్కసారిగా అతని తిట్ల దండకం ఆగిపోయింది. దానితో పాటు పచార్లు కొట్టడం ఆగిపోయింది. చివరికి మోటారు వాహనంలో కూర్చొని వెళ్ళిపోయాడు.

చీకటి పడింది. సందు మూలమలుపులో నిశ్శబ్దం రాజ్యమేలసాగింది. వెనక దర్వాజా నుండి రూప్ చంద్ భార్య వడ్డించబడిన రెండు ప్లేట్లను ఒక దానిపై ఒకటి వుంచి లోపలికి దొంగలా వచ్చింది. ఇద్దరు వృద్ధ స్త్రీలు మౌనంగా ఒకరికొకరు ఎదురుగా కూర్చున్నారు. నోళ్లు మౌనం వహించాయి, కాని కళ్ళు మాత్రం మాట్లాడుతూనేవున్నాయి. రెండు ప్లేట్లలోని అన్నం ఎలా వుందో అలానే వుండిపోయింది. ఆడాళ్ళు ఎప్పుడైతే వేరే వాళ్లకు వంకలు పెట్టాలని చూస్తారో అప్పుడు నాలుకలు కత్తెరలా నడుస్తాయి. పాపం, భావోద్వేగాలు దాడి చేస్తే మాత్రం నోటికి తాళాలు పడతాయి.

రాత్రంతా జ్ఞాపకాల దొంతర్లు ఎడతెరిపిలేకుండా ఎందుకో ఒంటరి దాన్ని చేసి ఒక్కసారిగా దాడి చేయసాగాయి. ఏమవుతుందో ఎవరికి తెలుసు, దారి మధ్యలోనే అందరూ మృత్యు వాత పడరని? ఈ మధ్య కాలంలో ఎన్ని రైళ్లు పట్టాలు తప్పిపోవడం లేదు..! యాభై సంవత్సరాలు రక్తం ధారపోసి పొలాలను పండించాము, మరి ఈ రోజు కొత్త నేల అన్వేషణలో కట్టుబట్టలతో దేశాన్నేవదిలి వెళ్లాల్సి వచ్చిందా? ఎవరికి తెలుసు కొత్త నేల ఈ మొక్కలకు కలిసి వస్తాయో లేదో! అమాయకమైన ఈ దేశపు మొక్కలు మృత్యువాత పడవు కదా!? చిన్న కోడలు నిండు గర్భిణీ, తెలియదు ఏ అడవిలో బాలింతగా ఆశ్రయం పొందాల్సి వస్తుందో? ఇల్లు, కుటుంబం, ఉద్యోగం , వ్యాపారం అన్నీ వదిలేసుకొని పోయారు. కొత్త దేశంలో కాకులు, గద్ద లు ఏమైనా వదిలేసి వుంటాయా? ఈ ప్రాణం అలసిపోయేలోగా తిరిగి వస్తారా? తిరిగి వచ్చాక తమ మూలాలను గట్టిపర్చుకోవడానికి అవకాశం దొరుకుతుందో? లేదో? ఈ ముసలి ప్రాణం వాళ్ళు తిరిగి వచ్చే సమయానికి జీవించివుంటుందో ? లేదో ? ఎవ్వరికీ తెలియదు.

అమ్మ ఇప్పుడు ప్రాణం లేని రాతి బొమ్మ. నిద్ర మాట దేవుడెరుగు , రాత్రంతా బిడ్డల తెగిపడిన శవాలు, యవ్వనంలో వున్న కోడళ్లను నగ్నంగా ఊరేగించడం, మనవళ్ల పిర్రల మీద వాతలు కమిలి, తేలిన బొబ్బలు అన్నీ మనసు తెర మీద కదలాడి ముసలి శరీరం వణికి పోయింది. ఎప్పుడు కునుకు పట్టిందో తెలియదు? దర్వాజా దగ్గర ఏదో పెద్ద గొడవ జరుగుతున్నదన్న అనుమానం కలిగింది. ప్రాణం మీద తీపి లేకపోవచ్చు కానీ నూనె లేక ఆరిపోయే సమయంలో దీపం కూడా వణికిపోతోంది. చావు సాధారణమైనదైనా అది ఎంత నిర్దయగా వుంటుందంటే మనిషి రూపంలో దయ్యమై ఎదురు పడుతుంది. వృద్ధ స్త్రీలైనా జుట్టు పట్టి రోడ్లెoబడి ఈడ్చుకుంటూ లాక్కెళతారని విన్నాను. అంతేకాదు చర్మం ఒలిచి, ఎముకలు బయటికి కనబడేటట్లు చేసి ఎంతగా హింసిస్తారంటే చివరికి ఆ యాతన చూసి యమదూతలు కూడా భయపడిపోతారు.

దర్వాజా మీద చప్పుడు ఎక్కువ కాసాగింది. యమరాజుకు తొందరెక్కువైంది. మళ్ళీ అంతలోనే తలుపుకున్న సంకెళ్లు వాటంతట అవే తెరుచుకోసాగాయి. వత్తులు వెలగసాగాయి. దూరంగా వున్న బావి అడుగు నుండి ఎవరిదో గొంతు వినిపించింది. బహుశా పెద్ద కొడుకు పిలుస్తున్నాడు? కాదు, కాదు చిన్న కొడుకు, నడిపి కొడుకుల గొంతులు అవి. ధ్వంసమైన మరోప్రపంచం మూల నుండి. ఐతే అందరికి వారి దేశం దొరికిపోయిందా? ఇంత త్వరగా? సంజ్లా! వెనకాల చిన్నోడు, సరిగానే నిలబడియున్నారు. ఒళ్ళో పిల్లల్ని ఎత్తుకొని కోడళ్ళు , మళ్ళీ ఒక్కసారిగా పూర్తి ఇంటి వాతావరణం, పరివారం తిరిగి జీవం పోసుకుంది. అన్ని ఆత్మలు మేల్కొన్నాయి. దుఃఖితురాలైన తల్లి దగ్గరికి చేరుకుంటున్నాయి. చిన్న, పెద్ద చేతులు ప్రేమతో స్పర్శించసాగాయి. ఎండిన పెదవుల మీద తిరిగి కొత్త చివుర్లు పూసాయి. ఆనందం అవధులు లేకుండా గజిబిజిగా చీకట్లో గంతులేస్తూ మాయమవ్వసాగాయి. అప్పుడు కళ్ళు నెమ్మదిగా తెరుచుకున్నాయి. పరిచయం వున్న వేళ్ళు నుదుటి మీద పాకసాగాయి.

“అరె వదినా, నన్ను అలా పిలిస్తే వచ్చేసే వాణ్నిగదా. ఈ నాటకాలన్నీ ఎందుకేస్తావు.” రూప్ చంద్ జి పర్దా వెనకనుండి సరదాగా చెప్పసాగాడు .

“ఔను, వదిన, కనీసం ఈ రోజైనా ఫీజు ఇప్పించు.” చూడు నీ పనికిమాలిన వెధవలను తీసుకురావడానికి జంక్షన్ కు వెళ్లి పట్టుకొచ్చాను. పరిగెత్తుకు పోతున్నారు, బద్మాష్ గాళ్ళు? పోలీస్ సూపరింటెండెంట్ ను కూడా నమ్మటం లేదు.

ఎదురుగా వున్న దృశ్యం, మళ్లీ ముసలి పెదవుల మీద కొత్త ఆశల వసంతాన్ని పూయించింది. నెమ్మదిగా లేచి కూర్చుంది. కాసేపు మౌనంగా వుండిపోయింది. రెండు వెచ్చని ముత్యాలు ఆమె కంటినుండి జారి ముడుతలు పడిన రూప్ చంద్ చేతి మీదకి రాలిపడ్డాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com