
సుంకర రమేశ్
ఎన్ని సార్లు చూసానో
పిట్టలు గూడు కట్టుకుంటున్న తీరు
మనసు ముచ్చట పడిందే గాని
వాటిలా నాకొక సొంత ఇల్లు కోసం
గట్టి కృషి చేయలేదన్నడు
వాటికేం ఉచితంగా
చెట్లమీద చేరుతాయి, కొంటే కానీ
తెలియదనుకున్న
గిజిగాడు గూడు కట్టుతున్నప్పుడూ
దాని అందమైన అల్లికను చూసి
దాని కుషన్ పరువును చూసి
సృష్టి రహస్యానికి
విధాత విశ్వవిన్యాసానికి
పరవశించానే కానీ
నేనెన్నడు ప్రయత్నించిందీ లేదు
దాని నిర్మాణ కౌశలాన్ని
కంటి కెమెరాలోనే
దాచుకున్నాను కానీ
నేలపై ముగ్గు పోసింది లేదు
ఇళ్లంటే మాటలా అని
దాట వేసానే కానీ
నూరు గజాలు కొన్నది లేదు
ఇదిగో ఇప్పుడు
కరోనా రేపిన కల్లోలానికి
కళ్ళు తెరిచాను
ఇల్లు లేని
నరకమెంతో కళ్ళముందు
కదలాడుతున్నది
కాలం నది వెంట
నడుచుకుంటూ వెళ్ళాను
కళ్ల ముందర వసంతాలెన్నో
వచ్చి వెళ్ళాయి
కానీ ఇలపై
సొంతింటి కల ఎండమావి
ఐనది
ఇక కలల రాజమందిరం
అక్కరలేదు
విలాస విల్లాలు వద్దు
వ్యవసాయ క్షేత్ర విహార గృహ శోభ లొద్దు
మన మనో మందిరంలో
మౌనగీతాలు ఆలపించడానికో
చిన్న ఇల్లోకటి చాలు
ఆంక్షలు, ఆక్రందనలు లేని
అరుపులు ,ఆరళ్లు లేని
ఒక బొమ్మరిల్లు కావాలి
పగలు,ప్రకోపాలు లేని
ప్రశాంత కుటీర మొకటి కావాలి
కిటికీ తెరిస్తే కాసిన్ని
వేకువ కిరణాలు రావాలి
వెన్నెల కురిసే వాకిలోకటి కావాలి
పిచుకుల బారు రయ్యు మని
సాగే లోగి లొకటి ఉండాలి
ఇంటి ముందర నందివర్దనం
విరగపూయాలి
మన ఊసుల ఊయల లూపే
ఏకాంత మందిరమొకటి కావాలి
నీటిలో చేపపిల్ల కదిలినట్టు
మనం నడవడానికో నేల కావాలి
కనుదోయి నిదురోయే
కలల కొలనొకటి కావాలి
హృదయానికి హాయి రాగం పలికే
ప్రేమపొదరిల్లు కావాలి