-డా.రేవూరు అనంతపద్మనాభ రావు

అచ్చర భామనీ! మిసిమి యందపు బొమ్మ వరూధినీ! నినున్

మెచ్చె వసంతకాంతులను మించెడి చక్కదనాల ప్రోడయో

సచ్చరి తుండు మంచుమల సాంతము జూచు నెపాన వచ్చెనీ

వచ్చెరు వంద; నదృష్టమటన్న నీదేగద! ఎంతవారికిన్

నీదు హృదజ్ఞ మందు కరుణించెను సోగదనమ్మ చందమామకొన్

జోదగురాజు వచ్చెడిని చూడుమదే, ప్రవరాఖ్యుడే సుమా!

వాదున కట్లు త్రోసె నిను, వాని మనమ్మున గల్గె ప్రేమ నిం

పాదిగ నేగు దెంచెడిని వాడె సుమాస్త్రుడు ఓవరూధినీ!

కన్నియవేట నీ మనసు కాంక్షిత మింతలు నంతలై కడున్

వన్నెలు చిన్నెలై కడుపు పంట స్వరోచికి దోహదమ్ముగా

సన్నుత వంశ సంభవుడో సారగభీరుడు మంచు కొండకున్

తిన్నగ పర్వులెత్తె గద! దేవుని లీల లెరుంగ నేర్తుమే!.

మాయలు పన్ని మోసముగ మాటలు పల్కిన వీని నమ్మి నీ

సోయగ మప్పజెప్పితివి; చోద్యముగాదె తిరస్కరించియున్

పోయిన వాడు వచ్చుటన మోసము గాదటె, దోషకారియై

హాయిగ ఖేచర ప్రవరు డాదట నేగెను మోసబోతిన్!

మోసము సుమ్మి- ఎట్టి పొర పొచ్చెములేక యెడంద నమ్మి ఆ

భూసురు డేయటంచు కడు మోసము నందితి; గుండె వ్రయ్యలే

నో సుదతీ! నిజంబు విన, నోర్వగ లేవమాన బాధ- ఆ

వేసము జూచి మోసపడి వెంగలివైతివి ఓ వరూధినీ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com