మనిషి విజ్ఞానంతో పాటు వంచన చేయడం ఎట్లా సాధించాడో చెప్పే కథ…

“చిత్రగుప్తా, ఈ అవిశ్రాంత కార్యక్రమాల వల్ల నా శరీరం బాగా అలసిపోయింది. మనసు కొంత విశ్రాంతిని కోరుకుంటుంది” యమధర్మరాజు ముఖంలో కొట్టచ్చినట్టు అలసత్వం కనిపిస్తుంటే చిత్రగుప్తునితో తన బాధంతా వెల్లడించుకున్నాడు.

ఎవరూహించని కరోనా మహమ్మారి మూలంగా ప్రపంచ వ్యాప్తంగా చాలా మరణాలు సంభవిస్తుంటే డాక్టర్లు, నర్సులతో సమానంగా నరకంలో యమపురిలో యమధర్మరాజు సంస్థానం కూడా అలుపు సొలుపూ లేకుండా పనిచేస్తున్నారు.

ఎవరూహించని కరోనా మహమ్మారి మూలంగా ప్రపంచ వ్యాప్తంగా చాలా మరణాలు సంభవిస్తుంటే డాక్టర్లు, నర్సులతో సమానంగా నరకంలో యమపురిలో యమధర్మరాజు సంస్థానం కూడా అలుపు సొలుపూ లేకుండా పనిచేస్తున్నారు.

భూలోకంలో మోసాలు,పాపాలు చేసే వారు ఎక్కువకావడం, కరోనా కష్టకాలం మొదలయ్యినప్పటి నుండి చచ్చిన ప్రతివాడు సరాసరి నరకానికే పోవడం వల్ల అక్కడ ఎవ్వరికీ ఒక్క క్షణం కంటిమీద కునుకులేకుండా అవుతుంది.

“స్వామీ, మీ పరిస్థితి చూసి నేనూ అదే చెపుదాము అనుకున్నా! మీకు విశ్రాంతి అవసరం. అక్కడ దేవేంద్రుల వారిని చూడండి. వచ్చే ఒకటీ,అరా కేసుల్ని చూస్తూ హాయిగా కాలు మీద కాలు వేసుకుని ఎలా కూర్చున్నాడో!” యమధర్మరాజుని ఉడికించాలని అన్నాడు చిత్రగుప్తుడు తన పని భారం కూడా కొన్ని రోజులు తప్పించుకోవాలని చూస్తూ.

“వైద్యులు కరోనాకి టీకా కనిపెట్టారు అని వార్త చూసాను, ఇప్పుడు మనకెట్లాగు కొంత పని భారం అయితే తగ్గుతుంది. ఆ ఏర్పాట్లేవో చేయి మరి!” చిత్రగుప్తునికి పని పురమాయించాడు యమధర్మరాజు.

“ఈ సారి భూలోకం లోనే భూతలస్వర్గం అని పేరు గాంచిన కొత్త ప్రదేశానికి తీసుకెళ్తాను. మనకెలాగూ ఇక్కడి స్వర్గలోకానికి అనుమతి లేదు” అన్నాడు ఎప్పటినుండో అమెరికాకు వెళ్ళాలి అని కోరికతో ఉన్న చిత్రగుప్తుడు.

“ఏదీ? హైదరాబాద్ నగరమే కదా?” అన్నాడు యమధర్మరాజు అక్కడ తిన్న హిమక్రీములు గుర్తుకు వచ్చి నోట్లో లాలాజలం ఊరుతుండగా.

“ఆ..అప్పుడెప్పుడో ఎన్ టీ ఆర్ జమానా నుండి ఇప్పటి జూనియర్ ఎన్ టీ ఆర్ జమానా వరకూ అక్కడికే వెళ్తున్నాము కదా స్వామీ! ఈ సారి తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్న ఒక విదేశానికి వెల్దాము. ఆ దేశంపేరు అమెరికా” అన్నాడు చిత్రగుప్తుడు.

“ఓ అమెరికానా? అటులనే కానివ్వు! “ అన్నాడు ఉత్సాహంగా యమధర్మరాజు.

“మానవులు అవలంభిస్తున్న ‘రిమోట్-వర్క్ ఫ్రొం హోమ్’ పద్ధతిన మనము అక్కడి నుండే అన్ని శిక్షలు అమలు చేయవచ్చు స్వామీ! ” అని మొత్తం ప్రణాళిక వివరించాడు చిత్రగుప్తుడు.

“భేష్ చిత్రగుప్తా భేష్ .. ప్రయాణానికి సిద్ధంకండు!” ఆర్డర్ జారీ చేసాడు యమధర్మరాజు.

ముందుగా అనుకున్నట్టుగానే అమెరికాలో న్యూ యార్క్ లో ఒకపెద్ద రిసార్టులో దిగారు యమధర్మరాజు, చిత్రగుప్తుడు. బాగా అలసి పోయిన ఇద్దరికీ మంచి నిద్రపట్టేసింది. కొన్నిగంటల కుంభకర్ణ నిద్ర అనంతరం మెలుకువ వచ్చింది యమధర్మరాజుకి. చుట్టూ చూసాడు. ఎక్కడా చిత్రగుప్తుని జాడ కనిపించలేదు.

కిటికీ ద్వారా బయటకు చూస్తే పెద్ద పెద్ద మంచు కొండలు. ఎక్కడా జన సంచారం లేదు. స్వర్గంలో- నరకంలో కనపడే మంచుకొండలే ఇక్కడా కనపడేసరికి కోపం నశాలానికి అంటింది.

“యముండ!” అరిచాడు గట్టిగా యమధర్మరాజు. ఆ అరుపులకి రిసార్ట్ అంతా మారు మ్రోగిపోయింది.

“ చిత్ర గుప్తా .. నాకు ఏదో భూతలస్వర్గం చూపుతావు అని ఇక్కడికి తీసుకొచ్చి పడేసావు. ఎక్కడ చూసిన మంచుగుట్టలు తప్ప మానవసంచారమే లేదే? ఎక్కడున్నావు?” చిర్రెత్తుకొచ్చిన యమధర్మరాజు గధని భుజంపై పెట్టుకుని బెడ్ రూమ్ నుండి హాల్లోకి, హాల్లో నుండి బెడ్ రూమ్ లోకి తిరుగుతున్నాడు ఆవేశంగా.

గడియారంలో సమయం ఉదయం తొమ్మిది గంటలు చూపుతుంది. కొద్ది సేపటి తర్వాత మెల్లిగా తలుపు తెరుచుకుంది. ఒక అందమైన యువతి చీరకట్టులో రాజకుమారిలా వెలిగిపోతూ నాజూకు నడకతో యమధర్మరాజుని సమీపించింది. ఆ అమ్మడి ఒంటికి రాసుకున్న అత్తరుపరిమళం ఒక్కసారిగా యమధర్మరాజు మత్తుని వదిలించింది.

యమధర్మరాజు కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. రంభ, ఊర్వశి, మేనక,తిలోత్తమలను చూసి విసిగిపోయిన కళ్ళకు ఆ అమ్మాయి మరింత అందంగా కనిపించింది. వయ్యారంగా నడుస్తూ యమధర్మరాజు నిల్చున్న దగ్గరకు వచ్చింది.

“ఎవరు బాలికా నువ్వు ,మా చిత్రగుప్తుడిని కాని చూసావా?” ఆశ్చర్యంలోంచి తేరుకుని అడిగాడు యముడు.

“స్వామి నాపేరు చిత్రగుప్తి. మహిళా కోటాలో నాకు ఈ ఉద్యోగం ఇచ్చి చిత్రగుప్తుల వారు నిన్ననే స్వీయ విద్యోగవిరమణ తీసుకున్నాడు. ఫ్లోరిడా లో ఒక వెకేషన్ హోం తీసుకొని అక్కడే సెటిల్ అవుతాడని మీతో చెప్పమన్నాడు” అంది వినయంగా చిత్రగుప్తి.

“యముండ! ఏమిటి.. చిత్రగుప్తుడికి ఉద్యోగవిరామణా?” కోపంతో,అసహనంతో అరిచినంత పనిచేసాడు యమధర్మరాజు.

“అవును స్వామీ, అమెరికా చట్టం ప్రకారం పదవీ విరమణ వయసు అరవై ఎనిమిది సంవత్సరాలు అని తెలుసుకొని పదవీ విరమణకి నిర్ణయించుకున్నారు” అసలు విషయం చెప్పింది చిత్ర గుప్తి.

“అంత మోసం చేస్తాడా చిత్రగుప్తుడు! చూద్దాం ఎన్నిరోజులు నా నుండి తప్పించుకు తిరుగుతాడో! ఇంతకీ నీకు ఈ అవకాశం ఎలా వచ్చింది?” అంత ఆవేశంలో కూడా సందేహం వచ్చింది యమధర్మరాజుకి.

“స్వామీ ..ఇక్కడే రెసెప్షనిస్టుగా పని చేస్తున్న నాకు ఎక్కువ జీతం ఆశ చూపడంతో ఈ రోజు నుండి ఈ వృత్తిలో చేరాను” అన్ని వివరాలు చెప్పింది చిత్రగుప్తి.

“యముండ!” గట్టిగ అరిచాడు ఆవేశంతో. బాగా అలసి పోయిన యముడికి బి.పీ కూడా పెరగడంతో సోఫాలో కూలపడిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న మెడికల్ కిట్ నుండి రెండు బి.పీ మాత్రలు తీసి కొన్ని నీళ్లు ఇచ్చింది. యమధర్మరాజు వాటిని గుటుక్కుమని మ్రింగి కొంత శాంత స్వరూపాడయ్యాడు.

“యముండ! మా పై అంత దారుణానికి ఒడిగడతాడా చిత్ర గుప్తుడు. చూస్తుండు నేను చిత్రగుప్తుని పై ఎలాంటి చర్యలు తీసుకుంటానో? అయినా ఒక మహిళ చిత్రగుప్తుని వృత్తి చేయుటమా..? ఇది అసంభవం!” కోపంతో ఊగిపోయాడు యమధర్మరాజు.

“అసంభవం కాదు స్వామీ, సంభవమే! మీరు మరొక్కసారి అలాంటి మాటలు మాట్లాడినచో ఇక్కడి మహిళా సంఘాలు మీపై పరువు నష్టం దావా వేయును. మీకు ఏ పని కావాలో, ఎవరి చిట్టా కావాలో అడుగుము. క్షణంలో మీ ముందు ఉంచెదను! అంతే కానీ, మహిళా సామర్థ్యాన్ని తక్కువ చేసి చూడకండి!” అంతే ధీటుగా జవాబిచ్చింది చిత్రగుప్తి.

“చిత్రగుప్తా ..” కోపంగా అరిచాడు యముడు

“పొరబాటు స్వామీ.. చిత్ర గుప్తి! “ సరిదిద్దింది.

“హు ..ఇది హెచ్చరికా లేక విన్నపమా?” హుంకరించాడు.

“ఇది హెచ్చరికే! “ అంతే వేగంగా జవాబిచ్చింది చిత్రగుప్తి.

“మాతోనే పరిహాసమా? అది ఎలా సాధ్యం? ఎన్నో రోజుల నుండి ఈ వృత్తిలో ఉన్న మాకే సాధ్యం కానప్పుడు, ఈ రోజే వృత్తిలో చేరిన నీకు ఎలా సాధ్యం? “ చిత్రగుప్తి దబాయింపుకు ఖంగుతిన్న యమధర్మరాజు కొంచెం తగ్గాడు.

“ఇప్పుడు దారిలో పడ్డారు స్వామి” అని మనసులో అనుకుంది చిత్రగుప్తి. టేబుల్ పైన ఉన్న బ్రేక్ఫాస్ట్ బార్ ని ఇచ్చి తినమంది. బాగా ఆకలిగా ఉన్న యముడు ఆవురావురని ఒక్క గుక్కలో మింగేశాడు. ఇప్పుడు కొంత స్థిమితపడ్డాడు యమధర్మరాజు.

“మీకు ఎవరి చిట్టా కావాలో చెప్పండి. చిటికె లో మీ ముందు ఉంచుతా! అంతే కాని నా సామర్థ్యాన్ని తక్కువ చేసి చూస్తె ఊరుకునేది లేదు” వార్నింగ్ ఇచ్చింది చిత్రగుప్తి.

“అబ్బో! మహిళా శక్తి అట!! అని మనసుకులో అనుకుని, కొంత నవ్వుకున్నాడు యమధర్మరాజు.

కొద్ది సేపు కళ్ళు మూసుకుని అలోచించి, చిత్రగుప్తి అరచేతిలో అంజనం వేసి ఒక వ్యక్తి రూపాన్ని చూపుతూ “ఈ మానవుడి చిట్టా విప్పుము” అని చెప్పి మీసము పై చేయి వేసి ఒక చిరు మందహాసం చేసాడు యమధర్మరాజు.

చిత్రగుప్తి ఆ వ్యక్తిని చూసి, “ఓ.. ఇతడేనా?” అని మనసులో అనుకోని పక్క రూములోకి వెళ్ళింది.

“ఒక వ్యక్తి వివరాలు కనుక్కోవడం కోసం ఎంత కష్టమో తెలియదు పాపం! మేము ఎన్ని రోజులు కూర్చుంటే, ఎన్ని గ్రంథాలు తిరగేవేస్తే అతడు చేసిన పాప పుణ్యాల చిట్టా దొరుకుతుంది? ఎలాగూ ఈ బాలిక ఆ చిట్టా సంపాదించలేదు. ఈ నెపంతో ఇప్పుడే ఉద్యోగంలోంచి తీసివేసి మళ్ళీ చిత్రగుప్తుని రప్పించెదను” అని మనసులో అనుకుని, నవ్వుకొని “యముండ!” అని తన తెలివికి తానే మురిసిపోయాడు యమధర్మరాజు.

పక్క రూములోకి వెళ్లిన చిత్రగుప్తి తన లాప్టాప్ ఓపెన్ చేసి, అక్కడి ప్రింటర్ కి కనెక్ట్ చేసింది. వికీపీడియాలోని వివరాలను ప్రింట్ చేసి ప్రింట్ అవుట్ తో బయటకు వచ్చి యమధర్మరాజు చేతికందించింది.

ఆ పేపర్ పై ఉన్న చిత్రం చూసి వివరాలు చూసి ఖంగుతిన్నాడు యముడు. ఆశ్చర్యచకితుడై చిత్రగుప్తి ఇచ్చిన వివరాలు చదవాడు.

“ఇతను మాయబజార్ చలనచిత్రం లోని ‘సత్యపీటం’ లాంటి యంత్రాన్ని వాడుకలోకి తెచ్చి ఐ-పాడ్, ఐ-ఫోన్ లాంటి పరికరాలను కనిపెట్టి దూర ప్రాంతాల్లోని సామాన్య ప్రజానీకం ఒకరిని ఒకరు చూసుకుంటూ మాట్లాడే వీలు కల్పించారు. కంప్యూటర్ రంగంలో ఒక సాంకేతిక విప్లవాన్ని లేపాడు. ఇతని పేరు స్టీవ్ జాబ్స్ . ఇతడు చాలా మందికి ఆదర్శంగా నిలిచాడు, అనారొగ్యంతో యాభై ఆరవ ఏట మరణించారు” అని చదివాడు యముడు.

కళ్ళు మూసుకుని తన పాశాన్ని గాల్లో పెట్టి ఒక చిన్న శ్లోకం చదివాడు. వెంటనే ఒక చిట్టా యముడి చేతిలో ప్రత్యక్షం అయ్యింది. యువతి ఇచ్చిన చిట్టాతో పోల్చి చూసాడు. అన్ని వివరాలు సరిగ్గా సరిపోయాయి. నమ్మలేక పోయాడు యముడు.

“బహుశా ఇదంతయూ ఆ చిత్రగుప్తుని మాయ అయుంటుంది. చిత్రగుప్తా.. నాతోనే పరిహాసమా? ఇప్పుడు చూద్దాం నీవెలా ఈ అమ్మడికి సహాయపడుతావో?“ అని మనసులో అనుకుని కళ్ళు మూసుకొని బాగా అలోచించి ఇప్పుడు ఇంకొక వ్యక్తి రూపాన్ని ఆ యువతి అరచేతిలో అంజనం వేసి చూపాడు యమధర్మరాజు.

ఆ రూపాన్ని చూసిన యువతి “ఓ ఇంతేనా? ఇది చాలా సులభం” అనుకుంటూ ఇలా లోపలికి వెళ్లి అలా బయటకి వచ్చింది ప్రింట్ అవుట్ తో.

అంతలోనే తిరిగి వచ్చిన యువతిని చూసి యముడు చాలా సంతోషంగా “నేను అనుకున్నానులే, ఇది నీ వల్ల కాదు అని! కొన్ని దశాబ్దాలుగా కోటాను కోట్ల మంది జనన మరణాలను, పుట్టు పూర్వోత్తరాలను రాసిన మాకే సవాలా ? సరే మీరు వెళ్లి చిత్రగుప్తుని తీసుక రండు, ఈ సారికి క్షమించి వదిలేస్తున్నాను” అని మరొక్క సారి మీసాల మీద చేయి వేసి “యముండ” అన్నాడు విజయ గర్వం తో యమధర్మరాజు

ఆ గర్వము నుండి తేరుకోక ముందే చిత్రగుప్తి తనచేతిలోని వివరాలు యముడికి అందచేసింది. ఖంగుతిన్నాడు యమధర్మరాజు. “ఇంత త్వరగా అన్నివివరాలు సేకరించడమా?” అని ఒకటికి రెండు సార్లు కాగితాన్ని అమ్మాయిని తేరపార చూసాడు. మళ్ళీ కళ్ళు మూసుకొని తన పాశాన్ని గాల్లో పెట్టి శ్లోకం చదివి చేతిలో చిట్టా రాగానే చదివాడు.

వివరాలు ఇలా చదివాడు “ఇతను కోటాను కోట్ల యువతీ యువకులకి తన ఆట పాటలతో వినోదాన్ని పంచాడు. ముఖ్యంగా యువతని తనదైన స్టయిల్లో స్టెప్పులు వేస్తూ ఉర్రూతలూగించెను. ఇతని పేరు మైఖేల్ జాక్సన్, అనుమానస్పద తీరులో, ఒక ఔషదం వికటించి మరణించెను”. రెండిటిలో వివరాలు పోల్చి చూసుకుని సంభ్రమాశ్చర్యాలకు గురి అయ్యాడు యమధర్మరాజు.

ఆ తర్వాత ప్రముఖ నిర్మాత రామానాయుడు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, గాన గంధర్వుడు బాలు,బాస్కెట్ బాల్ ప్లేయర్ కోబి బ్రయంట్, నటులు జయప్రకాశ్ మరి కొంత మంది ప్రముఖుల వివరాలు యమధర్మరాజు అడగడం, చిత్రగుప్తి చిటికెలో చూపడం జరిగింది.

“భేష్ బాలికా భేష్! మేము మీ పని వల్ల చాలా సంతృప్తి చెందినాము. అదియును కాక చిత్రగుప్తుని పనివల్ల మేము బాగా విసిగిపోతిమి” కొంత సంతోషంతో ఉప్పొంగి పోతూ, చిత్రగుప్తుని పై అసహనాన్ని ప్రదర్శించాడు యమధర్మరాజు

“అదేమిటీ స్వామీ, కొన్ని శతాబ్దాలుగా వారి సేవలు ..” అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది చిత్రగుప్తి.

ఆ మాటలను మధ్యలోనే ఆపి “ఆ .. ఒక్కరి చిట్టా తీసుకురావడానికి కనీసం వారం రోజులు తీసుకుంటున్నారు ఈ మధ్య చిత్రగుప్తులవారు. దానికి తోడు కొంత మతిమరుపు వ్యాధి కూడా సోకినట్టు మా అంతరిఅంగిక వైద్యుల అనుమానం!

చిత్రగుప్తుడు చిట్టా ఇచ్చే వరకు, మరణించిన వారిని స్వర్గానికి తీసుకు పోవాలో, నరకానికి తీసుకు పోవాలో తెలియక ఒక ప్రత్యేక బస ఏర్పాటు చేసి అందరికీ సమాన గౌరవం ఇస్తున్నాము. ఈ చర్య వల్ల మేము ఆర్థికంగా బాగా నష్ట పోయాము, ఇంకా నష్ట పోతూనేఉన్నాము. ఒక్క రోజులో నూనె లో దేవించి బుగ్గి కావల్సిన వారు కూడా వారం రోజుల వరకు స్వర్గానికి వెళ్లే వారితో సమానంగా రాజభోగాలు అనుభవిస్తున్నారు. ఇప్పుడు తాత్కాలిక బసను తొలగించి మా నష్టాన్ని పూడ్చుకుంటాము” ఒక పెద్ద పరిష్కారం దొరికిందన్న సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు యమధర్మరాజు.

“ధన్యురాలిని స్వామీ!” అంది వినయంగా చిత్రగుప్తి.

“భలే చిత్రగుప్తి, భలే! మాకు చాలాసంతోషంగా ఉంది. నీకు మంచి జీతభత్యాలతో పాటు ఉపరి లాభ బహుమానము ..అదే ‘ సైన్ ఆన్ బోనస్’ కూడా ఇప్పెంచెదను.

“చాలా సంతోషం స్వామీ!” అని వినయంగా నమస్కరించింది. “ఈ ఇంటర్నెట్ గూగుల్,వికీపీడియాగురించి తెలియకుండా జాగ్రత్తపడాలి. లేదంటే మొదటికే మోసం వస్తుంది” అని అనుకుంది చిత్రగుప్తి మనసులో.

“మరి స్వర్గ,నరకాల్లో జరుగుతున్న వివరాలు ఎలా తెలియాలి” కొంత సేపటి తర్వాత సందేహం వచ్చింది యమధర్మరాజుకి.

“మీకెందుకు చింతస్వామీ, రిమోట్ వర్క్ సిస్టం ఉంది కదా? ఇప్పటికే మేము భూమ్మీద ఉన్న నాసా సెంటర్ నుండి చంద్రునిపై ఉన్న ఉపగ్రహాన్ని నడిపిస్తున్నాము. రిపేరు లొస్తే చేస్తున్నాము. అలాంటిది స్వర్గ-నరకాల నుండి వివరాలు తేవడం మాకు పెద్ద కష్టమేమి కాదు. మీకు ప్రతి రోజు స్వర్గంలో దేవేంద్రులవారి సంగతులు, నరకంలో అమలు చేసిన శిక్షల వివరాలు, శిక్షలు పడిన వారి జాభితా, పునర్జన్మల వివరాలు, మనుషుల్ని వేయించే నూనె డబ్బాల స్టాక్ వివరాలు, ఇంధనం నిలువలు అన్నీ ఎప్పటికప్పుడు తెలియ చేస్తాను కదా!” చాలా నమ్మకంగా చెప్పింది చిత్రగుప్తి.

“భేష్ .బాలికా..భేష్! మీలో ఇంతటి సామర్థ్యం, నైపుణ్యం దాగున్నాయని అనుకోలేదు. సరేగాని మా చిత్ర గుప్తులవారు ఇది భూతలస్వర్గం అన్నారు, మరి ఎక్కడ చూసినా మా లోకంలో ఉన్నట్టే అన్నీమంచుకొండలే కనిపిస్తున్నాయి?“ అన్నాడు ప్రశ్నార్థకంగా ముఖం పెట్టి.

“ఇప్పుడు ఇక్కడ శీతాకాలం స్వామీ! విపరీతమయిన చలి,మంచు వల్ల ఎవరూ బయటకి రారు. ఇంకా కరోనా రెండవ వేవ్ వచ్చింది అన్నారు కదా! అందుకనే చాలా మంది ఇంటికే పరిమితం అయ్యారు. మీకు ఈ శీతాకాలంలొ భూతల స్వర్గం చూడాలంటె మనం వెస్ట్ కోస్ట్ కి వెళ్ళాలి స్వామీ” అంది వినయంగా

“అటుల అయినచో అక్కడికే వెళ్ళెదము. చిత్రగుప్తుల వారు ఇక్కడికెందుకు తెచ్చారో?” అన్నాడు సందేహంగా

“వయసు అయిపొయింది కదా స్వామీ, ఆ వివరాలు తెలియవనుకుంటా!” అంది చిత్రగుప్తి కావాలనే చిత్రగుప్తుని విలువ తక్కువ చేస్తూ.

“సరే అయితే. ఆ ప్రయాణపు ఏర్పాట్లు చూడండి. ఆమూటలో వజ్ర వైడ్యూరములు ఉన్నవి. అవసరము ఉన్నన్ని తీసుకొనుము” అన్నాడు చిత్రగుప్తి చెప్పిన మాటలు విని.

మూట విప్పి చూసిన చిత్రగుప్తికి దాదాపు కళ్ళు తిరిగి పడిపోయేంత పనయింది. వెంటనే ఆ షాకు నుండి తేరుకుని “సరే స్వామీ, అవన్నీ నాకు వదిలేయము” అని రెండు చేతుల్లో పట్టినన్ని వజ్రాలు బ్యాగులో వేసుకొని లాస్ వేగాస్ ట్రిప్ కి ఏర్పాట్లు మొదలుపెట్టింది.

ఎప్పుడూ తన వాహనం అయిన దున్నపోతు మీదే తిరిగిన యమధర్మరాజు మొదటి సారి విమానంలో ఎక్కాడు. యమధర్మరాజు తో పాటు చిత్రగుప్తి కూడా ఉంది.

“ఆహా .. ఈ పుష్పక విమాన ప్రయాణం ఎంత హాయిగా ఉంది. ఈ ప్రయాణం ఇంత హాయిగా ఉంటుందని అప్పుడే తెలిస్తే, ఆరోజు రావణాసురుడు మా యమపురిని ముట్టడించినప్పుడే రావణుని పుష్పక విమానాన్ని తస్కరించాల్సింది” యమధర్మరాజు ఆలోచనలు కొంటెగా ఎక్కడికెక్కడికో వెళ్లాయి తన విమాన ప్రయాణంలో.

ఆ రోజంతా యూనివర్సల్ స్టూడియోలో వింతలు, విశేషాలు చూసి, మానవుడి మేధస్సుకి, కళాత్మక విలువలకి అబ్బురపడ్డాడు యమధర్మరాజు. ఒక మంచి రెస్టారెంటులో సుష్టుగా భోంచేసి, తనకు బాగా ఇష్టమయిన హిమక్రీములని ఆరగించి తన హోటల్ సూట్ కి వెళ్లి హాయిగా నిద్ర పోయాడు యమధర్మరాజు.

యమధర్మరాజు దగ్గర ఉన్న వజ్రవైడ్యూరాలని ఎలా తన స్వంతం చేసుకోవాలో ఆలోచిస్తూ నిద్రపోలేక పోయింది చిత్రగుప్తి తన హోటల్ రూమ్ లో.

ఉదయం నిద్రనుండి లేచిన యమధర్మరాజుకి మనసు చాలా ప్రశాంతంగా ఉంది. యూనివర్సల్ స్టూడియోలో చూసిన వింతలు విశేషాలు, మనసులో గిలిగింతలు పెడుతున్నాయి.

“ఆహా..మానవుడి మేధస్సు రోజు రోజుకీ ఎంత కొత్తగా ఆలోచిస్తుంది? ఎన్ని గమ్మత్తులు, జిమ్మిక్కులు సృష్టిస్తున్నాడు” మనసులోనే ఎన్నోసార్లు అనుకున్నాడు యమధర్మరాజు.

తన మనసంతయూ పుష్పకవిమానంతో నిండిపోయింది. దాన్ని ఎలా యమపురికి తీసుకుపోవాలా అని ఆలోచిస్తున్నాడు. మానవుడు అనుభవిస్తున్న ఈ భోగభాగ్యాలని తాను కూడా నరకంలో ఎలా అనుభవించాలా అన్నవిషయం కలవరపెడుతుంటే ప్రశాంతంగా ఉండలేకపోతున్నాడు యమధర్మరాజు.

అప్పుడే వచ్చిన చిత్రగుప్తి యమధర్మరాజుకు నమస్కరించి ఆఫీసు రూం కి వెళ్ళింది నేరుగా. కంప్యూటర్ సిస్టంపై కూర్చుంది ఆఫీసు రూం లో. ఇంతకు ముందు సర్చ్ చేసి ప్రింట్ చేసిన వివరాల హిస్టరీ డిలీట్ చేసింది.

“చిత్రగుప్తీ!” పిలిచాడు యమధర్మరాజు

“స్వామీ” అని వచ్చింది చిత్రగుప్తి.

“మీరు ఏమి చేస్తున్నారు?” అన్నాడు ప్రశాంతంగా

“ప్రజల తప్పుల చిట్టా తయారు చేస్తున్నాను స్వామీ” అంది.

“భేష్ చిత్రగుప్తీ! “ అని కాఫీ టేబుల్ పై పెట్టిన బ్రేక్ఫాస్ట్ తింటూ ఇంకో చేతిలో ‘స్టార్ బక్స్ ‘ కాఫీ సేవిస్తూ కిటికీలో నుండి బయటకు చూస్తున్నాడు. పక్కనే ఎయిర్ పోర్టులో ఎన్నో విమానాలు ఆగి ఉన్నాయి.

“విమానంలో కూర్చుని ఆకాశంలో విహరిస్తూ విజయగర్వంతో మీసాలు మెలివేస్తూ యమపురిలో దిగుతుంటే, ఇంద్రుడు అసూయతో స్వర్గం నుండి చూస్తుంటే..” చాలా మత్తుగా, గమ్మత్తుగా అందమైన ఊహలతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు యమధర్మరాజు.

వారం రోజుల తర్వాత :

చిత్రగుప్తి పనితీరుతో యమధర్మరాజు చాలా సంతోషంగా ఉన్నాడు. అంతలోనే వెస్ట్ కోస్టును ఒక పెద్ద గాలి తుఫాను చుట్టి ముట్టింది. విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగి పడ్డాయి. విద్యుత్ సరఫరా ఆగిపోయింది. విమానాలు ఎక్కడివక్కడే అయిపోయాయి.

ఎంతో హడావిడిగా, కన్నుల పండువగా ఉన్న హాలీవుడ్ ప్రాంతం ఒక్కసారిగా నిర్మానుష్యం అయ్యింది. ఎటూ చూసినా చిమ్మ చీకటి. హోటల్లో జనరేటర్ పై ఎమర్జెన్సీ లైట్లు మాత్రమే వెలుగుతున్నాయి. ఏ/సి పూర్తిగా నిలిపి వేయబడింది. ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు యమధర్మరాజు. రాత్రి అసలే నిద్ర పట్టలేదు. ఉదయం నిద్రపట్టే సమయంలో దేవేంద్రుల వారి నుండి కబురు వచ్చింది. నరక ద్వారం వద్ద ఎవరూ లేక పోవడం వల్ల ప్రతి ఒక్కరూ వచ్చి స్వర్గపు తలుపులు కొడుతూ ఇబ్బంది పెడుతున్నారని సమాచారం. హడావిడాగా లేచి చిత్రగుప్తి కోసం ఎదురు చూస్తున్నాడు.

“చిత్రగుప్తీ, ఏమిటీ ఈ వైపరీత్యము? “ వచ్చీ రాగానే చాలా కోపంగా అడిగాడు యమధర్మరాజు

“ప్రకృతి వైపరీత్యము స్వామీ” అన్నది అమాయకంగా ముఖంపెట్టి .

“దేవేంద్రుల వారి నుండి ఆజ్ఞ . వెంటనే నాకు వారందరి చిట్టా తీసుకురండు” అని చిత్రగుప్తి చేతిలో అంజనం వేసి చూయించాడు స్వర్గద్వారం వద్ద ఎదురుచూస్తున్న వారిని.

“దేవేంద్రుల వారి నుండి ఆజ్ఞ . వెంటనే నాకు వారందరి చిట్టా తీసుకురండు” అని చిత్రగుప్తి చేతిలో అంజనం వేసి చూయించాడు స్వర్గద్వారం వద్ద ఎదురుచూస్తున్న వారిని.

“సరే స్వామీ” అని తన ఆఫీసు రూమ్ లోకి వెళ్లిన తర్వాత కానీ గుర్తుకు రాలేదు ఇంటెర్నెట్ లేదు అనే విషయం.

సెలిబ్రిటీస్ వివరాలు అయితే తీసుకురాగల్గింది కానీ ఇప్పుడు ముక్కూ మొఖం తెలియని వారి వివరాలు ఎలా తీసుకురావాలో అర్థం కాలేదు. ఒళ్ళంతా చమటలు పట్టేసాయి చిత్రగుప్తికి. అసలే యమధర్మరాజు చాలా కోపంగా ఉన్నాడు. ఏమి చెయ్యాలో అర్థం కాలేదు.

“చిత్రగుప్తీ!” అరిచాడు కోపంగా

“వస్తున్నా స్వామీ! “ అని హఠాత్తుగా హాట్స్పాట్ గుర్తుకు వచ్చి ఓపెన్ చేసి ఇంటర్నెట్ ద్వారా ఎవరివో కొన్ని వివరాలు తీసు కుంది. అప్పటికే కొన్ని వివరాలు యమధర్మరాజు తన మహిమతో తెప్పించాడు. ఎట్టి పరిస్థితిలో తను దొరికిపోయేది ఖాయం అని నిర్ధారించుకుంది. ఆ చిట్టాని యమధర్మరాజు చేతిలో పెట్టింది. ట్రంకు పెట్టిలో దాచిన వజ్రాల మూట మొత్తాన్ని తన హాండ్ బ్యాగ్ లో సర్దుకుని యమధర్మరాజుకి కనపడకుండా పారిపోయింది అక్కడినుండి.

యమధర్మరాజు ఒక్కొక్కరి చిట్టాను పరిశీలిస్తున్నాడు. ఎందుకో అనుమానం వచ్చింది. తన పాశం గాల్లో ఆడించి శ్లోకం చదివి చిట్టా తెప్పించాడు నరకలోకం నుండి. చిత్రగుప్తి చిట్టాతో పోల్చి చూసాడు. అసలే వివరాలు సరిపోలేదు. వెంటనే ఇంకొక చిట్టా తెప్పించారు. అది కూడా సరిపోలేదు. వెంటనే అన్ని చిట్టాలు పోల్చి చూస్తే అన్నీ నకిలీ చిట్టాలు అని తెలిసిపోయింది.

“చిత్రగుప్తీ! అని కోపంతో రంకెలేశాడు యమధర్మరాజు. ఎలాంటి అలజడి లేక పోవడంతో చుట్టూ కలియదిరిగాడు. ఎక్కడా చిత్రగుప్తి జాడ కనిపించలేదు. ట్రంక్ పెట్టె తెరచి చూస్తే ఒక వజ్రం కూడా లేదు. విషయం పూర్తిగా అర్థం అయ్యింది యమధర్మరాజుకి.

“యముండ!” ఆవేశం ఆపుకోలేక అరిచాడు. ఆ అరుపులకి హోటల్ భవనము మారు మ్రోగిపోయింది.

“చిత్రగుప్తీ ,మమ్ములనే మోసం చేస్తావా? నీవు అంతకంతకు శిక్ష అనుభవవిస్తావ్!” అని తన కోపాన్నివెళ్లగక్కాడు.

“పూర్తిగా నమ్మిన మనుషులే ఇలా మోసం చేస్తే .. పాపం ఆ చిత్రగుప్తుడి పరిస్థితి ఏంటో? ” మనసు చిత్రగుప్తుని పైకి మళ్లింది యమధర్మరాజు కి.

బట్టలన్నీ చినిగి, మాసిన గడ్డంతో ఉన్న చిత్రగుప్తుడు నయాగరా ఫాల్స్ లో ఉన్నాడు.చిత్రగుప్తుడి దగ్గర ఉన్న ధనాన్నిచూసి, ఫ్లోరిడా క్యాసినో లో ఎవరో మోసం చేసి నయాగరా ఫాల్స్ ని అమ్మి ధనమంతా దోచుకున్నారు.

“ఇది నేనుకొన్నాను, అందరూ నాకే పైకం ఇవ్వండి” అని టికెట్ కౌంటర్ దగ్గర సెక్యూరిటీ సిబ్బందితో గొడవపడటం కనిపించింది యమధర్మరాజుకి.

వెంటనే గాల్లో తన పాశాన్ని ఆడించి ఒక శ్లోకం చదివి చిత్రగుప్తుని సెక్యూరిటీ గార్డుల చేతుల్లో నుండి తన దగ్గరికి రప్పించాడు. అసలు విషయం చెప్పి నువ్వు, నేను మోసపోయాము అని చెప్పాడు యమధర్మరాజు. అంతా తెలుసుకొని తన బుద్ది తక్కువ పనికి క్షమించమని యమధర్మరాజు కాళ్ల పై బడ్డాడు చిత్రగుప్తుడు. చిత్రగుప్తి చేతిలో తాను మోసపోయిన తీరుని కూడా చెప్పి తర్వాత తన మహిమతో చిత్రగుప్తునికి పూర్వ వైభవం తెప్పించాడు యమధర్మరాజు.

“స్వామీ, ఇదేదో భూతల స్వర్గం అని వస్తే భూతాల స్వర్గంలా దొరికినోళ్లు దొరికినంత దోచుకున్నారు స్వామీ! ఈ భూలోకంలో ఒక్క మంచివాడు కూడా లేడా? ” అన్నాడు దించిన తలను పైకి ఎత్తకుండా చిత్రగుప్తుడు.

“ఎందుకు లేరు. ఎక్కడో ఒక దగ్గర ఉండే ఉంటారు.చూద్దాం మనకు కనపడక పోతారా?” అని వెంటనే ఏదో గుర్తుకు వచ్చినట్టు తలను చూపుడు వ్రేలుతో కొట్టుకొని “అయ్యో! పుష్పకవిమానం మోజులో పడి దున్నపోతుని మర్చిపోయానే. అది ఎక్కడుందో చూడాలి” అని తన మహిమతో మహిషం ఎక్కడుందో చూసాడు.

గొడ్డు మాంసం వ్యాపారికి ఎవరో అమ్మి వెళ్లారు. దాని శక్తిని అంచనా వేయని అక్కడి కసాయి ఉద్యోగులు దాన్ని ఒక యంత్రం పైకి ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడే యమధర్మరాజుకి చిత్రగుప్తుడు అడిగిన ప్రశ్నగుర్తుకు వచ్చింది.

మహిషం మహిమాలన్నీ తీసేసాడు యమధర్మరాజు. అక్కడి కసాయి మనుషులు చాలా దున్నపోతులని మిషన్ వైపు తోస్తున్నారు. యమధర్మరాజు దున్నపోతు మాత్రం ముందుకు పోవడానికి మారాం చేసింది. అందరూ తోస్తున్నారు. తన శక్తినంతా ఉపయోగించింది కానీ ఆ మానవ శక్తి ముందు ఓడిపోయింది. చివరికి జాలిగా ఎవరన్నా రక్షించలేక పోతారా అన్నట్టు చుట్టూ చూసింది.

“స్వామీ, అలా చూస్తూ నిలబడ్డారు. మన మహిషాన్ని సంహరించదానికి ఆ ముష్కరులు ప్రయత్నిస్తున్నారు. దాన్ని రక్షించడండి” ఆందోళనగా అన్నాడు చిత్రగుప్తుడు.

“చిత్రగుప్తా, మనుషుల్లో అక్కడక్కడా మంచి వారు కూడా ఉంటారు. అలాంటి వారు ఒక్కరయినా కనపడక పోతారా అని చూస్తున్నాను. అదిగో ఆ గళ్ళ చొక్కా యువకుడిని చూడుము. వారి కళ్ళలో నేను జాలిని చూసితిని. వారు మన దున్నపోతుని ముందుకు తోసినట్టు నటిస్తున్నారు కానీ దున్నపోతు కళ్ళలో దుఃఖాన్ని చూస్తున్నాడు. చూడు వారు ఎంత ప్రేమగా దున్నపోతు కి ధైర్యం కలిగిస్తున్నారో! అని ఆ యువకుడిని చిత్రగుప్తుడికి చూపుతారు యమధర్మరాజు.

“అవును స్వామీ, నేను కూడా గ్రహించాను. కసాయి వారిలో కూడా మంచి వారు ఉంటారనే విషయం అర్థమయ్యింది ఈ రోజు” అన్నాడు చిత్రగుప్తుడు.

“అవును చిత్రగుప్తా! మనుషులే ఇతర మనుషులకు మోసాలు చేస్తుంటే, ఇంకో వైపు మనుషులపట్లే కాక మూగ జంతువుల పట్ల కూడా దయతో మసులుకునే మనుషులు ఎక్కడో ఒకరు ఉంటారు“ అన్నాడు కొంత ఉద్వేగంగా.

దున్నపోతుకు పూర్తి శక్తులు తిరిగి ప్రసాదించాడు యమధర్మరాజు. వెంటనే దున్నపోతు ఒక్క ఉదుటున తన కట్లని తెంచుకుని, ఆ ఒక్క యువకుడిని తప్ప అందరినీ కుమ్మి అక్కడినుండి సురక్షితంగా బయటపడి యమధర్మరాజుని చేరింది.

ఇప్పుడూ తన పరివారం అంతా తన దగ్గరికి చేరినందుకు చాలా సంతోషంగా ఉంది యమధర్మరాజుకి.

“చిత్రగుప్తా ,నిన్నటి వరకూ ఎంతో అంగరంగ వైభోగంగా ఉన్న ఈ ప్రాంతం, ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎంత కకావికలం అయ్యిందో చూడు? ఆ పుష్పక విమానం కూడా పైకి ఎగరకుండా ముడుచుకుని కూర్చుంది. ఇలాంటి తాత్కాలిక సుఖాలు మనకు వద్దు. మన మహిషమే మనతో పాటు చివరి వరకూ వచ్చేది. మనుషులపై మనుషులకు నమ్మకం లేని ఈ భూతల స్వర్గాలు మనకు వద్దు! మన నరకమే మనకు స్వర్గం” అని దున్నపోతుపై ఎక్కి యమపురి వైపు పయనమయ్యాడు యమధర్మరాజు, చిత్రగుప్తునితో కలసి సంతోషంగా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com