కాల్పనికత నుండే సామాజిక దురంతాన్ని చెప్పిన కథ…

“ఎంత బాగుందోయి పాట. కొంత సేపాగి, విని, మరిపోదామా.”

“నాకు విందామనే వుంది కాని సమయానికక్కడ చేరకపోతే దయాదాక్షిణ్యం లేక దండన విధిస్తాడు ఆ యమధర్మరాజు తెలుసా?”

“ఆ భయం మనకు లేనిదేవుడు, వైతరణి దాటితే యమపురి ఎంతదూరం. కొంచెం తొందరగా నడిస్తే వేళకందలేమా ఏమి?”

“సరే నీ యిష్టం, కాని, పాశాల్లో జీవాలున్నావే, వెంట తీసుకొని ఎలా వెళ్ళడం గంధర్వులగానం వినేటందుకు?”

“వానిని వైతరణీ తీరాన వదిలేద్దాం. తిరుగుతాయి పాపం కొంచెం స్వేచ్చగా, ఎటైనా పారిపోతాయన్న భయమా లేదు. మళ్ళీ ఎన్నాళ్ళకో స్వేచ్ఛ. తలచుకుంటాయి కూడాను.”

“సరే, నీవు చెప్పినట్లు చేయుటకు నాకేం అభ్యంతరం లేదు. కాని, అక్కడికెళ్చి ఆ పాట వింటుంటే మనకు యమపురి సంగతి ఈ ప్రాణాల సంగతి జ్ఞాపకం వుంటుందా అని ?”

“నేను చెపుతాను లేవోయి కొంత సేపు కాగానే, నీవు నడుద్దూ ఈ పాశాన్ని నాదానితో పాటిక్కడ వదలి.”

“సరే, నడువు అట్లాగయితే.”

“ఇదేమిటి ? ఇప్పటికి నేనొక్కడనే అనుకుంటున్నాను ఈ ప్రదేశంలో, కాని! మీరెవరో వున్నారే నాతోపాటు ? మనమెక్కడ వున్నది మేకేమైనా తెలుసా?”

“నేను అదే ఆలోచిస్తున్నాను. ఈ ప్రదేశం నాకు కొత్తే. ఎక్కడున్నది ఏమి బోధపడడం లేదు

“సరే కాని, ఎక్కడివాడవు నాయనా నీవు?”

“అయ్యా, నేను భారతీయుడను.”

“ఏమీ, భారతీయుడవా, నా తండ్రీ! మా దేశీయుడవేనా నీవు ?”

“మహాభాగ్యం, మీరు భూలోక స్వర్గమగు భారతదేశం వారేనానండీ?”

“అవును కాని, ఏ ప్రాంతం నాయనా నీది?”

“అయ్యా, నేను నిజాం రాష్ట్రంలోని తెలంగాణా మనిషిని.”

“ఏమిటి! ఏమంటివి! నిజాం రాష్ట్రంలోని తెలంగాణా వాడవే? స్వదేశీయుడవే స్వప్రాంతీయుడవు కూడానా నాయనా? మరి, నీవు మాట్లాడే భాష ఏది, తండ్రీ, ఆ ప్రాంతంలో?”

“ఇంకే భాష మాట్లాడమంటారు మమ్మల్ని ? మేము మాట్లాడేది అచ్చం తెలుగండి మహాప్రభో”

‘ఏమి! ఏమి! తెలుగే, అట్లయితే నీవు నిజాం రాష్ట్రాంధ్ర సోదరుడవేనా తండ్రి ? అందుకే. నిన్ను చూడడంతోనే ఒక విధమైన సోదరప్రేమ కలిగింది. నాయినా. అయితే ఇక్కడికెలా రావడమైంది బాబూ?

“ఏమోనండి, అదే బోధపడడం లేదు నాకూనూ. ఉదయం మా ఊళ్ళో జరిగిన కొట్లాటలో -నా తలపైన దుడ్డుకఱ్ఱ పడ్డాక నాకు స్పృహ తప్పింది. తర్వాత ఏమి జరిగినదీ తెలియదు. ఇప్పుడు చూస్తే ఇక్కడున్నాను”.

“ఎంత చిత్రం, మీ ఊళ్ళో కూడా ఉదయం గోల జరిగిందా. మా ఊళ్లో జరిగిందే నా తలపైన గొడ్డలిపడడం వరకు జ్ఞాపకం వుంది. తర్వాత ఏమి జరిగినదీ నాకు తెలియదు. ఇప్పుడు చూస్తే ఎక్కడున్నది బోధపడడం లేదు.”

“సరే బాగానే వుంది. అయితే మీ ఊళ్ళో జరిగిన సంగతేమిటో చెప్పండి. నేను మా సంగతి చెపుతాను తర్వాత. చాలా అన్యాయంగా వుందండి కథ. ప్రపంచంలో దయ అనేది లేకపోవడం సత్యమని బోధపడుతుంది మీకే తర్వాత. మీరు కూడా నాతో మరియు నాతోటివారితో సహానుభూతి చూపకమానరు నా కథ విన్నాక.”

“నా కథా అలాగే వుంది అబ్బాయి. ప్రపంచంలో ధర్మమనేది నాశనమయిపోతున్నది దినదినం. ఆచార వ్యవహారాలు మంటగలుస్తున్నాయి లోకంలో. మా ఊళ్ళో జరిగినక థ చెప్పితే ఆశ్చర్యపడడమే కాకుండా నమ్మనైన నమ్మవేమో అని అనుమానిస్తున్నాను. అందుకే, నీవే నీ కథ మొదలు చెప్పితే – బాటుంటుందని నా అభిప్రాయం.”

“నిజమేనండి, ప్రపంచంలో మనుష్యత్వమే లేకుండా అయింది. ఏమి చెప్పేది మా ఊళ్లో అవస్థ ఏదో చెపుతాను వినండి. ఆ ఊళ్ళో ఒక దేవాలయం వుంది. అది మా ప్రాంతంలో చాలా పురాతనమైనది, ప్రసిద్ధికెక్కినది కూడాను. ప్రతి సంవత్సరము పెద్ద తీర్ధం సాగుతుంది. ఈ ఏడు జాతర అప్పుడు దేవాలయం ప్రవేశవిషయంలో వచ్చింది తగాదా అస్పృశ్యులకు సవర్ణ హిందువులకు. సవర్ణులలో కొందరు హరిజనుల పక్షం వహించి దేవాలయ ప్రవేశానికి సాయపడతాం అన్నారు. దాంట్లో ఒకరిద్దరు బ్రాహ్మణులు కూడా వుండడం తటస్థించింది. జాతరకంటే ఒక వారం ముందే హరిజనులందరు నిరసన వ్రతంతో దేవాలయ ప్రవేశ విషయమై సత్యాగ్రహం మొదలు పెట్టారు.

బ్రహ్మణులు. యితర హిందువులూ లాఠీలతో గుడిచుట్టూ కాపలా కాస్తున్నారు. ఈ రోజు ఉదయం హరిజనులు కూడా, సత్యాగ్రహానికి స్వస్తి చెప్పి జబర్దస్తిగా దేవాలయ ప్రవేశం చేద్దామని లాఠీలతో తయారైనారు. జరిగింది సవర్ణ హిందువులకు లాఠీలతో సంగ్రామం.

‘ఏమీ, నీవూ ఈ దేవాలయ ప్రవేశ సందర్భములోనే నెత్తి పగిలి స్పృహ దప్పిన మహావీరుడవా నాయనా? ధన్యుడవు. స్వరంలో ఇంద్ర వైభవము పొందగలవు. ధర్మ సంగ్రామంలో పాల్గొన్నవాడవు. ” నీ తల పగులగొట్టిన ఆ పాపాత్ముడెవడు? వానికి నరకం తప్పునా? నేనూ ఆ ధర్మయుద్దంలో పాల్గొన్న వీరుడనే తండ్రీ. ఇంతకూ, మనమిరువురము ఒక్క ఊరివారమే నాయనా. అయిన నిన్ను కొట్టిన ఆ దుర్మార్గుడెవడో జ్ఞాపకమున్నదా?” ,

కష్టమన్నది తెలియక రోజు మూడుపూటలూ అన్యాయంగా మమ్మల్ని దోచుకొని తిని బాగా బలిసిన ఒక లావాటి బాపనయ్య, ప్రక్కనుండి, నా తలపై దుడ్డుకఱ్ఱ వేసాడు. అతనికీ తగినశాస్తి అయిందనే నా అభిప్రాయం. మా వెంకడు అప్పుడే గొడ్డలితో అతని బుఱ్ఱ పై కొట్టినట్లు చూడడం నాకు జ్ఞాపకం.”

“ఓరి ముండాకొడుకా! మాదిగ వెధవవు ఇక్కడా దాపురించావు? పొద్దున్నే కసితీరా లాఠీతో కొట్టి దేవాలయ ప్రవేశం కంటె మొదలు యమపురి ప్రవేశం చేయిస్తామని అనుకుంటే ఆ గొడ్డలిదెబ్బ నా తలపై పడడం చేత తప్పించుకపోయావు. కాని ఇప్పుడెటు పోతావురా? గొంతుక పిసికి పారేస్తాను చూడు.”

* ఆ బాపనయ్యవు నీవేనా ? బొర్రపై ఒక లాఠీ కొట్టానంటే నిన్న సంతర్పణలో తిన్న భక్ష్యాలన్ని బయటపడాలే జాగ్రత్త! నా మెడ పిసికడమంటే పిండాలకూడు పిసకడం అనుకున్నావా”

“అబ్బా! ఎంత తన్ను తన్నితివిరా?”

“అయ్యో చస్తి! చేతకాక కొడుతావటయ్యా ? ఉండు నీపని పట్టిస్తా”

“అబ్బా ఎంత గుద్దు గుద్దితివిరా పేగులు వేళ్ళేటట్టు తొక్కుతానుండు.”

ఏడ్చావు బాపనయ్య కిందపడ్డా నాదే గెలుపంటావు. చూడు నీవు చేస్తానన్న పని నేనే చేస్తా.’

“అయ్యో చస్తీ! చస్తీ! ఎవ్వరన్నా రక్షించండి బ్రాహ్మణి,చచ్చిపోతున్నాను పుణ్యానికి.”

“అరే చాలురా పాట వినడం, నదీతీరాన ఏవో కేకలు వినిపిస్తున్నాయి. ప్రాణాలలను పాశాల్లోంచి వదిలివచ్చాం . అలవాటు చొప్పున ఇక్కడా కొట్లాడుకుంటున్నాయో ఏమో

“అవునురా ఈ కేకలక్కడివే. ఆ బ్రహ్మణ మాదిగ పంచాయితేరా ఇక్కడ కూడా

“నడువుమరి”

మంచిది.

‘వీరికావరం మండా, ఇక్కడేదో పోనీ పావమని కొంత స్వేచ్చ యిసే మళ్ళీ తన్నుకుంటున్నారేమిరా?”

‘చచ్చి ఇంకా సరిగా పదిగంటలు కాకపోయే. ద్వేషం అప్పుడే పోతుందా?”

“వీరి ద్వేషం చట్టుబండలు గాను. ఇదేం కావరంగా చచ్చినా ఈ మతపిచ్చి ఈ వర్ణ భేద శతృత్వం పోలేదే? యమపురిలో తీర్పు చెప్పిన తరువాత తెలుస్తుందిలే సంగతి.”

“ఇంకాలాలోచిస్తున్నావేమి నేను పాశంలో వేసుకొని నడవటానికి సిద్ధంగా వుంటే?”

“సరే నడవు నేనూ ఇదే బంధిస్తున్నాను ఈ బాపనయ్యను.”

“తొందరగా నడవాలి టైము ఎంతో లేదు మనకు.”

“నీవు కదిల్తేగా మాటలతోనే సరిపోయే.”

“సరే నడువవోయి.”

“ఏమి ఇతడు ఆ అమాయకులైన హరిజనులు దేవాలయం ప్రవేశం చేస్తామంటే అడ్డపడడమే కాకుండా ఒక హరిజనుని కర్రతో బాది చంపినాడా?”

“అవును మహాప్రభో”

“ఏమోయి, మా వాడు నీ విషయమై చెప్పేది నిజమేనా?”

“అయ్యా నిజమే కాని ధర్మ సంరక్షణ”

“నోరుమూయి ధర్మాధర్మములు ధర్మరాజునైన నాకా నీవు చెప్పేది? ఒరే ఇతనిని పదిరోజులూ అగ్నిగుండంలో పడవేసి తరువాత కొచ్చిన్ లోని ఒక పరయా (మాదిగ) కుటుంబంలో పడెయ్యి సుఖపడుతాడు. ధర్మం తెలుస్తుంది కూడాను.”

“చిత్తం మహాప్రభో.”

“అయ్యొ అగ్ని గుండమా? మాదిగ జన్మమా? అన్యాయం! ఘోరం…..”

“వీడెవడురా?”

“దేవాలయ ప్రవేశానికి లాఠీతోపోయి ఇప్పటి బాపనయ్యతో చంపబడ్డ హరిజనుడు “

“అట్లాగా….. ఒరే నీవు మహాత్ముడు చెప్పిన అహింసా విధానం మాని లాఠీ సహాయమెందుకపేక్షించావు దేవాలయ ప్రవేశానికి?”

ఎన్ని రోజులు ఊరికే ప్రయత్నించినా ఆ బాపనయ్యలకు దయరాలేదు విసికి వేసారి జబర్ దస్త్రీకి దిగాం మహారాజా”.

“అది తప్పే… ఒరే వీడిని రెండు రోజులు ఆ మంచులో పడవెయ్యి కోపం అంతా పోయి శాంతమలవడతుంది. మూడో రోజు తిరువాన్ కూరులో హరిజన కుటుంబంలోకి పంపించు.”

“తెనుగుదేశంలో కాక మలయాళదేశంలో ఎందుకు తండ్రీ జన్మం?”

“మళ్ళీ దేవాలయ ప్రవేశపు చిక్కులేకుండా. లేకపోతే ఏ బ్రాహ్మణి చేతనో తల పగులకొట్టించుకొని చేరుకుంటావు నా వద్దకు.”

“మహాభాగ్యం”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com