వరంగల్లు జిల్లాలో ధర్మ సాగరం మండలం లో తాటికాయల గ్రామం లో భూస్వామ్య కుటుంబంలో పొట్ల పల్లి శ్రీనివాస్ రావు దంపతులకు 1917 నవంబెర్ 20 న జన్మించిండ్రు .పొట్లపల్లి పదవ తరగతే చదివినప్పటికీ ,ఉర్దూ హిందీ ఆంగ్ల భాషలో మంచి పట్టు సంపాదించిండు.ఈయన వట్టికోట కాళోజి సమకాలీనుడు .

పొట్లపల్లి రామారావు కవి ,నాటక కర్త .ఆయన బాల్యం నుండి ప్రకృతి ప్రేమికుడు .తన పాలేర్లతో భేద భావం లేకుండా ప్రవర్తించిన సమతా వాది.జనసామాన్యం లో ఒకడిగా జీవించడం ఆయన కిష్టమైన పని .స్వాతంత్ర్య సమర యోధుడు గా జైలుకు వెళ్ళినవాడు .

కాళోజీ రామేశ్వర రావు సహకారం వల్ల ఆయన లో రచనా కళ వికసించింది. ఆయన ఆత్మ నివేదన ,చుక్కలు మెరుపులు ,అక్షర దీప్తి ,నాలో నేను వంటి కవితా సంపుటాలను జైలు కథలు, ఆచార్యుల కథలు , వంటి కథలు ప్రచురించిండ్రు .నీలవేణి అనే అసంపూర్తి నవలను రచించిండ్రు.

పోట్లపల్లి రామారావు కథల్లో ప్రధానం గా నాటి గ్రామీణ వాతావరణం కళ్ళముందు కదలాడుతది.గ్రామీణ సమాజం లో గ్రామస్థాయి పాలకుల ఆడంబరాలు ,అమానుషాలు ,డొల్లతనం, అదే విధం గా పేదవాని ఆకలి ,దైన్యం బానిసత్వం ,సజీవం గా చిత్రించిండ్రు.

ఈయన రాసిన మా గ్రామం గాని ,ఊరికి పోదాం గాని ,నిజానికి కథలు అనకూడదు .మనముందు సాక్షాత్కారించిన వీడియో చిత్రాలు అనాలి .ఇందులో ప్రతి ఒక్కరూ, వాళ్ళ వాళ్ళ గ్రామాలతో identity పొందుతరు.

ఆయన గ్రామం లో ప్రవేశించగానే వాగు కనిపిస్తుందట . వాగు గురించి ఇట్లా రాస్తరు.

‘’ఇది మా ఊరి వాగు .ఇది మా గ్రామానికి జీవనది .దీని కాలవల మూలాన మా పొలాలు పండి మా క్షుత్తు ను బాపుతాయి .నిత్యం మా గ్రామ స్త్రీలు తోడుకొని వచ్చే దీని చల్లని నీరు మా దాహాన్ని తొలగిస్తాయి .దీని నీరాల మునుకులాడి మా నిత్య శ్రమను తొలగించుకుంటాము .ఇది మా పిల్లల క్రీడాస్థలము .వయసు మళ్ళిన మా పెద్దల విశ్రాంతి స్థలము .ఇది మా ఊరు వచ్చే వారిని మందహాస వదనం తో ఎదుర్కొని మంచి నీరు అందిస్తుంది’’ .ఇట్లా సాగిపోతుంది ఆయన స్వభావ రమ్యమైన చిత్రీకరణ .గ్రామం నుంచి వచ్చిన ప్రతి వ్యక్తి కి వాళ్ళ ఊరు గుర్తుకొస్తది. .ఏలవాడు (కాపలాదారు )కరణం ,కోమటి నాగయ్య ,మొదలైన గ్రామానికి వెన్నెముక లాంటి పాత్రలన్నీ ఇందు లో కనిపిస్తవి .ఆనాటి గ్రామీణ వ్యవస్థ మరోసారి పునస్మరణ కు వస్తది .

అటువంటి ఊరిలోనే ఉన్న నాటి బళ్లను చిత్రించిన పొట్లపల్లి స్వేచ్చ అనే కథ ఇందులో ఉంది .

పంతులు అంగవైకల్యం కలవాడైనా అతనిచ్చే శిక్షలు భయంకరం .కర్ర ఏ విద్యార్థి ముందుకు విసిరితే ఆ విద్యార్థి శిక్షార్హుడని పంతులు నిర్ణయం అన్నమాట .ఆ విద్యార్థి శిక్ష కోసం ఆ కర్ర తీసుకొని పంతులు దగ్గరకు రావాలె.ఇక వాడి చేతి లో నిప్పులవాన కురుస్తుంది .vపంతులు అంగవైకల్యం కలవాడైనా అతనిచ్చే శిక్షలు భయంకరం .కర్ర ఏ విద్యార్థి ముందుకు విసిరితే ఆ విద్యార్థి శిక్షార్హుడని పంతులు నిర్ణయం అన్నమాట .ఆ విద్యార్థి శిక్ష కోసం ఆ కర్ర తీసుకొని పంతులు దగ్గరకు రావాలె.ఇక వాడి చేతి లో నిప్పులవాన కురుస్తుంది .

ఊరి దొర కొడుకైనా దీనికి అతీతుడు కాదు .

‘’ఎక్కడికి బోయినవురా ఎనుబోతు ? ‘’ అని అడిగేవాడు పంతులు .

‘’ ఏంది పంతులూ , ఎనుబోతు అంటవ్, ‘’ అని దొర కొడుకు పంతులు దిక్కు గుడ్డ్లుదీసి చూసేవాడు .

‘’నీవు ఇటు రా , ‘’

కదలక పోయేవాడు ,తన స్థానం నుంచి పంతులు కోపం గా వాని చెవి పట్టేవాడు ,

‘’చెవి విడువు పంతులూ ‘’,

వాడు ఎదురు మాట్లాడు తుంటే ముఖం చూసేవాడు పంతులు .అప్పుడపుడు దొర వచ్చి పంతులు కు బాసట గా నిలిచేవాడు . పంతులు వాని బుగ్గలు పిండి ఎడా పెడా తగిలించేవాడు .

పంతులుకు గుడ్డ్లు చేపలు ఇలాంటివి చాలా ఇష్టం .అవి వండుకున్న రోజు పంతులు కే కాదు ,విద్యార్థులకూ సెలవే ,పంతులు నిమిషానికో తడవ పొయ్యి దగ్గరకు పొయ్యి వస్తుండేవాడు .

ఇంకా పిల్లలు పంతులును ప్రసన్నుని చేసుకోవడానికి పడే తాపత్రయం ఇంతా అంతా కాదు .ఒక్కోసారి పిల్లలు పంతులు నేడిపించేవారు కూడా.ఆయన గుర్రం తోకకు కమ్మ కట్టి ,అది పారి పోవడం ,పంతులు దాన్ని వెతకడానికి పడే శ్రమ ,తరువాత ఆ పిల్లలు ఎంత అమాయకం గా నటించినా ,పంతులు గుర్తించడం ,వాళ్ళు దెబ్బలు తినడం ,ఇవన్నీ ఆనాటి ఖానిగి బడి పరిస్థితులు .

ఇంకా ఈయన కథల్లో విద్యాధికారులకు బెదరని పంతుళ్ళు కూడా కనబడుతరు.స్థాన బలం వీళ్ళను అట్ల ప్రేరేపిస్తది.

ఆ కాలం లోని గ్రామాలలో వెట్టి భయంకరం గా ఉండేది .’’న్యాయం’’ అనే కథ లో పై అధికారుల పేరు చెప్పి ఒక జవాను ఏ విధం గా దోచుకున్నడో చెపుతడు .గ్రామీణ వ్యవస్థ లో అధికారులు ఏమడిగినా ప్రజలు ఇవ్వాల్సిందే .కోమటివాళ్ళు భోజన దినుసును ,వ్యవసాయ దారులు కోళ్ళు ఇట్లా ఏమడిగినా ఇవ్వవలిసిందే .కోమటివాళ్ళు అవసరమైనపుడు అబద్దాలతో నాటి జవానులను లేక అధికారులను మోసగించే వైనం కూడా ఉంది .

అధికారులకు ప్రజలు వంతు కోళ్ళు ఇచ్చేవారు .అందులో మాదిగ కరణం ప్రధానమైన పాత్ర .కరణం గుర్తుకు తెచ్చుకొని చెబితే మాదిగ వెళ్ళేవాడు .చివరికి బిచ్చగాళ్ళ దగ్గరనుండి కూడా మామూలు గుంజడం జరిగేది .

రచయిత ఈ బిచ్చగాళ్ళను క్రిమినల్ ట్రైబ్స్ అయి ఉండేవారని చెబుతాడు .ఈ లోకువ అధికారులకు చాల విధాలు గా ఉపయోగపడేది .ఎన్నడో పూర్వం వాళ్ళ తాత లో ముత్తాత లో బందిపోట్లు అయినందుకు ,చాపలు అమ్ముకొని ,వ్యవసాయం చేసుకొని జీవించే వాళ్ళ సంతతులు కూడా criminal tribes గా నే ఉండి పోయారు .ఇక ఇటువంటి కష్ట జీవులనుండి సొంత లాభం కోసం crime చేసే ఉద్యోగులు ,న్యాయ మూర్తులు గా చలామణి అవుతారు .కొందరిలో ఉండే నిస్సహాయత అఙ్ఞానం, లోకువతనం, మరొకరికి వాళ్ళ మీద అధికారానికి దారి తీస్తుంది.

‘’న్యాయం’’ కథ లో ఎదురు చూసే అధికారి ఎంతకు రాడు. మధ్య జవానే అధికారి పేరు చెప్పి అన్నీ వసూలు చేస్తాడు .చివరికి అధికారి మోటారు పై వచ్చి ప్రజల తో పాటు ఎదిరి చూస్తున్న కరణం తో సంతకం తీసుకుంటాడు .అధికారి మోటారు పై వెళ్లి పోగానే తాను కాగితం పై చదివిన విషయం కరణం అందరికీ చెబుతాడు .

‘’దొరగారి బిడ్డ పెళ్లి ‘’

ఈ మాట తో ప్రజలంతా నివ్వెర పోతారు .

అంటే దొరగారి బిడ్డ పెళ్లి కి తామెన్ని కోళ్ళు ,గొర్రెలు ఇచ్చుకోవాలో .ఒక భయం ఆవరిస్తుంది వారిని .

ఆ కాలం జైలు గురించి రెండు కథలున్నాయి . విముక్తి –జైలు .

బయటి ప్రపంచానికి దూరం గా ఉంటూ జైలు లోనే కడతేరే ఆ ఖైదీలు అడిగితే చాలు ,మొత్తం ఏకరువు పెట్టేవారు .పార్టీ దారు జయానికి, తమ అపజయానికి కారణమైన లంచాలు ,సిఫారసులు పోగా హైకోర్ట్ సూత్రాలతో సహా సమన్వయం చేసి చెప్పేవాళ్ళు .ఎదో విధంగా నిర్భంధం నుండి బయట పడాలని ఆతురతతో కనబడ్డ వాడికల్లా తమ దుఃఖం వెళ్ళబోసుకునేవారు . అదే లేకపోతే చాలామంది పిచ్చివాళ్ళై పోయేవారు.

తన పూర్వికులు ఇచ్చిన కొంత నేలను దురాక్రమణ చేసుకున్న యజమాని తన పూర్వపు బాకీ కోసం తన పై నేరం మోపి తనను జైలు పాలు చేసిన అమాయకమైన రాంసింగ్ అనే ఖైదీ ఈ బాధితులకు ప్రతినిధి .జైళ్ళ స్వరూపం రచయిత అతని నోటనే ఇట్లా వ్యక్తం చేస్తాడు .

‘’శిక్ష వద్దనను .కాని నన్ను శిక్షించిన వాని నేరానికి మీ బోటి వాళ్ళని శిక్షించాలని న్యాయ సూత్రాలు కల్పించిన వాని నేరానికి ,అసలు నా బోటి వాళ్ళ మీద నేరాలు మోపేవాళ్ళకి దండన ఉన్నప్పుడు నన్ను దండించండి .కాని శాసనపు పురులనుండి తప్పించుకొని నా బోటి ధనహీనులు ,యుక్తి హీనులు ,ఏ కొందరినో ఈ చీకటి గదుల్లో త్రోసి న్యాయ పాలన సాగిస్తున్నామని చాటుకొన్నవి మీ ప్రభుత్వాలు ,అది కేవలం బూటకం.

‘’జైలు’’ అనే మరో కథ లో సమాజం అనే మరో జైలు కన్నా ప్రభుత్వాలు కల్పించిన ఆ జైలే నయం అనే భావం స్పురింపజేస్తాడు .

సోములు అనే వ్యక్తి దరిద్రం తోనూ, కుటుంబం పిల్లలతో ,భార్యతో చాలా భాధలు పడి ,పెద్దమనుషులతో ఇబ్బంది పడి,చివరికి నేరం మోపబడి ,జైలుకెడతడు.జైలు కెళ్లినందుకు కొంత బాధ పడ్డా ,తరువాత బయట సమాజం కన్నా ,జైలే బాగుందని అర్థం చేసుకుంటాడు .

శిక్షా కాలం అయిపోయి బయటకు వెళ్ళాక మళ్ళీ కావాలనే నేరం చేసి జైలుకు వెడతాడు .

అంటే నాటి పెత్తందారి గ్రామ సమాజం జైలుకన్నా దుర్బరం గా ఉన్న వైనం చిత్రిస్తారు ఈ కథ లో .ఈ కథ జైలు కొత్త కోణం లో చూపిస్తుంది .

‘’కుక్క పిల్ల’’ ‘’గజేంద్ర మోక్షం’’ రెండు కథలు మానవేతర ప్రాణులకు సంబంధించినవి.

తనను ఎంత దండించినా యజమాని పై విశ్వాసం చూపించిన కుక్క కథ ఇది . ఇంగ్లీషు లో ఇట్లాంటి విశ్వాసానికి సంబంధించే Edgar Allon Poe రాసిన The Black Cat అనే కథ ఉంది . నల్ల పెంపుడు పిల్లి చాలా విశ్వాసంతో తన యజమానులాలిని హత్య చేసిన ఆమె భర్తను పట్టిస్తుంది .Gorge Orwell రాసిన Shooting an Elephant కథ కూడా జంతు సంబంధమయిందే .ఈ కథ బ్రిటిష్ రాజరిక వ్యవస్థను ఏనుగు కు ప్రతీక చేస్తూ వచ్చింది . పొట్లపల్లి కథలో తన పై విశ్వాసం చూపిస్తున్న కుక్కను యజమాని ఈసడించుకొంటాడు . జమీందారు కుక్కను కావలనుకునేసరికి ,డబ్బులిచ్చి కొందామనుకునే సరికి కుక్క మీద ప్రేమ పుట్టుకొస్తుంది .ఆ వరకే యజమాని భార్య కొట్టడం వల్ల కుక్క చనిపోతుంది .

ఇక పొట్లపల్లి రామారావు ‘’గజేంద్ర మోక్షం కథ’’ ,కూయని కోడి పుంజు గురించి ,పిల్లి నోట్లో నుంచి తప్పించుకొని అది గట్టిగా కూస్తుంది.ప్రాణ రక్షణార్థం చేసే ప్రయత్నం ,ప్రాణం రక్షణ పొందగానే చేసే వ్యక్తీకరణ ఒక రకం గా మానవీయ స్పందనకు ప్రతీక .సమస్త జీవుల అంతర్వేదన ఒకటే అని తెలిపే కథ ఇది .

‘’ఒంటరి చావు’’ , ‘’సమాధి స్థలం’’ లాంటి కథల్లో ఆర్ధిక అసమానత పేదరికం వల్ల మనిషి పొందే దైన్యం చిత్రించారు .

అధికారం రాగానే మనుషులు ఎట్లా మారిపోతారో చెప్పే కథ ‘’కల’’ .స్థిర వ్యక్తిత్వం దృష్టి తో రాసిన కథ ‘’ కంకర రాయి’’ .మనిషి ధూమపానానికి బందీయై చావును కూడా లెక్క చేయని వైనం చిత్రించిన కథ’’ జైల్లో సిగరెట్టు ముక్క’’ .

పొట్ల పల్లి వారు చిత్రించిన ఈ కథల్లో వ్యక్తులు సంఘటనలు ఆ కాలానికి చెందినవే. అయినా ఇప్పటికి కూడా చదువుకునే ప్రాసంగికత వాటికుంది .పొట్ల పల్లి రామారావు కథా సంపుటానికి ముందు మాటలో చెప్పినట్టు, ఆయన కాలానికన్నా ముందున్న రచయిత .

ఈయన ముల్లా కథలు ,ఆచార్యుల వారి కథల్లో కూడా హాస్యం తో పాటు లోతైన జీవితం కూడా చూస్తాం .

డాక్టర్ .కాంచనపల్లి గో.రా .9676096614

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com