– కె.వి.నరేందర్

కరోనా నుండి పుట్టిన కవిత్వం మన ముందు పెట్టిన కథ

ఓ మనిషీ…

ఏ దగ్ధ ప్రేమికుల

కన్నీటి ఉసురు నీకు తాకిందేమో

కులం చాటున…మతం మాటున

నువ్వు చేసే అప్రకటిత యుద్ధానికి

ఏ నరుడు నిన్ను శపించాడో…

కడుపులోంచి రాలక ముందే

చితికట్టెలు చల్లారకముందే

నీ వికృత చేష్టలు చూసి కరోనాని సృష్టించివుంటాడు.

ఇకనైనా…మనసుకి కప్పేసిన

మాస్క్ విప్పేయ్…నీ గుండెని

శానిటైజర్ ముంచేయ్…

అయిదు రోజులుగా ఇంట్లో చిల్డ్రన్ బెడ్ రూంలో శైలి రాసిన తన కవిత్వం తనకే చిత్రంగా తోచింది. శైలికి పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. హోమ్ ఐసోలేషన్ అని ఇంట్లోనే వుంటుంది. శైలి బెంగంతా అమ్మ గురించే… ఈ మధ్యనే అమ్మకు షుగర్ వచ్చింది. కరోనా దెబ్బ కి నాన్న ఫోటో స్టూడియో సరిగ్గా నడవడం లేదు. రోజు తాగొచ్చి, అమ్మ ని కొడతాడు. మా తాతయ్య కూడా మా ఇంట్లో నే వుంటాడు. తాతయ్య కి వచ్చే ఆరు వేల పెక్షన్ అమ్మకిస్తాడు. వాటితోనే ఇల్లు గడవాలి. కవితని మళ్ళీ చదువుకొని… శైలి, “తాతయ్య..”,అని పిలిచింది. శ్రీరాములయ్య,”ఏమైంది తల్లి “, అని పరిగెత్తుకొచ్చాడు,దూరంగా ఉండి తలుపు కొంచెం తెరిచి…” ఇదొక్కసారి చదువు “, అంది. ఆయనది చదివి ఆశ్చర్యపోయాడు.

“నువ్వే రాసావమ్మ…”, అని అడిగాడు. తల బయటపెట్టి సంతోషంగా అంది,”నేనే కదా..”, శైలి డిగ్రీ ఫస్టీయర్ చదువుతుంది.

” కవిత బాగుంది… ఇదిగో లతమ్మ… నీ బిడ్డ కవిత రాసిందే…”,అన్నాడు.

వంటింట్లో చమటలు కక్కుతున్న లత ఆ మాట విని నిట్టూర్చుంది.

“అదేదో లక్ష రూపాయల లాటరీ తగిలినట్టు మీరు సంతోష పడుతారెందుకు మామయ్య “,అంది.

మరో రెండు రోజులకి, మరో కవిత రాసింది..

శైలి అమ్మ తిడుతోందేమోనని భయపడింది. అందులోను తనకి పీరియడ్ వచ్చింది. అమ్మ కి విసుగొస్తుంది.

నాలుగో తరగతి చదివే తమ్ముడికి ఆన్ లైన్ క్లాస్ కోసం ల్యాప్ టాప్ ముందు స్కూల్ డ్రెస్ వేసి, టై కట్టి, నిక్కరేసి బెల్టు పెట్టి కూచోబెట్టాలి. లేకుంటే ప్రిన్సిపాల్ ఫైన్ వేస్తుంది. వాడు ఇల్లంతా పరిగెడ్తాడు. స్నానం చేయడానికో, అన్నం తినడానికో సతాయిస్తుంటాడు…

తాను బయటుంటే…వీపు మీద ఒక్కటిచ్చేది.

కరోనా వల్ల అమ్మ కు పని ఎక్కువై అలిసిపోతుంది…

కరోనా వచ్చి పనిమనిషి రంగమ్మ రెండు నెలలు క్రింద చనిపోయింది. రంగమ్మ మరణం మాకన్నా అమ్మను కుంగ దీసింది. దాని కష్టసుఖాలు అమ్మ కి చెప్పేది. అత్త పెట్టె కష్టాలు, భర్త తాగొచ్చి రాత్రి కొట్టడం..ఆ దెబ్బలు వాతలు అమ్మ కు చూపించి ఏడ్చేది.ఆమె కి రెండో తరగతి చదివే కొడుకున్నాడు. తమ్ముడు వాడేసిన డ్రెస్ లన్నీ అమ్మ ఆమె కిచ్చేది.

” శైలి.. అమ్మ శైలి..”, తాతయ్య పిలిచాడు.

” ట్యాబ్లెట్ వేసుకున్నావా… ఈ రోజు ఏ కవిత రాసావ్ “, అడిగాడు.

” వేసుకున్న తాతయ్య…రాత్రి ఒక కవిత రాసాను. నువ్వయినా ఎంకరేజ్ చేస్తావ్. నాకదే బలం.

కానీ,పీరియడొచ్చింది తాతయ్య. నాలుగు రోజుల వరకు కవితలు బంద్ “, గది బయటికి ఒక మడిచిన కాగితాన్ని విసిరేసింది.

“ఇదేనా..”,అంటూ కాగితం తెరిచాడు తాతయ్య…

మా చప్పట్లు

నీకు విన్పించక పోవచ్చు…

మా దీపం వెలుగులు

నీకు కన్పించక పోవచ్చు …

నీతో యుద్ధం చేస్తున్న

మా శ్వేతకపోతాలకి కన్నీటి విలువ తెలుసు.

మా ఖాకీ సైన్యానికి

కత్తి విలువ తెలుసు

నీ పాద ముద్రల్ని ఊడ్చేసే చీపుర్లు కూడా

ఖడ్గ చాలనం చేస్తాయ్…

నీ కోట గోడల్ని కూల్చేసే

నీ డేగ రెక్కల విరిచేసే

మా ఖద్దర్ బిడ్డలు నిద్రపోని సముద్రాలవుతున్నారు

యుద్ధం మొదలవకముందే , ఆయుధాన్ని తస్కరించే…

శత్రువై నువ్వొచ్చిన

మాలోనే ఏ నైవేద్యం అడగని

స్వచ్ఛంద దేవతలు అన్నదానాలు చేస్తున్నారు.

శైలి తండ్రి నారాయణ..జగిత్యాలలో ఫోటో స్టూడియో నడుపుతున్నాడు. కరోనా కారణంగా… ఫంక్షన్లు కాదు గదా…బెత్తెడు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోల గిరాకీ లేకుండా పోయింది. ఇల్లు గడవాలంటేనే భయమేస్తుంది. మందు కొడ్తామన్నా డబ్బుల్లేవు…

శైలి..మెల్లిగా తలుపు తెరిచి…” అమ్మ ప్యాడ్స్ ఇవ్వవా “, అంది.

” అప్పుడే అయిపోయాయా…ఎక్కన్నుంచి తేవాలి…లాక్ డౌన్ మొదలయ్యాకా కరివేపాక్కే కరువొచ్చింది “, అమ్మ విసుక్కుంది.

” ఆ విషయం మెల్లిగా చెప్పొచ్చు గా…”, అన్నాడు నాన్న బెడ్ రూం లోంచి వస్తూ…

” ఇంకేం మెల్లిగా…నా బొందలాగానా…”, అమ్మ అరిచినట్టుగా అంది.

అప్పుడే…అంతరిక్షంలో తిరిగే వాళ్ళలాంటి డ్రెస్ వేసుకుని…ఇంటి ఓనర్ వచ్చాడు. అది చూసి నారాయణ, బాత్రూం లోకి వెళ్ళి దాక్కున్నాడు.

” నారాయణ…నారాయణ “, గట్టిగా అరిచాడు ఓనర్ . లత వంటింట్లోంచి బయటకు వచ్చింది.

” రండన్నయ్య…కూచోండి “, అంది లత.

” నేను కూచోడానికి రాలేదు. నాలుగు నెలల కిరాయివ్వాలి. ఎప్పుడిస్తారు..మీ ఆయనెక్కడ “, అన్నాడు సీరియస్ గా.

” ఆయన బాత్రూం లో ఉన్నారు “, అంది వినయంగా.

“మళ్ళీ వస్తాను…డబ్బులు రెఢీ చేసుకొమ్మను …నువ్వు మాస్క్ పెట్టుకోమ్మా..”,అంటూ వెళ్ళాడు.

నారాయణ బాత్రూం లోంచి వచ్చాడు.

” ఛీ ఛీ…దొంగ బతుకైంది “, అంది లత అసహనంగా,

” ఎవరిదే దొంగ బతుకు..?”, అడిగాడు నారాయణ ఆవేశంగా…

” ఊ…నాదే..”,

శైలి కి తెలుస్తోంది…ఇంట్లో తుఫాను మొదలవుతుందని..

కడుపు నొప్పి వస్తున్నా…బలవంతంగానైనా ఏదో రాయాలని పెన్ను, పేపర్ తీసుకుంది. తాతయ్య చెప్పేవాడు ‘పెన్ ‘ తో రాయటం కాదమ్మ…పెయిన్ తో రాయాలి అని.ఇప్పుడు తనకి రెండు ఉన్నాయని నవ్వుకుంది.

‘నాకు గోరంత స్వేచ్ఛ కావాలి,

నాకు చిటికెడు సంతోషం కావాలి,

నాకు పిడికెడు దుఃఖం కావాలి,

నాకు బెత్తెడు చోటు కావాలి,

నాకు దోసెడు స్వప్నాలు కావాలి,

నాకు చారెడు చిరునవ్వులు కావాలి,

ఇంకా చాలు…

వామనుడిలా వ్యాక్సిన్ రూపం లో అవతరిస్తాను…’,

అని రాసింది..

కానీ తాతయ్య కి నచ్చకపోవడం తో చించేసింది..!

కొన్ని రోజులకి..

శైలి మరో కవిత రాసింది..

ఊపిరి తిత్తుల్లో రహస్యం గా

మృత్యుగీతం పాడుతోంది కరోనా

లయ తప్పిన ఆ శ్వాస వింటే…

మరణ సందేశం విన్పిస్తుంది

దేవుడి ముందు పెట్టిన నైవేద్యం

లాక్ డౌన్ లో పాచిపోయింది.

కుబేరుడికి కూడా కోవిడ్ వచ్చిందేమో…

గుప్పెడు అటుకులు చాలనే కుచేలుడయ్యాడు

ఆన్ లైన్ లో పాఠాలు వింటున్న తమ్ముడు

వరిగొల్కల్ని ‘అన్నం చెట్టు’ అంటున్నాడు.

పాలిచ్చే బర్రెని చూసి ‘మిల్క్ రోబో’ అనుకుంటున్నాడు.

వ్యాక్సిన్ కనుగొంటావంటూ దేశాలు

పొక్కిలైన కళ్ళలో తడిపుట్టిస్తున్నాయి

నెర్రలు జూపిన గుండెలు…బతికించమని

ఆర్తనాదాలు చేస్తున్నాయి… ప్రేమించిన చెలికాడికి

కాల్ చేస్తే…కవరేజ్ ఏరియాలో లేడని వస్తోంది.

అంతకన్న ముందే…అపశకునం పలికినట్టే

కరోనా శ్లోకం విన్పిస్తోంది.

అది చదివి తాతయ్య… శైలి నీలో స్పందించే గుణం ఉందమ్మా. ఇంకా బాగా రాయి…అనగానే, ” తాతయ్య…ఈ గదిలో బందీ గా ఉన్నట్టుంది. నాకు కవిత రాయాలని మనసొప్పడం లేదు. నన్ను బయటికి తీసుకెళ్ళండి. ప్లీజ్…”, అంది బాధగా

శైలిని నిరుత్సాహ పర్చడం ఇష్టం లేకుండా “చూడమ్మ..ప్రముఖ కవులందరూ…నిర్బంధం లోనే గొప్ప కవితలు రాసారు. కునుకు తీసేందుకు కటిక నేల, మనసుకి శరీరానికి కూడా స్వేచ్ఛ లేని బంధీఖానా .. తినేందుకు సిమెంట్ ని కలిపిపెట్టిన రొట్టెలు, తీవ్రమైన అనారోగ్యం, నిత్య ప్రాణ భయం, తన జనం, తన కుటుంబం ఎలా ఉందో కూడా తెలియని స్థితి…ఇలా చావుకి బ్రతుక్కి ఉన్నా సంధీ కాలంలో కూడా మంచి కవిత్వం రాయొచ్చన్నా దాశరథి. జైలు గోడల మీద చెరబండరాజు, ‘అర చేతుల్ని అడ్డు పెట్టి సూర్య కాంతి ని ఆపలేవు…’,లాంటి రాసారు. అలాగే గంగు, ప్రజల మనిషి వంటి వట్టికోట ఆళ్వారుస్వామి నిర్బంధం లోను రచనలు చేసారు. అందుకని నువ్వు బాధపడకు… ఇంకో మూడు రోజులైతే…ఐసోలేషన్ పీరియడ్ అయిపోతుందని ఓదార్చాడు.

తర్వాత రోజు మరో కవిత రాసి…తాతయ్యకందించింది.

నీ ఉనికి కన్పించని… నెత్తుటి మరకల్లేని

పత్రిక చూడాలనుంది

కన్పించని సంకెళ్ళను తెంచి

దిక్కులు పిక్కటిల్లెలా రుద్రగీతం పాడాలనుంది

కరోనా గుండెలపై డీజే పెట్టుకొని

పాదాలు చిట్లిపోయేలా ఆడాలనుంది

అమ్మ చిర్నవ్వుల ఒడిని చేరి

సముద్రాల్ని మోస్తున్న నాన్న భుజాలపై

పువ్వునై వికసించాలనుంది.

శ్వాసని ఆపేస్తున్న కరోనాని…

అక్కని అగ్నిగుండం లో తోసేసిన కట్న పిశాచాలతో పోలిస్తే…

అనంతమైన ఆకాశంలో ఆకునై రాలిపోవాలనుంది.

కన్నీటి మౌన భాషనవుతున్నాను

ఉచ్ఛ్వాస గొంతులో తన్నుకుంటుంది.

పరమాణవంతలేని…నువ్వు ప్రపంచానికి పురిటి నొప్పులు చూపిస్తుంటే

నేను మాత్రం నీ మృత్యుపత్రం మీద సంతకం చేయలేను.

కవిత నై వికసించి… పుస్తకమై విస్తరించాలనుంది..

మర్నాడు…

శైలి గదిలోంచి ఏ కవిత రాలేదు… ముడతలున్న ఏ కాగితం రాలేదు. తాతయ్య కలవరపడ్డాడు. తల్లి మనసు తల్లడిల్లిపోయింది..

తండ్రి…తమ్ముడు గుండె చెదిరిపోయింది.

సుడులు తిరుగుతున్న దుఃఖంతో ఐసోలేషన్ గది తలుపులు తెరిచారు.

శైలి అపస్మారక స్థితిలో ఉంది…అంతా కంగారు పడుతున్నారు…తాతయ్య వంటింట్లోకి వెళ్ళి గ్లాస్ లో నీళ్ళు తెచ్చి ముఖంపై చలకరించాడు…తల్లి ఏడుస్తూనే వుంది..

మెల్లగా కళ్ళు తెరిచింది…

” కళ్ళు తిరిగాయి… చీకట్లు కమ్మాయి…”,అంది నీరసంగా.

పది నిమిషాల తర్వాత…పూర్తిగా కోలుకుంది.

పీడకలలా వచ్చి… నెత్తుటి కథలు చెప్పబోకు…

ఊడల మర్రిలా పెరిగి ఊపిరితిత్తుల్ని చుట్టేసుకొకు

మధురమైన మరణ జ్ఞాపకాన్ని తుంచేసావ్ కదే

అనుబంధాల్ని, ముక్కలు ముక్కలుగా తెంచేసావ్ కదే

అయినా… చావును ప్రేమించిగల మా సైన్యం

నీ మీద నిలబడి…శిరసెత్తి సింహనాదం చేస్తారు.

నమ్మకంగా కలగంటున్నాను…

నీపై దుఃఖ నిఘంటువునే…ఆవిష్క…

నారాయణ లోపలికి రాగానే శైలి రాయడం ఆపింది. నీ ఐసోలేషన్ పీరియడ్ అయిపోయిందిరా, నీ రిపోర్ట్ లో కూడా నెగిటివ్ వచ్చింది. శైలి తృప్తిగా శ్వాస తీసుకుంది.

శైలి చేతుల్లోని కాగితం మడత తీస్కొని నారాయణ ‘ఇవేం పిచ్చి రాతలే…’,అన్నాడు. తాతయ్య ‘మెల్లిగా లే బిడ్డా..’,అంటూ చెయ్యందించాడు.

నెమ్మదిగా బయటకొచ్చిన శైలి కి బయట ప్రపంచపు గాలి తగిలి… ఏవో స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్నట్లుంది.

అప్పుడే బయటనించి, ” అమ్మా… అన్నముంటే పెట్టండమ్మా “, అని గిన్నె పట్టుకొని ఏడేళ్ల పిల్లాడు నిల్చున్నాడు.

చెదిరిన జుత్తు…చిరిగిన దుస్తులతో…మురికి మురికి గా వున్నాడు..

దీనంగా నిల్చున్నాడు …

ఒక శైలి మాత్రమే వాన్ని గుర్తుపట్టింది…

వాడు చనిపోయిన పని మనిషి రంగమ్మ కొడుకు.

లత కూడా గుర్తుపట్టింది… వాడు దైన్యంగా ముఖంపెట్టి…’ అమ్మ ఆకలేస్తుంది…’, అన్నాడు.

లత మనసు మంచులా కరిగిపోయింది. కండ్ల నిండా నీళ్ళు తిరిగాయి…వానికి కరోనా ఉందో లేదో చూసుకోకుండానే…వెళ్ళి వాణ్ణి హత్తుకుంది.

శైలి, వాళ్ళ తాతయ్య ఆశ్చర్యపోయారు. టీవీ లో ‘ గాయపడిన కవి గుండెల్లో…రాయబడని కావ్యాలెన్నో…’, దాశరథి గీతాన్ని దేశపతి శ్రీనివాస్ ఆర్ధంగా పాడుతున్నాడు.

ఆ దృశ్యం చూసిన శైలి మనసులో ఎన్నెన్నో భావతరంగాలు ఉప్పొంగుతున్నాయి …!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com