తెలంగాణ పాట ప్రపంచ వ్యాప్తమై శతాబ్దాలు గడిచినా ఇంకా ఇక్కడి పాటపైన సమగ్ర పరిశోధన జరగలేదనే చెప్పాలి. ఆచార్య బిరుదురాజు రామరాజు జానపద గేయ సాహిత్యానికి, ఆచార్య యెల్దండ రఘుమారెడ్డి తెలుగు పల్లెపదాలలో ప్రజాజీవితానికి, ఆచార్య జయధీర్ తిరుమలరావు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పాటలకు, డా. గోపు లింగారెడ్డి శ్రామికగేయాలకు, డా. కె. రుక్నుద్దీన్ జానపదసాహిత్యంలో అలంకార విధానానికి, ఆచార్య ఎస్వీ సత్యనారాయణ ఉద్యమ గీతాలకు, డా. పసునూరి రవీందర్ తెలంగాణ పాటలోని ప్రాదేశిక విమర్శకు పరిమితమైపోయారు. కాని తెలంగాణ పాట సమగ్ర స్వరూపాన్ని నిరూపించిన పరిశోధన ఇంకా పూర్తిస్థాయిలో జరగలేదు. తెలంగాణ పాటలోని ఒక్కో కోణాన్ని స్పృశిస్తూ అక్కడక్కడ వ్యాసాలైతే చాలానే వచ్చాయి.

తెలంగాణ నేల మీద అనేక సంస్కరణ ఉద్యమాలు జరిగాయి. శివకవియుగంలో పాల్కురికి సోమనాథుడు శివుని ముందు అందరూ సమానులే అని ప్రచారం చేసి ఆయన తన కాలం నాటి అనేక జానపద జావళీలను పేర్కొన్నాడు. శ్రీనాథుడు కూడా పల్నాటి వీరచరిత్రలో తెలంగాణలోని ‘బవనీల పాటలు, ఎల్లమ్మ పాటల’ ను పేర్కొన్నాడు. భక్త రామదాసు పాటలపై కూడా ఇంకా పూర్తిస్థాయిలో పరిశోధన జరగలేదనే చెప్పాలి. స్వేచ్ఛా, స్వాతంత్ర్యాల కోసం, వెట్టిచాకిరి నిర్మూళన , మద్యపాన నిషేధం , పన్నులకు వ్యతిరేకంగా, గ్రంథాలయోద్యమం, అంటరానితనానికి, వ్యభిచారానికి, ఆడపాపల ఆచారానికి, జోగినీ, దేవదాసి ఆచారానికి వ్యతిరేకంగా, భూదానోద్యమ ప్రచారానికి, అక్షరాస్యత కోసం, ఖాదీ వస్త్రధారణ, స్టేట్ కాంగ్రెస్ ప్రచారానికి, ఆర్య సమాజ ప్రచారానికి, భూమి, భుక్తి, విముక్తి కోసం, సోషలిష్టు ఉద్యమాల ప్రచారానికి, హిందూ మహాసభల కోసం, శుద్ధి ఉద్యమ ప్రచారానికి, కూలీ జీతాల పెంపుకోసం, ఆంగ్లేయపాలనలో దేశభక్తి పెంపుదల కోసం, వందేమాతర ఉద్యమ సమయంలో, ఆంధ్రమహాసభల ప్రారంభ, ముగింపు సమయాల్లో, తెలంగాణ పోరాటవీరుల స్మృతి పాటలు, గణేష్ ఉత్సవాల పాటలు, వివిధ పండుగల పాటలు, ప్రభాతభేరి పాటలు, పీరీలపాటలు, ఉర్సు పాటలు, భక్తిపాటలు, భజనపాటలు, తందనానపాటలు, తత్త్వగీతాలు అనేకం పురుడుపోసుకున్నాయి. సాహిత్య చరిత్ర పుటలకెక్కని ఎన్నో వేల జానపద పాటలు ప్రజల నోళ్లల్లో ఇప్పటికీ నానుతూనే ఉన్నాయి. కాని దురదృష్టవశాత్తు వాటిని మనం రికార్డు చేసుకోలేకపోయాం . అట్లా ఎంతో విలువైన గేయ సాహిత్యం కాలగర్భంలో కలిసిపోయింది. అయితే సురవరం ప్రతాపరెడ్డి, సీతారామనాయుడు, గంగుల శాయిరెడ్డి, ఇల్లిందల సరస్వతీదేవి, అచ్యుతరాజు వంటి వారు కొన్ని తెలంగాణ స్త్రీల పాటలను సేకరించారు. సీమాంధ్రకు చెందిన వారైనా రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొడమేగాకుండా అనేక తెలంగాణ జానపదగేయాలను సేకరించి సంపుటిగా తీసుకొచ్చిన వారు లక్ష్మీకాంతమోహన్. ఇవిగాక అంతగా ప్రచారంలేని పాటలు కొన్ని అక్కడక్కడ పేర్కొనబడ్డాయి అలా విస్మృతికి గురైన 1956కు ముందటి తెలంగాణ పాటను రేఖా మాత్రంగా పరిచయం చేయడమే ఈ వ్యాస లక్ష్యం.

1908 సెప్టెంబర్ 28న హైదరాబాద్ నగరంలో 17 సెంటీమీటర్ల వర్షం కురవడంతో మూసీ (ముచికుంద) నది వరదలతో ఉప్పొంగింది. దీంతో నగరం సగానికి పైగా నీటిలో మునిగిపోయింది. కొన్ని

వేల మంది నిరాశ్రయులయ్యారు. మరెన్నో వేల జంతువులు, మనుషులు మరణించారు. ఇండ్లన్నీ నీటిలో మునిగిపోయాయి. వరద బాధితులకు ఉచిత భోజన, నివాస ప్రాంతములను ఆనాటి ప్రభుత్వం కల్పించింది. ఆనాటి నవాబు మహబూబ్ అలీఖాన్, ఆయన ప్రధాన మంత్రి మహారాజా సర్కిషన్ ప్రసార్లు స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ వరదలను చూసి జగిత్యాల ఆదికవిగా పేరుపొందిన జైశెట్టి రాజయ్య (1842-1921) ‘ముచికుంద ప్రళయతాండవము’ శీర్షికన కొన్ని గేయాలను రాశాడు. ఈ గేయాలలో ఆనాటి నిజాం ప్రభవు ప్రజలను తన కన్నబిడ్డల్లాగా చూసుకున్నాడని చెప్పడం గమనించదగింది.

“ముచికుంద నది వచ్చెనయ్యయ్యో

పట్నమును ముంచి చెడగొట్టెనయ్యయ్యో

ముచుకుంద నది వచ్చె మునిగె పట్నము సగము

నశియించి జనులంత నదిలో గొట్టుక పోయిరి ||ముచి||

కనబడ్డా పీనుగులా జూచిరీ

అడవికట్టె మండెల రీతి మోసిరీ

దినమూలు మూన్నాల్లు దినమూలు మొయ్యంగ

పీనుగులు ఏడు వేలెనుభై మూడె దొరికె ||ముచి||

రాజాధి మహబూబు రాజురా

మనల రక్షించే ధైర్యంబు రాజురా

యజమాని మనరాజు ఎంతో ధర్మాత్ముడై

సుజనూడై పాలించి ప్రజలాకన్నము బెట్టె” ||ముచి||

ఈ గేయంలో కవి మూసీ నది ఉగ్రరూపాన్ని కన్నులకు కట్టినట్టు వర్ణించాడు. దైవానుగ్రహం ఎలాంటిదో కాని అదే రోజు వివిధ గ్రాల నుండి ఏదో పని పై వచ్చి మూసీనది వరదల్లో కొట్టుకుపోయినవారు వేల

కొలది ఉన్నారని కవి ఆవేదన చెందాడు. లెక్క రాసిన దస్త్రాలు, చెట్లు విరిగి నగరమంతా అతలాకుతలమైందని బాధపడ్డాడు. మూడు నాలుగు రోజులు పీనుగులను మండెలా వేసి మోశారని, ఈ దృశ్యాలను చూసి నవాబు తీవ్రమైన ఫికర్ తో తన్లాడినాడని వర్ణించాడు. ఈ కవి రాసిన పాటలు కొన్ని ‘మనస్సంబోధన కీర్తనలు’ పేర 1933లో ముద్రణ పొందాయి.

1930లో జోగిపేట మొదలుకొని 1946 కంది సభదాకా మొత్తం 13 ఆంధ్రమహాసభలు జరిగాయి. ఈ సభల ప్రారంభంలో, ముగింపులో పలు ప్రార్థనాగీతాలు, జాతీయ గీతాలు, మంగళగీతాలు పాడేవారు. సుదర్శన్ రెడ్డి అనే గాయకుడు ఇలా చాలా పాటలు వినిపించేవాడు. 1936లో షాద్ నగర్ లో జరిగిన ఐదవ ఆంధ్రమహాసభలో మంత్రి ప్రగడ వెంకటేశ్వరరావు కింది ‘తెలంగాణ గీతాన్ని పాడి వినిపించారు..

“ఈ తేనె మాగాణి/నీ తెలంగాణమ్ము/నా తల్లియని పాడరా! నీ జీవ మాతగా సేవింపరా!/ తమ్ముడా నీ జీవ మాతగా సేవింపరా!! శ్రీరామ చంద్రుడు/సీతా మహాదేవి/కారామగృహమయ్యెరా!

ఈ భూమి ఆతిథ్యమ్ముల సీమరా! తమ్ముడా! ఈ భూమి ఆతిథ్యమ్ముల సీమరా!!”

తెలంగాణ వైభవాన్ని చాటుతూ సాగిన ఈ పాట ఆనాడు సభలో పాల్గొన్న ఎంతో మంది తెలంగాణ ప్రజల మన్ననలను పొందింది. ఉర్రూతలూగించింది. ప్రతి ఒక్కరూ తాను తెలంగాణ నేల మీద పుట్టినందుకు గర్వపడేలా చేసింది. తలెత్తుకొని తిరిగేలా, గుండెల నిండా ఆత్మవిశ్వాసం నిండేలా చేసిందీ పాట. ఐదు చరణాలుగా సాగిన ఈ పాటలో పోతన భాగవతము ద్వారా తెలంగాణ నేలలో తెలుగు భాష మిన్నంటిందని, కాకతీయ రుద్రమ్మదేవి రౌద్రం దశదిశలా పాకిందని తెలంగాణ ఔన్నత్యాన్ని కొనియాడడం కనిపిస్తుంది. వీరే రాసిన సుమారు 15 పాటలు ‘జాతీయగీతములు’ పేరిట 1939లో ప్రచురింపబడ్డాయి. ఈ పాటల పుస్తకం ఇలీవల తెలంగాణ ప్రచురణ సంస్థ పునర్ముద్రించింది. ఇందులో భక్తి, దేశభక్తి, ఆర్యసమాజ ప్రచార గీతాలు, రైతుల, పేదల బాధల గురించిన గేయాలున్నాయి. వీరిని ప్రశంసిస్తూ సురవరం ప్రతాపరెడ్డి “పాటలు రచించుటలో వీరికి మంచి నేర్పు అలవడినది. అవిద్యాంధకారములో దిక్కు తెలియని ఈ నిజాం రాష్ట్రమునకు ఇట్టి విజ్ఞాన ప్రదములును, ప్రబోధకరములునగు భజనావళి వెలుగు నిచ్చునవైయున్నవి. మంచి గానముల వలన ప్రజలలో కలుగునట్టి జాగ్రత మరే విధమున కాజాలదని విశ్వసింతును” అని అభిప్రాయపడ్డారు.

“రండోయి ప్రజలారా రాజ సౌధమునకు

రక్కసుల కృత్యములు తెలుపుకొనగ

రక్షసుడు మన రాజు రక్కసుల శిక్షించి

రక్షించు మన బీదప్రజల త్వరగ ||రండోయి||

పండ మంచము లేక తిండికన్నము లేక

ఎండి చచ్చేదిట్టు లెందాక

దండివారలు జేయు దుండగములకు తాళి

యుండజాలమటంచు తెలుపుకొనక

పొట్టకన్నము లేక వెట్టిచాకిరి చేసి

కొట్టుతిట్టులు మనము పడనేలా!

వెట్టిజేయుటకేన! పుట్టింది జగతిలో

ఇట్టులూరక చూచుచుండుటేలా! ||రండోయి||

‘అష్టకష్టములిట్లు పడనేలా!’ అంటూ సాగిన ఈ పాట వెట్టిచాకిరికి వ్యతిరేకంగా రాసిన పాట. తెలంగాణలో తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు దాకా ఈ వెట్టిచాకిరి అనధికారికంగా సాగిన మాట నిజం. ఈ సాంఘిక దురాచారానికి వ్యతిరేకంగా ఆనాడు అనేక మంది తెలంగాణ కవులు, రచయితలు, గాయక కవులు నిరసిస్తూ పాటలు రాసి, తిరగబడందే ఇది రూపుమాసిపోదని చైతన్యం కలిగించారు. అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదు. ఇంకెన్నాళ్లు మనం కనీసం అన్న వస్త్రం లేక అల్లాడి చావడమని కవి ప్రశ్నిస్తాడీ పాటలో. ఈ పాటతో పాటు ‘అయినదేమో ఆయె పోనీయండి’, ‘కర్షకా!’, ‘కష్టములెన్నేనియు రానిమ్ము’ అనే పాటలు ఆనాడు చాలా ప్రజాదరణ పొంది ఈ కవికి చాలా పేరు తీసుకొచ్చాయి. ప్రజల్లో ఎంతో కదలికను తీసుకువచ్చాయి.

1943 – 44 లోనే జొన్నవాడ రాఘవమ్మ అనేక భక్తిపాటలు, భజన పాటలు, కీర్తనలు, దేశభక్తి పాటలు,

జానపదగేయాలు రాసింది. ఈమె రాసిన అనేక పాటలు ఆకాశవాణిలో లలితగేయాలు శీర్షిక కింద ప్రసారమయ్యాయి. ఈమె రాసిన 159 పాటలతో ‘రాధికా గీతాలు’, 119 గేయాలతో ‘భావతరంగాలు’ ముద్రితమయ్యాయి.

“నడచిరారా కృష్ణయ్య నడచిరా

నా మనసు బాటలోకి నా పేద గూటిలోకి

తలచి తలచి తనువు మనసు అలసి సొలసి పోయినది

ఎన్నాల్లో నిలవదు ఈ స్థిరము లేని జీవితం

కన్నులారా ఒక్కసారి కాంచెద నీ రూపం” ||నడచిరారా||

అచంచలమైన భక్తితత్వంతో శ్రీకృష్ణుని కీర్తించిందీ పాటలో. ఈ గేయంలో భక్తి ఒకవైపు జీవిత తాత్త్వికత మరోవైపు తొంగిచూస్తాయి. జీవితం క్షణభంగురం కాబట్టి జీవించియున్నప్పుడే ఆ దేవదేవుని కీర్తించాలంటుంది. ఇదేగాక మంచి భావనాత్మక గీతాలు కూడా అనేకం రాసిందీ కవయిత్రి. “ఆకసమ్మున అల్లిబిల్లిగ – అలికి చుక్కలు దిద్దిరెవ్వరు/ అందమగు ఆ చందమామను కందుకము వలె కదిపిరెవ్వరు” అని, భారత ప్రథమ ప్రధాని నెహ్రూను కీర్తిస్తూ “విరిసిన గులాబి ఎదపై నిలయం/త్యాగం ధైర్యం చెదరని హృదయం” అని పాడింది.

మరో కొన్ని గీతాల్లో. ఇవేగాక తెలంగాణ పోరాటగేయాలు కూడా కొన్ని రాసింది.

1939లో భద్రాచలం పుట్టిన డా. చక్రవర్తుల లక్ష్మీనరసమ్మ 1948లో మహాత్మాగాంధీ మరణవార్త విని ‘భారత జనకుడు ఇక లేడు/గాంధీ తాత ఇక లేడు’ అని తన గేయ యాత్ర ప్రారంభించింది. కావ్యగౌతమి, మాతృభూమి, తులసీ దళాలు, భక్తిగీతావళి, దివ్యగీతాంజలి… ఇలా దాదాపు పాతిక పుస్తకాలు వెలువరించింది. ఈమె పాడిన పాటలు కొన్ని ఆకాశశాణిలో ప్రసారమయ్యాయి.

“మేఘము నీవే అనుకొని ఆడెద నేనే నెమలినై

కలనైనా ఇది చాలు/తెలవార నీకురా” రసజగత్తులో నిలయముండే ఆ దేవుడ్ని విషతుల్యమైన లోకంలో నివసించే మానవుడు చేరుకోవాలంటే చాలా కష్టం. మనం ఆయనను చేరుకోలేం అంటుంది లక్ష్మీనరసమ్మ. నైజాం వ్యతిరేకపోరాటంలో ‘చుట్టకాముడు’ అనే

జానపద కళారూపం నల్గొండ జిల్లాలో చాలా ప్రసిద్ధిగాంచింది. ప్రజలు కుల, మతాలకతీతంగా దోపిడికి వ్యతిరేకంగా ఒక్కటైపోయి ఈ ‘చుట్టకాముడు’ ఆటలో పాల్గొంటారు. ఈ ఆటలో పాడుకునే అనేక పాటల్లో బతుకమ్మ పాటల్ని పోలిన పాటలు కూడా ఉన్నాయి. ఇందులో భాగంగా మల్లు స్వరాజ్యం రాసిన ఉయ్యాలపాట నల్గొండ

జిల్లాలో చాలా పేరుగాంచింది.

“వీరమట్టారెడ్డి ఉయ్యాలో/ మీ వీరమరణమును ఉయ్యాలో

మీ వంటి వీరులు ఉయ్యాలో/మాకు వెల్గు చూప ఉయ్యాలో

ఆ దొంగ దోపిడులు ఉయ్యాలో/ఆంధ్రమహాసభ ఉయ్యాలో

హడలెత్తి సంఘాన్ని ఉయ్యాలో/పాత సూర్యాపేట ఉయ్యాలో

ధీర అనంతారెడ్డి ఉయ్యాలో మరువమెన్నటికైనా ఉయ్యాలో“

ఈ పాటలో నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వీరయోధుల త్యాగాలు, వారిని ప్రజలు కీర్తించిన విధానాన్ని చిత్రించింది మల్లు స్వరాజ్యం . 1951 ఆగష్టు 15న భువనగిరిలో నక్క ఆండాళమ్మ (డా. ఎన్. గోపి అక్క) అనే యువతి అక్కడి ఒక దర్గాలో కొంత మంది దుండగుల చేతిలో అఘాయిత్యానికి గురై వాళ్ల చేతిలోనే చంపబడింది. ఈ ఘోరమైన దృశ్యాన్ని ఆనాడు బల్ల గౌతమయ్య అనే కవి బతుకమ్మ పాటగా మలిచాడు. ఈ పాట ఇప్పటికీ తెలంగాణ పల్లెల్లో మారుమ్రోగుతుంది. “కారుమూకలు నన్ను ఉయ్యాలో/ కాల్చుచున్నారమ్మా ఉయ్యాలో జాలిగా ఈ రీతి ఉయ్యాలో తలపోసి ఆయమ్మ ఉయ్యాలో పాడు దరగలోన ఉయ్యాలో/పాణాలు విడిచింది ఉయ్యాలో…” ఇలా సాగుతుందా బతుకమ్మ పాట. ఈ వరుసలోనే కొమురం భీము, దొడ్డి కొంరయ్య, సీమ గురువయ్య లాంటి పోరాట వీరుల మీద చాలా స్మృతి గీతాలు వచ్చాయి. ఆర్. కమల అనే గాయకురాలు కూడా చాలా బతుకమ్మ, బొడ్డెమ్మ పాటల్ని రాసింది. ఆంధ్రసారస్వత పరిషత్తు నల్గొండ

జిల్లా శాఖ ప్రచురణగా 1946లో మూటువూరు వెంకటేశ్వరరావు సంపాదకత్వంలో ‘తొలిసంజ’ పేరుతో నల్గొండ

జిల్లా ఆధునిక కవితా సంకలనం ఒకటి వెలువడింది. ఇటీవల ఇది డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి సంపాదకత్వంలో పునర్ముద్రణ పొందింది. దీని ప్రత్యేకతేమిటంటే ఇది

భావకవిత్వం ముగిసి అభ్యుదయ కవిత్వం మొదలవుతోన్న సంధి దశలో వచ్చింది. ఇందులో మూడు పాటలున్నాయి.

“వెలిగించరా జ్యో తి వెలిగించరా

కటిక చీకటులెల్ల మటుమాయమై తొలగ ||వెలి||

పగలెల్ల శ్రమజేసి పరుగుపరుగున వచ్చి

పూరిండ్లలో జెలగు కారుచీకటి నడుమ

జీననాశారిరణ చిహ్నాల తడవికొని

యేడ్చు తమ్ముని బరువు టెదలోని సొదదీర ||వెలి||

అధికారమనే చీకటి ఆవరించిన కుటిల విశ్వమానవ శాంతి అనే వైభవోపేతమైన సభలలో చినిగిపోయిన పేలికలను ధరించి ఎముకలన్నింట మృత్యువు ఎగసి తాండ వమాడుతుంటే కడుపు మంటకు గంజి నీళ్లు కూడా దొరకని ఈ వెర్రి రైతును చూసి విసుక్కునే వారిని చూసి ఒకమారు జ్యోతిని వెలిగించు అని కవి విన్నవించుకుంటాడు. రైతు జీవితంలో వెలుగే లేదు. ఆరుగాలం కష్టపడి పంటతీసినా అధికారులు నిర్ణయించిన ధరకే పంటను అమ్ముకోవాలి. ఇలా లోలోన కుమిలిపోతున్న రైతు సోదరుల బెంగను తీర్చడానికి కవి జ్యోతిని వెలిగించమంటాడు.

“నీ శక్తి చూపించు కవిలేఖినీ!

రక్తి కట్టింపుమో కవి లేఖినీ!!

నిఖిలాంధ్ర జగమునకు నీ వెలుగులుండాలె

నీవు నడిచిన బాట పూదోట కావాలె

నిశ్చలంబగు కీర్తి నిలిచిపోవాలె ॥నీ శక్తి!

కష్టజీవుల పాట కర్షకావళి మాట

నీ మాటలన్నిటిలో నిండిపోవాలె

కఠినంపు గుండెలే కరిగిపోవాలె” ||నీ శక్తి||

కవిలేఖిని కర్షకుని వైపు నిలబడాలని ఆకాంక్షిస్తూ రాసిన పాట ఇది. కవి కలం నుండి కష్టజీవుల,

కర్షకుల పాటలు జాలువారాలని, ఆ పాటకు ఎంతటి కఠినమైన గుండెలైనా కరిగి పారాలని కోరుకుంటాడు కవి. అంతేకాదు కవి కలం దుండగుల పాలిట దండంగా మారి దు:ఖ జీవుల దు:ఖాన్ని పారద్రోలాలని, మత, వర్గ భేదాలను రూపుమాపాలని కవి ఆకాంక్ష.

ఆణిముత్యాల్లాంటి పాటలెన్నో తెలంగాణ నేల చుట్టూ, తెలంగాణ మనుషుల చుట్టూ, తెలంగాణ పల్లెల చుట్టూ, ప్రకృతి చుట్టూ అల్లుకుని ఉన్నాయి. కాలం కత్తెరలో పడి నశించిపోయినవి పోగా కనీసం మిగిలిన వాటినైనా మనం సేకరించి భద్రపరుచుకోవాలి. పరిశోధకులు వాటి విశిష్టతను భవిష్యత్తు తరాల వారికి విశ్లేషించి చెప్పాలి. అయితే ఇదంత సులభమైన పనికాదు. విశ్వవిద్యాలయాలు కాని, సాహిత్య సంస్థలు కాని ఆ బాధ్యత తీసుకొని చాలా అంకిత భావంతో, బాధ్యతగా చేయాల్సిన పని. నిఘంటు నిర్మాణాల పట్ల, పాటల సేకరణ పట్ల ప్రభుత్వాలకు కూడా ఒక దూరదృష్టి ఉండాలి. దీనికి బృహత్తరమైన దీర్ఘకాలిక ప్రణాళిక కావాలి. ఎంతో ధన వ్యయం కూడా అవసరమే. తరతరాల మానవుని సాంఘిక చరిత్రని నిర్మించాలంటే ప్రజల హృదయాల్లో కొలువై ఉన్న పాటలను ఆశ్రయించక తప్పదు. భాషా మూలాలు, సంగీత మూలాలు, ఎంతో శాస్త్ర విజ్ఞానంతో పాటు ఎన్నో అమూల్యమైన బాణీలను అధ్యయనం చేయాలంటే పాటలే తరగని ముడిసరుకు అనేది మరిచిపోవద్దు.

-డా|| వెల్దండి శ్రీధర్

9866977741

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com