జాతి నిర్మాతలు సృజన కారులే

జాతికి ఆత్మ గౌరవం ఉండాలె.అట్లాంటి జాతే కళలను అభిమానిస్తుంది .తమ జాతి నిర్మాణం లో స్వతంత్రేచ్చ లో సృజన కారుని పాత్ర గుర్తిస్తుంది .గౌరవిస్తుంది .

నిజానికి సాహిత్యం అంటేనే ఒక ఉద్యమం .అది కొద్ది మందితోనే మొదలవుతుంది ,క్రమంగా సమాజానికి సంక్రమిస్తుంది .నలుగురు విద్యావంతులు చేరినపుడు అదొక సాహిత్య గోష్టి కావాలి.కాకపోతే అట్లాంటి కలయిక కోసమైనా విద్యావంతులు ఒక చోట చేరాలి .కవులు తమ పద్యాలను సహా కవులకు వినిపించుకోవడం ,సహకవులు తమకు వినిపించడమే గాకుండా ,అవి ప్రజలకు వినిపించాలె.ప్రజలు కవులు రాసిన పద్యాలతో మమేకం కావాలె .

సాహిత్యం తన సృజన కాలానికి ప్రాతినిధ్యం వహిస్తుంది .అంతమాత్రాన అది ఆ కాలానికే పరిమితమైనది కాదు .కాలాతీతమైన సార్వజనీనత కూడా సృజనలో ఉంటుంది .

చాలా మంది నాయకులవలె ,సినిమా నటులవలె ,సృజనకారుని వెనుక సామాన్య జనం ఉండకపోవచ్చు ,ఒక పెద్ద గుంపు అతన్ని అనుసరించక పోవచ్చు. అధికార పటాటోపం లేని అతి సామాన్య వ్యక్తి గా అతను కనిపించవచ్చు .

కాని అతను ఒక జాతితో మనగాలుగుతాడు . ఒక జాతికి వారసత్వ సంపద కాగలుగుతాడు .అతని వాక్యాలు ఒక్కోసారి ఒక జీవితకాలపు చమరింత గా నిలిచి పోతాయి .

ఈ ప్రతిభ వల్లే ఆ కాలానికి నాగలి దున్నైనా పోతన ఈ కాలo లో కుడా జీవిస్తున్నాడు .’’నా తెలంగాణ కోటి రతనాల వీణ’’ అన్నపుడు దేహం పులకాంకురం అయ్యేది ఈ సోయి వల్లేనే .నిజానికి పోతన, ,నాటి ప్రభుత్వ నిరాదరణకు గురైన దాశరధి, ‘’బాకున గ్రుమ్మినట్లగును ‘ అని వేదన పడ్డ జాషువా, ,తన కలం తో నిప్పులు కురిపించిన కాళోజి లాంటి వాళ్ళంతా అతి సామాన్యం గా జీవించిన వాళ్ళే .కాని వాళ్ళంతా జాతి స్మరించుకోదగిన మహనీయులుగా తమ స్థానం నిలబెట్టుకొన్నారు .

సాహిత్యానికి కాలం చెల్లి పోయిందనే నిష్ప్రయోజన వాదులు మనకు కనిపిస్తారు .సృజనకారులను అవహేళన చేయడం వారి భాద్యత అన్నట్టుంటుంది వారి వ్యవహారం .’’ఈ రాతలు కోతలు తరువాత ,ముందు నీసంగతి చూసుకో ‘’ అని తమకు తామే పెద్దరికాన్ని ఆపాదించుకొని చిన్నబుచ్చేవాళ్ళుంటారు .మొకాలంత ఎత్తు లేనివారు వీపు తట్టడానికి ప్రయత్నిస్తారు .

నిజమైన ప్రజాక్షేత్రం ముందు ఇవేమీ నిలవవు .గాఢమైన సృజన తప్పక నిలుస్తుంది .అటువంటి అన్వేషణ ,దానితోపాటు సామాజిక ప్రయోజనం ,సృజనకారుని బాధ్యతలు గా మలచుకోవాలి .

ఏ జాతైతే జాతి నిర్మాతలైన కవుల్ని ,గుర్తించదో, స్మరించుకోదో , ఆ జాతి నిర్వీర్యమౌతుంది .కాల యవనిక నుండి నిష్క్రమిస్తుంది .

సృజన —జాతీయత విడగొట్టలేని అంశాలు .

అందుకే సృజనకు మన నీరాజనం .

జై తెలంగాణ, జై జాగృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com