మట్టిపొరల్లో దాగిన మనిషి గుండె సప్పుల్లని ధ్వనిముద్రితం చేస్తే ఎలావుంటుందో ఈ ‘పరంపర’ నవలలో వినవచ్చు. కాలంపొడుగూతా కదిలిపోయిన జీవనసౌందర్యాన్ని మరొకసారి కళ్ళారా చూడాలంటే ఈ నవలలోకి హృదయం పెట్టి చూడాలి.

గ్రామీణ ప్రజల మానవసంబంధాల్లో వృత్తులు ఎంత గాఢంగా పెనవేసుకునిపోయావనేది తెలుసుకోవాలంటే ఈ నవలలోని తిప్పర్తి గ్రామాన్ని సందర్శించాలి. మనిషికి అవసరమైన, నిత్యావసరమైన లోహపాత్రల నుంచి రసోల్లాసం కలిగించే శిల్పాలవరకు అద్భుత నైపుణ్యంతో కళాత్మకంగా తయారుచేసే కంచరవృత్తికారుల చారిత్రక జీవన గమనాన్ని ఆవిష్కరించిన ‘పరంపర’ను చదవడం ఒక సృజనాత్మక అధ్యయన అనుభవం. రచయిత శిరంశెట్టి కాంతారావు కొలిమిలో నిప్పుకణికగా మారి అక్షరాలకు పుటం పెట్టి కంచరవృత్తికారుల ఔన్నత్యాన్ని ఉన్నతంగా చిత్రించారు.

విరాట్ విశ్వకర్మ పంచాననులలో తృతీయులు ‘త్వష్ఠ బ్రహ్మవంశీయులు. వీరు కంచరం వృత్తిచేసే కాంస్యకారులు. ‘త్వష్ఠ’ అంటే రూపంలేనిదానికి రూపాన్ని ఇచ్చేవాడని అర్థం. ప్రాచీన సాహిత్యంలో విశ్వకర్మకు విశిష్టమైన స్థానం ఉంది. దేవతలకు పురోహితుడుగా విశ్వకర్మ ప్రవర్ధిల్లాడంటారు.యజ్ఞయాగాదులలో ఉపయోగించే ప్రత్యేక పాత్రలను తొలిసారిగా రూపకల్పన చేసిన సృజనకారులు కంచర కళాకారులు. అటువంటి ప్రాచీన మూలాలున్న వృత్తికళాకారుల జీవితాలను కేంద్రంగా మల్చుకుని మనకు తెలియని గొప్ప సామాజిక, సాంస్కృతిక గాథలను నవలగా రూపొందించి ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళతారు శిరంశెట్టివారు.

కాలచక్రం ఒక క్రమపద్ధతిలో ఎలా తిరుగుతుందో, ప్రకృతి ప్రణాళిక ప్రకారం తన పరిణామాలను చూపిస్తుందో రచయిత ఈ నవల ఇతివృత్తాన్ని కూడా అంత వ్యూహాత్మకంగా అల్లుకుని తన వెంట నడిపించుకుంటూ వెళ్ళిపోతాడు. నవల స్వాతంత్ర్యానికి పూర్వం నిజాం రాజ్యపాలనాకాలంనాటి నుంచి ప్రారంభమవుతుంది. ఆనాటి బ్రిటీష్ రెసిడెంట్ క్కి ప్యాట్రిక్సన్, నిజాం సంస్థానపు దివాన్ మనుమరాలు ఖైరున్నిసాబేగంల ప్రేమ ప్రతీకైన రెసిడెంట్ భవన సందర్శనలోంచే నవలకు మూలాంశమైన కంచరవృత్తి వైభవానికి బలమైన బీజం పడుతుంది. రెసిడెంట్ కుక్ దంపతులు భవనంలోని కళాత్మకమైన నగిషీలు చెక్కిన ఇత్తడి వస్తువులను చూసి ఆశ్చర్యపడడంతోనే కథంతా తిప్పర్తి గ్రామంలోకి ప్రయాణమవుతుంది. కంచర కళాకారుల అద్భుత నైపుణ్య విశేషాలపై ఆసక్తి ఏర్పడుతుంది.కంచరవృత్తి జనుల మనస్తత్వాలపై దృష్టి ప్రసారితమవుతుంది. ఒక యుగసంధిలో జరిగే పరిణామాలను తెలుసుకోవడానికి భూమిక ఏర్పడుతుంది.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. నిరంకుశ నిజాం ప్రభుత్వం కుప్పగూలిపోయింది. దాంతోపాటు కంచరవృత్తికూడా కునారిల్లిపోయింది. రాజకీయమార్పులు ప్రజల జీవితాలను ఎంత తీవ్రంగా ప్రభావితం చేస్తాయనే విషయాన్ని ఈ నవల రేఖామాత్రంగా నైనా బలంగా స్పృశించింది. ఏ వృత్తివారికైనా పది పదిహేనేండ్లకోసారి వచ్చే వృత్తిగత సంక్షోభాల్ని చెప్పకనే చెబుతుంది. ఈ నవల. ఇలాంటి ప్రమాదాలు, సమస్యలను అధిగమిస్తూ కంచరవృత్తి కళాకారులు ఏవిధంగా జీవనపోరాటాన్ని చేశారో సమగ్రంగా చిత్రించింది ఈ రచన. ఒక శతాబ్దికాలంలో జరిగిన కీలకమైన వృత్తిగత మలుపులను చాలా సహజంగా వివరిస్తాడు రచయిత. ఇందులో ప్రధానపాత్రగా, కుల పెద్దగా ‘పైలా విశ్వరూపాచారి’ ఆలోచనాపథంలోంచి, ఆచరణాత్మక దృక్పథంతో, ఆదర్శవంతంగా కథ నడుస్తుంది. ఈ నడక కంచరవృత్తికారుల నైపుణ్యపుదారిలోనే నడవడం రచయిత ప్రతిభకు నిదర్శనం.

పరంపర నవలలో విశ్వరూపాచారి విశిష్టవ్యక్తిత్వం మనల్ని ఆకట్టుకుంటుంది. అతడి నేపథ్యంకూడా ప్రత్యేకమైంది. చిన్నవయసులోనే కమ్యూనిస్ట్పర్టీలో చేరి సాయుధపోరాటంచేశాడు. అజ్ఞాతవీరుడుగా రజాకార్లతో, యూనియన్ సైనికులతో పోరాడిన ఉద్యమకారుడు. ప్రగతిశీల భావాలతో ఉద్యమానంతర కాలంలో తమ గ్రామంలోని కంచర కుటుంబీకుల జీవనోపాధికోసం తపించిపోయాడు. అంతేకాదు తను స్వయంగా తయారుచేసిన కళాత్మకమైన వృత్తి పనుల ద్వారా రాష్ట్రానికి, తెలుగువారికి

గ్రామానికి, కంచర వృత్తికారులకు దేశవ్యాప్తంగా పేరుప్రతిష్టలను తీసుకొచ్చాడు. ఈ క్రమంలో విశ్వరూపాచారి ఆలోచనాస్థాయి మేధస్సు, నైపుణ్యం, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే విధానాలు, ఉత్తేజాన్ని అందిస్తాయి.

కులవృత్తులు దెబ్బతిన్న సంధికాలంలో బతుకుతెరువు ఎట్లానో అర్ధంకాని సమయంలో విశ్వరూపాచారి తీసుకున్న నిర్ణయాలు ఈ కథకు పరిమితమైవికావు. “పని చేసుకునేవాడికి ఎప్పుడూ పని వుంటనే వుంటది. కాకుంటే ఆ పని కాలానికి

తగ్గట్టు చేసుకుంటూ పొవ్వాల గంతే” అంటూ వృత్తికారుల్లో ఆత్మసైర్యాన్ని నింపుతాడు విశ్వరూపాచారి. కేవలం మాటలతోనే సరిపుచ్చకుండా హైదరాబాద్ తీసుకెళ్ళి మిత్రుడు, వ్యాపారి మూల్‌చంద్ శారడా ద్వారా సహాయాన్ని ఇప్పించి బతుకుపై నమ్మకాన్ని కలిగిస్తాడు. కాలానుగుణంగా వ్యాపారాన్ని విస్తృతం చేసుకునే ఆలోచనలు చేస్తాడు. మనం తయారుచేసే వస్తువులను మన దుకాణంలోనే అమ్మడంకాదు, మనమే కొనుగోలుదారుడు దగ్గరకు వెళ్ళాలనే కొత్త ఆలోచనలు, ప్రయత్నాలు సఫలీకృతం కావడం పఠితలకు సైతం ఆనందాన్ని ఇస్తుంది.

జాతరలో దుకాణాలు పెట్టుకోవడం, గ్రామాలకు వెళ్ళి ఉద్దెరకు సామాన్లు అమ్మి, పంటచేతికొచ్చాక తీసుకోవడం, సంతలోను అమ్మకాలు చేయడం,సంచారవాసిగా బేరాలు సాగించడాలు వృద్ధికారుల బతుకుపోరును తెలుపుతుంది. ఈ వృత్తికారుల పాత్రలన్నీ జీవితంలో మన ఇంటిముందుకు వచ్చిన ఆత్మీయ పాత్రలుగా పలకరిస్తాయి. పాత్రల భావోద్వేగాలు నవలాపరిధిని దాటి పఠితలవిగా పరివర్తన చెందుతాయి.

ఈనవలలో విశ్వరూపాచారి అద్భుత కళానైపుణ్యం, సృజనాత్మక ప్రతిభ, సాధించిన విజయాలు అసామాన్యమైనవి. ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్లో ప్రదర్శించిన శకటానికి ప్రథమబహుమతిరావడం,

జాతీయస్థాయి పోటీల్లో తను తయారుచేసిన ఇంజన్ లోగో ఎంపిక కావడం, ప్రపంచమహాసభల మెమెంటో రూపకల్పన చేయడం, అంతర్జాతీయ హస్తకళల ప్రదర్శనలో ఉ త్తమ కళాకారుడుగా ప్రధానమంత్రితో సత్కరించబడటం, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి ప్రశంసలను పొందడం, విదేశీ ఆలయాల్లో దేవతామూర్తుల ఆభరణాలు, ధ్వజస్తంభాలు చేసే అవకాశం రావడం మొదలైనవన్నీ సహజమైన విజయాలుగా, అర్ధవంతంగా అనిపిస్తాయి. దాంతోపాటు పనిపట్ల అంకితభావం,ఏకాగ్రత, నిరంతరసాధన, అధ్యయనం, పరిశీలనవల్ల ఒక కళాకారుడు ఎంతటి ఉన్నతస్థాయికైనా ఎదగవచ్చనే స్ఫూర్తిని, సందేశాన్ని విశ్వరూపాచారి పాత్ర ఇస్తుంది. ఎంతగా పేరుప్రతిష్టలు వచ్చినా గర్వం తలకెక్కకుండా మునుపటిలా అందరితో కలిసిపోయి మెలగడం అనే సుగుణాలను నేర్పుతుంది. ఈ పాత్ర.మనుషులమధ్య స్నేహం ఎంత నిష్కల్మషంగా, గాఢంగా వుండాలో విశ్వరూపాచారి, మూల్ చంద్ శారడాల స్నేహానుబంధం తెలుపుతుంది. జీవితంలో స్నేహానికున్న విలువ, ప్రయోజనమేమిటో రచయిత నవలలో ఆర్థంగా ఆవిష్కరించారు.

పరంపరలో విశ్వరూపాచారి పాత్ర పలుకార్య నిర్వహణల భారాన్ని మోస్తూ కథాగమనానికి దిశానిర్దేశాన్ని చూపిస్తుంది. ప్రతిసంఘటనలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధాన్ని కలిగివుంటూ జీవితానికి అవసరమైన విషయాన్ని వ్యక్తీకరిస్తుంది. ఈ నవలలో విశ్వరూపాచారి పాత్ర ద్వారా వ్యక్తపరిచిన అభిప్రాయాలుకూడా విలువైనవి. విశ్వరూపాచారి వృత్తికారుడిగా దేవుళ్ళ నగలను తయారు చేస్తున్నా ,వ్యక్తిగతంగా దేవుళ్ళను, గుళ్లను, పూజలను నమ్మనివాడు.మనిషి శ్రమకు, ఆలోచనకు మాత్రమే ప్రాధాన్యమిచ్చే వ్యక్తిత్వంతో కొత్త చూపును ఆవిష్కరిస్తాడు. గ్రామంలో తమకులం యువకులు ఎన్నికల్లో నిలబడతాం అన్నప్పుడు ఒప్పుకోవడం,వారిని ప్రోత్సహించడం మారుతున్న తరాల దృక్పథంగా గుర్తించవచ్చు దాంతో పాటు పూర్వ ఉద్యమ చైతన్యంతో బతుకులో రాజకీయాల ప్రభావాన్ని , వాటి అనివార్యతను అర్ధంచేసుకున్న పరిణామవాదిగాను చూడవచ్చు.

ఈ నవల గ్రామరాజకీయాలను కూడా ఒకింత తీవ్రతతోనే చర్చించింది. విశ్వరూపాచారికి జాతీయస్థాయిలో పేరు ప్రతిష్టలు రావడం, ఊళ్ళో పరపతి పెరిగిపోవడం, కంచరకులస్తుడు సర్పంచ్ గా ఎన్నిక కావడం, కంచరకుల ఆధ్వర్యంలో మొట్టమొదటి సహకార పరపతి సంఘం ఏర్పడడం గ్రామంలోని అగ్రవర్ణాలవారికి మింగుడు పడడం లేదు. తమ దొరతనం, ఆధిపత్యం, రాజకీయ అధికారం కోల్పోవడం భూస్వామి రంగారెడ్డి, కరణం రాఘవరావు పంతులు అవమానంగా భావించారు. కంచరకులంవాళ్ళకు, కంచరపనులుచేస్తున్న ఇతర కులాల మధ్య నున్న అవగాహనను, ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నంచేసి సఫలీకృతులయ్యారు. గ్రామంలో విభిన్న బలహీస, బడుగువర్గాల వారు పరస్పర సహకారంతో అన్యోస్యంగా మెలగడం ఆధిపత్యవర్ణాలవారు సహించలేరనడానికి ఈ నవలలో రచయిత చిత్రించిన సంఘటనలు స్వాభావికంగా ఉన్నాయి. దొరల కుట్రలు, ఎత్తుగడలు, మాటలను శక్తివంతంగా చూపుతాడు నవలాకర్త. “కూసం విడిచిన పాము బుసకొడుతున్నట్టుగా శ్వాసతీసుకుంటూ” కరణం రాఘవరావుపంతులు మాట్లాడుతున్నాడని గ్రామరాజకీయాల్లోని విషపూరిత మనస్తత్వాలను వర్ణిస్తాడు. ఇట్లాంటి సందర్భాలను ఊహించే విశ్వరూపాచారి ఒక సందర్భంలో రాజకీయాలు తమ కులవృత్తికి ఆటంకం అవుతాయన్న భయంతో రాజకీయ విషయంలో వెనకడుగు వేస్తాడు. రాజకీయాలకు దూరంగా ఉండాలనే అసంబద్ధ నిర్ణయం తీసుకుంటాడు. బడుగు బలహీన వర్గాలవాళ్ళు రాజకీయంగా ఎందుకు ఎదగలేకపోతున్నారో ఓటరుగానే ఎందుకు ఉండిపోతున్నారనడానికి ఈ సన్నివేశం సమాధానమిస్తుంది. విశ్వరూపాచారి ఆలోచనా విధానాన్ని, ఇప్పటికీ ఈతరంవారు అనుసరిస్తున్నారని చెప్పకనే చెపుతాడు రచయిత.

ఒకరి కులవృత్తిలోకి మరొక కులానికి చెందినవారు ఏవిధంగా ప్రవేశించవలసిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయో ఈ నవల స్పష్టంగా తెలుపుతుంది. చేతినిండా పనివుండి, చేతికింద పనిముట్లు అందించే పనివాళ్ళులేని స్థితిలో ఇతర వృత్తులవారిని

పనిలోకి తీసుకురావడమనే సహజమైన చారిత్రక పరిణామాన్ని శక్తివంతంగా చిత్రీకరించారు శిరంశెట్టి కాంతారావు. బడుగు బలహీనవర్గాల ప్రజలు తమ ఉపాధికోసం ఏపనైనా అలవోకగా నేర్చుకుంటారనడానికి ఈ నవలలో అనేక ఉదాహరణలున్నాయి. ‘బంటోల్ల ఉప్పన్న రెండు మూడు రోజులు చూడగానే సుత్తిపట్టుకుని బిందెల తయారీలో చక్కగా పనిచేయడం కంచరకులస్తులే ఆశ్చర్యపోతారు. మరోవైపు ఒకవృత్తికి అనుబంధంగా మరికొన్ని రకాల పనులు చేసుకునే ఇతరకులాలవారు ఉండడం విశేషం. నవలలోని తిప్పర్తి గ్రామంలో కూడా కంచరోళ్ల చేతుల్లో తయారైన ఇత్తడి పాత్రలకు కళాయిపోస్తూ జీవించే నిరుపేద ముస్లిం కుటుంబాలు ఉంటాయి. కాలక్రమేణా ఇతర కులాలవారే అసలు వృత్తికులాల వారికి వ్యాపారపోటీ నివ్వడం మరో ఊహించని పరిణామం. ఈ విషయాన్నే కంచర పుల్లాచారి ఆవేదన చెందుతూ ఆత్మవిమర్శకు గురిచేస్తాడు. చివరకు ఎదురెదురుగా, పక్కపక్కనే ఇత్తడి దుకాణాలు పెట్టుకుని శత్రువులుగా మారిపోయిన స్థితిని రచయిత చర్చిస్తాడు. కాలం తీసుకువచ్చే అనివార్యపరిణామాల ఫలితాలను వాస్తవికంగా కళ్ళముందు దృశ్యీకరిస్తాడు.

గ్రామాల్లోని ఆత్మీయ మానవసంబంధాలు, మానవీయ విలువలను సహజమైన సన్నివేశాలతో సంభాషణలతో హృదయాన్ని సుతిమెత్తగా కదిలిస్తాడు. జాతరలో సామన్లు అమ్ముకుని తొందరగా వెళ్లిపోతున్న ఆనందాచారి, ముత్తయాచారీలకు వీడ్కోలు చెబుతూ ఇతర దుకాణదారులు ఆప్యాయంగా మాట్లాడుతారు. తమ దుకాణాల్లోని గాజుల దండలను, చిలకలదండలను,

బొమ్మలను ఇంట్లో వాళ్ళకి బహుమతిగా ఇస్తారు. దారిలో ఆకలేస్తే తినడానికి పకోడిపొట్లం ఇస్తారొకరు. ఆ సందర్భంగా “నిండా నాలుగు రోజులుగూడాలేని తమపరిచయానికి గుర్తుగా వాళ్ళు చూపిస్తున్న ప్రేమాప్యాయతలకు,

చారీలిద్దరూ నిలువునా కదిలిపోయారు. వాళ్ళ ప్రమేయం లేకుండానే గుండెల్లో నుండి పుట్టుకొచ్చిన సంతోషపు దు:ఖం ఊటలు ఊటలుగా కనుకొలుకులగుండా వెలుపలికి దూసుకొచ్చి ఎదలను తడుపుతుంటే ఒక్కొక్కరిని గుచ్చి గుచ్చి కౌగిలించుకుంటూ అప్పటివరకూ తమ జీవితాల్లో ఎరుగని నిజమైన మానవతా స్పర్శను, వాసనను, మనసు తనువుల నిండుగా అనుభవించారు” అని రచయిత వాళ్ల స్పదనను వర్ణిస్తాడు. పఠితలు సైతం ఆ ఇద్దరు చారీలుగా మారి తాదాత్మ్యతను అనుభవిస్తారు. ఆదారిలోనే రైతుదంపతుల ఆదరణకు ముగ్గుడైన ముత్తయాచారి ఒక గుండుచెంబును రైతమ్మకు ఇస్తూ “ఇగో చెల్లే నీ పెద్దబిడ్డకు మేనమామలెక్క ఇస్తున్న. దాసిపెట్టి దాని పెళ్ళినాటికియ్యి” అంటాడు. ఆప్యాయతతో ఊహించని కానుకనివ్వడంలో అవతలివారు పొందే ఆనందాన్ని తెలుసుకున్నవారు కాబట్టే ముత్తయాచారి ఆవిధంగా స్పందించాడు. “మనుషుల మధ్య బంధాలు అనుబంధాలు ఎప్పుడు? ఎందుకు? ఏవిధంగా? కలుస్తుంటయో, విడిపోతుంటాయో కాలం తప్ప అన్యులెవ్వరూ ఎరుగరన్న నిజాన్ని”రచయిత తాత్వికంగా స్పందిస్తాడు. ఈ నవలనిండా ఆయా సందర్భాలకనుగుణంగా శిరంశెట్టి కాంతారావు చేసే వ్యాఖ్యానాలు వారి అనుభవసారాన్ని వ్యక్తపరుస్తూ ఉ ద్వేగానికి గురిచేస్తాయి. చెరువుకట్టమీద టెంపో హారన్ చప్పుడుకు ఎడ్లు బెదిరిపోయి చెరువులోకి బండిని లాక్కెళ్ళడంతో ఎడ్లబండి వీరన్న, కంచర ఆనందాచారి చనిపోతారు.కేస్ పోలీస్ స్టేషన్ కి చేరుతుంది. టెంపో డ్రైవర్ పేదవాడు. ఏవిధమైన నష్టపరిహారం ఇవ్వలేని నిస్సహాయుడు. ఆనందాచారి కుటుంబసభ్యులు ధర్మబుద్దితో డ్రైవర్ నర్సిమ్మపై కేస్ వెనక్కి తీసుకుంటారు. ఇక ఎడ్లబండి వీరన్న కుటుంబానిది మరీ దయనీయమైన పరిస్థితి. సంపాదించే వీరన్న చనిపోయాడు. తన ముగ్గురు ఆడపిల్లలను చూస్తూ వీరన్న భార్య రోదిస్తుంది. ఈ సందర్భంలోనూ గ్రామప్రజల మానవీయ స్పందన ఎంత ఉదాత్తంగా ఉంటుందో తెలుపుతాడు రచయిత. ‘చనిపోయిన వీరన్న కుటుంబానికి ఒక ఎద్దును,

కోడెదూడను కొనిస్తాను, వ్యవసాయం చేసుకోమని’ డ్రైవర్ నర్సిమ్మ తనవంతు సహాయాన్ని ప్రకటిస్తాడు. ఇక నర్సిమ్మ భార్య గంగమ్మయితే “వీరన్న ముగ్గురు బిడ్డల్లో ఒక బిడ్డను పైసా కట్నం తీస్కోకుంట పెండ్లి ఖర్చులు పెట్టుకొని పిల్లని మాకొడుక్కు జేస్కుంటం” అని తన మనసులోని ఆలోచనను తెలుపుతుంది. గంగమ్మమాటలతో పోలీస్ స్టేషన్లోని ఎస్సై, విశ్వరూపాచారితోపాటు మిగతా అందరూ నిశ్చేష్టులవుతారు. “గంగవ్వ మాటలు ఆ పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుద్ధం చెయ్యసాగాయి” అన్న రచయిత వ్యంగ్య వ్యాఖ్య విస్తృతార్ధాన్నిస్తుంది. ఆమాటలు స్వార్ధపూరిత సమాజాన్నిగూడా పరిశుభ్రం చేస్తాయి.రచయిత చిన్న చిన్న మాటలతోనే మనల్ని ఇలా అనేకసార్లు కుదిపేస్తాడు. మానవ జీవితంలోని సున్నితమైన విషయాలలోని తీవ్రతను పట్టుకుని పాఠకుల నైతికతకు కొత్త అనుభవాన్ని పొదుగుతాడు.

‘పరంపర’ లాంటి వృత్తికులాల నేపథ్యంలో నవల రాస్త్నునప్పుడు రచయిత తాత్కాలికంగానైనా ఆ కులవృత్తికారుడిగా మారిపోవాల్సిందే. ఆయా కులాలకు సంబంధించిన పనిముట్లు,వాటి వినియోగం తీరుతెన్నులు, వారి సాంస్కృతిక విశేషాలు, వారి వృత్తిరహస్యాలను తెలుసుకోవడం తప్పనిసరి. శిరంశెట్టి కాంతారావు ఈ విషయంలో చాలా లోతుగానే అధ్యయనం, పరిశోధన చేసినట్లుగా అర్థమవుతుంది. నవల ప్రారంభంనుంచే కంచరవృత్తికారుల వాతావరణ చిత్రణతోపాటు, ఆయాకాలాలనాటి పరిసరాల పర్ణనలో వాస్తవికత ఉట్టిపడేటట్లుగా రచించారు. తిప్పర్తి గ్రామంలోని కంఠయాచారి ఛత్రశాల భవంతిని కళ్ళముందు కట్టి చూపిస్తాడు. ఆ కాలంనాటి కంఠయాచారి దంపతుల ఆహార్యాన్ని వర్ణిస్తూ ఫొటోతీసినట్లుగా చూపుతాడు. పొద్దున్నే లేచిన ఆడవాళ్ళు ఇంటిముందు ఊడ్చి వాకిలిని ఏవిధంగా ఎర్రమట్టితో అలికి అలంకరణలు చేస్తారో వివరంగా తెలుపుతారు. కంచరకారులు రెండేండ్ల నుండి మూలకుపడేసిన పనిముట్లను బయటకు తీసి తూడుస్తున్నప్పుడు వాటి పేర్లన్నిటినీ ప్రస్తావిస్తాడు. ఈ తరంవారు వినని కొత్తగా చిత్రమైన పేర్లు ఆ సామాన్లకు ఉన్నాయనేది తెలుస్తుంది. విశ్వబ్రాహ్మణులంతా ప్రతిఏటా మాఘమాసంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాన్ని జరుపుతుంటారు. ఆసమయంలో వీరి ఆశ్రితకులమైన రుంజోల్లు గ్రామంలోకి వస్తారు. ఊర్లోని సబ్బండవర్ణాలవారు కంచరోల్ల పండుగ గురించి మాట్లాడు కోవడాలు, రైతులు సైతం ఈ పండుగకు చందాలు ఇవ్వడం, విశ్వకర్మపూజా విధానాలు, రుంజకారుల ప్రదర్శనలు మొదలైనవన్నీ శ్రద్ధగా ఈ నవల వివరిస్తుంది. వ్వి బ్రాహ్మణులు శఠగోపానికి

మొక్కకపోవడానికి, దాన్ని తలమీద పెట్టించుకోకపోవడానికి గల మూలకథను వివరించడంతోపాటు, శఠగోపం వెనుకనున్న అగ్రకుల దురహంకారాన్ని సందర్బోచితంగా ఆసక్తికరంగా చెపుతాడు రచయిత. కంచరోళ్ళ పనితనానికి ముగ్ధుడైన బ్రిటీష్ రెసిడెంట్ కుక్ కంచర కుటుంబాలకు తలా మూడెకరాల పట్టా చేయిస్తానని హామీ ఇస్తాడు. ఇంత గొప్ప అవకాశాన్ని కంచరోళ్ళంతా సున్నితంగా తిరస్కరిస్తారు. అందుకు కులస్తులు చెప్పిన కారణాలను విన్న కుకకు కోపం వస్తుంది. కానీ తమాయించుకుని

మీఇష్టం అంటాడు. రచయిత ఈ సన్నివేశం ద్వారా విశ్వబ్రాహ్మణకులస్తులకు తమ వృత్తి గొప్పతనంపై వున్న ప్రాశస్త్యంతోపాటు వారి అతిశయాన్ని, వారి మనసులో పేరుకుపోయిన ఆధిపత్య భావజాలాన్నీ, అహంభావాలను నిష్కర్షగా చూపెట్టదలుచుకున్నాడు. నవలాసాంతం రేఖామాత్రంగా కనిపించే ఈ ధోరణిని మరచిపోకుండా ధ్వనీకరించాడు.

కంచరకుల సాంస్కృతిక, వృత్తిగత జ్ఞాన నైపుణ్యాలను రచయిత నిశితంగా పరిశీలించాడనడానికి ఈ నవలలో అనేక సన్నివేశాలను ప్రస్తావించవచ్చు. ముఖ్యంగా విశ్వరూపాచారి ప్రపంచ తెలుగుమహాసభలకోసం కాకతీయ శిల్పకళాతోరణం జ్ఞాపిక తయారీ దశలగురించి చేసిన వివరాలను చూస్తే నోరెళ్లబెడతాం. రచయితగూడా పఠితలాగా మారిపోయి కంచరపృత్తికారుల లోహపరిజ్ఞానానికి, మైనంపై, మట్టిపై వారికిగల అవగాహనకు ఆశ్చర్యపోతాడు. “ఈ స్థాయికి చేరుకోవడానికి” వాళ్ళు ఎన్నెన్ని తరాలు, తమ మేధస్సును ఎంతెంత దగ్ధం చేసుకున్నారో!? ఎన్ని జీవితాల అనుభవాలను రంగరించి కళలకు వారబోశారో!

దనిది. వాళ్ళంతా అలా వారబోశారు కాబట్టే ఈనాటికీ కంచరవృత్తి ఒక నిర్దిష్ట ప్రక్రియగా రూపుదిద్దుకుంది. ఆ ప్రక్రియను చూస్తే ఒల్లు పులకరించిపోతుంది” అని రచయిత ప్రశంసించకుండా ఉండలేకపోతాడు. రచయిత విశ్వరూపాచారిగా మారి జ్ఞాపిక రూపకల్పన చేసినట్లుగా అనిపిస్తుంది.

‘పరంపర’ నవల గ్రామీణ జీవితంలోని సమిష్టి జీవన సంప్రదాయాలను, సంస్కృతులను సందర్భోచితంగా దృశ్యమానం చేసింది. ఆనందాచారి, పాపయాచారిలు చనిపోయినప్పుడు జరిగే కార్యక్రమాలను చూస్తే విశదమవుతుంది. గ్రామంలో ఎవరైనా చనిపోతే ఆదు:ఖం ఆకుటుంబానికేగాక ఊరంతటిని ఎలా కమ్ముకుంటుందో ఆవేదనాత్మకంగా సన్నివేశ చిత్రణ చేశాడు రచయిత. అంత్యక్రియల ఏర్పాట్లలోనూ,

బాధితుల దు:ఖంలోనూ అన్నికులాలవారు తమ బాధగా భావిస్తూ సహాయసహకారాలను అందిస్తారనే మానవీయస్వభావాలను వెల్లడిస్తుంది. రచయిత ఈ విషాద వాతావరణంలోని వైరాగ్యాన్ని, తాత్త్వికమనోస్థితిని పఠితలోనూ ఆవిష్కృతం చేస్తాడు. పాత్రల భావోద్వేగాలను అక్షరాల్లోకి అనువదించడంలో రచయిత అభివ్యక్తిశక్తి ప్రతిసన్నివేశంలోనూ సాక్షాత్కారమవుతుంది.

శిరంశెట్టి కాంతారావు ఈ నవలకు ఎంచుకున్న కాలం విస్తృతమైంది. అనేక ముఖ్యమైన చారిత్రక కాలమార్గాల గుండా ఈ నవల పరుగెత్తుతుంది. కాలం మలుపుతిరిగిన ప్రతిచోట రచయిత ఒక తాత్త్వికుడిలా రాబోయే పరిణామాలను దృశ్యాత్మకంగా సూచన చేస్తాడు. ఒక్కోసారి కవితాత్మకంగా దార్శనికుడిగా వ్యాఖ్యానిస్తాడు. “కాలమనే చెట్టు మరో ఐదుసార్లు వసంతమనే రంగురంగుల

మెత్తటి దుప్పటిని కప్పుకుంది” అంటూ వృద్ధికారుల మెరుగైన జీవనాన్ని సూచిస్తాడు. “కనైప్పల తలుపులు సడీచప్పుడు లేకుండా వాటిపని అవి ఎట్లా చేసుకుంటూపోతాయో రోజులుగూడా అట్లాగే ఏమాత్రం అలికిడి లేకుండా ముప్పై ఆరుపున్నముల మైలురాల్లను దాటుకొని ముందుకు సాగిపోయాయి” అనే మాటలతో కంచరకుల యువతరంలో చోటుచేసుకున్న స్తబ్దతాస్థితిని ప్రతీకాత్మకంగా చెపుతాడు. రచయిత కాలస్పృహలో స్థానీయతా మూలాలను దాచిపెట్టడంలో తెలియని జీవనానుభూతి కలుగుతుంది.

భాష అవసరాలనే కాదు భావోద్వేగాలను మోసుకొచ్చే వాహికగా ‘పరంపర’లోని సంభాషణలు. సామెతలు, నానుడులు, పలుకుబడులు, జాతీయాలను పదునుగా ప్రయోగించాడు రచయిత. పాత్రల ఆలోచనాస్థాయిని, మనస్తత్వాన్ని తెలిపేటట్లుగా సంభాషణలు సాగుతాయి. తెలంగాణ భాషా, మాండలిక పదాల సౌందర్యాన్ని పాత్రలమూలాలనుండి మాట్లాడించాడు రచయిత. “ఇంటిల్రాజులూ దేవునర్రల జేర్చి, గుంజాయిష్, కండ్లెర్రి, లాయిలాస,మొదలైనవి వినియోగంలో లేని పదాలతో చెదిరిపోయిన

భాషా పరిమళాన్ని బంధిస్తాడు. సందర్భానుసారంగా విస్మృతిలోకి వెళుతున్న సామెతలు ఈ నవలలో ఉన్నాయి వాటిని రత్నాల్లాగా దాచుకోవచ్చు. ‘కాపోడు యాజ్యాలతోటి కంచరోడు తాలింపుల్తోటి అడుగుబడతారని’ సామెతను చెప్పడం ఔచిత్యంగా వుంది.’

కూట్లే రాయి దియ్యలేనోడు ఏట్ల రాయిదీసినట్టు”, కోడలు పిల్లలు గంటనంటె అత్త వద్దంటదా?”, ‘మొద్దునెత్తేసి ఎద్దునెత్తుకున్నట్టు’ సామెతలు తెలంగాణా తనాన్ని వెదజల్లుతాయి. సామెతకోసమనిగాకుండా సందర్బ తీవ్రతను పట్టిచూపేదిలాగా సహజంగా సన్నివేశాన్ని చిక్కబరిచేలా భాషను ఉపయోగించుకున్నాడు రచయిత. వృత్తికులాలవారి రహస్యభాషను కూడా ఉపయోగిస్తే బాగుండేది. కంచరుల సుత్తిదెబ్బలకంటే రచయిత పదప్రయోగాలు హృదయాలలో ప్రతిధ్వనిస్తాయి. మనందరికి తెలిసిన కంచరవృత్తికారుల ప్రసిద్ధ గ్రామం పెంబర్తిని తిప్పర్తిగా మార్చి స్థానికతలో దాగిన సాంస్కృతిక మూలాలకు శాశ్వతత్వం కలిగించారు.కంచరులు ఈ నవలను తమ వారసత్వపు సంపదగా, శాశ్వతంగా తమ జాతకంలా పదిలపరుచుకోవచ్చు.

అస్తిత్వ ఉద్యమాలు ఉధృతంగా విభిన్న ప్రభావాలను చూపుతున్న దశలో వున్నాం. వ్యక్తులు సైతం వంశమూలాల లోతుల్లోకి తరచిచూసుకుంటున్నారు.కులాన్ని ఎంతగా తొక్కిపెట్టినా ఏమూలనుంచో అది తొంగిచూస్తూనే వుంటుంది. వృత్తి, కులం విడదీయరాని అంశాలుగా మిగిలిపోయాయి. ప్రపంచీకరణ ప్రభావం ఎంత తీవ్రమవుతున్నా , వృత్తులు కనుమరుగైపోతున్నా కులస్పృహ కనుమరుగవడంలేదు. ఈ నేపథ్యంలో ఉత్పత్తి వృత్తిలో దాగున్న శాశ్వతమైన విలువ కులంలో లేదన్న సత్యం ఈ నవలద్వారా తెలుసుకోవచ్చు. ఏకులంవారైనా సరే ఎవరి ప్రత్యేకత వారిదే. విశ్వరూపాచారిలోని పనిపట్ల వుండే నిబద్దత ఎవరికైనా వ్యక్తిత్వవికాస పాఠంలాంటిదే. మానవ నాగరికతా వికాసంలో కీలకమైన ఉత్పత్తికులాల్ని పరిరక్షించుకోవలసిన సాంస్కృతిక బాధ్యతను గుర్తుచేస్తుంది ‘పరంపర’. శిరంశెట్టి కాంతారావులోని సామాజిక వాస్తవికత నవలంతటా విస్తరించి శ్రామిక జీవనసారాన్ని అందిస్తుంది. ఇది అక్షరాలా ఒక పుత్తడి జ్ఞాపకం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com