కన్నీటి నేపథ్యం తెలిపే కథల ఆవిష్కరణ…

అన్ని కథలూ కంచికి చేరవు . కొన్ని గుండెను తాకి పట్టేసి వదలవు . ఊపిరాడనట్టు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి . సమ్మెట ఉమాదేవి ‘ జమ్మి పూలు ‘ కథలు అలాంటివే ! ‘కాళ్ళు తడవకుండా నదినీ , కళ్ళు తడవకుండా జీవితాన్నీ దాటలేం ‘ అని ఎవరో కవి అన్నట్లు ఇవి కొన్ని జీవితాలను అద్దంలా మన ముందుంచిన ఆర్ద్రత నిండిన కథలు .

మనకెవ్వరికీ తెలియని , మన ఊహకు కూడా అందని చిన్న ప్రపంచం …ఒక్కొక్క పల్లెటూరిలో , తండాలో ఉందనీ , అక్కడ పూల వంటి సున్నితమైన , సుకుమారులైన చిన్నారులు సుడి గాలులకీ , తుఫానులకీ తట్టుకుంటూ , మొరటు మనుషుల కరకు చేతుల దాడికి తమ లేలేత పూరేకులు రాలి పోకుండా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారనీ ఈ కథలు చదివితే తెలుస్తుంది .

సరియైన చదువు లేక , వేరే విధంగా బ్రతికే దారి లేక బాల్యం లోనే వివాహ బంధం లోకి నెట్టి వేయబడి మొగుళ్ళు నాటు సారాకు బలి అయితే పిల్లల పోషణకూ ,కుటుంబ భారం మోయడానికీ తామే ఒక నీడనూ , పళ్ళనూ ఇచ్చే చెట్టు లాగా మారిన పూల తీగల్లాంటి స్త్రీలు ఈ కథల్లో అడుగడుగునా కనిపిస్తారు .

రైల్లోనో , బస్సు లోనో వెళ్తూంటే దారికి ఇరుప్రక్కలా అందమైన పచ్చని చేలను చూసి మనసు పరవశిస్తుంది . చేను పచ్చదనాన్నో , దానిపై నుండి వీచి మనను తాకే చల్లగాలినో ఆస్వాదిస్తాం . కొందరం ఆ అనుభూతిని అక్షరాల్లోకి అనువదిస్తాం కూడా . కానీ , ఉమ లోని మనసున్న రచయిత్రి ఆ చేను పెంచడానికి ఆ రైతు ఎంత కష్టపడ్డాడో , ఎన్ని నిద్ర లేని రాత్రులు మంచెపై కావలి కాశాడో , ఎన్ని వందల సార్లు కనుబొమ్మల పైన చేయి పెట్టుకుని తలెత్తి వర్షం కోసం ఆకాశం వైపు చూశాడో , ఎక్కడ అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టాడో తెలుసుకుని ఆ రైతులో పరకాయ ప్రవేశం చేసి రాస్తుంది. అందుకే ఈ కథల్లో జీవం తొణికిసలాడుతుంది .

స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్స్ అన్న మాటే గానీ , వాళ్ళ వెనకాల పెత్తనాలు చేసేది మగవాళ్లేనన్నది అందరికీ తెల్సిన నిజం. అయితే ‘ద్వాలి ‘ కథలో పదిహేనేళ్లకే భర్త చేయందుకుని ఓ పెద్ద కుటుంబంలోకి కోడలిగా అడుగు పెట్టిన ద్వాలి…భార్యగా , కోడలిగా , తల్లిగా తన బాధ్యతలు పరిపూర్ణంగా నిర్వర్తిస్తుంది . ఆ ఇంటి కోసం రెక్కలు ముక్కలు చేసుకుని చాకిరీ చేస్తుంది .ఓ మనిషిగా బయటినుంచి వచ్చిన మోతిని ఆదరిస్తుంది . అదే మోతిని తన భర్త హేమ్లా స్వీకరించి ఆమెతోనే కలిసి ఉంటే కూడా మౌనంగా భరించి తాను పిల్లలతో వేరేగా ఉంటుంది . కానీ … తాను ఒక్కతే తండాలో పదవ తరగతి చదివినందుకు సర్పంచ్ పదవికి అర్హత కల్గి ఎన్నికయ్యాక సంబంధిత పనుల్లో భర్త పెత్తనం మాత్రం సహించక అతన్ని హద్దుల్లో ఉండమని సూచిస్తుంది . ఆత్మాభిమానం , ధైర్యం , నిజాయితీ , కష్టపడే తత్త్వం కల్గిన స్త్రీ కథ ‘ద్వాలి ‘.

ఇక ‘జమ్మి పూలు ‘ కథ మొదటి పేజీ అంతా అపూర్వమైన వన సౌందర్య వర్ణనే ! చేల ఆకుపచ్చదనం , కొంగల ధవళ వర్ణం , పసుపు , తెలుపు పుప్పొడి కలబోసిన జమ్మి పూల గులాబీ వర్ణం … మొత్తానికి ఈ ప్రకృతే సప్తవర్ణ శోభితం ! తల్చుకుంటే ఉమాదేవి అందమైన కవిత్వం చెప్పగలరు అనడానికి ఈ కథ చక్కని ఉదాహరణ . జమ్మి పువ్వులా అందమైన చంప్లీ , ఆమెను ప్రేమతో , ప్రాణంలా చూసుకునే భర్త వాల్యా . ఆమె వెంట వేట కుక్కల్లా పడే వెంకటేష్ , సాంబి రెడ్డి. కట్టె కొట్టి కంచెలు నాటడానికి రాత్రి పూట వాల్యా వెళ్ళినప్పుడు తానూ వెళ్లే చంప్లీ , పండుగ రోజుల్లో పల్లెల్లో దొరికే సంబారాలు పట్నంలో అమ్మడానికి వాల్యా వెళ్ళినపుడు పొలం పని చేసుకుంటూ ఉండగా వెంటబడ్డ సాంబి రెడ్డికి ఎలా తెలివిగా బుద్ధి చెప్పింది అనేది కథ . జమ్మి పూలు ఆకర్షణీయంగా ఉండడమే కాదు , తమని నలిపి వేసే వాటినుంచి రక్షించుకోవడానికి చుట్టూ ముళ్ళను కూడా సిద్ధంగా ఉంచుకుంటాయని ఈ కథ చెబుతుంది . ఈ కాలపు ఆడపిల్లలు చదవాల్సిన కథ .

మొదటి చూపులోనే తనతో ప్రేమలో పడి , తనకోసం పదే పదే పల్లెకు వచ్చి మనసు తెల్పిన పట్నం దొర విరాట్ తో ‘ఇద్దరు మనుషులకు కాదు , రెండు కుటుంబాలకు స్నేహం కలిస్తేనే పెళ్లి , లేకపోతే కలవని అంతరాలతో పెద్దవాళ్లు సంఘర్షిస్తూ , వాళ్ళ వల్ల మనం కలహిస్తూ ఉంటామ ‘నే జీవిత సత్యం చెప్తుంది ‘ దశ్మి ‘. వయసు ప్రభావంతో ప్రేమలో పడడం ,ఆ తరువాత దాన్ని కాపాడుకోలేక పోవడం , విడిపోవడం , ఆత్మ హత్యలూ , పరువు హత్యలూ జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో యువత చదివి తీరాల్సినది ‘దశ్మి ‘ కథ .

రచయిత్రి స్వయంగా మంచి ఉపాధ్యాయురాలు గనుక ఈ సంపుటిలోని పదిహేను కథల్లో మూడు కథలు పాఠశాల నేపధ్యంలోనే ఉంటాయి . తమ వృత్తిని ప్రేమించే వారు , అంకిత భావంతో పని చేసే వారు .. అందరి మన్ననలనూ పొందడం సహజం . ‘రెడపంగి కావేరి ‘ కథలో అర్చనా టీచర్ లోనూ , ‘ఊరి ఉమ్మడి సిరి ‘ కథలో సరితా టీచర్ లోనూ పాఠకులకు ఉమాదేవి కనిపిస్తారు . పిల్లల్ని ప్రేమించడం , వారి అంతరంగపు లోతుల్ని తెల్సుకోవడం, లాలనగా వాళ్లకి విద్యాబుద్ధులు నేర్పించడం ..ఇవన్నీ చేసే ప్రభుత్వ ఉపాధ్యాయులున్నారా …అంటే ఉన్నారు , ఉమా దేవి కథల్లో ! అంటే , నిజంగా కూడా ఎక్కడో ఉన్నట్లే కదా ! అందుకు ప్రత్యక్ష తార్కాణం ఉమ అని చెప్పవచ్చు .

బడి ‘ఊరి ఉమ్మడి సిరి ‘ నిజమే .. పాఠశాల సామాజిక ఆస్తి , అన్నదీ నిజమే ! ఈ కథ చదువుతుంటే డెబ్బయ్యవ దశకంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నవారికి పుస్తకాల విద్యతో బాటు సామాజిక , సాంస్కృతిక , సంస్కార విద్యను అందించిన ఆనాటి ఉపాధ్యాయులు గుర్తు రాక మానరు .

అయితే , మన వృత్తి మనకెంత ఇష్టమైనా .. మన కాల పట్టిక పూర్తిగా రాయడం .. ముద్రణలో ఇరవై పేజీల కథలో సుమారుగా ఒక్కో పేరాగ్రాఫ్ ఒక పేజీ అంతా ఉండటం వల్ల చదువుతున్న పాఠకులు ఆసక్తిని కోల్పోయి పేజీ తిప్పేసే ప్రమాదం ఉంది . ఆ మాటకొస్తే ప్రతి వృత్తి లోనూ దానికి సంబంధించిన రోజువారీ చాకిరీ ఉంటుంది .ఈ ఒక్కటీ రచయిత్రి గమనించాలి.

సహజ జీవిత చిత్రణ ప్రధానమైన ఈ కథల్లో ..పుట్టిందే తాగడానికన్నట్టు తాగీ , తాగీ భర్తా , కొడుకూ చచ్చిపోతే కోడల్ని కడుపున పెట్టుకుని చూడ్డమే కాదు , మళ్ళీ పెళ్లి చేసి కోడలికి తల్లిగా మారిన ‘ గంసీ ‘ లున్నారు. కన్న తండ్రి తాగుబోతయి హింసిస్తుంటే ,అమ్మమ్మ తల్లికి మళ్ళీ పెళ్లి చేస్తే , ఆమెకు ఇద్దరు కొడుకులు పుట్టాక కొత్త అత్తింటి వారు మొదటి పిల్లైన తనను చీత్కరిస్తుంటే , తల్లి కొత్త జీవితానికి తను అడ్డు రాకూడదని మళ్ళీ అమ్మమ్మ దగ్గరికే వచ్చేసిన పెద్ద మనసున్న పదకొండేళ్ల ‘రెడపంగి కావేరు’లున్నారు .

తాగుబోతు మొగుడినీ , అతడి మూర్ఖత్వాన్నీ , తన సహనంతో , అత్తా మామల సహాయంతో భరిస్తూ .. అప్పుడప్పుడూ బుద్ధి చెప్తూ తల్లి లాగా దారికి తెచ్చుకునే ‘పుత్లీ’లున్నారు . ఎవరేం చెప్పినా వినకుండా వేలిముద్ర వేయకుండా సంతకం పెట్టి మరీ మనస్సాక్షి ప్రకారం ఓటేసిన దేనికీ లొంగని ‘ భారతమ్మ’లున్నారు.బతకాలంటే బహు మార్గాలున్నాయి , చావే పరిష్కారం కాదని…ఆత్మహత్య చేసుకోబోయిన బంధువులకు బతుకుదెరువు చూపిన ‘సత్తెమ్మ’లున్నారు .పెద్ద వాళ్ళు ‘బతుకు బండి ‘ ఈడవలేక పురుగుల మందు తాగి చచ్చి పోయినా , పెళ్లిళ్లు , ఫంక్షన్లలో సర్వింగ్ చేసే ఉపాధి తన తోటి వాళ్లకు కల్పిస్తూ .. బతికే దారి చూపిన ‘భోజ్యా నాయక్ ‘లున్నారు .

పలు బహుమతులు పొందిన ఈ కథల్లో నిరంతర శ్రామికులైన స్త్రీలు , గుండెల్లో బడబాగ్నిని దాచుకుని నవ్వుతూ జీవితాన్ని సవాలుగా తీసుకున్న స్త్రీలు , వయస్సుతో నిమిత్తం లేకుండా ఇతరులకు స్ఫూర్తి ప్రదాతలైన బాలికలు, రేపటి తరానికి దారి దీపాలైన స్త్రీలు కనిపిస్తారు .

అరుదైన వృక్ష జాతులు , పక్షి జాతులు అంతరించి పోతున్నాయనీ , వాటిని కాపాడుకోవాల్సిన ఆగత్యం ఉందనీ శాస్త్రవేత్తలూ , సామాజిక సేవకులూ గగ్గోలు పెడుతున్న వేళ ‘జమ్మి పూల ‘ లాంటి మట్టి మనుషుల్లోని స్వచ్ఛత, అనురాగమూ వసి వాడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా సాటి మనుషులమైన మనందరి పైనా ఉందనేది సత్యం .

ఒక రచయిత్రిగా, విమర్శకురాలిగా కాక పాఠకురాలిగా ఈ కథలను నేను చదివాను . మర్మమెరుగని సాదా సీదా గిరిజన పల్లె వాసుల బ్రతుకులను చిత్రించిన వీడియోగ్రాఫ్ ఈ పుస్తకం .

ఈ పుస్తకం లోని ప్రతి కథా అడవి పూలలాంటి స్వచ్ఛత , సరళత , పరిమళం కల్గి ఉన్నాయి . మట్టి మనుషుల జీవితాల్లోని దాపరికం లేని మనస్తత్వాలని మన ముందు పరిచి కళ్ళను తడి చేస్తాయి ఈ ‘జమ్మి పూలు ‘కథలు . మానవత్వంపై ఆశలను ఇంకా సజీవంగా ఉంచుతున్నందుకు రచయిత్రి సమ్మెట ఉమాదేవి గారిని మనసారా అభినందిస్తున్నాను .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com