స్త్రీకి మరో రూపమైన ధైర్యాన్ని చిత్రిస్తూ…

గాఢమైన నిద్రలో ఉన్న శారద ఐదింటికి మోగిన అలారంతో లేచి కూచుంది. మెదడుకు సిగ్నల్స్ అందించింది. ఆ రోజు షెడ్యూల్ గుర్తుకొచ్చింది. కాంప్లెక్స్ మీటింగ్ కి వెళ్లాలి. బాక్స్ రెడీ చేసుకొని బస్టాండ్ చేరింది. అంతలోనే టాటా ఏస్ ఆటో డ్రైవర్ సిద్ధిపేట సిద్ధిపేట… అంటూ పిలుస్తున్నాడు.

నాతో(శారద) పాటు ఇంకో ఇద్దరు ఎక్కారు. కమాన్ చౌరస్తా నుంచి బండి గౌరారం చేరింది. అందరం దిగేసి ఊరవుతలి పాఠశాలవైపు అడుగులేశాం. చుట్టూ ఎత్తైన కొండలు గుట్టలతో కొద్దిపాటి గుట్టమీదే ఉన్నట్లు ఉంటుంది ఆ బడి. ప్రార్థన పరిచయ కార్యక్రమాల అనంతరం వేప చెట్టు కింద ఒంటరిగా కూర్చున్న మేడమ్‌పై నాదృష్టి పడింది. పొద్దున్నుంచి సాయంత్రందాక అక్కడే కూర్చుంది. పక్కనే ఉన్న వాణిశ్రీ మేడమ్‌ను ఎవరా టీచర్, తనకి క్లాసులు లేవా అని అడిగా.

తనా…. అదో చరిత్రలే అంటూ వాణిశ్రీ చెప్పుకొచ్చింది. ఆమె భర్త ఓ షాడిస్ట్ వెదవ. స్టాఫ్ రూమ్‌లో కూర్చోవద్దు. ఫోన్ ఎప్పుడు భర్తకు కనెక్ట్ చేసే ఉంచాలి. పాఠం చెప్పేటప్పుడు, ప్రయాణంలో, క్లాస్ రూంలో ఎప్పుడు ఎవరితో మాట్లాడుతుందో వింటూ ఉంటాడు. లంచ్ కూడా ఒక్కతే ఒక రూమ్‌లో కూర్చొని తినాలని ఆ భర్త ఆర్డర్. ఫోన్ పెట్టేస్తే మళ్లీ 5 నిమిషాలకు ఫోన్ రింగవుతుంది. ఒక్కోసారి ఆమెని ఆటో ఎక్కించి తనూ వెనకనే బండిపై ఫాలో అవుతాడు. అది ప్రేమా.. భయమా… భక్తా.. భద్రతనా.. అభద్రతనా.. కాపలానా.. పురుష అహంకారమా నాకైతే ఏది అర్థం కాలేదు. నీకేమైనా తెలిసిందా అన్నట్లు నావైపు ప్రశ్నార్ధకంగా చూసింది వాణిశ్రీ.

నేనేమి చెప్పగలను. నా పరిస్థితి అంతే. నా భర్త ఏమైనా సుద్దపూసనా అనుకుంది. సమాజానికి ఎంతో గొప్ప వాడిలాగా, మంచి వాడిలాగా, కనిపిస్తాడు నా భర్త. నేను ఆఫీసు నుంచి ఇంటికెళ్లి అట్లా ఫ్రెష్ అవుతానో లేదో.. ఛాయ్ చేసుకొనిరా… మంచినీళ్లు తెచ్చివ్వు.. కూర్చుకున్నకాడికి అరొక్కటి తెప్పించుకుంటాడు. ఇద్దరు పిల్లలతో నేను సతమతమౌతుంటే సాయం చేయడు. పనిపనిషిని పెట్టుకొనివ్వడు. ఇంట్లోనే ఉంటాడు. వెలగబెట్టే ఉద్యోగం రియల్ ఎస్టేట్. రాత్రి నిద్రపోయాక నా ఫోన్ కాల్ లిస్ట్ చెక్ చేయని రోజుండదు. ఆ ఫోన్ ఎవరు చేసారు? ఈ మెసెజ్ ఎవరు పెట్టారు అని ఎంక్వైరీలు. ఎన్నోసార్లు ఇల్లు సంసారం వదిలి పారిపోదామనున్నా. ఆడపిల్లల్ని పెంచి పెద్దచేసి ధైర్యవంతులుగా తీర్చిదిద్దుదామని ఉండిపోయాను. కాంప్రమైస్ నా జీవితంలో ఒక భాగం ఐపోయింది.

లంచ్ టైమ్‌కు స్టాఫ్ రూమ్‌లో అడుగుపెట్టిన రోజ్‌లిన్ టీచర్.. శారద అని పిలిచే వరకు దీర్ఘాలోచనలో ఉండిపోయా. హా… రోజ్‌లిన్.. బాగున్నావా.. యూ ఆర్ లక్కీ. పురుషహంకార పంజరం నుంచి స్వేచ్ఛా జీవివి అయ్యావు. “ఏం చేయమంటావ్ శారద.. తను చెప్పేదే వినాలనేవాడు. చర్చకు తావే లేదు. రకరకాల మానసిక వేధింపులు. నా మెదడు ఆలోచన ప్రకారం నడువు. నీ మెదడును ఎప్పుడు ఎక్కడా వాడకు అనేవాడు. ఎన్ని సార్లు బంధువులకు చెప్పినా.. తీరు మారదు. బంధువుల ముందు అన్ని అబద్దపు మాటలు. ఈయన చెప్పేది అబద్దం అని అందరికీ తెలుసు, ఐనా ఆయనను గట్టిగ ఏమీ అనరు. సంసారం అన్నప్పుడు సర్దుకపోవాలే అని నన్నే అంటరు. ఇద్దరం యునివర్సీటీలో ఎమ్మే సైకాలజీ కలిసి చదివినవాళ్లం. ప్రస్తుతం ఇద్దరం వేర్వేరు ఉద్యోగాల్లో ఉన్నాం. ఎక్కువ తక్కువ ఏంటి.. ఎంతకాలం ఈ మానసిక క్షోభ. ఈయన తీరు మారేటట్టు లేదు. అందరికీ జీవితం ఒక్కటే. ఉన్న జీవితాన్నే నేను అనుకున్నట్లుగా జీవించాలి. లేదా ఇద్దరం అనుకున్నట్లైనా జీవించాలి. కానీ ఈ లంపటం సచ్చేదాంకనా…. అనిపించింది. ఠాట్ పో.. వీడు నాకెందుకు నా బతుకు నాది అనుకున్న. నీ జీవితం నీది నాజీవితం నాది అని తెగేసి చెప్పా.. తెగాయింపుతో తెగదెంపులు ఐయింది” అంటూ ఉత్సాహంగా చెప్పుకొచ్చింది రోజ్‌లిన్.

ప్రస్తుతం భర్త వేధింపులకు గురయ్యే ఎంతమంది ఆడవాళ్లకు నీలాంటి ధైర్యం ఉంది రోజ్‌లిన్… అంటూ హ్యాండ్ బ్యాగ్ వేసుకున్నది శారద. ఇప్పుడు మన ముందున్న ప్రధాన కర్తవ్యం మన విద్యార్థులను, ఆడపిల్లలను ధైర్యవంతులుగా తీర్చిదిద్దడమే. అంతకు మించి మగపిల్లలను మంచి పిల్లలుగా తీర్చిదిద్దడం. ఏ అహంకారాలు లేకుండా పెంచడం, స్త్రీలు పురుషులు సరిసమానం అనే భావనను వ్యాప్తి చేయాలంటూ ఇద్దరూ బస్ ఎక్కి ఇంటికి చేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com