శతకం తెలుగు వారి కెంతో ప్రీతి పాత్రమైన సాహితీ ప్రక్రియ. నోరు తిరగడం మొదలుపెట్టిన నాటినుండి శతక పద్యాలను వల్లె వేయడం మొదలు పెట్టేవారు. ముఖ్యంగా సుమతి వేమన శతకాలు. దాని వల్ల ప్రాథమికంగా స్ఫుటమైన ఉచ్చారణను అలవర్చుకోవడం జరిగేది. క్రమేపి తమకు తెలియకుండానే మంచి తలంపులు, సామరస్యధోరణి, సౌజన్యశీలం ఏర్పడడానికి అవసరమైన భావశుద్ధి జరిగేది. అట్లాగే రచనలు చేయడం మొదలైన దశలో అభ్యాసం కోసం శతక పద్యాల నాశ్రయించేవారు. ఒక మకుటం నిర్ణయించుకొని తదనుగుణమైన ఛందస్సులో భావాభివ్యక్తి చేయగలిగే నైపుణ్యం కలిగించుకునేవారు. కథా పరమైన పూర్వాపర సంబంధాలు లేకపోవడం వల్ల స్వేచ్ఛగా పద్యరచనాభ్యాసానికి శతకప్రక్రియ ఉపయోగపడేది. భగవత్పరమైన శతక రచన చేసే వారిలో ఆత్మసమర్పణభావం, ఆర్తి ద్యోతకమయ్యేది. అధిక్షేప శతక రచనలో అయితే సామాజిక అభ్యున్నతి,          దోషఖండనం వస్తువులయ్యేవి.

సుమతి, వేమన శతకాలు బాలుర కభ్యాస నిమిత్తం పనికి వస్తే, కాస్త పెద్దవారై పని పాటలు చేసుకొంటున్న వారికీ, మరీ జీవితంలో వయసయిపోయి అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్న పెద్దవారికీ ఆలంబనగా నిలిచింది శేషప్ప కవి రచితమైన నరసింహశతకం. జీవితాన్ని అన్ని రకాలుగా అనుభవిస్తూనే, ఆస్వాదిస్తూనే , ఆనందిస్తూనే తదతీతమైన మరొక వ్యవస్థ ఉందనీ, పారలౌకికతను విస్మరించి, ఇహలోకలంపటంలోనే కూరుకపోరాదని హెచ్చరించడం శేషప్ప నరసింహశతక ప్రయోజనమైంది. భగవత్పరమైన సమర్పణనైజాన్ని పెంచుతూనే భగవంతుని సర్వశక్తిమత్వాన్ని, సర్వవ్యాపకత్వాన్ని మనిషి పరిమితత్వాన్ని శేషప్పశతకం గుర్తింపచేసింది. గర్వాన్ని తలకెక్కించుకొని ఇతరుల పట్ల బాధాకరంగా ప్రవర్తించరాదనీ, వినయంతో ప్రేమాదరాలతో, పరస్పర సహాయసహకారాలతో మెలిగినపుడే సమాజంలో శాంతి సామరస్యాలు కుసుమిస్తాయని శేషప్ప శతకం ప్రబోధించింది .

శేషప్ప 18 వ శతాబ్దంలో ధర్మపురిలో జన్మించాడు . ఏ సుముహూర్తంలో శేషప్ప ఈ శతకం రాశాడో కాని ఇది తెలుగునాట ఎంతో ప్రీతి పాత్రమైపోయింది. పోతన మహాకవికి ఎంత జనాదరణ లభించిందో అంత జనాదరణ శేషప్పకూ లభించింది. ఎంత మంది నాలుకల మీద ఈ శతక పద్యాలు నర్తించాయో చెప్పలేం . శేషప్ప శతకానికి సామాన్య పాఠకులే ఆలంబనగా నిలిచారు. తెలుగులో గ్రంథప్రచురణం తొలి అడుగులు పడుతున్న కాలంలోనే, ఎవరు ప్రచురించారో తెలియదు కానీ 1870 లో శేషప్ప నరసింహశతకం మొదటిసారి ముద్రిత రూపమెత్తింది. తల్లా వజ్ఝల శివశంకర శాస్త్రి గారు 1868 లోనే తొలి ముద్రణ వచ్చినట్లు తెల్పారు . ఆర్. వెంకటేశ్వర్& కంపనీ 1909లో వెలువరించింది. వెస్టువార్డు అండు కంపెనీ వారి అమెరికన్ డైమండ్ ముద్రాక్షరశాలలో 1932లో మరోముద్రణ వచ్చింది. ఆ తర్వాత ఆనాటి సాహిత్యఅకాడమీ, గొల్లపూడి వీరాస్వామి &సన్స్, బాలసరస్వతి బుక్ డిపో, పావనిసేవాసమితి, వసుంధరా పబ్లికేషన్స్ లాంటి అరవైకి పైగా విభిన్నమైన సంస్థలు ఎన్నెన్నోసార్లు ప్రచురించాయి. ఇటీవలే ధర్మపురికి చెందిన ప్రముఖపండితులు డా. సంగనభట్ల నరసయ్యగారు శేషప్పకుటుంబీకులకు సంబంధించి ఎన్నో అమూల్యమైన వివరాలను తెలుపుతూ మంచిపుస్తకం రాశారు. మహా సంస్కృత విద్వాంసులు చిట్టిగూడూరు వరదాచార్యులవారు, ఆచార్య రవ్వా శ్రీహరిగారు వేర్వేరు కాలాల్లో శేషప్ప శతకాన్ని సంస్కృతంలోకి అనువదించారు. శ్రీ ఎస్. లక్ష్మీనరసింహశాస్త్రిగారు కన్నడంలోకి అనువదించారు. కే. రంగారావుగారు ఆంగ్లతాత్పర్యాలతో ప్రకటించారు. ప్రముఖగాయకులు శ్రీఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంగారు కమనీయంగా పాడి రికార్డు విడుదల చేశారు. చెన్నపురి రాజధానిగా తెలుగుతమిళప్రజలు దేశస్వాతంత్ర్యసిద్ధి దాకా కలిసి ఉండేవారు. ఆకాలంలో తమిళప్రాంతానికి చెందిన షోలింగర్ లోనున్న ఘటికాచల నరసింహస్వామికి అన్వయించి యథాతథంగా ఈ తెలుగు ధర్మపురిశతకాన్నే ప్రచురించడం ఒక సరదా ముచ్చట.

ఈ ప్రచురణల నన్నింటిని పరిశీలిస్తే పాఠభేదాలు కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నాయి. ప్రజల్లో ఈ శతకం బాగా పాదుకొని పోయిందనడానికి ఈ పాఠాంతరాలు కూడ ప్రబల నిదర్శనమే. గత ప్రచురణ లన్నింటిని సేకరించి శేషప్ప శతకానికి ఒక సంశోధిత ముద్రణానికి ఔత్సాహికులు పూనుకోవచ్చు నాగేంద్రశయన! నీ నామమాధుర్యంబు

మూఁడు కన్నుల సాంబమూర్తి కెఱుక

పంకజాతాక్ష! నీ బల పరాక్రమ మెల్ల

భారతీపతియైన బ్రహ్మ కెఱుక

మధుకైటభారి ! నీ మాయా సమర్థత

వసుధలో బలిచక్రవర్తి కెఱుక

పరమాత్మ! నీ దగు పక్షపాతిత్వంబు

దశశతాక్షుల పురందరుని కెఱుక

వీరి కెఱుకగు నీ కథల్ వింత లెల్ల

నరుల కెఱు కన్న నెవరైన నవ్వి పోరె ?

నరుల కెఱు కన్న నెవరైన నవ్వి పోరె ?

భూషణ వికాస! శ్రీధర్మ పురనివాస!

దుష్టసంహార! నరసింహ! దురితదూర! 89

దేవుని రకరకాలుగా సంబోధించడం, ఆయన లీలలను ప్రస్తావించడం, తన పరిమితులను, దేవుని అపరిమితత్వాన్ని పేర్కొనడం చివరకు తనకు ముక్తి నిచ్చే బాధ్యత నీదే అని శరణు వేడడం. ఇది శేషప్ప శతక పద్యాల్లో పాటింపబడిన రచనా శిల్పం.

విష్ణుమూర్తి మహత్త్వాన్ని పేర్కొనాలంటే సాధారణ వ్యక్తులు సరిపోరు. అలాంటి సామాన్యులు చెప్పడం ఆయన గొప్పతనానికి కొలమానం కాదు అని శేషప్పకు బాగా తెలుసు. అందుకే ఎంతో ఔచితీమంతంగా శివుడు, బ్రహ్మ, బలిచక్రవర్తి, ఇంద్రులను తీసుకొని వచ్చాడు. అంత గొప్ప వారికి మాత్రమే తెలిసేవాడు విష్ణువు. అంటే నిజానికి అంత గొప్పవారికి కూడ సమగ్రంగా విష్ణుమహత్త్వం తెలియదని ధ్వన్యాత్మకంగా చెబుతున్నాడు. అప్పుడు మామూలు మనుషుల సంగతి ఇక వేరే చెప్పాలా ? వారికి ఎట్లాగూ చేత కాదు అని శేషప్ప ఆంతర్యం. బ్రహ్మ, శివుడు, బలి, ఇంద్రునిలో ఉన్న శక్తి నాకు ఉంటే నేను కూడ నిన్ను కీర్తిస్తాను అని గూఢంగా మొరపెట్టుకున్నాడు. నాగేంద్రశయనుడు విష్ణువు. ఆదిశేషుని మీద విష్ణువు పడుకోవడం ప్రసిద్ధం. ఇది ప్రతీకాత్మకత .

ఆది- శేషం రెండు కలిగి ఉన్నవాడు కనుక ఆది శేషుడు . ఆది- శేషం రెండు ఉన్నాయంటే మధ్య కూడ అనివార్యంగా ఉంటుంది. సృష్టి సర్వత్ర వ్యాపించిందనడానికి ఆది శేషుడు ప్రతీక అయితే విష్ణువు – “విష్ -వ్యాపనే” అంతటా వ్యాపించిన వాడు విష్ణుమూర్తి. బ్రహ్మ సృష్టికారకుడు. శివుడు లయకారుడు. ఆది – అంతాల్లో వారిద్దరూ ఉంటారు . విష్ణువు ఈ ఆది అంతాలను కలుపుకొని అంతటా ఉండడం మూలాన స్థితికారుడయ్యాడు. అన్నీ తానై, నిర్వహిస్తున్న విష్ణువు స్థితివ్యాపకత్వాన్ని “సర్వము న్నతని దివ్య కళామయ మంచు” బ్రహ్మ శివులు దర్శించగలరు . వచ్చినవాడు విష్ణువనీ తెలుసు. గురువు శుక్రాచార్యులు వద్దని వారిస్తున్న సంగతీ తెలుసు. తనకు ప్రాణహాని కలుగబోతుందన్న సంగతీ అర్థమౌతుంది. అయినా విష్ణుకరంబు కిందై తన కరంబు మీదౌట మేల్గాదె అన్న వ్యామోహంలో పడిపోయాడు బలిచక్రవర్తి. ఈ వ్యామోహమే “విష్ణుమాయ”. ఇంతింతై వటుడింతయై త్రివిక్రమరూపం దాల్చి తనను పాతాళానికి పంపిన విష్ణుమూర్తి మాయాసామర్థ్యం అనుభవపూర్వకంగా బలిచక్రవర్తికి బాగా తెలుసు నని శేషప్ప పేర్కొంటున్నాడు. విష్ణు లీలలు దర్శించడానికి మానవుల కుండే రెండు చర్మ చక్షువులు, కీర్తించడానికి ఒకనోరు చాలవు. కనుక శేషప్ప సమగ్రంగా కీర్తించలేడు . కాని వేయి కన్నులు ఉన్న ఇంద్రుడు రెండు కన్నులుండే సామాన్య మానవుల కన్న ఐదువందల రెట్లెక్కువగా చూడగలడు. వేయినాలుకలు కలిగిన ఆదిశేషుడు అంతే ఎక్కువగా కీర్తించగలడు అంటూ ఎంతో సాభిప్రాయంగా సముచితమైన రీతితో శేషప్ప తన భక్తి భావాన్ని పాఠకులకు అందిస్తాడు.

విష్ణుసహస్ర నామాలకు సమానమైన ఒకనామం చెప్పవలసిందని పార్వతీదేవి “కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకమ్” అని శివుని అడుగుతుంది. అప్పుడు

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే

సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే

అని శివుడు చెప్తాడు. ఇది విష్ణుసహస్రనామాలను పారాయణం చేసే ప్రతి వారికి తెలిసిన అంశం. ఇది మనసులో స్ఫురించే కాబోలు భక్త కవి శేషప్ప “నాగేంద్రశయన! నీ నామమాధుర్యంబు మూడు కన్నుల సాంబమూర్తి కెఱుక” అని ఎంతో సార్థకంగా అన్నాడు. ఇందులో గమనించవలసిన మరో చమత్కారముంది. “సాంబమూర్తి” కి బదులు “శంకరుండు” అన్నా ఛందస్సు సరిపోతుంది. కాని పార్వతి అడగడం వల్ల శివుడు చెప్పాడని చెప్పడానికి అంబతో కూడిన శివుడు అని అర్థం వచ్చే విధంగా సాంబమూర్తి అని సాభిప్రాయంగా ప్రయోగించాడు . రామ రామ రామ అని మూడు సార్లు జపిస్తే చాలు విష్ణువు వేయి పేర్లు స్మరించినట్లే అని చెప్పిన వాడు వట్టి శివుడు కాడు. మూడు కన్నుల వాడు. నరసింహుని “ఆకంఠం విష్ణురూపాయ అత ఊర్ధ్వం శివరూపిణే” కంఠం దాక విష్ణువు ఆపైన శివుడు అని నరసింహుని శివకేశవాభేదంగా అన్వయించిన సంప్రదాయం కూడ లేక పోలేదు. విష్ణురూపాయ నమశ్శివాయ- విష్ణురూపంలో వున్న శివునకు నమస్కారం అన్నదీ జగత్ప్రసిద్ధమే .

“పరమాత్మ ! నీ దగు పక్షపాతిత్వంబు దశ శతాక్షుల పురందరుని కెఱుక” అనే పాదం కొన్ని ప్రతుల్లో “పరమాత్మ! నీ దగు ప్రబల శూరత్వంబు దశ శతాంబకపురందరుల కెఱుక” అని కనబడుతుంది .

“వీరి కెరుకగు నీ కథల్ వింతలెల్ల” అనే పాఠంలో “వింతలౌను” అన్న మార్పు కనిపిస్తుంది. “నరుల కెరుక” అన్న బహువచన పాఠం ఏకవచనంలోకి మారి “నరున కెరుక”గా మారింది . “మాయాసమర్థత” కొన్ని ప్రతుల్లో “మాయసామర్థ్య”మై పోయింది.

అర్థు లేమైన ని న్నడుగ వచ్చెద రంచు

క్షీర సాగర మందుఁ జేరినావు

నీచుట్టు సేవకుల్ నిలువకుండుటకునై

నీచుట్టు సేవకుల్ నిలువకుండుటకునై

భయద సర్పము మీఁదఁ బండినావు

భక్త బృందము వెంటఁ బడి చరించెద రంచు

నెగసి పోయెడి పక్షి నెక్కినావు

మౌనులు నీ ద్వార మాసింపకుంటకు

మంచి యోధుల కాప లుంచినావు

లావు గలవాఁడ వైతి వే లాగు నేను

నిన్నుఁ జూతును నాతండ్రి నీరజాక్ష!

భూషణ వికాస! శ్రీధర్మ పురనివాస!

భూషణ వికాస! శ్రీధర్మ పురనివాస!

దుష్టసంహార! నరసింహ! దురితదూర! 90

శేషప్ప భగవంతుని వ్యాజస్తుతి మార్గంలో కీర్తిస్తున్నాడు . భగవంతుని విమర్శించి నట్లు కనిపిస్తుంది .

అది కావాలనీ, ఇది కావాలనీ ఆరాటపడేవారు నిన్నడగడానికి వచ్చి నీ ప్రశాంతతకు భగ్నం కలిగిస్తారని పాలకడలిలో దాక్కున్నావు. సేవకుల వల్ల సేవాభాగ్యం కలిగినప్పటికీ, ఏకాంతం కూడ వాంఛనీయమే. సేవకుల వల్ల ఏకాంతానికి భంగం కలుగుతుందని సర్పం మీద పడుకుంటున్నావు. దాని భయం వల్ల సేవకులు నీ దరికి రాకున్నారు. అట్లే భక్త బృందానికి చిక్కకుండా పక్షి నెక్కి చరిస్తున్నావు . దాసులు నీ దరికి రాకుండా జయవిజయులనే యోధులను కాపలా ఉంచావు. ఇంత బలశాలివి. సాధారణ పరిపాలకుల చుట్టే ఎంతో మందీ మార్బలం, రక్షణ ఉంటుంది. వారిని కలవాలంటే ఎంతో తతంగం, కాలహరణం ఉంటుంది. మరి చతుర్దశ భువనాలకు అధిపతివైన నీకు రక్షణవలయాలు ఉండడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. ఆ రక్షణవలయాలను దాటుకొని తండ్రీ! నిన్నెలా చేరగలను? నాకలాంటి శక్తిఎక్కడిది? అని భగవంతునికి ఆర్తితో మొరపెట్టుకుంటు శరణాగతి చెందుతున్నాడు. “నా తండ్రి” అని ఎంతో సాభిప్రాయంగా శేషప్ప వాడాడు. అధికారి ఎంత గొప్పవాడైనా, మందిమార్బలం ఉన్నా, ఎంత కార్యవ్యగ్రత ఉన్నా సరే కొడుకు చెంత చేరడానికి ఎవరూ ఆటంకపరచజాలరు. భగవంతుడు ఎంతో గొప్పవాడే కాని “తండ్రి” కనుక సులువుగా నీ దరి చేరగలను అని సమన్వయించవచ్చు.

“దాసులు నీద్వార మాసింపకుంటకు మంచి యోధుల కాపలుంచినావు” అన్న దానికి పాఠాంతరం కనిపిస్తుంది. “మౌనులు నీ ద్వార మాసింప కుండంగ మంచి యోధుల కాపలుంచినావు” అని 1932 నాటి ప్రతిలో ఉంది. బహుశ కవి రాసిన పాఠం ఇదే అయివుండవచ్చు. సేవకులు అని రెండవ పాదంలో వచ్చాక దాసులు అవసరం లేదు. కాని పండితులు ప్రాస నిర్దుష్టత కోసం దాసులు అని కల్పించివుంటారు. కవి మౌనులు నీ ద్వార మాసింపకుండంగా అని అఖండయతి వేశాడు అని భావించవచ్చు. పద్య ప్రారంభంలో “అర్థులేమైన” అన్న దానికి “అందరేమైన” అని కూడ కనిపిస్తుంది. “ఎగసి పోయెడి పక్షి” మధ్యలో లోకుల నాలుకల్లో నాని నాని “ఎగిరి పోయెడి పక్షి” గానిలిచిపోయింది.

నీకథల్ చెవులలో సోఁకుట మొదలుగాఁ

బులకాంకురము మేనఁ ఋట్టువాడు

నయమైన నీ దివ్య నామకీర్తనలోన

మగ్నుఁడై దేహంబు మఱచువాఁడు

ఫాలంబుతో నీదు పాదయుగ్మమునకుఁ

బ్రేమతోఁ దండ మర్పించువాఁడు

హా! పుండరీకాక్ష! హా! రామ! హరి! యంచు

వేడ్కతోఁ గేకలు వేయువాఁడు

చిత్తకమలంబునను నిన్నుఁ జేర్చువాఁడు

నీదు లోకంబునం దుండు నీరజాక్ష!

భూషణ వికాస! శ్రీధర్మ పురనివాస!

దుష్టసంహార! నరసింహ! దురితదూర! 91

లోకులు ఎప్పుడూ లౌకిక కార్యాల పట్ల, లౌకిక ప్రయోజనాల పట్ల దృష్టి పెడ్తారు. కాని ఆధ్యాత్మికులు భగవంతుని పట్ల దృష్టి పెడ్తారు. వారు భగవంతుని కథాంశాలు వినడంలో పులకరించిపోతారు. భగవంతుని సంకీర్తనంలో మైమరచిపోతారు. నామస్మరణంలో పరవశించిపోతారు. భగవంతుని హృదయకమలంలో చేర్చుకొంటారు. అలాంటి భాగవతోత్తములే విష్ణులోకంలో వసించడానికి అర్హులు అని శేషప్ప ఎలుగెత్తి చాటుతున్నాడు. యజ్ఞయాగాదులు, జపతపాదులు, నియమనిష్ఠలు, శాస్త్రోక్తవిధివిధానాలు అలసులు, మందమతులు, అశక్తులు అయిన నేటికాలపువారికి సరిపోవు. నామసంకీర్తనమే భవసాగరతరుణోపాయ మన్న పెద్దల హితవచనాలకు శేషప్ప కల్పించిన పద్యరూప మిది.

శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం

అర్చనం, వందనం, దాస్యం, సఖ్య, మాత్మనివేదనం

అన్న ప్రసిద్ధ నవ విధ భక్తి విధానాలను “తనదైన అనుభూతి తనది కాన” అన్నట్లుగా నిసర్గ సుందర శైలిలో పేర్కొంటున్నాడు.

నిగమగోచర! నేను నీకు మెప్పగునట్లు

లెస్సగాఁ బూజింపలేను సుమ్మి

నాకుఁ దోఁచిన భూషణములు పెట్టెద నన్నఁ

గౌస్తుభమణి నీకుఁ గలదు ముందె

భక్ష్యభోజ్యముల నర్పణముఁ జేసెద నన్న

నీవు పెట్టితి సుధ నిర్జరులకుఁ

గలిమి కొద్దిగఁ గానుకల నొసంగెద నన్న

భార్గవీదేవి నీ భార్య యయ్యె

నన్ని గలవాఁడ వఖిల లోకాధిపతివి

నీకు సొమ్ములు పెట్ట నే నెంతవాఁడ

భూషణ వికాస! శ్రీధర్మపురనివాస!

దుష్టసంహార! నరసింహ! దురితదూర! 92

కొండంత దేవునకు కొండంత పత్రి సమర్పించలేం. ఆది మధ్యాంతరహితునకు, అపరిమితునకు, కాలస్వరూపునకు తగిన రీతిలో సామాన్యులు అర్చన చేయలేరు. అనంతమైన వేదాలే ఆ భగవంతుని సమగ్రత్వాన్ని కీర్తించలేక పోయినవి. ఏవో నాలుగు సొమ్ములు నాశక్తిమేరకు కానుకగా ఇచ్చి నిన్ను ప్రసన్నుని చేసుకొందామంటే సాక్షాత్తు కౌస్తుభమణి నీ చెంత ఉంది. భక్ష్యభోజ్యాలతో నిన్ను తృప్తి పరుద్దామంటే దేవతలకే అమృతాన్ని ప్రసాదించ గలిగిన వాడివి. నీ కేమైన ధనాన్ని ఇద్దామంటే సాక్షాత్తు లక్ష్మిదేవియే నీ భార్యామణి- అన్నీ ఉన్న వాడివి. అన్ని లోకాలకు నీవే అధిపతివి. ఏదైన నీకు లేనిది, నీవు కోరినది, నీకు కావలసినది ఇద్దామన్న తలంపు ఉన్నా సర్వం నీవే అయిన నీకు ఏమి ఇవ్వగలను?. ఇన్ని ఉన్నా నీవు భక్త సులభుడవు కూడ. పరిపూర్ణమైన త్రికరణ శుద్ధితో నిన్ను శరణువేడితే చాలు నీవు లొంగిపోయే అత్యంత కారుణ్యమూర్తివి అని శేషప్ప భగవంతుని వేడుకుంటున్నాడు. “నీకు సొమ్ములు పెట్ట నే నెంతవాడ” , “నీకు భూషాదులను పెట్టనెంతవాడ” అని రెండు తీరుల పాఠాలను వల్లె వేసినా శేషప్పను యతిదోషం నుండి కాపాడలేం. అయినా కవి తన భావప్రసరణానికి అఖండయతి తప్పనిసరై వేస్తున్నప్పుడు కాదనడానికి మనమెవరం? ఈ శేషప్ప పద్యాన్ని చదువగానే కృష్ణమాచార్యుల “సింహగిరివచనాలు” మదిలో మెదలకమానవు.

దేవా! పెద్దతనంబు చేసి మిమ్ము మెప్పించుదు నంటినా

జాంబవంతుడు మీసన్నిధినే యున్నాడే.

దేవా ! ధనధాన్యంబులచే మిమ్ము మెప్పించుదు నంటినా

శ్రీమహాలక్ష్మి నీయుదర మందేయున్నదే

దేవా ! శాంత శమ దమాది గుణంబులచేత ఓర్పు గలిగియుండెదనంటినా

భూదేవి మీసన్నిధినే యున్నది.

దేవా ! వాహనారూఢుండనై భరింతునంటినా

గరుత్మంతుడు మీసన్నిధినే యున్నాడే.

అని సాగే “సింహగిరివచనాలు” శేషప్ప పద్యం బింబ ప్రతిబింబాలుగా తోస్తాయి. అసలు భక్తులహృదయాలు, ప్రవర్తనలు, ఆలోచనాతీరులు అన్నీ ఒకేతీరుగా ఉంటాయి. అందువల్ల

రచనల్లో పోలికలు గోచరించడంలో వింతేమీ లేదు.

శేషప్ప నరసింహశతకం పైన కూచిమంచితిమ్మకవి కుక్కుటేశ్వరశతకం, గోగులపాటి కూర్మనాథుని సింహాద్రి నారసింహ శతకం, కాసులపురుషోత్తమకవి ఆంధ్రనాయక శతకం ప్రభావం అపారం. ఇవన్నీ సీసపద్య శతకాలే. అధిక్షేపవిన్యాసాలే. ఇంచుమించు ఏకకాలికాలే. కూచిమంచితిమ్మకవి కుక్కటేశ్వరశతకంలోనున్న “భూనుతవిలాస! పీఠికాపురనివాస! కుముదహితకోటి సంకాశ! కుక్కుటేశ”! మకుటాన్ని శేషప్పనరసింహశతకం లోనున్న “శ్రీధర్మపుర నివాస ! దుష్టసంహార! నరసింహ! దురితదూర” ! మకుటాన్ని సరిపోల్చి చూస్తే రెండు మకుటాలు కవలపిల్లల్లా తోచక మానవు. నేనింత భక్తుడి నయినా భగవంతుడు నాకే తక్కువ చేస్తున్నాడు అన్నతీరుగా ప్రపత్తితో శేషప్ప నరసింహశతకం సాగిపోతుంది. అసలు భగవంతునికే దిక్కు లేకపోతే ఇంక సామాన్యుని గతేమిటి? విధర్మీయుల ఆగడాలనుండి నిన్ను నీవే రక్షించుకోవాలి సుమా ! అని భగవంతునే అధిక్షేపించే రచనగా చారిత్రక ప్రతిపత్తితో గోగులపాటి కూర్మనాథుని సింహాద్రి నారసింహ శతకం కొనసాగుతుంది. శేషప్ప, కూచిమంచితిమ్మకవి, గోగులపాటి కూర్మనాథుని శతకాల్లోనున్న వైయక్తికమైన అనుభవ స్పర్శ సులువుగా పాఠకులకు అందివస్తుండగా సాహితీపరమైనవైదుష్యంతో, భావుకప్రతిభతో కాసులపురుషోత్తమకవి ఆంధ్రనాయక శతకం పాఠకులను సమ్మోహితులను చేస్తుంది.

శేషప్ప శాస్త్రపాండిత్యంతో, భాషాపటాటోపంతో అదరగొట్టే కవి కాదు. సామాన్య జనుల్లో తాను ఒకడిగా కలిసిపోతాడు. జీవితంలో ఏవో కష్టసుఖాలు, ఈతి బాధలు అన్నీ అనుభవించాడు. తనకు రావలసినదేదో రాలేదన్న అసంతృప్తికి కూడా లోనయివుంటాడు. భారతీయుల్లో ఉండే సహజమైన వేదాంతభావనను ఒంటబట్టించుకున్నాడు. నరసింహ శతకం చదువుతుంటే గ్రామీణ ప్రాంతాల్లో , ఇంకా ఆధునిక నాగరికత విజృంభించని కాలంలో మీదకు కట్టిన తెల్లని ధోవతి, కమీజు, తలకు ఒక పెద్దరుమాలు దాల్చి, ఒడ్డు పొడుగు ఉన్న ఓ మోస్తరు పెద్ద మనిషి మనకు ప్రత్యక్షమవుతాడు. శేషప్ప భక్తులలో భక్తుడు. సామాన్యులలో సామాన్యుడు. మనలో ఒకడు. ఆ భగవంతుడు శేషప్పకు, మనకు, సర్వ సృష్టిజాలానికి శుభాన్ని చేకూర్చుగాక!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com