బాధను దించుకోవడానికే కథలు రాస్తున్నాను

నేనెందుకు రాస్తున్నాను……? కొన్ని నేనే ఎందుకు రాస్తున్నాను….? ఇలా నాకు నేను తర్కించుకుంటే నేను రాస్తున్ననా లేక పరిస్థితులు నాతో రాయిస్తున్నయా..? ఏమిటా పరిస్థితులు..? ఈ దేవులాటలో ఏండ్ల తరబడి మా ఊరుకు నాకున్న సంబంధం ఏమిటి..? ఊరు నా కథలకు ఊటబాయి ఎందుకయింది ?. ఎండిన మానేరు నదిలో ఇంకెన్ని వెతలున్నయి..? ఇదిగో..ముందుగా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మొరం దేలి పొక్కిళ్లుగా మారిన వాకిళ్లకు మూలాలను వెతకాలె. అన్నింటికంటే ముందు పుంటి కూరలో ఉప్పులేని నా పేదరికాన్ని, పుట్టేడు రోగాలతో గొడ గొడ కన్నీటితో చీము రక్తమయిన నా బాల్యన్ని గెలకాలి. ఇది నా బలమో బలహీనతనో కాని నేను కథలు రాయడం మొదలుపెట్టేవరకూ ఎవరి కథల గురించి తెలువది. తెలిసిందల్లా అతలాకుతలమైన జీవితం గురించే.

మా ఊరు భీముని మల్లారెడ్డిపేట.రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఒకానొక చిన్న పల్లెటూరు. చాలా వాటికీ దూరంగా చాలా వాటికీ దగ్గరగా మానేరు వాగు ఒడ్డున ఉన్నది. ఊరు చుట్టూ నీళ్లు…. యాడాదికి రెండు పంటలు.. ఎండ కాలం వాన కాలం తేడా లేకుండా నిండు కుండల్లా రెండు చెరువులు. మాది వ్యవసాయ కుటుంబం.ఆడింత ఈడింత వక్కలు వక్కలుగా రెండెకరాల భూమి. ఏడుగురం పిల్లలం. పోయేటోళ్లు పోంగ మిగిలింది నలుగురం. నలుగురికి నాలుగు రోగాలు. సంసారం ఈదడం బాపుకు చాలా కష్టంగా ఉండేది. అప్పులంటే పుట్టెడు భయం. “చెప్పుకాలోడు అప్పు కట్టమని ఇంటి కడుప తొక్కద్దు “అనే వాడు. అయినా అప్పులు చేయక తప్పేది కాదు. అవి తీర్చలేక మొఖం దాచుకుని నానా ఇబ్బందులు పడేవాడు.సూడు సూదు మంట అప్పుడే అక్క పెండ్లయింది. ఏకుల గుల్లంత అప్పు ఏనుగంతయింది. కాలే కడుపుకు కాయనో పండో తిని కూటిగింజలను కూడా అమ్ముకునేది. ఇది నాకు బుద్ది తెల్సినప్పుడున్న మా యాతన సంసారం. ఇదే రాను రాను నా కథలకు జీవ సారం అయింది.

చిన్నప్పుడు మా ఇంట్లో నాటకాలు నేర్చుకునే వారు.బాపు ఐదో పదో వస్తయని రాత్రంతా నాటకాలు నేర్పేవాడు. నేను రాత్రంతా మేల్కొని రిహార్సల్స్ చూస్తుండేవాన్ని. నేర్చుకునే వాళ్ళంతా నాటకాల్లో రాజులు గనీ పొద్దంతా కష్టపడే వ్యవసాయ కూలీలు, జీతగాల్లే. అయినా రాత్రంతా నిద్రలేకుండా నేర్చుకునే వారు. వారిలో ఉన్న ఆ “జిల” నాకు విచిత్రంగా అనిపించేది. నేను వాళ్ళకు పాత్రలు రాసిచ్చేది.అప్పుడప్పుడు ప్రాంమ్టింగ్ చెప్పేది.అలా నాకూ నాటకాల పిచ్చి తలిగింది. రాత్రికి రాత్రి వాడకట్టు మొత్తం మా వాకిట్లనే ఉండేది. నేను నా దోస్తులతో రాత్రి చూసిన బాగోతాన్ని పగలు వీధుల్లో ఆడేది. ఈ అనుభవాలే ఆ తర్వాత మా “ ఊరి బాగోతం కథలు” రాసిన.

1980 లో పెద్ద కరువు వచ్చింది.అంతంత మాత్రంగా ఉన్న మా బతుకులు ఆగమైంది అప్పుడే. నేను ఆరవ తరగతిలో ఉన్నా. నేను చిన్నప్పటినుంచి రోగాల కుప్పనే గదా. దానికి తోడు మా ఊర్లో ఐదవ తరగతి వరకే ఉంది. ఆ పైచదువులకు ఆరు కిలోమీటర్లు నడిచి లింగన్నపేటకు ఒంటరిగా పోవలసిందే. మధ్యలో పెద్ద అడవి. భయమేసేది. ఎండాకాలం ఎండల్ల, వానాకాలం వానల్ల…..పునాస పంటల మీద, కాయలు పండ్ల మీద పదేండ్ల వయసులో పన్నెండు కిలో మీటర్ల నడకలో నాకు ఆరోగ్యం పాడయింది.చదువు మానేసిన. సరిగా తిండి లేక ఆకలిని మీద నేను చేసిన పోరాటం సరిగ్గా వైద్యం అందక సివసత్తుల చుట్టూ తిరిగిన గోస అంతా ఇంతా కాదు.ఆ అనుభవమే తర్వాత “అతడు ఆకలిని జయించాడు” “ ముల్లు “ “ తెగారం” కథలుగా రాసిన. చదువు లేదు కనుక బాపు వెంట పొలం పనికిపోతూ పంట కోసం ఆయన “తండ్లాటను ” దగ్గరుండి చూసేవాన్ని. తర్వాత…తర్వాత ఆ అనుభవాన్ని “తండ్లాట ” కథగా రాసిన. ఆయన భూమితో పంటతో పకృతితో చేసిన చావు రేవు పోరాటమే చూసిన కంటితో ‘కీలు బొమ్మలు’ ‘ అదృశ్య రూపాలు’ ’ఆటకోయిలి పోరడు ’ ‘ఎండ మావ‘ కథలుగా రాసిన.

నన్నో ప్రయోజకుడిని చేయాలనే బాపు ఆలోచనకు నా చదువు ఆగిపోవడంతో ఆయన చాలా బాధపడ్డడు.అప్పుడు వాళ్లకున్న జ్ఞానంలో డాక్టర్ కంటే శివసత్తులే గొప్పవాళ్లు. వాళ్ల పొత్తి, బండారి, నిమ్మకాయలు, తాయతుల మీదనే మందు గోళీలకంటే నమ్మకం ఎక్కువ.అట్లా ఓ ఆరు నెలల పాటు అనారోగ్యంతో శివసత్తుల ఇండ్ల చుట్టు తిరిగాను. దించుళ్లు….. తాయితులు….. బండారు ఆనతులు…. అట్లా వాళ్ల జీవితాలను చూసే అవకాశం దొరికింది. సామజిక హోదా కోసం శివసత్తులు పడే తపన కనిపించింది. నారోగం పోయిందో లేదో తెలువదుకాని వాళ్ళు పాడే పాటలు మాత్రం నోటికి వచ్చినయి.కోమటి, బ్రాహ్మణ వెలమ లాంటి ఉన్నత కులాల్లోని స్త్రీలకు రాని పూనకం దళిత స్త్రీ లకే ఎందుకు వస్తుంది అన్న ప్రశ్న నాకు అప్పుడే కలిగింది. ఆ మూలాలను వెదుక్కునే తర్వాత “తెగారం” కథను రాసిన అదే పేరుతో నాటికను రాసిన.అది నలబై రెండు ప్రదర్శనలు చేసుకుంది.

అట్లా చదువు ఆగిపోయినంక నేను వ్యవసాయం వైపు వచ్చిన. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. మాకు రెండు పూటల తిండి పెట్టడం కోసం జూదంలాంటి వ్యవసాయంతో ఆడుతూ ఓదుతూ అడుగడుగునా మా తల్లితండ్రులు పడే ఇబ్బందులు కంటి నిండా చూసాను. ఆ కొద్ది పంట చేతికి వస్తుందనే లోపు ఒకసారి రాళ్ళవాన పడేది. మరోసారి దోమపోటు లేచేది. ఇట్లా బాపుకు వ్యవసాయం మీద పూర్తిగా మనసు విరిగిపోయింది. నాలో ఎదో భావావేశం పొంగేది. పాటలు పద్యాలు రాసుకునేవాడిని. ఈ ఆవేదనే తరువాత ‘దాడి ’ నవలగా రాసిన.

వర్షాలు లెవ్వు. కరువు కోరలు సాచింది.ఉన్న దొయ్యలు బీడువారిపోయినయి. మొదటిసారిగా గల్ఫ్ దేశాల వైపు వలసలు అప్పుడే మొదలయ్యాయి. ఏడాది బొంబాయి చుట్టూ తిరిగితే తప్ప వీసా చేతికివచ్చేది కాదు. బొంబాయిలో జోపుడాల్లో వాళ్ళు పడే బాధలు కథలు కథలుగా చెప్పేవాళ్ళు. ఏజెంట్ల జిమ్మిక్కులకు లెక్కనే లేదు ఇన్ని కష్టాలకోర్చి అక్కడికి చేరుకుంటే ఆరు నెలల దాక ఉత్తరం వచ్చేది కాదు. వచ్చినా ఉత్తరం నిండా కష్టాలే !

మా వాడకు ఉత్తరాలు నేనే రాస్తుండేవాడిని. అక్కడి నుండి వచ్చిన ఉత్తరాలను నేనే చదువుతుండే వాడిని. అట్లా అక్కడ ఇక్కడ ఇద్దరి బాధలు నన్ను చిన్నతనాన్నే కలవర పెడుతుండేవి. నన్ను కంటతడి పెట్టిస్తుండేవి. మా దూరపు బంధువు ఒకాయన మస్కట్ వెళ్లిన తర్వాత యాడాదివరకూ ఉత్తరం రాలేదు. తర్వాత వచ్చిన ఒకే ఒక ఉత్తరంలో ఉన్న విషయం చదివి వాళ్ల తల్లి బెక్కన బెంగటిల్లి పిడాత పాణమిడిసింది.నాకు మనుసు కలి కలి అయింది.

తను ఎడారుల గుట్టల నడుమ ఉన్నానని గోర్లు మేపుతున్నానని వారానికి ఒకసారి కనిపించే హరిబాబు తప్ప మనిషి కనిపించడని నెలకు ఒకరోజు స్నానం చేస్తానని ఒక క్యాన్ నీళ్లు వారం దాకా కాపాడుకోవాలని, ఒకసారైతే నీళ్లు లేక గొర్ల మూత్రం తాగానని రాసిండు. మనిషన్న వానికి ఆ ఒక్క ఉత్తరం చాలు. జీవితాంతం వెంటాడడానికి.

కాలం నడుస్తుంది.ఈ వలసబాధ మాకూ తప్పలేదు. వ్యవసాయం మీద మనసు విరిగిన బాపు ఏజెంటు చేతుల్లో చిక్కుకున్నడు. ఏడాది బాంబే చుట్టు తిరిగిండు. నా ఆరోగ్యం కొద్దికొద్దిగా కుదుటపడుతుంది. బాపు ఇంట్లో లేకపోవడంతో నేను వ్యవసాయపనులు చూసుకుంటున్న. చదువుమీద మనసుతో పది ప్రైవెట్లో కట్టి పాస్ అయిన. అత్తెసరు మార్కులతో పాస్ అయినగదా..ఏ గవర్నమెంటు కాలేజీలో సీటు రాలేదు.అప్పుడే నార్త్ యమన్ దేశానికి బాపుకు వీసా వచ్చింది. వెళ్తు వెళ్తు ఎడ్లను అమ్మి వచ్చిన డబ్బుతో డొనేషన్ కట్టి నన్ను ఇంటర్ లో చేర్చి పోయిండు. నా కోసమే తెరిచినట్టు గంభీరావుపేటలో గవర్నమెంటు కాలేజీ డిసెంబర్ లో కొత్తగా లేటుగా తెరిచారు.

ఇందాక పక్కవాళ్ళకు చూసిన గల్ఫ్ వలస బాధలు ఇప్పుడు మా ఇంట్లో మొదలయ్యాయి. బాపు ఏమన్ వెళ్ళినంక ఎనిమిది నెలలవరకూ ఉత్తరం రాలేదు. ఎవరిని అడగాలో తెలువది. ఎవరికి చెప్పాలో తెలువది. అమ్మ ఏడ్వని రోజు లేదు. ఏడ్చి ఏడ్చి మంచాన పడ్డది.బతకనే బతకదనుకున్న. బాపు రాసినట్టుగా ఒక ఉత్తరాన్ని సృష్టించి తెచ్చి చదివితే కాని ఆమె కోలుకోలేదు. తర్వాత కాలంలో ఇవే అనుభవాలతో పద్నాలుగు వలస కథలతో ‘ వలస బతుకులు ’ . ‘ఎడారిమంటలు’ నవలగా ‘‘ ఎండమావ‘ నాటకంగా రాసిన.

ఇంటర్ చదివేప్పుడు కిరోసిన్ లేక కాగితాలతో అన్నం వండుకోవడం,రోజు రూపాయి కూళీకి బీడి కంపనీలో పనిచేయడం కూరగాయలు కొనలేక కారంతో తిని కడుపునొప్పి తెచ్చుకోవడం ఒక విచిత్ర అనుభవం.అవే ‘ఆట కోయిలి పోరడు’ ‘ ముల్లు ’ ‘ ఆకలి’ కథలకు మూలాలు. రెండేండ్ల తర్వాత బాపు ఉత్త చేతలతో వచ్చిండు.ఎవుసం మూలకు వడ్డంక అమ్మ అష్టకష్టాలు పడి బీడీలు నేర్చుకుంది. ఆమె చేతివేళ్ళు బీడీలు చుట్టడంలో మలిగేవి కావు. అయినా ప్రయాస పడేది. అప్పు అప్పులాగే ఉంది. ఉన్నదాంట్లో ఎకరం పొలం అమ్మి చెల్లెపెండ్లి చేసినం. సంసారం తీవ్ర సంక్షోబంలో పడింది. ‘మాయిముంత‘ కథల సంపుటిలోని పన్నెండు కథలకు అప్పటి అనుభవాలే మూలాలు.

అప్పుడు నేను డిగ్రీలో చేరిన.అప్పుల బాధతో అమ్మకు బెంగ పట్టుకుంది. నన్ను చదువు మాన్పించి ఏదైనా కిరాణం దుకాణంలో ఉంచుదామంది. బాపు ఒప్పుకోలేదు. నన్ను డాక్టర్ను చెయ్యాలని ఆయన పిచ్చికోరిక.ఇల్లు అమ్మి అయినా సరే డాక్టర్ చదివిస్తా అనేవాడు. నాకూ కావాలనే ఉండేది. కానీ ఎంత ఖర్చవుతదో ఆయనకు తెలువది. ఏం చదువాలో నాకూ తెలువది. నేను ఎంపిసి తో ఇంటర్ చేస్తుండగా గూడా అదే మాటను అనేవాడు. ఈ అనుభవమే‘ భూమడు ‘ ‘ ఇగ వీడు తొవ్వకు రాడు’ కథలకు మూలం.

నాకు మొదటిసారిగా కథంటే నవలంటే తెలిసింది డిగ్రీలోనే. ఒక మిత్రుడు ఆంద్రభూమి వార పత్రికను వరుసగా చదివేవాడు.అది సస్పెన్స్ థ్రిళ్ళింగ్ నవలల కాలం. వారపత్రికల కథలే కథలనుకునేవాన్ని. అంతవరకు నేను చూసిన గొర్రె తోక బెత్తెడు జీవితం జీవితమే కాదనిపించింది. వారపత్రికల మూసలో కథలు రాయడం మొదలు పెట్టిన. చదువొక్కటే జీవితాన్ని మారుస్తదని తెలుసుకున్నంక ట్యూషన్లు చెప్పుకుని డిగ్రీ, బియిడి పూర్తి చేసిన. 92లో పెండ్లి తర్వాత 96 వరకు ఊరికి దూరంగా ప్రైవేట్ స్కూళ్ళలో గడిపిన. ఈ కాలంలో ఊరిని చూసింది చాలా తక్కువ. ఈ కాలంలోనే మూడు నాలుగు ప్రేమ కథలు కూడా రాసిన. అదే జీవితంగా సాగిపోతుంది. ఈ లోగా ఊర్లో జరగాల్సిన మార్పులు జరిగిపోయినయి.ఊరు దురమక్కిన పండులా శిదలు శిదలయి కుప్ప కూలింది. 1996 లో టీచర్ ఉద్యోగం రాకపోతే నేను కథలు రాసేవాన్ని కాను. ఊరిపక్కనే ఉద్యోగం. ఊర్లో మకాం. నా స్వంత ఊరే అయినా ఐదేండ్లతరువాత వచ్చిన గదా ఇప్పుడు కొత్తగా వింతగా ఉంది. మార్పు మార్పుకు ఒదిగి భయంభయంగా ఉంది. అప్పటికీ ఇప్పటికీ తేడాలు చూస్తే ఊరి బతుకులు మరింత ఆగమైనయి. వలసలు పెరిగినయి. కుల వృత్తులు కూలి పోయినయి. ఊరు గ్లోబల్ పడగ నీడలో ఉన్నట్టు స్పష్టంగా కనిపించింది. ఊర్లనే పిల్ల ఏజంట్లు పుట్టుకొచ్చారు. మస్కట్, దుబాయ్ పేరుతో జనాలను ఆగం చేస్తున్నరు.మారిన ఊరిని చూసినంక ఏడుపు ఆగలేదు.ఊరిలో వయసు మీదున్న మొగోడు లేడు. అగో..అప్పుడు గుండె భరువు దింఛుకోవడానికి కథలు రాయడం మొదలు పెట్టిన. కూలిన కులవృత్తుల వెనక ఉన్న కుట్రను చెప్పడానికి పెన్ను పట్టిన.కుమ్మరి, కమ్మరి, వడ్ల, శాల, మంగలి, సాకలి, గొల్ల ,తెనుగు, గౌడ,మాదిగ, ఇలా సబ్బండ కులాలమీద కులానికో కథ రాసిన.అంతే కాకుండా పిల్లి, దోమ, ఈగ, కుక్క, బర్రె,పంది , కోతి, కోడి, పాము, గుడ్డెలుగు, గంగెద్దు..పల్లేలోని ఏ జంతువును వదలకుండా ప్ర్తీతీకాత్మకంగా కథల్లోకి తెచ్చిన. అవన్ని ‘ఊటబాయి ’ ‘భూమడు’ కథా సంకలనాల్లో రాసిన.

ఒకనాడు పాలకుండలాంటి ఊరును చూసిన. ఉన్నతంగా వెలిగిన వృత్తులను చూసిన. ఇప్పుడు ఆదృశ్యమే మారింది. ఊరు వాడిపోయిన పువ్వయింది. రెండేండ్లు నాలో నేను తొక్కుకున్న. మధనపడ్డ. ఏడ్చిన. 99 చివరలో మొదటిసారిగా ‘ ఆశ-నిరాశ –ఆశ‘ కథను రాసిన. కాని మొదటగా ప్రచురితమైన కథ మాత్రం “కన్నతల్లి “. 2000 సంవత్సరం నాటికి కథలు రాయకుండా ఉండలేని స్థితికి వచ్చిన.అంతదాక తెలంగాణ కథ రైతు కూలీల దగ్గరనే ఆగింది.మరీ కిందికి దింపి అట్టడుగున ఉన్న నా ఊరు జన జీవితాలను కథలుగా నా ఊరి భాషలో రాయాలనుకున్న. నా చుట్టూ ఉన్న జీవితాలనే తీసుకున్న. అన్నీ సజీవమైన పాత్రలే. పేర్లు మాత్రమే మారుస్తున్న. నన్ను కదిలించిన ప్రతీ సంఘటనను అక్షరీకరించడం మొదలుపెట్టిన. అవన్నీ ‘జుమ్మేకీ రాత్ మే‘ కథలుగా ‘ మానేటి కఠలగ‘ రాసిన. కాని రాసిన కథలకంటే మనసులో రాయకుండా మసులుతున్న కథలే ఎక్కువ.

ఒకప్పుడు చెలిమలూరిన ఊరు ఇయ్యాల్ల గొంతు తడుపుకోవడానికి నీళ్లను కొనుక్కుంటుంది.ఆ కోణంలో గ్రామీణ పర్యావరణ సమస్య మీద “దాడి “నవలను రాసిన. మాయమైన మా బాగోతాల నేపథ్యాన్ని “మా ఊరి బాగోతం ” గా రాసిన. చిన్నప్పటి నుంచి నన్ను కలవర పెట్టిన వలసలను “వలసబతుకులు “కథల సంపుటిలో రాసిన. పర్యావరణ కాలుష్యం, మారిన జీవితాలు కూలిన కులంవృత్తులను “ఊటబాయి ” కథలుగా రాసిన. రాజకీయాలు మారిన పల్లె జీవితాలను “ఊరికి ఉప్పులం “నవలగా రాసిన. సంచారజాతులమీద ‘గోస‘“ఆట‘ ‘రెండు కోతులు’ కథలతో పాటు‘ జిగిరి’ ‘ సంచారి’ నవలలను రాసిన.ఇది తొమ్మిది భాశల్లోకి అనువాదమయింది. అలా ఊరిని అంటుపెట్టుకున్న గ్న్యాపకాలతో రెండువందల కథలను ఏదూ నవలలను పది నాటకాలను రాసిన. హిందీలో మరాటీలో కన్నడంలో మాఊరి కథలే అనువాఅదమై సంకలనాలుగా వచ్చినయి.

తెలంగాణ ఉద్యమంలో ఊరు ఉప్పెనై లేచింది. ఆ నేపథ్యంలో ఆరు కథలతో ‘పోరుగడ్డ‘ ‘లాంగ్ మార్చ్’ నవలను రాసిన. కరోనా లాక్ దౌన్ వలసల మీద ఇంకెంత దూరం నవలను రాసిన.కథలు నవలలు కాకుండా ఊరి జీవితాలను వెండితెరకు ఎక్కించే ప్రయత్నంలో నాలుగు సినిమాలకు రచనలు చేసిన. మొత్తం మీద ఊరికి దూరమైతే తప్ప….. కదిలిపోవడం, కరిగిపోవడం ఆగితే తప్ప…. మా ఊరి వెతలు కథలు కథలుగా నా వెంట వస్తూనే ఉంటాయి. జనం పాత్రలుగా చోచ్చుకస్తూనే ఉంటారు. మా మానేరు వాగు పొంగులా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com