‘వడగాడ్పు– నా జీవితమైతే, వెన్నెల – నా కవిత్వం’ అని తన గురించి తాను చెప్పుకున్న కవి. అవమానాల జడివానలో తడిసి సన్మానాల శాలువాలతో వినూత్నంగా విరజిల్లే వరకు అవిశ్రాంత కృషి చేసిన సాహిత్య కృషీవలుడు. అక్షర జ్ఞానం లేనితనం నుంచి అక్షర శాసనాలను రూపొందించిన అనఘుడు. అవమానాలను ఆయుధాలు చేసుకుని అజరామర కీర్తి పొందిన సాహితీ గేస్తుడు. పేదరికం పెద్ద విద్యాశాల లజ్జ కానబడదని వ్యక్తీకరిస్తూనే కాలాన్ని కైగట్టి, పొడిచేటి పొద్దు మీద, నడిచే సాహిత్యాకాశంలో అస్తమించనీ ఆధునిక పద్య భాస్కరుడు. పురివిప్పిన కావ్య పుంజమై తెలుగు సాహిత్య లలాటంను సువర్ణ లిఖితం చేసిన పరిమళ సింధూర గుర్రం జాషువా.

జాషువా తెలుగు సాహిత్యం ఉన్నంతవరకు జీవించే సజీవ కవి. ఆధునిక కవుల్లో అత్యాధునికుడు. ఆలోచనల్లో మేథ. అవమానాలే గాథలు. భారతీయ సాంస్కృతిక వైభవాన్ని జాషువా దృక్పథంలోంచి పర్యాలోచన చేద్దాం. ఆధునిక తెలుగులో అజరామర కవి గుర్రం జాషువా (సెప్టెంబర్ 28, 1895 – జూలై 24, 1971). జన్మ స్థలం వినుకొండ గుంటూరు.

పుట్టింది చిన్న గ్రామమే. ఆకాశమే హద్దుగా ఎదిగిన కవి. హృద్యంగా పద్యంతో తెలుగు వారికి వండివార్చిన రస నైవేద్యం.

సాంస్కృతిక వైభవం:

సమాజంలోని మానవులు అలవర్చుకున్న జ్ఞానమూ, నమ్మకాలూ, కళలూ, నీతులూ, చట్టాలూ, ఆచారాలూ, అలవాట్లూ ఇంకా ఏ యే విషయాలనైతే మానవులు అలవర్చుకుంటారో, ఆ విషయాలన్నింటినీ కలుపుకుని ఆ మొత్తాన్ని ‘సంస్కతి’ అనవచ్చు – అని టైలర్ చెప్పాడు.

సమాజపు ఆర్థిక నిర్మాణ చట్రం ఆ సంబంధాల అసలైన పునాది. ఆ పునాది మీదనే చట్టబద్ధ, రాజకీయ ఉపరి నిర్మాణం వేస్తుంది. సామాజిక చైతన్యానికి సంబంధించిన ప్రత్యేక రూపాలు, దానికి అనుగుణంగానే ఉంటాయి. భౌతిక జీవితానికి సంబంధించిన ఉత్పత్తి విధానమే, మొత్తం మీద, సామాజిక-రాజకీయ, బౌద్ధిక జీవిత క్రమాన్ని నిర్దేశిస్తుంది.” (మార్క్సు, 1859. ‘అర్ధశాస్త్ర విమర్శ చేర్పు’కి రాసిన ముందు మాటలో- మార్క్స్‌, ఎంగెల్స్‌ ‘సంకలిత రచనలు’ 2వ భాగం. ‘ప్రగతి’ ప్రచురణాలయం, మాస్కో 1981)

సంస్కృతి (లాటిన్, స్పానిష్, పోర్చుగీస్ Cultura, ఫ్రెంచ్, ఆంగ్లం Culture, జర్మన్, స్వీడిష్ Kultur) అనేది మానవ సమాజం జీవన విధానంలో ప్రముఖమైన విషయాలను – అనగా జీవనం, ఆచారాలు, వ్యవహారాలు, ప్రమాణాలు, మతం, సంబంధాలు, పాలన – వంటివాటిని సూచించే పదం. దీనికి ఆంగ్ల పదమైన కల్చర్ (సంస్కృతి) లాటిన్ పదం. కల్చుర లేదా కొలెరె అనేవి “పండించడం.” అనగా వ్యవసాయం చేయడం నుండి ఉద్భవించాయి.

భారతదేశం భిన్న సంస్కృతుల ఏకత్వం. భారతదేశములోని వివిధ భాషలు, మతాలు, సంగీతం, నృత్యం, ఆహారం, నిర్మాణ కళ , ఆచారాలు, వ్యవహారాలు దేశంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో విధంగా వైవిద్యంగా ఉంటాయి. భారతీయత అనేక సంస్కృతుల సమ్మేళనంగా పిలువబడుతున్నది. భారత్ లో ఉన్న భారతీయ మతాలు, భారతీయ తత్వశాస్త్రం, భారతీయ వంటకాలు వంటి అనేక అంశాలు ప్రపంచవ్యాప్తంగా బలీయమైన ప్రభావం కలిగి ఉన్నాయి.

భారత దేశం ఎంతో ఘనతా వైశిష్టం గల దేశం. (బ్రహ్మ, విష్ణు, శివుడు) త్రిమూర్తులకు ఉగ్గు పెట్టావు. బ్రహ్మ అంతటి వాడిని వణికింపజాలిన మునులను భరించినావు. దేశంలో మునులు ఋషులు, తపస్సులు, కళాకారులు, కవుల ప్రతిభ నుంచి ఈ దేశాన్నిజాషువా వివరిస్తూ…

“ఉర్వి పుట్టకముందే నీవుంటే వేమొ; సకల శాస్త్ర పురాణముల్చదివినావు

గొన బుసిరిగల భాగ్యశాలి నిధి నీవు, భారతంభ మణీ! నమస్కార మమ్మ!

ఇట్టి నిను జూచి బిచ్చంబు మనుచు, నన్ని దిక్కులు యాచించు నవ్వమ్మ!

యైకమత్యంబం గలిగి నిన్న భవించు, కొరతపూరింపవే మాకు భరత మాత” అని ఈ ప్రపంచం పుట్టకముందే నీవు సకల పురాణాలు చదివావు. గొనబుసిరి గల సిరిసంపదలు గల భాగ్యశాలివి నీవు. ఓ భారతమాత నీకు నమస్కారమమ్మ అని ప్రణుతించినాడు.

చరిత్ర: నిన్నటి గత వైభవోపేతమైన వర్తమాన వ్యవహారాలు, గొప్పతనాన్ని అభివ్యక్తి చేస్తాడు.

హరిశ్చంద్రో నలో రాజ,పురుకుత్స:పురూరవా:I / సగర: కార్త వీర్యశ్చ,షడేతే………… చక్రవర్తిన:II అనే శ్లోకంలోని అంతరార్థాన్ని జాషువా ఒకే పద్యంలో గొప్పగా చెప్పిన విధం చూడండి.

“సగర మాంధాత్రాది షట్చక్రవర్తుల / అంక సీమలనిలిపినట్టి సాధ్వి ….

సింధు గంగానదీ జల క్షీరమెప్పుడు / గురిని బిడ్డల పోషించుకొనుచున్న

పచ్చి బాలెంతరాలు మా భరతమాత / మాతలకు మాత సకలసంపత్సమేత.” అని షట్చ చక్రవర్తుల గొప్పతనము, కాళిదాసాది సత్కవి కుమారులతో కీర్తి పొందింది. బుద్ధాది మునుల తపంతో అనేక కన్నీళ్ళకు కారణాలు కనుగొన్నాయి. జీవనదుల వల్ల ఈ దేశ పిల్లల్నీ నిత్యం సాదుతున్న పచ్చి బాలింతరాలు అని వ్యక్తీకరిస్తాడు. నిజమే కదా!

భారతీయతను తన అనేక పద్యాలలో వివరించాడు.

శిల్పకళా వైభవం:

కళలతో తులతూగుతున్న శిల్ప సంపద గల దేశం భారత దేశం. శిల్పానికి మొక్కుతున్న సమాజం శిల్పిని, శిల్పి జీవన స్థితిగతులను మరిచిపోయిన విషయాని గురుతు చేస్తాడు. స్ఫురణకురాని అంశాలను వెతికి తీయడమే జాషువా ముఖ్య ధ్యేయం. శిల్పిని స్తుతిస్తాడు.

‘సున్నితమైన నీ చేతి సుత్తె నుండి

బయలుపడె ఎన్ని ఎన్ని దేవస్థలములు

సార్థకము గాని ఎన్ని పాషాణములకు

గలిగే నేనీనాడు పసుపు కుంకుముల పూజ’ అని శిల్పి గురించి చెబుతాడు. ఓ శిల్పి సున్నితమైన నీ చేతిలో ఉండే సుత్తి నుండి ఎన్నో గొప్ప గొప్ప శిల్పాలు బయటపడ్డాయి. ఏమిటికీ పనికిరాని రాళ్ళకు పసుపు కుంకుమల పూజ కొనసాగుతున్నది. ఇదంతా శిల్పి నైపుణ్యం వల్లనే.

కవి కలంబునగల అలంకార రచన

కలదు కలదోయి శిల్పి నీ యులి ముఖమున

గాకపోయినా పెను రాతి కంబములకు / కుసుమవల్లరులేతిగా గుచ్చినావు’ అని కవికీ శిల్పికీ ఎలాంటి తేడా లేదని చెబుతూ కుసుమవల్లరులేరీతిగా గుచ్చుతావు? అని ప్రశ్నిస్తాడు. కవనమున చిత్రములు కూర్చు కవికి నీకు తారతమ్యం లేదు అబద్ధం కాదు అని చక్కగా చెబుతాడు.

“జగంబులోన చిర జీవిత్వంబు సృష్టించుకో / గల నీకెవ్వరు సాటి వచ్చును నమస్కారంబు నీ ప్రజ్ఞకున్” అని సంస్కారంతో శిల్పికి వారెకాక మనతో నమస్కార హృదయం కలుగజేస్తాడు. గురువు దైవము ఇద్దరూ ఒకేసారి ప్రత్యక్షమైతే నేను గురువుకు దండం పెడతా అని అన్న కవి కబిర్ మాటలు ఇక్కడ సంఘసంస్కరణ సాహిత్య దృష్టితో చూస్తే దేవుని పరిచయం చేసిన శిల్పికే మొక్కుతానంటాడు జాషువా.

గబ్బిలం కావ్యంలో గబ్బిలానికి తోవ చెప్పుతూ ఈ దేశంలోని ప్రతి స్థలంలోని గొప్ప తనాన్ని రంగరిస్తాడు. చారిత్రక గత వైభవ విశేషాలను దృశ్యీకరణ చేసి పాఠకుల మదిలో సింగారిస్తాడు. మందిరాలను, శిల్పకళా నైపుణ్యాలను, పేరు ప్రఖ్యాతులను ఆవిష్కరిస్తాడు.

సాహిత్య వైభవం: సాహిత్యం సాంఘిక, సమకాలీన అంశాలను దర్పణం పడుతుంది. భారతీయ సాహిత్యం, వివిధ భాషల సాహిత్యం, తెలుగు కవులు సాహిత్య పోషకులను కొనియాడినాడు జాషువ. సంస్కృత సాహిత్య విశేషాలను ఉగ్గడిస్తాడు. అక్షరాలతో దేదీప్యమానం చేస్తాడు.

“కాళిదాసాది సత్కవి కుమారుల గాంచి / కీర్తి నందిన పెద్ద గేస్తురాలు” అని కాళిదాసు, దండి, భావభూతి మొదలైన వాళ్ళను, వారు సృజించిన సాహితి సేవను కొనియాడుతాడు.

తెలుగు సాహిత్య పోషకుడు శ్రీకృష్ణ దేవరాయలను ‘అష్ట దిగ్గజనాగామృతార్ద్ర మగుచు / పావనంబైన నీ సభా భవన విభవ’ అని ఎంతగానో కీర్తిస్తాడు. అంతంటితో ఆగకుండా నీవు (శ్రీ కృష్ణ దేవరాయలు) ఉన్నప్పుడు నేనుండకపోతినని విలపిస్తూ “నేనుద్భవించితి / నీవు కల్గునాడు నేను లేను / నాల్గు వందలెండ్లు నాకు నీ కేడమయ్యే / నేనెట్లు జూతు నిన్ని కృష్ణరాయ” అని బాధపడుతాడు.

తెలుగు ఆదికవి నన్నయ్య, తిక్కన్న, శ్రీనాథుడు, వేమనలాంటి కవుల సాహిత్య వైభవాన్ని కొనియాడుతాడు.

పండుగల గురించి: తెలుగు వారు పండుగలు, వ్రతాలు, నోములు, పూజలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారు. ఆ పండుగల గురించి వివరిస్తాడు.

ఉగస్య ఆది అనేదే ఉగాది. “ఉగ” అనగా నక్షత్ర గమనం – జన్మ – ఆయుష్షు అని అర్థాలు. వీటికి ‘ఆది’ అనగా మొదలు ‘ఉగాది’. అనగా ప్రపంచం జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయింది. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది. పండుగలు ఆయా ప్రాంతాల్లోని ఆయా సమూహాల ఆచార వ్యవహారాలను ప్రతిబింబిస్తాయి. తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాదిగా పిలవబడుతుంది. ఈ ఉగాదికి ఒక్కో సంవత్సరం ఒక్కో పేరు ఉంటుంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకడం ఉగాది యొక్క ప్రధాన ఉద్దేశం ప్రతి నూతన సంవత్సరంలో సుఖసంతోషాలు ఇవ్వాలని ప్రతి కవి కోరుకుంటాడు.

“దరియున్ దాపు లేని కాళ్ల మన్వంతర్వత్ని నీళ్ళాడగా

ఖర సంవత్సర బాలకుండిపుడు సాక్షాత్కారమున్ చెంది,…. నూత్న క్షమాజానికిన్” అని పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన ఖర సంవత్సరాన్ని జాషువా ఆహ్వానిస్తాడు.

సంక్రాంతి అనగా నూతన క్రాంతి . సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు. అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. ఈ పండుగను పెద్ద పండుగగా ఆంధ్రులు జరుపుకుంటారు. సంక్రాంతిని మూడు రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ. కొన్ని ప్రాంతాలలో నాలగవ రోజు ముక్కనుమగా జరుపుకుంటారు. ఈ మూడు రోజులలో మొదటి రోజు బోగిమంటలతో, రెండవ రోజు పొంగలి, పిండివంటలతో, పితృ దేవతల, దేవుళ్ళ పూజలతో, మూడవ రోజు గో పూజలతో అలాగే మాంసప్రియులకు మంచి కూరలతో, మూడురోజుల పండుగ ఎంతో ఆనందంగా కొనసాగుతుంది.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మరొక ఒక ప్రముఖమైన పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతి ముందే వ్యవసాయదారుల పంటలు ఇంటికి వస్తాయి. ఈ సంక్రాంతి లో పిండి వంటలు రంగవల్లులు గంగిరెద్దులాటలు. కోడి పందాలు. రకరకాలైన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. సంక్రాంతి గురించి జాషువా ఒక పద్యం తో

“ఒడలన్, జెమ్మటలూర కర్షక జన వ్యూహంబు రేయింబవల్

పుడమిని దున్నిన దీర్ఘ కష్ట ఫలితం బున్ ధాన్య రూపంబు తో

నిడి విశ్రాంతి యొసంగ పండగవు, దేవీ! నీవు ఆనందపుం

కడలి నేల సమస్త లోకమును సంక్రాంతీ నమోవాకముల్.” అని రైతులు గురించి కర్షక రైతుల చెమటలు వారు పంట పండించడం కోసం వేసుకున్న వ్యూహాలు దీర్ఘకాలికంగా వారింటికి ధాన్య రూపంతో రాగానే జరుపుకునే పండుగవు. సమస్త లోకమునకు, సర్వ జనావళికి ఈ పండుగతో సంతోష కడలి అయింది. సంక్రాంతి నీకు నమస్కారాలు తెలుపుతాడు.

ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు పరువు నిష్టగా ధ్యానించే అంశం సిలువ వేత. అందరి పాపాల నిమిత్తం ఏసు క్రీస్తుప్రభువును, వారు మరణించిన విషయాన్ని ప్రస్తావిస్తూ తన ‘సిలువ వేత’ ఖండకావ్యంలో

“కర చరణాంగకములలో

నరములు నెమ్ములు చిదికి నవ నాడులలో

మెరుపులు మెరియ బిగించిరి

మర మమేకులతో శిలువ మాను క్రీస్తున్.” అని క్రీస్తు పొందిన బాధలను మర మేకులతో అరచేతుల్లో అరికాళ్ళలో మేకులు కొట్టి నప్పుడు నవనాడుల బాధను అనుభవించాడు అని చెప్తుందా పద్యం. వీరి క్రీస్తు చరిత్ర కావ్యం కు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు అందుకున్న రచన.

జాషువాగారు ఒక కంట కన్నీళ్ళని, మరో కంట కారుచీకట్లను ఏక కాలంలో కాంచుతాడు. ఈ రెండు వైరుధ్యాలు ఒకే పద్యంలో వ్యక్తీకరించే నేర్పు జాషువా సొంతం. ‘గబ్బిలం’ కావ్యంలో పండుగల గురించి వివరిస్తూ

“ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయించును గాని “ అనే ఒక్క మాటతో ఈ దేశం దేవుళ్ళ పెళ్లిళ్లకు లక్షలు, కోట్లు వెచ్చిస్తారు. పక్కనే ఆకలి బాధితున్ని ఏమాత్రం కనికరించరనే విషయాన్ని కళ్ళకు కడుతాడు.

గోపూజ: భారతీయ సంస్కృతిలో గోవును గోమాతగా పూజిస్తారు. అలాంటి గోమాత మీద తన పద్యం వింటుంటే అనంతమాత్యుని పద్యాలు గుర్తుకు రాకమానవు. నన్ను అర్థం చేసుకోవడానికి నా కన్నీటి సమన్వయం సేయ అర్థ్ర హృదయంబు కొంతవసరము అని చెప్పుకున్నట్లు గోమాతతో తదాత్మయం చెందుతాడు.

“అనుగు లేదూడ యంభారావమాలించి పొడుగునా దుగ్ధంబు పొంగిపోవ…

అర్రు నాకేడు నిను గాంచి యాగ్రహించి, బడియ చేబూని దండించు స్వామి నరసి

కలత చెందక అవ్వలకు బోవు, నీదు సహనంబు నా గుండె నీరు సేయు” తన బిడ్డ (దూడ)కు పాలిస్తున్నపుడు పాలు ఇస్తూ యజమాని దండిస్తుంటే తొణకకుండా ఆవలికి పోతుంటావు. నీ సహనం చూస్తే నా గుండె తరుక్కు పోతుండని బాధపడుతాడు.

“పెరుగున్ ఫలించు నిరతమున్ విశ్వంబు పోషించు, ని

న్న రవం కుత్తుకకోయు దాయలకు ద్రవ్యాశన్ సమర్పించు ము

ష్కరులన్ కొమ్ముల చిమ్మ వేటికిన్, స్వచ్ఛంబైన నీ వెన్న తో

విరచింపబడినేమో నీ మనసు దేవీ, ఆవు ముత్తైదువా”

ఓం ఆవు ముత్తయిదువా! పెరుగు పాలతో నిత్యము ఫలించే నీవు ఈ విశ్వాన్ని పోషించు చున్నావు నీ గొంతు కోయాలనేవారికి అమ్మేవారిని కొమ్ములతో ఎందుకు పొడవవు? నీ మనసు స్వచ్ఛమైన వెన్నతో తయారు చేసింది కాబట్టే నీవు దేవతవు.

మేఘుడు, ధూర్యోధనుడు, కృష్ణుని వర్ణన, మొదలైన పురాణ పాత్రల్ని, బుద్ధుడు మొదలైన పాత్రలు అద్భుతంగా వర్ణిస్తాడు. స్త్రీల గుర్రించి, ప్రకృతిని కడు రమ్యంగా ఆవిష్కరిస్తాడు. శిశువు పద్యాలు నెమరువేయని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. కాదేదీ కవితకనర్హం అన్నట్లు శ్మశాన పద్యాలు వింటే ఇహలోక సౌభాగ్యల మీద వైరాగ్యం పుట్టకమానదు. ఆగర్భ ధనవంతుడు, ఆగర్భ శ్రీమంతుడు కలుసుకునే శ్మశానన్ని భస్మ సింహాసనం అని సంబోధిస్తాడు.

దేశ భక్తి:

జాషువాకు దేశమన్నా, దేశభక్తి అన్న వల్లమాలిన ప్రేమ. వారు ఆనాటి రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులను ఆకళింపు చేసుకొని తన పద్యాలు ఆనాటి సమాజాన్ని ప్రతిబింబిస్తాయి. స్వాతంత్ర ఉద్యమ నేపథ్యంగా ఎన్నో కావ్యాలు వచ్చాయి. జాషువాది విభిన్నమైన శైలి. స్వాతంత్ర ఉద్యమాన్ని వధువుగా ఈ దేశ ప్రజలందరూ వరులుగా భావించి రాసిన కావ్యం స్వయంవరం. స్వాతంత్రం అనే వధువు వస్తున్న విషయాన్ని వివరిస్తూ

“మతములున్, వర్ణములున్, ధన వ్వ్యసనములున్మ మాద్యద్దురాచారముల్

సతులై, పేదలా చరించుటకు ముస్తాబై సువర్ణంపుట /క్షతలం గుప్పిట పట్టి రానరసి అక్కన్యావతం సంబస

మ్మతి చూపించే…” అని స్వయంవరం గురించి వివరిస్తాడు.

శాంతి సత్యం అహింసా పద్ధతుల్లో స్వాతంత్రం సాధించిన ప్రపంచంలో ఏకైక దేశం భారతదేశం. భారత స్వాతంత్ర సమరోత్సాహాన్ని పొగడిన విధానాన్ని చూస్తే అబ్బురమనిపించక మానదు.

“సేతు శీతాద్రి వరకు భాసించి ఆంగ్ల గజము నెదురించి తొడగొట్టు గడియెలవ్వి” అని ఆ కాలాన్ని తన పద్యాల్లో స్వాతంత్ర్యోద్యమము ఖండకావ్యం లో నిక్షిప్తం చేస్తాడు.

ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలు పణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు త్యాగ నిరతిని కొనియాడుతూ రాసిన ఖండకావ్యం ‘రాష్ట్ర పూజ’.

“పొలయున్నెత్తురు యాబదెన్మది దినంబుల్ క్షుత్పిపాసాగ్నిలో

బలి కావించిన పొట్టి రాముల అనల్పత్యాగ మమ్మూడు కొం

…దిగ్విజయ ఘంటారావం చేయుచున్న తెలుగు రాష్ట్ర మరుదెంచన్ నేడు పుట్టింటికిన్” అని

పొట్టి శ్రీరాములు గారి 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేయడం వల్ల దిగ్విజయ్ వచ్చింది తెలుగు రాష్ట్రము పుట్టింటికి వచ్చినట్లుగా వచ్చింది అని వ్యక్తీకరిస్తారు. ‘తెలుగుతల్లి’ ఖండ కావ్యం ద్వారా ప్రాశస్త్యాన్ని తెలుపుతాడు.

చైనా – భారత యుద్ధం జరిగినప్పుడు తన పద్యాల ద్వారా ఆనాటి మానసిక ఉత్పరివర్తనాలు అభివ్యక్తి గావించాడు. “చైనీయ రుధిరనిర్ఝరుల స్నానము చేసి భారత సైంకాకోటి మరలు దాక” ఊరుకోదని చెబుతాడు.

అటల్ బిహారీ వాజపేయిగారు ఇందిరాగాంధీని కొనియాడిన విషయం స్పురించేలా “మంచుమల మీద దృష్టి కెత్తించుదాకా / నిద్రవోవదు భారత కాళి” అని పేర్కొంటాడు.

గాంధీ, నేతాజీ, సర్ధారు పటేల్, అంబేడ్కర్ మొదలైన వారి కీర్తిని అద్భుతమైన పద్యాలతో అలంకరించాడు. దేశభక్తిని అత్యన్నతిగా ప్రశంసిస్తాడు.

పరహిత సహనం: ఈ దేశంలో అసహనం పెరుగుతున్న కాలానికి పోంచి పెట్టుకున్న తీరున అగుపించక మానదు. అంటరానితనం నిరసిస్తూ పల్నాటి గాథలని వివరిస్తాడు.

“అంటరానితనంపు తడసులో దిగబడ్డ కడజాతులకు ముక్తికలుగజేసి

ప్రజా రక్తం డ్రావు రానాపిశాచ్మ్బుల దశదీశాంతములకు తరిమివేసి …..

పావనంబగు మానవత్వము సృజించి ధర్మమమును ప్రతిషించు నూద్యమము నాది” అని బ్రహ్మనాయుడి అంతరంగావిష్కరణ గావిస్తాడు.

జోల పాటలు: చిన్న పిల్లలను నిద్ర పుచ్చడానికి తల్లులు పాడే పాటలే జోలపాటలు. జనపదబాణీలోనూ ఉంటాయి.. శివాజీ వీరుడవ్వడానికి తల్లి ఉగ్గుపాలతో నేర్పిన వీరగాథలే పురికొల్పాయి. జాషువాగారు రాసిన జోలపాటలో ఆంధ్ర సాంస్కృతిక వైభవం కళ్ళకుకడుతాడు. తల్లుల నోట పాడే పాటలో గత ప్రాశస్త్యాన్ని వివరిస్తాడు.

“చిచ్చో హాయీ, ఏడువకు నాయన్న!-ఏడువకు తండ్రి!,

ఏడిస్తే నీ కండ్లు – ఎరుపెక్కుతాయి, ఎరుపుజూచి తల్లి – కరిగిపోతాది

ఖడ్గ తిక్కన పంచ – కళ్యాణి హాయము , సకిలించి నాయన్న – సరస నిల్చింది అని రెడ్డి రాజులు, ఆంధ్ర పౌరుష శక్తి, ఓరుగంటి, కొండవీటి రెడ్లు, కృష్ణరాయని, అభిమన్యుని, భీమసేనుని, …. పరాక్రమ శక్తుల్ని వివరిస్తాడు.

లుప్తమవుతున్న సంస్కృతి: పైన పటారం. లోన లొటారమన్నట్లుగా ఉన్న సంస్కృతిని చూసి బాధపడుతాడు. ఆధునికతలవల్ల ధ్వంసమవుతున్న నాగరికతను చూసి జాలిపడుతాడు. కవిగా మేల్కొని అందులోంచి మనల్ని మేలుకొల్పుతాడు.

మనుషులకు కట్టుబాట్లు లేవు, ఆచారములు లేవు. సంప్రదాయములు లేవు. ఆధునిక నాగరికతను వివరిస్తున్నారు.

“కట్టుబాటులేక, కార్యక్రమామూలేక/ కష్టములకు లాభనష్టములకు

తెలివిసుమ్టలేక తలవ్రాత కేడ్చుట / నగ్నమైన నేటి నాగరకత” అని కట్టుబాట్లు లేకపోవడమే పతనానికి కారణమవుతున్న సంస్కృతిని నూతన నాగరికత అని పిలువడం ఎంతవరకు సమంజసం అని ఎత్తిపొడుస్తాడు. .

“హృదయానలేని లాహిరీ భక్తిభావంబు నటియించి యభివాగ్దానంబు లిడుట

తనవారు కాకపోయిన్ మహేంద్రుడకాని పొరపొచ్చేముల నాడిపోసికొనుట

అవసరంబుయాల్ పట్టులమ్ దిండ్ల కెత్తెంచి పొందులు గావించి పూసుకొనుట

శపథాలు పదివేలు సలిపి యాసలు గోలిపి వీగించి మొగము దప్పించుకొనుట”

శపథాలు పదివేలు సలిపి యాసలు గోలిపి విసిగించి మొగము దప్పించుకొనుట, ముక్కు మొకం తెలియాకున్న మహేంద్రుడని పొగడుట. భక్తి భావం లేకున్నా నమస్కారం చేయడం, పొరపొచ్చములు ఆడిపోసుకొనుట, అవసారానుసారం హామీలు ఎన్నో ఇచ్చి మొకం దాసుకొనుట మొదలైనవి నేడు ఎన్నో చేస్తున్నారు.

భారతీయ సంస్కృతి తన పద్య కావ్యం, ఖండ కావ్యం, నాటకాలు, సినీ గీతాలలో నభూతో నభవిష్యతి అన్నట్లు చిత్రించి తెలుగు సాహిత్యంలోనే గాకుండా విశ్వ నరుడుగా ఆలోచించి, విశ్వకవిగా లిఖించాడు. విశ్వ విఖ్యాత సాహిత్యాన్ని సృజించినాడు. నాలుగు కాలాలు నిలిచే సాహిత్యాన్ని సృజించి తెలుగు పాఠకుల హృదాయాల్లో సుకవి జీవించే ప్రజల నాలుకలపై అన్నట్లు తాను జీవిస్తూనే ఉంటాడు. భారతీయ సాంస్కృతిక వైభవాన్ని, వారి పద్య మాధుర్యాన్ని ఆస్వాదించాడానికి ఒంటపట్టించుకోవాలి. జాషువా శ్రేష్టతని ఆవాహన చేసుకోవాలి. ఆచరించాలి. ఆ సాహిత్యాన్ని పాఠాలుగా విద్యార్థులకు అందుబాటులో ఉంచాలి. వారి ఆశయ సాధనలో మనమూ విశ్వ నరులమవ్వాలి. విశ్వ మానవ విపంచులమై వెలుగొందాలి. మనమిచ్చే అసలైన నివాళి అదే.

డా. సిద్దెంకి యాదగిరి

9441244773

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com