వెళ్ళిపోయి తిరిగివచ్చిన ఒక సిపాయి ప్రేమకథ..

రామలింగం ఆ సాయంత్రం వేళ రైలు దిగి ఊళ్ళోకి వచ్చేసరికి ఊరు వూరంతా ఎవరీ మనిషి అన్నట్టు బిత్తరపోయి చూచింది. అరుగుల మీద కూర్చున్నవాళ్ళు కంచెల చాటున నిల్చున్నవాళ్ళు, వాకిళ్ళముందు పనిపాటలు చూచుకుంటున్న వాళ్ళు అంతా ఆ కొత్త మనిషిని ఆశ్చర్యంగా చూస్తున్నారు. బజార్లలో ఆడుకుంటూవున్న పిల్లలు గుంపుగా వాడి వెంటబడి ఎవరీ బూచాడని చోద్యంగా చూస్తున్నారు. వాడు నేరుగా ముందుకుపోయి ‘అమ్మా’ అని పిలిచాడు.

లోపల బట్టల మడతలు సర్దుతూవున్న వెంకామ బైటికొచ్చి “ఎవరునువ్వు” అంటూ రాముణ్ణి నిలువెల్లా చూచింది. “నేనమ్మా” అన్నాడు రాముడు తల్లి మొహంలోకి చూస్తూ,

“ఆం! నువ్వురా రాముడూ” అంటూ ఆ తల్లి కొడుకును అమాంతం కావలించుకొని వొళ్ళంతా పట్టి చూస్తూ “ఇన్నాళ్ళకు నేను గ్యాపకమొచ్చానురా” అంది చీరె చెరగుతో కళ్ళు తుడుచుకుంటూ.

“సెలవు పెట్టి వొచ్చానే” అన్నాడు రాముడు. “నాతండ్రే. నాలుగేళ్ళనుంచీ నీ కోసం చూచి కళ్ళు కాయలు గాశాయి. రా లోపలికి” అంటూ ఇంట్లోకి దారితీసింది.

రాముడు తనవెంట వొచ్చిన కూలీ అబ్బికి డబ్బులిచ్చి పంపేసి లోపలికి వెళ్ళాడు. తల్లి వాడికి దాహానికి మంచి నీళ్ళిచ్చి గుమ్మం ముందున్న కంచె దగ్గరికెళ్ళి సంతోషం పట్టలేక ఎల్లినీ, మల్లినీ కేకేసి “

రాముడొచ్చాడు రాండే” అంది. ఎల్లీ, మల్లీ ఆదరా బాదరావచ్చి రాముణ్ణి ఆపాదమస్తకంగా పరిశీలనగా చూచి బుగ్గలు నొక్కుకుంటూ “ఓశక్కా, ఇంతోడు ఎంతోడైనాడో! గుర్తుపట్టకుండా పోయ్యాడు. ఎంకామ్, ఇంకనేకేమే.. దొంగన్న కొడుకు దొరలా వొచ్చాడు” అన్నారు.

వెంకామ నిలువెల్లా సంతోషంతో ఉప్పొంగి పోయింది. ఎల్లీ, మలీ అన్నమాట నిజమే అనిపిస్తూవుంది. రాముడు ఆ వూళ్ళో వున్నంతవరకూ ఎలా వుండేవాడు! ఇప్పుడెలా ఉన్నాడు!! ఆ మాతృమూర్తి కొడుకును చూస్తూ నాలుగేళ్ళు వెనక్కి చూచింది.

రాముడు చిన్నప్పటి నుంచీ ఉత్త గుండగొయ్య. బక్లో వేస్తే చదువబ్బలేదు. రాలుగాయలా డొంకలంటా, చొప్పవాములంటా తిరిగేవాడు. తోటలో కాయా గడుసూ దక్కనిచ్చేవాడు కాదు. కుక్క నొకదాన్ని వెంటబెట్టుకుని ఊరునానుకొని పారే యేరుదాటి మామిడి తోపులో కి వెళ్ళి పగలంతా ఆ చెట్ల క్రింద తిరిగేవాడు. వానాకాలం వచ్చిందంటే బుర్ర ఒకటేసుకొని ఏట్లో ఈదుతూ వరదకు కొట్టుకొచ్చే కర్రల్నీ, కొయ్యల్ని పట్టుకొని ఒడ్డుకేసి కోమటి వైకుంఠానికి అప్పగించి సెనగపప్పు,బీడీలు తీసుకొనేవాడు. వూర చెరువు కెళ్ళి గాలంతో చేపలుపడుతూ అక్కడే నిద్రపొయ్యేవాడు. చింతలతోపులో డబ్బులు పెట్టి గోళీకాయలాట ఆడేవాడు. దాని మూలకంగా ఇంటిమీదికి రోజుకొక తగవు. ఎవరినో కొట్టేవాడు. ఎవరితోనో తన్నులు తినేవాడు. ఇంటికొచ్చి కుక్కపడుకున్న మూల స్పృహలేకుండా పడుకొని వుండేవాడు. కులవృతి చేయరా అంటే “చెహే వుండండి” అని కసురుకునేవాడు. అన్నలు వాడిమీద ఆశ ఎప్పుడో వదులుకున్నారు. పద్దెనిమిదేళ్ళాచ్చాయి. పెళ్ళిన్నాచేస్తే బాగుపడతాడేమోనని కొందరన్నారు. సరేనని తల్లి తండ్రి “పిల్లనియ్యవే” అని మల్లిని దేహి అని అడిగారు. మల్లి ఉగ్రురాలై” గుండకొయ్యకా నా పిల్ల. మళ్ళీ ఆ మాటెత్తారంటే బుద్ది చెప్తా” అంటూ “దమ్మిడి చెయ్యని యదవ. వాడికొకడికి గతిలేదు. నా పిల్లకేం పెడతాడు” అని వాడి అప్రయోజకత్వాన్నంతా ఏకరు పెట్టి అంతటితో ఊరుకోక “రాగెంటుకల యదవ. రొయ్యలకుమల్లె ఆడి కనురెప్పలు, వాళ్ళంతా బొచ్చు. ఈడికా నా పిల్ల, దాని కుదురుమట్టానికి వయసొస్తే దొరలొచ్చి పడిగాపులు గాస్తారు” అని ఈసడించి కొట్టింది. ఇలాంటి రాముణ్ణి ఏంచెయ్యాల్లో తల్లిదండ్రులకు తోచలేదు. వాణ్ణి అలా వదిలేసి వూరుకున్నారు. వాడు కూడా తానా వూళ్ళోవుండి చేసేదేమిలేదని గ్రహించాడో యేమో ఒకరోజు ఎవరికీ చెప్పకుండా అయిపులేకుండా పొయ్యాడు. ఆ పోయినపోవడం ఇవాళ యిట్లా తేలాడు.

మరి ఈ రాముడెక్కడ! ఖాకీనిక్కరు, మేజోళ్ళు, బూట్లు, పైగా పెద్ద లట్టూబట్టూ వేసుకొచ్చాడు. వాడు తెచ్చిన సామాను మోయడానికి కూలీ కావలసివొచ్చాడు. జేబులో పెన్ను, పెన్సిలు – మనిషే మారాడు చదువు నేర్చుకున్నాడు. సైన్యంలో ఎన్నోపనులు నేర్చుకున్నాడు. ఎన్నో సంగతులు తెలుసుకున్నాడు. చూపు మారింది. మాట్లాడేతీరు మారింది. వాడి తరహాయే కొత్తగా వుంది.

ఇలాంటి రాముణ్ణి చూడడానికి ఊరువూరంతా చాకలిగూడెంవైపు వచ్చింది. ఈ పల్లెల్లో ఇంతే. వూరు విడిచిపోయిన మనిషి మళ్ళీ వొచ్చాడంటే గూటికి చేరుకున్న పిట్ట అన్నట్టు, మందకు చేరుకున్న గొర్రెన్నట్టు విరగబడి చిత్రంగా చూస్తారు. పెద్దకాపు మల్లారెడ్డి వచ్చి “శబాష్ రాముడూ ఇప్పుడు | నువ్వు వస్తాదువయ్యావురా” అని మెచ్చుకున్నాడు. తెలగ రామన్న “ఎవడి అదృష్టం వాడిది’ అని తత్వం పలికాడు. వడ్ల బ్రహ్మయ్య పక్కనేవున్న శేషగాళ్లి చేచి “ఓరేయ్ మీరంతా వాడిముందు బలాదూరురా” ఎత్తిపొడిచాడు. ఇంకా కమ్మరి నరసయ్య, కుమ్మరి గోవిందు మాల పెరుమాళ్ళు, మాదిగెంకడు, ఎరికెల పేరిగాడు అంతా ఎవరికి తోచినట్టు వారు రాముణ్ణి పొగడుతూవుంటే వెనకాల నిల్చొనివున్న కోమటి వైకుంఠం పక్కనున్న పోలయ్యతో “మొత్తానికి వూరిపేరు నిలబెట్టాడు పో” అన్నాడు.

వూళ్లో వుండగా రాముడి దినచర్య అంతా పకడ్బందీగా వుండేది. పొద్దున్నే లేచి వూర చెరువు దగరకెళ్ళి కవాతు చేసేవాడే, అక్కడే స్నానంచేసి ఇంటికొచ్చి ఇంత తిని కుటుంబం వాళ్ళతో కులాసాకబుర్లు చెప్పేవాడు. మధ్యాహ్నం దాటిన తరువాత తానే టీ కాచి అందరికీ యిచ్చేవాడు.

సాయంత్రం డ్రెస్సు వేసుకొని వూరిబైటికి షికారుకెళ్ళేవాడు. పొద్దుగూకి యింటికొచ్చి అందరితో పాటు ఇంత తిని నలుగురినీ ఇంటి ముందు చేర్చుకొని సైన్యం సంగతులు, తాను తిరిగినచోట్లు, కలిగిన అనుభవాలు అన్నీ చెబుతూవుంటే ఆ గూడెం వాళ్ళెగాక మెరక వీధివాళ్ళు కూడా చోద్యంగా వివేవాళ్ళు.

తన ఇంటికి ఇంతమంది వస్తున్నారుగాని మల్లి కూతురు సీత మాత్రం రావడం లేదు. వొచ్చిందగ్గర్నుంచీ వాళ్ళింటికెళ్ళి అదిప్పుడెట్లా ఉందో చూడాలనుకుంటాడు. కానీ, పడలేదు. అదే ఎదురు పడుతుందేమోనని చూచాడు. అది సామాన్యురాలా ” తన దగ్గరికె వొస్తాడు, ఎవరి కోసమొస్తాడు, నేను రాబట్టనా” అనుకొని బిగదీసుకు కూర్చుంది.

సరే దీని అంతేదో కనుక్కుందామని రాముడు ఒక రోజు పొద్దుగూకేవేళ గూడెం వెలుపలవున్న వాళ్ల నిట్టాడి దగ్గరి కెళ్ళాడు. ఇంటి చుట్టూ కంచె, కంచెలోపల శుభ్రమైన నేల. అందులో కూరగాయల పాదులు పూలచెట్లు వున్నాయి. వాటిని చూచి గుమ్మం తడికె దగ్గర క్షణం సేపాగి “సీత యిల్లంటే పర్ణశాలలా ఇట్టాగే వుండాలి” అనుకొని తల ఎగరేసి తడికెతీసి లోపలికెళ్ళి అత్తా అని పిలిచాడు.

మల్లి బైటికొచ్చి “నువ్వా రాముడూ, రా కూర్చో” అంటూ మంచం వాల్చింది.

“వుండత్తా, రాణిగారిని చూడాలి” అంటూ నిట్టాడి లోపలికి దారితీశాడు.

“అదింకా నీక గ్యాపకముందిరా” అంది రాముణ్ణి ఆశ్చర్యంగా చూస్తూ,

“అది గాకపోతే నువ్వా గ్యాపకముండేది!”

“పెంకితనం ఇంకా పోలేదు” అని లోపల అనుకుంటు మల్లి ముఖమంతా నవ్వుతో వీధిచివరలోవున్న తడికల కాఫీ హోటలు కెళ్ళింది.

రాముడు తలుపనెట్టి లోపలికెళ్ళాడు. సీత పొయ్యి దగ్గర మంచంచాటున నిల్చొని సిగ్గుతో నేలకేసి చూస్తూ కాలి బొటన వేలితో నేలమీద రాస్తూవుంది. రాముడు దానిని నఖశిఖ పర్యంతం చూచాడు. మనిషి గువ్వలా తేలింది. చన్నూ చంకా ఏర్పడ్డాయి. వయస్సొచ్చేసరికి వంకలన్నీ తీరతాయి. అన్నట్టు అది కట్టుకున్న బట్టలు కూడా అందంగా కనిపిస్తున్నాయి. చురుకైన చూపులు, వంపులు తిరిన బుజాలు గుండ్రంగా తేలిన మెడ,సోగకళ్ళు, సన్నటి ముక్కు చిన్న పెదిమలు, చెక్కిళ్ళ మీద చెంపరాల వల పడుతున్న జుట్టు. అసలే అందమైన పిల్లేమో, వ్యక్తురాలై సిగొచ్చెసరికి మరీ ఆకర్షవంతంగా వుంది. ఈ పిల్ల తనకోసమే వ్యక్తురాలైందనుకున్నారు. రాముడు ఆ అందాన్ని ఆలాగే చూస్తూ “ఏంపిల్లా ఏమంటావ్” అన్నాడు.

సీత దూరంగా వెళ్ళి “ఫో!కొంటోడా” అంది. రైట్ పిల్లా, నువ్వింకా నాదానివే. బలే, బలేగా వున్నావులే. రెడీగా వుండు, ఇద్దరం జంటవుదాం” అన్నాడు.

మల్లి ఒక చేతిలో పకోడీల పొట్లం, మరో చేతిలో టీగ్లాసు పట్టుకొని తడిక దగ్గరకొచ్చి “రాముడూ ఇవి తీసుకుందువు గాని రా” అంటూ ఆప్యాయంగా పిలిచింది.

రాముడు నిట్టాడిలోంచి బైటికొచ్చి మంచం మీద కూర్చున్నాడు. ఒక పకోడీ తీసుకొని మిగతావి మల్లికిచ్చి “ఇవి సీతకివ్వత్తా-నాకు టీ చాలులే” అన్నాడు. మల్లి అతనిలో కలిగిన మార్పును పరకాయించి చూస్తూ వుంది. రాముడా టీ గ్లాసు క్రింద పెడుతూ “అత్తా, మా సంగతేమంటావు” అని అడిగాడు. “మీ యిద్దరి ఇష్టమైతే నాదేముంది రాముడూ” అంది మల్లి.

“చూడు వొచ్చేది ఆగస్టు పదిహేను. అది మన ఇండియా వాళ్ళకి గొప్పరోజు. ఆ రోజు ఉదయం మా లగ్గం ఖాయం. నేనన్ని ఏర్పాట్లు చేస్తా అత్తా” అని లేస్తూ సీత కన్పిస్తుందేమోనని తలుపుకేసి చూచాడు. మనిషి కన్పించలేదు గాని తలుపుమాత్రం కదిలింది.

“మరి నే వొస్తానత్తా” అని బైలుదేరాడు రాముడు. “సర్లే, మా అమ్మతో మాట్లాడుతాలే అంది” మల్లి, రాముడు కంచె తడికదాక వొచ్చి వెనక్కి తిరిగి చూచాడు. పొరుగు నిట్టాడిలో నుంచి సీత చెల్లెళ్ళు గంతులేసుకుంటూ కంచెదాటి వచ్చి “గూట్లో రూపాయి, నీ మొగుడు సిపాయి” అని పాడుతూ పరుగుతీశారు.

భారతదేశీయులందరికీ స్వాతంత్ర్య దినమైన ఆగష్టు పదిహేను ఎప్పటిలాగే ఆ సంవత్సరం కూడా వచ్చింది. ఆ గ్రామస్తులు అంతకుముందు ఆ రోజు ప్రాముఖ్యాన్ని సరిగా ఎరుగరు. కాని ఈసంవత్సరం మాత్రం ఆగష్టు పదిహేనంటే యేమిటో వాళ్ళకు బాగా తెలిసింది.

తెల్లవారేసరికి సిపాయి రాముడు పెళ్ళికొడకై సీతతో పెళ్ళిపీటలమీద కూర్చున్నాడు. ఊరూవాడా అంతా పెళ్ళి చూడడానికి వచ్చారు. రాముడు ఠీవిగా కూర్చున్నాడు. సీత తలవంచుకొని ముసిముసిగా నవ్వుతూంది. చూచిన పెద్దలంతా ‘ఈడుజోడూ’ అని ఏకగ్రీవంగా అన్నారు. వెంకామ సంతోషంతో కళ్ళనీళ్లు తుడుచుకుంటూ వుంది. మల్లి కూతురిని పట్టుకొని వెనక కూర్చొని వుంది. సన్నాయి,యబు *మా రాముడు పెళ్ళికొడుకాయనే” అని హుషారుగా సన్నాయి పాడుతూవుంటే వూరి పెద్దలు అక్షంతలు చల్లి వధూవరులను ఆశీర్వదించి వెళ్ళారు. —

పెళ్ళితంతు ముగిసిన తరువాత ఎనిమిది గంటలకు వూళ్ళో రచ్చబండ దగ్గిర కట్టిన చావడి ముందు జెండా వందనం ఏర్పాటు చేశారు. బడిపిల్లలు కొత్త బట్టలు వేసుకొని బారుతీరి నిల్చొని వున్నారు.

గ్రామ పెద్ద యజ్ఞనారాయణ పంతులుగారు కరతాళధ్వనుల మధ్య హర్షధ్వానాలు చెలరేగుతూ వుండగా జెండా ఎగురవేశారు. సిపాయి దుస్తులతో, పక్కన పెళ్ళికూతురు సీతతో నిటారుగా తలయెత్తుకొని నిల్చున్న రాముడు సైనిక వందనం పద్ధతిలో బూటు టకామనికొట్టి హుందాగా జెండాకు సెల్యూట్ చేశాడు. అంతకుముందే అలా చెయ్యమని చెప్పి వుంచాడో యేమో సీత కూడా చక్కగా నిలబడి తలపై కెత్తి జెండాను సెల్యూట్ చేసింది.

జెండా వందనమైన తరువాత వడ్ల బ్రహ్మయ్య రాముడి దగ్గరిగా వొచ్చి “రాముడూ ఎందుకట్టా బూటు టకామని కొట్టి హుషారుగా విసురుగా సలాం చేశావు” అని అడిగాడు. సంగతేమిటో తెలుసుకోవాలన్న కుతూహలంతో

“ఇవాళ మన స్వాతంత్ర్య దినోత్సవం కదండీ. ఇది మన జాతీయజెండా. ప్రాణమైనా వదులుకుంటాముగాని ఈ జెండాకు అగౌరవం జరగనివ్వం అందుకని ఇటాగే సెల్యూట్ చేసి దేశ సేవకు ప్రతిజ్ఞ చేస్తాం” అన్నాడు. ఆ సమాధానానికి బ్రహ్మయ్య దిగాలుపడి చూస్తూ వాడికంత వ్యక్తిత్వం వచ్చినందుకు లోలోపల వాణ్ణి మెచ్చుకున్నాడు. అంతా ఇళ్ళకెళ్ళుతున్నారు.

ఎల్లవచ్చి మల్లితో “ఓయబ్బో రాముడెంత పౌరుషం కలోడయ్యాడో చూశావే. ఎట్టా సలాంకొట్టాడు” అని బుగ్గనొక్కుకుంది. “పౌరుషం కలోడేకాదు పెయోజకమంతుడు కూడా అయ్యాడు” అంది మల్లి సగర్వంగా “మరి అందుకేగా కూతరునిచ్చి చేశావ్” అంది యెల్లి.

రాముడి పక్కనే వున్నసీతకు ఆ మాటలు వినిపించి ముసిముసిగా నవ్వుకుంటూ భర్త ననుసరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com