-డా. బూర్ల చంద్రశేఖర్,

చారిత్రక పరిణామంలో శాసనాల ప్రాధాన్యం తెలిపే వ్యాసం..

I. పరిచయం

శాసనాలే చరిత్ర రచనకు ప్రధానమైన ఆకరాలు. శాసనాల్లో వారవారి భావాన్ని వ్యక్తపర్చే భాష ఉంటుంది. భాషలోనే లిపి, సాహిత్య, సంస్కృతి మొదలగు విషయాలన్ని ఉంటాయి. అలాంటి భాషను అధ్యయనం చేస్తే, ఆయా భాషీయుల జాతి, ప్రదేశం యొక్క సమగ్రమైన చరిత్ర మనకు తెలుస్తుంది. ప్రాచీన భాషాధ్యయనానికి సాహిత్య గ్రంథాలకన్నా ముఖ్యంగా శాసనాలు మనకు ఎక్కువ తోడ్పడతాయి. ఇంకా చెప్పాలంటే సాహిత్య గ్రంథాల పరిష్కారానికి కూడా శాసనాల అవసరం తో ఉంది. ఎన్నో ఏళ్ళ కిందటి భాష, లిపి యథాతథంగా మనకు శాసనాల ద్వారా కనబడుతుంది. పూర్వ కవులు, రచయితలు, లేఖకులు, రాజులు ఏదైతే చెప్పదల్చుకున్నారో వాటిని అదే రీతిగా తెలుసుకోగలుగుతాం. శాసనాలను పూర్వం శిలలపై, లోహపురేకులపై, (తామ్ర), క్యూనిఫామం (బంకమట్టిపై), చెక్కపలకలపై, జంతుచర్మాలపై, దంతాలపై, తాటి ఆకులపై, ఈత ఆకులపై, బూర్జాపత్రాలపై, వెదురుబొంగులపై, వస్త్రాలపై, ఎముకలపై, ఇటుకలపై, రాసేవారు. నేడు కాగితాలపై రాస్తున్నారు. శాసనాలు రాయడానికి ఉపయోగించే వస్తువులు ఎన్ని ఉన్నా ఎక్కువగా శిలాసనాన్నే శాసనం అని వాడతారు. తెలుగునాట ‘‘శిలాశాసనం’’ అనే జాతీయం ఇందుకే వచ్చుంటుంది. అయితే ఈ శాసనాల సేకరణ, అధ్యయనం కష్టమైన పనే కాని ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి.

ప్రాచీన వాఙ్మయ చరిత్ర నిర్మాణంలో శాసనాలు ఎంతగానో తోడ్పడతాయి. తెలుగులో శాసనాల సేకరణ, అధ్యయనం దాదాపు తగ్గుతుందనిపిస్తుంది. 2013 లో ఆచార్య వెలుదండ నిత్యానందారావు గారిచే సంకలనం చేయబడ్డ ‘‘విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన’’ గ్రంథంలో చూసినట్లైతే శాసనాలపై 22 పరిశోధనలు అందులో 3 ఎం.ఫిల్ న్నట్లు, 9 గ్రంథాలే ముద్రణాభాగ్యానికి నోచుకున్నట్లు తెలుస్తుంది. శాసనాలపై పూర్వపరిశోధకులంత కృషి చేయకున్నా కనీసం వారు సేకరించిన శాసనాలను పరిశీలించి, వ్యావహారిక భాషలోకి అనువదిస్తూ, టీకాతాత్పర్యసహిత అర్థవివరణలతో పరిష్కరించి ప్రచురణలు కూడా మనం చేయడంలేదనిపిస్తుంది. వారు ఎంతో కష్టపడి సేకరించిన ప్రతులు చీకటి గదుల్లో మూలుగుతున్నాయి. ‘ఒక్క మైసూర్ గ్రంథాలయంలో 1896 నుండి 2009 వరకు సేకరించిన శాసనాలు 18000 ఉన్నాయంటే పూర్వ పరిశోధకుల కృషి ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.’(కుర్రా జితేంద్రబాబు గారి ఉపన్యాసం) ఒక్క మైసూరుగ్రంథాలయంలోనే ఇన్ని ఉంటే తంజావూరు గ్రంథాలయం, హైదరాబాదు ప్రాచ్యలిఖిత భాండాగారం, రాజ్యాభిలేఖన గ్రంథాలయం, బ్రిటీష్ మ్యూజియంలాంటి వివిధ దేశ, విదేశ గ్రంథాలయాలు, మ్యూజియాలలో ప్రచురణకు నోచుకోక మూలనపడిన ఎన్ని ప్రాచీన తెలుగు లిఖిత వాఙ్మయ సమాచారంవున్న శాసనాలున్నాయో ఆనిపిస్తుంది. పూర్వపరిశోధకులు వాటిని వ్యక్తిగతంగా, సంస్థాగతంగా ఎంతో వ్యయప్రయాసలకోర్చి వెలికి తీసారు. ఇలా తీసినవి తెలంగాణాలో కూడా ఇంకా ఎన్నో వేల శాసనాలు ప్రచురణలోకి రాలేదని తెలుస్తుంది. వారు అందించిన ఆ అమూల్య సంపద ‘అంధేందూదయముల్ మూకబధిరశంఖారావము…’ లే అవుతున్నాయి. శాస్త్రసాంకేతిక రంగం అంతగా అభివృద్ధి చెందని ఆరోజుల్లోనే వారన్ని శాసనాలు సేకరిస్తే, సాంకేతికరంగం ఇంతగా అభివృద్ధి చెందిన నేడు మనమెంత చేయవచ్చో అనిపిస్తుంది. ఇప్పటికీ సాహిత్యంలో ఒక్కో రంగంలో నిష్ణాతులైన విద్వాంసులున్నారు. వారి సేవలుపయోగించుకొని ఒక్కో శాసన ప్రతిని అర్థవివరణలో నేటి, రాబోవు తరాలకు అందిస్తే బాగుంటుంది. దీనికొరకు తెలుగు భాషాభివృద్ధికై ఏర్పడిన సంస్థల, జ్ఞానకాసారాలైన విశ్వవిద్యాలయాల బాధ్యత ఎంతో ఉంది. ఔత్సాహికులైన పరిశోధకులకు శాసనాధ్యయనంపై శిక్షణాతరగతులనిచ్చి అంధకారంలో బంధీలైన శాసనాల ప్రతుల పుటలు విప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. శాసనాలను అధ్యయనం చేయకుండా మన చరిత్రను మనం లిఖించుకోలేము. సేకరణ, అధ్యయనం, ప్రచురణ జరిగితే తప్ప అది సాధ్యం కాదు. ‘‘ప్రచురణ భాగ్యం లేని పరిశోధన నిష్ప్రయోజనకరం’’ (ఆధారగ్రంథం.నెం.06. పు.14) అన్న మాట అక్షరసత్యం. నేను కూడా శాసనాలను అధ్యయనం చేయాలనే ఉత్సాహంతో ఈ శాసన ఆకరగ్రథాలను సమీక్షించదల్చాను.

II. తెలుగు శాసనాలపై జరిగిన కృషి

తెలుగు శాసనాలపై పూర్వపరిశోధకులు అవిరళమైన కృషి చేసారు. వారి గ్రంథాలను అధ్యయనం చేయడం వల్ల మనలో ఉత్సాహం రావడమే కాకుండా ఎన్నో వినూత్న విషయాలు కూడా తెలుసుకోగలుగుతాము. శాసనాధ్యయనాలపై వచ్చిన గ్రంథాలు, వ్యాసాలు ఎన్నో ఉన్నాయి. అందులో నాకు దొరికిన కొన్ని గ్రంథాలను ఇక్కడ స్థాలీపూలకన్యాయంగా పరిచయం చేస్తాను.

1. తెలంగానా శాసనములు – మొదటి సంపుటము

గ్రంథనామంలో తెలంగాణ పదం యొక్క వికృతి రూపమైన తెలంగానా శబ్దాన్నే ప్రత్యేకత కోసం వినియోగించినట్లు ఈ గ్రంథం పీఠికలో ఉంది. హైదరాబాద్ లోని ‘‘లక్ష్మణరాయ పరిశోధక మండలి’’ వారు ఈ గ్రంథాన్ని 1935లో ముద్రించారు. ప్రస్తావనా రచయితలు అప్పటి మద్రాసు హైకోర్టు న్యాధీశులు వేపా రామేశం పంతులుగారు ఈ సంపుటికి ఆంగ్లంలో ముందుమాట రాసారు. అసలైన సంపాదకులు శేషాద్రి రమణకవులు (దూపాటి శేషాచార్యులు, దూపాటివెంకట రమణాచార్యులు), మారేమండ రామారావు పంతులుగార్లు. కాని అట్టపైన వారి పేరు కనిపించదు. ఆదిరాజు వీరభద్రారావు రాసిన పీఠిక ద్వారా సంపాదకుల విషయం మనకు తెలుస్తుంది. 1921 హైదరాబాద్ లో ‘ఆంధ్రజన సంఘం’ స్థాపించబడింది. ఈ సంస్థ 1922 లో ‘ఆంధ్రపరిశోధక మండలి’ స్థాపించి సాహిత్య కృషిచేయ సంకల్పించారు. దీనిలో మొదటగా కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావు సభ్యులుగా ఉన్నారు.వారి తదనంతరం వారి సేవలకు గుర్తింపుగా ‘‘లక్ష్మణరాయ పరిశోధక మండలి.’’ అని పేరు పెట్టారు. దీని స్థాపకులు, అధ్యక్షలు మునగాల జమీంధారు రాజనాయని వేంకట రంగారావు. 1924 తర్వాత ఈ ఆంధ్రజనసంఘం కేంద్రం ఆధీనంలోకి వెళ్ళింది. దీని ఆస్తినంతా శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలంలో భద్రపర్చారు.

ఈ గ్రంథంలో 123 శాసనాలున్నాయి. పరిశోధకులు శేషాద్రి రమణకవులు, మారేమండ రామారావు పంతులు రాష్ట్రంలో చాలా చోట్ల తిరిగి శాసనాలు సేకరించి నివేదికలు కూడా రాసారట. ఈ నివేదికలు ఇందులో పొందుపర్చలేదు. ఈ 123 శాసనాలను 3 భాగాలుగా చేసారు. మొదటి భాగంలో 57 కాకతీయశాసనాలు, రెండవ భాగంలో 42 చాళుక్యశాసనాలు, మూడవ భాగంలో ఇతర శాసనాలుగా విభజించారు. 82 శాసనాలకు శేషాద్రి రమణకవులు, 40 శాసనాలకు మారేమండ రామారావు పంతులు, 01 శాసనానికి భావరాజు వేంకట కృష్ణారావు నకళ్లు రాసారు. ఇందులో విషయవివరణ, టిప్పణులు తెలుగు, ఇంగ్లీషులో ఉన్నాయి. ప్రతి శాసనానికి పుస్తకం చివరలో వివరాలు ఇవ్వడం ఇందులోని విశేషం.

గౌరవకార్యదర్శి ఆదిరాజు వీరభద్రారావు పీఠికరాస్తూ ఒక్క మాటంటారు ‘‘ఆంధ్రదేశంలోనే కాదు, హిందూదేశం మొత్తం ఇలాంటి శాసన సంపుటి ప్రకటించిన ప్రజాసంస్థ ఒక్క ‘లక్ష్మణరాయ పరిశోధకమండ’లే (ఆధారగ్రంథం.నెం.1. పు.xiv) అని తెలుపడంలో ఈ పుస్తక ప్రాధాన్యం మనం తెలుసుకోవచ్చు.

2. తెలంగాణ శాసనములు – రెండవ సంపుటము

హైదరాబాద్ లోని లక్ష్మణరాయ పరిశోధక మండలి వారు ఈ గ్రంథాన్ని 1960 లో ప్రచురించారు. ప్రస్తావనా రచయితలు డా.పుట్టపర్తి శ్రీనివాసాచార్యులుగారు ఈ సంపుటికి ఆంగ్లంలో ముందుమాట రాసారు. గౌరవకార్యదర్శి ఆదిరాజు వీరభద్రారావు పీఠికరాసారు. సంపాదకులు గడియారం రామకృష్ణశర్మ, నివేదన రాసారు. దీని ముద్రణకు భారత ప్రభుత్వం కొంత ద్రవ్యమిచ్చి ప్రోత్సహించింది. ఇందులో 85 శాసనాలున్నాయి. ఇవి మొదటి సంపుటమేయగా నిలువవున్న శాసనాలు. ఇందులో బాదామీ చాళుక్యులవి 03, రాష్ట్ర కూటులవి 5, కళ్యాణి చాళుక్యులవి 41, కాలచూర్యులవి 2, కాకతీయులవి 14, విజయనగరంవి 06, ఇతర శాసనాలు 14 ఉన్నాయి. 83 శాసనాలకు గడియారం రామకృష్ణశర్మ గారు, 02 శాసనాలకు మల్లంపల్లి సోమశేఖర శర్మగారు, నకళ్లు రాసారు.

ఇందులో విషయవివరణ తెలుగు, ఇంగ్లీషులో ఉంది. ప్రతి శాసనానికి పుస్తకం చివరలో వివరాలు ఇచ్చారు. అలాగే ఇంగ్లీషులో శాసనసంబంధిత వివరాలను టేబుల్సు వేసి వివరించారు. 5 శాసనాల ఫోటోలు కూడా అనుబంధంగా చేర్చారు.

‘‘ఆంధ్రదేశము గురించియు, ఆంధ్రరాజులను గురించియు, నాంధ్ర వాఙ్మయమును గురించియు నెక్కుడు పరిశోధనలు చేసి క్రొత్త వింతలను గనుగొనదలచిన వారికి హైదరాబాదు రాజ్యమందలి తెలుగుభాగమొక బంగారుపు గని వంటిది’’ అని శ్రీ లక్ష్మణరావుగారు సెలవిచ్చియున్నారు. ఆ బంగారపు గని నుండి కొంత బంగారమును గ్రహించి బంగారు పువ్వులతో రెండు హారములను నిర్మించి ఆంధ్రమాత కంఠసీమనలంకరించినాము. మొదటి హారమునందు. 123 బంగారు పువ్వులు గలవు, రెంవ హారమునందు 85 బంగారుపువ్వులు గలవు.’’ (ఆధారగ్రంథం.నెం.2. పు.iv) అని పీఠక రాస్తూ ఆదిరాజు వీరభద్రరావు అనడంలో ఎంతో ఔచిత్యముంది.

3. Inscriptions of Andhra Pradesh – Karimnagar District

ఈ కరీంనగర్ జిల్లా శాసనాలు గ్రంథాన్ని 1974 లో ముద్రించారు. దీని సంపాదకులు శ్రీ పి.వి.పరబ్రహ్మ శాస్త్రి గారు. అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రచురించారు. దీనికన్నా ముందు మొదటగా వరంగల్ జిల్లా శాసనాలను సంకలనం చేసి ముద్రించారు. ఈ క్రమంలో కరీంనగర్ శాసనాల గ్రంథం రెండవది. తరువాత కడపజిల్లాది కూడా ప్రచురించారు. ఈ గ్రంథంలో రాష్ట్రకూటుల సామంతులైన వేములవాడ (లేములవాడ) చాళుక్యుల వంశంలోని క్రీ.శ. 750 కాలం నాటి వినయాధిత్య యుద్ధమల్లుని నుండి క్రీ.శ. 966 కాలం వరకు పరిపాలించిన మూడ అరికేసరి వరకు ఉన్న చరిత్రను వివరించారు. వేములవాడ చాళుక్యులు పోదన (బోధన్) నుండి వారి రాజధానిని రెండవ అరికేసరి (క్రీ.శ. 930-955) కాలంలో వేములవాడకు మార్చాడని తెలుస్తుంది. కాకతీయుల శత్రువులు పొలాస మేడరాజు, మంథెన గుండరాజు, నగునూరు దొమ్మెరాజు, రామగుండం ఒడ్డెరాజుల చరిత్ర ప్రస్థావన ఉంది. ఇందులో మరిన్ని ఆసక్తిగొలిపే అంశాలు, శాసనాలతో పాటు కోటిలింగాల, మునుల గుట్ట, సబ్బినాడు, శనిగరం, నగునూరు, సపాదలక్షప్రాంతం, పర్బని పత్రాలు మొదలగు విశేషాలు చర్చచేసారు.

కరీంనగర్ లోని రెండవ అరికేసరి క్రీ.శ. 946 లో వేయించిన శాసనంలో తేదిని కూడా మనం చేడవచ్చు. ‘‘ … సకవష౯, ౮౬౯ పరాభవ సంవత్సరద కాత్తి౯ బహుళ ఏకాదసి సోమవారదన్దు…’’ అని ఉంది. ఇందులో క్రీ.శ. 945 కాలంలో జినవల్లభుడు వేయించిన తెలుగులో మొదటి కందపద్యం, కన్నడ పద్యం కలిగిన త్రిభాషా సమ్మిళిత ప్రసిద్ధిగాంచిన శాసనం గురించి ఉంది.

4. నరసింహ కవి రాసిన సిద్ధోద్వాహః

ఈ గ్రంథాన్ని1968 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముద్రించింది. దీని సంపాదకులు శ్రీ పి.వి.పరబ్రహ్మ శాస్త్రి. వరంగల్ రైల్వేష్టేషన్ కు 2 మైళ్ళ దూరంలో ఉన్న ఉర్సుగుట్ట (Hillock) పైన రాజగురు విశ్వేషర కుమారుడైన నరసింహకవి సంస్కృతంలో 155 పంక్తులో చెక్కిన (కావ్యం) శిలాశాసనం. ఇందులో 60 శార్దూల శ్లోకాలు, 2 స్రగ్దర శ్లోకాలతో కలిపి మొత్తం 62 శ్లోకాలున్నాయి. శాసనం చివర్లో కవి సంతకం కూడా ఉంది. శాసనం మొదట్లో ఒక దేవనాగరి లిపిలో ఒక వాక్యం మాత్రమే ఉంది. మిగతాదంతా తెలుగు లిపిలో ఉంది. ఈ కవి కాకతీయ ప్రతాపరుద్రుని ఆస్థనకవిగా, కాలం 12 శతాబ్ది నుండి 13 వశతాబ్ది మధ్య జీవించి ఉండొచ్చునని చరిత్ర పరిశోధకులు ఊహిస్తున్నారు. ఈ కావ్యంపై కాళిదాసు మేఘసందేశ కావ్య ప్రభావం ఉందని తెలుస్తుంది. ఇంగ్లీషు, తెలుగు లిపులలో పూర్తి శాసన పాఠాన్ని ముద్రించారు. ఇంగ్లీషులో ఈ శాసన వివరణ, విశ్లేషణ ఉంది. ఈ శాసన కావ్యంలో ఒక సిద్ధుని ప్రేమవివాహ కథ ఉంది. ఈ కథ మేరుపర్వతవర్ణన దగ్గర మొదలై సిద్ధుని వివాహవర్ణనతో ముగుస్తుంది. ఇందులోని కావ్యలక్షణాలను కవికి సమకాలికుడైన, ప్రతాపరుద్రుని ఆస్థాన కవి అయిన విద్యానాథుని ప్రతాపరుద్రయశోభూషణం అలంకారశాస్త్ర గ్రంథంతో అన్వయించి చూస్తే మరిన్ని విశేషాలు లభ్యమయ్యే అవకాశం ఉంది.

5. ప్రాచీనాంధ్ర శాసనములు

ఈ గ్రంథ రచయిత డా.బూదరాజు రాధాకృష్ణ, వీరు ఈ అంశంపై పరిశోధన చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి డాక్టరెట్ పట్టా అందుకున్నారు. ఈ గ్రంథం 1971 లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి ప్రచురించింది. దీనిని మల్లంపల్లి సోమశేఖరశర్మగారికి అంకితమిచ్చారు. ఇందులో క్రీ.శ. 2 శతాబ్ది నుండి క్రీ.శ.1100 మధ్య కాలంలో వచ్చిన 269 శాసనాల గురించి ఉంది. ఇందులో 217 శిలాశాసనాలు, 52 తామ్రశాసనాలున్నాయి. వీరు 255 శాసనాలవరకు వివిధ ముద్రిత గ్రంథాలు, పత్రికల నుండి సేకరించారు. రచయిత తెలిపిన ప్రకారం ఇందులో 74 రాయలసీమ 93 ఉభయగోదావరులవి, 62 ఉత్తరాంధ్రవి, 4 తెలంగాణ ప్రాంతాల శాసనాలు విశ్లేషించానన్నారు.

రచయిత నిజానికి 1958-60 ప్రాచీనాంధ్ర భాషా చారిత్రక వ్యాకరణమొకటి ఆధునిక పద్ధతుల్లో రాయాలన్న తలంపుతో మల్లంపల్లి సోమశేఖరశర్మ గారి సహాయం తీసుకొని ఈ శాసనాలపై కృషి చేసారు. అందుకే ఈ గ్రంథంలో భాషాపరమైన అంశాలను తీసుకొని శాసనాలు విశ్లేషించారు. శాసనాలను భాషాకోణంలో అధ్యయనం చేస్తే ఎన్ని కొత్త విషాలు తెలుస్తాయో వివరించారు. అంతేకాకుండా వీరు ఈ గ్రంథంలో ఎన్నో నూతన శాసనాధ్యయను పద్ధతులను ఉపయోగించారు. ఇవి పరోక్షంగా తరువాతి శాసన పరిశోధకులకి తొవ్వజూపాయనవచ్చు.

క్రీ.శ. 1200 కాలం వరకు ఉన్న ‘డ’ ‘ళ’ ల కు, ‘ద’ ‘డ’ ల సమానంగా ఉన్న లిపి సంకేతాల వివరణ, క్రీ.శ. 17 శతాబ్ది తరువాతనే తెలుగులో ఎ ఏ ఒ ఓ ల హ్రస్వ దీర్ఘతల భేదాన్ని స్పష్టంగా గుర్తించ గలమని తెలుపుతారు. ద్విరుక్త వర్ణాలు, మహాప్రాణ అల్పప్రాణాల ఉపయోగం, అనుస్వార, రేఫల తర్వాత స్పర్శ వర్ణాలు దిత్వంగా రాయడం, పంక్తిమీద అనుస్వార చిహ్నం, శాసనంలోని నొక్కులకు అక్షరాలకు భేదం మొదలగు ఎన్నో భాషాపరమైన విశేషాలు చర్చించారు.

ఈ గ్రంథంలో శాసనాలను మరియు అందులోని శబ్దార్థాల వివరాలను ఇంగ్లీషు మరియు తెలుగులో ప్రచురించారు. రెండుభాషల్లో ప్రచురించడం వలన ఔత్సాహికులైన పరిశోధకులకు సమగ్రంగా శాసనస్థ విషయంపై సుబోధకం అవుతుంది.

6. తెలుగు శాసనాలు

ఈ గ్రంథ రచయిత జి.పరబ్రహ్మ శాస్త్రి గారు. ఈ పుస్తకాన్ని ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా 1975 ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి వారు ప్రచురించారు. 1975 సంవత్సరాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సాంస్కృతిక సంవత్సరంగా ప్రకటించింది.

తెలుగు లిపి భాషలు మొదలుకొని ధనంజయుని కలమళ్ళ శాసనం, ఎఱ్ఱగిపాడుశాసనం, తిప్పలూరుశాసనం, కొరవిశాసనం అద్ధంకి శాసనం, కుర్క్యాలశాసనం, ఉప్పరపల్లి శాసనం మొదలగు దాదాపు 17 శాసనాలవరకు వివరణాత్మక విశ్లేషణలతో తెలిపారు. భాషాపరమైన సంధులు, సమాసాలు, లిపి,ధ్వని, వర్ణం, పదజాల చర్చకూడా విస్తారంగా చేసారు. క్రీ.శ. 898 నాటికి శాసనాల్లో తెలుగులో ఐఔలు లేవని, అఆఇఈఉఊఎఒ అను 8 అక్షరాలే ఉన్నాయని, సున్నాకు బదులుగా వర్గపంచమాక్షరాలే వాడేవారని తెలిపారు. జయంతి రామయ్యపంతులు, వేటూరి ప్రభాకరశాస్త్రి, మల్లంపల్లి సోమశేఖర శర్మ మొదలగు వారు చర్చించిన విషయమైన అడ్డుగీత లేని శకటరేఫంలాగా ఉన్న వర్ణం డ,ళ,ద అనే అక్షరాలవలే ఎలా మారిందో అన్న వాదాన్ని ఇంకొంత వివరించారు. అలాగే అర్ధానుస్వార, పూర్ణానుస్వార చర్చచేసారు. క్లిష్టమైన పదజాలానికి ఆధునిక రూపాలను తెలిపారు. కరీంనగర్ లోని కుర్క్యాల, ఉప్పరపల్లి శాసన చర్చ చేసారు. నేడు శాసనాలను అధ్యయనం చేసేవారికి మార్గదర్శన గ్రంథంలాగా ఉంటుంది.

7. తెలుగు లిపి, భాషలకు ఈ శాసనాలు తిరుగులేని ఆనవాళ్ళు

ఈ గ్రంథ రచయిత డా. ఈమని శివనాగిరెడ్డి గారు. ఈ పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ అధికార భాషాసంఘం వారు 2008 లో ప్రచురించారు. దీనికి ముందు మాటరాస్తూ డా.ఎ.బి.కె. ప్రసాద్ గారు ‘‘శాసనాలే మన ‘శ్వాస’నాలాలు’’ అని అనడం ఎంతో ఔచిత్యంగా ఉంది. కోటిలింగాల, సింగవరం ప్రాంతాల్లో లభించిన నాణేలు సుమారు 2500 సంవత్సరాల తెలుగు లిపి, భాషా చరిత్రని పట్టిస్తున్నాయని. నాణేలపై అధ్యయనం చేసిన డా. దేమో రాజారెడ్డి గారి కృషిని కూడా గుర్తు చేస్తారు. కల్నల్ కాలిన్ మెకంజి (1754 – 1821) మొదటగా తెలుగు ప్రాంతం అంతటా తిరిగి 6218 నాణేలు, 8076 శాసనాలు సేకరించినట్టు, వీరికి కావలి సోదరులు తో సహకరించారనే విషయం మనకు తెలుస్తుంది. 1837 లో జేమ్స్ ప్రిన్సెప్ బ్రాహ్మీ లిపిని కనుగొన్న తర్వాత శాసన పురావస్తు చరిత్రను సమూలంగా మార్చివేసింది. 1870 లో బాస్వెల్ స్థూపాన్ని, 1892 లో బూలర్ భట్టిప్రోలు ధాతుపేటికలమీదున్న శాసనాలను చదివి ప్రచురించారు. తెలుగులో కొమర్రాజు వేంకట లక్ష్మణరావు, వేణుగోపాల్, జయంతి రామయ్యపంతులు, కుందూరి ఈశ్వరదత్తు, చిలుకూరి వీరభద్రరావు, చిలుకూరి నారాయణరావు, మల్లంపల్లి సోమశేఖర శర్మ, దూపాటి వేంకటరమణాచారి, గడియారం రామకృష్ణ శర్మ, పుట్టపర్తి శ్రీనివాసా చార్యులు, నెలటూరి వెంకటరమణ, బి.ఎన్. శాస్త్రి, పి.వి. పరబ్రహ్మశాస్త్రి, వి.వి.కృష్ణశాస్త్రి, దెమో రాజారెడ్డి, జితేంద్రదాసు మొదలు ఎందరో శాసన పరిశోధనలో కృషి చేసారని, తెలుగు నేలలో 6500 కు పైగా శాసనాలు సేకరించారని, క్రీ.పూ 3 శతాబ్దిలోని భట్టిప్రోలు శాసనం నుండి క్రీ.శ. 9 శతాబ్ది యుద్ధమల్లుని బెజవాడ శాసనంవరకు తెలుగు లిపి,భాషా పరిణామ వికాసాలకు నిలువుటద్దాలని ఈ పుస్తకం ముందుమాట ద్వారా తెలుస్తుంది.

ఈ గ్రంథంలో భట్టిప్రోలు బుద్ధ ధాతుపేటిక, అశోకుని ఎరగుడి శాసనం నుండి ప్రారంభమై కోటిలింగాల నాణేలు పెద్దబొంకూరు ముద్రికలు, శాలిహుండం ముద్రికలు, ధాన్యకటక, అమరావతి శాసనాలు, ఇక్ష్వాకు, బృహత్పలాయన, శాలంకాయన, పల్లవ, విష్ణుకుండిన, రేనాటి చోళ, బాదామి చాళుక్య, తూర్పు చాళుక్య, బాణారాజుల, మైదుంబ రాజుల, రాష్ట్రకూట రాజుల శాసనాల వరకు విస్తృత వివరణలో పాటు శాసనాల ప్రతిబింబాలను కూడా ఇచ్చారు. అనుబంధాల్లో బ్రాహ్మీ లిపి, తెలుగు లిపి పరిణామక్రమ చార్టులను కూడా ఇచ్చారు.

8. శాసన సంపుటి (1,2 భాగములు)

ఈ గ్రంథ సంపాదకులు బి.ఎన్.శాస్త్రి గారు. ఈ పుస్తకాన్ని సరస్వతీ నిలయం. నారాయణగూడ వారు 1976 లో(ద్వితియా ముద్రణ) ప్రచురించారు. దీనికి గడియారం రామకృష్ణ శర్మ అభిప్రాయం, తిరుమల రామచంద్ర గారి ముందు మాట సంపాదకుల కృషిని ఇనుమడింపజేసాయి. గడియారం గారు మైసూరు ప్రభుత్వం ‘ఎఫిగ్రాఫికా కర్నాటికా’ శాసనాలపై మంచి కృషి జరుపుతుందని, మన ప్రభుత్వం ప్రారంభించిన ‘ఎఫిగ్రాఫికా ఆంధ్రికా’ ఇంకా పురిటి దశలోనే ఉందని ఆనాటి వాస్తవిక స్థితిని ఎండగట్టారు. అదే సమయంలో శాసనాలపై అవిరళ సేవ చేసిన రాజమండ్రి ‘ఆంధ్రేతిహాస పరిశోధకమండలి’ హైదరాబాద్ లోని ‘లక్ష్మణరాయ పరిశోధక మండలి’ సంస్థలను, వ్యక్తిగతంగా కృషి చేస్తున్నవారిని మెచ్చుకున్నారు. బి.ఎన్.శాస్త్రి గారు కృతజ్ఞతలలో శాసనాల సేకరణలో తెలంగాణాలోని 9 మండలాలు 4000 గ్రామాలు తిరిగి చూసాన్నారు. పూజాద్రవ్యాలతో నిండిన దేవాలయాల్లో శాసనప్రతింబాలు తీయడంలోని ఇబ్బందులు, ప్రజలు మూఢనమ్మకాలతో శాసనలను బయటకు తీయడానికి కూడా ముందుకురాకపోవడమే కాకుండా, కనీసం వారి గడ్డపారలు కూడా ఇవ్వకపోయేవారని, స్వయంగా వీరే గడ్డపారలు కొనుక్కొని తవ్వితీసి సేకరించేవారని వారి వ్యక్తిగత సాధకబాధకాలను వివరించారు.

ఈ సంపుటిలో మొదటి భాగంలో తామ్రశాసనాలు, రెండవ భాగంలో శిలాశాసనాల గురించి ఉంది. మొదటి భాగంలో 2 విష్ణు కుండినులవి, 1 మారర వంశీయులది, 2 కళింగ గంగ రాజులవి ఉ తామ్రశాసనాలున్నాయి. రెండవ భాగంలో 10 కందూరు చోడరాజులవి, 12 కళ్యాణి చాళుక్యులవి 10 కాకతీయులవి, 1 గోల్కొడ నవాబులవి శిలాశాసనాలున్నాయి. వీరు ప్రకటించిన శాసనాలన్ని అముద్రితాలే. ఈ శాసనాలు ఎక్కువగా మహబూబ్ నగర్, నల్గొండజిల్లాలో పర్యటించి సేకరించినవి. శనిగరం శిలాశాసనం మాత్రం కరీంనగర్లోని శనిగరం పార్థేశ్వర దేవాలయంలోనిది. శాసనపాఠంతోపాటు, అనువాదం, భాషావిషయాలు, లిపి, వర్ణక్రమం గుర్తులు, అందులోని వస్తువు చారిత్రక నేపథ్యాలు కాలనిర్ణయం, వంశవృక్షాలతో పాటు వివిధ రకాలైన అంశాలను సవిస్తరంగా తెలిపారు. ఇలా ప్రతి శాసనానికి విపులమైన వ్యాఖ్యానమందించడం పాఠకులకు ఆసక్తికరంగా ఉంది. తామ్రశాసనాల రేకుల బరువును, ఎన్ని పంక్తులున్నాయో తెలుపడం వీరి లోతైన పరిశోధనాదృష్టికి నిదర్శనం. ఈ సంపుటిలోని ఇంద్రపాలనగర తామ్రశాసనం వలన విష్ణుకుండినులు మహబూబ్ నగర్ మండలంలోని శ్రీపర్వత ప్రాంతీయులని, ఇక్ష్వాకులకు సామంతులుగా నల్లగొండ జిల్లాలోని ఇంద్రపాలనగరాన్ని రాజధానిగా చేసుకొని రాజ్యం చేసారని, దక్షిణాపథులైనారని ఉంది. ఇంతవరకు వీరు విజయవాడ, అమరావతి ప్రాంతపువారన్న వాదాన్ని ఇది విభేదించింది. ఈ తామ్రశాసనం గురించి సంపాదకులు రాసిన వ్యాసం 1965 లోనే భారతి పత్రిక జూన్, జులై సంచికల్లో వచ్చింది. ఇదేకాదు తామ్రశిలాశాసనాలలోని పేరూరు, కందుకూరు శాసనాలు తప్ప అన్ని శాసనాలు భారతిపత్రిక 1965 సంవత్సరంలో వారు వ్యాసాల రూపంలో ప్రకటించినవే ఉన్నాయి. స్వయంగా 400 పైగా శిలాశాసనాలను సేకరించారంటే ఎంతో ఆశ్చర్యం కలుగకమానదు. .

9. ఆచంద్రార్కం.

ఈ గ్రంథ సంకలన రచయిత దామరాజు సూర్యకుమార్ గారు. ఈ పుస్తకాన్ని డాక్రి (DACRI) వారు 2013 లో ప్రచురించారు. వీరు శాసనాన్ని చూడగానే అలవోకగా చదవగలరు. ఈ గ్రంథలో క్రీ.శ. 1042 జగదేకమల్లుని కాలంనాటి మాడుగుల శాసనం నుండి గ్రంథలో క్రీ.శ. 1834 కాలంనాటి నల్లగొండ జిల్లా పొడిచేడు శాసనం వరకు 21 కొత్త శాసనాలు ప్రచురించారు. కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావుగారి శిష్యులు మల్లంపల్లి సోమశేఖర శర్మగారు, వారి శిష్యులు నెలటూరి వేంకట రమణ్యగారు వారి శిష్యులు బి.ఎన్.శాస్త్రి గారు వారి శిష్యత్రయమే నేడు శాసనాలపై విస్త్రృత పరిశోధనలు చేస్తున్న డా.ఈమని శివనాగిరెడ్డి గారు, కుర్రా జితేంద్రబాబు గారు, దామరాజు సూర్య కుమార్ గారు. బి.ఎన్.శాస్త్రి గారు ‘డెక్కన్ ఆర్కియాలజికల్ సొసైటి’ పేరుతో ఒక సంస్థ స్థాపించి ప్రతి నెల రెండవ శనివారం సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసేవారట. దామరాజు సూర్యకుమార్ గారు అందులో సభ్యులు.

10. Inscriptional Glossary of Andhra Pradesh (శాసన శబ్దకోశము),

ఈ గ్రంథం 1967 లో ప్రచురితం అయింది. దీని రచయిత కుందూరి ఈశ్వర దత్తుగారు, ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమి వారు ముద్రించారు. శాసనభాషా పరిశోధకులకు అద్భుతమైన ఆకర గ్రంధం ఇది. ఈ గ్రంథాన్ని వేంకటాచలపతికి అంకితమిస్తూ శాసనపరిభాషలో కృతిసమర్పణ చేసారు. వీరికి శాసనాలమీద ఎంత మక్కువ ఉందో ఈ ఒక్క ఉదాహరణవల్ల తెలుస్తుంది.

ఆంధ్రదేశీయేతిహాస మండలి వారు 1992 లో ‘‘శ్రీ రాజరాజనరేంద్ర పట్టాభిషేక సంచిక’’ భావరాజు వేంకట కృష్ణారావు సంపాదకత్వంలో ప్రకటించారు. అందులో శ్రీ సోమశేఖర శర్మ రాసిన ‘‘ప్రాచీనాంధ్రాషాస్వరూపము’’ వ్యాసం, అందులోనే వచ్చిన గిడుగు వారి వ్యాసాలు వీరు చదివారు. అటు తర్వాత South Indian Inscriptions (Texts) 4,5 భాగాలు స్ఫూర్తి పొందారట. 1936 లో ‘‘శాసనములలోని తెలుగుభాష’’ అనే వ్యాసం నవ్యసాహిత్య పత్రికలో రాసారు.

ఈ శాసనశబ్దకోశానికి పీఠిక రాస్తూ ‘‘ నా దగ్గఱ నున్న వ్రాతప్రతి సంపుటముల పరిశీలించి గ్రంథరూపకముగా ప్రకటనార్హమౌనో కాదో యని నిర్ణయించుటకు అకాడమీ కార్యనిర్వాహక సంఘము వారొక విద్వజ్జనపరీక్షకమూర్తి త్రయోపసంఘమును నియోగించిరి. అందలి సభ్యులు (1) డాక్టరు భద్రి రాజు కృష్ణమూర్తి గారు (2) డాక్టరు బిరుదురాజు రామరాజుగారు (3) శ్రీ గడియారం రామకృష్ణశర్మ గారు మొదటి వారిద్దరు ఆంధ్రభాషావేత్తలు మూడవ వారు ప్రసిద్ధ శాసన పరిశోధకులు…’’ ఇలా ఆ ఉద్ధండులను గుర్తుచేసుకొన్నారు.

శాసనాల్లోని శబ్దాలకు ఇంగ్లీషు, తెలుగు అర్థవివరణ ఇస్తూ ఆయా పదాలు ఏయే శాసనాల్లో ఉన్నాయో కూడా ఉటంకించారు. మిక్కిలి క్లిష్టమైన, ప్రయాసతో కూడుకున్న పరిశ్రమ ఇది. చివర అనుబంధాల్లో ప్రాకృతశాసన పదపట్టికలిచ్చారు, అలాగే భవిష్యతరాలవారికి ఇకా అర్థ నిర్ణయం చేయాల్సిన పదాల పట్టిక జాబితా కూడా పొందు పర్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com