-దాస్యం సేనాధిపతి


సంసార సాగరంపై


ఎగసి పడే


సంఘర్షణ అలలు…


చందమామను కమ్మిన


మేఘాల వలే..


తాత్కాలికమని ఇప్పుడిపుడే..


తెలుసుకుంటున్నా!


అపోహల


వలయం నుండి బయటపడ్డాక..


నీవేమిటో…


క్రమంగా గ్రహిస్తున్నా!


మనిద్దరి మధ్యన ఉన్న


సందేహాల దొంతరలు


కనుమరుగయ్యాక తెలిసింది..


నా కోసం…


ఆనందాలను పంచే


ఈ పూదోటను నువ్వే


నిర్మించావనీ…


నేను ఈ పూల దారుల వెంటే


నీ సన్నిధి చేరాలనీ..!


కుసుమాలు ఇంట విరియకున్నా..


నీ భరోసా పరిమళాలు


నన్ను తాకుతుంటే..


పూర్వ వైభవం వైపు


వడివడిగా..


అడుగులు వేస్తున్నా!


ఔను


నా కింతవరకు అసలే


స్ఫురించలేదు


కొన్ని తెలుకోవాలన్నా..


మరికొన్ని


వెతుక్కోవాలన్నా..


మనల్ని మనం


అప్పుడప్పుడు…కాసేపు


అజ్ఞాత పరుచుకోవాలనీ…!


సంభాషణల ఆసరాతో


అలకలు తీరాకే…


వాస్తవ మొలకలు


అంకురిస్తాయనీ!!
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com