-పసునూరి రవీందర్

“పిల్లలరూపంలో తల్లిదండ్రులు బతికే ఉంటారు”

-సిద్ధార్థుడు

ఈ మధ్య అప్పుడప్పుడు

నాలోకి నాన్న వచ్చి వెళ్తున్నాడు

చెప్పకుండా వెళ్లిపోయిన నాన్న

ఇన్నాళ్లకు ఎటువైపు నుండో వచ్చి

నన్ను ఆవహిస్తున్నాడు

తాను వదిలి వెళ్లిన కుటుంబాన్ని

నాన్న జ్ఞాపకాలతో బతుకుతున్న అమ్మను

చిన్న మొక్కల్లా తన చేతుల్లో మెదిలి

ఇవాళ నలుగురికి నీడనిస్తు

వృక్షాల్లా ఎదిగిన తమ్ముళ్లను

తనలాగే నవ్వుతున్న

మనువండ్లను, మనవరాళ్లను

నా కళ్లతో చూసి పులకించిపోతున్నాడు

ఆనందబాష్పాల వానలో తడిచిపోతున్నాడు

నాన్న నాలోకి వచ్చినప్పుడు

నేను ఉన్నట్టుండి

అరవైయేండ్ల వాడినైపోతున్నాను

అప్పుడు నా తనువు, మనస్సు

నాన్నతో నిండిపోతాయి

జీవితాంతం నీడలా వెంటాడిన షుగరు నీరసం

తరం నుండి తరానికి ఆస్తిలా వచ్చిన ఆకలి బాధ

నన్ను ఒక్కసారిగా చుట్టుముడుతాయి

కన్నీళ్లు గేట్లు తెరిచిన ప్రాజెక్టులవుతాయి

ఔను…

రోజూ చావుతో కొట్లాడిన వీరుడు కదా నాన్న

బుక్కెడు మెతుకుల కోసం

ఎన్ని కన్నీటి సముద్రాలను ఈదిండో…

రిక్షా తొక్కి కాళ్లు, బస్తాలు మోసి ఒళ్లు

నాన్నకంటే ముందే చచ్చుబడిపోయాయి

కంటినిండా నిద్రా

కడుపునిండా తిండి మాటల్లోనే తప్ప

ఏనాడు పొందనివాడు

తనను తాను మరిచి ఎన్ని యుగాలైందో

కష్టాల దండయాత్రల నుండి

తనను కాపాడుకోలేక కాటిపాలయ్యాడు

అయినా నాన్న ఓడిపోలేదు

మమ్మల్ని గెలిపిస్తూనే ఉన్నాడు

కలవరింతల బతుకోడు నాన్న

ఏ కలలు కన్నాడో

ఎన్ని జాగారాలున్నాడో

ఎంత గింజుకున్నాడో

ఎంత లోలోపలే తన్నుకున్నాడో

ఏనాడు ఏ నొప్పిని చెప్పకుండా

మానని మనసు గాయాలను చూపకుండా

బాధలన్నీ లోలోపలే మోసినోడు నాన్న

నాన్న అంతే… నిండుకుండా!

నాన్న లేని శూన్యం

దీపం లేని చీకటిల్లులా

తరాల దు:ఖాన్ని వలపోస్తున్నది

కంటిరెప్పల కింద

కన్నీళ్లు సుడులు తిరుగుతున్నట్టు

రోజూ నాలోనే కలె తిరుగుతున్నాడు నాన్న

ఎన్ని అడగాలని ఉందో నాన్నను

ఎన్ని చెప్పాలని ఉందో నాన్నకు

పెరుగన్నంలో ప్రేమను కలిపి

తినిపించిన నాన్నకు

నా చేత ఒక్క ముద్దెనా

తినిపించాలని ఉంది

చిన్ననాడు నాకు చేపించినట్టే

నాన్నకు స్నానం చేపించాలని

నాకు తన బతుకును కథగా చెప్పినట్టే

నా విజయగాథ నాన్నకు చూపెట్టాలి

నాన్న ముఖంలో కోటికాంతుల

వెలుగు చూడాలని ఎన్నెన్ని అనుకున్నానో…

మరి ఇప్పుడు నాన్న ఏడి?!

అంతే…తీరని రుణం నాన్న

నాన్న నువ్వు ఉంటే…

నువ్వే ఇచ్చిన గజం ఆత్మగౌరవ వస్త్రాన్ని

ఎట్లా జెండా చేసి ఎగరేస్తున్నానో చూపించేవాడిని

నువు నేర్పిన విలువల పడవతో

బతుకువరదను

ఎట్లా ఎదురీది గెలుస్తున్నానో చూపేవాణ్ణి

పదిమందిలో నీ కొడుకుగా

ఎట్లా తలెత్తుకు బతుకుతున్నానో

నీ గుండె ఉప్పొంగేటట్టు చేసేవాడిని

ఏవీ చూడకుండానే ఎందుకు నాన్న

ఇట్లా జీవితపు ఇంటర్ వెల్ లోనే వెళ్లిపోయావు

ఈ దు:ఖం తీరదు

ఈ కథ సుఖాంతం కాదు

నాన్న రాడని తెలిసినా

నాలోకి నాన్న వచ్చే ఘడియ కోసం

దిక్కులన్నీ గాలిస్తున్నాను

ప్లీజ్ నాన్న… ఈ సారి వస్తే మాత్రం

నాలోనే ఉండిపో నాన్న !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com