జాతి సాంస్కృతికాంశాలలో ఆదాన ప్రదానాలుంటాయి .లేకుంటే జాతి కి జీవ లక్షణం కొరవడి నిర్వీర్యమౌతుంది .అదే సమయం లో ప్రతి జాతికి కొన్ని మౌలిక లక్షణాలు కూడా ఉంటవి .వాటిని కాపాడుకుంటూనే ఆదాన ప్రదానాలపట్ల సౌజన్యం కల జాతి మనగలుగుతుంది .

సాంస్కృతిక అంశాలలో భాష, కవిత్వం చాలా ప్రధానమైనవి .ఈ రెంటికీ ప్రధాన ధర్మం ప్రవాహ గుణమే ఈ రోజు ప్రపంచభాష గా పరిణమిస్తున్న ఆంగ్లాన్ని తీసుకుందాం ..ఈ భాష చాలా చేరికలను ఆమోదించింది .

ప్రాచీన కాలం లో ఆంగ్లేయులు మూడు ద్వీపాల నివాసులు .వారిది celitic భాష .రోమన్ ఆక్రమణ జరిగేవరకు అంటే 55 బి.సి నుండి లాటిన్ ప్రభావం మొదలైంది . తరువాత ఉత్తర జర్మనీ నుండి దాడి చేసిన Angels , Saxons ,Jutes ,Tribes భాష నిజమైన ఇంగ్లీషు భాష గా చలామణి అయింది .15 వ శతాబ్ది నుండే ఆంగ్ల భాష Mid Land Dialict గా పిలువబడింది .Metropolis భాష గా నిలువగలిగినది .

భాష లో ఇలాంటి ఆదాన ప్రదానా లున్నట్టే కవిత్వం లోను ఉంటాయి .ఒకప్పుడు కవిత్వానికి సంస్కృతం ఉత్ప్రేరకం అయినట్టే ఇప్పుడు ఇంగ్లీషు ఉత్ప్రేరకం అయింది .వచన కవిత్వం దగ్గరికి వచ్చేసరికి వస్తువు పూర్తి గా సామాజికం అయింది .

ఈ నాటి ప్రధాన కవితా మాధ్యమం వచనం ,సరే …దాని పరిణామమేమిటి ? ఏ సమాజం అనివార్యం గా వచన కవిత్వాన్ని సృష్టించుకొంది? అది సంతరించుకొన్న లక్షణాలు ఏమిటి ?వచన కవిత్వం లో ఈ భాషా వినిమయం ఎట్లా ఉండాలి ?ఇలాంటి అంశాలన్నే చర్చించింది ఈ పొత్తం .

వచన కవిత్వం ఎత్తుగడ ,నిర్వహణ ,ముగింపు ,అనే మూడు దశలని కవులు ఎట్లా నిర్వహించాలో తెలిపింది . లక్ష్మణ చక్రవర్తి ,బెల్లి యాదయ్య ,యాకుబ్ ,పెన్నా శివరామకృష్ణ,లాంటి తొమ్మండుగురు కవి విమర్శకుల వ్యాసాలూ ఇందులో ఉన్నాయి .

ఆధునిక కవులు ఈ నిర్వహణ ఎట్లా చేస్తున్నారో వివరించింది .Robert Frost , ‘’It is like playing Tennis without net’’ అంటాడు .అంటే లాక్షణిక నిర్మాణ సూత్రాలు లేకుండా కొనసాగే వచనకవిత్వ రచన యొక్క క్లిష్టత ఇక్కడ వ్యక్తమైంది .

ముందే నిర్మించిన లక్షణాలతో మన భావాన్ని నింపలేం, వస్తువును బట్టి తనకు తానే రూపం ఏర్పరచుకోవాలె .ఈ క్రమం లో కవి ఉద్వేగం తో వస్తువు దానితో పాటు రూపం ఉత్పత్తి చేస్తాడు .ఇక్కడే కవి అభ్యాసం, వ్యుత్పత్తి బాగా పనికి వస్తాయి .సరైన అభ్యాసం లేని వ్యక్తి చోదకం బాల కవిత్వ పరిధికి పరిమితమౌతుంది . అట్లా కాక కవి నిరంతర సాధన నేపధ్యం గా ఉంటె నిర్మాణం అప్రయత్నం గా గాఢత సంతరించుకుంటుంది .

ఈ విషయాలన్నిటినీ గురించి ఈ వచన కవిత్వం వస్తుశిల్పాలు పుస్తకం లో కూలాంకష మైన చర్చ జరిగింది .

దాదాపు ఈ విమర్శకులందరూ వచన కవిత్వం మీద ఉన్న ఆంగ్లప్రభావాన్ని చర్చించారు .

వస్తువు ఎంపికలో ముఖ్యమైన విషయం దృక్పధం అన్నారు సుంకిరెడ్డి ,గుంటూరు లక్ష్మినర్సయ్య కూడా కవి వ్యక్తం చేసే విషయం పట్ల కవికున్న దృక్పధం ఈ విషయం సాధారణ కవిత్వ స్థాయి నుండి ఉత్తమ కవిత్వ స్థాయి కి చేరుకోవడం లో కీలక పాత్ర వహిస్తుందని దృక్పధం ప్రాధాన్యత తెలియజేస్తారు .

కే. శివారెడ్డి కవిత్వాన్ని నిర్వచిస్తూ దర్బశయనం, కవిత్వం పై ఆ కవి ముద్ర ,అతని అనుభవ సారం ,అతని పైన ఒక విశ్వాస ప్రకటన ఎట్లా ఉంటుందో తెలియ జేస్తారు .వస్తువు ను బట్టే కవితా చట్రం అని నిర్ధారించుకున్నాక ,వస్తువు కుండే పరిధి ఎంత? ఏమిటి ? అన్నది పరిశీలనాంశం అని తన విశ్లేషణ కొనసాగించారు .కాంచనపల్లి గోరా కవి వస్తువును ఎన్నుకోవడానికి ,ప్రధానం గా సమకాలీన సాహిత్య పరిస్థితులు ,తాత్విక నేపధ్యం ,కవి వ్యక్తిత్వం దోహదం చేస్తాయని చెప్పారు .అట్లాగే శిఖామణి, కవిత్వం ఒక భావోద్వేగ రచన ,నువ్వు ఏం చెప్పినా అది ఎత్తుగడ ,వస్తువు ,నిర్వహణ , భాష , అన్నే కలగలిపి కవిత్వ రూపం దాలుస్తాయి అని కవిత్వ సమగ్రతని అవిష్కరించదానికి ప్రయత్నించారు .

ఇది తొలి ప్రయత్నం కవులకు ఒక కరదీపిక. అట్లాగే సీనియర్ కవులకి ఒక పునశ్చరణ. వెరసి కవితా ప్రియులంతా చదువదగిన పుస్తకం ఇది . పుస్తకాన్ని అందంగా ముద్రించి మంచి కవిత్వ సృజనకు దోహదం అవుతున్న తెలంగాణా సారస్వత పరిషత్తు అధ్యక్షులు ఎల్లూరు శివారెడ్డి ,ప్రధాన కార్య దర్శి జే .చెన్నయ్య గార్లు మిగుల అభినందనీయులు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com