
కందుకూరిశ్రీరాములు
బతుకు
బహిర్గతం కాకుండా
చిరుగులు కుట్టుకోవాల్సిందే!
ఇల్లున్నప్పుడు
చెత్తాచెదారం
దుమ్మూ ధూళీ పడుతుంది
చక్కగా ఊడ్చితుడిచి
అద్దమోలే చేయాల్సిందే!
ఎవరి అన్నాన్ని వాళ్లు
కాపాడుకొని
ఎవరి సొమ్ము వాళ్లు
దాచిపెట్టుకుని
ఎవరి సంసారాన్ని వాళ్లు
దిద్దుకొని
సంరక్షించుకోవాల్సిందే!
పండుగనో పబ్బమో
వస్తుంటాయి
పనిచేసి కొన్ని రాళ్లు
పోగుచేసుకోవాల్సిందే!
కష్టపడి
సంపాదించినదేదీ
ఊరకే పోదు
ఊరంతా పెద్దదవుతుంది !
అక్షరాలు
చెదిరి పోకముందే
చిత్రాన్ని గీయాల్సిందే !
సాహిత్యమన్నప్పుడు
మంచీ చెడూ
విద్యా విజ్ఞానమూ తెలుస్తుంది
ఎవరి ఆలోచన్లు వాళ్లు
మరవకపోతే
ఒకదగ్గర కట్ట కట్టిన
తాళపత్రగ్రంధమే !
ఎక్కడతయారైతేనేం?
ఎవరి వస్తువులు
వాళ్లకుపయోగపడాల్సిందే !
ఏ వ్యాయామైతేనేం ?
ఎవరిచైతన్యం
వాళ్లకుండాల్సిందే !
సభనో సమావేషమో
జరుగుతుంటుంది
ఎవరి వాదం వారు
నిర్భీతిగా వినిపించాల్సిందే !
వస్తుశిల్పాలు
సమపాళ్లల్లో కలిసి
కావ్యశీలం
మరో చరిత్ర రాస్తుంది !!