ఆ గజేంద్రుడు మొర పెట్టినంతలోన

పరుగు పరుగున వచ్చి కాపాడినావు,

కరుణ గల్గు వాడ వని లోకమ్ము నిన్ను

పొగడినంతలో , హరి ! నీవు పొంగినావు.

నీకు సంతోష మిది , కాని, నాకు నీవు

బ్రతుకు లేకుండ జేయ ధర్మ మ్మటయ్య !

నేను చేసిన అంతటి నేర మేమి ?

జల నివాసమే కద మా మొసళ్ళ బ్రతుకు !

నా నివాస గృహమునకు తాను వచ్చి

అల్లకల్లోల మొనరింప నడ్డుపడగ

వలదొ ? ఇదియు నేరమగునొ ? వచ్చినట్టి

వాడు వనరాజు – వాని గర్వమ్ము గనవొ ?!

వానికై అంత వనమునే వ్రాసి ఇచ్చి

ఏలుకొను మంటివి ; వనము చాలు ననగ

వలదె ? వాడు నా కొలనికి వచ్చి ఇదియు

నాది యన్నట్లు చెలరేగినాడు ; తగవె ?!

ఎవరి హద్దులు వారివి ; అవి ఎరింగి

తమ బ్రతుకు తాము బ్రతుకుట ధర్మ మగును ;

బలము కలదని పరుల ఎల్లలను దాటి

బ్రతుకులను పాడు చేయుట భావ్య మగునె ?

ఎవ్వ రెవ రే విధముగ జీవించవలెనొ

వ్రాసి పెట్టిన ఒక చక్రవర్తివి కద !

అమలు పరచవలదె వాని నట్లె నీవు ;

ఆ మద కరిని శిక్షింప వైతి వేమి ?!

ఇంట దొంగ దూరిన యంత నెవరు గాని

అతని పట్టుకొనుటకు ప్రయత్న మింత

యైన చేయకుందు రటయ్య ! అదియు నేర

మగునొ ? అదియె నే చేసితి , నంతియె కద !

ఇంత మాత్రమునకె ఆత డంత అరచె ,

ఆ అరపుల కీవు కరగి అరుగుదెంచి

నావు , కరిని ముక్తుని జేసినావు ; కాని

నన్ను దయ లేక చంపుట న్యాయ మగునె ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com