
-డా.ఉదారి నారాయణ
నను నన్నుగా
నిలబెట్టుకోవడానికి
నిక్కచ్చిగా గొంతెత్తడానికి
జీవిత సంఘర్షణల్లోంచి
పదునెక్కడానికి
నాకింత సత్తువను
సారభూతమైన ఆలోచనా విత్తనాలని
నాలో వెదజల్లి వెళ్లిన పెద్దలు
ఈ రోజు మా ఇంటికస్తున్నలు
అరికాళ్ళకింత జిగిని
కనుచూపుల్లో కొంత సమరత్వాన్ని
దోసిలినిండా త్యాగగుణాన్ని
నింపి వెళ్లిన పెద్దలు
ఈ రోజు మా ఇంటికొస్తున్నలు
వాళ్ళ దయాపాతాలు ఇంకా
చెమట చెమటగానే
తొలిచినుకు మట్టివాసన గానే
అలసిపోని అలగానే
వాడిపోని పొద్దుగానే
నావైపు చూస్తుంటయి
అటు ఇటు తొణకకుండా
నన్ను పహరా కాస్తుంటయి
ఆకాశం ఎవడికీ దాసోహం కానట్టు
సముద్రం ఎవడి ముందు
దూపదేహం చూపనట్టు
మరణాన్ని తీరం దాకా తరిమిన వాళ్ళు
ఆ పెద్దలు
నా బతుకు దాతలు
నా మెతుకు మెతుకుపై
నిజాయితీ శిల్పం చెక్కిన తరతరాల
శిల్ప కారులు వాళ్ళు
మాటలు ఎండిపోయిన
ఎడారి ప్రపంచంలో
రోజుకు ఒక్కసారైనా
విధేయున్నయి విధేయున్నయి
మనసారా వాళ్ళను మనసులో
హత్తుకుంటాను
నా మనో శిఖరంపై ఎత్తుకుంటాను
నా బతుకు పయనానికి మరింత
ఉత్తేజపు ఇంధనాన్ని వంపుకుంటాను
ఈ రోజు మా పెద్దలను ఇల్లంత కండ్లతో
మా ఇంటికి రమ్మంటాను.