
బైరెడ్డి కృష్ణారెడ్డి
ప్రేమాభిమానాల
హెచ్చుతగ్గుల భారమితిలో
సమతూగలేని
నేనొక దుర్బల మానసికున్ని
కడతేరనొల్లని కార్యాచరణా
ఒక దౌర్బల్య మానసికమే
ఏ దుర్బలతకైనా
గుండె నిబ్బరం ఒక
అత్యావశ్యకమైన
పర్యాయ పదార్థ నిరర్ధకం
మిడిమిడి యోచనల మిడిసిపాట్లు
ఒక కేవల ఆత్మానందపు సాగుబాటన్న
ఎరుకను దేవులాడుకోటానికి
వసంతమని మురిసిన బతుకంతా
ఏడు దశాబ్దుల ఎండమావై పొయ్యింది
గారవించిన అభిమాన్యతను
కాలరాసితినన్న దురపవాదు స్పృహ
అంతరాంతర నైర్మల్య కుశలతను
అపరాత్రి పీడకలల దెయ్యమై
పట్టి పీడిస్తుంటది
సాలు తప్పని కోండ్రలెయ్యాలని
మేడితోక పట్టుకోని
సాగుబడి కోడెదూడనై
బతుకంతా
నేలను దున్నుతూనే వున్న
ఐనా ఇంత మాత్రానికే
ఇంతట్లనే బండెద్దునైతనా
చెయ్యని పాపపు
నెత్తురు మరకల్ని కడిగేసుకొమ్మని
ఆత్మ ప్రక్షాళనేదో
అంతర్మథనమై ఘోషిస్తుంటది
ఏరు దాటి
తెప్ప తన్నేసే వాలకమనే
దురపవాదు తగదన్న
పశ్చాత్తాపమేదో
ప్రాయశ్చిత్తమై కెలుకుతుంటది
ఓనమాల తలకట్టుల దిద్దుబాటుకే
ఒక ఆయువు దీర్ఘాన్నిచ్చిన దేవుడు
ఒక వాక్యరూప గుణింతాల రచనకు
ఇంకొక్క పిడికెడు
బతుకు నుడికారాన్నియ్యకపాయె
భ్రమ నిజమైనంత భ్రమగా
నిజం భ్రమైనంత నిజంగా
నిజానికి నిజమొక భ్రమ
ఐనా
కన్నీళ్ళను కవిత్వీకరించడం
కవితకు కన్నీళ్లనద్దడం
ఒక నిరుపమాన సార్ధక్యం