మార్చిలో మొదలు కరోనా కవితలు రచనలు భీకర సాహితీరంగ పోరాట కసరత్తులు.

దైనందినమే దైన్యమై ప్రశ్నార్థకంగా మారి మనుషులు కుదుళ్ళలో కుదింపై పోయేంతగా బతుకు కుదేలయ్యింది. ఈ పరిస్థితిలో డైరీలేమి రాస్తారు అన్న ఆలోచన వచ్చుంటే ఈ సమీక్ష రాసే అవకాశమే లేదు..

ఈ మొత్త కాలగమనంలో క్షణాలు నిముషాలయి, నిముషాలు గంటలూ రోజులయి,

అవీ ఆనవాయితీగా వారాలు పక్షాలు నెలలుగా సాగి సాగి దినచర్యలను కబలిళించే ప్రయత్నం విశ్రుంకలంగా తలలు విరబోసుకుని మరీ చేస్తుంటే ఓ జ్వాలా కీల ఎగసింది. ‘జ్వలిత’ రూపంలో మానవత్వం తలెత్తింది, గొంతు సవరించుకుని, వ్యాధి గణాంకాల మధ్య వేదనల రోదనల మధ్య ఓ సుధీర్ఘ ఆలాపన గళం విప్పింది.

ఈ రుగ్మయుగంలో రచయిత్రుల మనసులో పొరల్లో రాయబడుతున్న రాతలేమిటిమ? వైతాళికులైన సృజనకారులు చేతులు కట్టుకుని ఏనాడు నిలబడరు. పైగా నిలదీస్తారు. ఈ భీభత్సాన్ని అక్షరీకరించేందుకు తమ నైపుణ్యాలతో ఈ విశృంఖల విజృంభణని, దాన్ని కట్టడి చేసేందుకు, బాధితుల బాధలను సమాయత్తం అయ్యారు.

మనసుకు ఆశ్వాసమిచ్చి చిరునవ్వు తెప్పించే వినమ్ర ప్రయత్నమేదో చేస్తూనే ఉంటారు. రవి గాంచని చోటు కవి కాంచునన్నది పాత కాలం నుంచే వస్తున్న పలుకుబడి. ఇప్పుడూ అది ఫలవంతంగా పని చేస్తుంటుంది. ఈ రచయిత్రులూ కవయిత్రుల మనసు తెలుసుకోవడం వారి లో జరిగిన మధనం సాకారమై అక్షర రూపాన అందరికి అందించడం ముందు తరాలకొక వారసత్వపు పెన్నిధిని మాతృ భాషలో పేర్చిన పెన్నిధి గా ఆలోచనల అనుభవాల ఆరాట పోరాటాల చిలికిన మీగడ తరకల మైత్రీ భావం తో అందించడమే ఈ అవలోకనపు ముఖ్య ఉద్ధేశ్యం అనిపిస్తుంది.

భీరుత్వం ఎక్కడా కనబడకపోవడం ఇందులో ఉన్న విశిష్ట లక్షణం. ఏకధాటిగా పొడిగింప

బడుతూ లాక్డవును ఏడిపిస్తున్నదనుకుంటే, అయిన కాడికి అవకాశాలుగా మార్చుకుంటూ తాము జీవిస్తూ తమ కందుబాటులో ఉన్న రోగులకూ, వారి దగ్గరి వారికీ సాయమందిస్తూ, వారి ఇబ్బందుల తగ్గించే అవిశ్రాంత సేవలో నిమగ్నమయిన సోదరీమణుల దైనందిన దినచర్య ఈ కరోనాడైరీ పేజీలన్నింటా మనకు కళ్ళకు కట్టినట్టే కనబడుతుంది.

రచయితగా పరిణామాలను గమనిస్తు మనిషిగా ప్రతిస్పందిస్తూ అడ్డంకులనూ అధిగమిస్తు ఆలోచన వివేకంతో ముందు చూపుతో రాబోయే సమస్యలను తీవ్రతల తగ్గింప జేస్తు ఉపశమనాలనే ఉధృతంతో కార్యభూతంగా పాటుపడిన మహిళ మనకు ప్రతి డైరీ పేజీలో ప్రత్యక్షంగా సాక్షాత్కారమిస్తుంది.

ఇందులో రాసిన వారందరూ మహిళలే. వివిధ రంగాల లో పని చేస్తూ అదనంగా రచనా వ్యాసంగం చేస్తున్న వారే ఎక్కువ మంది. ముఖ్యంగా ఉపాధ్యాయినులు అధిక సంఖ్యలో రాశారు. ప్రతి రచన లోనూ సమాజాన్ని జల్లెడ పట్టి మనలో దాగున్న స్వార్థపు వెకిలితనాన్నీ, వ్యాధి గ్రస్తుల పట్ల కొందరు ప్రవర్తించిన అమానవీయ కోణాన్ని వదలకుండా చూపిస్తూ, అవసరమైన సంస్కరణలు సవరణలు చేసి చూపించి తమ డైరీలో పేజీల భాగంగా అందరితో పంచుకున్నారు. అసహాయతలను వివరిస్తూ ఆదుకోగలిగిన అవకాశాలు మనం చేయడానికి ఉన్న ఆస్కారాల వైపూ దృష్టి సారించారు

ముఖ్యంగా చూడగలిగింది ఏఒక్క మహిళా నైరాశ్యం వైపు దారి మళ్ళలేదు. కష్టాల పట్ల కన్నీరు రావడం సహజమైనా! ఓటమి విరక్తి ఏ ఒక్క పేజీలోనూ కనబడదు. తమ ఇక్కట్టైన పరిస్థితిని ఎదుర్కొన్న విధాలు, ఆ తహతహలో అనుభవించిన మానసిక వేదనలను ధీరోద్ధాత్తంగా వెలికి అలవోకగా చెప్పిన వైనాలే కనిపిస్తాయి. నేటి సమాజంలో మహిళలు ఇంత పట్టుదల, గుండె ధైర్యాలతో జీవితపు ఒడిదుడుకులను ఎదుర్కొంటూ రాజీ పడకుండా సజావుగా పయనం సాగించడం చూస్తుంటే, గురజాడ వారి ధీమా నెరవేరినట్టే. ఇందులో రాసిన ప్రతి మహిళా ‘ఆధునిక స్త్రీ చరిత్ర ను తిరిగి రాస్తుందని’ అన్న గురజాడ వారి మాట గురి తప్ప లేదని నిరూపణే.

మగువ మనసు అతి నిగూఢమని అంటుంటారు. ఆడవారి మాటలకు అర్ధాలు వేరనీ అంటారు. ఈ పుస్తకం లో రచించిన వారిని అలా మహిళా సగటు మూస లో పోసే అవకాశం లేదు. డైరీతనం గా రాయడం వలన మాటలలో తమను తాము రుగ్మయుగాన నిర్వహించుకున్న తరహాలో నిజాయితీ వాస్తవిక వాదం.గడ్డు పరిస్తితులను సహనం ఓపికలతో తాము ఎదుర్కొంటూ, తమ వారికి సాయపడ్డ సమాజిక నేపధ్యంలో నిష్ణాతులయ్యారనే సంకేతమే వస్తుంది..

ఈ పుస్తకం చదవడం మన బాధ్యత. ఆడవాళ్ళూ చీర షాపింగులని అస్తమానం ఎగతాళి చేసే మన సమాజం ఈ కాలం లో మహిళలు ఎంత చాతుర్యంగా ఎదురీదారన్న విషయం తేటతెల్లమవుతుంది.

ఇంకో ముఖ్య విషయం మన దేశాన సునామీ వచ్చింది అది ఒక్క రోజు చేసిన భీభత్సాన్ని అందరం ఎదుర్కొన్నాము. ఎలాటి సంసిద్ధత లేని నేపధ్యంలో ఆ సందర్భాన్ని ఎదుర్కొన్నాము. కరోనా విశ్వాన్నంతటినీ కబళించే విధం గా విజృంభిస్తే సునామీ కొంత జనాభానీ సముద్ర తీర ప్రాంతాలనే అతలాకుతలం చేసింది. కొన్ని ప్రాంతాలే ఇబ్బందులకు గురైన కొన్ని గంటల భీభత్సం ఎన్నో జీవితాలను దెబ్బ తీసింది. బహుశా ఆ సందర్భం లోనూ ఇలాటి సునామీ తాకిడి ఆరాట కెరటాలను నిక్షిప్తం చేసుంటే వేదనల వెతలు భావి తరాల కు బలమై ఉండేది. రవి కాంచనిదీ కవి కాంచునని జారవిడుచుకున్న గతం తప్పిదమైతే ప్రస్తుతానికి అద్దం పట్టించిన ఈ అవలోకనం సమాజం గురించిన పారదర్శకమైన ప్రజారీతుల దర్పణమే.

చదవడం మంచి అలవాటు ఇలాటి సహజ స్పందనల కెరటాలనూ చదవడం గొప్ప సదవకాశం..

ఇందు లో అంతా సకారాత్మకతేనా చేదెక్కడా లేదా అని పరిశీలిస్తే ఈ అవలోకనం పుస్తక రూప పురిటి నొప్పులు ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి గా నాకనిపించినది . మనో సాగర మధనం లో వాట్సాప్ సమరాల ఆటుపోట్లు వాయిస్ మెసెజుల గర్జనలనే హాలాహలమే ముందు వచ్చినా వందల చేతులు 126 మనోస్థైర్యాల పటిష్టమైన చేతులు తమ మనో వీచికల కాంతులను లోకాని కందించే విజయకేతనాన్ని అంది పుచ్చుకున్నారు. పట్టుదల లక్ష్యం పై గురి తప్పని దీక్ష గా సాగిన ఈ రచనలు సంఘటిత శక్తి విజయానికి తార్కానాలు.దారి లో వచ్చిన అడ్డంకులు దూది పింజల్లా తేలిపోయాయి. మానవత్వం సమాజానికి పట్టిన చీడను ఎడమ చేత్తో తీసి వేస్తుందని కవరు పేజీలోనే స్పష్టపరచడం తో ఒక దరహాసరేఖ తోనే పుస్తకం చదువరికి అవలోకనపు తలుపు తీస్తున్నది. మహిళల సాధికారత సావిత్రి బాయి ఫులే తోనే సాకారమయిన విషయాన్నీ ప్రతీకిస్తూ ముఖచిత్ర మహిళ ఫూలేగారిని పుణికి పుచ్చుకున్నది. పైగ అటు చిన్నది మరీ పెద్దది కాకుండా చదవడానికి అనువైన అక్షరాల వరుసలు అందరినీ ఆహ్లాదకరం గా చదివించేస్తాయి.

అతివల అవలోకనం..

కరోనా కాలంలో ఏం చేసానంటూ ప్రారంభించిన అత్తలూరి విజయలక్ష్మిగారు ఎప్పుడో భూస్థాపితం అయిన అంటరానితనం ఆరోగ్యపు అవసరంగా దేవుడు మళ్ళీ తవ్వి తీశాడా అన్న సందేహం చెబుతూనే సాంకేతికల తో ఈ సమయాన్ని సదుపయోగమూ చేసుకున్నామన్నారు. రోడ్లో అడ్డమున్న తాటి చెట్ల మీది నుండి గాలి పోయిన టైరును అందించి సాహసాలు చేయడం ఆత్మీయులను చేరడానికై అరుణజ్యోతిగారి అనుభవాల లో అలా మిగిలిపోతుంది. రాజ్యలక్ష్మి. ఎ.గారి డైరీ లోనిదే ” కరోనా అనకొండా చుట్టు పెట్టడం నుంచి అందరం తప్పించుకోవాలనే అహర్నిశం ప్రయత్నం ” అందరి మనసు లో స్థిరపడ్డ అత్యంత నిజమైన వాస్తవం. ఇంటికి ఎవరొచ్చినా బయటట నుంచే పంపేయడం అసలు రావద్దని చెప్పేయడం అలవాటైందన్న కన్నోజు ఫణిమాధవిగారి మాటే మనందరి నోట. శుచి శుభ్రం అని పాత పద్ధతులు అలవాట్లు మళ్ళీ మొదలెట్టినా మనసు లోని మాట ” ఈ ప్రపంచం ఏం కాబోతున్నదన్న దిగులు ” చల్లా సరోజిని దేవి* మాట అందరి ఆలోచనల రింగారమే. రేపేమౌతున్నదని నిన్న నేడు వణకడమే..

జ్వలితగారి డైరీ గురించి అరపేజీకి పైగా రాయొచ్చును. ప్రతి రోజును పరీక్షార్ధకంగా ఎదుర్కొంటూ అదే సమయం ప్రతి రోజు చివరాఖరు రోజేమొనని రేపు రాకున్నా ఆ పని నేడే పూర్తి చేయడానికి ఉద్యమించి ధీరత్వాన్ని చూపి మరో 125 చేత డైరీ రాయించి మరీ పట్టు సాధించారు.

స్రవంతి ఈతరపు మహిళ . ఈ రుగ్మ యుగం age of limbo అని తీర్మానించి ఆఫీసు కెళ్ళే సాహస ప్రయత్నం లో అసలు ఎందుకు వెళ్ళారో కూడా మరిచేంతగా ఉన్న అయోమయ పరిస్థితి. ఇంకో వైపు అసలు లక్ష్య పెట్టని వితండవాదులు భయం భయం గా అడుగులేస్తున్న ఆలోచనాపరులు ఇరు వర్గాల విధానం లో నిర్ణయాలు తీసుకున్నా కరెక్టే.. తీసుకోకున్నా కరెక్టే అని సగటు మనుషుల అగమ్యగోచరతని పట్టేసి రాసిన స్పష్టత. ముఖ్యం గా అన్నీ విషయాల లో యువతను ముందుకు నడిపే పెద్దలూ పిల్లల్లాగే కనుక్కుని తెలుసుకొనే రీతిలో అందరూ ఒకే పరీక్ష ఏక కాలం లో రాస్తున్నామని అందరికీ కొత్తే అన్న నిజం నిర్ధుష్టంగా రాసేసింది..

అడువాల సుజాతగారు ” అందరినీ కష్టపెడుతున్న క రోనా దాడీ అస్సలు కనబడకుండా పోతే బాగుండ ” ని చల్లటి మాట . అమృతలతగారు ఎంతో మందికి గడ్డు పరిస్థితుల లోంచి సాయపడినా దగ్గరి వ్యక్తులు వ్యాధిగ్రస్తులవడం వలన చేదు అనుభవాల గాయం వేదన పంచుకున్నారు..

డా తిరునగరి దేవకీదేవిగారం మనందరం ఎదుర్కుంటున్న సంక్లిష్టమైన సందర్భాలను చక్కగా కళ్ళ ముందుంచి వలస బడుగు జీవితాల కొక మంచి పరిష్కారానికి సమాజం పూనుకోవాలని ముందుచూపు సలహాల తో పెద్దరికపు పాత్ర నిర్వహించారు.

డా దేవేంద్ర మారోజుగారు ఎంతో పరిణితితో తమ సాహిత్య ప్రస్థానం సాగించినా ఎక్కడో అభద్రతాభావం వెంటాడిన ఎన్నో క్షణాలను గుర్తు చేసుకున్నారు.

తులసి గుగులోతుగారి నిత్యం పక్కవారి పై ఏడ్చే మనం ” అందరూ బాగుండాలి అంలో మనం ఉండాలి” అనుకునేంతగా ఎదిగామంటుంటే ముచ్చటేస్తుంది..

నాంపల్లి సుజాతగారు ‘ విపత్కర పరిస్థితి కి అద్దం పట్టి రేపటి చరిత్ర కు ఓ సాక్షిభూతం గానే ఈ డైరీ రాసుకున్నారు. అయినా నా నగరం మౌనదుఃఖిత అంటూ కవితాక్రోశం తో నిస్సహాయతను పంచుకున్నారు.

డా మమత రఘువీర్గారు సమాజపు స్వార్థ కోణం వైపు ఫోకస్ చేసి ఈ విపత్కర పరిస్థితులను అవకాశం గా తీసుకుని సడి చప్పుడు లేకుండా పెరిగి పోయిన బాల్యవివాహాలు వాటి నుంచి అమ్మాయిలను కాపాడడం అన్న సమస్యనూ ఎదుర్కోవడం గురించి రాసి వింత పరిణామాలను వివరించారు.

నెల్లుట్ల రమాదేవిగారు ఒక బాంకర్ గా ఈ రుగ్మ యుగం లో సమాజాన్ని అధ్యయనం చేసి స్వచ్ఛందం గానూ సేవ చేయడం మన తో పంచుకున్నారు

పెద్దపల్లి తేజస్విగారు గానం చేసి వైరలైన జ్వలిత గారి పాట బడులు లేకా తిండిలేక గురించి తమ అనుభవం పంచుకున్నారు.

యడవల్లి సుజాతగారు అచ్చం గా తేదిల ప్రకారం దినచర్య రాసి ఎక్కువగా ప్రేమించే తన గుణం ఓ మార్చుకోవలసిన అంశం అన్న తీర్మానం చేసుకున్నారు.

రమాదేవి బాలబోయినగారు ఈ సమయం లో జీవితపు ఒడిదుడుకులను లోతుగా పరిచయం చేసిన కాలపు కాఠిన్యతకు అద్దం పట్టారు.

వనపర్తి పద్మావతిగారు ఈ చిక్కు పరిస్థితుల వలన కుటుంబ సభ్యులకు తమ ఆత్మీయుల తో అవగాహన పెంచుకునే అవకాశం ఇచ్చి మనుషులను దగ్గర చేసే మేలైతే చేసిందన్న ఊరటను వ్యక్తపరిచారు.

డా ప్రతిమారాజ్ వైద్యరంగపు అనుభవాలు పంచుకుంటూ భయాలు పోగొట్టే దిశగా ధైర్యం చెప్పారు.

సిస్టర్ అనసూయగారు ప్రతి మనిషిలోని భావన్నీ ప్రతిఫలిస్తూ ” ఇలాటి వైరసులు ఇంక ఎన్నడూ ఈ భూమి మీదకు రాకూడదని ” కోరుకున్నారు.అదే విశ్వమంతటా అందరి కోరికా ఆశ.

ప్రత్యేక మైన అంశంగా చదవడం రాయడం రాని వారి అభిప్రాయాలు మనసు లోని మాటలు సేకరించడం వారు సామాజిక స్ఫూర్తి ఇబ్బందులను వివేకం తో అర్ధం చేసుకున్నారనే అర్ధమవుతున్నది.

ఈ పుస్తకాన్ని తడుముతుంటే కన్నీళ్ళ మధ్య వెన్నెల వెలుగులూ దోబూచులాడి అదో ఆశల జాబిలి అలవోకగా అందుతుందన్న నమ్మకం నికార్సుగా దొరుకుతుంది. అన్ని గ్రంథాలయల లోను అవశ్యం అందుబాటులో ఉండాల్సిన అందరు తీసుకుని చదవాల్సిన పుస్తకం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com