-ఎల్లాప్రగడ సీతాకుమారి

సాయంకాలం అయ్యేటప్పటికి రెసిడెన్సీ చమను, గాలిమేతకు వచ్చిన యువకులతోటి , ఆటలకు వచ్చిన పిల్లలతోటి కిటకిటలాడిపోతుంటుంది. అందులో ముందువైపు స్క్వేరులో రాజారావు కూచొని, అఖిలాంధ్రకథక సమ్మేళనానికి పంపడానికి ఏమి కథ రాద్దామా అని ఆలోచన చేస్తున్నాడు. కథకు ఎన్ని విధాల చూచినా మంచి ‘థీము’ దొరకడములేదు. అందులో టూకీగా రాశామా అంటే పాఠకులు సందర్భాలు వివరంగాలేవు అంటారు. పోనీ వివరంగా రాస్తే చాలా దీర్ఘం అయింది. మాకక్కర్లేదంటారు సంపాదకులు. పైగా చిన్నకథకు పాతవిషయాలేమీ పనికిరావు. కొత్త పోకడలు ఏం పోదాము ? ప్రణయరంగాలేమన్నా తీసుకుందామా. అబ్బే, ప్రణయమంతా

పాతబడిపోయింది. పోనీ కర్షక కార్మిక సమస్యలో ? చెత్త. ఎందుకూ మన కర్షక కార్మికులేమో రష్యాలోలాగ చదువుకోరు. ఇతర్లు చదివినా కార్యం శూన్యం. ఏదో కాస్త చదువుకున్న ఆడవాళ్లను తీసుకొని అవి ఇవి తగిలించిరాస్తే…. బాగానే ఉంటుంది కాని. ఇప్పటి సీలు ఊరుకోవడం లేదు. మా తెలుగువాళ్ల డాబులూ, ఇంట్లో కోతలూ, బయట పిరికితనమూ… ఉహూఁ. ఈ కుళ్లంతా పేపర్లకెక్కిస్తే బయటి వాళ్ళు ఎగతాళి పట్టించరూ!! పోనీ మా యువకుల్లో…..”

ఆకస్మికంగా అతని ఆలోచనలకి అంతరాయం కలిగింది. ఎదురుగా ఒక పదహారేళ్ల అమ్మాయి పమిటచెంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ నిలుచొని ఉంది. ఆమె చూడ్డానికి ఎక్కువ సౌందర్యవతి కాదు.

చామనఛాయా, సామన్యమైన పొడగూ, పల్చని చెంపలూ, కొద్దిగా ముందుకు వాలిన నుదరూ చూడ్డానికి చాలా సామాన్యంగా కనిపిస్తుంది. కాని ఆ కళ్ళూ ఆ జుట్టూ…. అవి రెండే అమ్మాయిని మనిషిని చెయ్యడానికి తోడ్పడ్డాయి. ఆ కళ్లు గూడా చాలా పెద్దవి కావు గాని నల్లగానూ, తీక్షణంగానూ ఉండి ఒక విధమైన వశీకరణ శక్తితో ప్రకాశిస్తూ ఉన్నాయి. జుట్టుకూడా బిరుసుగానూ, వంకరలుగానూ ఉండి, ఆమెలోని దృఢనిశ్చయాన్ని తెలియజేస్తున్నాయి.

రాజా ఆ అమ్మాయిని ముందుగా పలకరించడం ఎందుకని ఊరుకున్నాడు. కాని ఆమె మరికొంచెం సమీపానికి వచ్చి “క్షమించాలి, మీ పరిచయం లేకపోయినప్పటికీ, మీ వేషాన్ని బట్టి ఆంధ్రులేనని గ్రహించి మాట్లాడుతున్నాను. ప్రస్తుతము నేను కొంచెం ఇబ్బందిలో ఉన్నాను. ఇప్పుడెవరయినా ఒక పురుషుడి సాయం కావలసి వుంది. కనుక మీరెవరయినా నాకు చెయ్యగలిగితే….” సగంలోనే అందుకొని రాజా “తప్పకుండా నా ప్రాణాల్నిచ్చెనా రక్షిస్తాను. మీకు

వచ్చిన ఆపద ఏమిటో చెప్పండి. ఆంధ్రులు కాకపోతే మరెవరు తోడ్పడుతారు?” అంటూ పొంగిపొయ్యే ఆంధ్రోత్సాహంతో తొందర పెట్టాడు.

కృతజ్ఞురాలిని, నా స్థితి . అంతా ఇప్పుడు చెప్పాలంటే చాలాకాలం పడుతుంది. టూకీగా చెబుతాను. మా వాళ్లు నన్ను ఇప్పుడొక ముసలివాడికిచ్చి పెళ్లి చెయ్యాలని చూస్తున్నారు. నా కది ఇష్టం లేక, ప్రస్తుత మా మూహూర్తం తప్పించాలని వీలయినంత వరకు ఒక వందరూపాయలవరకూ దొరికించుకొని ఇలా వచ్చాను. మీరు దయవుంచి నన్ను ఒక సురక్షిత స్థానంలో జెరిస్తే కొన్నాళ్లుండి మళ్లీ వస్తాను.. ఏమంటారు..?

మీ ధైర్యానికి నా అభినందనాలు. ఇలాంటి అసందర్భపు బలత్కార వివాహాలను బలవంతంగా ఫోర్సు చేసి అయినా తప్పించాలని మా యువకుల ఉద్దేశం తప్పించకుండా మీరు కోరిన చోట మిమ్మల్ని దిగబెట్టివస్తాను.

ఆ అమ్మాయి సంతృప్తనయనాలతో “అలాగైతే మనం షాదునగరం వెళుదాము. ఈ రోజుల్లో అక్కడ కొంచెం చల్లగా కూడా ఉంటుందిట…” అంటూ వీధిలోపోతున్న ఒక మనిషిని చూచి కొంచెం భయంతో ముఖం పక్కకు తిప్పుకొని “చూచారా, ఆ ఎర్రకోటు మనిషి మా పక్కఇంట్లోనే నడు. మనల్ని చూచినట్లు మా వాళ్లతో చెప్పాడాఅంటే మళ్లీ ప్రమాదంలో ఇరుక్కుపోతాము. సాధ్యమైనంత త్వరగా మనం వెళ్లిపోతే మంచిది” అంది. .

రాజా కూడా కొంచెం తడబడి, “మీరు ఇక్కడే చెట్ల చాటున కొంచెం నిలబడండి. నేను వెళ్లి టాక్సీని తెస్తాను” అని గబగబా క్లాకుటవరు దగ్గరకు వెళ్లి ఐదు నిమిషాల్లో ఒక కారు తీసుకువచ్చాడు. ఇద్దరూ కట్టూబట్టల్లో అందులో ఎక్కి కూచోని కాచీగూడెం స్టేషనుకు పోనిమ్మన్నారు.

“ఇక్కడ నుంచీ సౌకర్యంగా ఉండటానికి మీ పేరేమిటో చెప్పండి. నన్ను రాజారావు అంటారు’ అన్నాడు రాజా.

అమె కొంచెం నెమ్మదిస్తున్న తొట్రుపాటుతో “రాధ అంటారు” అంది. – రైలు కదిలింతరువాత ఇద్దరూ సంభాషణలోకి దిగారు. “ఐతే మీ వాళ్లు ఎందుకిస్తున్నారు అంత పెద్దవాడికి.”

“ఏమి లేదు, ఎక్కడ చూచినా పెద్ద పెద్ద కట్నాలు కావాలెననేవాళ్లే, పోనీ కాలేజీ స్టూడెంట్లెవరన్నా కట్నం లేకుండా వప్పుకుంటారేమోనంటే, వాళల్ల రేటు మరీ ఎక్కువగా ఉంది. అభివృద్ధిపక్షంలో యువకులెవరన్నా కుదురుతారేమోనంటే వాళ్లకి నా చదువూ, చక్కదనమూ సరిపోలేదు. ఏంచేస్తారు మరి”.

“ఐతే మరి మీరు పారిపోయి మాత్రం ఏం లాభం”?

“ఏదో తొందరపడకుండా విచారిస్తే, ఎవరైనా సంస్కారబుద్ధి ఉన్నవాళ్లు దొరక్కపోతారా అని… మీ రేంచేస్తున్నారిప్పుడు?”

ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాను. ఈయేడే ఎమ్.ఏ. అయిపోయింది. మా నాన్నగా రెక్కడన్నా ఉద్యోగంలో ప్రవేశించమంటున్నారు. నాకేమో జర్మనీ వెళ్లి డాక్టరేటు తెచ్చుకుందామని ఉంది కాని ఎదో ఆర్థికపుచిక్కుల్తో అనుకూలపడ్డంలేదు.”

“బహుశా వివాహం అయిందనుకుంటాను.” “ఇంకా లేదండి, అదంతా ఓ రామాయణం, అసలు నాకు పెళ్లంటేనే ముందు అదో వికారం. అందులో నా ఉద్దేశాలకు తగిన ఆమె దొరకడం అంటే, కుందేటి కొమ్ము సాధించడమన్నమాట! “

“అలాగా, అయినా ఎలాటి ఊహలుండేవో………

“ అసలు నాకు మన తెలుగుపిల్లలంటేనే అసంతృప్తి, ఎక్కడైనా మగాడి మాట వినబడితే తుర్రున పారిపోవడమూ, ఏ సందర్భంలోనన్నా కాస్సేపు నలుగురు మమగవాళ్లల్లో నుంచో వలసివస్తే ఈ తొట్రుపాటు, పమిటెసర్దుడూ, బెదురుచూపులూ ఇలాటి వాళ్లతో మనకేం రొమాన్సు దొరుకుతుంది ? ఏదో సందర్భపడితే జర్మనీనుంచే…”

“పోనీ, మంచి చదువులు చదివినవాళ్ళెరూ దొరకలేదూ ఇక్కడే?…..”

“ఇక్కడ ఒకటుంటే ఒకటుండదండీ. చదువుంటే చక్కదనం ఉండదూ. రెండూ ఉంటే చలా ఉండదు. హైద్రాబాదులోనే ఎన్నో సంబంధాలున్నాయి. నాకొక్కటి నచ్చలేదు. మా మేనమాను కూతురే ఓ అమ్మాయి ఉంది. చిన్నప్పుడొకసారి చూచాను తోక ఒకటి తక్కువగా ఉంటుంది. మా వాళ్లంతా చేసుకోమన్నారు. కాని నేను ఒద్దుపొమ్మన్నాను. నా సంగతి విన్నారుకాదూ, ఏదోకాస్త ఆంధ్రోద్యమం అనీ, వైతాళికసమితి అనీ, సమ్మేళనాలనీ….. ఏదో ఒక ఉద్యమం నడిపిస్తూ ఉండాలిసిందే కాని ఊరికే ఉండే ఘటం కాదు. ఇక తీరా చేసుకున్న తరువాత అవతలి మనిషి కూడా కాస్త మనకు సరిపొయ్యేటట్లుండాలెనా…..”

ఏదో స్టేషనులో బందాగింది ఎవరో తెలుగువాళ్లే మొగుడూ పెళ్లాము పిల్లల్తో వచ్చి ఎక్కారు. రాజా కొంచెం సర్దుక్కూచున్నాడు. రాధమాత్రం బెరుకు లేకుండానే ఆ వచ్చినవాళ్ల నడిగి ఒక చెంబు పుచ్చుకొని చూడండీ అక్కడ నల్లా ఉంది. మీరు కొంచెంతాగి నాక్కొంచెం తెచ్చిపెడుతారూ….?” అంది.

రాజా నీళ్లు తీసుకవచ్చాడు. ఇంతలో రాధ అక్కడికి వచ్చిన పూరీ, సేరూ కొని ఉంచింది. ఇద్దరూ ఫలహారం మొదలెట్టారు.

రాజా తల్లో ఆలోచనశకటాలు పరుగెత్తుతున్నాయి… “పాపం ఎప్పుడు తిన్నదో, ఏమో…..! ఐనా ముఖంలో ఇందాకటి దైన్యం కొంచెం తగ్గింది. ఇప్పుడు మనిషిలో కాస్త చురుకుదనం కూడా కనిపిస్తున్నది….. నేను కొత్తవాణ్ణే అయినా ఎవరికీ అనుమానం కలక్కుండా ఉండడానికేమో, ఎంతో చనువుగా ఉంటున్నది…? ఈ మోస్తరు”

షాదునగరంలో దిగి ఇద్దరూ బండిచేసుకొని వెళ్లి ఒక ఇంట్లో దిగి కావలసిన సామాన్లనీ కొద్దికొద్దిగా తెచ్చుకున్నారు.

మర్నాడు సాయంత్రం రాజా ప్రయాణం అయినాడు. కాని రాధ విచారంతో వేడుకుంది. ఈ కొత్తవూళ్లో నేనొక్కదాన్నీ…. ఇంకో రెండు రోజులుంటే…. ఎల్లుండే మావాళ్లు పెట్టిన సుముహూర్తం అదయిపోతే మళ్లీ మనం ఇంటికి వెళ్లిపోవచ్చును.”

నిజంగా రాజా కూడా వెళ్లలేకపోయినాడు. ఆ రాత్రి రాజాహృదయంలో చిన్నకదలిక కలిగింది. రాధ నడత అతన్ని చాలా ఆకర్షించేస్తున్నది. ఆమె మాటల్లోనూ, నడతలోనూ, ఎక్కువ అనురాగమూ, పరిపూర్ణమైన జాగ్రత్తా, సూక్ష్మ మైన విధేయతా, తొలుకాడుతూ కనిపించేవి. ఆమె అంటే అతనికీ ఒక విధమైన అవ్యక్తభావం ఎక్కువౌతూ ఉన్నది. పాపం కష్టాల్లో ఉంది కదూ, సానుభూతేమో… ఏమో…. త్వరగా వెళ్లిపోతే బాగుండును.

నిద్రలేచేటప్పటికి రాధ ఫలహారమూ, కాఫీ తయారుచేసింది. చిన్న వయసే కాని చాలా రుచిగా ఉన్నయి. రాజా కొద్దికొద్దిగా సంకోచం వదిలిపెట్టి, అడిగివేయించుకోడం మొదలు పెట్టాడు .

“పాపం నా నుంచి మీకు చాలా కష్టం కలిగింది. అక్కడేమన్నా తొందరపనులున్నాయో ఏమో అంది రాధ కాఫీ కలుపుతూ.

“అంత చెడిపియ్యే పనులేమీ లేవులెండి. వచ్చే శుక్రవారంనాడు కథక సమ్మేళనం ఉంది. దాని కందుకుంటే సరి. కష్టం మాత్రం ఏముంది నాకు. నాలుగు ఉపన్యాసా లిచ్చేకంటే, ఒక అబలను కష్టాల్లోనుంచి తప్పిస్తే మంచిదికాదా?”

గంభీరమయిన రాధముఖంలో నుంచి ఒక విశ్వాసంతో కూడుకున్న మందహాసం బయటికొచ్చింది. “నిజంగా ఆ కష్టసమయంలో మీరూ దొరికినందుకూ…మీలో యిన్ని ఆదర్శకోద్దేశాలు ఉన్నందుకూ.. ఆ భగవంతుడికి పదివేల నమస్కారాలు. “

“అబ్బే, అట్టే పొగడకండి నాకు కష్టంగా ఉంటుంది. ఎలాగైనా మిమ్మల్ని నిర్విచారంగా ఇంటికి చేరిస్తే….”

రాధ సంతృప్త హృదయంతో వంటకు వెళ్లిపోయింది.

సాయంకాలం రాజా అక్కడక్కడ తిరిగి ఇంటికి వచ్చేసరికి రాధ తలంటిపోసుకొని క్రిందటిరోజే తెప్పించిన ఔరంగాబాదు తెల్లపట్టుచీర కట్టుకొని ఉతికి ఆరవేసిన పెద్ద పోలో కాలరు జంపరు వేసుకొని ఇంకా సొమ్మేమి పెట్టుకోకుండానే లోపలివాకిట్లో పారిజాతం చెట్టుకింద చాపవేసుకొని జడ అల్లుకుంటూ కూచున్నది. రాజాను చూడాగానే లేచి స్వాగత సూచకంగా చిన్న మందహాసంతో “వూరుచూడడానికి వెళ్లారు కాబోలు, చాలా సేపయింది. ఏమయినా విశేషాలున్నాయా ఇక్కడ చూడదగినవి?” అంటూ పలకరించింది.

రాజా కోటూ చెప్పులూ విప్పి వచ్చి కూచొని “అట్టే విశేషాలేమీ లేవుకాని రెండు మూడు ఫర్లాంగుల దూరంలోనే చిన్నగుట్ట ఒహటుంది. దానిమీద కూర్చొని చుట్టూ ఉన్న మబ్బుల్నీ పొలాల్నీ చూస్తూ ఉంటే బాగా సాయంకాలమైపోయిన సంగతే తెలీలేదు” అన్నాడు.

“ఎక్కడానికి బాగా వీలుగా ఉంటుందా.”

ఫరవాలేదు. ఒక మోస్తరుగా ఉంటుంది కొంచెం కష్టంగానే అయినా పైకి గనక వెళ్లితే….ఎది మాలాటి వాళ్లకి కాస్త మనోహరమైన దృశ్యాలు కనిపిస్తాయి.

‘వంటయింది భోంచేద్దామా.”

ఆ రాత్రి రాజాహృదయంలో పెద్ద తుఫాను రేగింది. “ఈ అమ్మాయి ఇదివరకు నేను భావన స్వప్నాల్లో తిలకిస్తున్నంత చక్కంది కాదుకాని ఎందుకో నన్ను ఆకర్షించివేస్తున్నది..ఏమో గృహిణిగా ఉండటానికి ఈ చక్కదనం చాలదా ఏమిటి?…. ఐనా మనిషి నదకలో మంచి చక్కదనం ఉంది. మాటలు చాలా పొంకంగానూ, పొదుపుగానూ వాడుతుంది. వంట మహారుచిగా చేస్తుంది. సాయంత్రం చెవులకీ, ముక్కులకీ గూడా ఏమీ సొమ్ములు లేకుండా ఉంటే నిజంగా కళ్లల్లో కాంతి, చెంపల్లోవున్న స్నిగత్వమూ బయటబడ్డాయి. ఈ ఆడాళ్లంతా సొమ్ములూ, పూలూ, రంగు చీరలూ వదిలి పెడితేనేకాని అసలు అందమనేది వాళ్లలో కొంచమయినా ఉందా లేదా అనే విషయం తేలదు…. పెగా రాధకు నేనంటే ఎంతో ఇష్టంలాగా ఉన్నది. కాస్త బయటకి పోతే సరి. ఎంతోసేపయిందంటుంది. కృతజ్ఞతేమో.. కాకపోయినా కష్టాల్లో నుంచి తప్పించడానికి తీసుకువచ్చి ఇప్పుడిలా అనుకోవడం..?”

సగంరాత్రయింది; రాజాకు నిద్ర రాలేదు. రాధకు గూడా బహుశా నిద్ర రాకుండవచ్చు. లేచి రాధపడుకున్న వరండావైపు వెళ్లి చూచాడు.

రాధ నిర్విచారంగా నిద్రపోతూవున్నది. ఏ సుఖస్వప్పం చూస్తున్నదో ఏమో, పెదవుల్లో చిన్న మందహాసం, ముఖంలో సంతృప్తి, చెంపల్లో వికాసమూ తొలకాడుతూ వున్నాయి.

నిశ్శబ్దంగా రాజా తన గదిలో కెళ్లి పడుకొని ఆలోచనల్లో మునిగిపోయినాడు.

మర్నాడు సాయంత్రం రాధచేసిన క్యాబేజీ పకోడీలు ఫలహారంచేస్తూ రాజా “చూడాలని ఉంటే, ఇవ్వాళ నువుగూడా రా, రాధా! నిన్నటికొండ చూచి వద్దాము. చిన్న దేవాలయం కూడా ఒకటుంది అక్కడ, నీకు దేవుడు కావాలెనంటే” అన్నాడు.

ఇద్దరూ కాఫీ ముగించి బయలుదేరారు. ఆ ఎగుడుదిగుడు కొండరాళ్లను, రాధ కూడా అనాయాసంగానూ, ఉత్సాహంగానూ పమిట బిగించి ఎక్కుతూఉంటే రాజాకళ్లు, కొత్త ఆశల్తో నిండిపోతున్నాయి. రేగిపోతూ ఉన్న ఆమె జుట్టూ, జారిపోతున్న ఆమె పూలు, అలిసిపోతూ వున్న ఆమె ముఖమూ రాజా భావాలను తేలగొడుతూవున్నాయి. ఆమెతో ఎక్కలేక అడుగడక్కీ, తానే వెనకబడిపోతూవచ్చాడు.

ఇక పైకి పోలేక ఇద్దరూ పడమటి వైపున ఉన్న ఒక సమ ప్రదేశాన కూర్చున్నారు. అక్కడ నుంచి చూస్తూ చాలా దూరందాకా పరుచుకొన్ని వున్న వరిమళ్లు పచ్చీసు గళ్లలాగా కనిపిస్తున్నాయి. అక్కడక్కడ కాపువాళ్లు స్త్రీ పురుష భేదం లేకుండా కలిసి పాటలు పాడుకుంటూ పనిచేసుకుంటున్నారు. ఉండటానికి కొంచెం దూరంలోనే వున్నా పంటచెరువు చూడ్డానికి కొండ కిందనే ఉన్నట్లుంది నిర్మలంగా ఉండడంచేత రంగురంగుల పశ్చిమాకాశాన్నీ, అస్తమించబోతున్న రక్తసూర్యుణ్నీ ప్రతిఫలింపచేస్తున్నది. ఆ నిండుచేలల్లో గాలిపిల్లలు హృద్యంగా ఈలపాటలు పాడుతున్నాయి.

ఆయాసంచేత కొంచెం తీవ్రంగా వస్తూన్న నిశ్వాసాలతో రాధ “చాలా హాయిగా వున్నదండీ ఇక్కడ. మీరు చెప్పిన మాటల్ని బట్టి ఏదో భావకవులకేగాని నాలాటి వాళ్లకేమీ బాగుండదేమోననుకున్నాను. కాని తీరా వచ్చి ఆ దృశ్యాల్ని చూస్తుంటే చెప్పలేనంత తృప్తీ హాయీ కలుగుతూ ఉన్నాయి. ” అని సంభాషణ ప్రారంభించింది.

“నేనూ అలాగే అనుకున్నాను సుమండీ మొదట్లలో. ఆ తెల్లని మేఘాలన్నీ కరుళ్లుకట్టి పాలసముద్రం ఇదేనా

అనిపిస్తున్నాయి. ” అన్నాడు రాజా, రాధలో కూడా కొద్దిగా కళాపిపాస ఉన్నందుకు సంతృప్తిజెందుతూ.

ఐతే రాధా, మరి మీ వూరు వెళ్లడం ఎపుడూ”

వెళ్లాలి మరి త్వరగానే, డబ్బుకూడా అయిపోతున్నది

“వెళ్లితే మరి మీ వాళ్లు ఏమీ అనకుండా ఊరుకుంటారా?”

ఆ విషయం తలచుకోడానికే భయానకంగా ఉంది. కోప్పడుతారని నాకు పెద్ద భయంగా లేదుగాని మళ్లీ ఆ బండతనికే ఇచ్చే ప్రయత్నం చేస్తారని దిగులుగా ఉంది”

పాపం రాధకళ్లు మళ్లీ మొదటిరోజున లాగే దిగులుతో నిండిపోయాయి. రాజాహృదయం నీరయిపోయింది. తన రాధను వివాహం చేసుకుంటే ఇక చిక్కేమీ ఉండదు కాని తన మహదాశయాలన్నీనో;….. ఇంతకూ రాధ తన్నా ఉద్దేశంతో చూస్తున్నదో లేదో….?

ఆమె ఏ. ఐ.సి.యస్ ఆఫీసర్ని చేసుకుందామనుకుంటున్నదో!” రాధ తన హృదయ పరివర్తనాన్ని ఎంతవరకు కనిపెట్టుతున్నదో ఎమో గాని ముఖంలో మాత్రం ఏమీ కల్లోలం కనిపించడము లేదు.

చివరకు రాజా ధైర్యంచేసి గొంతు సవరించుకొని చెప్పడానికి ఉపక్రమించాడు. ” పోనీ రాధా! నీ కిష్టమైతే…. మీవాళ్లతో చెప్పి…. నేనే….మరి మన వివాహం… నీకిష్టమేనా..?

రాధ ఆకస్మికంగా ‘షాకు’ తగిలినట్టయి పోతుందనుకున్నాడు రాజా. కాని రాధ సామాన్యమైన ముఖంతోనే కొంచెం నిరాశకంఠంతో, “ఏం లాభం, మీకు మాత్రం వెయ్యీ, రెండువేలూ కట్నం మా వాళ్లెక్కడ నుంచి తీసుకురాగలరు…..?” అంది.

రాజా ఉద్వేగంతో కట్న మెవరిక్కావాలి, పిల్ల నాకు అన్ని విధాలా నచ్చాలి. నా కోళోపాసనకు తోడ్పడాలి అని గానీ,…. అసలు నీకు నేను తగినవాణ్ణేనో, కాదో….. చూసుకో…. ” అన్నాడు.

కళవళపాటేమిలేకుండానే రాధ స్థిరస్వరంతో “ఇప్పటికైనా మీకు నేను అర్హరాలినని తోస్తే…..?”

క్షణం ఆలస్యం చెయ్యకుండా రాజా ఆమెను వొళ్లోకి తీసుకున్నాడు. విజయగర్వంతో రాధ వణికిపోయింది. గుండెలు ఆగిపోతాయేమోన్నంత తీవ్రంగా కొట్టుకున్నాయి. కళ్లు ఉద్రేకబాష్పాలతో నిండిపోయినాయి. రెండుచేతుల్తో రాజా తలను తన హృదయంలో చేర్చుకొని’ కంఠాన్ని పెనేసుకపోయింది.

విజయధ్యజంలాగా పంచమిచంద్రరేఖ బయటికి వచ్చింది.

తేలికబడ్డ హృదయాలతో ఇద్దరూ కిందికి దిగి వచ్చారు.

ఆ మర్నాడు సాయంత్రం హైద్రబాదు స్టేషనులో, రాజా రాధతో గూడా దిగేటప్పటికి, ఎందుకొచ్చారో

తెలీదుగాని వాళ్ల వాళ్లంతా కనిపించారు. తన తండ్రి తమ్ముడూ ఇంకో పెద్దమనిషీ…

తెలుసు మేనమామే… మరో యువకుడూ… అవును మేనమామ కొడుకే… మరికొందరూ తమ పెట్టిదగ్గరకే వచ్చారు. తనకోసమేనేమో…..?

ఆశ్చర్యంతో చూస్తుండగానే ఆ మేనమామ దగ్గరకు వచ్చి, కొడుకు చేతుల్లోని చెంగేరీ’ అందుకొని, రెండుపూలహారాలు తీసి ఇద్దరిమెళ్ళో చెరొకటీ వేసి రాజాను గట్టిగా కావలించుకొని, “మారాజి ఇప్పటికి దారికి వచ్చావా?” అని, రాధను దగ్గిరకు తీసుకొని “ఇప్పటికి నిపట్టు నెగ్గించుకున్నా తల్లీ” అని బుజ్జగించి, “సరీగా ముహూర్తాని కందుకున్నారు” అన్నాడు.

రాజా విభ్రమంలో పడిపోయినాడు, “ఏమిటిది? తన మేనమామకూతురేనా! ఈ రాధ? ఈ రాధనేనా చిన్నప్పటి నుంచీ ఎంతమంది చెప్పినా చేసుకోనని కూచున్నది!! రాధ చేసిన పన్నాగమంతా అందరికి తెల్సిందేనా!! రాధ ఎంత మేధావి!! నిజంగా ఈ రాధే తన చేతినుంచి జారిపోయినట్టయితే.. తనంత నిర్భాగ్యుడు ఇంకోడుండడు!! విధాతకు కృతజ్ఞుణ్ణి”

రెండోనాటి సాయింత్రం రాజా వాకిట్లో ఈజీ చైర్లో కూచొని అభిలాంధ్ర కథక సమ్మేళనానికి పంపడానికి అఘటనాసంఘటితమైన తన వివాహాన్నే కథగా రాస్తున్నాడు.

రెండోనాటి సాయింత్రం రాజా వాకిట్లో ఈజీ చైర్లో కూచొని అభిలాంధ్ర కథక సమ్మేళనానికి పంపడానికి అఘటనాసంఘటితమైన తన వివాహాన్నే కథగా రాస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com