
భాంగ్య భూక్య రచించిన History of Modern Telangana పుస్తకం, కొత్త రాష్ట్రమైన తెలంగాణ యొక్క గతాన్ని అన్వేషిస్తుంది. ఇది పద్దెనిమిదవ శతాబ్దంలో అసఫ్ జాహి పాలన స్థాపించబడినప్పటి నుండి జూన్ 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు తెలంగాణ చరిత్రను వివరిస్తుంది. ప్రధానంగా ఈ ప్రాంతంలో జరిగిన సామాజిక-ఆర్థిక మరియు రాజకీయ పరిణామాలను ఈ పుస్తకంలో వివరించారు.
తెలంగాణ ప్రాంతం శతాబ్దాలుగా ప్రత్యేకమైన సంస్కృతిని మరియు స్వంత చరిత్రను కలిగి ఉంది. తెలంగాణ ప్రాంతంలో జరిగిన వివిధ ప్రజా ఉద్యమాలను సైతం ఈ పుస్తకంలో వివరించారు.

వినోద్ రాయ్ మరియు డా.అమితెండు పాలిత్ రచించిన Seven Decades of Independent India పుస్తకం భారతదేశం యొక్క నిన్న, నేడు, రేపు అనే అంశాలను ప్రతిబింబిస్తుంది. దేశంలోని విశిష్టమైన వ్యక్తులు, నిపుణుల నుండి అరుదైన విషయాలు, వివిధ అంశాలను సేకరించి ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఈ పుస్తకం నిన్న, ఈ రోజు, మరియు రేపు భారతదేశంపై ప్రతిబింబిస్తుంది.
భారతదేశంలో ప్రజాస్వామ్యం తన ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిందా? రాజ్యంగ సంస్థలు సరైన దిశలో పనిచేస్తున్నాయా? దేశం ఆర్థిక శక్తి కేంద్రంగా మారుతుందా? వంటి ప్రశ్నలకు ఈ పుస్తకం సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది.

ఇటీవల ముగిసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్, ఆ దేశ 46 వ అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. జెస్సిమైన్ కాన్రాడ్ రాసిన What You Should Know About Politics . . . But Don’t పుస్తకం, అమెరికన్ రాజకీయాల ప్రపంచం గురించి లోతైన అవగాహన పొందడానికి సహాయపడుతుంది.
హోరెత్తించే ప్రచారాలు, అసత్యాలు, నీలం, ఎరుపు గా విడిపోయిన రాజకీయ చిత్రపటంలో…సగటు అమెరికా విద్యావంతుడు, రాజకీయాలకు అతీతమైన, నమ్మకమైన శిబిరాన్ని ఎలా ఎన్నుకుంటాడు..? ఇలాంటి అంశాలను ఈ పుస్తకంలో క్షుణ్ణంగా వివరించారు.

మాజీ జర్నలిస్ట్-స్క్రీన్ రైటర్ పీటర్ మే, 15 సంవత్సరాల క్రితం 2005 లో ‘లాక్ డౌన్’ అనే క్రైమ్ థ్రిల్లర్ రాశారు. ఈ పుస్తకంలో, లండన్ కేంద్రంగా సంక్రమించిన ఒక ప్రాణాంతక వ్యాధి, త్వరితగతిన ప్రపంచమంతా వ్యాపించింది. ఈ వ్యాధిని అరికట్టడానికి ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధిస్తాయి.
అయితే ఈ పుస్తకం “అవాస్తవికమైనది” అంటూ 2005 లో ప్రచురణకు నోచుకోక, తిరస్కరించబడింది. కానీ ఇప్పుడు మనం కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నందు వల్ల, 2005 లో పీటర్ మే రాసిన ‘లాక్ డౌన్’ చివరకు 2020 లో ప్రచురించబడింది.