కవి లేక సాహితీ వేత్త మనోమైదానం మీద చదును చేసి పొంకంగా పూయించిన పూల తోట సాహిత్యం .అది కవిత కావచ్చు .కథ కావచ్చు .నవలైనా కావచ్చు .

కారణం ఒక సాహిత్య ప్రక్రియ ఎలా రూపు దిద్దుకొంటుంది ?సాహిత్యం ఇన్ని ప్రక్రియలు గా ఎందుకు రూపం ధరిస్తుంది ?దీనికి కవి ఎన్నుకునే వస్తువే .సమాంతర సామాజిక చిత్రణ కోసం సృజన కారుడు ఒక విశాల మైన అవనిక ను ఆవిష్కరిస్తే అది నవల గా రూపం ధరిస్తుంది .నవల అనేది వాస్తవాన్ని సమాంతరం గా ప్రతిబింబించే ఒక సామాజిక ఇతి వృత్తం .ఇదే విషయం నిడివి చాలా చిన్నది చేసి చెప్పాలనుకుంటే అది కథ గా రూపం ధరిస్తుంది .కథ చాలా సార్లు ఒక సంఘటనను కూడా చిత్రిస్తుంది .ఇదే ఇతివృత్తానికి సంబంధించిన అంశాన్ని కాక దాని సారాన్ని లేక దానిద్వారా కలిగిన అనుభూతి ని ప్రకటిస్తే అది కవిత అవుతుంది

కవిత లో మళ్ళీ ఎన్నో విభాగాలున్నాయి .పద్యం, గేయం, కవిత ,లాంటి అనేక విభాగాలు ,ఆయా సందర్భాలకు సామాజిక పరిస్థితులకు అనుగుణం గా ప్రక్రియా రూపధారణ జరుగుతుంది .ఒకపుడు రాజరిక సమాజం ఉన్న కాలం లో పద్యం రాజ్యం చేసింది .పద్యం ప్రధానం గా ఇతివృత్తాన్ని ఆశ్రయించేది . .అంతకంటే మొదలు సమాజం జానపదాలు గా ఉన్న కాలం లో గేయమే కవిత్వ రూపం. .కవిత్వం లోని ఇతివృత్తం నవలలోకి కథ లోకి వెళ్ళిపోయాక ,దానితోపాటు రాచరిక వ్యవస్థ స్థానం లో ప్రజాస్వామ్యం వచ్చాక అనుభూతే ప్రధానం గా వచన కవిత్వం తల ఎత్తింది. ప్రజాస్వామ్య యుగం లో ప్రజలే ప్రభువులు .ప్రజల కష్టాలే కవి సృష్టించే రూపాలు . ఈ విధం గా వచన కవిత్వం అడుగు పెట్టింది కాగా గేయం పాటగా జనాన్ని ఉర్రూత లూగిస్తే పద్యం కూడా తన పూర్వ రూపం మార్చుకొంటున్నది.

ఆధునిక సాహితీవేత్త తాత్విక భూమిక చాలా విస్త్రుతమైనది .ఏ ఒక్క అంశాన్ని సృశించి వదిలేసేది కాదు .డార్విన్ ,మార్క్స్ ,ప్రాయిడ్,సార్త్రే లాంటి తత్వవేత్త లెందరి ప్రభావమో ఆధునిక సాహిత్యం మీద ఉన్నది .ప్రెంచి విప్లవం ,రష్యా పరిణామాలు ,భారత జాతీయోద్యమం ,ప్రపంచీకరణ ఫలితాలు ,నిన్న మొన్నటి తెలంగాణ ఉద్యమమం లాంటి ఎన్నో చారిత్రక పరిణామాలు ఈ నాటి సృజన వెనుక ఉన్నాయి .

తంగేడు ఇలాంటి అన్ని రూపాలకు ప్రాతినిధ్యం వహించాలని ప్రయత్నం చేస్తున్నది .పరిశోధకులకు నాటి, నేటి, కవిత ,కథ రూపాలు దాని వెనుక సామాజిక స్థితి గతులు అవగాహనకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నది .

తంగేడు వీటితో పాటు త్వరలో ఈ పేపర్ ప్రారంభిస్తున్నది .
తెలంగాణా లోని సాహిత్య పరిణామాల హేతు బద్దత ప్రపంచం ముందు పెడుతున్నది .
ఇది ఫలవంతం కావడం సహృదయుల ఆదరణ మీద ఆధార పడి ఉంటుంది .
బంగారు తెలంగాణాను కలగన్నట్టే ,దానికి ప్రతిబింబమైన బంగారు సాహిత్య సమాజాన్ని కలగందాం ,ఆవిష్కరించుకుందాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com