నాటి తరం సహృదయ సాహిత్యాన్ని చిత్రిస్తూ….

తెలంగాణ కవులలో కవిరాయలు, కవి భూషణ బిరుదాంకితులు గుండి ప్రాంత నివాసి వెల్చాల కేశవరావు గారు. ఒడ్డూ పొడువూ హుందాతనంతో పాటు,మనసున్న మనీషి 1908 లో జన్మించిన వీరు పెత్తండ్రికి దత్తుగా గుండి గ్రామానికి వెళ్ళినా,జన్మస్థలం కురిక్యాల. ఈ ఊరికి దగ్గరగా శిలాఫలకంపై జైన శాసనమున్నది. అరి కేసరి ప్రభువు పంపమహాకవి తమ్ముడైన జినమల్లునికి ఈ ప్రాంతాన్ని దానమిచ్చినట్లు అక్కడి జనులు చెప్పగా కేశవరావు చిన్నతనంలోనే తెలుసుకున్నాడు. అప్పటి నుండి భారత భాగవతాలు శ్రద్ధతో చదివారు. ఉర్దూ ఆంగ్ల భాషలు నేర్చుకున్నారు. అమరం కంఠస్థం చేసారు.

పెరిగి పెద్దయ్యాక గ్రామ సర్పంచ్ గా గ్రామాభివృద్ధికై శ్రమించారు. ఆధునిక భావాలున్న ఆయన అనేక సత్కార్యాలు చేశారు. బాధ్యత గల పదవులు నిర్వహించి అధికారుల ప్రశంసలందుకున్నారు. సారస్వత పరిషత్ పరీక్షలు గుండీలో నిర్వహించారు. ధనం సంపాదించటమే కాదు, పాత్రోచితంగా దానమివ్వాలనే వారు. ఊహాలోకం గేయ సంకలనం, మిత్రనీతి శతకం(కంద పద్యాలతో) “నేను నా జ్ఞాపకాలు- వారి కుటుంబ జీవితం” వంశవృక్షం రచించారు. వీరి రచనల్లో పాండిత్యంతో పాటు, సామాజిక దృష్టి ఉన్నది. ఆత్మపరిశీలన, విమర్శ, సంస్కరణ కనిపిస్తాయి. వాస్తవికత, మానవతావాద దృక్పథం వారిది.

మంచితనం. ఎవరిని ఎక్కువగా పొగడని కవి సమ్రాట్టు విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన రచించిన “కేదార గౌళ” కృతిని వీరికి అంకితమిస్తూ యిలా అన్నారు.

వెలమ వారిలోన వెల్చాల కేశవ

రావనగ నొక యుమరావు కలడు

చదువు కవిత సరియు సంపతి కలవాడు

ఈ కరీంనగరపుటరుగులందు అని ప్రశంసిచారు. జంట కవులైన శేషాద్రి రమణ కవులలో ఒకరైన దూపాటి వేంకట రమణా చార్యులు.

చవిచూచి నాడవు సరస్వతీ

సా హిత్య సంపూర్ణ సౌష్టవంబు అని

వెల్చాల వారినిలా కొనియాడారు. వీరేకాక ప్రజాకవి చెన్నుపల్లి సుబ్బారావు, దప్పూరి సత్యనారాయణాచార్య, గర్రెపల్లి సత్యం ‘శ్రీ వెల్చాలాన్వయాపారావీర సుధాకరా! ధీనిధీ కేశవరాయా!’ అని అభివర్ణించారు.

కవి పండితులకు కరీంనగర్ జిల్లా పెట్టింది పేరు. నాటి నుండి నేటి వరకు సారస్వత జ్యోతి మిత్రమండలి పేర ఒక సంస్థను స్థాపించి, కవి సమ్మేళనాలు, కవితా గోష్టులు, పుస్తకావిష్కరణలు జరుతుంటాయి. ఆ కార్యక్రమాలన్నీ కరీంనగర్ గాంధీగా పిలువబడే శ్రీ బోయినపల్లి వేంకటరామారావు గారు చూసుకునే వారు. ఒకసారి కవి సమ్మేళన వార్షిక సమావేశానికి శ్రీ కేశవరావు గారు అధ్యక్షులు. అప్పటికే కరీంనగర్ గ్రంథాలయ వారోత్సవాలు, సాహిత్య సభలు, స్వాతంత్ర్య సమర యోధుల సభలు, కమ్యూనిష్టు సభలు ఘనంగా జరిగేవి. సభలకు జనులు చాలా మంది వచ్చేవారు. వక్తలు చెప్పిన విషయాలు శ్రద్ధగా వినేవారు. రజాకార్ల ఊచకోతలు, నిజాం నిరంకుశ పరిపాలన గురించి సభల్లో ప్రసంగించటమే కాక, విజ్ఞాన ప్రచురుణ గ్రంథమాల ద్వారా జ్యోతి, జయంతి పత్రికల ద్వారా ప్రచురించి ఆవిష్కారం చేశారు.

ఆ సభల్లో కొన్నింటిలో వక్తగా, మరికొన్నింటిలో శ్రోతగా శ్రీ కేశవరావు గారు పాల్గొనేవారు. తెలంగాణ ప్రాంతపు గుళ్ళు, కోటలు వాటి పూర్వవైభవం, ప్రాచీన రాజు లేలిన పట్టణ ప్రాంతాలు, పురాతన చరిత్రాంశాలు, నాణాలు, శాసనాలు వాటి వాటి జాడలు, ఆ ప్రాంతాల్లో జరిగే పండుగలు, ఉత్సవాలు, ఊరేగింపులు అవకాశమిచ్చినప్పుడల్లా సవివరంగా విన్పించేవారు. అంతేకాక, పేద పండితులను వెదికి వారి వారి అడ్రసులు కనుక్కోని, వారి పూర్వీకులు వ్రాసి పెట్టుకున్న వ్రాతులను, తాళపత్ర గ్రంధాలను పరిశీలించి, ప్రచురణల కవసరమయ్యే ధనమిచ్చిన దాత. ఆయన యిచ్చిన గుప్తదానాలెన్నో తీసుకున్నవారికే ఎరుక. ఆయన యిచ్చిన వెంటనే మార్చేవారు.

మనకు తెలిసిన ప్రాచీన వైభవం, చరిత్ర చాలా తక్కువని తెలుసుకున్నది గోరంత, తెలుసుకోవలసింది కొండంతని ప్రతి సభలో పదే పదే చప్పేవారు. ఉత్సాహవంతమైన యువకులు ఓర్పుతో, నేర్పుతో వెదికి తెలుసుకోవాలనే వారు. యువకుడు నిత్య పరిశోధకుడు కావాలని, రాబోయే తరాలకు పరిశోధనాంశాలు అందించగల బాధ్యత మనందరిని నొక్కి వాక్కాణించేవారు.

పరాయి రాష్ట్రాల్లో, ప్రక్క ప్రాంతాల్లో జరుగుతున్న విషయ సేకరణ మన తెలంగాణలో జరుగుట లేదని బాధను వ్యక్తం చేసేవారు. స్వంత లాభం కొంతమానిక , మీమీ ప్రాంతాల్లో పడిపోతున్న దేవాలయాలు, కుడ్యాల మీది చిత్రాలు శాసనాలు, శిల్పకళలు, గుహలు కనివిని ఎరిగిన కవులు ప్రచురణ కాక, ప్రజల నాల్కల మీద నున్న మౌఖిక సాహిత్యం, పూర్వకవుల రచనలు చిరిగి పోతున్న, చెదలు పడుతున్న సాహిత్యం సేకరించాలనేవారు. ఏయే రాజులు, ప్రభువులు, ప్రజాహితకార్యాలు చేసిన ధనవంతులు వారు తవ్వించిన చెరువులు, కట్టించిన సత్రాలు,విద్యాదాతలు, అన్నదాతలు ఏయే ప్రాంతాల్లో ఉండేవారో వారిని స్మరించి, ముందు తరాల కందించాల్సిన బాధ్యత మనందరిని వెతికి వెలికితీసి పత్రికల ద్వారా ప్రకటించాలని ప్రబోధించేవారు.

ప్రతి పనికి పైసా అవసరమని పైకం లేదని పనులు కావని యువకులు తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవిస్తారు కనుక జీత బత్యాలు లేనివారికి ధనవంతులు ఈ సర్వేకు కొంత డబ్బు సాయం చేయాలని సూచించేవారు. విద్యార్థుల సెలవులు చాలా విలువైనవి. హాయిగా తిని పడుకోక బంధువుల ఇళ్ళకే, మిత్రుల యిళ్ళకో వెళ్ళినపుడు ఆ ప్రాంతానికా పేరెలా వచ్చింది. అక్కడ పుట్టి పెరిగిన గొప్ప వ్యక్తులు, పరిపాలించిన ప్రభువులు వారు కట్టించిన గుళ్ళు గోపురాలు ఒక డైరీలో తప్పక నోట్ చేసుకోవాలనేవారు.

ఆడపిల్లలకు ఆటపాటల గురించి, పండుగలు, ప్రసాదాలు వంటలు వారి కట్టు బొట్టు, ఆచార వ్యవహారాలు తెలుసుకోవాలని, మగవారితో సమానంగా మీరు అన్ని రంగాల్లో రాణించాలనీ వారికి ధీటుగా మీరు అనేక విషయ సేకరణ చేయగలరు. మీరు మాత్రమే చేయగల పనులు కొని ఉన్నవి. మన ప్రాంతాల్లో స్త్రీలు పాడుకునే పాటలు వ్రతాలు, నోములు పండుగలు వాటి పరమార్థాము, ఆడపిల్లలాడుకునే ఆటలు వేసవి కాలం యింట్లో ఉండి ఆడుకునే కచ్చకాయలు, చింతపిక్కలాట, ఓమన గుంటలు వీటి ద్వారా వివేకం చేకూరుతాయని చెప్పేవారు.

స్త్రీ విద్య గురించి విరేశలింగం గారి సంస్కరణలు, దయానందుని సత్యార్థ ప్రవచనాలు, రామకృష్ణ, వివేకానందుల రచనలు, అరవిందుల, రమణ మహర్షుల బోధనలు త్రిపురనేని విమర్శలు క్షుణ్ణంగా చదివి అవగాహన చేసుకోవాలనే వారు.

అవకాశము దొరికినప్పుడల్లా శరత్ చంద్ర రచనలు నార్ల, గోరా, సహేతుక నడవడి న్యాయమూర్తి ఆవుల సాంబశివరావు గారి మాటలు వార్తల్లో చదివి రేడియోల్లో విని సభల్లో సవివరంగా వివరించేవారు. క్రొత్త పుస్తకాలు ఏవి వచ్చినా హైదరాబాదు వెళ్ళి వచ్చేవారితో కొని తెప్పించుకునేవారు. పేపర్లో కాని, మ్యాగజైన్ లో కాని, పుస్తక సమీక్షలు చదివి స్పందించేవారు. వెయిల రూపాయలతో పుస్తకాలు తెప్పించేవారు.

విషయ సేకరణ, ముద్రణ ఒక్కరితో జరిగే పని కాదని, రచయితలంతా ఏకమై మెంబర్ షిప్ ఫీజు సేకరించి, సహకార సంఘ సంస్థాపకులై ప్రాచీన రచనలు సేకరించి, సవరించి, ముద్రించాలని విదేశీయులైన బ్రౌను తెలుగు భాషకు చేసిన సేవ ప్రతి తెలుగువాడు చేయాలన్నాడు. ప్రతి విద్యార్థి విధిగా నియమావళి తయారు చేసుకొని పండుగ సెలవుల్లో అమ్మమ్మ నాయనమ్మ యిళ్ళకు వెళ్తే సమయం వృధా చేయక కొంత సమయం వారికి కేటాయించి పూర్వీకుల చరిత్ర తెలుసుకోవాలి. ముసలి వాళ్ళ దగ్గర 3 తరాల విషయాలుంటాయి. అన్నీ పుస్తకాల్లో దొరుకుతాయనుకోకూడదు.మారుమూల ప్రాంతాల్లో మౌఖిక సాహిత్యమెంతో ఉన్నది. ఈ రోజుల్లో కెమెరాలు, టేపు రికార్డులు మొదలైన వస్తువులు చాలా ఉన్నాయి. 4 జతల బట్టలు కొనుట మాని, వీటిని కొని వాటిలో నిక్షిప్తం చేయాలి. వృద్ధులకు మతిమరుపు రాకముందే సేకరించాలి. కాని వారెక్కడ పోతార్లే మరోసారి అని వాయిదా వేయకూడదు. వీరిక ఓపిక తగ్గవచ్చు, మాటపడిపోవచ్చు. అందుకే మౌఖిక సాహిత్యం వెంటనే సేకరించాలి.

పేద సోదర కవుల నాదుకోవాలి. రాసి పెట్టుకున్న రచనలు అచ్చు వేయించుకోలేక పోవచ్చు. ధనవంతులు కృతి భర్తలు కావాలి. అక్షరం క్షరం లేనిది. ధనం శాశ్వతం కాదు. కాని కృతి ఉన్నంత కాలం కృతికర్త, కృతిభర్త పేరుంటుంది. కనుక, పుస్తక ప్రచురణకు సాయం చేయాలనే వారు. ఆసక్తి గల విద్యార్థులు, పేద విద్యార్థులు విరామ సమయాల్లో గ్రామనామాల, ఇళ్ళ నామాల పేర్లు, పలు ప్రాంతాల్లో నివసించే కవి కాలం, రచనలు సేకరించే కార్యక్రమం ఉద్యమంలా సాగాలి. ఇది నిరంతర వాషిని. పాత నీరు వెనుక క్రొత్త నీరు వచ్చినట్లు కొత్త కవులు, క్రొత్ర ప్రక్రియలు వస్తుంటాయి. కనుక ఇది సర్వకాలీనం, సర్వజనీన మనేవారు కేశవరావు గారు.

ఇవే కాక, ప్రజల నాల్కల పైన ఉన్న తెలంగాణ పదాలు, శాతవాహనుల కాలంలోని హాయిని సంకలన ప్రాకృత గ్రంథం గాథా సప్తశతి లోని అనేక వాడుక భాషా పదాలు సేకరించాలి. కరీంనగర్ మండలములోని ధూళికట్ట కోటిలింగాల ప్రాంతాల శాతవాహన సామ్రాజ్య చారిత్రక విశేషాలెన్నో ఉన్నాయి. ఈ ప్రాంతంలో గోదావరి, మానేరు నది పరిసర ప్రాంతాల్లో ఆదిమ, అనంతర కాలాల రాతియుగ మానవులు నివాసమున్నట్లు తవ్వకాలలో లభించిన రాతి పనిముట్లు సాక్ష్యమిస్తున్నవి. కైరాన్యు, బృహచ్ఛిలా సమాధు అక్కడ ఉన్నాయి.

శాతవాహన, వాకాటిక, చాళుక్య, యాదవ, రాష్ట్రకూట, రేచెర్ల, పద్మనాయిక, కాకతీయ, మహ్మదీయ ప్రభువుల పాలన చవిచూసి నదీ ప్రాంతం. మతాలలో ఆటవిక, శైవ శ్రీ వైష్ణవ, జైన, బౌద్ధ, వీరశైవ, అద్వైత, ఇస్లామీ బ్రహ్మ సమాజ, ఆర్య సమాజ, నాస్తికాలు చోటుచేసుకున్నాయి. తెలంగాణలో తెలుగు, కన్నడ, సంస్కృతం, ఉర్దూ, తమిళం, హిందీ, ఇంగ్లీషు వాడుకలో ఉన్నాయి.

వెయ్యేళ్ళ నాటి చరిత్ర ఉన్న ఈ ప్రాంతాన్ని అనేక కోణాల నుండి ఉత్సాహవంతులైన యువకులు పరిశీలించాలి. దాదాపు 30,000 ఆర్థిక సహాయమందించి శ్రీ మలయ శ్రీ చేత 1981 లో కరీలినగర్ జిల్లా రచయితల చరిత్ర అచ్చు వేయించిన దీక్షాపరులు శ్రీ వెల్చాల కేశవ రావు గారు. అదే విషయం మీద ఆసక్తితో 1990-95 కాలంలో కరీంనగర్ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర పేరుతో మలయ శ్రీ గారి పరిశోధన గ్రంధానికి నాంది అయింది సేకరణే.

భావి తరాల కనేక విషయంల నందించాలనే ఆలోచన చేసిన శ్రీ వెల్చాల కేశవరావు గారు ముందు తరాలకు ప్రాత:స్మరణీయులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com