2016 నోబెల్ సాహిత్య పురస్కారం బాబ్‌ డైలాన్‌

అమెరికా గేయ రచయిత బాబ్‌ డైలాన్‌ కు 2016లో సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతి లభించింది. సాహిత్యవిప్లవకారుడు, ప్రజా వాగ్గేయకారుడు, రచయిత అయిన బాబ్‌ డైలాన్‌, అమెరికా గేయ సంప్రదాయంలో కొత్త కవితా భావజాలాన్ని రూపొందించినందుకు గానూ ఈ పురస్కారం దక్కింది. బాబ్ రచించిన బ్లోయింగ్ ఇన్ ది విండ్, ది టైమ్స్ దే ఆర్ ఎ-చేంజింగ్ గేయాలు అమెరికా పౌర హక్కులు, యుద్ధ వ్యతిరేక ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చే గీతాలుగా మారాయి. ‘బ్లోయింగ్‌ ఇన్‌ ద విండ్‌’ కవితలో యుద్ధ వ్యతిరేకతను, మానవ సంక్షోభాన్నీ, వేదననూ అద్భుతంగా ప్రతిఫలిస్తాడు. ఆయన పాటల్లో మౌఖిక జానపద సాంప్రదాయంలోని ఒక క్రమశిక్షణ, కఠినమైన కూర్పు ఉంటాయి.

భల్‌చంద్ర నెమడే.. జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీత 2014

ప్రముఖ మరాఠీ సాహితీ వేత్త భల్‌చంద్ర నెమడే, 50వ జ్ఞాన్ పీఠ్ అవార్డుకు ఎంపికయ్యారు. భల్‌చంద్ర నెమడే నవల ‘కోసల’ కు గాను, జ్ఞాన్ పీఠ్ అవార్డు లభించింది. 1963లో ప్రచురితమైన ‘కోసల’ మరాఠీ సాహిత్యంలో కొత్త ఒరవడిని సృష్టించింది. భల్‌చంద్ర నెమడే 2010 లో రచించిన Hindu: Jaganyachi Samruddha నవల మంచి ఆదరణ పొందింది. 1938 లో జన్మించిన భల్‌చంద్ర నెమడే, తన 25 ఏండ్ల వయసులోనే ‘కోసల’ ను రచించారు. హూల్, బిదార్, జరీలా, ఝూల్ వంటివి భల్‌చంద్ర నెమడే ప్రముఖ రచనలు. నెమడే 1991 లో సాహిత్య అకాడమీ అవార్డును, 2011 లో పద్మ శ్రీ అవార్డును పొందాడు.

పుస్తక సమీక్ష Sebastian and Sons: A Brief History of Mrdangam Makers

మృదంగం..సంగీతం కోసం వాడే పరికరాల్లో పేరుగాంచింది. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కర్ణాటక వంటి రాష్ట్రాల్లో మృదంగం ,సాంప్రదాయ సంగీత వాయిద్యంగా ప్రముఖంగా ఉపయోగిస్తారు. అయితే మృదంగం పరికరం తయారీ వెనకున్న పూర్తి వివరాలను Sebastian and Sons: A Brief History of Mrdangam Makers పుస్తకంలో వివరించారు రచయిత టీ.ఎం కృష్ణ. ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన రచయిత, మృదంగం గురించి ప్రపంచానికి తెలియని అనేక అంశాలను సేకరించారు. మృదంగం పరికరం తయారుచేసే విధానం, వ్యక్తులు, కళాత్మక నైపుణ్యాలు వంటి అనేక విషయాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు.

పుస్తక సమీక్ష Khaki in Dust Storm

ప్రజలకు రక్షణ కల్పించడంలో, శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసుల పాత్ర కీలకం. పోలీసులు వృత్తి నిర్వహణలో ఎదురయ్యే అనేక సవాళ్లు, బాధ్యతలను Khaki in Dust Storm పుస్తకం ద్వారా పాఠకులతో పంచుకున్నారు రిటర్డ్ ఐపీఎస్ అధికారి అమోద్ కె.కాంత్. 1980, 90 దశకంలో ఢిల్లీలో వివిధ స్థాయిల్లో విధులు నిర్వర్తించిన అమోద్ కె.కాంత్, తాను చూసిన, పాల్గొన్న అనేక భద్రతా పరమైన సంఘటనలను ఇందులో వివరించారు. ఖలిస్థాన్ ఉద్యమం, ప్రధానిగా ఇందిరాగాంధీ హత్య అనంతరం జరిగిన అల్లర్లు వంటి కీలక సంఘటనలను పోలీసులు ఎలా పరిష్కరించారు అనే అంశాలను ఆసక్తికరంగా వివరించారు. అంతే కాకుండా విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లు, పై స్థాయి నుండి వచ్చేఒత్తిళ్లు వంటివి కూడా ఈ పుస్తకంలో వివరించారు.

పుస్తక సమీక్ష Red Fear: The China Threat

భారత్- చైనా.. ప్ర‌పంచంలోనే అత్యధిక‌ జ‌నాభా గ‌ల రెండు దేశాలు. అంతేకాదు ఆసియాలో అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థ గల దేశాలు. అయితే భారత్- చైనా సరిహద్దుల్లో ఘర్షణలు జరగటం ఈ మధ్య తరచుగా వింటున్నాం. క‌శ్మీర్‌లోని ల‌ద్దాఖ్‌‌లో వివాదాస్ప‌ద ప్రాంత‌మైన గాల్వాన్ లోయ‌లో ఇటీవల భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన సంఘర్షణ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనను రేకెత్తించింది. భారత్, చైనా ల మధ్య15 వ శతాబ్దం నుండి 21 వ శతాబ్దం వరకు సాగుతున్న సరిహద్దు సంఘర్షణలను, వాటి చరిత్రను Red Fear: The China Threat పుస్తకంలో వివరించారు రచయిత ఇఖ్బాల్ చంద్ మల్హోత్ర. చైనా నుండి భారతదేశానికి పొంచి ఉన్న ముప్పును, ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లు, పలు సైనిక, రాజకీయపరమైన అంశాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు.

పుస్తక సమీక్ష The Commonwealth of Cricket

ప్రముఖ చరిత్రకారుడు, భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) క్రికెట్‌ పాలక కమిటీ (సీఓఏ) మాజీ సభ్యుడు, రామచంద్ర గుహ రచించిన తాజా పుస్తకం The Commonwealth of Cricket. పాఠశాల స్థాయి నుండి జాతీయ స్థాయి దాకా…భారత్‌లోని అన్ని స్థాయిల క్రికెట్‌ గురించి ఇందులో వివరించారు. ఒక ఆటగాడిగా, అభిమానిగా, రచయితగా, క్రికెట్‌ పరిపాలకుడిగా దశాబ్దాలుగా ఈ క్రీడతో ఉన్న అనుబంధంతో ఈ పుస్తకాన్ని రచించారు రామచంద్ర గుహ. టెస్టులు, వన్డేలు, టీ ట్వంటీ…ఇలా మూడూ ఫార్మాట్లలో టెస్టు క్రికెట్ కు ఉన్న ప్రాధాన్యతను ఇందులో పొందుపరిచారు. భారత క్రికెట్ లో జరుగుతున్న పలు వివాదాస్పద అంశాలను సైతం ఇందులో ఆసక్తికరంగా వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com