ఎంత పెద్దదానివైపోయావు

ఎంత అందంగా వున్నావు

అంటూ ఉక్కిరిబిక్కిరి చేస్తూ తన రెండు చేతుల మధ్య పొదువుకొని ఇక ఆ పెళ్ళి అయిపోయేదాక వదిలింటే ఒట్టు.

నాకు సంతోషంతో పాటు ఎంత ఏడుపు వచ్చిందో..

ఈ స్పర్శ ఈ ఆత్మీయ పరిమళం నన్ను వదిలి వెళ్ళి ఎన్ని రోజులు అయ్యింది. తిరిగి మళ్ళీ ఇన్ని రోజులకు ఆ స్పర్శ, ఆ అనుభూతి.

అప్రయత్నంగానే ఆపుకున్నా ఆగని కన్నీళ్ళు మా ఇద్దరి కళ్లల్లో..

మాట ఎంత మెత్తనో

మనసు అంతే సున్నితం

మా అనూషక్కకు.

అక్క నా చిన్నప్పుడు నన్ను ఎంత ప్రేమగా చూసుకునేదో

అందుకే మా అనూషక్కంటే నాకు ఎంతిష్టమో..

అనూషక్క మాకు దాయాది అయిన పెదనాన్న కూతురు.

అక్కా వాళ్ళు నాకు ఊహ తెలిసే వరకు మా వూరిలో లేరు.

వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో వుండేవాళ్ళు.

పెద్దనాన్న గుండెపోటుతో చనిపోయాక పెద్దమ్మ పుట్టింటిలోనే వుండిపోయింది.

అనూషక్కకు ఒక తమ్ముడు వున్నాడు పేరు వినయ్, నా కన్నా ఒక సంవత్సరం పెద్దవాడు. ఇద్దరం ఒకే తరగతి కాబట్టి నేను వినయ్ అనే పిలిచేదాన్ని. ఇద్దరూ ఇద్దరే అక్కా తమ్ముడు ఎంతో సున్నిత మనస్కులు. అందుకే మా వూరిలో అందరికన్నా నాకు వాళ్ళిద్దరంటేనే ఇష్టం.

అనూషక్క వాళ్ళ పెద్దనాన్న వీళ్ళ పొలం పండించుకుంటా సరైన గుత్త ఇచ్చేవాడు కాదు. అందుకే పెద్దమ్మ పిల్లలు పెద్దగవుతున్నారు డబ్బు అవసరం వుంటుందని తిరిగి మా వూరికి వచ్చింది అనూషక్కను,వినయ్ ని తీసుకొని.

తిరిగి మా వూరికి రావడమైతే వచ్చారు కానీ పాపం వాళ్ళ పరిస్థితి దారుణం.

వాళ్ళు వుండటానికి సరైన ఇల్లు కూడా లేదు.

అనూషక్క వాళ్ళ పెద్దనాన్న చాలా కఠినాత్ముడు, దుర్మార్గుడు.

తిరిగి వాళ్ళ ఆస్తికి వాళ్ళు వచ్చారని కడుపు మంట. వాళ్ళ బాగానికని ఒక పాతబడిన ఇల్లు ఇచ్చాడు. వాళ్ళ ఇల్లు మా ఇంటికి వెనక వుండేది. అప్పుడు ఆ ఇంట్లో కరెంటు కూడా లేదు. ఇంటి ముందు పాతబడిన ఇల్లులు మొండి గోడలతో,ముళ్ల చెట్లతో నిర్మానుష్యంగా భీతొరిసేది. రాత్రి అయితే కీచురాళ్ళ అరుపులు. వాళ్ళు ఆ ఇంట్లో ఎలా వుంటున్నారని బాధనిపించేది నాకు.

వాళ్ళు అలా ఇబ్బంది పడటం చూడలేక నాన్న మా ఇంట్లో నుంచి కరెంటు కనెక్షన్ ఇప్పించాడు. అప్పుడు అనూషక్క, వినయ్ ఎంత సంతోషించారో.. నాకు ఇప్పటికి గుర్తు. అప్పటి నుండి అనూషక్కకు వినయ్ కి మా మీద మరింత ప్రేమ పెరిగింది. అప్పుడప్పుడు అమ్మా నాన్న కాస్తంత మంచి చెడు చూసేవాళ్ళు మగతోడు లేని వాళ్ళని. అనూషక్క ఎన్నో సార్లు అనేది, చిన్నమ్మ చిన్నాన్న లేకపోతే మేము ఏమైపోయేవాళ్ళమని.. అప్పుడు నాకు ఏమి చెప్పాలో కూడా తెలిసేది కాదు. కానీ మనసు మాత్రం తడితడిగా అయ్యేది.

కొద్ది రోజులు తర్వాత ఇక ఆ ఇంట్లో వుండలేక అక్కా వాళ్ళు మా వూరిలోనే కొంచెం దూరంలో వాళ్ళ దగ్గర బంధువుల ఇంటి దగ్గర ఇల్లు తీసుకొని ఆ ఇంట్లోకి మారి పోయారు.

ఆ ఇల్లు నాకు చాలా నచ్చేది. కల్లంలో ఇల్లు అవటం వల్ల చుట్టూ చెట్లతో ఎంతో ఆహ్లాదంగా వుండేది. ఆ ఇంటికి వెళ్ళాక అక్కా వాళ్ళు ఇంకా చాలా మొక్కలు వేశారు. నాకు మొక్కలు అంటే ప్రాణం. అందుకే చదువు సాకుతో రోజూ వెళ్ళే దాన్ని ఆ మొక్కల కోసం అక్కా వాళ్ళ కోసం. అక్కా వాళ్ళ ఇంట్లో వున్నంత సేపు ఆ మొక్కల మధ్య సీతాకోకచిలుకలా తిరిగే దాన్ని స్వేచ్ఛగా హాయిగా..

అక్కా వాళ్ళు ఆ ఇంట్లోకి మారినప్పుడు అక్కా వాళ్ళ పెద్దనాన్న మరింత మండిపడ్డాడు పెదమ్మ పైన. ఆ పిల్లలను చెడగోట్టడానికే ఆ ఇంటికి వెళ్ళిందని.

ఏది ఏమైతేనేమి అక్కా వాళ్ళకు అక్కడికి వెళ్ళాక ఒంటరి తనం దూరమైంది. వాళ్ళల్లో కాస్త సంతోషం కనిపించేది నాకు.మా ఊరిలో ఐదవ తరగతి వరకే బడి వుండటం వల్ల, ఆరవ తరగతి నుండి పక్క ఊరికి వెళ్ళాలి… బడికి వెళ్ళే దారంతా పొలాలు, ఒంటరిగా వెళ్ళను బయమేసేది, అక్క,నేను, వినయ్ ఇంకా కొందరు పిల్లలం అంతా కలిసి వెళ్ళేవాళ్ళం.

అమ్మకు ఆరోగ్యం బాగాలేక ఉదయం తొందరగా లేచేది కాదు. కొంచెం ఎండపడ్డాకే లేచేది. అందుకని నా క్యారియర్ కు నేనే వండుకునేదాన్ని, ఇంకా అదృష్టం ఏమిటంటే మా ఇంట్లో అప్పుడు గోబర్ గ్యాస్ వుండేది. ఆ గ్యాస్ పొయ్యి మీద కొంచెం అన్నం, నాకు ఇష్టమైన టమోటా కూర చేసుకునేదాన్ని సులువుగా.. నేను క్యారియర్ సర్దుకొని, స్నానం చేసి వచ్చేలోగా, అమ్మ లేచి నాకు జడ వేసి, జొన్నరొట్టె చేసేది. నేను రొట్టె తిని స్కూల్ కు క్యారియర్ తీసుకొని వెళ్ళేదాన్ని.

అక్కకు ఎంత బాధో.. అంత చిన్న వయసులో.. నా క్యారియర్ నేను చేసుకొని వెళ్ళటం, అదీ రోజూ టమోటా కూరే అని. అందుకే తన క్యారియర్ లో తను ఏమి తెచ్చుకున్నా ఎక్కువగా తెచ్చి, కొసరి కొసరి తినిపించేది. అమ్మ కన్నా ఎక్కువగా.. అక్క ఏ జన్మలోనో అమ్మ అయి వుంటుందని అనుకునే దాన్ని, కల్మషం లేని తన ప్రేమలో..

అక్క ఎంతో అందంగా వుండేది.

గుండ్రటి ముఖం,రింగు రింగుల జుట్టు, పచ్చని మేనిఛాయతో మెరిసి పోతూ.. పుత్తడిబొమ్మలా..

అక్కావాళ్ళు వాళ్ళకు వున్నదాంట్లో వాళ్ళు ఆత్మాభిమానంతో బ్రతికే వాళ్ళు, ఎవరిని ఎప్పుడూ ఏ సాయం అడిగే వాళ్ళు కాదు. అయినా పనికట్టుకొని వాళ్ళ పెద్దనాన్న ఇంకొందరిని తోడుచేసుకొని వాళ్ళపై లేని పోని అపవాదులు వేసేవాడు.

ఎవరివల్ల ప్రేమ, ఆదరణ అందని అనుషక్క,పెద్దమ్మ ఎవరి మాటలను పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు.. ఎంత బాధనైనా బయటికి కనిపించ కుండా మింగుకునే వాళ్ళు గుంభనంగా..

ఒంటరితనపు బాధను అనుభవిస్తున్నా వాళ్ళ ముఖంపై చిరునవ్వు చెదిరేది కాదు. వాళ్ళు ఎవరితో మాట్లాడినా ముందు వాళ్ళ చిరునవ్వు పలకరించేది. వాళ్ళలో నాకు నచ్చింది అదే..

వాళ్ళను అలా దయనీయంగా చూస్తున్నప్పుడు, వాళ్ళపై నాకు ఎంతో జాలి కలిగేది ఎవరికి ఏ హాని చేయని మనుషులు అయినా దూషణకు గురవుతున్నారని బాధనిపించేది. ఈ సమాజం కళ్ళున్న గుడ్డిది. ఇలాంటి వాళ్ళు లోలోపలే కుమిలి పోతూ.. తమను తాము నిందించుకుంటూ వుంటారు శాపగ్రస్తులుగా.. అలా అనుకోవడం.. వాళ్ళు తిరిగి ఎవరిని దూషించలేరు.. ఆ అస్సహాయతే సమాజానికి దొరికిన అవకాశం.. అలా శిక్షిస్తూ వుంటుంది.

అక్కా వాళ్ళు మాతో వున్నంత చనువుగా మా వూరిలో ఇక ఎవరితో వుండే వాళ్ళు కాదు. అందుకనే వాళ్ళను గర్విస్టులుగా అనుకునేవాళ్ళు, నాకైతే వాళ్ళలో స్వచ్ఛతే కనిపించేది. ఎవరికైనా మనం దగ్గరైనప్పుడే వాళ్ళ స్వభావం తెలుస్తుంది.

నా కోసం రోజూ ఎదురు చూస్తూ వుండేవాళ్ళు. నన్ను చూడగానే వాళ్ళ ముఖాలు వెలిగిపోయేవి ఆనందంతో.. నాకు అంతే.. బడికి వెళ్ళినా, బడి శెలవు వున్నా.. అక్కా వాళ్ళ తోనే గడిపే దాన్ని, అక్క తప్ప వేరే లోకం లేనట్టు అతుక్కుపోయేదాన్ని.

అక్క పదవ తరగతిలో వుండగా ఒకరోజు పొద్దున పొద్దున్నే పిడుగులాంటి వార్త. అక్క వాళ్ళ ఇంటి పక్కన వున్న వాళ్ళ అత్త కొడుకుతో వెళ్ళి పోయిందని. అప్పుడు నాకు ఎంత ఏడుపు వచ్చిందో..

అక్క అలా వెళ్ళి పోయాక, వాళ్ళ పెద్దనాన్న కుటుంబం, ఆ ఇంటికి ఆ పరిసరాలకు వెళ్ళాక ఆ పిల్ల అలా చేయక ఇంకేమి చేస్తుందని ఎంతో ఆడిపోసుకున్నారు.

స్కూలులో భోజనం సమయంలో అక్క గుర్తుకు వచ్చి బాగా ఏడ్చుకునేదాన్ని.. రోజూ స్కూలుకు ముగ్గురం “గువ్వల్లా” వెళ్ళే వాళ్ళం, ఇప్పుడు ఒక “గువ్వ” మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది.

అక్క అక్కడ ఎలా వుందో అని వేదనాగా వుండేది. బయటికి ఎప్పుడూ అనేదాన్ని కాదు. కానీ అక్క గురించిన విషయాలు తెలుసుకోవాలని ఆరాటపడేదాన్ని లోలోపల.

అక్క అలా వెళ్ళి పోయాక నన్ను అక్కా వాళ్ళ ఇంటికి వెళ్ళనిచ్చే వాళ్ళు కాదు అమ్మా ,నాన్న .. నాకు కూడా వెళ్ళాలని పించేది కాదు.. ఇక అక్కడ అక్క లేదని.

అక్క గురించిన విషయాలు అప్పుడప్పుడు అమ్మా, నాన్న మాట్లాడుకుంటుంటే విని ఊరట పడేదాన్ని.

అక్క బావతో సంతోషంగానే వుందని, చిన్నతనంలోనే తండ్రి చనిపోవడం వల్ల తండ్రి ప్రేమను నోచుకోని అక్క , ఇప్పుడు బావను పెళ్ళి చేసుకొని ఆ లోటు తీరి సంతోషంగా వుందని.. అక్క సంతోషంగా వుందని నాకు సంతోషంగా అనిపించేది.

తరువాత కొద్ది రోజులకు వినయ్, పెద్దమ్మ కూడా హైదరాబాద్ వెళ్ళి పోయారు వినయ్ చదువుకోసం. నన్ను టౌన్ చదువుకు పంపను ఇష్టం లేక పెళ్ళి చేసేశారు నాకు.

ఆ తర్వాత అక్క గురించిన ఆలోచనలు కొంచెం దూరమే అయ్యాయి.. నా సొంత జీవితంతో.. కొత్త లోకంలో..

అనూషక్కకు పెళ్ళి అయ్యాక మళ్ళీ మేము కలుసుకోవడం ఇప్పుడే.. ఇన్ని రోజుల తర్వాత అనూషక్క వాళ్ళ పెద్దమ్మ మనవరాలు పెళ్ళికి కర్నూలు వచ్చింది. ఆ పెళ్ళి అయిపోయేదాక ఎన్ని మాటలు నడిచాయో కొన్ని నోటితో అయితే, కొన్ని మనసుతో.. అక్క ఆ పెళ్ళి అయిపోయాక తిరిగి వూరికి వెళ్ళి పోతుంటే, ఇద్దరిలో నిశ్శబ్ద దుఃఖం తప్పని వీడుకోలుతో..

నాకు ఎప్పుడూ అనిపిస్తూ వుంటుంది.

అక్క చేసిన తప్పు ఏంటి?

అక్కను, అంతలా అనుకోను

తనకు కావలసిన ప్రేమను తను వెతుక్కుంది.

అదేనా అక్క చేసిన తప్పు.

ప్రేమ, ప్రేమను.. ప్రేమించడం తప్పా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com