చిత్రం:క్వీన్ దర్శకుడు: వికాస్ భా భాష: హిందీ

చివరి నిమిషంలో తన పెళ్లి ఆగిపోవడంతో ఒంటరి గా యూరోప్ వెళ్లి, తిరిగి సంతోషాన్ని సంపాదించిన ఒక ఢిల్లీ యువతి కథ నేపథ్యంగా రూపొందిన సినిమా క్వీన్. ఢిల్లీలో ఉండే రాణి మెహ్రా అనే పంజాబి యువతి పాత్రలో కంగనా రనౌత్ నటించింది. రాణి అందం, అమాయకత్వం, తెలివితో పాటు, భయస్తురాలుగా ఉంటుంది. రాణి జీవితంలోకి విజయ్ (రాజ్ కుమార్) అనే యువకుడు ప్రవేశించి, పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చి, రాణిని ఒఫ్పిస్తాడు. రాణి పెళ్లికి ఒప్పుకుంటుంది. అనంతరం విజయ్ కొన్ని నెలలు విదేశాల్లో ఉంటాడు. అనంతరం ఇండియాకు వచ్చిన విజయ్, పెళ్లికి ఒక రోజు ముందు విజయ్, రాణిని పెళ్లి చేసుకోనంటూ, వివాహాన్ని రద్దు చేస్తాడు. విదేశాల్లో తన లైఫ్ స్టైల్ పూర్తిగా మారిందని, నాకు రాణి సరిపోదంటూ కారణం చెప్తాడు విజయ్. షాక్ నుండి తేరుకోవడానికి, హనీమూన్ కోసం బుక్ చేసుకున్న విమాన టికెట్లతో రాణి పారిస్, ఆమ్ స్టర్ డామ్ వెళ్తుంది. కొన్ని రోజులు విదేశాల్లో ఉన్న రాణి ఎలాంటి జీవితాన్ని అనుభవించింది. అక్కడ ఏర్పడ్డ పరిచయాలు, మిత్రులు రాణి జీవితంలో ఎలాంటి మార్పు తీసుకొచ్చాడు..? రాణి విదేశాల్లో ఉండగా, విజయ్ మనసు ఎలా మారింది.. ?చివరకు రాణి, విజయ్ లు ఎలా వివాహం చేసుకున్నారు అనే అంశాలను దర్శకుడు ఆసక్తిరంగా తెరకెక్కించాడు. విదేశాలకు వెళ్లిన రాణి, తనేంటో తెలుసుకునే సన్నివేశాలు, తను ఎలా బతకాలో నేర్చుకునే సంఘటలను ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించాడు దర్శకుడు వికాస్ భా. మహిళల మనస్సులను అర్థం చేసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించి, అనంతరం తన తప్పును తెలుసుకున్న విజయ్ పాత్ర సందేశాత్మకంగా ఉంటుంది. కంగనా రనౌత్, రాజ్ కుమార్ ఆద్యంతం తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

చిత్రం: బర్డ్‌మ్యాన్ దర్శకుడు: అలెజాండ్రో గోంజాలెజ్‌ ఇన్యారీటూ భాష: ఇంగ్లీషు

బర్డ్‌మ్యాన్‌ పాత్రను పోషించి దాని మీద విసుగొచ్చి రచన, దర్శకత్వం వైపు మరలడానికి ప్రయత్నించే ఓ నటుడి పాత్రతో రూపొందిన చిత్రం ‘బర్డ్‌మ్యాన్‌’ (ది అన్‌ ఎక్స్‌పెక్టెడ్‌ వర్చ్యూ ఆఫ్‌ ఇగ్నోరెన్స్‌). అనేక చిత్రాల్లో సూపర్‌హీరో ‘బర్డ్‌మ్యాన్’గా పాత్రపోషణ చేసి సుపరిచితుడై, తెర మరుగైన రిగ్గన్ థామ్సన్ అనే హాలీవుడ్ నటుడి పాత్ర నేపథ్యంలో బర్డ్‌మ్యాన్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు అలెజాండ్రో గోంజాలెజ్‌ ఇన్యారీటూ. తను అనుకున్నది సాధించడానికి దేనికైనా సిద్ధపడే రిగ్గన్‌ థామ్సన్‌ పాత్రలో మైఖేల్‌ కీటన్‌ కనిపిస్తాడు.

20ఏళ్ళ క్రితం వచ్చిన ‘బర్డ్‌మ్యాన్‌’ చిత్రంతో సూపర్‌హీరోగా పాపులర్‌ అవుతారు రిగ్గన్‌ థామ్సన్‌. కాని అది గతం. ఇప్పటి జనాలకు పెద్దగా తెలియదు. మధ్య వయస్సుకు వచ్చిన రిగ్గన్‌ ఇప్పుడు నటుడిగా స్థిరపడాలను కుంటాడు. రైటర్‌గా, దర్శకుడిగా, నటుడిగా తనేంటో నిరూపించుకోవాలనుకుంటాడు. అతని స్నేహితుడు జాక్‌ ద్వారా ఇదంతా సులభం అవుతుందనుకుం టుంటాడు. వీళ్ళిద్దరు కలిసి ‘రేమాండ్‌ కార్‌వర్‌’ స్టోరీ ఆధారంగా సినిమా చేయాలని ఫ్లాన్‌ చేస్తారు. సినిమా చేయడం కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతారు. అందుకు కష్టపడి సంపాదించి కూడబెట్టుకున్న డబ్బును, తన లైఫ్‌ను రిస్క్‌లో పెట్టి మరి సినిమా నిర్మిం చాలనుకుంటాడు రిగ్గన్‌. ఎలాగైనా ఈ చిత్రాన్ని సక్సెస్‌ చేసి తీరాలనేది అతని తాపత్రయం. ఈ ప్రయత్నంలో చోటు చేసుకున్న హాస్య భరిత సన్నివేశాల సమాహారమే ఈ చిత్రం. కామెడీ డ్రామాగా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఒక వ్యక్తిలోని పట్టుదలను, అదే సందర్భంలో ఏదైనా చేయడానికి తెగించే సన్నివేశాలు దర్శకుడి ప్రతిభకు అద్దం పడతాయి. మంచి సందేశానికి కామెడీని జోడించి దర్శకుడు తెరకెక్కించిన విధానం ప్రపంచ ప్రేక్షకులకి కనెక్ట్‌ అయ్యేలా చేసింది. అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో ప్రతి సీన్‌ని కొత్త అనుభూతిని పొందేలా చేస్తుంది. విజువల్‌గా ఒక కొత్తలోకంలోకి తీసుకెళ్తుందీ చిత్రం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com