జాతి గర్వించదగ్గ కవితా ఝరి తిరునగరి. తెలంగాణ ప్రభుత్వం 2020 దాశరథి అవార్డు తిరునగిరికి ప్రకటించింది.
ప్రక్రియలన్నీ సమాంతరంగా సృజించినా ఆయన మొగ్గు పద్యం వైపే. ఆ ప్రయత్నంగా చందోబద్దమైన అక్షర మాలిక ఆయన నోటినుండి వర్షిస్తుంది. ఏ సభలో ప్రసంగం చేసినా ఆయన ధారణ ప్రేక్షకుల్ని ఆశ్చర్య చకితుల్ని చేస్తుంది.
ముప్పైకి మించి గ్రంథాలు వేలయించారు. లెక్కకు మిక్కిలి సాహిత్య వ్యాసాలు రాశారు. లలిత గీతాలు, దేశభక్తి గీతాలు, ప్రభాది గీతాలు ఇట్లా ఎన్నో గీతాల జాలు ఆయన లేఖిని ప్రసరించింది.
ఏనొక కర్మయోగినయి నిల్తును బాధ్యత నిర్వహింపగ
ఏనొక భారతీయుడు రచింతును ఉజ్వల భావి కార్యముల్
అని తన కర్తవ్యాన్ని తెలుపుతున్నారు తిరునగిరి.
ఈ కవికి మహాకవి దాశరథితో అవినాభావ సంబంధం ఉంది. దాశరథి పద్యాలు ఎన్నో ధారణలో ఉన్న తిరునగిరి కొన్ని సభలలో దాశరథి పద్యగాన చేస్తుంటే ఆయనకే అందించేవారట.
తిరునగిరి, రామక్క- మనోహర్ దంపతులకు 1945 లో భువనగిరి జిల్లా ఆలేరులో జన్మించారు.
బాలవీర శతకం, శృంగార నాయికలు వసంతం, కొవ్వత్తి, అక్షర ధార, మా పల్లె, మనిషి కోసం..ఆయన సాహిత్య వ్యవసాయములో పేర్కొనదగిన రచనలు.
ఐదు దశాబ్దాలుగా సాహితీ సేవ చేస్తున్నారు. మూడు దశాబ్దాల పాటు ఉపాధ్యాయుడుగా, ఉపన్యాసకుడుగా బోధనా రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఒక సృజన శీలి మాత్రమే కాదు, మహావక్త కూడా. సంస్కృతం, హిందీ, ఇంగ్లీషు ప్రసంగాల ద్వారా గొప్ప వక్తగా నిరూపించుకున్నారు. నల్లగొండ జిల్లాలో అధికార భాషా సంఘం సభ్యుడుగా పనిచేశారు. నిరాడంబరత, స్నేహశీలం ఆయన లక్షణాలు.
ఆయన వచనా కవితా సంపుటి కిటికీ లోంచిలో…
కవీ నువ్వు రాసే ప్రతీ గీతం
సమాజానికి జాగృద్గీతం
సమాజంలో నువ్వు
నీతోనే సమాజం
నువ్వు దేశీకుడివి
మార్గ నిర్దేశికుడివి అంటూ
తన సామాజిక స్పృహ, శ్రామిక జన పక్షపాతం చూపించారు.
తంగేడు తిరునగిరి నుండి మరింత సాహిత్య సృజన కోరుకుంటున్నది.
ఈ నిరంతర కవితా యాత్రికుడిని అభినందిస్తున్నది.
