1872 లో తెలుగు లో తోలి నవల వచ్చింది. 1955 వరకు ఈ ప్రక్రియ మళ్ళీ రాలేదు. తెలంగాణా పోరాటాన్ని గురించి చాలా నవలలే వచ్చినా అవేమీ తెలంగాణా వాళ్ళు రాసినవి కావు .కాగా ఇంతకు పూర్వం వచ్చిన నవలలు తెలంగాణా వీరత్వాన్ని ప్రతిఫలించేవే. సంస్కృతిని సామాజిక జీవితాన్ని చిత్రించినవి చాలా అరుదు.

 వట్టికోట ప్రజలమనిషి ఈ మినహయింపును  అధిగమించింది. తెలంగాణా మౌలికత ను చిత్రించడంలో ఇది మొదటి నవల అని చెప్పాలి. ఆ కాలం వరకు నవలా శిల్పం లో నిర్దిష్టత రాకపోయినా ఆళ్వారు స్వామి ప్రజా జీవితాన్ని సాకారం చేయడం లో సఫలమయ్యారు.

ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆయన జీవిత కథే. ఆళ్వారు స్వామికి ఉన్న సాంద్రమైన దృష్టి కోణమే ఈ రచనకు మరింత మేలిమి కూర్చింది.

ఈ కథలో అన్ని కథలకు మల్లె నాయకుడు ప్రతినాయకుడు ఉన్నారు .రచయిత తనను మమేకం చేసుకున్న నాయకుడు కంఠీరవం. ఇక దౌర్జన్యాలకు, నాటి తెలంగాణా లోని పెత్తందారీ తనానానికి గ్రామాధికారి రామభూపాల రావు నిదర్శనం.

కథానాయకుడు కంఠీరవం తరతమ బేధాలు లేని సమతా వాది. బ్రాహ్మణా చారాల మూఢత నుండి పూర్తిగా బయట పడతాడు. తనముందు అన్యాయం జరిగితే ఎంతమాత్రం సహించదు. ఎదిరించడం ఆయన ప్రవృత్తి. శతృవు ఎంత బలవంతుడైనా లెక్క చేయడు.

ఆయన జీవితం విషాద ప్రాయం. బాల్యం లోనే పితృవియోగం కలిగింది. తల్లి ఏకాకిగా మిగులుతుంది. అన్న వెంకటార్యుడు  దొర వ్యూహంలో చిక్కుకొని తమ్మున్ని దుర్మార్గం గా ఇంటినుండి  వెడలగొడుతాడు. చివరికి తల్లి ని విడిచి వెళ్ళాల్సిన అగత్యం కలిగింది.

బాల్యం లో కంఠీరవం ఉదారవాది. ఇందుకేన్నో ఉదాహరణలు కనబడతాయి. టికెట్ లేకుండా ప్రయాణం చేసిన ఒక ప్రయాణీకున్ని పోలీస్, రైల్ స్టేసన్ మాస్టారు వేధిస్తారు .అతని దగ్గర ఉన్న దండకడియం లాక్కొంటారు. అదివిని చలించిన కంఠీరవం తనదగ్గరున్న ఒకేఒక రూపాయితో అతనికి సాయం చేయడానికి  సిద్దపదతాడు.

కంఠీరవం నిజామాబాద్ వేదాంతాచార్యుల ఇంటికి చేరుతాడు. అతని సత్ప్రవర్తన వేదాంతాచార్యులను మిగుల ఆకర్షిస్తుంది. గ్రంధాలయం లో పఠనం వల్ల గాంధి ఆకళింపుకు వస్తాడు. ఆంగ్లేయపాలకుల దమన నీతి అర్థమౌతుంది .క్రమంగా కంఠీరవం గ్రంధాలయం సభ్యత్వం నుండి ప్రధాన కార్యదర్శి వరకు ఎదుగుతాడు .మంచి ప్రభుత్వం వచ్చెదాక కష్టాలు తప్పవని కంఠీరవం నమ్మకం. నవలలో కథ జరిగిన ప్రాంతం కామారెడ్డి ప్రాంతం లోని దిమ్మగూడెం.

ఆ ప్రాంతాన బలవంతాన మతాంతరీకరణ జరిగింది. అలా హాజత్ అంటే మాలల్ని మాదిగాలని ఉద్దరించడం అన్న మాట.అంటే కట్టు బొట్టు మార్చడమే .పేరు మార్చడమే .క్రిస్టియన్లు కూడా వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. కాని ముసల్మానుల చేతిలో రాజ్యం ఉంది కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు చెల్లుతున్నాయి. ఊరిలొ అగ్రకులస్తులు ఇతరులందరికీ బాధ .మాల మాదిగలంతా హిందువు లు గా ఉండాలి .కాని అంటరాని వాళ్ళు గానే ఉండాలి. అమ్మా పెట్టదు…అన్నట్టు గా ఉంది.

ఇది అన్యాయం అని అడ్డుపడ్డాడుకంఠీరవం. అతను అందరూ గౌరవించే మూర్తి మత్వం ఉన్నవాడు. మాలలను ఉద్దరిస్తే ఈ మనిషి కి ఎందుకు కు భాద ?అన్న ముస్లెం మతపెద్దల ప్రశ్నలకు ‘’[,నువ్వు ముందు వాళ్ళను సమానం గా చూడు.జమీందారుల దగ్గర పెద్ద గుమాస్తాలు గా ఉన్న ముస్లెం అధికారులు వాళ్ళ నెందుకు బాధిస్తున్నారు ?అధికారం తో కలిసి వాళ్ళు చేస్తున్న పనేమిటి ?ఇక్కడ మారవలసింది మతం కాదు ,మనిషి ‘’, కంఠీరవం లాంటి మనుషులు బయట ఉండరు. జైలుకు వెడతారు. అదే జరిగింది. కంఠీరవానికి  జైలు శిక్ష పడింది. జైలు లో అతను మరింత రాటు దేలాడు.

ఆచారాలు విశ్వాసాలు, కులాలు గోత్రాలు, ఇదో విష పరంపర. ఒక మనిషి సాటి మనిషి తో కలిసి భోజనం చేయలేని  అయోగ్యత క్షంతవ్యం కాదు. సంస్కృతి కి పూర్ణత్వం అంటే ఇది కాదు.

కంఠీరవానికి జైలులో  స్నేహితుడు బషీర్.

కాగా మతాంతీకరణ కు కారణం మతం కాదు .వ్యవస్థ లోని పీడన .ఇట్లా తన ఆలోచనా విధానం మార్చుకుంటాడు .మతాంతీకరణకు వ్యతిరేకం గా పనిచేయడానికి వచ్చిన ఆర్య సమాజ్ కార్య కర్త  విజయ్ దేవ్. ఊరిదొర రామ్ భూపాల్ దౌర్జన్యాలకు అంతు లేదు .ప్రజల దగ్గర ఉన్నది లాగేసుకోవడమే అతని పని .ముందు ఈ దొర బాధ నుండి ప్రజలను తప్పించాలనుకొంటాడు విజయ దేవ్. ప్రజల చేత ఎన్నుకొన్న ప్రభుత్వం వస్తే ఈ బాధలు పోతాయని కంఠీరవం నమ్మకం.

1935 నాటి సాఘిక స్థితి ని చిత్రించడం చిన్నవిషయం కాదు .దిన పత్రిక చదవడమే నేరమైన కాలం లో ఈ రచన  వచ్చింది .సామాజిక విషయాలెన్నో కళ్ళముందు చలన చిత్రం లాగా తిరుగుతాయి.

కంఠీరవం బాల్యం లో పూర్తిగా బ్రాహ్మణ జీవితానికే అలవాటు పడ్డవాడు. అన్నతో పోట్లాడి బయటకు వెడితే ఇతర కులస్థుల పిల్లవాళ్ళు చేనులో కాకులు తెంపి ఇస్తారు. పెసరు గింజలు తెచ్చి ఇస్తారు. అతనికి ఆకలినుంది దుఃఖం నుండి ఉపశమనం కలుగుతుంది. ఇవన్నీ తినడానికి అభ్యంతరం ఉండదు కాని వాళ్ళు గురిగిలో నీళ్ళు తెస్తానంటే తాగడానికి మనస్కరించదు .కంఠీరవం ఊరిని వదలి పెట్టి పొతున్నపుడు కాపు వనిత అంకమ్మ చిన్నపిల్లవాడైనా అతని కాళ్ళకు మొక్కుతుంది. జైలు నుంచి విడుదలయి బషీర్ తో మొహనాచార్యుల ఇంటికి వెడతాడు .మొహనాచార్యులు కంరీరావానికి తనకు లోపల వడ్డించమని బషీర్ కు బయట ఆఫీసు గదిలో వడ్డించమని చెబుతాడు .అపుడు కంఠీరవం అంటాడు ‘’మీరు వేరు విధంగా భావించవద్దు. మీరెంత నాకు ఆప్తులో గౌరవనీయులో బషీర్ కూడా అంత కావలసినవాడు. అతడిని నాతో దూరంగా ఉంచజాలను .’’

వెంకటేశ్వర రావు బషీర్ తో అంటాడు ‘’ మన ఆచారాలు సంప్రదాయాలు కట్టుబాట్ల వెనుక ఉత్తమమైనట్టి ఏదైనా ఆశయమో లక్ష్యమో  ఉందని మీరనుకొంటారా?’’

దానికి  కంఠీరవం సమాధానం. ’’ప్రతి దానికి అట్లా ఉంటుందని అనుకోను, కొన్నిటికి ఉన్నప్పటికీ వాటి మూలసూత్రాలు అడుగున పడి, కోతి రూపులు మాత్రం నిలిచిపోయాయి.

తరువాత కంఠీరవం తన ఊరికి వెళ్ళినపుడు కాపువనిత అన్నమ్మ కాళ్ళకు  నమస్కారం చేస్తాడు.

ఈ విధం గా అనేక సామాజికాంశాల మార్పు కోసం ప్రయత్నం చేసే వ్యక్తి జీవితానికి అనుసంధానంగా కొనసాగుతుంది ఈ నవల.

రచయిత అన్ని సందర్భాలలో వైష్ణవ భాషే వాడుతాడు కొన్ని మినహాయింపులతో. ఈ నవల గురించి దాశరధి రంగాచార్య చెప్పిన మాటలు నవల సారాన్ని పిండి చెప్పేవి.

‘’ప్రజల మనిషి అతి పల్చటి పొర.ఉద్యమం కోసం అల్లిన చిన్న కథ. ఇది ఉద్యమ నవల మాత్రమె కాదు, ఆనాటి సాంఘిక చరిత్ర. నాటి అమలిన జీవితాన్ని ప్రేమలు ఆప్యాయతలు, వేదనలు అతి  సున్నితం గా ఆర్ద్రంగా  చిత్రించారు ఈ నవలలో.

                             కాంచనపల్లి గో.రా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com