చుట్టూ వున్న సమాజాన్ని లోతుగా పరిశీలించి కలం పట్టాలి

– అమృతలత

సుదీర్ఘ సాహిత్య అనుభవాలను మనకు పంచుతున్న ప్రముఖ సాహితీ వేత్తతో ముఖాముఖి…

కవిత, కథ, నవల, నాటిక, పాట, వ్యాస ప్రక్రియల్లో చేయి తిరిగిన సీనియర్ రచయిత్రి మీరు… మీ మొట్టమొదటి రచన కవిత్వమా, కథా, వ్యాసమా?

నేను ఆరవ తరగతి చదివే రోజుల్లో – ఏవో పుస్తకాలు తిరగేస్తోంటే – మా చిన్నన్న ఎప్పుడో 1958లో రాసిన ‘అదిగదిగో ఆంగ్లేయులు…’ కవిత దొరికింది. చిన్నన్నలా నేను కూడా కవిత రాయవచ్చుకదా అనుకున్నాను… ఎదురుగా గోడమీద కమలంమీద కూర్చున్న లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో కన్పించింది! లేడికి లేచిందే పరుగులాకమలం మీద కవిత రాసేసాను! అదే నా మొదటి కవిత. చిన్నన్న కవిత ఆ రోజు నా కంటబడకపోతే బహుశ కవితలూ –

కథలూ రాయాలన్న స్పూర్తి నాకు కలిగేది కాదేమో! హెచ్చెస్సీ చదివే రోజుల్లోనే… రాత్రి పూట జరిగే దౌర్జన్యాలూ, దోపిడీలూ, అరాచక శక్తుల గురించి వివరిస్తూ… ‘నిశాదేవి ఒడిలో ఉషాకన్య నిదురిస్తోన్న వేళ…’ అంటూ ఓ కవిత రాసి, ‘ఎలా రాసానో చూడూ’ అంటూ హైదరాబాదులో వుంటోన్న నా ఫ్రెండ్ అమృత మధుకి దాన్ని పోస్ట్ చేసాను.

అమృత మధు నాకు రిప్లై ఇస్తూ – ‘అమృతా! నువ్వు పంపించిన కవితను మా టీచర్ కి చూపించాను. నీ పేరూ, నా పేరూ ఒకటే కావడంతో మా టీచర్ ఆ కవిత రాసింది నేనే అనుకుని మా ఆర్.బి.వి. ఆర్.ఆర్. స్కూల్ మాగజైన్ లో ప్రింట్ చేయించింది. అయామ్ సారీ’ అంటూ బాధపడింది. ఆ కవిత ఎలా వుందో నాకు గుర్తులేదు కానీ… ఆ టైటిల్ చాలా బావుందే… పరాయిపాలయిందే! మళ్ళీ ఆ టైటిల్ లో రాయలేనే!’ అని బాధపడ్డాను.

నిజామాబాదు విమెన్స్ కాలేజీలో పీయూసీ చదువుతోన్నప్పుడు సృజన పత్రికలో కవితల పోటీ వుందంటే అప్పటికప్పుడు ‘కూలి’ పేర ఓ కవిత రాసి పంపించాను. ఓ రోజు ప్రిన్సిపాల్ నన్ను ఆఫీసుకు పిలిపించారు. ఎందుకోనని భయపడుతూ వెళ్ళాను. “ఇందూరు

భారతి’ సాహితీ సంస్థ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి ఏ. సూర్యప్రకాశ్ గారిని నాకు పరిచయం చేసారు. ఆయన నన్ను చూస్తూనే – “వరవరరావుగారి ‘సృజన’ పత్రికలో కవితల పోటీ ఫలితాలు వచ్చాయి. అమ్మంగి వేణుగోపాల్ గారి కవిత ‘ఉత్తమ కవిత’గా ఎంపికైంది, ఎన్. గోపిగారి కవితకి ప్రత్యేక బహుమతి’ లభించింది. కె.వి.యస్. ప్రకాశరావు, సింగమనేని నారాయణ చౌదరి, మీరు రాసిన కవితలు సాధారణ ప్రచురణకి ఎంపికయ్యాయి. మా నిజామాబాదులో కవితలు రాసే కవయిత్రి, వుందనుకోలేదు. సంతోషం!” అని అభినందించారు. మా ప్రిన్సిపాల్ నా వంక

మెచ్చుకోలుగా చూసారు. ఆయన బయటికి వెళ్తూ – “మీ కవిత ‘కూలి’ చాలా బావుంది. మాస్టర్ పీ లాంటి కవిత రాసారు. కంగ్రాట్స్!” అన్నారు.

ఊహ వచ్చాక నా మొదటి కవిత పబ్లిష్ అయింది కదా అని పట్టరాని సంతోషంతో నా ముఖం వెలిగిపోయింది. సూర్య ప్రకాశ్ గారికి థాంక్స్ చెప్పి క్లాసికి వచ్చేసాను. ఆ తర్వాత మా కాలేజీ మ్యాగజైన్లో ‘ఆ రోజులే నయం’ అన్న కవిత రాసాను. అదే నా చివరి కవిత. మళ్ళీ ఎప్పుడూ కవితల జోలికి వెళ్ళలేదు.

కవితతో మొదలైన మీ రచన కథలోకి ఎప్పుడు మారింది. బాల్యంలోనేనా… లేక…..?

నేను ఏడో తరగతి చదువుతున్నప్పుడు సంక్రాంతి సెలవుల్లో ఓసారి మా అమ్మమ్మా వాళ్ళ వూరు వెళ్ళాను. అక్కడ బోలెడు కథల పుస్తకాలు కనిపించాయి. ఒక పుస్తకంలో ‘చిరకాల నిద్రితుడు’ కథ చదివాను. కథ చాలా నచ్చింది. అదెవరు చదివి ఉంటార్లే అనుకుని… అందులోని పేర్లు – ఊర్లూ – డైలాగ్స్ – సంఘట నలూ అన్నీ మార్చేసి – అదే కథని థీమ్ మార్చకుండా ఇంకోలా రాసి – మామయ్యకి చూపించాను!

మామయ్య ఆ కథని ఆసాంతం చదివి – ‘భేష్! చదివిన కథని – పాత్రలు మార్చి కొత్త దానిలా రాసావ్! కానీ తలచుకుంటే – నువ్వే ఒక కొత్త కథ సృష్టించగలవు! ఇలా కాపీ కాకుండా – సొంతంగా రాయి!! సలహా ఇచ్చారు.

మీ సాహిత్య వ్యాసంగానికి స్పూర్తినిచ్చింది…

బాల్యంలో మామయ్య ఇచ్చిన సలహా, కుటుంబ సభ్యుల తో పంచుకున్న మధురానుభూతులూ నా చుట్టూ వున్న సమాజాన్ని లోతుగా పరిశీలించివిశ్లేషించుకోవడానికి దోహదపడి -మనసు స్పందించిన ప్రతిసారీ నేను కలం పట్టుకునేలా చేసి – నాలోని రచయిత్రికి ఊపిరిపోసాయి! అదీగాక – ఒకటో తరగతిలో వున్నప్పుడే మా పెద్దన్నయ్య చందమామ, బాలమిత్రలాంటి పిల్లల పత్రికలనూ, ఆ తరువాత రోజుల్లో ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, కృష్ణాపత్రిక, ప్రజామతలాంటి వారపత్రికలను గుట్టల కొద్ది తెచ్చిచ్చేవారు. అలాంటి పుస్తకాలు చదవడం వల్లే నాకు అంతో ఇంతో సాహితీ సుగంధం అబ్బింది. నేను బి.ఏ రెండో సంవత్సరంలో వున్నప్పుడు… 19-03- 1970 రోజున మధ్యాహ్నం ఒంటి గంటకు… ఆలిండియా రేడియో, హైదరాబాదు స్టేషన్ నుండి నేను రాసిన కథ ‘ఆశయాలూ- ఆదర్శాలూ’ ప్రసారమైంది. కానీ హాస్టల్లో ఎవరి దగ్గరా రేడియో లేకపోవడంతో… మేమెవరమూ వినలేకపోయామని బాధపడ్డాం.

తాపీ ధర్మారావు (తాతాజీ)గారి అధ్యక్షతన ‘ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం’ సలహా మండలి డా|| దివాకర్ల వెంకటావధానిగారిచే ఏప్రిల్ 07, 1970 రోజున స్థాపించబడింది. ఈ సలహా మండలికి శశాంకగారు గౌరవ అధ్యక్షులుగా డా॥ దివాకర్ల వెంకటావధాని, డా॥ సినారె, రావూరి భరద్వాజ, బోయి భీమన్నగార్లు సలహాదారులుగానూ, విద్యార్థి రచయితల సంఘానికి అడపా రామారావుగారు కార్యదర్శిగా, సుధామ సహాయ కార్యదర్శి గా, రఘుశ్రీ, ఉమాకాంట్లు నిర్వాహకులుగానూ వ్యవహరించారు. ఎమెస్కో సంస్థ అధినేత ఎం.ఎస్.రావుగారి ప్రోత్సాహంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం, దాని అనుబంధ కళాశాలలలో చదువుతోన్న విద్యార్థుల కోసం – ఓ కథల పోటీ నిర్వహించారు. సుమారు రెండువేల మంది విద్యార్థులు ఆ కథల పోటీలో పాల్గొన్నారు. ఆ పోటీకి మా కాలేజీ నుండి నేనూ, మా జూనియర్ స్వాతి శ్రీపాద మా కథలను పంపించాం.

నేను రాసిన ‘కన్నీళ్ళతో కాలక్షేపం’, స్వాతి శ్రీపాద రాసిన ప్రతిఫలించని అద్దాలు’ కథలు ‘ఉస్మానియా యూనివర్సిటీ ఎమెస్కో కథల పోటీ’లో ఎంపికై ఎమెస్కో కథాంజలి-3లో ప్రింటయ్యా యి. ఇద్దరం కలిసి ఆంధ్ర సారస్వత పరిషత్ హాల్లో జరిగిన ఆ పుస్తకావిష్కరణ సభకు హైదరాబాద్ వెళ్ళాం. ఉస్మానియా విశ్వ విద్యాలయ విద్యార్థి రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆ సభకి డా॥ సి.నారాయణ రెడ్డి, రావూరి భరద్వాజ, శశాంక లాంటి సాహితీ

ఉద్దండులు ముఖ్య అతిథులుగా విచ్చేయడం మాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఆవిష్కరణ తరువాత కథలు రాసినవాళ్ళందరికీ ఆ పుస్తకాలూ, సర్టిఫికెట్లు ఇచ్చారు. మొత్తం పదిహేడు కథలున్న ఆ పుస్తకంలో మొదటి కథ నాదే కావడం నాకు థ్రిల్ కలిగించింది…

ఉస్మానియా విశ్వ విద్యాలయ విద్యార్థి రచయితల సంఘం కోరిక మేరకు…

స్వాతి మాసపత్రిక (మే, 1971) నిర్వహించిన కథల పోటీలో నా కథ ‘మనసు ఎదగని మనుషులు’కి రెండో బహుమతి లభించింది.

మొదటి బహుమతి ఎవరికీ దక్కలేదు. ఆ కథల పోటీలో నాకు వంద రూపాయల ప్రైజు మనీ వచ్చింది. కానీ, ఎన్ని రోజులు చూసినా ఆ ప్రైజు మనీ

అందలేదు. ఎడిటర్ గారికి ఉత్తరం రాసాను. నా కథకి వచ్చిన ప్రైజు మనీ రాలేదని, దయచేసి పంపించండనీ!

కొన్ని రోజుల తర్వాత – ‘మీరు ప్రైజు మనీ అడిగారట! స్వాతి పత్రిక వాళ్ళు మన స్టూడెంట్స్ కథలు వేయడమే గొప్ప! అలా డబ్బు అడుగుతారా? ఆ పత్రిక వ్యవస్థాపకులు చాలా బాధపడ్డారు’ అంటూ ఓ విద్యార్థి నాయకుడి దగ్గరి నుండి ఉత్తరం వచ్చింది- ‘అయ్యో! ఆ వంద రూపాయలు రచనల ద్వారా వచ్చిన నా మొదటి సంపాదన – దాన్ని ఖర్చు పెట్టుకోకుండా నా ఫోటో ఆల్బమ్ లో భద్రంగా దాచుకోవాలనుకున్నాను. ఆయన ఏమైనా హర్ట్ అయితే అయాం సారీ!’ అన్నాను.

పత్రికలు పెట్టడమే చాలా సాహసం, ఎన్నో కష్ట నష్టాలుంటాయి. పత్రికలు స్థాపించిన తొలినాళ్ళలో అవి రెమ్యు నరేషన్ ఇచ్చే స్థితిలో కూడా వుండవన్న అవగాహన లేక అడిగాను కదాని ఇప్పటికీ ఫీలవుతుంటాను. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి (20-7-1973) వీక్లీలో నా కథ ‘ఆమె నవ్వు’ ప్రచురింపబడింది. అనంతరం ఆంధ్రజ్యోతి, నవ్య, ఆంధ్రభూమి, మయూరి వీక్లీలలో నా మరో ఇరవైమూడు కథలు పబ్లిష్ అయ్యాయి.

ఓటర్లని చైతన్యం కలిగించే దిశలో… సంభాషణల రూపంలో(2017)లో ‘ఓటెందుకు?’ పుస్తకం వెలువరించాను.

మీరు నాటికలు కూడా రాసారు కదా….. మీ మొదటి నాటిక… అదీ చిన్నప్పుడే మొదలైందా?

నేను హజూరాబాద్లో తొమ్మిదో తరగతి చదువుతోన్న రోజుల్లో… స్కూల్ మ్యాగజైన్ కోసం ‘పృథ్వి రాజ్ చౌహాన్’ కథని కథా వస్తువుగా చేసుకొని ఓ చిన్న నాటిక రాసాను. అది ప్రింటై వచ్చినప్పుడు… పుస్తకంలో నా పేరు చూసుకుని ప్రపంచాన్ని జయించినంత తృప్తిగా ఫీలయ్యాను.

హైదరాబాదు నగరానికి మొదటి మేయర్, రాజకీయవేత్త, ప్రముఖ రచయిత మాడపాటి హన్మంతరావుగారు ఆ నాటిక చదివి – ‘ఈ అమ్మాయి భవిష్యత్తులో గొప్ప రచయిత్రి అవుతుంది’ అని మెచ్చుకోవడం, దానిని మా హెడ్ మాస్టారు గారు ప్రతి క్లాస్ లో వినిపించడం… నేను మరిన్ని రచనలు చేసేలా పురికొల్పింది. తర్వాతి రోజుల్లో స్కూల్స్ స్థాపించాక పిల్లల కోసం ఎన్నో ఏకాంకిలు రాసాను. అవి ఆంధ్రభూమిలో సీరియల్ గా ప్రచురితమయ్యా యి.

అవును… అవి నేనూ చదివాను. ఆ క్రమంలోనే మీతో ముఖాముఖి కూడా అదే పత్రికలో వచ్చేది. అయినా… ఏకాంకికలు రాయడం చాలా కష్టం. ఇందులో మీరు నిష్ణాతులు. 1977లో ఆంధ్రజ్యోతి వార పత్రికలో వచ్చిన మీ సీరియల్ ‘సృష్టిలో తీయనిది’ చదివాను. ఆ నవల ఆసాంతమూ కాలేజీ జీవితానికి సంబంధించింది. అయినప్పటికినీ అందులో మనోవిశ్లేషణ బాగా చేసారు. అప్పట్లో అందరినోటా మీ నవల గురించే చర్చలు! మరి మళ్ళీ నవలల జోలికి పోలేదు… కారణం?

ఆ మాట కొస్తే నేను ఎనిమిదో తరగతి చదువుతోన్న రోజుల్లోనే… ‘పర్వతాలూ – లోయలూ’ అనే నవల రాసాను. సమాజంలో భర్తలని ఉన్నతంగా,

భార్యల్ని తక్కువగా చూపిస్తున్నారనీ… కానీ, ఇద్దరూ సమానులేనని రాయాలనిపించి – భర్త మహోన్నత ‘శిఖరం’ అయితే – భార్య అగాధమైన ‘లోయ’ అనీ – ఆ రెండూ కలిస్తే ఒకదానిలో ఒకటి ఇమిడిపోతే జీవితం స్వర్గమవుతుందనీ – లేకపోతే నరకప్రాయం అవుతుందన్న ‘కథాంశం’తో

ఆ నవల రాసాను. ప్రతిరోజూ కొంత రాయడం, దాన్ని నా క్లాస్ మేట్స్క వినిపించడం, వాళ్ళు ‘ఆహా… ఓహ…” అనడం నాకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. అయితే ‘సృష్టిలో తీయనిది’ నవల తర్వాత నేను విద్యారంగంలో బిజీగా వుండడం మూలంగా నవలలు రాయలేకపోయాను.

మీ ‘పర్వతాలూ – లోయలూ’ చందమామ కథ టైటిల్లా వుంది. ఆ ప్రతి ఏమైనా మీ దగ్గరుందా? సదరు కథా వస్తువు కొంతైనా గుర్తుందా ?

బీఎడ్ పూర్తి చేసాక – నేను ఎనిమిదో తరగతిలో రాసిన పర్వతాలూ-లోయలూ’ నవల దుమ్ము దులిపి కాలానుగుణంగా ఎన్నో మార్పులూ చేర్పులూ చేసాను. ఆ నవల పేరు మార్చాలని పించింది. ‘ఆడపిల్లలు గాజుబొమ్మల్లాంటి వాళ్ళు. వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి – మగాడు దాన్ని పగలగొట్టాలని చూస్తేఅది వాడి మణికట్టు మీద పగిలి అతడి

ప్రాణాలనే హరిస్తుంది’ అనే సందేశం ధ్వనించేలా ‘గ్లాస్ విత్ కేర్’ అన్న టైటిల్ లో దాన్ని ఓ పత్రికకు పంపించాను. అయితే ఇంకో కాపీ నా దగ్గర పెట్టుకోలేదు – పోస్టులో ఆ పత్రిక వాళ్ళకి చేరలేదో, లేక మరెక్కడైనా మిస్సయ్యిందో, లేక పత్రికల వాళ్ళకి అది నచ్చలేదో తెలీదు. . రెండొందల పేజీల ఆ నవలని నా అజాగ్రత్త మూలంగా పోగొట్టుకున్నాను.

మీరు స్కూల్ టాలెంట్‌ షోలకి ఎన్నో జానపద పాటలు రాసారు. మీరు రాసిన మొట్టమొదటి పాట…?

మా చిన్న తరగతుల్లో ‘బుర్రుపిట్ట బుర్రుపిట్ట తుర్రుమన్నదీ’ అనే పాట పాడేవాళ్ళం . ఆ పాట చివర్లో ‘మొగుడి చేత మొట్టికాయ తింటనన్నదీ’ అనే మా టలు నాకు నచ్చకపో యేవి. హెచ్చెస్పీ చదివే రోజుల్లో (1966)… ఆ పాట మీద కోపం వచ్చి దాని మీద ఓ పేరడీని రాసి, నా ఫ్రెండ్స్ కి చూపించాను. ఆ పేరడీ చదివి మా ఫ్రెండ్సందరూ ‘ఒరిజినల్ పాటకన్నా నువ్వు రాసిందే బావుంది’ అని మెచ్చుకున్నారు.

వివిధ సాహితీ ప్రక్రియల్లో మీది అందెవేసిన చేయి కదా… ఏ ప్రక్రియ మీకు కష్టతరమనిపించింది ?

నిజం చెప్పాలంటే… నేను అమృత్ కిరణ్ పక్షపత్రిక స్థాపించిన రోజుల్లో సంపాదకీయం రాయల్సివచ్చేది. అది వ్యాస ప్రక్రియ. అయితే పుంఖాను పుంఖాలుగా… పేజీల కొద్దీ పెద్ద పెద్ద పేరాలతో వ్యాసాలు రాయడం నా అభిమతానికి విరుద్ధం. ఏదైనా ఓ అంశం ఎన్నుకుంటే… దాని గురించి రాసేటప్పుడు అన్ని కోణాల నుండి దాన్ని పరిశీలించాలి, విశ్లేషించాలి. పొందికైన పద్దతిలో తిరిగి సంశ్లేషిస్తూ….. సింగిల్ పేజీలో పొదగడం… అదో సవాల్ గా నిలిచేది. నాకు అది కష్టమైనా… ఎంతో ఇష్టంగా వుండేది.

పక్షపత్రిక సంపాదకురాలిగా, పబ్లిషర్‌గా, ప్రింటగా మీ అనుభవాలు? పత్రిక ఎక్కువ కాలం నడవకపోవడటానికి కారణాలు చెబుతారా ?

నాకు పత్రికలంటే ప్రాణం! నాకీమాత్రం సాహితీ సుగంధం అబ్బిందంటే.. ఆరోజుల్లోని ఆంధ్రప్రభ, ఆంధ్ర పత్రిక, ఆంధ్రజ్యోతి వార పత్రికలూ, చందమామ, యువ, జ్యోతి మాస పత్రికలే మూల కారణం! పత్రికా రంగం మీదున్న అభిమానంతో నిజామాబాదు నుండి పక్షపత్రికని నడిపేందుకు నిర్ణయించుకున్నాను. పత్రిక కోసం ఒక ఆఫ్ సెట్ ప్రింటింగ్ ప్రెస్ ని కూడా కొన్నాం. ముగ్గురు డీటీపీ ఆపరేటర్లను నియమించుకున్నాం.

అమృత్ కిరణ్ పక్షపత్రికను 64 పేజీలతో ఆంధ్రభూమి, స్వాతి పత్రికల సైజులో పక్షానికోసారి క్రమం తప్పకుండా ఓ రెండేళ్ళు వెలువరించాం.

చాలామంది కొత్త రచయితలని ప్రోత్సహించటంతో పాటు అంపశయ్య నవీన్, మల్లాది వెంకట కృష్ణమూర్తి, డా|| సి. ఆనందారామం వంటి ప్రముఖుల రచనలు కూడా ఆ పత్రికలో సీరియల్ గా ప్రచురించాం. ‘అందుకో నా లేఖా…’ పేర పాఠకుల అభిప్రాయాలకు, ‘తెలుసుకొనవె చెల్లి’ పేర స్త్రీల

సమస్యలపై చర్చలకూ, హిజ్ టీన్స్- హర్ టీన్స్’ పేర టీనేజీ పిల్లల సమస్యలకి అగ్రతాంబూలం ఇచ్చాం. కానీ చాలా కారణాల వల్ల నడపలేకపోయాం .

ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం మాండలికాన్ని ప్రాచుర్యంలోకి తేవాలనీ, అలా మాండలికంలో రాయనివాళ్ళు ఆ ప్రాంతాన్నీ, ప్రజల్నీ, అక్కడ జీవ భాషనీ సొంతం చేసుకోనట్టేననీ తరచూ ఒక విమర్శ వస్తూ వుంటుంది. తెలంగాణా బిడ్డగా దీనిపై మీ అభిప్రాయం…

కథల్లో ప్రామాణిక భాషనే ఉపయోగిస్తే – అన్ని ప్రాంతాల పాఠకులకి అర్థమవుతుందని నా అభిప్రాయం. మాండలికంలో రచనచేస్తే పరిధి కుంచించుకుపోతుంది. అది ఆ ఒక్క ప్రాంతానికి మాత్రమే పరిమితం అయిపోతుంది. తెలంగాణా అయినా, రాయలసీమ అయినా, ఆంధ్రా అయినా… ఒక్కో ప్రాంతానికి ఒక్కో మాండలికం వుంటుంది. ఆ ప్రాంతాల్లో కూడా జిల్లాకొక మాండలికం వుంటుంది. పైగా ఒక

జిల్లా మాండలికం ఇంకో జిల్లాకు అర్థంకాదు. ఏ మాండలికమైనా పాత్రోచితంగా ప్రవేశపెట్టాలి గానీ, కథనం కూడా మాండలికంలోనే రాస్తే – ఆయా మాండలికాలు తెలిసిన వాళ్ళు మాత్రమే అవి అర్థం చేసుకోగలుగుతారు. మిగిలిన పాఠకులు దూరమవుతారు. అప్పుడు ఆ కథ లక్ష్యం నెరవేరదు కదా!

మాండలికాలను మనం శ్రోతలుగా ఎంజాయి చేస్తాం! కానీ పాఠకులుగా చిరాకుపడతాం, ఒకప్పుడు కార్మికుల కార్యక్రమంలో రేడియో చిన్నక్క రతన్ ప్రసాద్ గారు తెలంగాణ మాండలికాన్ని ఎంతో సహజంగా మాట్లాడేవారు. అది వినడానికి బావుండేది. ఇప్పుడు టీవీల్లో బిత్తిరి సత్తిలాంటి వాళ్ళు మాట్లాడే మాండలికం కూడా తెలంగాణ పల్లె యాసలో వినసొంపుగా వుంటుంది. అవే మాటలు పుస్తకంలో రాసి, చదవమంటే మాత్రం… ఆయా వాక్యాలు మన రీడింగ్ కి అడుగడుగునా స్పీడ్ బ్రేకర్ష్ , అడ్డుపడతాయి. రేడియోకో, టీవీకో మాండలికంలో రాస్తే… నిరక్షరాస్యులు కూడా ఎంజాయ్ చేస్తారు. పత్రికలకు మాత్రం ప్రామాణిక భాషలోనే రాస్తే చదువుకున్న వాళ్ళందరూ ఇష్టపడతారు. ఇంకో విషయం చెప్పమంటారా… మాండలికాల్లో కొన్ని పదాలు చాలా అప్రాప్రియేట్ గా వుంటాయి. ప్రామాణిక భాషలో అవి దొరకవు. తెలంగాణాలో ‘సోయిలేదా?, ఏయ్ బిత్తిరోడా!’ లాంటి అందమైన పదాలు ప్రామాణిక భాషలో కనిపించవు. ఇలాంటి పదాలను తరచూ ఉపయోగించి తెలంగాణ భాషలోని సొగసు తెలిపే రచనలు చేస్తే ప్రామాణిక భాషలో అవి కూడా చేరి, తెలుగు భాష మరింత సుసంపన్నం అవుతుంది.

‘అమృతలత – అపురూప అవార్డ్స్’ గురించి…

ఒక ఉగాది రోజున మా జిల్లాలోని సాహితీవేత్తలనందర్నీ మా ఇంటికి ఆహ్వానించి సత్కరించడం జరిగింది. వారి కళ్ళల్లోని సంతోషాన్ని చూసిన ఆరోజే కళాకారులకు అవార్డులిచ్చి, సత్కరించాలన్న ఆలోచనకు నాలో అంకురార్పణ జరిగింది. ముఖ్యంగా ఇంటిపనులతో సతమతమవుతూ… ప్రతికూల పరిస్థితులను సైతం | ఎదుర్కొంటూ… తమలోని కళలను

మెరుగుపరుచుకుంటోన్న మహిళలను గుర్తించి గౌరవించాలన్న భావనతో అపురూప అవార్డులు నెలకొల్పాం .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com