-హుమాయున్ సంఘీర్

రంగుల చిత్ర ప్రపంచం వెనుక చీకటి నీడలు చూపించే కథ..

ఫిల్మ్ నగర్ బస్తీలో ఉన్న సింగిల్ రెంటెడ్ రూంలో ఒంటరిగా కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు రాజు. తల తిప్పి గోడకు ఓ వైపు గెల్ఫుల నిండా ఉన్న పుస్తకాల వైపు చూస్తూ నిట్టూర్చాడు. ఆ పక్కనే మంచం మీద ఉన్న ల్యాప్

టాప్ వైపు నిరాసక్తంగా చూశాడు. ఇవాళ నిర్మాతకు చెప్పిన కథ నచ్చి సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ ఇస్తే తన పదేళ్ల శ్రమకు ఫలితం దక్కుతుందని మనసులో పదే పదే అనుకుంటున్నాడు. గోడకు వేలాడుతున్న వినాయకుడి ఫోటో ఉన్న క్యాలెండర్ వైపు చూస్తూ కళ్లు మూసుకుని గట్టిగా అర్జీ పెట్టుకున్నాడు. అప్పుడతనికి మాజీ రూంమేట్స్ హరి, జగన్ గుర్తుకు వచ్చారు. సినిమా స్టగుల్స్ చేస్తూ నిత్యం వాళ్లిద్దరు ఆ వినాయకుడికి మొక్కుకోనిదే కాలు బయట పెట్టేవారు కాదు. అప్పుడు రాజు తన కష్టాన్ని, ప్రయత్నం తప్ప దేనిని నమ్మేవాడు కాదు. కాలం గడుస్తున్న కొద్ది వారిద్దరిలో ఒకరు సినీ నటుడిగా, మరొకరు టీవీ యాంకర్‌గా స్థిరపడ్డారు. అంతా వినాయకుడి చలువే అనేవారు. ఆటోమేటిగ్గా తాను ఆ ఫోటోకి దండం పెట్టడం అలవాటు చేసుకున్నాడు.

ఇంతలో తన ఫోను యూట్యూబ్ నోటిఫికేషన్ వచ్చిన సౌండు విని క్లిక్ చేశాడు. ఓ ఛానెల్ లో హరి చేసిన స్కిట్ అది. హరి చేసే కామెడీ రాజుకు చాలా ఇష్టం. దీంతో అతని ముఖంలో చిన్న

మెరుపు. నాలుగున్నర నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోను చూస్తున్నాడు. యాంకర్ కు, హరికి జరిగే సెటైరికల్ కన్వర్టేషన్ అది. కులమతాలు అంటూ పరువు హత్యలకు పాల్పడుతున్న వారికి చక్కటి సెటైరికల్ సందేశం ఇచ్చారు ఆ వీడియోలో. రాజు చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నాడు. పరువు హత్యలు జరిగినప్పుడు చాలా మంది ఆ ఇద్దరి కులం ఏదని గూగుల్ చేస్తున్నారని హరి చెప్తాడు. ఎవరైనా ఏ రంగంలోనైనా విజయం సాధిస్తే అతని గురించి చాలా మంది గూగుల్ లో సెర్చ్ చేసేది అతనిది ఏ కులం అని. వీడియో చివర్లో తన రక్తం బిందువులను ఓ ఇద్దరు ముగ్గురి రక్త బిందువులను ఓ రాయి మీద వేసి అందరి రక్తం ఎర్రగానే ఉందే.. ఈ ఎరుపు రక్తం

నీ కులం ఇది నా మతం ఇది అని చెప్పడం లేదే అంటాడు హరి. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లలో ఎన్ని పెటాకులు అవడంలేదు… ఇంకా ఎన్నెన్ని తరాలుగా ప్రేమికుల రక్తాన్ని చిందిద్దాం అని స్కిట్ ముగిస్తాడు.

“కరెంట్ ఇష్యూ మీద పర్ ఫెక్టుగా హరి ఈ వీడియో చేసిండు. వెల్డన్ హరి” అనుకున్నాడు మనసులో. వెంటనే వాట్సాప్ ఓపెన్ చేశాడు. హరి నంబర్ తీశాడు. ఆర్నెల్ల క్రితం హాయ్, హలో అని ఉన్న తమ చాటను చూసి మనసులో చిన్నగా కలుక్కుమంది. ఇష్టమైన ఫీల్డులో మనుషులు బిజీ అవుతున్న కొద్దీ కమ్యూనికేషన్ గ్యాప్ చాలానే వస్తుంది అనుకున్నాడు. రేపు తాను బిజీ అయినా ఇలాగే తయారవుతానేమో అని తనను తాను ప్రశ్నించుకుని ఛఛ తానలా కానని మళ్లీ సర్ది చెప్పుకుంటున్నాడు. హరికీ ఎప్పుడైనా ఫోన్ చేస్తే షూటింగ్ అనో, ఈవెంట్ అనో బిజీగా ఉన్నానని చెప్తాడు. జగన్ కూడా ఆ మాటే చెప్పాడు. ఇక అప్పటి నుంచి బిజీగా ఉన్నవారికి ఖాళీగా ఉన్న తను ఫోన్ చేయడం నామోషీగా భావించాడు రాజు. రూమ్మెట్‌గా గుర్తుకు వచ్చినప్పుడు వాళ్లే ఫోన్ చేస్తారను కున్నాడు. కానీ అది అబద్ధం అయిపోయింది. వాట్సాప్లో తనకు తాను హలో హరి, జగన్ ఎలా ఉన్నావని అడిగితే తప్ప రెండు మూడు రోజులకు రిప్లై వచ్చేది కాదు. అది చాలా పొదుపైన ఎమోజీ రూపంలో వచ్చేది. బంధాలు, స్నేహాలు మనసు విప్పి మాట్లాడుకోనంత, ఆ భావాలను కనీసం టైప్ చేసో, వాయిస్ మెసేజో పంపనంతగా.. పెద్ద భావాన్ని చిన్న ఎమోజీలతో పొదుపు చేసేశారని నిట్టూర్చిన సందర్భాలు రాజుకు ఎన్నో. సంశయిస్తూనే హరికి ఫోన్ కలిపాడు.

లక్కీగా ఎత్తాడు. “హాయ్ రాజూ ఎలా ఉన్నావ్?” అన్నాడు ఆప్యాయంగా. చాలా రోజుల తర్వాత హరి వాయిస్ వినగానే రాజులో ఒక రకమైన ఆనంద చారిక. “బాగున్నా హరీ.. నీ స్కిట్ ఇప్పుడే చూసిన.

మస్తి చేసినవు” “థాంక్యూ రాజు.. మనం ఇట్ల ఫోన్ల కన్నా లైవ్ మాట్లాడుకుందామా” “యాహ్ ష్యూర్ హరీ” “నాకు రేపు ఓ వినాయకుడి మండపం కాడ ఈవెంట్ ఉంది. జగన్ గూడ వస్తున్నడు. నువ్వూ వస్తే మాట్లాడుకుంట పోదాం సరేనా” అన్నాడు హరి. “ఓకే హరీ” అన్నాడు. ఫోన్ కట్ అయింది.

హరి, జగన్ ఇద్దరూ నటననే ఎంచుకోబట్టి ఎక్కువ టైం తీసుకోకుండా సక్సెస్ అయ్యారు. ఇద్దరూ అటు సినిమాలు, ఇటు టీవీ షోలు, మరోవైపు ఈవెంట్లు చేసుకుంటూ బాగా సంపాదించుకుంటున్నారు. వారు అనుకున్నట్టుగానే మంచి గుర్తింపును కూడా సంపాదించుకున్నారు. ఫేమ్ వచ్చాక వాళ్లు తన రూం ఖాళీ చేసి వెళ్లిపోయారు. పెద్దింటి సంబంధాలు చూసుకుని పెళ్లిళ్లు చేసుకుని మణికొండలో సొంతిల్లు కొనుక్కుని పోష్ లైఫ్ అనుభవిస్తున్నారు. వాళ్లిప్పుడు బయట స్టార్లు కానీ తనకు పాత దోస్తులే.

రాజు మాత్రం అదే రూంలోనే ఉన్నాడు. ఇండస్ట్రీలో రాణించాలంటే కొండల కొద్దీ టాలెంట్ ఎంత ముఖ్యమో పెసర గింజంత లక్ కూడా అంతే అవసరం. ఏడీగా మొదలైన రాజు ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు. చేసిన కష్టానికి జీతం ఉండదు. సినిమా రంగంలో ఎదగాలంటే తొలుత పైకం ఆశించొద్దు అని ఎంతో మంది చెబుతుంటే వింటూ వచ్చిన అవకాశాన్నల్లా చేజార్చుకోకుండా కష్టపడ్డాడు. అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి కో డైరెక్టర్ వరకు ఎదిగాడు. నాలుగు సినిమాలకు ఏడీగా, ఒక సినిమాకు కో డైరెక్టర్ గా, రెండు సినిమాలకు ఘోస్ట్ రైటర్ గా వర్క్ ఎక్స్ పీరియన్స్ సంపాదించుకున్నాడు. ఆ అనుభవంతో ఓ నాలుగు షార్ట్ ఫిలింస్, ఓ డాక్యుమెంటరీ చిత్రం, ఒక వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించి ట్రాక్ రికార్డ్ బిల్డ్ చేసుకున్నాడు. ఇక వెండితెర మీద దర్శకుడిగా తన పేరు చూసుకోవడమే తరువాయి. ఆ తర్వాత పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ పెట్టి పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలి అనుకున్నాడు. రాజు గత ఎనిమిదేళ్ల నుంచి అదే రూంలో ఉంటు న్నాడు. హరి, జగన్ వెళ్లిపోయినా ఒంటరిగా తను ఆ రూంలోనే ఉంటు న్నాడు. తన ఎన్నో ఆలోచనలకు పురుడు పోసింది ఆ రూం. కథలతో కుస్తీ పట్టాడు ఆ గదిలోనే. తాను బాధలో ఉన్నప్పుడు అమ్మలా ఓదార్చింది ఆ రూం. అందుకే దానిని వీడలేకపోతున్నాడు రాజు.

వాళ్లిద్దరు ఉన్నప్పుడు రూంలో నిత్యం నవ్వులు పూసేవి. వాళ్లు నటులు అవడంతో వాళ్లను, వీళ్లను ఇమిటేట్ చేసి చూయించేవారు. వారంలో మందు, చికెన్ అంటూ ఎంజాయ్ చేసేవారు. బ్యాచర్లుగా ముగ్గురూ కలిసి గది అద్దె

షేర్ చేసుకునేవారు. తినడానికి అయ్యే ఖర్చులను కూడా బుక్కులో రాసుకుని సమానంగా పంచుకునేవారు. ఎదిగాక స్టేటస్ ఇష్యూ అని భావించిన వారిద్దరు అకస్మాత్తుగా ఆ బస్తీలోని రూం ఖాళీ చేసి వెళ్లడంతో తాను ఒక్కసారిగా ఒంటరిని అయిన ఫీలింగ్ కలిగింది. వాళ్లు మళ్లీ తన రూంకు రావడానికి అదే ఫేం అడొచ్చింది.

ఈ క్రమంలో ఊళ్లో ఉన్న అమ్మ ఫోన్ చేసి అవసరాలకు డబ్బులు పంపివ్వమనేది. ఇక్కడేమో నెలనెలా ఠంచనుగా వచ్చే జీతాలు ఉండవు సినిమా స్టర్లకు. “ఇంకెప్పుడు సంపాదిస్తవురా.

నీ తో టోల్లు లగ్గాలు జేసుకుని పెండ్లాం పిల్లలతోని ముద్దుగా ఉంటున్నారు. నీ ఈడు పెరుగుతున్నది. ఆ సీన్మలు మనకు పడయి. సప్పుడుదాక ఇంటికచ్చి ఏదన్న పని జేసుకుందువు గానీ. నీ ఒక్కని లగ్గం జేస్తే నా బాధ్యత తీరినట్లైతది బిడ్డా. నా మాటిను కొడుకా” అని ఎప్పుడు ఫోన్ చేసినా అమ్మ ఇదే మాట అంటుంటుంది. అన్న కూడా ఫోన్ చేసి “ఇదే నీకు లాస్ట్ ఇయర్. నువ్వు డైరెక్టర్ వి కాకపోతే నెక్స్ట్ ఇయర్ పెండ్లి జేసుడు ఖాయం” అంటూ అన్న టార్గెట్ పెట్టాడు. ఇన్ని రోజులు ఏదో ఒకటి చెప్తూ వస్తున్న రాజుకు ఈ సారి వాళ్లను ఆప తన తరం కాదనుకున్నాడు. స్థిరపడాలని విశ్వప్రయత్నం చేస్తున్నాడు./p>

ఎండలు మండిపోతున్నాయి. కారులో ముగ్గురూ బయలుదేరారు. హరి డ్రైవింగ్ చేస్తున్నాడు. అతని పక్కనే ముందు సీట్లో జగన్ కూర్చున్నాడు. రాజు వెనుక సీట్లో కూర్చున్నాడు. చాలా రోజుల తర్వాత లైవ్ లో వారిద్దరిని చూస్తున్న రాజులో ఆనందం వర్ణనాతీతంగా ఉంది. హరి, జగన్ ఎప్పటి మాదిరే అవే జోకులు

పేలుస్తూ నవ్వులు పూయిస్తున్నారు. “నువ్వు డైరెక్టరు ఎప్పుడు అయితవో మా అన్ల ఎప్పుడు కలుస్తవో” జగన్ మాటకు హరి కూడా గొల్లున నవ్వాడు. ఆ మాట వినగానే రాజు మనసు చివుక్కుమంది. ముఖంలో నెర్వెస్ భావన కనిపించకుండా తను కూడా అది పంచ్ జోక్ అన్నట్టు నవ్వు కలిపాడు. “అంటే నేనిప్పుడు వాళ్ల స్నేహితుడిని కానా? నేను డైరెక్టర్‌ను అయి డబ్బు సదా సంపాదించుకుంటే వాళ్లల్ల కలుస్తనా? ఒకవేళ నేను ఏం సాధించకపోతే?” రాజు లోపల ప్రశ్నలు. ఇంతలో హరి ఫోన్ పదేపదే మోగుతోంది.

స్క్రీన్ మీద నంబర్ చూస్తూ చిరాకు పడుతున్నాడు. “ఎవరో ఫోన్ జేస్తున్నట్టున్నరు గదా ఎత్తు హరీ” అన్నాడు రాజు. ఆ మాటకు జగన్ హరి వైపు చూసి కీసుక్కుమన్నాడు. “ఆ ఫోన్ కావాలనే ఎత్తుతలేడు రాజు” అన్నాడు జగన్. రాజుకి ఏం అర్థం కాలేదు.

“ఫేమ్, పైసా వచ్చినంక ఇసుంటి ఫోన్ కాల్స్ శాన చిరాకు వెళ్తాయి. జగన్ అంటుంటగా హరి ఫోన్ మళ్లీ మోగింది. క్షిహరిలో అదే చిరాకు. స్క్రీన్ మీద లక్ష్మి అన్న పేరు కనిపించింది రాజుకు. ఆ పేరు చూడగానే రాజుకు ఆ లక్ష్మీ గుర్తుకు వచ్చింది. అప్పట్లో హరి, లక్ష్మి అనే అమ్మాయితో ఫోన్లో ఎప్పుడూ బిజీగా మాట్లాడే వాడు. ఆమెనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. నాలుగైదేళ్లు రూంలో టైం దొరికినప్పుడల్లా లక్ష్మితో మాట్లాడేవాడు. లక్ష్మిది, తనది పక్కపక్క ఊళ్లే. ఇద్దరూ కలిసి ఒకే స్కూల్లో చదువుకున్నామని, పసితనం నుంచే ఇద్దరి మధ్య కనెక్షన్ ఏర్పడిందని హరి కథలు కథలుగా చెప్పిన మాటలు ఆ క్షణం రాజు చెవుల్లో మారుమోగసాగాయి. ఓకే బడిలో చదువుకుని, ఆడిపాడి పెద్దయ్యా రు. సెటిల్ అవగానే లక్ష్మినే పెళ్లి చేసుకుంటాడేమో అనుకున్నాడు రాజు. లక్ష్మి హరినే తన ప్రపంచంగా భావించి ప్రాణంగా ప్రేమించింది. రూంలో ఎప్పుడైనా ఖర్చులకు డబ్బులు లేకపోతే లక్ష్మి పంపించేది. పండగలకు బట్టలు కూడా గిఫ్ట్ ఇచ్చేది. హరి ఎదుగుదలలో లక్ష్మిది పెద్ద పాత్ర. ఎంతో ప్రోత్సహించింది. అవకాశాలు రావు అని నిర్వేదానికి లోనైన హరికి లక్ష్మి అందించిన ధైర్యం ఎప్పటికీ మరిచిపోలేనిది. డిగ్రీ వరకు చదువుకున్న లక్ష్మి ఊళ్లో తమకున్న పౌల్ట్రీఫాం వ్యాపారం చూసు కుంటోందని హరి చెప్పేవాడు. అప్పుడప్పుడు రాజు, జగన్లతో కూడా లక్ష్మి ఫోన్లో మాట్లాడేది. ఛామనఛాయలో కళగా ఉండే లక్ష్మి రూపాన్ని చూస్తూ హరి ఎంతో మురిసిపోవడాన్ని రాజు ఇంకా మరిచిపోలేదు.

సెటిల్ అయ్యాక అనూహ్యంగా హరి జీవితంలోంచి లక్ష్మి వెళ్లిపోయింది. ఎందుకు? ఆ విషయం దాదాపుగా అందరూ మరిచిపోయారు. ఆ ప్రస్తావన తెద్దాం అనుకుంటే వాళ్లు కలిసిన సందర్భాలు చాలా తక్కువ. “ఆ లక్ష్మీనా హరి” ఆదుర్దాగా అడిగాడు రాజు.. “అవును రాజు. మనం ఎన్నో అనుకుంటం గనీ మనకు ఏ పిల్ల రాసిపెట్టి ఉంటే ఆ పిల్లనే పెండ్లి చేసుకుంటం” తత్త్వం బోధించిన వాడిలా అన్నాడు హరి. రాజు భృకుటి ముడిపడింది. “మన పైసా,

ఫేమ్ ను చూసి ఇసుంటి లక్ష్ములు చాలామంది వస్తరు పోతరు కదా రాజు” జగన్ మాటలకు రాజు లోలోన ఉడుక్కు న్నాడు. పైకి నవ్వలేక నవ్వాడు. హరి కూడా ఫక్కున నవ్వుతున్నాడు. “లక్ష్మిని అంత ఈజీగా హరి ఎట్ల మరిచిపోయిండు? వీళ్ల బ్రేకప్ కి బలమైన కారణం వేరే ఉంది?” అని రాజు ప్రశ్నించుకుంటున్నాడు. మొదటిసారి వాళ్ల పంచులు చాలా గలీజుగా అనిపించ సాగాయి రాజుకి. “అయింది అయిపోయింది. మా అమ్మానాయినలు లక్ష్మిని వద్దన్నరు. నేను వాళ్ల మాటకు విలువిచ్చి, వాళ్లు జూసిన పిల్ల మెడలనే పుస్తెలతాడు కట్టిన. ఈమె గూడ నన్ను మరిచిపోవచ్చుగదా. ఇగో ఊకె గిట్ల చేస్తది. తెలువని ఏజుల ప్రేమించిన. తెలిసినంక మరిచిపోయిన గంతే” ముఖం చిట్లిస్తూ అన్నాడు హరి. “వాళ్లూర్లనే మన ఈవెంట్ అని పొల్ల నిన్ను కలవాలను కుంటున్నదేమో” జగన్ ఎగతాళికి “ఛీ” అన్నాడు హరి. చీనా? రాజులో మరిన్ని ప్రశ్నలు. “అబ్బా మనం నీళ్ల బాటిల్ తీసుకునుడు మరిచినం. నాకు దూప బాగైతున్నది” హరి అన్నాడు. “అక్కడ

ఎవరైనా ఇయ్యరా నీళ్లు” రాజు అన్నాడు. “ఏ నీళ్లు పడితే అవి తాగుతే పడిశం అయితది” జగన్ వక్కాణించాడు.

మాటల్లోనే ఈవెంట్ ఉన్న గ్రామానికి చేరుకున్నారు. కారు దిగుతున్న వాళ్లిద్దర్ని చూసి జనాలు,

గోలలు చేయసాగారు. ఆ గణపతి మండలి పెద్దలు ఓ ఇద్దరు ముగ్గురు వచ్చి మెడలో పూలదండలు వేసి స్వాగతాలు పలికారు. రాజు వైపు ప్రశ్నార్థకంగా చూస్తున్నారు వారంతా. “నా అసిస్టెంట్” అని చెప్పాడు హరి. రాజు షాక్ అవుతూ ముఖంలో బలవంతంగా నవ్వును పులుముకున్నాడు. ఎప్పుడూ వాళ్ల వెంట వెళ్లే అసిస్టెంట్ రాలేదని తనను తీసుకొచ్చారని తెలుసుకున్నాడు రాజు. వెంట అసిస్టెంట్ లేకపోతే నామోషీగా భావిస్తారనుకుని పోనీలే అనుకున్నాడు. వారికున్న క్రేజ్ కారణంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి జనాలు విరగబడ్డారు. వాళ్లను కంట్రోల్ చేయడానికి పోలీసులు వచ్చారు. ఆ జనాలను ఆశ్చర్యంగా చూస్తున్న రాజు చూపు ఓ చోట ఆగిపోయింది. జనాల మధ్య లక్ష్మి నిలుచుంది. తెల్లని చుడిదార్ వేసుకుని అందంగా కనిపించింది. హరి, జగన్లు వినాయకుడి వద్ద పూజలో పాల్గొన్నారు. అదే అదునుగా భావించిన రాజు, లక్ష్మి ఉన్న చోటికి ఒక్క ఉదుటున వెళ్లాడు. రాజును చూడగానే గుర్తు పట్టిన లక్ష్మి “రాజు బాగున్నావా” గట్టిగా అంది. జనాల లొల్లి కారణంగా రాజు కూడా వాయిస్ పెంచాడు. “బాగున్నా. నువ్వెలా ఉన్నావ్” అనగానే బాగానే ఉన్నానన్నట్టు తలాడిస్తూ కళ్లు చెమర్చుకుంది. తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్ చూసి “అవి మంచినీళ్లే గదా” అనగానే అవునన్నట్టు తలూపుతూ బాటిల్ ను అతనికి అందించింది. ఇందాక హరి దాహం అన్నాడు కదా ఈ నీళ్లు ఇద్దామనుకున్నాడు రాజు.

దూరం నుంచి రాజు అన్న పిలుపు విని కంగారుపడుతూ.. “నేను నీతోని ఫోన్ల మాట్లాడ ఇగో ఇది నా నంబర్. కాల్ జేసుడు మరిచిపోకు” అని ఓ చీటీ లక్ష్మికి అందించాడు. వెంటనే అక్కడి నుంచి స్టేజీ వద్దకు వెళ్లాడు. స్టేజీ మీద హరి, జగన్లు మాట్లాడుతున్నారు. జోకులు పేల్చుతూ అక్కడున్న వారిని నవ్విస్తున్నారు. రాజు ఆ జనాల్లో నిల్చున్న లక్ష్మి నే చూస్తున్నాడు. హరి మాట్లాడుతూ లక్ష్మిని చూసి చూపులు తిప్పుకోవడాన్ని రాజు గమనిస్తున్నాడు. కానీ, లక్ష్మి కళ్లలో అదే తరగని ఆరాధనా భావం. శాలువాలతో సన్మానించి తిరిగి ఇంటికి పంపిస్తూ ఈవెంట్ కు మాట్లాడినంత సొమ్మును వారి చేతిలో పెట్టారు. కారులో కూర్చున్నారు. లక్ష్మి కారు దగ్గరకు పరుగెత్తుకు వచ్చింది. వారి ఆమెను కావాలనే ఇగ్నోర్ చేస్తూ రేసు పెంచాడు. కారు దుమ్ము రేపుకుంటూ ముందుకు వెళోంది. ఆ దుమ్ము లక్ష్మిని ఆవరించింది. అయినా రెప్పవాల్చకుండా వెళ్తున్న కారునే చూస్తోంది. హరి చర్యకు షాక్ అయిన రాజు కారు వెనుక అద్దంలోంచి లక్ష్మినే చూస్తున్నాడు. మనసులో దేవినట్టైంది రాజుకు. “పాపం లక్ష్మి ఎంత బాధపడుతున్నదో’ అనుకుని అటే చూస్తున్నాడు. దూరం వెళ్తున్న కొద్దీ లక్ష్మి ఆ ధూళిలో కనుమరుగైంది. రాజు ఉండబట్టలేక “హరీ.. లక్ష్మిని కనీసం పల్కరియ్యాల్సింది” అన్నాడు.

ఆ మాటకి రాజు వైపు ఉడుగ్గా చూశాడు హరి. ఆ టాపిక్ ఇష్టం లేనట్టు మాట మారుస్తూ “అబ్బా దూ పైతున్నది” జగన్ అనగానే రాజు తన చేతిలో ఉన్న లక్ష్మి ఇందాక ఇచ్చిన బాటిల్ ఇవ్వబోయాడు. “నాకియ్యి ముందుగాల” అని హరి ఆ బాటిల్ లాక్కుని “ఏడ తెచ్చినవు బాటిల్” అంటూ గొంతులో పోసుకుంటున్నాడు. “లక్ష్మి ఇచ్చింది” అనగానే ఏదో షాకింగ్ వార్త విన్నట్టు కారుకు సడెన్ బ్రేక్ వేసి, నోట్లో పడ్డ నీళ్లను ఊసేశాడు. చేతిలో ఉన్న బాటిల్ వైపు అసహ్యంగా చూస్తూ దూరంగా విసిరేశాడు. నీళ్లు ఇంకా నోట్లో మిగిలి ఉన్నాయేమోనని లోగొంతులోంచి కాకరించి ఉమ్మేస్తున్నాడు. “రాజూ.. హరికి ఇసుంటియి నచ్చయి గదా. ఎందుకిట్ల చేసినవు” అంటూ కారు దిగి అక్కడే ఉన్న ఓ కిరాణా షాపులోకి వెళ్లి మినరల్ వాటర్ బాటిల్ అందుకున్నాడు జగన్. వెంటనే ఆ బాటిల్ అందుకుని పుక్కిలించి ఉమ్మాడు. నోట్లో నోట్లో ఏవో మంత్రాలు చదువుతూ లెంపలు వేసుకుంటున్నాడు. రాజు ముఖం ప్రశ్నార్థకంగా మారింది? లక్ష్మి మీద హరికి ఎందుకు ఇంత అసహ్యం? ఆమె ఇచ్చిన నీళ్లు తాగనంతగా ఏమంత పెద్ద తప్పు చేసింది? రాజు బుర్ర వేడెక్కుతోంది. ఇంక ఏం మాట్లాడకుండా మౌనం వహించాడు రాజు.

గదిలో అవే ఆలోచనలతో సతమతం అవుతున్నాడు రాజు. లక్ష్మితో మాట్లాడి ఈ గందరగోళానికి క్లారిటీ తీసుకోవా లనుకుంటున్నాడు. తన నంబర్ లక్ష్మికి ఇచ్చాడు గానీ, ఆమె నంబర్ తీసుకోవడం మర్చిపోయాడు రాజు. తను ఫోన్ చేస్తుందో లేదో అని హైరానా పడుతున్నాడు.

వారం తర్వాత ఆ రోజు రాత్రంతా ఓ సీన్ విషయంలో తర్జన భర్జనలు పడ్డ రాజు లేట్ నైట్ నిద్రపోయాడు. ఉదయం పదకొండు అవుతున్నా లేవలేదు. ఫోన్ రింగుతో మెలకువ వచ్చి కళ్లు నులుముకుంటూ ఫోన్ స్క్రీన్ చూశాడు. కొత్త నంబర్ ఉంది. లిఫ్ట్ చేసి ‘హలో’ అన్నాడు. “హలో రాజు నేను లక్ష్మిని మాట్లాడుతున్నా” అంది. లక్ష్మి వాయిస్ వినగానే రాజుకి నిద్రమబ్బు ఎగిరిపోయింది. ఠక్కున లేచి కూర్చున్నాడు. ఐదేళ్ల తర్వాత లక్ష్మితో మాట్లాడుతున్నాడు రాజు. చాలా ఎగ్జిట్ మెంట్ గా ఫీలవుతున్నాడు. మరోవైపు తనలో రగులుతున్న ఎన్నో అనుమానాలను నివృత్తి చేసుకోవాలనుకుంటున్నాడు. “రాజు నీకు వీలైతే ఒకసారి మా పౌల్ట్రీఫాంకు రా – మాట్లాడుకుందాం” అంది. సరే అన్నాడు రాజు. బైక్ కిక్ కొట్టాడు , ఎక్సలేటర్ పెంచాడు.

సిటీ నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరం. లక్ష్మి చెప్పిన ఊరి శివారులో ఉన్న పౌల్ట్రీఫాంకు వెళ్లాడు. మగాడి కన్నా ఎక్కువగా కష్టపడుతోంది లక్ష్మి. ఆమెను చూడగానే తెలియని ఆత్మీయత ఉప్పొం గింది రాజులో. రాజును చూడగానే బుట్టల్లో కోడిగుడ్లు ఏరుతున్న లక్ష్మి వాటిని పక్కన పెట్టి చేతులు కడుక్కుంది. అటుపక్క లక్ష్మి వాళ్ల అమ్మానాన్నలు ఓ ఇద్దరు కూలీవాళ్లు గుడ్లను ట్రేలలో పేర్చుతున్నారు. ఫామ్ బయటున్న గద్దెను చూపించింది కూర్చోమని. లక్ష్మిలో అదే చెరగని అందం. మార్చి మార్చి చూస్తున్నాడు రాజు. ఆ కళ్లల్లో హరి ఇంకా ఉన్నాడని తెలుస్తోంది. మరో మాటకు ఆస్కారం లేకుండా “అసలేం జరిగింది నీకు హరికి మధ్య. నిన్ను అసహ్యించుకునేటంత తప్పు పని ఏం చేసినవ్ నువ్వు” అడిగాడు. ఆ ప్రశ్నకు నొచ్చుకుంది లక్ష్మి. మౌనంగా కూర్చున్న ఆమె కంట్లోంచి టపటపా కన్నీళ్లు నేల మీద రాలుతున్నాయి. మళ్లీ రాజే అందుకుంటూ “మీరిద్దరు పెళ్లి చేసుకుంటరు అనుకున్నా. సరే బ్రేకప్ అయిందేమో అనుకున్నా కానీ, ప్రేమించిన వ్యక్తిని అసహ్యించుకునేటంత తప్పు నువ్వైతే చెయ్యవు” అంటున్న రాజు మాట పూర్తి అవనే లేదు లక్ష్మి అందుకుంటూ “నేను తక్కువ కులంల పుట్టిన. అందుకే నన్ను అసహ్యించుకుంటున్నడు” లక్ష్మి సమాధానానికి రాజు తల గిర్రున తిరిగింది.

“చిన్నప్పటి నుంచి మా నడుమ ప్రేమ చిగురించింది. నా ప్రాణం కన్నా ఎక్కువ హరిని ప్రేమించిన. అది నీకు జగన్ కు, ఎర్కనే. అప్పటికి మా అమ్మానాయిన మొత్తుకుంటనే ఉన్నరు. ‘అద్దు బిడ్డా.. మన కులం వాళ్ల కన్నా శాన తక్కువ కులం. పెండ్లికి ఒప్పుకోరు’ అన్నారు.

కానీ కళాకారులకు కులం మతం ఉండయి గదా అనుకున్నా. వాళ్ల అమ్మానాయినలు నన్ను పెండ్లి చేసుకోవద్దని గట్టిగ చెప్పిర్రు.

అప్పటికే హరి, జగన్లు ఓ సంఘంల జాయిన్ అయ్యిర్రు. ఆ సంఘంల ఏ కులపోల్లు దేవుని దేహంలకెల్లి ఎక్కడెక్కడి నుంచి పుడుతరో చెప్తరు. వాళ్ల లెక్క ప్రకారం మేము దేవును కాళ్లకాడినుంచి పుట్టినం అన్నమాట. దేవుని ఛాతిలకెల్లి పుట్టిన వాళ్లు నన్ను ఎట్ల పెండ్లి చేసుకుంటరు చెప్పు? హరిని నమ్మి పిచ్చిదాని లెక్క నా సర్వస్వాన్ని అప్పజెప్పిన. హరికి నాతోని లవ్,

రొమాన్స్ అంత నడిసింది గానీ, పెండ్లి కాడ అవన్నీ నడవయి అన్నట్టే నడుసుకున్నడు” అంటున్న లక్ష్మి కళ్లు ఏరుధారలయ్యాయి. రాజు మరింత షాక్ అయ్యాడు. హరి కులమతాలు ఏం లేవని చేసిన స్కిట్ ఉత్తకతనే అనుకున్నడు. “మీదికి చెప్పేతందుకు నీతులు మస్తు చెప్తరు గానీ అసలు కత వేరే ఉంటది” అనుకున్నాడు.

“కేవలం కులాలను పట్టుకొని మనసుల ఉన్న ప్రేమను సంపుకున్నడు హరి. కనీ నాకు హరి మీద ఎసుంటి కోపం లేదు. మనిషిగా హరిని నేను నా కంట్ల పానం ఉన్నంతవరకు ప్రేమిస్తనే ఉంట” జీరగా అంటున్న లక్ష్మిని చూస్తున్న రాజు రెండు చేతులెత్తి మొక్కాడు. “తన కులం అమ్మాయిని, అన్ల పైస బగ్గున్న అమ్మాయిని పెండ్లి చేసుకుని తన ధర్మాన్ని నిలపెట్టిండా హరి? నీ అసుంటి దేవతను కాలదన్నిన హరి ఏదో ఒక రోజు నీ వ్యాల్యూ తెలుసుకుంటడు” రాజు మాటలకు దీర్ఘంగా శ్వాస పీల్చి వదులుతూ నిట్టూర్చింది లక్ష్మి.

కాసేపు మౌనం. లక్ష్మి ఇచ్చిన నీళ్లను ఇందుకోసమా తాగలేడు? అనుకుని నోరు వెళ్లబెట్టాడు రాజు. హరి లక్ష్మిని అసహ్యించుకున్న దానికి వంద రెట్లు ఎక్కువ అసహ్యం కలుగుతోంది. వారిద్దరి

మీద. ఆలోచనల నుంచి బయటకు వచ్చి “దాహంగా ఉంది మంచినీళ్లు ఇయ్యు లక్ష్మి” అని అడిగాడు. వెంటనే లక్ష్మి వెళ్లి అక్కడున్న కుండలోని నీళ్లను గ్లాసులో తెచ్చి ఇచ్చింది. తన చేతి నీళ్లు తాగుతాడా లేదా అనే సంశయం ఆమె కళ్లల్లో చదివాడు రాజు. నవ్వుతూ ఆ గ్లాసును అందుకున్నాడు గటగటా తాగుతున్నాడు. గొంతు దిగుతున్న ఆ నీళ్లలో వారికి కనిపించిన ఏ కులం కంపు వాసన కనిపించడం లేదు రాజుకి. ‘అదే రుచి, అదే పవిత్రత. ఒకరి శత తీసుకున్నంత మాత్రాన గంగ అపవిత్రం అయిపోతదా… వాళ్ల పిచ్చి గాకపోతే” అనుకుంటూనే నీళ్లు తాగేశాడు. “నాకు ఉన్న ఈ పేరు గూడ అగ్రకుల దేవత పేరని మార్చుమంటరేమో ముందుముందు” సంశయంగా అంది లక్ష్మీ.

“మూర్ఖులు ఎన్నో అనుకుంటరు. అనుకోనియ్. కనీ లాస్టుకు మిగిలేది మానవత్వం, మంచితనమే” ఎదనిండా శ్వాస పీలుస్తూ అన్నాడు రాజు. రాజును మురిపెంగా చూస్తోంది లక్ష్మి. “నీతోని ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి లక్ష్మి” అన్నాడు. ఏంటన్నట్టు చూస్తోంది లక్ష్మి. “నువ్వు, హరి, జగన్ అనుకున్నట్టు నా పేరు రాజు కాదు.. మొహమ్మద్ ఖలీల్” అంటున్న రాజును చూస్తూ షాక్ అయింది లక్ష్మి. “ఏంది నువ్వు చెప్తున్నది నిజమా?”

“అవును లక్ష్మి. నా ఆధార్ కార్డ్ వాళ్లకు కనిపియ్యకుంట చాలా జాగ్రత్త పడ్డ. నేను ఈ కులపోన్నని తెలుస్తే నన్ను గూడ రూంలకెల్లి,

దోస్తాన్ కెల్లి ఎప్పుడో వెలేసెటోళ్లు గావచ్చు. వాళ్లు గూడ ఇట్ల మారి మనిషిని కులం కండ్లతోని సూస్తరని అనుకోలే. ఎన్నో రంగుల కలలు కని ఇక్కడికి వస్తే కళారంగం సాంతం రంగులు పులుముకుని ఉంది. మీదికి మాత్రం హరిలాగ సామాజిక స్పృహ అనుకుంట తెగ నటిస్తున్నది. ఓటు బ్యాంకు రాజకీయాలు ఎట్లనో కళారంగంల గూడ తెర మీద అందరం సమానం అని తెగ కలర్ ఇస్తున్నరు. సినిమాను అందరు సూసైనే పైసలు వస్తయి కాబట్టి కలుపుకుపోతున్నట్టు మసలుతున్నరు. కానీ లోపట ఇసుంటి కపట బుద్ధి వేన్నూళ్లుకున్నది. ఇట్ల నాలెక్క ఎందరో తమ అస్తిత్వాలను సంపుకొని పేర్లు మార్చుకుంటున్నరు. ఉన్న పేరు జెన్రీ అంటనియ్యరు, ఎదగనియ్యరు.

అందుకే నేను ఈడికి వచ్చేటప్పుడే పేరు రాజుగా మార్చుకున్న. నేను మా ఇంటోళ్లతోని ఎప్పుడు హిందీలనే మాట్లాడేటోన్ని. అప్పుడు హరి, జగన్ నన్ను అడిగేటోళ్లు ఎందుకు హిందీల మాట్లాడుతున్నవని. అప్పుడు నేను ఇంకో కట్టుకథ అల్లిన. మేము నార్త్ ఇండియన్స్.. ఈడికి బతకొచ్చినం అని చెప్పిన” అంటున్న రాజు వైపు నమ్మలేనట్టు చూస్తోంది లక్ష్మి.

మళ్లీ రాజే అందుకుంటూ “నీ బాధ ఇన్నంక నేనేందో నీకు చెప్పాలనిపిచ్చింది” ముభావంగా అన్నాడు. షాక్ నుంచి తేరుకుంటూ “అబద్దపు పునాదుల మీద మనం ఎదగొద్దు రాజు. మన అస్తిత్వం, మన పేరుతోనే ఎదగాలి. ఎంతమందిని తొక్కేస్తరు వాళ్లు చెప్పు?” అంటున్న లక్ష్మి మాటలు వింటున్న రాజులో ఆత్మవిశ్వాసం రెట్టింపై బలపడుతోంది. మనసులో ఏదో గట్టిగా నిర్ణయించుకున్నాడు.

మంచి ఆత్మీయురాలిగా మారిన లక్ష్మి నిత్యం అందిస్తున్న ప్రోత్సాహంతో ఖలీల్ అలియాస్ రాజు దర్శకుడిగా సినిమా తీశాడు. తన అసలు పేరుతోనే ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. పలు యూట్యూబ్ ఛానెల్స్ లో ఖలీల్ ఇంటర్వ్యు లను జగన్, హరి చూసి షాక్ అయ్యారు. “నీ పేరు రాజు కాదా? నీది ఆ మతమా?” ఇద్దరి దగ్గరి నుంచి ఇవే ప్రశ్నలు. “యస్ నేను నా కులం కన్నా ముందు మనిషిని. నేను మనిషిని మాత్రమే గౌరవిస్త” అని రిప్లై ఇచ్చాడు. ‘తన సమాధానం విని ఇంతకాలం తనతో కలిసి ఉన్న పాపాన్ని ఏ నీళ్లతో కడుక్కుంటారోనని” అనుకుని చిన్నగా నవ్వుకున్నాడు. తల తిప్పి ఎదురు సోఫాలో కూర్చున్న లక్ష్మిని చూశాడు. లక్ష్మి ముసిముసిగా నవ్వుతోంది. తర్వాతి సినిమా డిస్కషన్లో పడ్డారిద్దరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com