నాటి నవలలో హైదరాబాద్ సమాజ ఆవిష్కరణ

దక్షిణ ఏషియా ప్రాంతంలోని సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ఉద్దేశ్యంతో ఐక్య రాజ్యసమితికి అనుబంధంగా నడిచే యునెస్కో సంస్థ 1968-71 మధ్య కాలంలో ఐదు పుస్తకాలను ప్రచురించింది. ఇందులో బిభూతిభూషణ్ బందోపాధ్యాయ రాసిన పతేర్ పాంచాలి, ప్రేమ్ చంద్ రాసిన ‘గోదాన్’, అలాగే ఆయన చిన్న కథలు ఆంగ్లంలోకి తర్జుమా చేసి ఆ సంస్థ ప్రచురించింది. దీనితో పాటు ఉర్దూలో అహ్మద్ అజీజ్ రాసిన ‘హైసీ బులందీ హైసీ పస్తీ’ నవలను కూడా ప్రచురించింది. దీన్ని రాల్స్ రసెల్ ఇంగ్లీషులోకి ‘షోర్ అండ్ వేవ్’ పేరిట తర్జుమా చేసిండు. జపనీస్ భాషలో రాసిన పుస్తకాలు ‘ఫుట్ ప్రింట్స్ ఇన్ స్నో’, ‘పిల్లర్ ఆఫ్ ఫైర్’ పేరిట వెలువడ్డాయి. బిభూతి భూషణ్ బంధోపాధ్యాయ పతేర్ పాంచాలి’ పుస్తకాన్ని 1929లో రాసిండు. దీన్ని 1955లో సత్యజిత్ రే అదే పేరుతో సినిమాగా తీసిండు. ఈ పుస్తకాన్ని మద్దిపట్ల సూరి అదే పేరుతో తెలుగులోకి 1960లో తర్జుమా చేసిండు. ఆ తర్వాత

యునెస్కో సంస్థ తరపున టి.డబ్ల్యు క్లార్క్, తారపద ముఖర్జీలు ఇంగ్లీషులోకి తర్జుమా చేసిండ్రు. ఇది 1968లో ప్రచురితమయింది. అలాగే మున్నీ ప్రేమ చంద్ 1936లో రాసిన ‘గోదాన్’ నవలను’గిఫ్ట్ ఆఫ్ ఏ కౌ’ పేరిట 1968లో గార్డన్ సి. రోడర్మెల్ తర్జుమా చేసిండు. అలాగే

ప్రేమ్ చంద్ చిన్న కథలను ఇంగ్లీషులోకి డేవిడ్ రూబిన్ తర్జుమా చేసిండు. ఇది ‘వరల్డ్ ఆఫ్ ప్రేమ్ చంద్’ పేరిట అచ్చయింది. వీటన్నింటినీ యునెస్కో సంస్థ ప్రచురించింది. ఇవన్నీ కూడా తెలుగులోకి కూడా తర్జుమా అయ్యాయి. అయితే ఇక్కడ చర్చించుకుంటున్న నవల ‘షోర్ అండ్ వేవ్’.

‘షోర్ అండ్ వేవ్’ని పాకిస్తాన్ ప్రాతినిధ్య నవలగా యునెస్కో ప్రచురించింది. అయితే ఈ నవలలోని కథాంశం 1945లో రెండో ప్రపంచ యుద్ధ ఆరంభం నుంచి ఇండియా-పాకిస్తాన్‌గా విడిపోయే వరకు హైదరాబాద్ నగర ఉన్నత ముస్లిం (నవాబుల) కుటుంబాల జీవనశైలిని, ఆనాటి స్థితిగతుల్ని,సంస్కృతిని మనసుకు హత్తుకునే విధంగా అహ్మద్ అజీజ్ రాసిండు. అంతే ఉన్నతంగా ఈ నవలను బ్రిటన్‌కు చెందిన లండన్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ రాల్స్ రస్పెల్ అనువదించిండు.

హైదరాబాద్ ఆత్మను ఆవిష్కరించిండు. ఇందులోని పాత్రలను ప్రత్యక్షంగా పేర్కొనకుండా కల్పిత పాత్రలను, ప్రాంతాలను సృష్టించిండు. హైదరాబాదు ఫర్టూందనగర్, సికింద్రాబాదు తాబిందనగర్ గా, హుసేన్నగరని షాహిద్నగర్‌, బంజారహిల్స్ ని కిషన్పల్లిగా పేర్కొన్నాడు. ఏడో నిజామ్ ని ఖాన్ హజ్రత్ గా, ఆయన ప్రధానిని రాజా ఆఫ్ రాజాస్ షుజాత్ షం షేర్ సింగ్ బహదూర్‌గా పేర్కొన్నాడు. ఆధునికత వైపు వేగంగా అడుగులు వేస్తున్న హైదరాబాద్ కట్టడాలు, అందులోని విలాసవంతుల జీవితాలను ఈ నవల్లో చిత్రించాడు. హైదరాబాద్లోని మూడు ఉన్నత నవాబీ కుటుంబాలు, రాజాస్థానంలో ఒకరిపై ఒకరు పై చేయి కోసం వేసే ఎత్తుగడలు, కయ్యాలను వియ్యం ద్వారా నెయ్యంగా మార్చుకోవడం ప్రధానంగా స్త్రీ పాత్రల ద్వారా కథను నడిపించిన తీరు అద్భుతం. ఈ నవల రచనా కాలం 1948. ఉర్దూలో అచ్చయింది కూడా ఈ కాలంలోనే. అయితే ఆంగ్లంలోకి 1971లో తర్జుమాఅయింది. అయినప్పటికీ ఈ నవలయొక్క వన్నె ఏ మాత్రం తగ్గలేదు. మీదు మిక్కిలి హైదరాబాద్ ఔన్నత్యాన్నిప్రపంచానికి తెలియజేసింది.

నవాబీ ఖాందాన్‌కు చెందిన ఖుర్షీద్ జమానీ ఆమె కూతురు నూర్జహాన్కేంద్రంగా ఈ నవల నడిచింది. ఖుర్షీద్ జమానీ 1920 ఆ కాలం నాటికే ఇంట్లో ఉన్న వాళ్ళని డార్లింగ్’ అని పిలిచేది. ఆమె ఆంగ్ల విద్యా ప్రవీణురాలు. విదేశాల్లో చదువుకున్నది. మొత్తం హైదరాబాద్ రాజ్యంలోనే ఆమెలాగా ఆంగ్లంలో అనర్ఘళంగా మాట్లాడేవారు లేరు అనే ప్రతీతి. ఎంత జ్ఞానవంతురాలో అంత అందగత్తె కూడా! ఈమె తండ్రి ఖబిల్ జంగ్ నిజాం ఆస్థానంలో ఉన్నతోద్యోగి. ఈయన తన మొదటి భార్య చనిపోయిన తర్వాత ఐదేండ్లకు బిడ్డకు ట్యూషన్లు చెప్పే గ్రేస్ క్రూ (సికందర్ బేగమ్) అనే ఆంగ్ల వనితను పెళ్ళి చేసుకున్నడు. అంటే ఆంగ్లో-ముస్లిం వివాహమనేదిహైదరాబాద్లో 1930 ఆప్రాంతంలో చాలా విరివిగా ఉండే వనేది అర్థమైతుంది. ఈ విషయం తర్వాత నవలలో వచ్చే పాత్రల ద్వారా మరింత అర్థమైతది. ఖుర్షీద్ జమానీ భర్త సంజయ్ బంగర్ నిజాం ఆస్థానంలో కమీషనర్ పదవిలో ఉన్నాడు. వీళ్లకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వీళ్ళ చుట్టూతా ఈ నవల నడుస్తుంది.

ఈ నవల్లో హైదరాబాద్లోని ముస్లిం సమాజంలో భాగమైన ఆధునికత, సంస్కృతి, ఆచారాలు, నమ్మకాలు, నిజాం రాజు అలవాట్లు, నవాబీ ఖాందాన్ల చుట్టరికాలు, చదువులు, వృత్తులు, పాలనా వ్యవహారాలు తదితర అంశాలు రికార్డయ్యాయి. వీటన్నింటిలోనూ హైదరాబాద్ ఆత్మ ప్రతిఫలించింది. గంధ, ధూపపు గాఢమైన పరిమళం మైమరపింప జేసింది. ఇచ్చిన మాటకోసం ‌ కట్టుబడే ఖచ్చితత్వం, ఆంగ్లో- ఇండియన్( ముస్లిం) సహవాసం, దోస్తానా‌ ఇందులో ఆవిష్కృతమయింది. హైదరాబాద్ లోని నవాబీ కుటుంబాలుమషూర్ ల్ ముల్క్, ఖబిల్ జంగ్, జలీల్ జంగ్ కుటుంబాల చుట్టూ కథ నడుస్తుంది. ఆనాడు ముల్క్, జంగ్,మొయునుద్దేలా అనేది రాజ కుటుంబీకుల బిరుదులు. ముల్క్ కన్నా జంగ్ పెద్ద బిరుదు. జంగ్ కన్నామొయునుద్దేలా ఇంకా పెద్ద బిరుదు. ఇప్పటికీ హైదరాబాద్ లో దేశవ్యాప్తంగా ఖ్యాతి గాంచిన ‘మొయినుద్దేలా క్రికెట్ కప్ పోటీలు జరుగుతాయి. వీరందరూ ఒకే పేరుతో అదే ‘నవాబ్ సాబ్’ పేరిట పిలువబడేవారు.

ఈ నవలలోని కథాంశం హైదరాబాద్ లోని నవాబీ ఖాందాన్ లోని వ్యక్తుల నిత్య జీవితంలో ఎదురయ్యే వివాదాలు, విషయాలే! వీటన్నింటినినూర్జహాన్ అనే మహిళ కేంద్రంగా రాయడమయ్యింది. సంజర్ బేగ్, ఖుర్షిద్ జమానీల కూతురు నూర్జహాన్. సంజర్ బేగ్ నిజాం ప్రభుత్వంలో ఉన్నతోద్యోగి.

నూర్జహాన్ వివాహం బయటిప్రాంతంలో ఇంజనీరింగ్ చదువుకున్న సుల్తాన్ హుసేన్తో జరుగుతుంది. సుల్తాన్ అప్పటికే అన్ని ఖండాల్లో విహారయాత్రలు చేసి ఉన్నాడు. అంటే ఎంత విస్తృతంగా ప్రపంచాన్ని చుట్టివచ్చాడో అర్థం చేసుకోవచ్చు. ఆయన ప్రతి సంవత్సరం ఒక నెల రోజుల పాటు వేసవి అలసట తీరేందుకు ముస్సోరిలో గడపడం అలవాటుగా చేసుకున్నాడు. ఆనాడు ముస్సోరిలోని హెూటల్లలో సుల్తాన్, ఆయన మిత్రులు (ఆడ, మగ) జాలీగా గడిపేవారు. 35వ యేట 19 ఏళ్ళ నూర్జహాన్ని పెళ్ళి చేసుకున్నాడు. ముస్పోరికి హనీమూను వచ్చిననాడే భర్త తన పాత మిత్రురాలుతో ప్రణయంకొనసాగించడాన్ని చూస్తుంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్యన ఉన్న ఏజ్ గ్యాప్, సుల్తాన్ హుసేన్విచ్చలవిడితనం, తాగుడు ఆమెకు నచ్చలేదు. దాంతో పాటు ఒకసారి గొడవలో నూర్జహాన్ని సుల్తాన్ చెంపదెబ్బకొడతాడు. దీంతో విషయం తెలుసుకొని కోపోద్రిక్తురాలైన ఖుర్షిద్ జమానీ సంఘటనకు ఎలాంటి సంబంధంలేని అమాయకులైన సుల్తాన్ తల్లి, చెల్లి జుబూదాని తూలనాడుతుంది. తర్వాతి కొంతకాలానికి అనివార్యంగా వీరి ఖాందాన్లలోనే మొదటిసారిగా ‘విడాకులు’ తీసుకున్నరు. ఆ తర్వాత తన చిన్ననాటి దోస్తు అతర్ ని నూర్జహాన్ని పెళ్ళాడుతుంది. ఆ తర్వాత సుల్తాన్ కూడా మరో పెళ్ళి చేసుకుంటాడు.

హైదరాబాద్ నగరంలో ఆంగ్లో-ముస్లిం వివాహాలు చాలా సర్వసాధారణంగా జరిగేవి. అంతేగాదు తాబిందనగర్ (సికింద్రాబాద్) లోని క్లబ్బుల్లో జరిగే పార్టీల్లో డాన్సులు,రోల్స్ రాయిస్ కారుల్లో కిషన్పల్లి (బంజారాహిల్స్) నుండి ప్రయాణాలు విందులు, వినోదాల గురించి అజీజ్ అహ్మద్ రాసిండు. ఈ నవల ప్రారంభం కావడమే బంజారా స్త్రీలు తమ వస్తువులను అమ్ముకోవడానికి వివిధప్రాంతాల నుంచి వచ్చిన తీరు. ఆ తర్వాత వారి వృత్తి పోవడం. అదే సమయంలో నగరానికి ఆవల వారు నివాసం ఏర్పాటు చేసుకోవడం గురించి రాసిండు. ఈ బంజారాలు నివసించే

ప్రాంతం కొండలు, గుట్టలు, పచ్చని పచ్చిక, నీటి కొలనులు, సూర్యోదయం , చంద్రుని మెళుకువ అన్నీ అద్భుతంగా ఉండడంతో నిజాం నవాబు దగ్గర త్వరలోప్రధానిగా నియమితులుగానున్న అస్లీ హస్కర్ జంగ్ ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసిండు. ఇక్కడి ఇండ్లు విదేశాలను తలపించే విధంగా నిర్మించిన విధానాన్ని ఆయన నవల్లో వర్ణించిండు. జర్మనీ, ఇటలీల నుంచి తెప్పించిన వస్తువులతో ఈ ఇండ్ల ఇంటిరీయర్స్ ని డెకరేట్ చేయడం కూడా ఇందులో రాసిండు. మిత్రులతో ఏరి కోరి అక్కడ స్థలాలు కొని భవంతులు నిర్మించుకునేలా హస్కర్కంగ్ కృషి చేసిండు. ఇతనే ఆప్రాంతానికి నిజాం సంస్థానంలోని హిందు పండితుడితో ‘కిషన్పల్లి’ పేరిట చరిత్రను రాయించడానికి పూనుకుంటాడు. ఎందుకంటే అంతకుముందు ఆ పండితుడు తనకు కలలో శ్రీకృష్ణుడు కనిపించి తన గురించి రాయిమన్నాడు అని చెప్పుకుంటాడు. దీన్ని గుర్తుంచుకొని హస్కర్ జంగ్ ఆ పండితునితో ‘కిషనల్లి’ చరిత్రను రాయమంటాడు. నిజానికిది ఇవ్వాళ బంజారా హిల్స్’గా ప్రసిద్ది. బంజారాహిల్స్ రూపుదిద్దుకుంటున్న నాటి చిత్రాన్ని మనకళ్ల ముందుంచిండు. నవాబులకు ఒక్కొక్కరికి ఒకటి కన్నాఎక్కువ భవంతులు ఉన్న తీరును, కొంత మంది తమ ‘ఉన్నత స్థాయి’నిమెయింటెయిన్ చేయడానికి ఫాల్స్ ప్రిస్టేజ్ కు పోయి అప్పులపాలయిన తీరుని కూడా చెప్పిండు. అంతెందుకు నిజాం నవాబ్ తన చాయ్ లో మార్జువానా లాంటి మత్తుపదార్థాన్ని సేవించేవాడని కూడా ఒక దగ్గర రాసిండు. ఆనాడు నిజాం గురించి అలా రాయడానికి (ఎంత కల్పిత పేరు పెట్టినప్పటికీ) సాహసముండాలి. అంతేగాకుండా ఆనాటి నవాబ్ ఖాందాన్లో పెళ్ళి కావాల్సిన బాలురకు ‘ఉంపుడు గత్తె’లుండటం సర్వ సాధారణం. బాలురు బయట చెడుతిరుగుళ్లు తిరుగుతున్న తీరు, బంజారాహిల్స్ రాళ్ళు కొట్టుకునేవడ్డెర స్త్రీల పై అత్యాచారాలకు పాల్పడే ‘చోటే నవాబు’ల గురించి రాసిండు. వీరికి ఉంపుడుగత్తెలుగా అత్యంత పేదరికంలో ఉన్నటువంటి 14-15 ఏండ్ల అమ్మాయిలను తీసుకొచ్చి ఇంట్లోనే ఉంచుకొనే తీరుని, వీరు చోటే నవాబులకు అందించే సేవల’ గురించి కూడా చెప్పిండు. అంతెందుకు ఉన్నత కుటుంబాల్లోని స్త్రీలు పర్వర్ట్’గా మారిన తీరుని జీనత్ పాత్ర ద్వారా చెప్పిండు. ఆమె ఆఖరికి కల్లు కూడా తాగడాన్ని కూడా రికార్డు చేసిండు. ఇదంతా హైదరాబాద్ సంస్థానంలోని ముస్లిం ఖాందానీ కల్చర్, జీవన విధానంలో భాగంగా అజీజ్ చెప్పిండు.

పైన చెప్పుకున్నట్లుగా బిభూతిభూషణ్ బంధోపాధ్యాయ, ప్రేమ్ చంద్ రాసిన రచనలు దాదాపు 50 ఏండ్ల నుంచే తెలుగు పాఠకులకు తెలుసు. అయితే ఉర్దూలో రాసిన ‘హైసీ బులందీ హైసీ పస్తీ’ గురించి పెద్దగా తెలియదు. ఈ నవలాకారుడు అహ్మద్ అజీజ్ పక్కా హైదరాబాదీ. హైదరాబాద్లో 1914లో పుట్టిన అహ్మద్ ఉర్దూలో కథలు, నవలలు రాయడమే గాకుండా ఇక్బాల్ రచనల్లో నిష్ణాతుడు. మంచి పరిశోధకుడు. ఈయన దేశ విభజన తర్వాత పాకిస్తాను వెళ్ళిండు. అక్కడ ఒకటి రెండేండ్లు ఉండి కెనడాకు వెళ్ళిండు. కెనడాలోని విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషు ప్రొఫెసర్‌గా పనిచేసిండు. అంతకు ముందు ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో కూడా పనిజేసిండు.అంతేగాదు ప్రిన్సెస్ దుర్రెషెవారు వ్యక్తిగత కార్యదర్శిగా వ్యవహరించిండు. ఆమెతో పాటు కాశ్మీర్ లో పర్యటించిండు. ఆ అనుభవంతో మూడుతరాల కశ్మీరీ జీవితాన్ని కథల్లో చిత్రించిండు. 1946లో అజీజ్ ఉర్దూలో రాసిన పుస్తకమే ఇప్పటికీ అభ్యుదయ రచయితల సంఘానికి సంబంధించిన అథెంటిక్ పుస్తకం అంటే అతిశయోక్తి కాదు. ఈయన 16, డిసెంబర్, 1978లో చనిపోయిండు. ఇక నవలను ఇంగ్లీషులోకి హృద్యంగా తర్జుమాచేసిన రాల్స్ రస్సెల్ ఆ భాషలో నిష్ణాతులు. బ్రిటన్ కమ్యూనిస్టు పార్టీ సభ్యుడైన రస్సెల్ ఉర్దూ ప్రతిభను | గుర్తించి పాకిస్తాన్ ప్రభుత్వం ఈయనకు – ‘సితార-ఎ-ఇంతియాజ్’ అవార్డుని బహూకరించింది.

హైదరాబాద్ ది గంగా-జమున తెహజీబ్. పంచభాషా సంస్కృతికి ఆలవాలం. ఇంగ్లీషు, ఉర్దూ, తెలుగు, మరాఠీ, కన్నడ హైదరాబాద్ రాజ్య అధికార భాషలు. అయితే ఈ సంస్కృతి క్రమేణా తెలంగాణ సాయుధ పోరాటం కాలం నుంచి కనుమరుగయింది. అందుకే ఇవ్వాళ తెలుగు తెలిసిన ముస్లింలు (ముఖ్యంగా హైదరాబాద్ లో), ఉర్దూ తెలిసిన హిందువులు’ ప్రధానంగాగ్రామాల్లో) చాలా తక్కువ. హైదరాబాద్లో పక్కపక్కనే కలిసి జీవిస్తున్నా వీరి విషయాలు వారికి, వారి విషయాలు వీరికి పట్టింపులో ఉండవు. ఎవరి ఉద్యమాలు వారివి. ఎవరి ఇలాఖా వారిది. కాలం, దానితో పాటు రాజకీయాలు వీరిద్దరినీ పరస్పరం శత్రువులుగా మార్చింది. ఎగ్జిబిషన్గ్రౌండ్ లో ముషాయిరాల్లో భాగంగా గజళ్ళు వినిపించిన నారాయణరెడ్డి, దాశరథులు ఇప్పుడు లేరు. ఉర్దూ కవితా గానం చేసిన మఖూం, మైకాన్లు కూడా లేరు.అయితే వారి సాహిత్యాన్ని మొత్తం తెలుగు పాఠకులకు తెలియజేయాల్సిన బాధ్యత ‘తెలంగాణ సాహిత్య అకాడెమీ పైఉన్నది. ఇన్నేండ్లు పరాయి పాలన మూలంగా హైదరాబాద్ ఉర్దూ సాహిత్యం రకరకాల కారణాల వల్ల తెలుగులోకి రాలేదు. ఇప్పటికైనా హైదరాబాద్ కేంద్రంగా విశ్వవ్యాప్తమైన ఉర్దూ సాహిత్యాన్ని తెలుగులోకి తీసుకు రావాల్సిన అవసరమున్నది. గంగా-జమున తెహజీలకు ఆలవాలమైన ఉర్దూ-తెలుగు సాహిత్యాన్ని, రచనలను అటు తెలుగులోకి, తెలుగులో మెరుగైన రచనలు ఉర్దూలోకి తర్జుమా చేయాల్సిన అవసరమున్నది. దీని ద్వారా ప్రజల మధ్యన సయోధ్య పెరిగే అవకాశమున్నది. ఇందుకు తొలి అడుగు ‘హైసీ బులందీ హైసీ పస్తీ’ (శిఖరాలు-లోయలు)తో మొదలు కావాలని కోరుకుంటున్నా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com