ఆంగ్ల రచన: RM ప్రభులింగారెడ్డి

తెలుగు అనువాదం: అచ్యుతుని రాజ్యశ్రీ

‘ఆ..ఇది కోస్గీ పల్లె కదయ్యా..?’ బస్సులో ఉన్న నాగయ్య సంచయంతో అడిగాడు. ఢెబ్బై ఐదేళ్ల తర్వాత నూరేళ్ల ఆ పండు ముసలి నాగయ్యకు ఆ సందేహం రావటం సహజమే మరి..! తన స్వస్థలంలో ఎన్ని మార్పులు చేర్పులు..! ‘అవునయ్యా! నీవు ఏడనుంచి వస్తుండావు? నీవు ఎవరివి? ’ ఎవరో ప్రయాణికుని స్వరం, బస్సు దిగుతూ అడిగింది. గుల్బర్గా( కలిబుర్గి) నుంచి వస్తున్న ఆమె పేరు సరోజ. ‘ఎవరు నువ్వు తాతా? ఎక్కడ్నించి వస్తున్నావు? ’. ‘నా పేరు నాగయ్య. పాకిస్తాన్ లోని సింధ్ నించి వస్తుండా. ‘ఏంటీ? పాకిస్తాన్ నించా? నీకు మా కోస్గీలో బంధుమిత్రువులెవరైనా వున్నారా? ’ సరోజ ప్రశ్నకు ధృడంగానే జవాబిచ్చాడాయన. ‘అవును, పాకిస్తాన్ కాడనించే వస్తుండా. నా పెళ్లాం ఈ ఊళ్లనే ఉంటది’. ‘ఎవరామె? ’. ‘సిద్ధమ్మ’. ప్రేమ, ఆప్యాయత ఆయన కంఠంలో తొణకిసలాడ్తోంది. ‘సిద్ధమ్మా? ఆయన ఇంటి పేరు ఏంటి? ఏ వీధిలో ఉంటుంది? సరోజ ప్రశ్నల జడివాన కురిపించింది. ‘మా యింటి పేరు టెంకాయల, జంగమవాడలో మా ఇల్లు ఉండాది. ఆమె ఆడనే ఉన్నదో, లేదో నాకు ఎరికలేదమ్మా?

‘ఓ..టెంకాయల సిద్ధమ్మనా! ఆశ్చర్యంగా అంది సరోజ. ‘బిడ్డా! ఆమె నీకు ఎరుకేనా? ’ ఆనందం, ఆత్రం తొణికిసలాడింది. ఆ పెద్దాయన మొహంలో! ‘తాతా..నేనూ జంగమవాడలోనే ఉంటా. మరి నాతో నువ్వు నడవగలవా? టాంగా మాట్లాడేదా?. ఆమె కంఠంలో అత్యుత్సాహం,కుతూహలం . తొంగి చూశాడు. రెండు కిలోమీటర్లు ఆ పెద్ద మనిషి నడవలేడని ఆమె అభిప్రాయం. ఓ…జబర్దస్త్ గా నడుస్తానమ్మా! సరోజతో అడుగేస్తూ అన్నాడు నాగయ్య. మీకు తొంభై ఏళ్లుంటాయా.. ? ఆమె దృష్టిలో ఆ వయసు వారు రెండు కి.మీ నడవలేరు.

‘నాకు సరిగ్గా వంద ఏండ్లు బిడ్డా!. నా పెండ్లాంకి ఎనభై ఐదు’. మీకు బాగా గుర్తుందా మీ వయసులు! ఆమెలో సందేహం ఇంకా సమసిపోలేదు. కానీ ఆ వృద్ధుని జ్ఞాపక శక్తి అపారం.

తన జ్ఞాపక శక్తికి పరీక్షలా నాగయ్య చెప్పుకుపోసాగాడు. నా లగ్గమప్పుడు ఆమెకి ఐదు ఏండ్లు, నాకు ఇరవై. నీకెందుకంత అనుమానం బిడ్డా.. ? అది కాదు తాతా! ఆ రోజుల్లో పుట్టిన తేదీ, సంవత్సరం ఎక్కడా రాసి రికార్డు చేసే వారు కాదు గదా? ‘మా వంశంలో మా భార్య ఇంట జాతకాలు రాసి ఉంచేవారు, మేము పుట్టగానే. అలా మా పుట్టిన తేదీలు, జాతకాల్ని బట్టి లగ్గం టైంల పెండ్లి కూతురు, పెండ్లి కొడుకులకి లగ్గం జరిపేవారు. జాతకం కుదరకుంటే వదిలేసేవారు’.

‘ఆ..మాకూ ఈ పద్దతే ఉంది తాతా! మరి అవ్వను అలా వదిలేసి ఒంటరిగా ఎందుకు వదిలెళ్లిపోయావు?’. సరోజ ఆ విషయాన్ని తన చుట్టు ప్రక్కల వారి ద్వారా అప్పటికే విని ఉంది. పెళ్ళి కాగానే నాగయ్య తన ఇంటి వారిని, భార్యని వదిలేసి యాడికో వెళ్లి పోయాడనే అంతా చెప్పుకునేవారు.

‘పాపం ఆ పిల్లకీ తెలవదమ్మా? నేను నా వారిని, ఆమెనీ వదిలి ఏడికో పోయిన సంగతి! అమాయకురాలు సిద్ధమ్మ..ఆ..ఆమె ఇంటిలో ఎవరెవరుంటారు బిడ్డా? ’. ‘పాపం, ఒకత్తే ఉంటది. బంధు మిత్రులు లేరు ఆమెకి. నాకు తెల్సినంతవరకూ. ఎవరూ ఆమె ఇంటికి రారు.

‘ఆమె అన్నదమ్ములు కూడా రారా బిడ్డా? ’. తాతా, ఆమె ఇద్దరు అన్నదమ్ములు చనిపోయారు . తమ్ముడు కర్ణాటకలో స్థిరనివాసం ఏర్పరచుకున్నాడు. నాకు ఇప్పుడు యాభై ఏళ్లు. నా బాల్యం నుంచీ ఆమెను చూస్తున్నా. ఎవరూ రారు, పోరు, ఒంటిగా ఉంటదా అవ్వ..సరోజ చెప్పింది.

‘పాపం, ఎలా బతుకు ఈడుస్తుందమ్మా…’ తాతకు బాధ, పశ్చాత్తాపం. తొంగి చూస్తున్నాడు. నాకూ నా అన్నదమ్ముల గురించి ఎరుకే లేదు’.

‘మీరు, ఎన్నాళ్లు అయింది తాతా, ఇల్లు, ఊరు విడిచి..? ఇన్నాళ్లూ మీ భార్య గుర్తుకే రాలేదా?’ డెబ్బయి సంవత్సరాలు! ఊరునీ, ఆమెనీ యాదిజేకుంటనే ఉండా. నాకు తెలీకుండా చెప్పాపెట్టకుండా ఇరవై ఏండ్లకే నాకు లగ్గం చేశారు. ఓ పిలగాడిలా ఆడుతూ పాడూతూ తిరిగే నాకు, మా అన్న వదినెల సూటిపోటి మాటలు ముల్లుల్లా గుచ్చుకునేవి. ఏ కారణం లేకుండానే పొద్దస్తమానం నన్ను సతాయించేటోళ్లు. పుల్ల విరుపు మాటలు దెప్పళ్ళతో నన్ను గాయపరిచేవారు. పానం ఇసిగి నడుచుకుంటా తాండూరు ఎల్లినా. ఆడినుంచి కలిబుర్గి , ఆడినించి షోలాపూర్, ఆపై బొంబాయి చేరిన రెండేళ్లకి. తిండి తిప్పలు లేక, నిద్ర లేక రెండేళ్లు ఆవారాగా పనిపాటా లేక రెండేళ్లు తిరిగినా. బొంబాయిల బట్టల గోడౌన్ ల కూలీగా చేరి, మా యజమానితో పాకిస్తాన్ లోని సింధుకి చేరాను. నా నీతి నిజాయితీలే నాకు ఆయన కాడ కొలువు ఇప్పించినయి. తన తొమ్మిది మంది బిడ్డలు, ముగ్గురు కొడుకుల పెండ్లి పేరంటం అయ్యే దాకా నేను ఆడనే ఉంటానని ఆయనకి పెమానం చేసినా.

‘తాతా!అలా నిన్ను ఎందుకు కట్టిపడేశాడు ఆయన? ’ కుతూహలంగా అడిగింది సరోజ. ‘ఆయన మూడు లగ్గాలు చేస్కున్నడు. నలభయ్యవ ఏట పన్నెండు మంది పిల్లలు కల్గారు ఆ ముగ్గురు భార్యల వల్ల. నేను సింధుకి వెళ్ళేప్పటికీ ఆయన వయసు అరవై. అందుకే కుటుంబ బరువు, భారం నాపై మోపాడు. తన ముగ్గురు భార్యలకి తమ్మునిలా అండగా ఉంటానన్నాను. ఆ అమ్మలు కూడా సరే అన్నారు. అలా ఆయనకి ఇచ్చిన వాగ్ధానం కోసం నేనుండిపోయాను. ఆయన బతికుండగానే ఇద్దరు కూతుళ్ల పెళ్ళి చేశాడు. ఆయన చనిపోవటంతో వ్యవసాయం వస్త్ర వ్యాపార భారం నాపై పడింది. మిగతా అందరి పెళ్ళి పేరంటాలు చేసి ముప్పై ఏళ్ళు నా స్వామి భక్తిని చాటుకున్నాను. కానీ గత పదేళ్లుగా ఆ పిల్లలు నన్ను ఈసడించి లెక్కచేయడం లేదు. అయినా సహించాను. ఒకడు నన్ను బయటికి గెంటేస్తే అంతా గడ్లప్పగించి చూశారు. నేను వారికి వ్యర్థ పదార్థంగా, భారంగా అన్పించాను. అంతే వారిల్లు వదిలి నా యజమాని పెద్ద కూతురు దగ్గర కెళ్ళి నా గోడు వెళ్లబోసుకున్నాను. ఆమె తన తమ్ముళ్ళ తరుపున క్షమాపణ చెప్పి, అక్కడే ఉండమంది. కానీ నన్ను నా పల్లెకు పంపేయమని వేడుకుంటుంటే, ఆమె చేసిన ఏర్పాట్లతో నేను భారతదేశానికి వచ్చాను. ఇప్పుడు నా పల్లె తల్లిని నా వారు, నా భార్యని కలవాలని, ఇక్కడే తనువు చాలించాలని వచ్చాను బిడ్డా! ‘అంటే సిద్దమ్మ గురించి మీకేమీ తెలీదా తాతా? ’

‘అవును, నాకేమీ తెలీదమ్మా!’ పాపం, ఆమె ఎలా బతుకుతోంది? అతని కంఠంలో ఓ బాధ. తాతా ! మీరు ఊరు విడిచి వెళ్ళాక ఆమె పుట్టింటికెళ్లటానికి ఇష్టపడలేదు. మీ అమ్మా నాన్నల్తోటే ఉంది. ముప్పై ఏళ్ల క్రితం వారు ఈ లోకం విడిచి పోయారు. మీ అన్నలు పోలీసు శాఖలో ఉద్యోగం కాబట్టి హైద్రాబాద్ లో స్థిరపడ్డారు. మీ తమ్ముడు కర్ణాటకలో స్థిరపడి కలిబుర్గి జిల్లాకి చెందిన ఓ పల్లె ప్రాంత స్త్రీని వివాహం చేసుకున్నాడు. అప్పట్లో అది హైదరాబాద్ రాజ్యంలా ఉండేది. అతని గురించి తెలీదు. మీ మరదలు పుట్టింటి వారు ధనవంతులే. అవ్వ సిద్ధమ్మ ఒక్కత్తే ‘ నా మగడు ఎప్పటికో అప్పటికి వచ్చి తీరుతాడు’ అని గట్టి నమ్మకంతో రోజులు వెళ్లదీస్తోంది. ఆయన్ని చూశాకే నా పానం పోతది అని అంటుంది అవ్వ! క్లుప్తంగా సరోజ వివరాలు అందించింది. ‘తాతా! ఎంతో మంది అనుకుంటున్నారు ఆమె భర్త ఎప్పుడో గటించి ఉంటాడని. ఆమెని వితంతువుగానే భావించి పుణ్యకారాలకి, పెళ్ళి పేరంటాలకి రానివ్వరు, పిలవరు కూడా. అసలు ఆమెని ఎంత మంది మళ్ళీ పెళ్ళి చేసుకో అని ఎంత నచ్చజెప్పినా ససేమిరా అంది. పెళ్ళి అంటే జన్మజన్మల బంధం అని ఆమె గట్టి నమ్మకం. ‘ఆమెను ఎవరూ వంచించలేదా?’ పెళ్ళాడమని బలవంతపెట్టలేదా అమ్మ?. ‘ఏంటి తాతా, ఆమె శీలాన్నే శంకిస్తున్నావా? ముసలాడివైన నీ మగ బుద్ది పోనిచ్చుకున్నావు గాదు?’. సరోజ కోపంగా అరిచింది. ‘అదిగాదమ్మా! నా జీవితంలో ఎంత మంచి స్త్రీల దీన హీన స్థితిన చూశానమ్మా! తన మాటను సమర్థించుకున్నాడు. ‘నీవన్నది కరక్టే తాతా! కానీ సిద్ధమ్మ అవ్వ అంటే గ్రామమంతా చెయ్యెత్తి మొక్కుతారు. ఆమెపై అపవాదు వేయటం, కన్నెత్తి చూడటం ఇంతవరకూ ఎవరూ చేయలేదు. అవునూ, నీవు అక్కడ ఇంకో ఆమెను పెళ్ళాడావా తాతా? ’. ఊహు, నాకు తాళికట్టిన భార్య తప్ప ఇంకో ఆమెతో పనిలేదు. సిద్ధమ్మను భర్తగా నేను ఏలుకో లేదు కానీ, ఏకపత్నీవ్రతుడిని. నా జీవితంలోకి ఇంకో స్త్రీని ప్రవేశించనీయలేదు నేను. ‘నిజంగా మీ ఇద్దరూ ఆదర్శ వ్యక్తులు. నిష్కళంక సచ్చీలురు. బ్రహ్మచారి, కన్యలాగ ఎలాంటి దోషం లేని ఆమలిన జీవితం గడుపుతున్నారు. ఆనందం, ఉద్వేగం, ఆరాధనా భావం సరోజ స్వరంలో తొణికిసలాడాయి.

‘అవ్వా! గావు కేక వేసింది సరోజ’. తన ఇంటి లోపల్నించి సిద్ధమ్మ, ‘రా బిడ్డా సరోజ! ఆ..ఇంకోరు ఎవరు? ’ అంటూ లోపలికి ఆహ్వానించింది. ఆ ఇద్దరూ చాపపై కూచున్నారు. అవ్వ మాత్రం కూచోలేదు. సరోజ బలవంతంపై కూలబడింది. ‘అవ్వా! నాకు మంచి విందు ఇవ్వాలి ’. ‘నీకేది కావాలంటే అది తీసుకో బిడ్డా!’ ఆప్యాయంగా అంది అవ్వ. ‘ఆ..నీకు ఓ వింత ఆశ్చర్యకర విషయం చెప్తాను అవ్వా! ఈ తాత ఎవరో నీకు తెలుసా? గుర్తు పట్టలేదా? ’ నాగయ్య పెదవి విప్పబోతుండగా వారించింది సరోజ. ‘లేదు బిడ్డా! ఈయన నాకు ఎరకలేడు’. ‘అవ్వా, నీవు భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్ని, అచ్చమైన హిందూ గృహిణి పుణికి పుచ్చుకున్న స్త్రీ మూర్తివి. జంతు పశుపక్షులు కూడా తమ భౌతిక శారీరక అవసరాలకై, వాటిని సంతృప్తి పరుచుకోవటానికై తెగ తాపత్రయపడి, అవి తీరేదాకా పోరాటం సాగిస్తాయి. నీవు మాత్రం ఆడపిల్లగా పుట్టి కన్నెగా, నిష్కమంగా పవిత్ర జీవితం గడిపిన ధన్యజీవివి. సతీ ధర్మాన్ని తు.చ. తప్పకుండా పాటించి ఆనాటి పురాణ పతివ్రతల అడుగు జాడల్లో నడిచిన సుగుణాల రాశివి. పెళ్ళంటే తెలీని వయసులో తాళి కట్టించుకుని, నా భర్త తిరిగి వస్తాడు అనే ధృడ నమ్మకం, విశ్వాసంతో ఇంకా ఆయన కోసం ఎదురుచూస్తున్న అమాయక ముగ్ధవి. భర్త మొహం తెలీని నీవు, శీలం పోగొట్టుకోని, గ్రామ జనాల చేత జేజేలు పలికించుకుంటున్న జేజెమ్మవి. ‘అబ్బా..అది సరే బిడ్డా! అసలు సంగతి చెప్పనీకి వస్తలేదా నీకు? ’. ‘అవ్వా!ఈ తాత కూడా నీలాంటి వాడే. ఒకే భార్య అని పరస్త్రీ మొహం చూడని పురుషోత్తముడు! ’.

‘ఆయన ఎవరు బిడ్డా! అది చెప్పు ముందు గల.. ’. ‘ఆయన నీ పెనిమిటి, నీ మెళ్ళో తాళికట్టిన నాగయ్య తాత అవ్వా!’. నా దేవుడా.. !. ‘అవును సిద్దూ!’. అతని మాటలకు నివ్వెరపోయిన అవ్వ పెదాలు కదిపింది. ‘అవును, నన్నెవ్వరూ సిద్దూ అని పిలవరు. నువ్వు నిజంగా నా దేవుడివే. నీ కాల్మొక్కుతా’ అంటూనే ఆమె అతని పాదాలపై తెగిన తీగలాగ వాలిపోయింది. స్పర్శ ఎరుగని ఆ వృద్ద జంట కన్నీటి సంద్రంలో ఈదులాడుతోంది. అలా ఎంతోసేపు ఏడ్చింది. అంతే! హఠాత్తుగా వారి శ్వాస అనంత ఆకాశంలోకెగిసి ఆగిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com