నేటి మహాకవి అంతరంగావిష్కరణ..

మానవ సంవేదనలకు అక్షరరూపమిస్తే అది డా. ఎన్. గోపి కవిత్వమై మనల్ని కదిలిస్తుంది. ప్రాపంచిక జీవన పరిణామాలన్నీ గోపిగారి కవిత్వంలో నిక్షిప్తమై తాత్విక వ్యాఖ్యానాలై మానవాళికి దిశానిర్దేశం చేస్తాయి. “ముట్టుకుంటే తగలాలి కవిత్వం మనిషిలాగా” అనే ఆశయంతో కవిత్వ ఆల్కేమిని పట్టుకున్న పరుసవేది కవి డా.ఎన్. గోపి. ఐదు దశాబ్దాల తమ రచనాయానంలో ఎన్నెన్నో కవనశిఖరాలను గోపిగారు అధిరోహించారు. విశ్వవిద్యాలయ ఆచార్యుడి నుండి వైస్ ఛాన్స్ ర్ స్థాయికి చేరుకున్నారు. ఉన్నత విద్యా ప్రమాణాలను నెలకొల్పిన అకడమిషియన్ గాను, ఉత్తమ పాలనాదక్షుడిగాను విద్యావ్యవస్థ పేరు

ప్రతిష్టలను పెంపొందించారు. ఏడు దశాబ్దాలు పూర్తి చేసుకున్న జీవనోత్సాహంతో మరింత సృజనోద్వేగాన్ని నింపుకుని కదులుతున్న ఈ తరం మహాకవి డా.ఎన్. గోపిగారితో డా.ఎస్.రఘు జరిపిన సంభాషణ.

* గోపిగారు! ఐదు దశాబ్దాల మీ రచనా వ్యాసంగంలో 54 గ్రంథాలు వెలువరించి సాహిత్య లోకంలో ప్రఖ్యాతులయ్యారు. నిరంతర కవితా స్పూర్తితో 25 కవితా సంపుటాలను రచించారు. ఇంత విస్తృతంగా రాయడంలో ఏమైనా రహస్యం వుందా? బలమైన ప్రేరణ ఏంటి?

రహస్యమేముంది. నేను నిరంతర కవిని. పల్లె నుంచి వచ్చిన వాడిని. బాల్యంలో పేదరికాన్ని కిరీటంలా ధరించినవాన్ని. కాబట్టి నేను లోకాన్ని ఎల్లప్పుడు వాస్తవికరమ్యంగా సంవేదనా ప్రపూర్ణంగా దర్శిస్తున్నవాన్ని. నాకేమనిపిస్తుందంటే రఘూ! మనలాంటి వాళ్ళకు ఎంత తోడినా అనుభవాలు అడుగంటవు. వస్తువులకు కరువుండదు. నేనే ఓ చోట అన్నాను “వస్తువు లేనప్పుడు కవిత్వం పస్తులుంటుంది” అని. నీకు తెలుసు నేను ఎక్కువగా ప్రయాణంలో కవితలు రాస్తుంటాను. నిత్య చైతన్యశీలంగా వుండటం దీనికి కారణమని నేననుకుంటాను. నా తొలిసంపుటి ‘తంగెడుపూలు’ (1976) నుండి ఇప్పటివరకు ఓ రెండువేల కవితలు రాసుంటా. మరీ ముఖ్యంగా గత ఆరేళ్ళుగా సాహిత్య సందర్భంగా నేను భారతదేశమంతటా పర్యటించాను. ఈ ఆరేళ్ళలోనే ఓ వెయ్యి కవితలు రాశాను. కాబట్టి కవిత్వం నా ప్రవృత్తి, నా ఊపిరి. అయితే విస్తృతంగా రాయడం వల్ల క్వాలిటీకి డోకా ఏం లేదు. జీవన తాత్వికతలో మగ్నం కాకుండా నేనేదీ రాయలేదు.

* 2000లో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డ్ పొందిన ‘కాలాన్ని నిద్రపోనివ్వను’ కవితా సంపుటి ఇరవై మూడు భారతీయ భాషల్లోకి అనువాదమైంది. అందులో

మీరు కాలాన్ని గురించి అనేక తాత్విక కోణాల్లో ఆవిష్కరించారు. ఆ తర్వాత మీ కవిత్వ అభివ్యక్తి కూడా కొత్త రీతుల్లోకి మారింది. ఈ పరిణామానికి కారణాలు చెప్పండి సార్!

‘కాలాన్ని నిద్రపోనివ్వను’ నా ఐదో కవితాసంపుటి. అంతకుముందు తంగెడుపూలు, మైలురాయి, చిత్రదీపాలు, వంతెన కవితా సంపుటాలకు మంచి గుర్తింపే వచ్చింది. నువ్వన్నట్లు నా తాత్విక ప్రయాణంలో ‘కాలాన్ని నిద్రపోనివ్వను’ ఓ మలుపు. కాలానికి సంబంధించిన వివిధ పొరలను దానిలో విప్పిచూపాను. ముఖ్యంగా ‘కాలం కన్న మనిషే గొప్పవాడు’ అనే భావనను ప్రతిపాదించాను. దీనివల్ల మనిషికి ఆత్మ విశ్వాసం ఏర్పడుతుందని బహుశా నా అభిప్రాయం.

* ‘జలగీతం’ దీర్ఘకావ్యం మీ మ్యాగ్నం వోపస్ (Magnum opus) రచన. అది పర్షియన్ భాషతో సహా 13 భాషల్లోకి అనువాదమైంది, వివిధ విశ్వవిద్యాలయాల్లో పాఠ్య గ్రంథంగానూ అధ్యయనం చేస్తున్నారు. అది ఇంతగా ప్రసిద్ధి పొందుతుందని మీరు ఊహించారా? ఆ నేపథ్యాన్ని వివరించండి. –

ఇప్పుడు జలం పెద్ద ప్రమాదంలో వుంది. ప్రాణి హక్కుగా వుండవలసిన నీరు వ్యాపార సరుకుగా మారింది. నేను నల్లగొండ జిల్లా నుండి వచ్చినవాన్ని. ఆ జిల్లాలోని ఫ్లోరోసిస్ ప్రభావాన్ని గ్రామాల్లోని దుష్ఫలితాల్ని ప్రత్యక్షంగా చూసి చలించిపోయినవాన్ని. తెలంగాణ గడ్డ మీదే నాగార్జున సాగర్ వున్నా తెలంగాణకు నీళ్ళందని వైనాన్ని గమనించిన వాన్ని. దశాబ్దాల జల పోరాటాలకు స్పందించి పిడికిలి బిగించినవాన్ని. ఇది నా తొలి దీర్ఘకవిత. దీనిని రాజస్థాన్లో చచ్చిపోయిన ఐదు నదులను బతికించి, మూడువేల చెరువులను తవ్వించిన జలపురుషుడు, రామన్

మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్రసింగు అంకితమిచ్చాను. రవీంద్రభారతిలో జరిగిన ఆవిష్కరణకు ఆయన రాక ఒక పవిత్ర ఆకర్షణ.

జలం అన్నిచోట్లకూ ప్రవహించినట్లే ఈ జలగీతం అందరి హృదయాల్లోకి ప్రవహించింది.

* 1997లో మీరు అనుకోకుండా రూపకల్పన చేసిన నానీలు ఎంతో విస్తృతంగా పాఠకాదరణను

పొందాయి. వందలాది కవులు రాయడం ఇప్పటి వరకు 360కి పైగా నానీల సంపుటాలు

వెలువడటం ఆశ్చర్యం కలిగించింది. పుస్తక రూపంలో రాకుండా మరో వెయ్యి మంది నానీలు రాసి ఉంటారు. సాహిత్య చరిత్రలో నానీలకు ఒక ప్రత్యేక స్థానం లభించింది.

విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు సైతం జరిగాయి. అసలు నానీల ప్రక్రియ ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా?

నా నానీల రచన యాదృచ్చికంగానే మొదలైనా వాటిలో ఒక అపూర్వమైన భావధార కన్పిస్తుంది. అప్పటి ‘వార్త’ సంపాదకుడు ఎ.బి.కె. ప్రసాద్ గారు మా ఇంటికి వచ్చినప్పుడు నా టేబుల్ మీద నానీల వ్రాత ప్రతి చూసి తిరగేసి ‘ఒరే అబ్బాయ్ మీ ఇంట్లో గొప్ప విప్లవం వుంది. వీటిని నేను తీసుకెళుతున్నా’ అని వార్త ఎడిట్ పేజిలో 20 వారాల పాటు ధారావాహికంగా ప్రచురించారు. అంతే అది కొత్త సూర్యోదయంగా నలువైపులా వ్యాపించింది. ఎందరో కవులు వీటిపట్ల

ఆకర్షితులై నానీలు రాశారు. తెలుగు జిల్లాల అన్నింటిలోనూ తెలుగేతర ప్రాంతాలైన ఇతర

రాష్ట్రాలలోనూ నానీకవులు ఉద్భవించారు. నానీ కవితారూపం ఇంతగా ప్రాచుర్యం పొందడానికి దాని నిర్మాణమే కారణమని ప్రగాఢంగా నమ్ముతున్నాను. నానీల్లోని కవితాశక్తి మరో కారణం. వస్తుపరంగా నానీలు మ్యా క్రోలెవల్లో (Macrolevel) వున్నా తెలుగు కవిత్వాన్ని మైక్రోలెవలకు (Micro level) తీసుకెళ్ళాయి. నా నానీలు కూడా పన్నెండు భాషల్లోకి అనువాదమయ్యాయి. రష్యన్ భాషలోకి కూడా వెళ్ళి అక్కడ ఆదరణ పొందడం విశేషం. లఘుకవితా రూపాల్లో ఇదొక ట్రెండ్ సెట్టర్ అనడానికి నేనే మాత్రం సందేహించను.

* తెలుగులో వచ్చిన పది ప్రామాణిక పరిశోధన (Monumentel research) సిద్ధాంత గ్రంథాలలో మీ ‘ప్రజాకవి వేమన’ ఒకటి. అది ఎనిమిది పునర్ముద్రణలు పొందడం ఒక రికార్డు. ఇటీవల ఆ గ్రంథం కన్నడ భాషలోకి కూడా అనువాదం అయింది. ఇలా ఒక సిద్ధాంత గ్రంథం ఇంతగా ప్రసిద్ధి పొందడం

వెనకున్న మీ పరిశోధనా శ్రమను ఈ తరం పరిశోధకులకు వివరిస్తారా?

నేను గత యాభై ఏళ్ళలో కవిత్వం రాయని సందర్భం ఏదన్నా వుంది అంటే వేమన పరిశోధనలో వున్న ఆ నాలుగేళ్ళు మాత్రమే. నేను వేమన పద్యాల సేకరణ కోసం మద్రాస్, తిరుపతి, కాకినాడల్లో ఆరేడు మాసాలు వున్నాను. నాకు 450 రూపాయల నెల జీతం వున్న కాలంలో నేను వేమన పరిశోధన కోసం యాభై వేల రూపాయలు అప్పుచేసి ఖర్చు పెట్టాను. వేమన పద్యాల తాళపత్ర గ్రంథాలను నెలల పాటు ఎత్తిరాసుకోవడం వల్ల (అప్పుడు జిరాక్స్ సౌకర్యం లేదు) నాలోకి ఏదో జీవన విద్యుత్తు ప్రసరించి నట్టయింది. కేవలం ఎం.ఏ., సిలబస్ పాండిత్యం కాస్తా ప్రపంచజ్ఞానంగా విస్తృతమైంది. ‘శ్రమములోన పుట్టు సర్వంబు తానౌను’ అనే వేమన పంక్తి నా పట్ల సార్థకమైనట్టుంది.

* వృద్ధుల జీవితానుభవాలను ఇతివృత్తంగా తీసుకుని ‘వృద్రోపనిషత్ కవితా సంపుటిని అందించారు. ప్రత్యేంగా వృద్ధులమీదే ఒక కావ్యం రాయాలని మీకు ఎందుకు అనిపించింది?

నీవన్నట్టు నేనప్పుడే వృద్ధున్ని కాలేదు, కనీసం మానసికంగా. ప్రపంచంలోని వృద్ధుల సాహిత్యాన్ని గురించి ఆరేళ్ళుగా అధ్యయనం చేస్తున్నాను. ముఖ్యంగా యువతరానికి వాళ్లకు వృద్ధుల విలువ తెలియాలని నా తపన. వృద్ధుడు కూడా దైన్యానికి లోనుగాకుండా ధైర్యంగా వుండాలని నా కోరిక. ఇది వృద్ధుల జీవితంలోని అనేక పార్శ్వాలను తడిమిన విశాల కావ్యం. అనుకున్నట్టే ఇది అందరికి కనెక్ట్ అయింది. ఇది కూడా అప్పుడే పలు భాషల్లోకి అనువాదం కావడం దాని ప్రాసంగికతను తెలియజేస్తుంది.

* ఒక కవిగా, అకడమిషీయన్‌గా, సాహిత్య అకాడమీ కన్వీనర్‌గా అమెరికా, ఇంగ్లాండ్, చైనా, జర్మనీ, మారిషస్, సైప్రస్

మొదలైన విదేశాల్లో పర్యటించారు. ప్రతి పర్యటనను ఒక విలువైన యాత్రా చరిత్రలుగా గ్రంథస్థం చేస్తారు. మీ విదేశీ పరిశీలనలో అంతర్జాతీయంగా కవిత్వం ఎలా వస్తుంది. మనమే స్థానంలో వున్నాం?

యాత్రాచరిత్రలకు హిందీలో వున్నంత ఆదరణ తెలుగులో లేదనిపిస్తుంది. యాత్రాచరిత్ర ట్రావెల్ ఏజన్సీస్ వేసే యాత్రాదర్శిని లాంటిది కాదు. ఇది ఒక ప్రత్యేకమైన వ్యక్తి చేసిన ప్రయాణంలోని సద్య స్పందన. నావి సాహిత్య యాత్రలేగాని సాహసయాత్రలుకావు. నాకు లభించిన విదేశీ పర్యటన అవకాశాన్ని నా జాతి జనులకు అందించాలనే తపన వీటి రచనకు కారణం అనుకుంటా. ముఖ్యంగా ఒక దిగువ మధ్యతరగతి వాడి సంవేదన వీటిలో కనిపిస్తుంది. ఇక కవిత్వమంటారా మానవుల మౌలిక స్పందనలన్నీ ఒకటే. అయితే భావవిధానం (Mode of emotion) వేరుగా ఉంటుంది. సాంస్కృతిక చారిత్రక కుడ్యాలని ఛేదించి చూడగలిగితే మనం వాటిని హాయిగా అందుకోగలం. అయితే విదేశాల్లో కంటే భారతదేశంలోనే మంచి కవిత్వం వస్తుందని నా భావన.

* కవిత్వమంతా అనేక భారతీయ భాషల్లోకి అనువాదమయ్యింది. నాకు తెలిసినంత వరకు ఏ తెలుగు కవి కూడా ఇన్ని భారతీయ భాషల్లోకి వెళ్ళినట్టులేదు. కొన్ని భాషల్లో అయితే మీరు ప్రత్యేకంగా గుర్తించబడి తెలుగు కవిత్వానికి గౌరవాన్ని తెచ్చి పెట్టారు. ఇదంతా ఎలా సాధ్య మైంది?

30 సంవత్సరాలుగా నేను భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో అనేక కవి సమ్మేళనాల్లో పాల్గొన్నాను అక్కడ విన్నవారు నా కవితలు నచ్చి అనువాదానికి పూనుకున్నారు. వారిలో ఆయా భాషల ప్రసిద్ధ కవులే ఎక్కువ. సాహిత్య అకాడమి 23 భాషల్లో నా అనువాదాలు ప్రచురించింది అంటే అది మ్యాండేటరీ కాదు. అనువాదకుల చొరవవల్లే అది జరిగింది. అనువాదకులందరితో ఎప్పుడో అప్పుడు, ఎక్కడో అక్కడ వారితో నేను దాదాపు వెయ్యిగంటలు గడిపి వుంటాను. దాని ద్వారా భారతదేశంలోని ఏకత్వాన్ని దర్శించగలిగాను. ప్రస్తుతం “నేను – నా

అనువాదకులు” అనే గ్రంథాన్ని రాయడానికి సంకల్పించాను. వాటిలో అనేక విషయాలను చర్చిస్తాను.

* ‘ప్రపంచీకరోనా’ అని కోవిడ్ విలయంపై కవితా సంపుటిని వేసారు కదా? ప్రత్యేకంగా ఇటీవలి ప్రపంచ పరిస్థితులపై ఒక బుద్ధిజీవిగా ఎలా స్పందిస్తారు. ఈ ప్రపంచానికి ఏం చెప్పదలచుకున్నారు.

మనం ఈ కరోనాకాలం నుంచి చాలా నేర్చుకున్నామనిపిస్తుంది. ముఖ్యంగా భయం జాగ్రత్తగా మారింది.

జాగ్రత్త సమస్త మానవాళిని దర్శించడానికి తోడ్పడింది. కోట్లాది వలస కార్మికుల కడగండ్లను చూసి అన్ని వ్యవస్థలకు గర్వభంగమైంది. 2018 అక్టోబర్ లో నేను

చైనాలోనే వున్నాను. ఇండియాకు తిరిగొచ్చిన కొన్ని నెలలకే కోవిడ్ వైరస్ ఇక్కడా ప్రత్యక్షమయింది. ఈ అతివేగ విస్తరణకు ప్రపంచంలోని పలు దేశాల మధ్య వ్యాపార సంబంధాలే కారణం. ఒకప్పటి ఆర్థిక సరళీకరణ అనుకున్నది మానవజాతి వినాశీకరణగా పరిణమించింది. నా ‘ప్రపంచీకరోనా’ కావ్య సంపుటిలో లాక్ డౌన్ కాలంలోని మానసిక స్థితులన్ని ప్రతిబింబితమైనాయి. ఇట్లాంటి మానవజాతికి ‘ఆర్కెవ్’ లో వుండి మార్గదర్శనం చేసే కవిత్వంగా నేను భావిస్తాను.

*వర్తమాన వచన కవిత ఏవిధంగా పయనిస్తుంది. ఈ తరం కవులకు మీరిచ్చే సందేశం ఏమిటి?

ప్రతిభకు మనదగ్గర ఏమీ లోటులేదు. కాని దానికి అనుభవం, శిల్పం తోడవ్వాలి. ఈనాటి యువతకు అధ్యయనం బాగా వుండాలని నా అభిలాష, సామాజిక మాధ్యమాలు వేగానికి, విస్తృతికీ తోడ్పడుతాయి గాని వాటివల్ల క్వాలిటీ పెరుగుతుందన్న గ్యారంటీ ఏమీ లేదు. కీర్తికి ఆత్రం పనికి రాదు. “నీడలాగా నీ వెంట పడేదే నిక్కమైన కీర్తి” అన్నాడు మహాకవి సినారె.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com