ఉద్యమానికి ముందర తెలంగాణను వివరిస్తున్న వ్యాసం…

తెలంగాణ సంస్కృతి ఒకనాడు ప్రపంచాన్ని ఆకట్టుకుంది. కాని, గతపాలకులు ఈ సంస్కృతిని ధ్వంసం చేశారు. తెలంగాణ విలువైన చరిత్రను, సంస్కృతిని అర్థం చేసుకుంటే తప్ప అది అర్థం కాదు. పది జిల్లాల్లో ఎక్కడ పిడికెడు మట్టిని పట్టుకున్నా అది శతాబ్దాల చరిత్రను ఎలుగెత్తి చాటుతుంది. తెలంగాణ నేల పూర్వ కాలం నుండి అనేకమంది పాలకుల పాలనలో కొనసాగడం మూలంగా, ఇక్కడి సంస్కృతిలో వైవిధ్యం చోటు చేసుకుంది. అందువల్ల తెలంగాణ సంస్కృతి ఉపఖండ లక్షణాలను కలిగినదిగా విశ్లేషకులు భావిస్తారు. అలాగే దేశానికి మధ్యలో ఉండడం కారణంగా ఉత్తర దక్షిణ భారతాలకు కూడలిగా కూడా భావిస్తారు. ప్రాచీన కాలం నుండి తెలంగాణలో శాతవాహనుల పాలన కొనసాగిందని

ప్రభుత్వ చరిత్ర పుస్తకాలు తెలుపు తున్నప్పటికీ, తెలంగాణ చరిత్రకారులు ఇటీవల దొరికిన అనేక ఆధారాలతో తెలంగాణలో తెగల జీవనానికి ముందు నుండే, సింధూ నాగరికతతో సమానమైన నాగరికత విలసిల్లినదిగా భావించారు. అలాగే ఇక్కడ దొరికిన ఇనుము, ఉక్కు ఖనిజంతో వ్యవసాయంలో వికసన దశ ఏర్పడిందని, ఇక్కడి అవసరాలకు సరిపోగా మిగిలిన లోహాన్ని ప్రపంచదేశాలకు ఎగుమతి చేసిన చరిత్ర కూడా వెలికితీయడం జరిగింది.

తెగలుగా ఉన్న జాతి ఇక్కడి చరిత్రను ఎలుగెత్తుతుంటే, ఇక్కడి వ్యవసాయ వికాసము, బౌద్ధ ఆరామాలు ప్రజల

యొక్క సంస్కృతి సంప్రదాయాలను తెలియజేస్తున్నది. నాగరికతలో భాగంగా విద్యా, వైజ్ఞానిక ఆవిష్కరణలు జరిగిన విధానాన్ని ఇక్కడి సాహిత్యం కండ్లముందుంచుతున్నది. తెలుగు సాహిత్యంలో తొలి విప్లవకవి అయిన పాల్కుర్కి సోమనాథుడు, తెలుగు ప్రజలు గర్వపడేలా భాగవతాన్ని తెనిగీకరించిన మహాకవి బమ్మెర పోతన తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే. తన కావ్యాలను పాలకులకు అంకితమివ్వనని శపథం చేసిన పోతన, తన చరమాంక జీవితాన్ని వ్యవసాయం చేయడంలోనే గడిపాడనే చరిత్ర ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని తెలియజేస్తున్నది. ఇదంతా ఒక ఎత్తైతే, ముస్లిం పాలకుల రాకతో తెలంగాణలో మరో నూతనత్వం

చోటుచేసుకుంది. ముస్లిమేతరులైన బహుజనులు, ముస్లింలు, పార్సీలు, సిక్కులు తదితర జాతుల ప్రజలు ఇక్కడికి వలస వచ్చి, ఇక్కడి సంస్కృతితో మమేకం కావడంతో పాటు, ఇక్కడి మంచిని స్వీకరించి, వారి వారి సంస్కృతిలోని ఔన్నత్యమైన విషయాలను ఇక్కడి ప్రజలతో కలబోసుకున్నారు. అలా ఇక్కడి సంస్కృతిని “గంగా,

జమున తహెజీబ్” అని విదేశీ పర్యాటకులు కొనియాడారు.

ముస్లిం పాలకులు పాలన చేసినప్పటికీ, ఇతర మతస్థుల యొక్క ఆచార వ్యవహారాలను గౌరవించారు. కులీకుతూ షా తన ప్రేయసి పేరు మీద

భాగ్యనగరాన్ని నిర్మించాడు. తన ప్రేమ కోసం ఒక నగరాన్ని నిర్మించిన చరిత్ర

ప్రపంచంలోనే చాలా అరుదు. అంతేకాకుండా తన పాలనలో అక్కన్న, మాదన్నలను మంత్రులుగా నియమించుకోవడమే కాకుండా, ప్రతీ శ్రీరామ నవమికి పట్టు వస్త్రాలను కూడా తానే స్వయంగా తీసుకెళ్లి సమర్పించిన మత సామరస్యం కేవలం ఇక్కడ మాత్రమే జరిగింది. అసఫ్ జాహీల పాలనలో కూడా తెలుగు కవులను ఆస్థాన కవులుగా నియమించుకున్న చరిత్ర ఇక్కడి వైవిధ్యాన్ని తెలియజేస్తుంది. పాలకులు మారుతున్నప్పటికీ, ప్రజలు మాత్రం తమ స్థానికత్వాన్ని ఈ నేల స్వభావాన్ని ఏమాత్రం కోల్పోకుండా కాపాడుకున్నారు. గోలుకొండ కేంద్రంగా ఒకప్పుడు కొనసాగిన వజ్రాల వ్యాపారం, హైదరాబాదు “పెరల్ సిటీ” అని కీర్తించేలా చేసింది. ఆ కాలంలో గోలుకొండ ప్రాంతంలో ముత్యాలను రాసులుగా పోసి అమ్మారని ఇప్పటికీ తెలంగాణ ప్రజలు చెప్పుకుంటుంటారు. వ్యాపార సంబంధమైన జీవనం తెలంగాణ పట్టణాలకే పరిమితమయ్యింది తప్ప విశాల సమూహాలుగా ఉన్న తెలంగాణ ప్రజల్లో ప్రకృతితో కలిసి జీవించేతనమే ఇటీవలి కాలం వరకు సజీవంగా ఉంది. దొరికిన దానితోనే సంతృప్తిగా జీవించడం మినహా, రేపటి గురించి కూడ పెట్టుకుని, దాచుకునే లోభి మనసతత్వం తెలంగాణ ప్రజల్లో మచ్చుకు కూడా కనిపించదు. స్వార్థ చింతనలేని జీవనవిధానం తెలంగాణ ప్రజల్లో కనిపించే మరో సాంస్కృతిక ప్రత్యేకత.

ఉత్పత్తి విధానమే ఉపరితలమైన సంస్కృతిని నిర్ణయిస్తుంది అన్న అవగాహనతో చూసినపుడు తెలంగాణ ప్రజలది ఏ సంస్కృతో అర్థమవుతుంది. తెలంగాణ ప్రాంతాన్ని బ్రిటీషు వలస పాలన ఆక్రమించుకోకపోవడం కారణంగా తెలంగాణ ప్రజలకు వలస వ్యాపార ధోరణులు అలవడలేదు. ఇప్పటికీ “పుట్టినరే కన్నతల్లీ….” అనే భావన్, తెలంగాణ ప్రజల్లో సజీవంగా ఉంది. కరువులు జీవితాలను కల్లోల పరిస్తే

గ్రామాలను వదిలిపోయిన ప్రజలు, కేవలం వేళ్లమీదికే పరిమితం. తెలంగాణ నైసర్గిక స్వరూపమే భిన్నమైంది. మౌలికంగా కొండలు, గుట్టలు, వంపులు, డొంకలు, ఎత్తైన తోపులు, పర్వతాలు ఇట్లా వాతావరణంలోనే ఒక ప్రత్యేకత ఉంది. కోస్తా ప్రాంతంలో ఎక్కడా అర ఎకరం జాగా గడ్డి ఉన్నది ఉండదు. విపరీతమైన

నీటి పారుదల సౌకర్యాల వల్ల గోదావరి జిల్లాల్లో ఎక్కడ కూడా ఖాళీ కనిపించదు.

మైదాన ప్రాంతాలల్ల సాగుజేసి, ప్రకృతి పైన మరింత దాడి చేసి, ప్రకృతిని ఒకరకంగా హింసించి, లాభాల

కోసం విపరీతమైన వాణిజ్య పంటల్ని పండిస్తూ, లాభ

ప్రాధాన్యతగా ఉన్న జీవన విధానం ఉన్నది. తెలంగాణలో మాత్రం మనుగడ కోసం, ఆహారం కోసం, ఆహర పంటలు, పరిమితమైన వనరులు, పరిమిత ప్రశాంత సాధుజీవనం. ఇప్పటికీ తెలంగాణ గ్రామాల్లో గ్లోబలైజేషన్ నేపథ్యంలో కూడా దాని ఛాయలు కనిపిస్తయి.

తెలంగాణ సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్న వేలయేండ్ల జానపద కళారూపాలు, శాతవాహన, కాకతీయ శిల్ప సంపద తెలంగాణ విశిష్టతను పరిపూర్ణం చేశాయి. “ఏది సాహిత్యం అన్నప్పుడు అట్టడుగు ప్రజల నోటి సాహిత్యం అనీ, ఏది కళ అన్నప్పుడు అట్టడుగు ప్రజల చిందు, మాలభాగోతుల ప్రదర్శనే కళ…అనీ చెబుతున్నప్పుడే నిజమైన నిర్వచనం చెప్పినవాళ్లం అవుతాం” (

జయధీర్ తిరుమలరావు వ్యాసం)(గౌరీ శంకర్ జూలూరు, శివరామకృష్ణ పెన్నా 2009:31)

జయధీర్ తిరుమలరావు వ్యాసం)(గౌరీ శంకర్ జూలూరు, శివరామకృష్ణ పెన్నా 2009:31)

జానపద కళారూపాలకు ఆధారమైన కులపురాణాలు, ఆశ్రిత కులాలు కళలను పూర్వకాలం నుండి తెలంగాణ గ్రామీణ ప్రజలను అలరిస్తున్నాయి. కేవలం అలరించడమే కాకుండా అనేక చారిత్రక విషయాలను ఈ కథల్లో బోధిస్తున్నాయి. వారే చిందు, బైండ్ల, ఒగ్గు, శారద, మంద హెచ్చులు, పటమొల్లు, బుడుబుడుకల, దాసరులు, జంగాలు, బాలసంతులు, ఫకీర్లు తదితరులు. అలాగే తెలంగాణ శ్రమసంస్కృతిలో భాగంగా ఇక్కడ పాట సజీవంగా ఉంది. మౌఖిక సాంప్రదాయంగా వచ్చిన ఈ పాట తెలంగాణ ప్రాంతంలో ఉన్న దళిత, బహుజన కులాల జీవనాన్ని కండ్ల ముందుంచుతుంది. అందుకే పాట ఇక్కడ మనుగడలో ఉంది. అనేక కళారూపాలు పాశ్చాత్య వలస సంస్కృతి దాడికి కనుమరుగైనా, పాట ఒక్కటే ఉద్యమాల కారణంగా సజీవంగా ఉంది. ఈ కళారూపాలతో పాటు, తెలంగాణ చారిత్రక వైభవానికి అద్దం పట్టే శిల్ప సంపద శతాబ్దాలు గడిచినా చెక్కు చెదరలేదు. శాతవాహన, కాకతీయ రాజుల పాలనలో ఎనలేని కట్టడాలు ఇక్కడి ప్రజల కళాభిరుచికి ప్రతిబింబంగా నిలుస్తున్నాయి. వరంగల్, కరీంనగర్, హైదరాబాద్లతో పాటు, ఏ

జిల్లా చూసినా, శిల్ప కళలతో ఇక్కడి కళా వైభవానికి ఆనవాళ్లుగా ప్రసిద్ధికెక్కాయి. శిల్ప కళతో పాటు హస్తకళలు కూడా అనేకం తెలంగాణలో ఓ వెలుగు వెలిగాయి. పెంబర్తి నగిషీలు, నిర్మల్

బొమ్మలు, భూదాన్ పోచంపల్లి చేనేత పరిశ్రమ తెలంగాణ కళాత్మకతను మరింత ప్రకాశవంతం చేశాయి. కాకతీయుల కాలంలోనే “పేరిణి శివతాండవ నృత్యం” ఆవిర్భవించి ప్రసిద్ధికెక్కింది. ఇంకా తెలంగాణలో విస్తారంగా ఉన్న అడవుల్లో కోయా, గోండు ప్రజలు తమవైన కళారూపాలను ప్రదర్శించడం తెలంగాణ సాంస్కృతిక చరిత్రకు కొత్త వన్నెను అద్దుతున్నాయి. ఇవే కాకుండా తెలంగాణలో ఉన్న అనేక ప్రదర్శన కళలు, తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి పెట్టని కోటలుగా వర్థిల్లుతున్నాయి. తెలంగాణ ప్రజలది మూలవాసి సంస్కృతి. ఆది మానవుడు నడయాడిన దశనుంచి, ఆధునిక నాగరికత వరకు తెలంగాణ ప్రజల మత విశ్వాసాలు, ఆచారవ్యవహారాల్లో వైవిధ్యం, విభిన్నత చోటుచేసుకున్నది. నాగార్జున కొండ, ఏకశిలా నగరాల బౌద్ధ ఆరామాలను బట్టి, ఇక్కడ బౌద్ధమతాన్ని ప్రజలు పెద్దమొత్తంలో ఆదరించారనే విషయం అర్థమవుతుంది. జైన, బౌద్దాల అవశేషాలెన్నో తెలంగాణలో ఉన్నాయి. నల్లగొండ, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో జైన మతానికి సంబంధించిన, అనేక ఆనవాళ్ళు తవ్వకాల్లో బయటపడ్డాయి. భువనగిరి సమీపంలోని రాయగిరిలో (కొలనుపాక) జైన మందిరాన్ని ప్రజలు విస్తృతంగా సందర్శిస్తుంటారు. బౌద్ధ, జైన మతాల తర్వాత, ఉత్తర భారతం నుండి వచ్చిన మతం ముస్లిం మతం. పాలకులుగా ముస్లింలు సుమారు నాలుగువందల యేండ్ల పాటు పాలించడం వల్ల ఇక్కడి సంస్కృతిలో మార్పులు చోటు చేసుకున్నాయి. అలాగే ఉర్దూ పాలన భాష కావడం కారణంగా విద్యా, ఉద్యోగ అవకాశాల కోసం కూడా కొంతమంది ఇస్లాంను స్వీకరించారు. ముస్లిం పాలన కొనసాగుతున్న సమయంలోనే క్రైస్తవ, సిక్కు, పార్సీ తదితర మతాలు కూడా, తెలంగాణ నేల పైన అడుగు పెట్టాయి. ఇలా భిన్నమతాల సంగమంగా తెలంగాణ సంస్కృతి పేరుగాంచింది.

తెలంగాణ అనగానే గుర్తొచ్చే ‘బతుకమ్మ’, బోనాలు తదితర పండుగలు తెలంగాణ ప్రత్యేకతను నిలబెడుతున్నాయి. ఈ పండుగలను మిగిలిన ఏ ప్రాంతంలోనూ జరుపుకోరు. అలాగే పువ్వులతో పండుగ చేసుకునే చరిత్ర ప్రపంచంలో మరెక్కడా కానరాని విషయం . తెలంగాణ ప్రజలు ఎంతటి ప్రకృతి ఆరాధకులో బతుకమ్మ పండుగను చూస్తే అర్థం చేసుకోవచ్చు. శ్రమలో భాగంగా ప్రకృతిని పూజించే సంస్కృతి తెలంగాణలో ఇప్పటికీ కనిపిస్తుంది. బతుకమ్మ తర్వాత తెలంగాణలో పెద్దపండుగ దసరా.

నిజానికి దసరా పండుగ దేశమంతటా జరుపుకునేదే అయినప్పటికీ, తెలంగాణలో జరుపుకునే తీరులో వైవిధ్యమున్నది. పండుగను సద్దులు, దసరా,

పిల్ల దసరా పేర్లతో మూడు రోజుల పాటు జరుపుకుంటారు. ఏ పండుగైనా ఒక్కరోజు, రెండు రోజులో ఉంటే, దసరా మాత్రం తెలంగాణలో మూడు రోజుల పాటు జరుపుకుంటారు. దసరా రోజు తెలంగాణ ప్రజలు ‘పాలపిట్ట’ను చూడడానికి తమ పొలాల్లోకి వెళతారు. తప్పనిసరిగా పాలపిట్టను చూడాలనే ఆచారం ఇక్కడ ఎప్పటినుంచో ఉంది. అలాగే దసరా నాటి సాయంత్రం, జమ్మి ఆకు పంచుకొని, పెద్దల

ఆశీర్వాదాలు అందుకుంటారు. హిందూ-ముస్లిం సోదరత్వానికి చిహ్నం దర్గా సంస్కృతి. ఇందులో భాగంగా పీరీల పండుగను కూడా తెలంగాణలో ఘనంగా జరుపుకుంటారు. అలావ సుట్టూ అడుగులు కదుపు పాటలు పాడుకుంటారు. దసరాతో పాటు ఉత్తర

భారతీయుల వలసతో తెలంగాణకు వచ్చిన పండుగ ‘హెూళీ’. ఇది తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుకొని ముఖ్యపట్టణాల వరకు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. బతుకమ్మ, హళీ పండుగలపై ప్రత్యేకంగా పాటలు కూడా రూపొందించుకున్నారు. ఇక్కడి ప్రజలు. ఇక ఆహారం విషయానికొస్తే తెలంగాణ వంటకాలు కూడా మిగిలిన తెలుగు సమాజపు రుచులలో ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. సకినాలు, బచ్చాలు, లచ్చించారు, బిర్యానీ తదితర కమ్మటి రుచులు, తెలంగాణ ఆహారపు ప్రత్యేకతలను చాటుతాయి.

ఇంతటి ఘనమైన సంస్కృతి ఉమ్మడి పాలనలో వివక్షకు గురైంది. ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు పాలకులు. తమది మాత్రమే గొప్ప భాష, సంస్కృతి, చరిత్ర అయినట్టుగా వ్యవహరించారు. ఈ అన్యాయం దశాబ్దాల పాటు కొనసాగింది. “తెలంగాణలో ఇవాల్టిదాకా ప్రజలు ఉరికి ఉరికి అలసిపోతున్నారు. కాకపోతే రూపం మారిందంతే. దగాపడ్డ తెలంగాణలో దోపిడి కొత్త కొత్త రూపాల్లో కొనసాగుతూనే ఉన్నది. చారెడు -నేలకోసంనిండు ప్రాణాలు బలైపోతూనే ఉన్నాయి. అభివృద్ధి పేరుతో భూముల్ని లాగేసుకొంటున్నారు. ఉన్న ఆసరా కూడా పోయేసరికి ఆత్మహత్యలే శరణ్య మవుతున్నాయి” (రమేష్, సుంకర 2009:9) మరోవైపు రాజకీయంగా కొనసాగిన ఆధిపత్యం తెలంగాణ ప్రజలను మరింత బానిసత్వంలోకి నెట్టింది. దీంతో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ఈ కనిపించని కుట్రల పైన తెలంగాణ ఉద్యమం అగై మండింది. సకల కుట్రలను కుల్లంకుల్లం చేసింది. ఈ అన్యాయాలకు ఊతమిస్తున్న పాలనను మార్చకుంటే తెలంగాణ బాగుపడదని భావించింది. అలా ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే ఉద్యమం మొదలైంది. లక్షలాది మంది పోరాటం, వేలాదిమంది త్యాగాల ఫలం, కేసియార్ మహెన్నత నాయకత్వం తెలంగాణ రాష్ట్ర కలను నిజం చేశాయి.

తెలంగాణ ఉద్యమాన్ని గమ్యానికి చేర్చింది పాట. సాంస్కృతిక శక్తుల

క్రియాశీలత మీదే ఏ ఉద్యమ గమనాలైనా ఆధారపడి ఉంటాయి. ఆ విధంగా చూసినపుడు తెలంగాణ ఉద్యమానికి ఉన్న సాంస్కృతిక చరిత్ర సుదీర్ఘమైంది. తెలంగాణ నేలకు గల వేల యేండ్ల మౌఖిక సాహిత్య చరిత్ర అత్యంత విలువైంది. ప్రజల జీవితాలు, వారి ఉత్పత్తి విధానం మీద ఆధారపడి ఉంటాయి. అలాగే వారికి గల సహజ వనరులు, భౌగోళిక, శీతోష్ణస్థితుల మీద కూడా ఆధారపడి ఉంటాయి. అడవి ప్రాంతం అధికంగా గల దేశాల జీవన శైలికి, నగరాలు వేగంగా విస్తరిస్తున్న దేశాల స్థితిగతులకు చాలా వైరుధ్యం ఉంటుంది. “తెలంగాణ భౌగోళిక స్వరూపం కూడా మౌఖిక సాహిత్యానికి పెట్టని కోట. అటు గోండ్వాన గిరిజనులు, ఇటు భద్రాచలం, పాపికొండల ప్రాంతంలో కొండరెడ్లు, కోయలు, నల్లమలలో చెంచులు, ఎరుకలు వ్యాపించి ఉన్నారు. నిరంతరం

యుద్ధాలలో సతమతమయ్యే ప్రజలు తమ జీవిత యుద్దాలను పాడుకోవడం వారి అవసరం. పనిలో, పాటలో, వుత్పత్తిలో, పోరులో వారి అండదండడగా పాట పరుగెత్తింది. జైనం, బౌద్దం, వీరశైవం, క్రైస్తవం వ్యాప్తి చెందాయి. అంతేకాదు నిత్యం అంతర్యుద్దాలు చేశాయి. మతసాహిత్యం గూడా మౌఖికంగానే ప్రచారం పొందింది. ఇవి కాకుండా జానపద జనజీవిత గాధలు, మాత కథలు, వీరగాథాచక్రాలు ఇక్కడ వ్యాపించి ఉన్నాయి. మాతకథ అయినా వీరగాథ అయినా అనేక చారిత్రికాంశాలు వాటిలో కనిపించడం ఈ కథల ప్రత్యేకత. ఆ భాష చారిత్రికాంశాలు గల గాథలు ఇతర ప్రాంతాల్లో అధికం. కాని తెలంగాణలో మామూలు పాటలలోనూ ఎక్కువ మొత్తంలో చరిత్ర కనిపించడం విశేషం” (జయధీర్ తిరుమలరావు వ్యాసం) (గౌరీ శంకర్ జూలూరు, శివరామకృష్ణ పెన్నా 2009:90) ఇలాంటి సుదీర్ఘమైన చరిత్ర తెలంగాణ నేలకు ఉందనే విషయాన్ని చారిత్రక ఆధారాలు రుజువు చేస్తున్నాయి.

తెలంగాణ ప్రాంతానికి అనేక సహజ వనరులు ఉన్నాయి. కానీ, ఈ వనరుల

మీద ఇక్కడి ప్రజలకు హక్కు లేకుండా పోయింది. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు ఇక్కడ దక్కకుండా పోవడానికి పాలకుల నిర్లక్ష్య ధోరణి కారణంగా కనిపిస్తున్నది. నిజానికి పాలకులే రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించే బాధ్యతను స్వీకరించాలి. కానీ, ఆ బాధ్యత నుండి ప్రభుత్వాలు వైదొలగడం మూలంగా తెలంగాణ ప్రజల జీవితం అభివృద్ధికి ఆమడ దూరం నెట్టివేయబడింది. ఈ పరిస్థితుల మీద ఒక తిరుగుబాటుగా తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకుంది. ఆత్మగౌరవం, స్వయంపాలన అనే భావనలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో సుదీర్ఘమైన చరిత్ర ఉంది. తెలంగాణ ఉద్యమం కూడా ఈ భావనల పునాదిగానే పురుడు పోసుకుంది.

రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు దక్కక పోవడానికి హక్కుల ఉల్లంఘనే కారణం. తెలంగాణ విషయానికి వస్తే, రాష్ట్ర ఏర్పాటు సమయంలోనే అనేక షరతులు, నియమాలు ఏర్పాటు చేసుకున్నారు. పెద్దమనుషుల ఒప్పందాలు, ఫజల్ అలీ కమీషన్ రిపోర్టులు ఏవి కూడా తెలంగాణ ప్రజల న్యాయమైన హక్కులను కాపాడలేకపోయాయి. అందుకే క్రమంగా తెలంగాణ ప్రజల్లో ఒక అసంతృప్తి ఆవేదన గూడుకట్టుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం వేరైతే తప్ప తమ బ్రతుకులు బాగుపడవు అనే భావన ప్రజల్లో స్థిరపడిపోయింది. దాని భౌతికరూపమే ఉద్యమం. ఊఊరూర ప్రతీ పౌరునికి ఈ రకమైన స్పృహ అందివచ్చింది. అభివృద్ధికి పాలకుల వైఖరి ఎలా శాపంగా మారిందో గుర్తించారు. తమ విముక్తికి తామే ఉద్యమించాలని బయలుదేరారు. అట్లా మూడు తరాలుగా ఇక్కడి ప్రజలు పోరాడారు. వారి ఉద్యమ ఆకాంక్షల్ని వివిధ రూపాల్లో వ్యక్తం చేశారు. ముఖ్యంగా కవులు, కళాకారులు తమ సాహిత్యం ద్వారా ప్రజల ఆకాంక్షకు పట్టం కట్టారు. ప్రజల ఆలోచనే తమ ఆలోచనగా సాహిత్యాన్ని సృష్టించారు. తెలంగాణ వెనుకబాటుకు గల కారణాలను చారిత్రికంగా వివరించే ప్రయత్నంచేశారు. అట్లా ఉద్యమం ప్రతీ ఇంటికీ, పోరాటం ప్రతీ కంటికీ చేరింది. ఈ పరిణామం వెనకాల అనేక చారిత్రక మలుపులు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ తొలి, మలిదశ అడుగులు చాలా కీలకమైనవి. వ్యక్తి నుండి వ్యక్తికి తెలంగాణ విముక్తి భావజాలం అంద జియడం వెనుక సాహిత్య, సాంస్కృతిక రంగాల పాత్ర అత్యంత కీలకమైంది. ఆ క్రమంలో వచ్చిందే ధూంధాం. ప్రజలందరినీ తన ఉద్యమ సాహిత్యంతో ఊర్రూతలూగించిన ప్రక్రియ ఇది – ధూంధాం స్వరూపం మరొకసారి….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com