పొట్లపల్లి శ్రీనివాసరావు

కాళోజి జీవితము, వ్యక్తిత్వము, సాహిత్యము వేరు వేరు కాదు. ఆయనెంత నిరాడంబరుడో కవిత్వమూ అంతే. మన ఎదురుగా నిలబడి మాట్లాడినట్లు ఉంటుంది. అన్యాయంగా మాట్లాడేటోన్ని చూస్తె రుస రుస లాడెటోడు. అన్యాయం ఏ రూపంల ఉన్న సహించేటోడుగాడు.

తెలంగాణలోని ఆటుపోట్లకు ఉద్యమాలకు కాళోజి “నాగొడవ” ఒక సజీవ సంతకం. ప్రపంచంలోని అనేకానేక విషయాలకు ఒక దర్పణం. మనిషితనం మరువని మహోజ్వల ఉ గ్రరూపం కాళోజి.

“తెలంగాణా వస్తుందా” అని కాళోజి చనిపోవడానికి ముందు ఆయన్ను చూడ్డానికి వెళ్ళిన నన్ను, నందిని సిధారెడ్డి, అనిశెట్టి రజితలను ప్రశ్నించిండు ! “వస్తది మీరు తప్పక చూస్తరు” అని సిధారెడ్డి గట్టిగ చెప్పిండు- కాళోజీ కండ్లలో ఏదో ఆనందం “మెరుపు? కాళోజీ చివరాఖరి ఊపిరిలో

కూడా “తెలంగాణ” రావాలన్న కొరిక. ఈ ప్రజలు బాగుపడాలన్న తపన, ఇవాల్లి సమాధానం దొరకని అనేక ప్రశ్నలకు కాళోజీ బతికుంటే తప్పక జవాబు చెప్పెటోడు.

భౌగోళిక, ప్రజాస్వామ్య, సాంస్కృతిక తెలంగాణ ఇదంతా ఏంది? మనది మనకు ఐనాక ఏది కావాల్నో అప్పడు మాట్లాడుకుందం-మన సంగతి మనం చూసుకుందం-ఇప్పుడీ విడగొట్టే మాటలెందుకని,. కాళోజి ప్రశ్నించేటోడు ఇప్పుడాయన లేడు … ఆయన మాటలున్నయి-ప్రశ్నలున్నయి..

_ . మనిషికి అచ్చమైన నిర్వచనం కాళోజి, మానవత్వానికి అసలైన అర్ధం కాళోజీ . మాటలు తప్ప ఏ ఇజాలు లేక పోవడం కాళోజీ యిజం. మనిషి తనం మరువని మనిషి అసమ్మతి, నిరసన, ధిక్కారాల స్వరం మానవత్వపు మనుగడకు నిలువెత్తు సంతకం. కాళోజి ఒక కాలేజి. అక్షర యోధుడు, ఈ కాలపు వేమన్న పౌర హక్కుల సంతకం హక్కులు ఝండా, నిజమైన ప్రజస్వామ్యవాది ఉద్యమజీవి కాళోజీ ఇలా చెప్పుకుంటూ పేజీలుగా రాయొచ్చు, చెప్పొచ్చు, ఇవన్నీ కాళోజీ గురించి ప్రజలు అనుకునే విషయాలు. అంతగా ప్రజలతో మమేకమైన కవి బహుశా ముందు తరాల్లో కూడా అరుదు గానే ఉంటారు కావచ్చు.

జరిగిందంతా చూస్తూ ఎరగనట్టు పడివుండగ /సాక్షీ భూతున్ని కాదు/సాక్షాత్తు మానవున్ని’ అని ధీమాగా చెప్పిన కాళోజీ అనే మానవీయ సంతకం సెప్టెంబర్ 9, 1914లో జన్మించింది. ఈయన పూర్తి పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాస రావు రాంరాజా కాళోజి. మడికొండలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న రంగారావు, రమాబాయి దంపతుల ద్వితీయ సంతానం. భార్య వేలూరి రుక్మీణిబాయి, కుమారుడు రవికుమార్. ప్రముఖ ఉర్దూ కవి కాళోజీ రామేశ్వరావు ‘షాద్’ వీరి అన్న గారు ఆనాటి కర్ణాటక ప్రాంతం బీజాపూర్ జిల్లాలోని రట్టిహళి గ్రామములో తన తల్లి మేనమామల ఇంట్లో కాళోజి జన్మించాడు. అక్కడ సాయిరాం గ్రామములోను, వరంగల్ లోని ఇల్లంద తాలూగా కారేపల్లి

గ్రామములోను బుడిబుడి అడుగులు వేసిన కాళోజీ ప్రాథమిక విద్య మడికొండలో మొదలైంది. సెకండ్ ఫారం ఆనాటి మెదక్ సుభాలో ఉండిన కాలేజ్ యేట్ పాఠశాలలోనూ, హైదారాబాద్ పాతబస్తీ కాన్గీ బడిలోను జరిగింది. పదవ తరగతి వరకు వరంగల్ కాలేజ్ యేట్ హైస్కూల్ నుండి పూర్తి చేశారు.

సహజంగానే పోరాటాల జీవి కాబట్టి ఆనాటి ఆర్య సమాజ ఉద్యమం, పౌరహక్కులు, 1931లో భగత్ సింగ్ ఉరితీత, స్కూల్లో నాటకాలు, వాక్ స్వాతంత్ర్యాల సమావేశ స్వాతంత్ర్యాన్ని హరించిన “గస్తి నిషా తిరుపన్” చట్టం కాళోజీ జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని సాహిత్యాన్ని చివరిదాకా ప్రభావితం చేసినయి. అందర్నీ గౌరవించడం ‘నా గొడవ’ నైజం. మారని పరిస్థితులకు మనిషి స్థితిగతులకు నా గొడవ ఇంకా సజీవ సాక్ష్యంగా మిగిలిందని అందరూ అంటుంటే నేనిప్పుడు నా కవిత్వానికి కీర్తికీ సంతోషించాలా? యాభై సంవత్సరాల తరీఖ ఇప్పుడు కూడా ఉన్నందుకు ఏడ్వాల్నా…. అని మద్రాస్ కళాసాగర్ అవార్డు సంధర్భంలో భోరుస విలపించిన కాళోజీ కవిత్వానికి ముసలితనం ఎప్పుడూ అరమైలు దూరంలోనే ఉందనేది నిర్వివాదాంశం.

కవిత్వం సామాజిక ప్రయోజనం కోసమే కాని కీర్తి కండూతి కోసం కాదని కాళోజీ వాదన. ఈ వాదనతో ఏకీభవించని వారు కాళన్నను చూసి కూడా ఉంటే… వాళ్లు ఇప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిందే.

ప్రజాస్వామ్యం మీద ప్రగాఢ నమ్మకం ఉన్న కాళోజీ ప్రహ్లాదుడు మొట్టమొదటి సత్యాగ్రహి అంటాడు. హిరణ్యకశ్యవుని పొట్ట చీల్చిన నరసింహుడు చేసింది ప్రతి హింస అని తీర్మానిస్తాడు. పురాణేతిహాసాల్లోని అనేకానేక సంప్రదాయ విశ్వాసాలను ఆధునిక సామాజిక అవసరాలకు అన్వయించి చెప్పగల ప్రతిభాశాలి. హింస ప్రతిహంసల కన్న ‘అధీకృత హింస’ మరింత దారుణమని తెల్చి చెప్పుతాడు. ఓటు హక్కును నిర్బంధించడం సహేతుకం కాదని ఎవరు ఎవరిని నియంత్రించకూడదని కోరుకున్న స్వేచ్ఛాజీవి. పౌరహక్కుల వేదిక ఆయన స్వరం ఆయన మాటకు కవిత్వానికి తేడా ఉండదు. అది జనం బాష, అది జనంగోడు. అల్లాంటి వాడుక భాషను అందలమెక్కించిన ఘనత కాళోజీది. వాడుకభాష అనేది కొన్ని ప్రాంతాలకే పరిమితం కాదు. అది తెలుగు జాతియావత్తుది.

అన్ని మాండలికాలకు తగు ఆదరణ ఉండాలనే తపన అయనది. అట్లా తెలంగాణ భాషను, సాంస్కృతిని పరిరక్షించు కోవాలని ఈ దృష్టితో పాలకులు చూడాలని, అలా చూడలేదు కాబట్టే అట్లా మరించిన ఆత్మాభిమానం, అణచివేత వీర తెలంగాణకు నాందీ ప్రస్థానంగా మారిందని కాళోజీ స్పష్టంగానే హెచ్చరించాడు. తెలంగాణను స్వప్నించాడు. వ్యక్తి స్వాతంత్ర్యాన్ని హరించే ఏ సందర్భానైనా నిరసించాడు, ఉగ్రుడై ప్రజానీకాన్ని హెచ్చారించాడు.

‘మన కొంపలార్చిన మన స్త్రీల చెరచిన/మన పిల్లలను చంపి మనల బంధించిన మానవాధములను మండలాధీశులను/ మరచిపోకుండగా గురుతుంచుకోవాలి/కసి ఆరిపోకుండా బుసకొట్టచుండాలే/కాలంబురాగానే కాటేసి తీరాలె/తిట్టిన నాల్కలను చేపట్టి కొయ్యాలె/ కొంగు లాగిన వ్రేళ్ళ కొలిమిలో పెట్టాలే కన్ను గీటిన కళ్ళ కారాలు చల్లాలే/తన్నిన కాళ్ళను “డాకలి”గా వాడాలె కండ కండగా కోసి కాకులకు వెయ్యాలే/కాలంబు రాగానే కాటేసి తీరాలే’ అని హైదనారాబాద్ సంస్థాన నిజాం నిరంకుశ పరిపాలనలోని ఆకృత్యాలను ఎండగడ్తూ ప్రజల్లో చైతన్య జ్వాలలు రగలుస్తూ ఊరూవాడా ఉద్యమ ప్రవాహమై సాగుతాడు. జైలు జీవితాన్ని అనుభవించాడు. చిన్నప్పటి నుండే దేశ పరిస్థితుల పై దృష్టినిలిపినాడు. కుటీలమతులను దేబె ముఖాలను జాగ్రత్తనే గమనిస్తూ తన , జీవన గమానాన్ని గమ్యాన్ని నిర్దేశించున్న కాళోజీ క్రమంగా ప్లీడరీ చదువు చదివినప్పటికీ భావజావ వ్యాప్తికి 1938లోనే భావజా అప్పా ‘వైతాళిక సమితి’ స్థాపించాడు. వందేమాతరం ఉద్యమానికి విరాళాలు సేకరించాడు. కాలేజి విద్యార్థి సంఘ నాయకుడిగా ఆనాటి పరిస్థితుల దృష్ట్యా గణేష్ ఉత్సవాలను ఘనంగా జరిపిన ధీరోదాత్తుడిగా దసరా ఉత్సవాల్లో చురుకైన కార్యకర్తగా ఆనాటి నియంతలకు హెచ్చరికగానే పాల్గొన్నాడు. మూర్తీభవించిన మానవతా వాదిగా అభ్యుదయ కాముకుడిగా ప్రజాపక్షం వహించే నిఖార్సైన కవిగా ఎదిగాడు. ‘నా గొడవ’ కవిత్వాన్ని ప్రకటించాడు. ఆ కవిత్వ సమస్తం ప్రజల కవిత్వం. అది చదివిన వాళ్ళు ఎవరికి వాళ్ళు తన గొడవ చెప్పుకున్నట్లుగా ఉంటుంది. అలా ప్రతి మనిషి గొడవే ‘నా గొడవ’ లో కనిపిస్తుంది కాబట్టే కాళోజీ ప్రజాకవి అయ్యాడు.

ఆ భావార్ణవంబులో నా వరకు నేను/ మునక లేసి ఎంతో మురిసిపోతాను/మన మిరువురము కలుసుకొనిన సమయాల ఆటలూ పాటలూ పనులూ ఎప్పుడెపుడు ఏవేవి ఎటుల జరిగినవో/ఎదలోన అటులనే పదిల పరచాను.స్మృతి చేత వానినే వెదికించుతాను/వెదికించి మనసులో అతికించుతాను/

తలచుకుని తలచుకుని ఉలికి పడతాను/గట్టు కనపడనీక నిట్టూర్చుతాను, అని భావనా జగత్తులో ఒకటి రెండు సందర్భాల్లో కన్పించిన కాళోజీ “నర్తకుని నాట్యాలు, గాయకుని గానాలు/వాదకుని వాద్యాలు శిల్పకుని శిల్పాలు/చిత్రకుని చిత్రాలు అంగనల అందాలు కందర్వు కయ్యాలు కవిరాజు కావ్యాలు/కర్షకా! నీ కర్రు కదిలినన్నాళ్ళే” అంటూ జన చైతన్యం కోసం బతికినన్నాళ్ళు తపించాడు. జాతి మూలాలు మరిచిన పాలకులను నిష్కర్షగా నిజాయితీగా పౌరుడిగా, ప్రశ్నించడమే ఊపిరిగా కవిత్వాన్ని వాహికగా మార్చుకున్నాడు. పౌరులారా ! పొరలుగా బ్రతుకు గడుపుచున్నారేం? అని ది ప్రశ్నించినాడు, ఆవేదన చెందాడు. అన్యాయాన్ని ఎదిరించిన ప్రతి ఒక్కర్ని ఆరాధించాడు.

అధిక్షేపమా… అన్యాపదేశమా…పొగడ్తనా… తెగడ్తనా.. అన్నీ కలగలిపి గణనాయకుల అవలక్షణాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తాడు. ముద్దుముద్దుగానే వాళ్ళ మొద్దు నిద్దర వదలగొట్టే సత్తా ఒక్క కాళోజీకే చెల్లింది. అందుకే నీ పేరుతో టోపి నిత్యమైపోయింది/మీమాట వెనుకనే మా మాటచెప్పాము/ బతికినన్నాళ్ళ నిన్ను బాపు అని పిలిచితిమి/చచ్చిపోయిన నిన్ను జాతిపితను చేసితిమి || పెక్కు భంగుల నిన్ను చెక్కి శిలవేసితిమి/వేడ్కతో ఇంటింట వేలాడదీసితిమి. ఇంకేమికావలె/ ఇంకేమి చేయాలె, ‘బాపూ… బాపూ… బాపూ’ అని గుండెలు బాదుకుంటూ

మరీ చేస్తాడు. చెప్తాడు.

చతురమతులు, దేబెమొగాలు/జగతిలో రెండే రెండు రకాలు/చతుర వర్గం విలాసం కొరకు దేబెల సర్వస్వం ముడిసరకు… ప్రజాస్వామ్యం గణరాజ్యం/చతుర నాయకమ్మన్యుల భోజ్యం/పాలితులపై జరిగే శోషణ/పాలకవర్గం చేసే పోషణ/నెత్తిన నోరుంటే చాలు/పెత్తనం లభిస్తుంది’ అని అనడమేకాదు ఎవరికి చేపని ఎండిన చన్నులు/రస విహీనములు రాజకీయములు’ అని ఘాటుగానే ఈసడిస్తాడు, నిప్పులు చెరుగుతాడు.

‘మానవుని మానవుడు మానవుని మాదిరిగా మన్నించ లేనంతమలిన మైనాది/మానవుని

హృదయం మలినమైనదని’ అనవరత ఆందోళనతో ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు ఎటర్నల్ విజిలెంట్ గా పౌరుడు వుండాలని కోరుకున్న కాళోజీ, మాటలను ఈటెలుగా, కత్తులుగా మార్చి దౌర్జన్యపు దగుల్బాజీల గుండెల్లోకి సూటిగానే దింపేవాడు. ఒక చారిత్రిక ఆశావాదంతో భవిష్యత్తు పథగామిగా ఉదయం కానే కాదనుకోవడం నిరాశ ఉదయంచి అట్లానే ఉంటుందనుకోవడం దురాశ ఈ చీకటి ఉండదు….. సూర్యుడు తప్పక ఉదయస్తాడడు’ అంటూ భరోసా కల్పించిన కాళోజీ ‘సాగిపోవుటే బ్రతుకు…ఆగిపోవుటే చావు/సాగిపోదలిచిన ఆగరాదిచటెపుడు/ఆగిపోయిన ముందు–సాగనే

లేవెప్పుడు/వేచియుండిన-పోను నోచుకోనేలేవు. తొలగి త్రోవెవడిచ్చు త్రోసుకొని పోవలయు/బ్రతుకు

పోరాటము- పడకు ఆరాటము’ అంటూ భుజం చరిచి మనవెంట నడుస్తాడు. మనల తలఎత్తి నడిపిస్తాడు.

“చెమ్మగిలిన కన్నులలో కమ్మలెన్నో చదివాను/బతికి పారలేని బాధ-పలుకుజారని గాధ, చలికి బయటపడేడి గుట్టు బలిమినెటులో దాచినట్టు” అని చెపుతూనే చెమ్మగిల్లని కనులు బ్రతుకు కమ్మదనము చూడలేవు అని తీర్మానిస్తాడు. నేల కొరుగుతున్న పోరాటయోధుల పక్షాన కన్నీరై

ప్రవహిస్తాడు

సామాన్య ప్రజల్లోని నిర్లిప్తతను గొర్రెదాటు తనాన్ని ఎద్దేవా చేస్తడు. వాళ్ళలో ఒక చైతన్య అవగాహన పెంపొందించితేనే ప్రజాస్వామ్యం బతికి బట్టకడుతుందని కాళోజీకి ప్రగాఢ నమ్మకం. ‘గొర్రెదాటు’ ప్రజానికానికి మార్గదర్శనం చేస్తడు. దగాగడ్డి కరుస్తాంది గొర్రె/వగల గాలి పీలుస్తోంది గొర్రె/పగల నీళ్ళు తాగుతాంది గొర్రె/మందల పడి మురుస్తోంది గొర్రె తెగ బల్చుంది. గొర్రె/ గొల్లన్న యాతనంతా తన కొసమే అనుకుంటాంది. గొర్రెగొల్లన్న కొలిచే మల్లన్న తానే అనుకుంటుంది గొర్రె. మోసంలో పడి మోచ్చం చూస్తాంది గొర్రె/మందల పడి మురుస్తోంది గొర్రె/తెగ బలుస్తోంది గొర్రె

యని ప్రజలకు పాలకులకు గల వ్యత్యాసాన్ని కవిత్వమై సమూహంలో సంభాషిస్తాడు.

మనుషుల మధ్య వైరుధ్యాలకు, కాట్లాట పొట్లాటలకు సూదిమొన మొదలు రైలింజన్ వరకు ఏదైనా కావచ్చంటాడు ఆ నేపథ్యంలోంచే ‘చాపచింపు సామ్రాజ్యం/కోడిగుడ్డు-కోహినూర్/పాటి మన్ను ప్లాటినం/ఏదైతేనేం? ఏదైతేం/పసిబాలుడు….పండు ముసలి/బిచ్చగాడు….. లచ్చిమొగుడు/తత్తు కొడుకు… పెత్తందార్/ఎవడైతేనేం? ఏవడైతేనేం?….. పోటీ పడి కాటులాడ అన్న కవితను విన్పిస్తాడు.

– “నేను కమ్యూనిస్టువలెచెప్తున్న’ ‘నేను సోషలిస్టుగా మాట్లాడుతున్న’ ‘నేను హిందువుగ ఈ విషయం చెప్తున్న’ అంటారు గాని మనిషివలె ఆలోచించేదెప్పుడు? అనేది నా ప్రశ్న -డాక్టర్’ అంటె పలుకుతరువకీల్ అంటే పలుకుతరు. కవీ అంటే పలుకుతరు కానీ మనిషి అంటే ‘మనిషంటవ్’ అని కోపానికస్తరు…. ఇదెక్కడి వ్యవహారం-ఇడెక్కడి నీతని ఆవేదన చెందేవాడు. మనం ఇంకా మనుషులుగా మారలేదని భాధ మనిషంటే కష్టపడేవాడు, శ్రామికుడు అని కాళోజీ భావన- ఒకసారి ‘మిత్రమలండలి’ సమావేశం జరుగుతున్న సంధర్భంలో రిక్షాలో ఏదో సామాను తెచ్చిన రిక్షా అతను సార్ ఇక్కడెవరన్న మనుషులున్నారు అని కాళోజిని అడుగుతే-ఇగో ఇక్కడున్నోల్లందరం మనషులమే

కదా… అంటే రిక్షా అతను నవ్వుతూ…..ఛి మీరు కాదు సార్.. గా సామాండ్లు లోపటి పెట్టేటోళ్ళు కావలంటాడు-ఇప్పటికైనా అర్ధమైందా మనుషులంటే ఎవరో అని కాళోజీ గంభీరంగా చూస్తూ చెప్పిన జవాబు —ఆనాటి మిత్రమండలి ఎప్పటికీ గుర్తుంటుంది అందుకే కాళోజీ “ సంత సముగ జీవింవగ/సతతము యత్నింతుగాని ఎంతటి సౌఖ్యానికైన ఇతరుల పీడింప లేను’ అని చెప్పుకుంటాడు ‘నేనింకా ‘నా’ నుండి ‘మా’ వరకే రాలేదు/మనం’ అన్నప్పుడు కద ముందడుగు ఆ మనం గురించి ప్రతి ఒక్కరు పాటు పడాలని కోరుకుంటాడు. 1) – మాతృదేశము మాట ముచ్చట/ ముదము గూర్పదు మదికిననియెడి/ పరమనీచుకు ధరణినంతట/ గలయవెదికిన కావనగునా?/ లాఠీ దెబ్బల లక్ష్యమేమి/ కఠిన శిక్షయె కాదు కాదు/ చావు కైనను జంకనీయదు.. అగ్గి కొండల అవనియైనను వానవరదల ఎడారియైనను/ మాతృదేశము మాతృదేశమే యని దేశభక్తిని చాటుకుంటూనే దేశంలో పడ్డ దొంగల నీతి బాహ్యతను పబ్లిగ్గానే విమర్శిస్తాడు.

‘యుద్ధంలో ప్రాన్సు కవులంతా చెల్లా చెదురై పారిపోతే లూయా ఆరగాన్ ఒక్కరే దేశంలో నిలబడి ప్రజా స్వామాన్ని వెల్లడించే గీతాలు వ్రాశారు. కాళోజీ ‘లూయి ఆరగాన్ లాంటి వాడు. తెలంగాణా మూగజీవాల హృదయాల్ని ప్రతిబింపచేశాడు. అని శ్రీ శ్రీ అన్న మాటలు ముమ్మాటికి నిజమని పండిత పామర జనం ముక్తకంఠంతో కాళోజీ పట్ల విశ్వాసాన్ని ప్రకటించింది. ‘పుటుకనీది/ చావునీది/బతుకంతా దేశానిది’ అని జయప్రకాశ్ నారాయణ్ ను ఉద్దేశించి వ్రాసిన కాళోజీ కవిత కాళోజీకే మరింత సమగ్రంగా సరిపోయింది. లార్డ్ బైరన్ కవిత ‘ ఒకే ఒక్క సిరాచుక్కల

మెదళ్ళకు కదలిక’ అనువాదం ఐనప్పటికీ, కాళోజీ మూల కవితగానే విస్తృత ప్రచారమైంది.

కాళోజి నాగొడవ 1946 పార్ధివ వ్యయంగా రూపు దిద్దుకుంది. 1953లో దేశోద్ధారక గ్రంథమాల మొదటి సంపుటి వెలువరించింది క్రమంగా నాగొడవ-పరాభవ వసంతం, పరాభవం గ్రీష్మం, పరాభవ వర్షం,పరాభవ శరత్తు, పరాభవ హేమంతం, పరాభవ శిశిరం ‘ఆరు సంపుటాలుగా వెలువడ్డాయి. తెలంగాణ ఉద్యమ కవితలు, జనధర్మ 1968లో వెలువరిస్తే, నాగొడవ కొన్ని భాగాలు, యువభారతి,ఏలూరు సంక్రాంతి మిత్రులు ప్రచురించారు. కాళోజీ కథానికలు అణా గ్రంథామాల 1940లో, దేశోద్ధారక గ్రంథమాల 1950లో వెలువరించింది. 1968లో ఖలీల్ జీబ్రాన్ ‘ది ప్రాఫెట్ ‘జీవనగీత’గా అనువదించబడింది. ఇంకా అనేక మరాఠీ, బెంగాళీ రచనలను తెలుగు అనువాదాలు, అనేక వ్యాసాలు, పత్రికలకు ఇచ్చిన ఇంటర్వూలు ప్రచురించాల్సి ఉంది. కాళోజీ సమగ్ర సంపుటి ‘నా గొడవ’ కాళోజీ ఉన్నప్పుడే గౌరవనీయులు మాజీ ప్రధాని కీ.శే.పి.వి.నరసింహరావు గారి చేతుల మీదుగా హైదరాబాద్ లో కాళోజీ 88వ జన్మదినోత్సవం సందర్భంగా ఆవిష్కరించబడింది. ‘ఇదీ నాగొడవ’ కాళోజి ఆత్మకథ స్వేచ్చా సాహితి ప్రకటించింది.

తూర్పు మల్లారెడ్డి కాళోజీ జీవితం సాహిత్యం సిద్ధాంత గ్రంథం’ ప్రకటించి డాక్టరేటు పట్టా పొందాడు. ‘బాపూ, బాపూ!!! బాపూ!” కాళోజీ కథలు, కౌన్సిల్ లో కాళోజీ, కాళోజీ ఫౌండేషన్ ప్రకటిస్తూ… ఆయన ఆలోచనలను భవిష్యత్తరాలకు అందిస్తున్నది. బతికినన్నాళ్ళు మనిషి బతుకు కోసం తపించిన కాళోజీ

భౌతికంగా నవంబర్ 13, 2002న మన నుండి దూరమైనా ఆయన కండ్లు ఎక్కడి నుండో మనల చూస్తునే ఉన్నాయి. చివర్లో నేత్రదానం చేసాడు. చివరికి ఆయన శరీరం కూడా కాకతీయ మెడికల్ కళాశాల విద్యార్ధులకు చేతి పుస్తకమైంది. ‘నానా యిజాల అడుగున చూడ నా ఇజందే అగుపఠునుజాడ’ అని చెప్పిన కాళోజీ ‘బతుకు తప్పదు/బతక్క తప్పదు’ అని సందేశించిన కాళోజీ అన్యాయాన్నెదిరించిన కాళోజీకి అన్యాయన్నెదిరించిన వాడే ఆరాధ్యుడు. అలాంటి కాళోజీ శకం’లో మనము బతికినందుకు కనీసం ఒకతృప్తితో గర్విద్దాం-ఆ ఆలోచనా ధారను ముందు తరాలకు

అందిద్దాం.

‘బడి పలుకులు కాదు…పలుకుబడులు కావాలి’ ఎవడి భాషలో వాడు మాట్లాడాలి. ఏ మాటకు ఆ మాట వేరే… కాని దాని ఆట కోటి తీర్లు… ఒకడి భాష…ఇంకోడికి యాస-దేని అందం దానిదే. అన్ని భాషలు/ప్రాంతీయాలు/మాండలికాలు బతకాలి. మనభాష పట్ల…మన వాడుక పట్ల ఖచ్చితంగా ఆత్మాభిమానం ఉండాలి… అని కాళోజీ అదే పనిగా చెప్పెటోడు. ఒకడి వాడుక భాష ఇంకొకడు కించ పరచొద్దు. అక్కడి కవిత్వం, కథ, నవల ఇక్కడ అర్ధమైతున్నపుడు ఇక్కడి సాహిత్యం అక్కడెందుకు అర్ధం కాదు….. ఇదెక్కడి వ్యవహారం అని ఆవేదన చెందిన కాళోజీ జన్మదినం సెప్టెంబర్ 09, “తెలుగు మాండలిక భాషాదినోత్సవం” జరుపాలని కాళోజీ ఫౌండేషన్ నిర్ణయించి జరుపుతున్నది. ప్రజాకవి కాళోజీ నాగొడవ… ప్రజల గొడవగా కాలం ఉన్నంత కాలం ఉంటుందనేది నిర్వివాదాంశం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుతున్నది.

–పొట్లపల్లి శ్రీనివాసరావు

సెల్: 9849254078

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com