వీడని నీడ.. మాదిరెడ్డి సులోచన నవలలో సమాజం ‘

మాదిరెడ్డి సులోచన 1970 ,80 ప్రాంతం లో వెలిగిపోయిన నవలాకారిణి.ఒకప్పుడు ఆమె నవలలు గృహిణిలు ఇంటి పని మరచి పోయి చదివేవారు .కాలేజి విద్యార్థులు పాఠం చెప్పే లెక్చెరర్ చూడకుండా పుస్తకం మధ్యలో నవలను పెట్టుకొని చదివేవారు .సినీ నిర్మాతలు ఆమె నవలలను తెరకెక్కించడానికి పోటీ పడేవారు .

ఇన్ని ఆదరణలున్న ఈ నవలామణి వ్యాపార నవల అపప్రద లో చిక్కుకుపోయారు .పాఠకులను తనతో నడిపించగలిగే శైలీ నైగనిగ్యం దాని తో పాటు సామాజిక చిత్రణ ఉన్న ఈమె సీరియస్ నవలాకారుల వరుస లో చేరలేక పోయారు .

కాని మిగతా వ్యాపార నవలా రచయితలతో పోలిస్తే మాదిరెడ్డి సులోచన రచనలలో ఎన్నో గుర్తించదగిన లక్షణాలున్నాయి .సాహిత్య ప్రయోజనం ఆనవాళ్ళు ఉన్నాయి .

మాదిరెడ్డి నవలలో సామాజిక కోణాన్ని గుర్తిస్తే ఆమె కూడా సీరియస్ నవలాకారుల వరుసలో చేరిపోతారు .

ఆమె ‘’వీడని నీడ’’ నవల సుమారుగా 1970 ప్రాంతం లో వచ్చింది.తెలంగాణ ప్రాంతం లో జన్మించిన సులోచన ,తెలంగాణ సమాజాన్ని ,అది ఎదుర్కొన్న తాకిడులను బాగా అర్థం చేసుకున్నారు .ఆమె లోని కనికట్టు ఏమిటంటే అనవసర సిద్దాంత విశ్లేషణలు భాషాడంబరం మచ్చు కైనా ఉండవు .పాఠకుడు వస్తువు తో ప్రయాణం చేస్తూ ఆమె చిత్రించిన సామాజిక పరిస్థితులు దర్శిస్తాడు .

వీడని నీడ నవలలో మధ్యతరగతి కుటుంబానికి చెందిన క్రాంతి అనే నర్సు ఒక ఆదర్శ యువతి.పట్టుదలగా తాను ఉద్యోగం చేస్తానని అనంతగిరి శానిటోరియం లో చేరుతుంది .రాజా అనే పేషెంట్, అతని తో పాటు సింహ అనే యువకుడు పరిచయం అవుతారు .సింహ తాను నమ్మిన సిద్దాంతాల కోసం ప్రాణాలను ఫణం గా పెట్టడానికి సిద్ధమైనవాడు . ఉద్రేకి .అతని పట్ల ఆకర్షితురాలైన క్రాంతి సింహాను చీకటి జీవితం నుండి తప్పించాలని ప్రయత్నం చేస్తుంది .మానవతా కోణం మనిషి సామాజిక బాధ్యత గురించి అతనికి అవగాహన కలిగించడానికి ప్రయత్నం చేస్తుంది .తన పార్టీ లోనే ఉన్న స్వార్థపరుల పోకడల వల్ల ,అతను మారుతాడు .వ్యక్తి హింస వల్ల ప్రయోజనం లేదని గుర్తిస్తాడు .సింహాను తన జీవిత భాగస్వామి గా ప్రపంచానికి పరిచయం చేద్దామనుకునే సమయానికల్లా, పార్టీ నాయకుడైన పికూర్ కుట్రకు బలై చనిపోతాడు .అతను క్రాంతి స్మృతుల్లో వీడని నీడగా ఉంటాడు .

కథ చిన్నదే అయినా మాదిరెడ్డి కథనాన్ని కొనసాగించిన తీరు ముచ్చటగా ఉంటుంది .మధ్యతరగతి కుటుంబాలలో సాధారణంగా అమ్మాయిల స్వేచ్చ కు తల్లులు అడ్డు పడితే తండ్రులు ప్రోత్సహించడం ఆకాలం నుంచే ఉంది .నవలలో క్రాంతి తండ్రి ఆమెను కాదనకుండా సహకరిస్తాడు .

నవలలో రాజా అనే యువకుని పెళ్లిజరుగుతుంది .ఆ కాలం లోని సంపన్నుల పెళ్లి కి అద్దం పడుతుంది ఇది .ఆమె పెళ్లి ని చిత్రీకరించిన పద్ధతి చూడండి.

’ఐశ్వర్యవంతులు ఒక చోట చేరారా అన్నట్టు ఉంటుంది. స్త్రీలు బంగారునగలతో జరీ చీరలతో తిరుగుతున్నారు .ఒకవైపు బారులు తీరిన కుర్చీలు రెండో వైపు జంబుఖానాలు పరచి కింద కూర్చునె వారికి ,కుర్చీలపై కూర్చునే వారికి వీలు గా అమర్చారు .బ్యాండు మేళం ఒక ప్రక్క కూర్చొంది.బారులు తీరిన వాహనాలు మరొక వైపు ఉన్నాయి .ఒకసారి నా దుస్తుల వైపు చూసుకున్నాను .లైట్ బ్లూ కలర్ కొవ్వాయి చీర ,సాదా జాకెట్టు ఒంటిపేట గొలుసు తప్ప మరే ఆడంబరం లేదు .కింద పడ్డట్టు నిల్చుండి పోయాను .చెమట పట్ట సాగింది .

యువతీ యువకులు ఓర చూపుల తో పరిహాసాలడుకొంటున్నారు.వారిని చూసి వీరు, వీరిని చూసి వారు విసుర్లు విసురుకొంటున్నారు.పందిళ్ళు పచ్చటి ఆకుల సువాసనలు లేకపోయినా పందిరి కొసకు వ్రేలాడదీసిన మల్లెల సౌరభం మత్తెక్కించే లా ఉంది .అలాగే కూర్చుండి పోయాను .

ఇవే కాకుండా ఆ కాలం లో మధ్య తరగతి విలువలు ,అపోహలు ,మానవ సంబంధాలలోని అనేక కోణాలు ఈ నవలలో చక్క గా చిత్రించారు .

సింహ తో అతని విధానాలు నచ్చక పోవడం తో మధ్యలో విడి పోతుంది .క్రాంతి కూడా తనతో సహయానం చేయలేదని వేరే పెళ్లి చేసుకొమ్మని చెప్పి వెళ్లి పోతాడు .తలిదండ్రుల బలవంతం వల్ల దూరపు బంధువైన శంకరం తో పెళ్లి కి ఒప్పుకొంటుంది క్రాంతి .

క్రాంతి శంకరానికి తన కథ అంతా చెబుతుంది .’’నిన్ను మోసం చేయడం నా కిష్టం లేదు ,కాబట్టి చెబుతున్నానంటుంది.ఆమె సంస్కారం శంకరానికి నచ్చుతుంది .గతాన్ని మరచి పోదామంటాడు .
తరువాత పెళ్లి తంతు మొదలయాక సింహ స్నేహితుడు రాజా దగ్గరనుండి క్రాంతి ఇంటికి ఉత్తరం వస్తుంది .క్రాంతి అన్న ఆ ఉత్తరం విప్పి చదువుతాడు .

రాజా క్రాంతి ని నిరసిస్తాడు .సింహకు ద్రోహం చేసిందంటాడు.తనకు వైద్య సహాయం చేసినందుకు వంద రూపాయల చెక్ పంపిస్తాడు .(ఆ రోజుల్లో వంద రూపాయలు అంటే చాలా ఎక్కువ అన్నమాట).

ఆ ఉత్తరం సంగతి అక్కడున్న బంధువులందరికీ తెలిసిపోతుంది .ఆ వరకే బంతి భోజనాలు పూర్తవుతాయి.పెళ్లి కొడుకు వదిన చాలా అక్షెపణ చేస్తుంది .క్రాంతి తలిదండ్రులు డీలా పడిపోతారు .అపుడే వచ్చిన శంకరానికి వదిన అంతా చెబుతోంది .’’నాకు తెలుసు లే ఆమె అంతా చెప్పింది ‘’ అని కొట్టి పారేస్తాడు .

క్రాంతి కృతజ్ఞత తో శంకరం కాళ్ళ కు నమస్కారం చేస్తుంది .క్రాంతి తల్లి దండ్రులు శాంతిస్తారు .

తరువాత ఇంటికి వెళ్ళాక శంకరం వదిన మాటల వల్ల ఇతర బంధువుల మాటల వల్ల మారిపోయి క్రాంతి ని తిరస్కరిస్తాడు .

ఈ విధం గా అడుగడుగునా మధ్య తరగతి మనుషుల మనస్తత్వాలు ,పట్టింపులు ,మధ్యతరగతి వివాహాల్లోని భోజన పద్దతులు, వధూవరులను సిద్ధం చేయడం లోని పద్దతులు , ఇతర ఆచారాలు , చిత్రిస్తారు .

నవలలో ఇపుడు మనం చూడని రిక్షాలు కనబడుతాయి .రిక్షాకు రూపాయి బాడుగ చాలా ఎక్కువ .ఒక పెళ్లి కి క్రాంతి రిక్షా లో వెడుతుంది .రిక్షా అతను రూపాయి పావలా అడిగితే క్రాంతి రూపాయి ఇస్తానంటుంది.

క్రాంతి సింహ పార్టీ స్థావరానికి వెడుతుంది .అక్కడ కొంత కాల్పనిక వాతావరణం చూస్తాం . అది రచయిత్రి తన ఊహతో రాసిందని తెలిసిపోతుంది .

హాస్పిటల్ లో జగన్ మోహన్ రావు అనే పేషెంట్ కి ట్రీట్ చేస్తుంది క్రాంతి .ఆయన సమన్వయ వాది.ఆయన సంభాషణా క్రమం లో క్రాంతి తో ఇట్లా అంటాడు .

’నాన్న గారు మరణించగానే ఆదాయ వ్యయాలు చూసుకున్నాను .నాకున్న భూములు చూసి ఆశర్య పోయాను .చేసుకోలేని నాకు ఇంత పొలమా?కష్టం చేసి చెమటోడ్చి పండించే వారికేం లేదు .రాత్రిం బవళ్ళు ఆలోచించాను .అనవసరం గా నాదగ్గర అంత ఉండడం ఇతరులకు ఈర్ష్య కలిగింప జేస్తుందనేది నిర్వివాడాంశం .అందుకే అమ్మేశాను .నాకు కావలసింది ఉంచుకొన్నాను. వారికి నా పట్ల పగ ద్వేషం లేదు .

అతను సింహాను జనజీవన స్రవంతి లో కలపడానికి క్రాంతి చెసే ప్రయత్నానికి సహకరిస్తాడు .లాయర్ ద్వారా చట్ట పరం గా వెళ్లాలని ఆలోచిస్తాడు .చెయ్యని హత్యా నేరం సింహ పై పడిందని విశ్వసిస్తాడు.

జీవితానుభవం నుండి ,వాస్తవిక సామాజిక పరిస్థితి నుండి ఒలికిన వాక్యాలు ఈ నవల లో ఎన్నో కనిపిస్తాయి

‘’ఎవరిని కావాలని చంపను, వారి చర్యలే వారి పాలిటి మృత్యువు అవుతాయి’’ .(సింహ 62 పేజీ)

‘’స్త్రీలు ఆరాధన పేరిట మగవారికి అహం పెంచుతున్నారు’’ .(పేజి 62)

‘’ఏ ప్రేమారాధన గుడ్డిదని షోనా బాయి విషయం లో నేననుకున్నానో ఆ ప్రేమారాధన వదలలేక పోతున్నాను’’

ఇట్లా చూసుకుంటూ పోతే నవలలో ఆకాలం లోని స్త్రీ పురుషుల మానసిక ప్రచలనాలు సమాంతర సమాజం పునాదులుగా కనిపిస్తాయి .

తీవ్రవాది సింహ పరివర్తన చెందినాక ఇట్లా అంటాడు.

‘’క్రాంతీ ,నువ్వు చెప్పే మాటలు నాడు నిర్లక్ష్యం చేసినా నేడు నమ్ముతున్నాను .ఒక దుష్టుడిని చంపినంత మాత్రాన దుష్ట శక్తులు నశించవు.ఈ దుష్ట శక్తులు స్వార్థం అనే ఆహారం తో బతుకుతున్నాయి .ఈ స్వార్థానికి మూలకారణం తెలుసుకోవాలి అన్నాడు .

పార్టీ నాయకుడు గా ఉన్న వ్యక్తి ప్రభుత్వానికి సరెండర్ అవుతాడు .టైగర్ గా పిలువబడ్డ ఈ నాయకుడు అధికార పార్టీ లో చేరిపోతాడు .అతన్ని గురించి సింహ ఇట్లా అంటాడు .

‘’అతను చేసిన పనులు చేయించిన పనులు తలచుకొంటే సిగ్గు వేస్తుంది .ధనవంతులంతా చెడ్డవారన్న దురభిప్రాయం తో మేము మా కామ్రేడ్స్ చందాలు గా అయితే నేమి ,బెదిరించి అయితే నేమి డబ్బు లాగాం,అది పార్టీ కోసం , రూలింగ్ పార్టీ ఒత్తిడికి భయపడి పార్టీ మార్చిన వాడు ,తన మానాన ఉండవచ్చు కదా ,ఎదురు ప్రశ్నించిన దామోదర్ రెడ్డి ని చిత్రవధ చేయించాడు’’ .

తరువాత మరొక చోట మరొక వ్యక్తి గురించి క్రాంతి ,సింహ ల సంభాషణ ,

‘’ఇది ఎన్నడో గ్రహించాను .చొక్కాలు మార్చినట్టు పార్టీ లు మర్చేవారున్నంతకాలం మన ప్రజల గతి ఇంతే .హరిజన వాడలో పోచయ్య ప్రకాశం గా మిషనరీ సహాయం పొందాడు .బయట రామి రెడ్డి దోపిడీ సంగతి తెలిసి బాగుపవడచ్చుననుకున్నాడేమో, పార్టీ లో చేరాడు .ఇపుడు కాంగ్రెస్ లో రిజర్వేడ్ సీట్లున్నాయని తెలిసి అక్కడికి వెళ్లి పోచయ్య గా సీటు సంపాదించాడు .అవకాశ వాదులు ,అతను ప్రకాశం గా మారినపుడే అతని అసలు రంగు బయట పడింది’’ .

‘’నేను అనుకోలేదు క్రాంతీ ,నిమ్న జాతులవాళ్ళు సోషల్ సప్రెషన్ వల్ల ఎకనామిక్ డిప్రెషన్ వల్ల మతం మార్చారు అనుకున్నాను ,

అలాగే వివాహేతర సంబంధం గురించి ఓ పాత్రతో స్త్రీ కో న్యాయం పురుషుని కో న్యాయం అవసరం లేదు “’ అనిపిస్తుంది .

ఇంకా రజాకార్లు ,కమ్యూనిస్టులు హింస విప్లవ కారుల స్థావరం ,హేతువాదులు ,ధనిక వర్గాలు ,భూస్వాముల మనస్తత్వం గురించి ,ప్రేమ చంద్ కథ ,భూస్వాముల హత్య లాంటి ఉదంతాల చర్చలు ఎన్నో కనబడతాయి .నవలలో కొంత నాటకీయత ,కాల్పనికత కూడా ఉన్నాయి .

ఏమైనా ఈ నవల సామాజిక కోణం మాత్రం అవశ్యం గమనించ దగింది .ఇంత శాస్త్రీయ దృక్పధం కలిగిన ఈ రచయిత్రి వ్యాపార నవలా కర్తల వరుసన చేరడం ఈమె తెలంగాణ నుండి రావడం ఒక కారణమేమో ?

కాంచనపల్లి గోరా . 9676096614.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com